దేశవ్యాప్తంగా సహకార వ్యవస్థ పరిధిలో పనిచేస్తున్న అనేక సంఘాలు, సరళీకరణ ప్రైవేటీకరణ విధానాల దెబ్బకు కుదేలవడం తొంబైల తర్వాత  ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతదేశంలో అమలవుతున్న మిక్సెడ్ ఎకానమీ ప్రైవేటు వేటుకు గురవడం కూడా యీ కాలంలోనే జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కొద్దిగా ప్రతిఘటించడం తొలినాళ్లలో జరిగింది. అయితే సహకార రంగంలోని నూలు మిల్లులూ, చెక్కెర కర్మాగారాలూ చాలా సులభంగా ప్రైవేటు కుట్రలకు గురికావడం జరిగింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో చెక్కెర వినియోగదారులకు  చుక్కలు చూపించిన వైనం వొకవైపూ, వినియోగదారులకు విదేశీ చెక్కెరను సరఫరా చేయడాన్ని ప్రభుత్వాలు సమర్థించుకోవడం ఒకవైపు ఏకకాలంలో జరిగిపోయాయి.

ప్రతిమ గారు రాసిన కంకాళం కథ, రాఘవయ్య అనబడే చెరుకు రైతు తన చెరకును సహకార చెక్కెర కర్మాగారానికి అమ్మీ, డబ్బులు పొందక మోసపోవడం, వొత్తడి తట్టుకోలేక వూపిరి వదలడం, కథ. ఇంతే కథను రైతు దైన్యాన్ని చెప్పడం దాకే ఆగకుండా, చెక్కెర కర్మాగారాల పతనం వెనుక వున్న అనేక కారణాలను కూడా కథలోకి తెచ్చింది రచయిత్రి. ఒక ప్రాంతపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, అంతర్జాతీయ పరిణామాలు ఎలా నిర్దేశిస్తాయో యీ కథ చెబుతుంది.

రాఘవయ్యను మిషగా చేసుకుని, చెరుకు రైతుల కడగండ్ల , వాళ్ల ఆశలూ, ఆశాభంగాలూ, వేడికోళ్లూ, నిస్సహాయతలూ చిత్రించింది. దేశ ఆర్థిక రంగంలో సహకార ఆర్థిక రంగం బలహీనమైంది కాబట్టి, దాన్ని కూలదోయటానికీ, లొంగదీసుకోవడానికీ యీ దేశ రాజకీయ యంత్రాంగానికి సులభసాధ్యమెలా అయ్యిందో కూడా యీ కథ చెబుతుంది.

సహకార చెక్కెర కర్మాగారానికి అధ్యక్షుడు సహృదయుడైనా సాటి సభ్యుడైన రైతుకు సహాయం చేయలేక పోవడానికి, అధికార యంత్రాంగం సహకరించకపోవడం కూడా యీ కథలో చిత్రితమైంది.

తెలుగు సాహిత్యంలో కథా రచయితలు సోషియో ఎకనామిక్ అంశాలను సాహిత్య సృజన చేయడం ఎక్కువే అయినప్పటికీ, స్త్రీ వాద రచయితలు అరుదుగా యీ జానర్ ను తడుముతుంటారు. ప్రతిమ గారు, గంగజాతర  లాంటి గ్రామీణ రాజకీయ కథలతో పాటు కంకాళం లాంటి గ్రామీణ ఆర్థిక అంశాలనూ కథ చేయగలిగింది.

దేశ ఆర్థిక వ్యవస్థను బడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం ప్రారంభమయ్యాక, రాఘవయ్య లాంటి నిస్సహాయ రైతుల గుండెజారిపోవడం సహజమే.

కథ అంతంలో నిరాశ ఎదురైనా, మరణంతో ముగిసినా, రెండువేల దశకంలో అదే వాస్తవిక స్థితి.

కథలో హృదయగతమైన కరుణతో పాటు మేధోపరమైన అవగాహన కూడా సమపాళ్లలో వుంది.

కథా నిర్మాణంలో యే ప్రయోగాలూ అవసరం లేని సలళ గంభీర కథనాన్ని కథావస్తువు ఎంచుకుంది. దాన్ని రచయిత్రి  అవసరమైనంత వివరాలతో కన్నీటి పువ్వుగా కథను మలిచింది

Leave a Reply