‘జీవితం’ కరుణ రాసిన కథల సంపుటి. ఇందులో మొత్తం 30 కథలున్నాయి. వాటిలో జీవితం ఒక కథ. ఆ కథ పేరే పుస్తకం పెరయ్యింది. 30 కథలు విభిన్నమైన సారూప్యమైన ఇతి వృత్తాల కలయికగా, పాఠకులకు పరిచయమై అనేక సన్నీవేశాలతో, సంఘటనలతో, పాఠకులు తమను తాము పాత్రలలో ప్రవేశ పెట్టుకునేంత సహజ సిద్దంగా , మమేకత్వంతో పాత్రలను, కథనాలను, నిర్మించడం రచయిత్రీలోని ప్రత్యేకత. ఆ ప్రత్యేకతే ఈ పుస్తకంలోని కథలు ఎక్కువ కాలం పాఠకుని మనసులో నిలిచిపోయేందుకు కారణం అవుతోంది. సంపుటిలోని ప్రతి కథ ఒక సందేశాత్మక ఇతివృత్తంతో ఉంటుంది. రచయిత్రి ఆ మూలాగ్రం తన కథలలోని, విభిన్న పాత్రల ద్వారా, ఈ విశాల సంబంధాల స్థాపనకు, పునరుద్దరణకు, విశేషమైన ప్రయత్నం చేశారు. చాలా మట్టుకు సఫలమయ్యారు కూడా. బహుశా ఇందులోని కథల్లో నిలుచున్న అనేక పాత్రలు, కరుణ వాస్తవ జీవితంలోని పాత్రలే అయి వుంటాయి. అదే అయితే నిజ జీవిత ఘటనలను ఇంత క్రమ బద్దంగా, ఉద్వేగ పూరితంగా, అక్షరీకరించిన కరుణ నిజంగా అభినందనీయురాలే. పరిణతి చెందిన కథా కథన పద్దతితో, ఈ కథలన్నీ ఆసాంతంగా పాఠకున్ని చదివించేలా ఉన్నందుకు ప్రధాన కారణం. రచయిత్రి వాటిని కథలుగా కాకుండా, జీవితానుభవాలుగా పుస్తకానికెక్కించడం. అందుకే ‘జీవితం‘ అనేక అనుభవాల సారాల రంగరింపు. విభిన్న మానవ సంబంధాల అత్యావశ్యక స్థిరికరణల ఆకాంక్ష.
ఈ కథా సంపుటిలోని టైటిల్ కథ ‘జీవితం’ ను మాత్రమే తీసుకొని ఈ విశ్లేషణను కొనసాగిస్తే, ముఖ్యంగా ‘జీవితం’ కథ లోని ప్రధాన అభివ్యక్తి మరియు వస్తువు అయిన అమ్మ ప్రేమ, అమ్మ మనస్తత్వ విశ్లేషణ చేయడం మాత్రమే ప్రధాన విశ్లేషణ అవుతుంది. ‘జీవితం’ కథ 2009 ఆగష్టు 25 న వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురించిబడిననూ , ఇందులోని కథ వస్తువు ఎల్ల కాలాలకు, ఏకాలానికి ఆ కాలమే నిలిచి ఉండే ప్రాధాన్యతను కలిగి ఉంది. అమ్మ మనసును కొలిచే మితి పద్దతి ఏదీకాదు. అయిన అమ్మను అర్ధం చేసుకొనే ప్రయత్నం, నిరంతరం చేస్తూ ఉండటమే అమ్మకు బిడ్డలిచ్చే కృతజ్ఞతాపూర్వక ప్రతి స్పందన. కానీ తొంభై తొమ్మిది శాతం పిల్లల నుండి ఆ స్పందన ఉండటం లేదు. అందుకే ‘జీవితం’ లో లాగా అమ్మలు, ఎందరో బిడ్డలున్నా ఒంటరి అవుతున్నారు. తమ రక్త సంబంధాల నుంచి తామే పరాయీకరించబడుతున్నారు. కన్న అనుబంధం నిర్లక్ష్యంపరిస్తే, ఒంటరితనాన్ని పారవశ్యంతో ముద్దాడుతున్నారు.
ముందు జీవితం కథలోని అమ్మ గురించిన ప్రాధమిక విషయాలను చూద్దాం. అమ్మ కు డెబ్బై ఒక సంవత్సరాలు. అంతా వయసులోనూ అమ్మ శారీరకంగా, చాలా చురుగ్గా ఉంది. మానసిక ఆలోచనలులో బాధలు ఉన్నా, అవేవీ శారీరక దృఢత్వాన్ని దెబ్బతీయలేదు. అమ్మకు మొత్తం ఎనిమిది మంది పిల్లలు. ఐదుగురు మగ, ముగ్గురు ఆడ పిల్లలు అందరికీ పెళ్లిళ్లు అయి సంసారాలు ఏర్పడ్డాయి. తాత అంటే అమ్మకు తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. అతను బతికున్నప్పుడు అప్పుడో ఇప్పుడో కొన్న కొద్దిపాటి బంగారం, అమ్మమ్మ సంసారం నడపటానికే సరిపోయింది. అందుకే రెండో పెళ్లి అయినా నాన్నను చేసుకోవడానికి అంగీకరించింది అమ్మ. నాన్న పూర్తిగా పురుషాధిక్యపు మనిషి. భార్యను కొట్టనిది మగ పుట్టుకే కాదనే సూత్రంతో అమ్మను నాలుక, మినహా మిగతా శరీరం అంతా హింసించాడు. అసలే చిన్న తనాన, పెళ్లినాటికే బక్కగా, ఎత్తు పళ్ళుండి వికారంగా ఉన్న అమ్మ , నాన్న దెబ్బలతో మరింత వికారంగా మారింది. అయితే అమ్మమ్మ విషయంలో ఇది పూర్తిగా భిన్నమే. అమ్మమ్మను తాత చాలా బాగా ఇష్టంగా చూసుకునేవాడు. బారెడుండే అమ్మమ్మ జుట్టుకు, తాతే తలంటూ పోసేవాడు. అమ్మమ్మ నగలు, సవరం పెట్టుకుంటే తాత చాలా సంతోషించే వాడు. ఒక్కో రోజూ ఆమెను కోపగించుకునేవాడు. కానీ తాత చేదగ్గుతో చనిపోయాడు. తాత ప్రేమను అంతగా పొందిన అమ్మమ్మ, సంసార బాధ్యతలు నెత్తిన పడిన ఆ తరువాత, చాలా కష్టపడింది. మొత్తానికి తన బాధ్యతలు నెరవేర్చి అమ్మమ్మ సుఖమరణమే పొందింది. కానీ అమ్మ సంసారం నాన్నతో అంతా గొప్పగా సాగలేదు. అందుకు కారణం నాన్న ప్రవర్తనే. ఆయనెప్పుడు ఇంటిని పట్టించుకోలేదు. అమ్మ రెక్కల కష్టమే సంసారాన్ని ఓ దారికి తెచ్చింది. ఎనిమిది మంది పిల్లలను చదివించి, సవరించి, పేదరికంలో తిండి పెట్టి, పెళ్లిళ్లు చేయడమంటే, ఎంత కష్టమో అమ్మ జీవితమే ఒక ఉదాహరణ. అయితే అంతగా కష్టపడ్డ అమ్మ ఇవ్వాళ ఒంటరి. కన్న పిల్లలందరికి అమ్మ ఇవ్వాళ పరాయీ. ఎనిమిది మంది పిల్లలున్నా తాను ఒంటరిననే బాధ అమ్మది. బహుశ తన తోటి అన్న, అక్క, పెద్ద తమ్ముడు చనిపోయి తాను మిగిలున్నా, పెద్దగా అమ్మ తన పిల్లలతో సంతృప్తి పడిందేమీ లేదు.
అమ్మకు సంబంధించిన ఈ ప్రాధమిక విషయాలల్లో అమ్మ పుట్టి పెరిగిన , అమ్మపై ప్రభావం చూపిన, అమ్మను రాటుదేల్చిన వాతావరణాల గురించి, సమాజం గురించి స్థూలమైన లోటులో చర్చించడం జరిగింది. డెబ్బై ఒక సంవత్సరాల వయసులో అమ్మ శారీరకంగా, గట్టిగా ఉందంటే చిన్నతనం నుంచీ ఆమె చేసిన శారీరక శ్రమే కారణమనాలి. కుదురుగా కూర్చొనివ్వని పిల్లలతో, ఒక చేత్తో పిల్లవాన్ని ఎత్తుకొని, మరో చేత్తో తినేంత ఊపిరి సలపని పని అమ్మకు. జీవితమంతా చాకిరికే ధార పోసింది అమ్మ. కథలో ఈ విషయం నేరుగా ప్రస్తావన జరగకపోయిన మనం గమనించవచ్చు. అమ్మమ్మ సంసారం గురించి చెప్తూ, ఆదర్శ దాంపత్య భావనను, అమ్మ సంసారం గురించి చెప్తూ బాధల సంసార భావనను రచయిత్రి చూపించారు. అంటే ఒక చోట భార్య భర్తలు ఎలా అన్యోన్యంగా ఉండాలి, భర్తలు ఎలా ఉండకూడదో చెప్పారు. అమ్మమ్మను ప్రేమగా చూసుకునే తాత లాగే నాన్న కూడా ఉంటాడని అమ్మ ఎన్నో కళలు కని ఉంటుంది. ఈ కళ, ఆదర్శ దాంపత్య కోరిక ప్రతి అమ్మాయి జీవితంలో సహజమే కానీ ఆ కోరిక ఆచరణలో తలక్రిందులవుతే ఆ దాంపత్యం నరక ప్రాయం. అమ్మ ఆ నరకంలోనే జీవించింది. ఈ తల్లి కూతుర్ల పాత్రల ద్వారా, రచయిత్రి ఒకేచోట రెండు రకాల దాంపత్యాల గురించి చెప్పారు. అమ్మకు సుఖ మరణమంటే ఇష్టమన్నట్లుగా రచయిత్రి, మాటలు, వివరణల ద్వారా తెలుస్తుంది. ‘ఆఖరికి మంచి సావు సచ్చిపోయింది’ అంటుంది. అమ్మమ్మ మరణాన్ని తల్చుకొని, అమ్మ కష్టాలను జీవితమంతా అనుభవించి, సంసారాలను సవరించి, చివరకు మంచంలో పడి దీనంగా చావడం కంటే సుఖంగా చనిపోవడమే గొప్ప అనేది. అమ్మ భావనా జీవితంలో ఏ రోజుకారోజు ఎదురయ్యే సొంత మనుషుల, పరాయీతనాల బాధ చెప్పరానిది. అమ్మ అదే బాధ అనుభవిస్తున్నది. ఎనిమిది మంది పిల్లలు ఉన్న అమ్మ మానసికంగా ఒంటరి. బహుశా శారీరకంగానూ …తన పిల్లలనే ప్రేమను తనువంత నింపుకుని ఆ ప్రేమ , దగ్గరితనం కొంతైనా దొరకక, అమ్మ అల్లాడిపోయింది. అమ్మ తనపు ఈ మానసిక బాధను రచయిత్రి కథలో చూపించారు.
కథలో ఊరికి సంబంధించిన, పల్లెటూర్లకు సంబంధించిన విషయాలను కొంత, రచయిత్రి పాఠకులకు అందించే ప్రయత్నం చేశారు. బొడ్రాయి సంస్కృతి గురించి చెప్పడం అందులో ఒకటి. ఒక కథ ద్వారా పాఠకులకు ఒక విషయాన్ని చెప్పడం, అందులోనూ తెలియని విషయాన్ని చెప్పడం ద్వారా రచయిత పాఠకులకు తొందరగా కనెక్టవుతాడు. బొడ్రాయి గురించి చెప్పడం వెనక రచయిత్రి లక్ష్యం అదే. అమ్మ పాత్ర ద్వారా బొడ్రాయి సంస్కృతిని గురించి చెప్పిస్తూ, అమ్మ పాత్ర చుట్టూ పాఠకులు ఆలోచించే లాగా చేసి, ఆ తరువాత అమ్మ గురించి మాత్రమే చెప్పే విషయాలవైపు సులభంగా, పాఠకుడు దృష్టి సారించేలాగా చేయడమనే టెక్నిక్ ను, రచయిత్రి ఇక్కడ ఉపయోగించారు. లోతుల్లోకి గమనిస్తే రచయిత్రి ఈ టెక్నిక్ ను ఎంత సమార్దవంతంగా వాడారో అర్దమవుతుంది. నిజానికి బొడ్రాయి గురించి అమ్మ ద్వారా చెప్పించక పోయినా, అమ్మ క్యారక్టరైజేషన్ లో రచయిత్రికి వచ్చే ఇబ్బందేమీలేదు. అమ్మ ద్వారా నెలకొల్పాల్సిన మానవ సంబంధాల స్థాపనకు, ఏమి అంతరాయం ఏర్పడదు. అమ్మ పట్ల పాఠకుడు ఆలోచించే తీరు మీద, అది ప్రభావం చూపదు. అయిన బొడ్రాయి విషయానికి ప్రాధాన్యత ఇస్తూ, చెప్పడమెందుకంటే ఇంతకు ముందు చెప్పు కున్న, ఆ కనెక్టివిటీని సాధించడం కోసం. పేరొందిన రచయితలు మాత్రమే చొప్పించగల, చొప్పించి విజయవంతం కాగల ఈ టెక్నిక్ ను, రచయిత్రి ఈ కథలో వాడి సక్సెస్ అయ్యారు. ఆ క్రమంలో అసలైన కంటెంట్ కు ఎక్కడా విఘాతం ఏర్పడనీయలేదు. బొడ్రాయి గురించి ప్రాధమికంగా ఏమి తెలియని వాళ్ళకు కూడా అర్దమయ్యేలా, బొడ్రాయి అంటే ఏమిటి ?అని, ప్రతి ఊరికి ఉంటుందా ?అనే దగ్గర మొదలు పెట్టి, సంస్కృతిని క్షుణ్ణంగా వివరించారు. ఊరు బయట ఉండే బొడ్రాయి క్రమేణా అనేక చోట్ల ఊరి మధ్యలోకి వచ్చింది. ఊరు విస్తరణ గురించి చెప్పడమిది. పాఠకుడికి వెంటనే ఊరేందుకు విస్తరించబడుతుందనే ఆలోచన కలిగించడమిది. బొడ్రాయి చుట్టూ కొంత దూరం వరకు వ్యవసాయం చేయక , ఇల్లు కట్టక వదిలేస్తారు. వరుస జ్వరాలు, వరుస మరణాలు సంభవిస్తే, ఊర్లో బొడ్రాయిని లేపడం ఆనవాయితీ. ఊరంతా ఏకమైతే పెద్ద మనుషులు ఊరందరిని నడిపిస్తారు. బొడ్రాయి లేపినపుడు ఏం చేస్తారో, సహజంగానే పల్లెటూరి సంస్కృతి లో మిళితమైన రచయిత్రి, అమ్మ పాత్ర ద్వారా చెప్పారు. గుండిగలతో అన్నం వండటం, దున్నపోతులను నరకడం, ఆ రక్తం అన్నానికి కలపడం , ఎవరిని అది చూడటానికి అనుమతించకపోవడం, దున్నపోతు దోబ్బలను బైండ్లాయన నోటితో పట్టుకొని తిరగడం, అతను ఒల్లంత పసుపు రాసుకొని, కుంకుమతో బొట్లు పుదించుకొని, మొల చుట్టూ వేపాకు మండలు ధరించడం, ఎర్రటి రక్తపు అన్నం పారేసుకుంటూ పోవడం, లాంటి అనేక పనులు బొడ్రాయి సంస్కృతిలో, ఎట్లా జరుగుతుంటాయో రచయిత్రి చెప్పారు. నిజానికి ఈ పనులన్నీ ఇప్పుడు కుదించబడ్డాయి. పల్లెటూర్లలో బొడ్రాయి లేపడంలో భాగంగా చాలా చోట్ల ఇంత సుదీర్ఘంగా పనులు జరగడం లేదు. ఇదే సంస్కృతి పరాయీకరణ. బొడ్రాయి విషయం ద్వారా సంస్కృతి పరాయికరించబడుతున్నదనే ఆలోచనను, పాఠకులకు కలిగించారు రచయిత్రి. ఇప్పటికీ పల్లెల్లోనే జీవనం సాగిస్తున్న ఎవ్వరైన బొడ్రాయి లేపమంటే ఇంత సుదీర్ఘమైన పని ఉంటుందా, ఇప్పుడిట్లా ఏమి జరగడం లేదే అనే దిశాగా ఆలోచించకుండా ఏమి ఉండరు. పాఠకుని పాత్ర ద్వారా, ఒక సంఘటన ద్వారా, వాస్తవ పరిస్థితిని తెలియజెప్పే చైతన్యం కలిగించడం రచయిత యొక్క బాధ్యత. ఆ బాధ్యతను ఇక్కడ రచయిత్రి బాధ్యతాయుతంగా నిర్వర్తించారు.
స్త్రీ , పురుష సంబంధాలు పల్లెటూర్లలో కొంత పటిష్టంగా ఉంటాయనే నమ్మకం, సడలిపోయెందుకు ఎలాంటి పెడదొరణలు పల్లెల్లోకి, పల్లె మనుషులలోకి, పల్లెతో సంబంధం ఉన్న మనుషుల్లోకి, ఏవిధంగా ప్రవేశిస్తున్నాయో శోధించడం, గ్రామీణ వ్యవస్థ బలోపేతమవడాన్ని గురించి ఆలోచించే, అభిలషించే వాళ్ళు, దృష్టి పెట్టాల్సిన సామాజిక విషయం కథలో ఇలాంటిది ఒకటి కనిపిస్తుంది. చాకలి బుచ్చవన్న భార్య సైదమ్మ ఇంకొకరితో ఇంట్లోంచి వెళ్లిపోతుంది. అప్పటికి ఆమెకు ఇద్దరు మగ పిల్లలు. పిల్లలను వదిలేసి ఆమె వెళ్తుంది. పిల్లలు పెద్ద వాళ్ళాయక మళ్ళీ తిరిగొస్తే భర్త రానీయడు. అతను తన తల్లితోనే కలిసుంటాడు గాని భార్యను, తనతో ఉండటానికి అనుమతించడు. వాస్తవానికి ఇలాంటి పరిస్థితులలో అనుమతించిన భర్తలు ఉన్నారు. ఈ విషయంలో అమ్మ బుచ్చవన్న వైపే మాట్లాడుతూ చెప్తుంది. అమ్మ చైతన్యాన్ని ఆ పరిధిని దాటి ఆశించలేం. ఆమెకు ప్రగతిశీల ఆలోచనలు మాత్రమే లేవు .తాను పుట్టి పెరిగిన, సమాజపు పరిమిత ఆలోచనలు అమ్మకున్నాయి. అందుకే బుచ్చవన్న, తన భార్యను అంగీకరిస్తే మాత్రం ఏమిటనే దిశగా అమ్మ ఆలోచించలేక పోయింది. కానీ రచయిత్రిలోని ఒక ఆలోచనగా వెళ్ళి నామె వైపు సానుకూలంగా ఉండటమనే భావన కనిపిస్తుంది. రచయిత్రికి ఆ ఆలోచన విస్తృతి ఉండబట్టే, బుచ్చవన్న అంగీకరించకపోయిన, అతని పెద్ద కొడుకు తల్లికి డబ్బులివ్వడం, వారం వారం మాంసం పంపడం, లాంటివి చేస్తూ తల్లి మీద ప్రేమ పడతాడని రాయగలిగారు. బుచ్చవన్న భార్య విషయం చెప్పడం ద్వారా పల్లెల్లో పెరుగుతున్న స్త్రీ , పురుష సంబంధాలు విచ్చిన్నాలను గురించి రచయిత్రి పేర్కొన్నారు.
అసలు ఒకనాటికి, ఇప్పటికీ స్త్రీ , పురుష సంబంధాలే కాదు ఆహార్యలలోనూ విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఈ తేడాను చాలా మంది గమనిస్తూనే ఉన్నారు. రచయిత్రి మరోసారి ఈ తేడాను నర్సక్క గురించి చెప్పేటప్పుడు, అమ్మ పాత్ర ద్వారా చెప్పించారు. నర్సక్కకు రెండు ముక్కులకు రెండు బేసర్లు, చెవులకు వెడల్పాటి రాళ్ళ దిద్దులు, మెడలో మెత్తటి నాను, పెద్ద గొలుసు, నల్ల పూసలు, చేతులకు దండే కడియాలు, నడుముకు వడ్డాణం, కాళ్ళకు పట్టగొలుసులు, కడియాలు, సాలం కడియాలు, చేతులకు గాజులు, నొసటికి రూపాయి బిల్లంత బొట్టు, నున్నగా దువ్విన కొప్పు ఉండేవి. నర్సక్కకే కాదు గ్రామీణ స్త్రీ, సాధారణ రూప సౌందర్యమిది. ఇప్పుడు కనుమరుగై పోయిన ఈ రూపాన్ని, రచయిత్రి నర్సక్క పాత్రలో పునర్దర్శింపజేశారు. అంతటి అందమైన నర్సక్కకు కాళ్ళు, చేతులు పడిపోయి మంచాన పడింది. బక్కగా అయిపోయింది. తిండి పెట్టె నాధుడే లేడు. ‘చావన్నా రాకపాయే’ అని ఏడ్చింది. నర్సక్క బాధతో అమ్మ సహానుభూతి చెందింది. తాను ఏడ్చింది. ఒకప్పుడేంతో సుఖపడిన నర్సక్క ఇప్పుడేంత కష్టపడుతున్నదోనని కుమిలి పోయింది.
అమ్మకు మానవ సంబంధాల పట్ల, విపరీతమైన ఇష్టం, కన్సర్ను ఉన్నాయి. తోటి మనిషి కళ్ల ముందు బాధలు పడుతుంటే, అనారోగ్యం పాలైతే, అమ్మ మనసు సహించలేదు. నర్సక్కది తన కులం కాదు, అయినా తన సొంత చెల్లెలికి ఆపద వచ్చినట్లే అమ్మ బాధపడ్డది . నర్సక్క పట్లే కాదు, మంగమ్మ విషయం లోనూ అంతే. పెళ్ళైన కొత్తలో మంగమ్మ అత్తగారింట్లో పెట్టె గట్క తినలేక, పారిపోయి పుట్టింటికి వచ్చేది. ఈ బాధ భరించలేక మంగమ్మ తల్లి, మంగమ్మను బావిలో దింపుతానని సిద్దమై కూర్చుంది. అలాంటి మంగమ్మకు, పెద్దతనాన కొడుకులు రోజు గట్కే పెట్టారు. మంగమ్మ తన బాధ చెప్పుకుంటుంటే అమ్మ విపరీతంగా బాధపడింది. కట్టుకోవడానికి కొత్త చీర, ఐదు వందల రూపాయలు ఇచ్చి వచ్చింది. అమ్మ, అమ్మదే చివరి చూపు. అమ్మ వెళ్లిపోగానే మంగమ్మ చనిపోయింది. నర్సక్కతో అయినా, మంగమ్మతో అయినా అమ్మది ఆత్మీయ అనుబంధం. ఆ మాటకు వస్తే తనకు పరిచయమున్న ప్రతి ఒక్కరితోనూ అదే లాంటి బంధం. అందుకే అమ్మ వాళ్ళ కష్టాలకు చలించి పోయింది. వాళ్ళు పడే కష్టాలు తానే పడ్డట్లు భావించేది. అందుకే వాళ్ళ బాధలు, తన బాధలుగానే స్వీకరించి మనసంతా ఆర్ద్రం చేసుకునేది. తలుచుకొని-తలుచుకొని ఏడ్చేది. చివరి వరకు వాళ్ళకు, తనకు ఏడుపే మిగిలిందని కన్నీరు మున్నీరయి చెప్పుకునేది.
గుండె నొప్పితో మరణించిన చిన్నమ్మ బక్క లచ్చి పట్లా అమ్మకు అదే సానుభూతి . ఊరు ఊరందరూ చిన్నమ్మ అంత్యక్రియలకు, రావడాన్ని చూసి, ఆమె గొప్పతనాన్ని, అమ్మ గొప్పగా అర్థం చేసుకుంది. ఎరుకలోల్లు, మాదిగోళ్ళు, గౌండొల్లు, అంతా తరలి వచ్చిన గొప్ప చావుగా అర్థం చేసుకుంది. ఆ అంత్యక్రియలకు కులాల అంతరాలు లేకుండా అందరూ హాజరయ్యారు. పల్లెల్లో కులాల తేడాలు తక్కువ. రోజూ వారి జీవితంలో తరచూ ఆ తేడాలున్న కూడా మనిషికి ఆపద ఎదురైతే మాత్రం, కులాల జోలికి పోకుండానే మనిషికి, మనిషి సాయం చేసుకుంటారు. కులం పక్కకి జరిగి, మానవత్వం ముందుకొచ్చి, ఆపద పక్కకి తొలగిపోతుంది. ఇప్పుడు వస్తున్న కొత్త తరాల్లో ఈ మానవత్వం తగ్గిపోతూ వస్తున్నది. పక్క మనిషికి సాయం చేసే గుణం స్థానంలో, స్వార్ధం ప్రవేశిస్తున్నది. తన సుఖం కోసం ఎంతగా దిగజారడానికైనా, మనిషి సిద్దపడుతున్నాడు. చివరికి తనను కన్న తల్లితండ్రులను, నిర్లక్ష్య పరిచి, వాళ్ళను హింసించే స్థితికి దిగజారిపోతున్నాడు.
కన్నతల్లిని హింసించే, ఇలాంటి సన్నివేశమే ‘జీవితం’ కథలో కనిపిస్తుంది. తాటి సాంబడు, అతని భార్య కారం మిల్లు నడిపారు. పిండిమిల్లు నడిపారు. మిషన్ కుట్టారు. వారం వారం అంగడిలో బట్టలు బేరాలు చేశారు. ఇంతా చేసింది తన సంసారం కోసం. తన పిల్లల కోసం తాగక, తినక, బట్ట కట్టక ఆ తల్లి తండ్రులు జీవితాన్ని త్యాగం చేసింది, తమ పిల్లల భవితవ్యం కోసం. కానీ తాటి సాంబని కొడుకు తండ్రిని కొడతాడు. ముందరి పండ్లన్ని విరిగి పోయేలా కొడతాడు. తాటి సాంబని త్యాగం ఇసుక రేణువంత గుర్తొచ్చిన, ఆ త్యాగానికి కొడుకు విలువ ఇచ్చినా, కనీసం గుర్తించినా, తండ్రి పై చేయి చేసుకునే వాడు కాదు. సాంబని కొడుకు ప్రవర్తనకు, అమ్మ విపరీతంగా బాధపడుతుంది. ‘ఇయ్యాల రేపు పోరాగాండ్లకు అద్దు లేకుంట అయింది’ అని కోపగించుకుంటుంది.
ఇవన్నీ సన్నివేశాలలో, సంఘటనలలో అమ్మ తనలోని అమ్మతనపు ప్రేమను, అందరి విషయాలలోనూ ప్రదర్శించింది. తన, పర తేడా లేకుండా అమ్మ అందరి కష్టాలలోనూ, మానవీయంగా స్పందించింది. అందరి జీవితాలను, భావాలను సున్నితంగా అర్థం చేసుకొని మదనపడిపోయింది. అందుకే సూక్ష్మంగా గమనిస్తే అమ్మది చాలా ఉద్వేగభరితమైన మనస్తత్వం. అందరూ తన వాళ్ళే అనుకునే వైఖరి అమ్మది. అలాంటి ప్రేమానురాగాలు పొదిలి పెట్టుకున్న అమ్మ తన స్వంత కొడుకులు, కూతుర్లతో మరెంత ప్రేమగా మసులుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎంత వయసు పెరిగినా అమ్మ తన పిల్లల వెనక, చంటి పిల్లల్లాగా తిరుగుతుంది. పిల్లలంతా తనను పలకరించాలని కోరుకుంటుంది. వాళ్ళతో గడపాలని తహతహ లాడుతుంది. కూతురు ఇంటికి వస్తే, గుంజకు కట్టేసిన మేక పిల్లలాగా తన చుట్టే తిరుగుతుంది. ఎవరి ఇంటికి పోకుండా కూతురుతోనే గడుపుతుంది. తన ప్రేమతో, కూతురితో నిరంతరం మాట్లాడాలన్న తపనతో, కూతురుని రాసుకొనివ్వదు, చదువనివ్వదు. తాను ఒంటరినని తెలిసినా, మాట్లాడటానికి కూడా మనిషి కరువై ఉన్నానని, తెలిసినా అమ్మ తన కడుపులోని బాధను, కూతురితో పంచుకోవాలనుకుంటుంది. కూతురు వినకున్నా, తన మానాన తాను చదువుకుంటూ, రాసుకుంటూ, ఉన్న కూడా నిరుత్సాహ పడకుండా తన దోరణిలో తాను మాట్లాడుతుంది. విరామం లేకుండా తన మనసును కూతురి ముందు పరుస్తుంది. అమ్మకు ముచ్చటంటే ఇష్టం. తన వారితో ముచ్చట పెట్టాలని అమ్మ మనసు తహ తహ లాడుతుంది. ఎన్ని మాటలన్నా అమ్మ పట్టించుకోదు. కోపగించుకోదు. బాధ పడదు. ప్రేమగా పలకరిస్తే చాలు ఏడుస్తుంది. అప్పటి వరకు తనన్న మాటలన్నీ మర్చిపోతుంది. మళ్ళీ మామూలు మనిషై పోయి, అమ్మగా ప్రేమ మూర్తి అయిపోతుంది. అందుకే అమ్మకు కొలమానం లేదు. అమ్మకు సరితూకం లేదు.
కానీ కన్న బిడ్డలే, అమ్మలాగా నిజాయితీగా ఉండలేరు. అమ్మంత స్వచ్చంగా మసలేరు. అమ్మంత అనురాగాన్ని తిరిగి పంచలేరు. పిల్లలు ఎంతటి విశాల హృదయులైనా, తల్లిని విశాలంగా చూడటానికి, తల్లి పట్ల విశాలంగా ప్రవర్తించటానికి, అనుకూలత ప్రదర్శించరు. ‘జీవితం కథలో ‘ కూతురి పాత్రలో విపరీతమైన కృత్రిమత్వం ఉంటుంది. కూతురికి ఆరోగ్యం బాగలేక అమ్మ దగ్గరకి వస్తుంది. కానీ అమ్మ మీద దగ్గరితనంతో కాదు. తాను ఏ మాత్రం లేచి తిరగ గలిగినా, కూతురు తన ఉద్యోగం తాను చేసుకుంటూ, తన మానాన తాను ఉండే దాన్నని, స్వయాన చెప్పుతుంది. కాసేపు చదువుకుందామనుకున్నా, రాసుకుందామనుకున్నా చేసుకొనివ్వదని, కూతురుకొక అసంతృప్తి అమ్మ మీద. ఎప్పుడు ఒకటే ముచ్చట. ఎదురుగానే కూర్చుంటుంది అమ్మ. ఇవన్నీ చూస్తే కూతురుకు, విసుగు వస్తుంది. ఎంతసేపని వింటాం. ఎంత సేపు మాట్లాడతామనే విసుగు. పిల్లల పట్ల అమ్మకున్న ప్రేమ, అనురాగం, అర్థమైన పట్టి పట్టనట్లు ఉండటం, ఓపిక లేనితనంతో, అమ్మ ఇంకా ఇంకా మాట్లాడితే చికాకు పడుతుండడం అనేవి, పిల్లల సహజ సిద్దమైన పనులైపోయాయి. ఒక్కోసారి విసుగొచ్చి కసురుకుంటారు కూడా. అమ్మ ముసలితనపు మానసిక రుగ్మతలను, తట్టుకునే స్థితిలో తాము లేమని, కూతురు బాహాటంగానే చెప్తుంది. అమ్మకు తల్లులుగా మారే ఆలోచనే తమకు కలగదనీ అంటుంది. ఇవన్నీ గమనిస్తే కూతురికి, తల్లి మీద మనసులో ప్రేమ ఉన్నా కూడా, అంతకు మించిన కృతిమత్వం , నిర్లక్ష్య దొరణి, పట్టించుకొని తనం కూతురికి ఉన్నట్లు కనపడుతుంది. రచయిత్రి అమ్మ పాత్రను పెంచే క్రమంలో, అమ్మ పాత్రపై పాఠకునికి గౌరవం కలిగించాలనే క్రమంలో, కథలోని మరో ప్రధాన పాత్ర అయిన, కూతురి స్థాయిని తగ్గించి, చూపాలని ప్రయత్నం చేసేసరికి, కూతురి పాత్రకు నెగెటివ్ నీడలు అలుముకున్నాయి. అమ్మ, కూతురి పాత్రల పట్ల సమానంగా వైఖరిని కలిగి ఉండేలా, పాత్రల నిర్మాణం చేస్తే కథ మరింత ఆకట్టుకునేది.
ఈ చిన్న పరిమితి తప్ప, మరేవిధమైన ఆక్షేపనీయ అంశం ‘జీవితం ‘కథలో లేదు. ముఖ్యంగా అమ్మ పాత్ర చిత్రణ, అమ్మ మనస్తత్వ విశ్లేషణకే పరిమితమై చూస్తే, అమ్మ మానసిక దృక్కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన కథ ఇది. తప్పక చదవాల్సిన, పాఠకునితో ఏకబిగిన రచయిత్రి చదివించే కథ ఇది.
‘జీవితం’కథ గురించి చాలా బాగా విశ్లేషించారు.
Thank you అరణ్య గారు.