ఉరికొయ్యలను దాదాపుగా తాకిన సాంస్కృతిక విప్లవ గొంతుక, జార్ఖండ్ అభేన్ నాయకుడు జీతన్ మరాండీకి జోహార్లు. ప్రజలను చైతన్యవంతం చేస్తున్న పాటపై సుదీర్ఘ కాలం సాగిన వేట మరాండీని మానసికంగా బలహీనపరచలేకపోయింది. కానీ, ఆయన ఆరోగ్యాన్ని మాత్రం బాగా దెబ్బతీసింది. ఓ తప్పుడు హత్య కేసు నుంచి 2013లో మరాండీ బయటపడ్డారు. అరెస్టు సమయంలో చేసిన ఇంటరాగేషన్‌లో పోలీసు అధికారులు చూపించిన నరకం వల్ల జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అనారోగ్య సమస్యలు వేధించాయి. ఈ నెల 12వ తేదీన బాగా జబ్బుపడిన ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వైద్య చికిత్స అందిస్తుండగానే 13న జీతన్ మరాండీ మరణించారు. ఆయన సహచరి అపర్ణ కూడా సాంస్కృతిక కార్యకర్తే. జీతన్, అపర్ణ ఇద్దరూ తెలంగాణ, ఆంధ్రా నేలలకు పరిచయమైన గొంతుకలు. సహచరుడు జీతన్ విడుదల కోసం విరసం, ఇతర ప్రజాసంస్థలు హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సభల్లో అప్పట్లో అపర్ణ పాల్గొన్నారు. జీతన్ కూడా… తాను విడుదలయి బయటకు వచ్చిన మరుసటి ఏడాది హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ క్రమంలో ఆయన బృందం అరెస్టు అయింది. ఆ తరువాత 2014 లో ప్రజాకళామండలి మహాసభలకు హాజరయ్యారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పీపుల్స్‌వార్, జనశక్తి పార్టీలు జరిపిన చర్చలు, ఐక్య మావోయిస్టు పార్టీ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక వేదికలపైజార్ఖండ్ అభేన్ తరపున జీతన్ బృందం కళా ప్రదర్శనలు ఇచ్చింది. నేలను ఎగదన్నీ పైకి తన్నుకొచ్చిన ఊచలాంటి శరీరంతో వేదికపై కదలాడే జీతన్ రూపం మన కళ్లలో కదలాడుతూనే ఉంటుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో చెరబండరాజు, శివసాగర్, వంగపండు, గద్దర్ పాట ఎంత ప్రసిద్ధమో, జార్ఖండ్ లో జీతన్ మరాండీ పేరూ, ఆయన గొంతూ అంత ప్రముఖమైనవి. పలు భాషల్లో ఆయన పేరిట ఆడియో, వీడియో సీడీలు విడుదలయ్యాయి.జార్ఖండ్ అభేన్ ఉమ్మడి ఆచరణలో భాగమవుతూనే… తనకుండే ప్రత్యేక కళా కౌశలం వల్ల జీతన్ పేరు వ్యక్తిగతంగానూజార్ఖండ్ సంథాల్ ఆదివాసీ సమాజం నాలుకలపై నిలబడిపోయింది.జార్ఖండ్‌లోని గిరిధి జిల్లా సుదూర్‌లో జన్మించిన జీతన్‌కు సీపీఐ రాజకీయాలు తొలి ప్రేరణ. ఆ తర్వాత ఆయన చాలా దూరమే ప్రయాణించారు. కళను వాహిక చేసుకుని ప్రజా సమస్యలపై పనిచేస్తూ, తనలా ఆలోచించే మరికొందరితో కలిసిజార్ఖండ్ అభేన్ అనే కళాసంస్థను ఏర్పాటుచేశారు. విరసం వ్యవస్థాపకుడు, మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడు కేవీఆర్ వంటివారి పూనికతో ఏర్పడిన ఏఐఎల్ఆర్సీలో ఈ సంస్థ కూడా భాగస్వామి. జీతన్ ప్రేరణాత్మక వక్త కూడా. తన ఉపన్యాసాల కారణంగా అరెస్టు కూడా చేశారు. గుర్తించిన సమస్యలపై అప్పటికప్పుడు పాట కట్టేవారు…జార్ఖండ్ అభేన్ కళా ప్రదర్శనలు చాలావరకు జనం మధ్య తయారయినవే. ప్రదర్శనలకు ముందు జీతన్ ప్రసంగించేవారు. అయితే అది వాచ్యంలా కాకుండా… ఆ ప్రసంగమూ ప్రదర్శనలో అనివార్యమైన, అవిభాజ్యమైన అంగమన్నట్టు అమరేది.
అవిభాజ్య బిహార్ నుంచి 2000లో వేరుపడేటప్పుడు సంథాల్ ఆదివాసీ సమాజానికి ఇచ్చిన ఏ హామీనీ జార్థండ్ నూతన ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. జనాభాలో మూడొంతులుగా ఉన్నప్పటికీ, ఆదివాసీల సాంస్కృతిక ప్రతిష్టను నిలిపే చర్యలేవీ అప్పటి బాబూలాల్ మరాండీ ప్రభుత్వం తీసుకోలేదు. పైగా ఆదివాసీలను అడవులనుంచి బేదఖలు చేసేందుకు ప్రైవేటు హంతక సాయుధ ముఠాలను సృష్టించింది. వేర్పాటుతో జార్థండ్ ఒక సాంస్కృతిక క్షేత్రం అవుతుందని జీతన్ వంటి కళాకారులు ఎంతో ఆశించారు. ఆ కలలు రక్తసిక్తమవ్వడం కళ్లారా చూసినవాడిగా తన సంథాల్ ఆదివాసీ జాతి కోసం జీతన్ నిలబడ్డారు. అడవి ఎవరిది అని ప్రశ్నించి జైలుపాలైన వేలాదిమంది ఆదివాసీల కోసం నిలబడ్డారు. ఈ క్రమంలోనే రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ఆచరణలో భాగమయ్యారు. రాంచీలో 2007లో జరిగిన కమిటీ సభలో పాల్గొని… తొలిసారి అరెస్ట అయ్యారు. ఆ తర్వాత కూడా అనేకసార్లు పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పారు. ఈ క్రమంలోనే 2008 ఏప్రిల్ ఐదో తేదీన మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ కుమారుడు అనూప్ మరాండీ, మరో 19 మంది హత్యల కేసును జీతన్ మరాండీపై మోపారు. విస్థాపన్ విరోధి జన వికాస్ ఆందోళన సంస్థ నిర్వహించిన ఆందోళనలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తుండగా మఫ్టీలో పోలీసులు ఎత్తుకుపోయారు. గనుల తవ్వకాలను వ్యతిరేకిస్తున్న ఈ సంస్థలో జాతీయ కమిటీ సభ్యుడు జీతన్. గనుల యజమానుల కోసమనిజార్ఖండ్ లో అధికార పార్టీ, విపక్ష పార్టీ కలిసిపోయాయి. మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ కుమాకుడు అనూప్ మండల్… ఆదివాసీలు, మావోయిస్టులను నిర్మూలించడం కోసం హర్మత్ వాహిని అనే ప్రైవేటు హంతక ముఠాను ఏర్పాటుచేశాడు. వాహిని సభపై మావోయిస్టులు 2007లో జరిపిన దాడి ఘటనే చిల్ఖారే ఊచకోతలుగా సంచలనం రేపాయి. ఈ ఘటనలో జీతన్ మరాండీ అనే మావోయిస్టు కార్యకర్త పాల్గొన్నట్టు ఎఫ్ఐఆర్లో రాసుకున్న పోలీసులు… కళాకారుడు జీతన్ మరాండీని ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. అనిల్ రామ్, మనోజ్ రాజ్వర్, ఛత్రపతి మండల్‌లను ఇతర నిందితులుగా చూపారు. చిల్ఖారీ ఘటనకు మించిన సంచలనాత్మక రీతిలో ఈ నలుగురికీ గిరిధి సెషన్స్ కోర్టు ఉరిశిక్ష ప్రకటించింది.
జీతన్ సహచరుల కేసులో పర్యావసరాలు ఎలా మొదలై ఎలా ముగిశాయనేది ఇప్పుడు చరిత్రలో భాగం. కానీ, కేసు నడిచిన ఐదేళ్ల కాలం న్యాయవ్యవస్థపై గట్టి ప్రశ్నలను సంధించింది. మరో కెన్సారోవివాను బలి కానివ్వబోమంటూ దేశవ్యాప్తంగా మేధావులు, కవులు, కళాకారులు కదిలారు. జీతన్ కోసం జరిగిన ప్రధాన ఆందోళనలకు హైదరాబాద్ వేదికగా మారింది. సహ కళాసంస్థలతో కలిసి ప్రధాన కార్యాచరణలో విరసం భాగమైంది. కవులు, రచయితలను ఉరిశిక్షకు వ్యతిరేకంగా అప్పట్లో పెద్దఎత్తున కదిలించిన విరసం వ్యవస్తాపక సభ్యుడు కామ్రేడ్ వరవరరావు, సీనియర్ సభ్యడు ప్రొ. జిఎన్ సాయిబాబాలు స్వయంగా ఇప్పుడు నిర్బంధంలో ఉన్నారు. జీతన్ స్వేచ్చ కోసమే కాకుండా… రాజ్యం నుంచి కళలను రక్షించుకోవాలని తపించిన ప్రజాకళామండలి కార్యదర్శి జె. కోటేశ్వరరావు ఇప్పుడు తానే ఒక జైలు కోకిల. జీతన్ విడుదల సందర్భంగా ‘అంతిమంగా సత్యమే పరిఢవిల్లింది’ అని ప్రకటించిన స్టాన్‌స్వామిని ఇటీవల నిర్బంధం మింగేసింది. ఇంతలోనే సంభవించిన జీతన్ మరాండీ మరణం జార్థండ్ ఆదివాసీ సమాజానికి, సహచరి అపర్ణకు కలిగించిన దుఖాఃన్ని విరసం పంచుకుంటోంది. భూమి, శ్రమ, ఆత్మగౌరవం, వైవిధ్య జీవనవిలువలతో ముడిపడిన సాంస్కృతిక విప్లవ కర్తవ్యాలను పరిపూర్తి చేయడమే జీతన్ మరాండీకి నిజమైన నివాళి.
– అరసవిల్లి కృష్ణ, అధ్యక్షుడు
– బాసిత్, ఉపాధ్యక్షుడు
– రివేరా, సహాయ కార్యదర్శి
విప్లవ రచయితల సంఘం