1998లో అనుకుంటాను గోదావరిఖనిలో కథల వర్కు షాప్ జరిగింది. అల్లంరాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, వారాల ఆనంద్ గార్ల పూనికతో. వర్క్ షాపు అయ్యాక బొగ్గుబాయిలు చూడటానికి పోయాము అందరమూ. పాత అండర్‌గ్రౌండ్ మైనింగ్‌తో పాటు అప్పుడప్పుడే ఓపెన్ కాస్ట్ తవ్వకాలూ మొదలయిన కాలం అది. ఒక కొండను మించివున్న పేద్ద పేద్ద యంత్రభూతాలు నిజంగానే భయపెట్టాయి. నేను, రాప్తాడు గోపాలకృష్ణ, పాణీ బొగ్గు బాయిలను చూడటం అదే మొదటిసారి. లోపల భరించలేని వేడి, ఉక్కపోత, పేద్ద ఫ్యాన్లు పెట్టి గాలి లోపలికి తోలుతున్నా అది సగదూరం కూడా పోదు. ఆకు అల్లాడిన గాలికూడా రాదు. అతి తక్కువ ఆక్సిజనే లభ్యం. శ్వాస ఆడదు, రాతిబొగ్గు కప్పు ఎప్పుడైనా కూలవచ్చు. సహజవాయువు విడుదలై మండితే అక్కడికక్కడే మనుషులు మాడిమసై పోతారు. ఎన్ని జాగ్రత్తలు వున్నా అక్కడ పని అంటే ఘడియ ఘడియకూ ప్రాణాన్ని మృత్యుపొలిమేరల్లోకి మోసుకుపోవడమే.

వసపిట్టగా వాగే గోపీ గనిలోపల మౌనంతో గడ్డకట్టి పోయాడు. బయట వెలుతురులోకి వచ్చాక గోపీ ఒక బండపై కూర్చుని ఒక్కపెట్టున దుఃఖంతో బద్దలయ్యాడు. ఎవరి ఓదార్పులూ తనకు వూరటనివ్వలేదు. సున్నిత మనస్కుడు గని కార్మికుల దుర్భర జీవితాన్ని చూసి చలించిపోయాడు. ‘జీవన లాలస’ నవల కథానాయకుడు విన్సెంట్ వ్యాన్గో కూడా మొదటిసారి బొగ్గుబాయిలో దిగినపుడు ఇదే దుఃఖాన్ని పొందాడు. పైగా అది కనీస కార్మిక హక్కులు కూడాలేని మరీ అధ్వాన్న కాలం. రోజుకు 12 గంటల పనికి అరకొర కూలి(వేతనం కాదు) మాత్రమే.

అప్పుడు బెల్జియం  బొగ్గుగనుల్లో పని ఇలా వుండేది

ఇద్దరు సున్నితమనస్కులు. ఇద్దరి మధ్య 150 ఏళ్ల పైన కాల అంతరం. తమ వ్యక్తిగత కష్టాల విముక్తికి ఇద్దరూ  ఆత్మహత్యనే మార్గంగా ఎంచుకున్నారు. కాకపోతే ఒకడు కవీ, కథకుడు మరొకడు చిత్రకారుడు. ముప్ఫై ఏడేళ్లు వ్యాన్గో బతికితే అందులో ఒక పదేళ్లు తక్కువ రాప్తాడు గోపీ బతికివున్నాడు.

                          ***   

నవల ఎత్తుకొని నేరుగా కథలోకి జొరబడి పట్టుమని పది పేజీలు దాటకుండానే కడుపులో తెలియని సంకటం ఎవరెవరో గుర్తొచ్చారు. గతంలో వ్యాన్గో గురించి ఫేస్‌బుక్‌లో ఈ నవల అనువదాకుడు మోహన్ పెట్టిన పోస్టులూ,  వ్యాన్గో పెయింటింగ్స్, రాప్తాడు, యువకగా నాకు తొలి పరిచయమున్న కలేకూరి ప్రసాద్, ఒకటి రెండు సార్లు  మాత్రమే కలిసిన నాగప్పగారి సుందర్రాజు, యగ్గిగా నేనెరిగిన యాజ్ఞవల్క్య, మరి నేను ఏనాడూ చూడని చిత్రకొండ గంగాధర్…..

పుస్తకం పక్కకు పెట్టి  యిట్లా రాసుకున్నా…

లోకం మీద వుమ్మి వెళిపోయిన 

పిచ్చివాడు వొకడు

క్షమించండి యీ వొక్కసారికీ

లౌక్యం తెలియని అతడే అతడు

మోసకారిలోకంలో పసితనపు ప్రేమలను కలగన్నందుకు పెక్కుసార్లకు క్షమించండి

సంప్రదాయపు అక్షరాన్ని పుటంపెట్టి శుద్ధిచేసి

పాటగా దట్టించినందుకో

‘సవర్ణమైన’ చిత్రాల వెనుక

నలుపునీడలను దర్శించినందుకో

అనాదరము సేయకండి

కడుపులో మెలిపెడుతున్నది.

ఆసిడిటీనో, అల్సరో కాకపోవచ్చు ప్రతీసారీ

లోకంతో ఇమడలేని తనమో

వున్నచోట నిలవనీయని దిగులో

హార్మోనులు పోటెత్తే యవ్వన జవనాశ్వపు

కాళ్ళు విరిచేసిన ప్రేమరాహిత్యమో

కొలత వేయడానికి కొత్త రాళ్లు తెండి

కొరతే వేయాలనుకుంటే కొత్త తాళ్ళు తెండి!

ఎన్నెన్ని ఉద్యోగాలు… చేసి మానేశాడు

ఎన్నెన్ని వూర్లు…. బతకలేక వదిలేశాడు యీ దేశద్రిమ్మరి

ఎక్కడో ఒక చోట వచనమై వెక్కిరించాయని

యెంత కవిత్వాన్ని చింపి కుప్పలుబోశాడు.

యేదో ఒకమూల మనసు రంగు సరిగా అద్దలేదని

ఎన్ని కాన్వాసులను నెగడు గూటిలో కుక్కివున్నాడు

వాడు రాజీపడని పిచ్చివాడు దేనితోనూ

విచిత్రం వాడు కమ్యూనిస్టు కూడానేమో!

మనలా ఒకచెట్టునీడనో, ఒక కప్పు కిందో మనలేనివాడు

మనయింట్లోనో, మన తావునో

ఖచ్చితంగా వుండే వుంటాడు, వెతకండి

పైకి నిశ్చలంగా కనబడతాడు లోన సంక్షుభిత జలధి

సిగరెట్టు పొగతో వెన్నెల మేఘాలను అల్లుతున్నట్టే అనిపించినా

వేసవి గాడ్పులు కూరిన ఇసుక తుఫాను కనిపెట్టండి

మనతోటే వుంటాడు…. మన పాటే తింటాడు

మురికికాలువ పక్కనో వ్యభిచారుల వీధిలోనో

కంటబడిన దృశ్యమేదో వున్నపళంగా గుర్తొచ్చి

తింటున్న పళ్లెంలోకే వాంతి చేసుకుంటాడు

అతడిని దయతో క్షమించండి

అంతర్ముఖంగా లోపలికి ముడుచుకొని

అనుమానంగా తలదించుకొని  

నిశితంగా తరచిచూసే సూదంటుచూపులతో

అరుదుగా వుంటాడు

చల్లని మీచేతిని చాచండి…

శీతలస్పర్శ తగిలీ తగలగానే వర్షించే మొయిలు వాడు

హృదయపు జల్లులవుతాడు

మీతో ఎక్కువ రోజులేమీ ఉండడు

మీకు బరువూ… బాధ్యతా కూడా కాడు

యీ లోకానికి మూడురోజుల అతిధి ….అంతే

అంత అసహజంగానూ దాటుకుంటాడు

సాహస దుశ్చర్యలకు హత్యచేయబడతాడో

ఆత్మహత్యనే చేయబడతాడో…

అందుకు పెక్కుసార్లు అతడిని క్షమించండి

పిరికివాడని మాత్రం మాటిమాటికీ వాగకండి

మట్టిలో పొర్లాడాడనో తాగుబోతనో

కులీనపు దొంగనీతులూ వల్లించకండి

ఆదర్శాల అడ్డున

నంగినంగిగా బతికేవాళ్లకు ఆహక్కులేదు

చేష్టలుడిగిన పౌరసమాజపు ప్రతిఫలనం వాడు

అతడు రాసిన రెండు వాక్యాలను

గీసిన రెండు బొమ్మలను 

నాలుగు రోడ్లకూడలిలో వేలాడదీయండి

అద్దంలో తన మొహం చూసుకున్న నాగరికత సిగ్గుపడుతుంది

అందుకు అతన్ని శాశ్వితంగా క్షమించండి.

                        **       **        **

కొన్ని రచనలు చదవడానికి పాఠకుడు యెంతో కొంత ‘ఇంటిపని’ (home work) చేయడం అవసరం. ‘జీవన లాలస’ వంటి ఒక చిత్రకారుడి జీవితాన్ని చదవాల్సివచ్చినపుడు యిది మరీ తప్పనిసరి. వూరికే నవల ఎవరైనా చదువుతూపోవచ్చు. కానీ అతను జీవించిన స్థలకాలాదులు, ఆనాటి కళారీతులు తెలుసుకోకపోతే వ్యాన్గో వంటి గొప్ప సృజనకారుడు కూడా పరమమోటుగా తోస్తాడు. అతని కళలోని లోతులే కాదు అతని జీవితపు లోతులూ అంతగా మన మనసుకు పట్టవు. పైపైన అధిశోషణమే గానీ అంతరాంతరాలలోకి శోషణ జరుగదు. మన చదువు అనుభూతిహీనం అయిపోతుంది. యీ నేపధ్యాన్ని పాఠకుడి నోట్సు ఎంతో కొంత ఇస్తుందని ఆశిస్తాను.

విన్సెంట్ వ్యాన్గో ఒక చిత్రకారుడు (1853-1890) ఒక అసంతృప్త ఆత్మ. నిండుగా జీవించింది 37 ఏళ్లే.

“Bliss was it in that dawn to be alive, But to be young was very heaven,”  ఆన్నాడా వర్డ్స్‌వర్త్.  “ఒక సంక్షుభిత సంధ్యా కాలంలో బతకడం ఎంత అదృష్టం!” అంటారు కానీ కుతకుతా వుడుకుతున్న లావావంటి నేలలో బతుకీడ్చడమూ అంతే దుర్భరం. విన్సెంట్ వ్యాన్గో జీవితం ఆ దుర్భరతను చూపుతుంది.

 వ్యాన్గో పుట్టుకకు ముందు రంగుల లోకం

15,16వ శతాబ్దాల వరకు యూరోపియన్ చిత్రకళ ప్రధాన వస్తువు దేవుళ్ళు, బైబిల్ కథలు లేదా గ్రీకు, రోమన్ పురాణ గాధలు. ఆ తరువాత చారిత్రిక ఘట్టాలు వచ్చి చేరాయి. రాజులు జమీందార్లు తమ, తమ భార్యల, ప్రియురాళ్ల చిత్రాలను గీయించుకోవడం ఫ్యాషన్ అయ్యింది. లౌకిక, సామాజిక అంశాలు కళావస్తువులు అవడానికి చాలా కాలమే పట్టింది. డచ్ స్వర్ణయుగంగా చెప్పబడే 17వ శతాబ్దపు కాలానికే నిశ్చల చిత్రాలు (still life), రోజువారీ జీవితమూ, ప్రకృతి దృశ్యాలు (landscape) వునికిలోకి వచ్చాయి. అందరికీ చెందే కామన్ థీమ్స్ స్థానంలో వ్యక్తి అనుభూతులు రంగం మీదకు వచ్చాయి. రోమన్ కాథలిక్ చర్చి పూనుకున్న ఆధ్యాత్మిక జీవిత పునరుద్ధరణకు ‘బరోక్’ కళ అండగా నిలబడింది. కళలోకి రాజకీయాలు, నాటకీయత, ఉద్వేగాలు ప్రవేశించాయి.  ముదురు గాఢ రంగుల నేపథ్యంమీద ఘనమైన లేతరంగుల వాడకం మొదలైంది.

డిలాక్రోక్స్(రొమాంటిసిజం-లిబర్టీ లీడింగ్ ది పీపుల్)1830

18వ శతాబ్దికి బరోక్ కళా వైభవం మసక బారుతున్న దశలో ‘రొకోకో’ కళ అభివృద్ధి చెందింది. ఘనమైన, గాఢమైన రంగుల స్థానంలో రొకోకో లేత రంగుల వాడకాన్ని పాటించింది. రాజకీయాలు, మతం స్థానంలో ప్రేమ, శృంగారం, ప్రకృతి ఔన్నత్యాన్ని కీర్తించడం, మనుషులు గుంపులుగా వుండే వేడుకలు, మానవ సందోహాలను వస్తువులుగా ఎంచుకుంది.

మతాధికారం,  రాచరికాలపై స్వేచ్చాభావనలతో బూర్జువాలు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా శ్రామికులు తిరగబడిన కాలం మొదలైంది. ఫ్రెంచ్ విప్లవ ప్రభావంతో రొకోకోకు వ్యతిరేకంగా నియో క్లాసిసిజం పుట్టింది. క్రమత, శరీర సౌష్టవత్వాలకు ప్రాధాన్యత నిచ్చింది. నిష్పాక్షికత, హేతువు కలిగి వుండటం, అనుభావిక సత్యం దీని లక్షణాలు. నిజానికి ఇదో రాజకీయ ఉద్యమం అనుకోవచ్చు. ప్రేమపురాణాలు, రాసలీలలు వద్దంటూ నెపోలియన్ వంటి వాళ్ల వీరత్వం, ప్రాచీన గ్రీకు రోమన్ కళా వైభవం వెంటపడింది.

నియో క్లాసిజం కళావిలువలను ఆ తరువాత వచ్చిన రొమాంటిసిజం నిరాకరించింది. వ్యక్తి స్వేచ్ఛను, ప్రకృతి శక్తిని, సౌందర్యాన్ని, విలయాన్ని ఆరాధించింది. మనిషి ఉద్వేగాలకు ప్రాధాన్యత నిచ్చింది. అనుభూతులను ఉద్వేగాలను వ్యక్తపరచడానికి రంగులను, ప్రతీకలను బలంగా వాడుకుంది.

ఫ్రెంచి  విప్లవ కాలంలో అచ్చు యంత్రం ఉద్యమకారుల ఆయుధమైంది. భావవ్యాప్తికి కరపత్రాలు, పత్రికలు ప్రచురించారు. అందులోని వ్యంగ్య చిత్రాలు, కారికేచర్లు ప్రజలను ఎంత చైతన్యపరచాయంటే ఫ్రెంచ్ ప్రభుత్వం వాటిపై నిషేధాన్ని ప్రకటించింది. కళ నెరవేర్చగలిగే తక్షణ ప్రయోజనమేమిటో కళాకారులకు నేరుగా గోచరించింది.

పారిశ్రామిక విప్లవం పేదరికం, కొత్త శ్రామికులతోపాటు నగరాలనే మురికి కూపాలను సృష్టించింది. సంపద అతికొద్దిమంది పక్క పొగుపడింది. సామాజిక అంతరాలు పక్కపక్కనే నిలిచి కనిపిస్తున్నాయి. జీవన దుర్భరత, పేదరికం, ఆకలి, కష్టాలు కళావస్తువులయ్యాయి. ఈ నేపద్యంలో వాస్తవికవాదం (రియలిజం) ఆవిర్భభించింది. పట్టణకార్మిక జీవితపు లోతులను చూపింది. రైతుల కష్టాన్నీ రంగులకు ఎత్తింది. సమాజం మారుతుందన్న ఆశనూ రేకెత్తించింది. రొమాంటిసిజం లాగా ఇదికూడా సాహిత్య కళా రంగాలు రెండింటిలో ప్రభావాన్ని చూపింది. గుస్తేవ్ కోర్బెట్, మిల్లెట్, కోరట్, హెన్రీ డామియర్, మానెట్, డేగాస్, వ్యాన్గో, గాగిన్ వంటివారు దీని ప్రతినిధులయ్యారు. వీరిలో కొందరు ఆ తరువాత ఇంప్రెషనిస్టులు కూడా. ఈ విస్తృత నేపథ్యంలో వ్యాన్గోను మనం చూడగలగాలి.

ఇక వ్యాన్గో కథ

హాలెండ్‌లోని ఒక ఎగువ మధ్యతరగతి వాంగో కుటుంబంలో విన్సెంట్ (1853-1890) పుట్టాడు. (నవల కాన్వాస్  1873 నుంచి 1890 వరకు). పెదనాన్న కళారంగంలో పేరుమోసిన వ్యాపారి, తండ్రేమో ప్రొటెస్టెంట్ చర్చి పాస్టర్, బతకడం పెద్దగా చేతనవని సంప్రదాయపు విశ్వాసి.

“తల్లి కార్నీలియా సాధుస్వభావి. లోకంలోని చెడును చూసి యెరుగదు. ఆమెకు తెలిసినవల్లా ఆశక్తత, అనురాగం, బండెడు కష్టాలు, బాధలే. తండ్రికూడ అలాంటివాడే కానీ చెడు గురించి ఆమూలాగ్రం తెలుసు. దాన్ని కడదాకా చీల్చిచెండాడతాడు.” ‘అమ్మ, అబ్బల చాలే కొడుక్కు వచ్చిందిగానీ’ కాస్త భిన్నంగా, మరింత ‘తిక్కగా’. విన్సెంట్ కొంచెం బలమైనవాడే, అందగాడు మాత్రం కాదు. దానికితోడు యవ్వనపు మానసిక సమస్యగా మొదలైన అంతర్ముఖత్వం.

పెదనాన్నది లండన్, పారిస్ వంటి నగరాల్లో కళాఖండాలు అమ్మే ఉద్యోగం. తన పని అలాంటి లండన్‌లోని ఒక దుకాణంలో. పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్న ఇంటి అమ్మాయి ఉర్సులా చాలా నచ్చింది. ప్రేమ మనిషిని మార్చేస్తుంది. పరమ ముభావంగా వుండే విన్సెంట్ లాంటి వాణ్ణికూడా “ఒంటరి లోకం నుంచి అతన్ని పదిమందిలోకి లాక్కొచ్చి మామూలు జీవితంలోని మంచితనాన్ని పరిచయం చేసింది.” ఆమె తనను ప్రేమిస్తుందని మనసులో అనుకున్నప్పుడు అతనికి లోకం అందంగా కనిపించింది. ఆమె తన ప్రేమను నిరాకరించగానే నిరాశతో లోకం కూడా వడలిపోయినట్టు అనిపించింది. అచ్చు మనవంటి యింత మామూలు యువకుడు అంత గొప్ప చిత్రకారుడు ఎలా అయ్యాడా అని మనకు ఆశ్చర్యమేస్తుంది.

ఆమె లేని జీవితం అతనికి దుస్సహమైంది. వున్న ఉద్యోగం వదిలేశాడు. వూరికి బయలుదేరాడు. పుస్తకాలు చదవడం అతనికి ఇష్టమైన పని. ఫ్రెంచ్ తత్వవేత్త జోసఫ్ రెనా సోషలిజపు మూలాల్ని పరిచయం చేశాడు.”మనిషి యీలోకంలో నెగ్గుకురావాలంటే తన లోపల మరణించా లి. మనిషి యీ లోకానికి వచ్చింది సంతోషంగా నిజాయితీగా బతకడానికి కాదు. ఉదాత్తమైన మానవతా కార్యాలను నెరవేర్చి , ఔన్నత్యాన్ని అందుకొని అందరి అస్తిత్వాలనూ కబళిస్తున్న నీచత్వాన్ని అధిగమించడానికి…”

విన్సెంట్ బడిపంతుల ఉద్యోగానికి మారాడు. (గోపీ కూడా అలంపూర్ వద్ద ఉన్న మాంటెస్సోరి స్కూలులో ఆరునెల లు టీచరుగా చేశాడు) తిండి, బస మాత్రమే ఇస్తారు. పైన చిల్లిగవ్వ ఇవ్వరు. అక్కడా కుదురుకోలేదు. ఉర్సులా మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. విన్సెంట్ దుఃఖంతో లండన్ వదిలేశాడు. మతబోధకుడు కావాలని, అందుకు అవసరమైన చదువు కోసం ఆమ్‌స్టర్‌డామ్ చేరుకున్నాడు. పెద్దమ్మ కూతురు ‘కే’ను ఇష్టపడ్డాడు. కానీ అప్పటికే ఆమెకు పెళ్లయి బిడ్డ కూడా వున్నాడు. మళ్లీ నిరాశ. చదువులోనూ… వెనకబడ్డాడు.

“ప్రతి మనిషికీ నైతికధృతి అనేదొకటి ఉంటుంది. దాన్ని గుర్తిస్తే ఏ పని చేసినా చక్కగా పూర్తి అవుతుంది నువ్వేం చేసినా బాగా చెయ్యి. నిన్ను ఒక పరిపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దనున్న శక్తి ఎలాంటిదో నాకు తెలుసు . జీవితంలో నువ్వు ఓడిపోయావని చాలాసార్లు అనుకోవచ్చు. కానీ అంతిమంగా నిన్ను నువ్వు నిరూపించుకుంటావు. ఆ శక్తి నీ జీవితాన్ని సార్థకం చేస్తుంది.” విన్సెంట్ అదృష్టానికి మెండెస్ వంటి గురువు దొరికి ఇలా దారి చూపాడు.

“చదువులో వెనుకబడ్డాను గనుక లోకంలో దేనికీ పనికిరానివాడినా? తోటి మనిషిని ప్రేమించడానికి గ్రీకు, లాటిన్ తో పనియేమి? నేను చేయాల్సింది భగవత్సేవే గానీ త్రికోణాలు, వృత్తాలు గీయడం కాదు”. అంతర్మథనం నుంచి బయటపడి కొత్త నౌకరీ ఎక్కాడు.

యివాంజెలిస్టు మత బోధకుడిగా మారాడు. అదీ బెల్జియంలోని బోరినాజ్ బొగ్గుగనుల ప్రాంతంలో.

ఇక్కడ మనకో ప్రశ్న రావచ్చు. నెదర్లాండ్స్ వదలి బెల్జియం పోవడమెందుకని? ఒకప్పుడు (నెపోలినిక్ యుద్దాల తరువాత) బెల్జియం, నెదర్లాండ్స్ కలిసి ‘యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ నెదర్లాండ్స్’గా వుండేవి. 1830లో బెల్జియం విడిపోయినప్పటికీ ఆప్రాంతాల మధ్య, ప్రజల మధ్య పాతసంబంధాలు అలాగే కొనసాగాయి.

బొగ్గుగనుల ప్రాంతంలో కొండ వాలుకు అడ్డదిడ్డంగా చెక్క పలకలతో వేసుకున్న పూరి గుడిసెలు, మట్టి నేల, బోదకప్పు. పశువులకంటే హీనమైన బతుకు అక్కడి కార్మికులది. గనిలో 12 గంటల పని, చీకటి, ఉక్కపోత భరించలేక బట్టలు విప్పి ఉత్తబిత్తల పనిచేయాల్సిందే. గాలిలో బొగ్గునుసి, విషవాయువులు. గొంతుకూర్చుని పని, నిలబడుకోను కూడా జాగా వుండదు. పిల్లలు కూడా ఎనిమిది తొమ్మిదేళ్లకే గనిలో దిగుతారు. ఇరవై ఏళ్లకంతా ముసలివాళ్ళయిపోతారు. మనిషి గరిష్ట జీవితం అక్కడ నలభైయేళ్లే, అదికూడా ప్రమాదాల్లోనో, చివికిన గుడిసెల్లో కోతపెట్టే చలికాలాల్లో నిమోనియాతోనో, క్షయతోనో ముందుగా చచ్చిపోకపోతే. యింత చేసి వాళ్లకు దక్కిందేమిటి? జానెడు పూరిగుడిసె, మాడుచెక్క, పులిసిన జున్ను ముక్క, పాలులేని కాఫీ, యాడాదికో రెండేళ్లకో కాసిని మాంసం తునకలు. రోగ మొస్తే చేతిలో పైసా వుండదు. కుక్కచావు… నవలలో ఈ వర్ణనలు చదువుతున్నప్పుడు  “ఏనాటికానాడు ఎండవానల్లోన…” వంగపండు పాట గుర్తొచ్చి విషాదం కమ్ముకుంటుంది.

తన అవసరం జరూరుగా అక్కడే వుంది అనిపించింది విన్సెంట్‌కు. నిండు నిజాయితీతో క్రీస్తుమార్గాన్ని అనుసరించాడు. తనకొచ్చే కొద్ది జీతంతోనే గుడిసె గుడిసె తిరిగి ఆకలి కడుపులకు తిండిపెట్టాడు. వూరడించాడు, దేవుని వెలుగుచూపాడు. అతనితో సేవలు చేయించుకోని రోగులు, అతనితోకలిసి ప్రార్థనలు చేయని బాధామయులు ఆ పల్లెలో ఎవరూ లేరు. ఒక్కోసారి వాళ్లకు తిండి పెట్టి తను కడుపు మాడ్చుకున్నాడు. వాళ్ళ గుడిసెల్లోనే నివసించాడు. అలా ‘డిక్లాసిఫై’ అయ్యి వాళ్ళ విశ్వాసాన్ని ప్రోదిచేసుకున్నాడు. ఎంతగా అంటే ఒక దశలో కార్మికుల ప్రతినిధిగా గని యాజమానులతో చర్చలకూ పోయాడు. ఒక్కటంటే ఒక్కటి కనీస డిమాండునూ ఒప్పుకోలేదు వాళ్ళు.

శీతాకాలపు చలికి మనుషులు రాలిపోతున్నారు. తన చేతులతోనే అంత్యక్రియలు, ప్రార్థనలు చేస్తున్నాడు. వాళ్ల గుడిసెల్లో వేడి కలిగించేందుకు దిబ్బల్లో బొగ్గుముక్కలు ఏరి యిస్తున్నాడు. పేదరికాన్ని అంతలా అక్కున చేర్చుకున్నాడు. గని ప్రమాదంలో యాభయ్యేడు మంది చనిపోయారు. కార్మికులు సమ్మెకట్టారు. ఆకలితో పిల్లా ముసలి నకనకలాడుతున్నారు. తన జీతం ఏమూలకూ సరిపోవడం లేదు. విశ్వాసులైన ప్రజలకు సహాయం చేయమని  చర్చి పెద్దలకు జాబురాశాడు. జవాబులేదు. తన డబ్బులు వాళ్లకు ఖర్చు పెట్టేసి కొన్నాళ్ల పాటు కాఫీ, మంచినీళ్ళతోనే నెట్టుకొచ్చాడు. నెమ్మదిగా విశ్వాసం సడలనారంభించింది. మునుపటి నైరాశ్యం కమ్మింది. రెవరెండ్లు వచ్చారు.

“పూరికొంపలో మతబోధనలేమిటి? ముందు ఆ మురికి కుక్కలను బైటికి తోలు” అంటూ శాంతి ప్రార్ధనలకొచ్చిన ప్రజలను చూపి గాండ్రించారు.”అనాగరిక మతాన్ని మొదలుపెట్టా వా?” అని తిట్టారు. విన్సెంట్‌కు సభ్యత సంస్కారాలు లేవన్నారు. యివాంజెలిస్ట్ చర్చికి బద్ధ శత్రువన్నారు. చర్చి ప్రతిష్ఠ మంటకలిసిందని ఉద్యోగం తీసేసారు. మతం యే వర్గం పక్షాన నిలబడుతుందో తేటతెల్లమైంది. అంతర్మథనం మొదలయ్యింది.

“బైబిల్ సువార్తతో వాళ్లకు ఒరిగిందేమిటి? దీనుల మొర అలకించలేని బండరాయి అయ్యాడు దేవుడు.”

“ఈ దేవుడి కథలూ, సందేశాలు కుంటిసాకులు. భయవిహ్వలుడైన ఒంటరి మనిషి శీతలతిమిరంలో ఆనంతనిశీధిలో ఉరటకోసం తనకు తను కల్పించి చెప్పుకునే అపద్దాలు. దేవుడు లేడు, లేనే లేడు. ఉన్నదంతా మహాసంక్షోభం, దుఃఖభాజనమైన దుస్సహ సంక్షోభం.”

సత్యం గోచరించింది. తిరిగి పుస్తకాలు పట్టుకున్నాడు కానీ అప్పటికే దేనినీ పట్టించుకోని ఉద్వేగరాహిత్యంలోకి జారిపోయాడు. గని బయట కూర్చుని పెన్సిల్‌తో కార్మికుల బొమ్మలు గీయడం మొదలు పెట్టాడు. తన రంగం ఏమిటో బోధపడింది.

ఒక మనసరి కళాకారుడుగా మారడానికి వెనుక ఇంత ఘర్షణా, ఇంత నేపధ్యమూ ఉంది.

ఏ కార్మికుల ఇళ్లకు మతబోధకుడిగా పోయాడో అదే ఇళ్లకు చిత్రకారుడిగా ప్రవేశించాడు. చీకటి ఇళ్లను, నల్లని మసిబట్టిన పిల్లలను, ఇల్లాళ్లను, దుక్కిదున్నే రైతాంగాన్ని స్కెచ్ లు వేసుకొని సాధనచేశాడు. అంతకుముందు కంటే బలవత్తరమైన ఆకలి లోపల, కానీ తింటే తీరేది కాదు. కళతో, సృజనతోమాత్రమే ఆ మంట తృప్తిపడుతుంది.

తనకు ఇప్పుడు సాధన కావాలి మార్గనిర్దేశం కావాలి. అంటే బోరినాజ్ వదిలేయాలి.

రెవరెండ్ పీటర్సన్ రూపంలో సలహా దొరికింది. “మరీ దగ్గరగా వుండి గీస్తున్నట్టున్నావ్. చూసే కోణం సరిగా రాలేదు. కానీ నీ బొమ్మల్లో ఏదో తాకుతోంది. కొలతలు తప్పు. మొహమూ బాలేదు. కానీ బోరినాజ్ మనుషుల ఆత్మను నీవు పట్టుకున్నావు. అది చిన్నవిషయం కాదు.”

ఇన్ని వివరాలన్నీ ఇక్కడ ఎందుకు ఏకరువు పెడుతున్నానంటే: మనలో ఎక్కువమందికి చిత్రకళ గురించి తెలియదు. ఆసక్తీ అంతంత మాత్రమే. దీనికితోడు చిత్ర కళపట్ల చిన్నచూపు. గీతలో నిలదొక్కుకోగలిగిన ఒక చిత్రకారుడు అవ్వాలంటే ఎంత రాపిడి పడాల్సివుంటుందో తెలుసుకోవడం కోసం. 

సలహాల కోసం కళావేత్త జూల్ బెత్రాను కలవాలి, కొత్తగా వేసిన తన బొమ్మలు చూపాలి.

జూల్ బెత్ర – గోధుమ పొలంలో పని (1859)

170 కిలోమీటర్ల ప్రయాణంలో డబ్బు వున్నంత వరకు రైల్లో అక్కడినుంచి నడక… చిరిగిన బూట్లు, మాసిన కోటు. తన అవతారం తానే చూసుకుంటే అతని స్టూడియో లోపల అడుగుపెట్టడానికీ మనసొప్పలేదు. కాలే కడుపుతో అరిగిపోయిన బూట్లతో కాళ్ళు కొట్టుకుంటూ అంత దూరమూ నడిచి వెనక్కొచ్చాడు. దారిలో ఆకలికి తన స్కెచ్‌లు తక్కువ ధరకు అమ్మో, అడుక్కునో బ్రెడ్డు తిన్నాడు. అంత ఆ ఉన్మాది ఆకలితో, జ్వరంతో మూలనబడితే కార్మికుల భార్యలు తమకు కలిగింది తెచ్చిపెట్టారు. తమ్ముడు  రాబట్టి సరిపోయింది.

తమ్ముడు థియోడర్ తప్ప కడవరకూ అతని తోడు నిలబడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. అన్న అంటే థియోకు కూడా ప్రాణం. తల్లిదండ్రుల కంటే మిన్న. అతనితో కలిసే ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు.

‘విన్సెంట్ తనలో సగం. తన జీవితం పరిపూర్ణం కావాలంటే అన్న తనకు తోడుగా ఉండాలి. యెందుకూ పనికి రాకుండా పోతున్న అన్నకు కళ్ళుతెరిపించి జవసత్వాలు ఇవ్వాలి. తన కాళ్లపై తను నిలబడేలా చేయాలి’ అనుకున్నాడు తమ్ముడు. ఇంటికి తెచ్చాడు.

తండ్రులూ- కొడుకులూ

“ఇంకెప్పుడు జీవితంలో స్థిరపడతావ్?”

“ఇంకెన్ని సంవత్సరాలు ఇలా సాధన చేస్తూ కాల వృధా చేస్తావ్?”

“నీలో ఏ మాత్రం ప్రతిభ వున్నా బొమ్మలు తొలిప్రయత్నంలోనే బాగా వచ్చేవికదా!”

“యింత ప్రయత్నించినా నీకు కళ సరిగా అబ్బకపోతే?”

తండ్రి మొదలు ప్రపంచం నుంచి పదే పదే ఎదురౌతున్న ఆవే ప్రశ్నలు.

 విన్సెంట్ అన్నాడు “కళాకారుడు జూదమాడాల్సిందే నాన్నా!”

“నీ జూదానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందా?”

“ఏం ప్రతిఫలం?”

“డబ్బు, సంఘంలో హోదా!” ఇదీ అసలు విషయం. తండ్రులూ కొడుకుల మధ్య, తరాల మధ్య ఈ అంతరం శతాబ్దాల పాటు ఇలా కొనసాగవలసిందేనా?

ఆ ముందుతరం ఆశించినట్టు మనిషి వికాసం, ఎదుగుదల పరమలక్ష్యం డబ్బు, సంఘంలో హోదా మాత్రమేనా? కొన్ని వందల ఏళ్లుగా కళాకారుడికి సమాజంతో యిదే పేచీ.

విన్సెంట్ ఆలోచనలు భిన్నమైనవి, దృఢమైనవి. “మనిషి బొమ్మ వేయాలంటే అతని శరీరంలోని ఎముకలు, కండరాలు నరాలు తెలియాలి. తలను గియ్యాలంటే మస్తిష్కంలో, ఆత్మలోపల ఏం జరుగుతుందో గ్రహించాలి. ప్రజల జీవితాన్ని చిత్రించాలంటే వాళ్ళ శరీర నిర్మాణంతో పాటు లోకం పట్ల వాళ్ళ ఆలోచనలేమిటో కూడా తెలుసుకోవాలి. వట్టిగీతలు, రంగులు మాత్రమే తెలిసిన కళాకారుడు రసహీనంగా మిగిలిపోతాడు.”

నేను కోట్స్‌గా ఇస్తున్న భావనలు నవల మూల రచయిత ఇర్వింగ్ స్టోన్‌వి కాదు. విన్సెంట్ వ్యాన్గో తన తమ్ముడు థియోకి రాసిన ఉత్తరాలలోని భావాలు. 18 సంవత్సరాల్లో రాసిన 660కి పైగా ఉత్తరాలలో అనేక కళా సంబంధ విషయాలూ, తన జీవితమూ, కష్టనష్టాలు పంచుకున్నా డు. వాటిని ఉపయోగించి ఇర్వింగ్ స్టోన్ వ్యాన్గో వ్యక్తిత్వాన్ని రూపుకట్టాడు. అందుకే నవల అంత సాధికారంగా వచ్చింది.

విన్సెంట్ తన నివాసాన్ని డచ్ సాంస్కృతిక రాజధాని హేగ్ పట్టణానికి మార్చాడు. టర్‌స్టీగ్ హాలండ్‌లోనే అగ్రస్థాయి కళా వ్యాపారి, హేగ్ చిత్రకళా సాంప్రదాయ స్థాపకుడు. గూపిల్స్ కంపెనీ మేనేజర్‌గా వున్నాడు. యువకళాకారులకు చేయూతనిస్తున్నాడు. తనకు సాయపడవచ్చు. అలాగే తన బంధువు ‘మావ్’ హేగ్‌లో అప్పటికే మంచి గుర్తింపువున్న కళాకారుడు అతనూ సాయపడవచ్చునన్న గంపెడాసెతో వచ్చాడు.

Morning Ride on the Beach (1876) by Anton Mauve

టర్‌స్టీగ్ ఆదరంగా మాట్లాడాడు. చిత్రాలన్నీ చూసి మరి కొంతకాలం నువ్వు కాపీచేస్తే మేలు. సొంతంగా వేసే దశకు నువ్వింకా చేరుకోలేదు అన్నాడు.  మావ్ స్పందన భిన్నంగా వుంది “నీ బొమ్మలు మోటుగా ఉన్నావాటిలో జీవమూ శృతి వున్నాయి. కాపీ పుస్తకాలు గిరాటేసి రంగులు కొనుక్కో, డ్రాయింగ్ మెరుగుపరచుకో” అన్నాడు.

భర్త చనిపోయి వితంతువైన ‘కే’ కూడా అక్కడే ఉంది. పాలిపోయివుంది. బలహీనంగా, దిగులుగా ఉంది. విన్సెంట్ ఆమెకూ, ఆమె కొడుకు జాన్‌కు తోడు నిలిచాడు. కానీ మనసులో ఏదో ఒకమూల ఒంటరితనం. 29 ఏళ్ళు వచ్చినా ఇంకా అర్భకుడే. “స్త్రీ ప్రేమకు నోచుకోని జీవితం మరణసదృశం” అతని అభిప్రాయం. ఆమె సన్నిధిలో వుంటే చాలు తను సంతోషంగా ఉంటాడు. ఒకనాడు ప్రేమిస్తున్నానని చెప్పేసాడు.

“నువ్వూ ప్రేమిస్తున్నావు కదూ, పెళ్లాడతావుకదూ” ఆమెను ఒడిసి పట్టుకొని అన్నాడు. ఠారెత్తి పోయింది. “వద్దు కుదరదు.కుదరదు” అంటూ పిల్లవాణ్ణి ఎత్తుకొని పరిగెత్తింది. ఆమె ఎందుకు వద్దంటున్నదో అతనికి అర్థం కాలేదు.

బహుశా తీవ్రమైన ప్రేమ కాంక్షతో వున్న నిరుద్యోగ యువకులెవ్వరికీ ఇది అర్థం కాదు. ఆ యువకుల మనసు స్త్రీ సాంగత్యం కోసం ఎందుకలా పరితపిస్తున్నదో యీ లోకానికీ అర్థం కాదు.

‘ఆమె తొలి జ్ఞాతి. ఆమెతో పెళ్లి కూడదు,” మతాచారాల్లో పరమనిష్టగా ఉండే తండ్రి నిరాకరించాడు. ఆమె వెళ్ళిపోయింది. తను దిగులుపడ్డాడు. ఆమె మనసు మార్చగలననుకొని ఉత్తరాలు రాయసాగాడు. ఆమె పట్టించుకోలేదు. నిజానికి ‘కే’ కన్నా తనకు బొమ్మలపైనే ప్రేమ ఎక్కువని తెలుసు. ఆమె నిరాకరణ తరువాత అతని డ్రాయింగులు ఎత్తుపల్లాలు లేకుండా చదునుగా రాసాగాయి. మళ్లీ వదలకుండా నేరుగా ‘కే’ ఇంటికే పోయాడు. ఆమె తల్లిదండ్రులు చీదరించుకున్నారు. ప్రేమను గెలుచుకోడానికి ఒక్క అవకాశం ఇమ్మని, ఒంటరితనాన్ని, దుఃఖాన్ని ఇక భరించలేనని వేడుకున్నాడు. ‘అంత పిరికివాడివా? చేతకాని దద్దమ్మలా ఏడుస్తూ వుంటావా?’ ఆమె తండ్రి చీదరించుకున్నాడు.

‘నా చేయిని దీపంపై ఉంచగలిగినంతసేపు నేను ‘కే’ తో మాట్లాడాలి’ అని కొవ్వొత్తిపై అరచేయి పెట్టాడు విన్సెంట్. చర్మం కాలి కమిలింది, కొన్నిసెకన్లకు బొబ్బ కట్టింది. చిట్లిపోయింది. ఆఖరికి ఆమె తండ్రి తెలివిలోకి వచ్చి ’పిచ్చోడా! మూర్ఖుడా!’ అని కొవ్వొత్తిని ఆర్పేశాడు. చుట్టూ అంధకారం. “వెళ్లిపో పిచ్చివాడా! ‘కే’ కు నువ్వంటే అసహ్యం,” అని అరిచాడు.

కళాసాధన ఆగలేదు. మావ్ కుంచెతో నీటి రంగులబొమ్మలు వేయడం నేర్పించాడు. తమ్ముడి నుంచి డబ్బు రాలేదు. మూడు రోజులు పస్తు పడుకున్నాడు. అభిమానం చంపుకొని పాతిక ఫ్రాంకులు అప్పుతెచ్చుకున్నాడు. తిన్నా ఆకలి చావలేదు. ఒంటరి పరివేదన వెంటాడుతూనే వుంది. ‘కే’ పై ప్రేమ మళ్లీ గుర్తొచ్చింది. దుఃఖంతో వూపిరితీయడమూ కష్టమైంది. సారా దుకాణానికి పోయాడు. తనలాగే బీదగా వుంది. అభాగ్యుల వూరట గూడు. పక్కనే తాగటానికి పైసలు లేని ఒంటరి స్త్రీ. ఆహ్వానించాడు. యవ్వనం లేదు, అందం లేదు, జీవం లేదు కానీ తీరుగానే ఉంది. ఆమె బట్టలు వుతుకుటుంది. ఒంట్లో శక్తి లేనప్పుడు వొళ్ళు అమ్ముకుంటుంది. ఐదుమంది పిల్లలను సాకాలి. ఇప్పుడు మళ్లీ గర్భవతి కూడా.

ఆమెదీ ఒంటరితనమే. “పడుకోడానికి మగనాకొడుకులు వస్తారు మనుషులు లేకకాదు. యిష్టమైన మనిషిలేకనే బాధ” అతను ఆ వేదనను అర్థం చేసుకోగలడు. అప్పటికి విన్సెంట్ వయసు ముప్పై ఏళ్ళు. ఆమెతోపాటే వెళ్ళాడు. విన్సెంట్ పొద్దున ఒంటరిగా నిద్ర లేవలేదు. తొలిసంజె వెలుగులో పక్కన తోడుకనిపించి ప్రపంచం ప్రేమాస్పదంగా అనిపించింది. మనసున శాంతి నెలకొంది. తమ్ముడిచ్చిన వంద ఫ్రాంకులతో ఇప్పుడు మోడళ్లను పెట్టుకొని బొమ్మలు వేస్తున్నాడు. కాకపోతే బొమ్మలలో తన ఎంపిక మారలేదు. పొయ్యి దగ్గర కూర్చున్న ముసలమ్మలు, కమ్మరి కొడుకో, చిదుగు బజారు కార్మికుడో, యూదుల బస్తీలోని అవ్వా మనవళ్ళో. విలాసవంతమైన నగరానికి వచ్చినా, డిబాక్ వంటి సంపన్న చిత్రకారుల మధ్యన పడినా అతని కళా వస్తువు మారలేదు. కొన్ని సహజాతాలు వదలవంతే.

గొప్పవాళ్ళ చిత్రాలను అనుకరించడానికి ప్రయత్నిస్తే మావ్ తిట్టాడు. ‘నీ మోటుదనపు బొమ్మలకే కట్టుబడి వుండు. కాలక్షేపం గాళ్ల వెంటా, బొమ్మలుకొనే డీలర్ల వెంటా పరిగెత్తకు. నీ బొమ్మల్ని ఇష్టపడే వాళ్ళు నీ దగ్గరికి రాకమానరు. నువ్వు పరిణితి సాధిస్తావు’ అని విన్సెంట్‌కు గడ్డిపెట్టాడు.

సారా దుకాణంలో పరిచయమైన సియా ఇంటికొచ్చింది. అతనికి మాంసం వండిపెట్టింది. కల్లాకపటం, మెచ్చుకో వాలన్న ఆశ, భేషజాలు లేకుండా అతి మామూలు విషయాలు మాట్లాడుకున్నారు. ముసుగులు, గొప్పలు, వంచన, అంతస్తుల తేడాలు అన్నీ వదిలించుకున్న రెండు ఆత్మల పవిత్ర సంగమం. మోడల్‌గా వుంటే రోజుకు రెండు ఫ్రాంకులు ఇస్తానన్నాడు. పిల్లలను తల్లిదగ్గర వదిలేసి విన్సెంట్ గదిలోనే ఉండి పోయింది. వంట, ఇంటి పనులు చేసి పెడుతున్నది. ఆమె మోడల్‌గా ‘సారో’ చిత్రం గీశాడు.  చేతిలో డబ్బులు అయిపోయాయి. ఉరువెళ్తున్నానని చెప్పి ఆమెను పంపేసి తను పస్తులున్నాడు. ఆఖరుకు టీ, కేకు దొరుకుతాయన్న ఆశతో డిబాక్ ఇంటికి పోయాడు. నిరాశే. రెండు రోజులు మళ్లీ ఆకలి, జ్వరం. సియాకు పరిస్థితి అర్థమైంది. తన సంపాదనతో అతనికి సరుకులు తెచ్చి వండిపెట్టింది. ఆ నిర్భాగ్యురాలి కనికరం అతని నడ్డిని విరిచేస్తోంది. విన్సెంట్ కూడా ఆమె పట్ల అంత బాధ్యతనూ కనపరచాడు. ఆమె ఆరోగ్యం బాగుచేయించడానికి కష్టపడ్డాడు.

కథను అర్ధాంతరంగా ఇక్కడ ఆపేస్తాను నేను…

ఆ జీవితాన్ని మీరు నవలలో చదువుకోవచ్చు…

ఆశ నిరాశలతో గడిపిన తన జీవితమంతా విన్సెంట్ వ్యాన్గో అనే యువకుడు కళా సాధన చేస్తూనే వున్నాడు. పడుతూ లేస్తూ చిత్రాలు గీస్తూనే వున్నాడు.

నవల చదువుతూ చదువుతూ ‘జీవితంలో నిలదొక్కుకోలేని’ అతని చేతగానితనం పట్ల మీకు కోపమొస్తే, అతనిది బాధ్యతా రాహిత్యం అనిపిస్తే మనలోనూ ఒక తండ్రిని పోలిన పాత్ర వున్నట్టే అని నాకు అనిపించింది.

ముప్పై అయిదు ఏళ్లకు వ్యాన్గోకు మతిభ్రమించిది. మానసిక రోగుల ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ కూడా చిత్రాలు వేసిన పిచ్చివాడు అతను. ఒకనాడు పొలంలో ఆత్మహత్యతో కళాకారుడి జీవితం ముగిసింది.

వ్యాన్గో, అతని తమ్ముడి సమాధి.

వ్యాన్గో అతని సమకాలీనులు

వ్యాన్గో సమకాలీనుల బొమ్మలను యిపుడు గమనిద్దాం. కొన్ని పొలికలూ, లేదా కొంత కొనసాగింపూ కనిపిస్తుంది.

జూల్ బ్రెతా వేసిన ‘గోధుమ పొలంలో పని’ చిత్రానికీ వ్యాన్గో ‘బొరినాజ్ గనికార్మికుల భార్యలు’ లేదా ‘ఆలుగడ్డలు ఎరుతున్న కష్టజీవి’ చిత్రాలకు, అలాగే మిల్లెట్ ‘పరిగలేరుకునే వారు’ చిత్రాలకు ఎంతో పోలిక ఉంది. డచ్ దేశం ఒకప్పుడు ఫ్రెంచ్ దేశం ఏలుబడిలో ఉండేది. అందువల్ల డచ్ చిత్రకారులపై ఫ్రెంచ్ చిత్రకళా ప్రభావం కనిపిస్తుంది.

హెన్రీ డామియర్ (1808-1870) ఆనాటి ఫ్రెంచ్ వార్తా పత్రికలకు కార్టూనిస్టు, లితోగ్రాఫర్. బిడ్డల తల్లులు, ముతక మనుషులతో నిండిన అతని ‘మూడవ తరగతి రైలుపెట్టె’ చిత్రం చూడండి. ఎంత గాఢమైన రంగులు వాడాడో. రంగులే కాదు ఆ మనుషుల ముదురు మొఖాలు కూడా అచ్చు వ్యాన్గో ‘ఆలుగడ్డల భోజనం’ చిత్రంలో ఉన్నట్టే.

డౌమియర్(1862) మూడవతరగతి రైలుపెట్టె

డామియర్ పత్రికా స్వాతంత్ర్యమ్ చూడండి. మన చిత్తప్రసాద్ దరిమిలా ఆర్టిస్టు మోహన్ గుర్తొస్తారు.

డౌమియర్ ఫ్రీడం ఆఫ్ ది ప్రెస్ (1834).

(పరిగలేరుకునేవారు)మిల్లెట్

(రాళ్లు కొట్టే వాళ్ళు) గుస్తేవ్  కార్బెట్

కోర్బెట్ వేసిన రాళ్లు పగులగొట్టే కార్మికులు వ్యాన్గో వేసుకున్న కొన్ని స్కెచ్‌లలో ప్రతిఫలిస్తుంటారు.వాస్తవికతలోని సహజత్వం, కాంతిపై ప్రేమ వల్ల ఇంప్రెషనిజం వచ్చింది. ఒక రకంగా ఇది ఆధునిక చిత్రకళలో మొదటిది అంటారు. వీరు వెలుగునీడలకు ప్రాధాన్యత నిచ్చారు.

కొరొట్ ల్యాండ్ స్కేప్

ఈమధ్యలో పాయింటిలిజం వచ్చింది. సోరట్ దీనికి ఆద్యుడు. జానర్ వేరే అయినప్పటికీ సోరట్ ‘స్ప్రింగ్ టైం’ కు వ్యాన్గో ‘సూర్యాస్తమయం’కు సామీప్యత వుంది.

Spring time sauret -1888

మానెట్ : చక్రవర్తి కి మరణశిక్ష (1868)

డేగాస్ (నిరీక్షణ)

డేగాస్ ‘నిరీక్షణ’ చిత్రానికీ వ్యాన్గో ‘దుఃఖం’కు పోలికలు వున్నాయి.

                              ***

వ్యాన్గో కోరికోరి ఎక్కిన అంపశయ్యపైన వున్నప్పుడు, మరణం తరువాత వచ్చిన అనేక కళా రీతుల్లో సింబాలిజం ఒకటి. 19వ శతాబ్దపు రియలిజం, ఇంప్రెషనిజం, 20వ శతాబ్దపు ఎక్స్‌ప్రెషజనిజం నైరూప్యతలకు మధ్య వారధి సింబాలిజం.

మొదట్లో విమర్శకులు వ్యాన్గో, పాల్ గాగిన్ చిత్రాలకు ఈ వాదాన్ని అన్వయించారు. ప్రకృతిలో ఉన్నదాన్ని కాపీ చేయడానికి వ్యతిరేకం యిది. ప్రకృతిలో ఉన్నదాన్ని చూసినపుడు కలిగిన అనుభూతిని చిత్తంలోకి తేగలిగేది కళ అని వారి భావన.

దీని తరువాత పోస్ట్ ఇంప్రెషనిజం వచ్చింది. సోరట్, సిజాన్, వ్యాన్గో, గాగిన్ లు దీని ప్రతినిధులు. సిజాన్ తన చిత్రాల్లో పేలేట్ నైఫ్‌ను ఎక్కువగా వాడేవాడు. వ్యాన్గో కూడా దీన్ని అనుసరించాడు.

వ్యాన్గో అతని సహచరుల తరువాత రెండు ప్రపంచయుద్ధాల కాలానికి సర్రియలిజం, అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్, డాడాయిజం, నియో రియలిజం, హ్యూమనిజం, సోషియల్ రియలిజం, పోస్టు మాడర్నిజంగా ఇలా నిరంతరాయంగా   ప్రవహిస్తూనే వున్నది కళ.

ఇన్ని ధోరణులు, కళారీతులు ఎందుకొచ్చాయి?

ఒకసారి సంస్కృతిలో భాగమైనదేదీ అంతరించిపోదు. ఆ కాలానికి మరుగునపడవచ్చునేమో. మళ్లీ అనుకూల వాతావరణం ఏర్పడగానే తిరిగి గుర్తుపట్టలేనంత కొత్తరూపంలో మొలకెత్తవచ్చు కూడా. ప్రపంచంలో అంతిమంగా ఉన్నది రెందు పాయలే ఒకటి భావవాదం, రెండు భౌతిక వాదం.

ముగింపునకు ముందు

జీవనలాలస నవల నాకు ఎంతగానో నచ్చింది. అనువాదంలా అనిపించకుండా మోహన్ స్వంత రచనేమో అన్నంత హాయిగా నడిచింది. కెమిస్ట్రీ రీసెర్చ్ పేరుమీద తిరుపతిలో నేను సాహిత్య వ్యాసంగం నడుపుతున్నప్పుడు ఒక మిత్రుడి దయతో పాత నవల ‘బీదలపాట్లు’ చదివాను. అది వ్యాన్గోకు ఇష్టమైన విక్టర్ హ్యూగో Les Miserablesకు తెలుగుసేత. అనువాదం చేసింది నెల్లూరు పెద్దాయన మరుపూరు కోదండరామిరెడ్డి గారు. కొద్దిగా అప్పటి గ్రాంధిక వచనంలో సాగుతుంది. ఒక్క పది పేజీల వరకే పాఠకుడికి ఇబ్బంది. ఒక్కసారి కథలోకి వెళ్లిపోయామా ఆపడం అతి కష్టం. అంత మంచి అనువాదం. పేజీలు 900 పైగానే. ఆ మొత్తంలో ఒకే ఒక్క చోట ఇంగ్లీష్ పదం వాడాడు. అదీ  కోదండరామిరెడ్డి గారి టాలెంటు. మోహన్ కూడా ఈ అనువాదంలో అతి తక్కువ ఇంగ్లీషు పదాలు వాడాడు. నచ్చడానికి ఇది మరో కారణం.

యీ నోట్సులో నేను వ్యాన్గో చిత్రాలు ఇవ్వలేదు. అనువాదకుడు పుస్తకంలో వ్యాన్గో వర్ణచిత్రాలను రంగుల్లో, స్కెచ్‌లను ఫోటోలను తెలుపు- నలుపుల్లో చాలా ఇచ్చివున్నాడు. పైన చెప్పిన పోలికల పరిశీలన  కోసం వాటిని చూడండి.

వ్యాన్గో  పుట్టుకకు అరవైయేళ్ల ముందు  ప్రెంచ్ విప్లవం జరిగింది. ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తిసంబంధాలలో వచ్చిన మార్పు సామాజిక సంబంధాలలోనూ మార్పుకు దారి తీసింది. నిరంకుశ రాచరికాన్ని సవాలు చేసి కొత్త పాలనా విలువలు, చర్చి(మత) ఆధిపత్యాన్ని నిలువరించే కొత్త సామాజిక విలువలూ అవసరం అయ్యాయి. ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే వ్యాపార పెట్టుబడిగా ఉన్న తొలిదశలో భూస్వామ్య వ్యవస్థను బద్దలు కొట్టవలసి వచ్చినపుడు  పెట్టుబడిదారీ విధానం “స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం” అనే విప్లవాత్మక నినాదాలను ఎత్తుకుంది.

Jean-Pierre Houël బాస్టిల్ కోటపై తిరుగుబాటు

ఆ తరువాతి స్వేచ్చా పెట్టుబడి గుత్త పెట్టుబడిగా మారుతున్న దశలో ఇతర దేశాలకు పెట్టుబడిని ఎగుమతి చేసింది. దీన్ని సామ్రాజ్య వాద దశ అంటారు. అందుకోసం తాను ఎదిగిన స్వేచ్చా పెట్టుబడిదారీ విధానాన్ని తానే నాశనం చేసింది. తన వలస దేశాల్లో ( భారత దేశం వంటి) మాత్రం తాను నాశనం చేసిన పాత భావాలను తనవిగా, గొప్పగా ప్రచారం చేసుకుంది. సాధారణఅర్థంలో ఉత్పత్తి విధానంలో వచ్చిన మార్పు సామాజిక సంబంధాల్లో మార్పునూ కోరింది. ఘనీభవించిన సమాజం బద్దలు అయితేకాని ఆ మార్పు రాదు. ఆ మార్పు అన్ని దేశాలనూ ప్రభావితం చేసింది. రూసో, వోల్టేర్ వంటి తత్వవేత్తల భావనలు ప్రజాస్వామిక భావాలుగా రూపుదిద్దుకున్నాయి. అన్ని రకాల ఆసమా నతలు పోవాలన్న ఆకాంక్ష దేశ దేశాల రాజ్యాంగాలలో పొందుపరచడం అనివార్యమైంది. ఫ్రెంచ్ విప్లవ పతనానికి దారితీసిన పరిస్థితుల విశ్లేషణ మార్క్స్- ఎంగిల్స్ పరిశీలనలుగా మొదలై తాత్విక సిద్ధాంతంగా రూపుదిద్దుకుంటు న్నది. అది విప్లవాలను కడుపుతో వున్న కాలం.

ఫ్రెంచ్ విప్లవం(1789 -1799)తో మొదలై పారిశ్రామిక విప్లవం(1800-1840) దన్నుతో పెట్టుబడిదారీ సమాజ దిశగా సాగుతున్న యూరోప్ శాస్త్ర సాంకేతికతలో, సమాజంలో గత బంధనాలను తెంచుకుని ఆధునిక భావనల వికాసం మొదలైన కాలం. కళారంగంలో రొమాంటిసిజం, నాచురలిజం, రియలిజం పవనాలు వీస్తున్నవి.  యీ ఉద్రిక్త సంధికాలంలో వ్యాన్గో వంటి కళాకారుడు పుట్టాడు. అన్నింటిలో భాగమయ్యాడు.

Leave a Reply