ఒక దశాబ్ద కాలం నాటి ఒక మనిషి అనుభవం, దాని తాలూకు జ్ఞాపకాలు ఇప్పుడు అవసరమా అని కొందరు పెదవి విరవొచ్చు. కాలం మారింది కాబట్టి సమాజం మారకుండా ఉంటుందా అని మరికొందరు ఎదురు ప్రశ్నించవచ్చు. లేదా రచయిత ముందుమాటలో చెప్పినట్టు కొందరు అగ్రకుల పీడక పీఠాధిపతులు ఎదురు దాడి చేయనూ వచ్చు. నిజానికి రచయిత మోహన్ తలారి అనుభవాలు ఆయన జ్ఞాపకాలు కేవలం ఆయనకే పరిమితమైనటువంటి వైయక్తికమైన అనుభవాలు కావు. అవి వందల, వేలాది మందితో కూడిన కొన్ని జన సమూహాలవి అయినప్పుడు, అవి నేడు నడుస్తున్న చరిత్రలో కూడా అంతర్భాగమైనప్పుడు వాటి నమోదు సమాజానికి ఎంత అవసరమో తెలియజెప్పే పుస్తకమే పర్స్పెక్టివ్స్ ప్రచురణ (2022) మోహన్ తలారి రాసిన ఈ “హాస్టల్ లైఫ్”.

 తనతో పాటు సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో, హాస్టళ్లల్లో చదువుకుంటున్న వందల,వేలాది మంది విద్యార్థుల జీవితానుభవాలను రచయిత సోషల్ మీడియాలో రాసినప్పుడు అవి పాఠకులను ఎంతో ఆవేదనకు, ఆందోళనకు గురిచేశాయి. మన చుట్టూ మనకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందా అని ఆశ్చర్యపోయారు. అంటే పాఠకుల(ప్రజల) జీవితాలు విభజించబడి వేర్వేరుగా ఉన్నాయని, వాళ్ల అనుభవాలు, అవగాహనలు వేరువేరుగా ఉన్నాయని దానర్థం.

నిజం పట్ల విధేయత కలిగి ఉండడమే నిజాయితీ అని నమ్మిన మోహన్ తలారి మడి కట్టుకున్న కుల గుంపులను, దడి కట్టుకున్న ప్రతిభోత్తములను ఆశ్రయించకుండా ముఖాన్నే పుస్తకంగా ధరించి రాసిన సాహసోపేతమైన కథలు ఇవి.

 ఇంతకూ ముందుమాటలో చెప్పినట్టుగా తనను ఎంతో బాధ పెట్టిన 20 ఏళ్ల నాటి హాస్టల్ లైఫ్ మోహన్ కు ఎందుకంత ఇష్టం? అప్పటి జ్ఞాపకాలు ఎందుకు ఇంకా సజీవంగా ఉన్నాయి? ఎందుకంటే- రచయితలో మూలాలను మరిచిపోకూడదన్న సుగుణం ఉండడమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇదేదో అతని గుణగణాల్ని స్తుతించడం కాదు. జ్ఞాపకాలను గుర్తుంచుకోవడం అంటే చరిత్రను గుర్తుంచుకోవడమే. బ్రిటిష్ చరిత్రకారుడు ఇ.హెచ్. కార్ అన్నట్టుగా చరిత్ర అంటే కేవలం గతానికి, వర్త మానానికి మధ్య జరిగే సంభాషణ మాత్రమే కాదు. వర్తమానం మీదుగా గతంతో భవిష్యత్తు చేసే సంభాషణే అసలైన చరిత్ర. అటువంటి  నికార్సైన చరిత్రను నిర్మించాల్సి ఉందని తాడిత, పీడితులందరికీ కర్తవ్య బోధ చేసే పుస్తకమే ఈ ‘హాస్టల్ లైఫ్’.

 ఇప్పటి సంగతేమో తెలియదు గాని రెండు దశాబ్దాల నాటి కాలం ప్రాచీన కాలం కాదు. ఆధునిక యుగావధిలోని కాలమే. ఆ కాలంలోనూ ఒక ఆటో గాని, కనీసం ఒక రిక్షా గాని తిరగని వెలివాడలలో పుట్టి పెరిగిన ప్రజా సమూహాలు ఉన్నాయి. వాళ్ల సంతానమైన పిల్లలు చదువుకోవాలంటే సైకిళ్లు అద్దెకు తీసుకునో, అద్దె కట్టలేని వాళ్లు ఎన్నెన్నో కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది. కూలి సాలక తమ పిల్లలకు ఓ ముద్ద అన్నం పెట్టి, నాలుగు అక్షరాలు చెప్పించలేని పరిస్థితులలో వాళ్లను సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టళ్లలో చేర్పించారు. వేళకి ఇంత తిండి, ఎంతో కొంత చదువు వస్తుందని వందలాది మంది తల్లిదండ్రులు నమ్మారు (కూలిసాలక- కూటి కోసం). ఈ గురుకుల  హాస్టళ్లను జనావాసాలకు చాలా దూరంగా నిర్మించి, నిర్వహించడం కరెక్ట్ కాదని రచయిత విద్యార్థిగా ఉన్ననాడే భావించాడు. ఒకటి, రెండు దశాబ్దాల క్రితమే కట్టిన హాస్టల్ బిల్డింగులు 1999లో రచయిత విద్యార్థిగా చేరే నాటికే అవన్నీ పాడైపోయాయి. గోడలన్నీ వానలకు తడిసి నాచు పట్టి కిటికీల ఊచలు తుప్పుపట్టాయి. వారంలో అనేకసార్లు కరెంటు బందయి తిరిగి రావడం, కనీసం వారానికి ఒక్కరోజైనా కరెంటు పూర్తిగా పోవడం అనేది ఆ రోజుల్లో అతి సాధారణం. అప్పుడు ట్రాన్స్ఫారాలు కాలిపోవడం, మోటార్లు కాలిపోవడం,తాగడానికి గాని,స్నానానికి గాని నీళ్లు దొరకని దుస్థితిని ఆనాటి గురుకుల విద్యార్థులు అనుభవించారు. కానీ గురువుల కుటుంబాలకు మాత్రం టాంకర్ల ద్వారా నీళ్ల ఏర్పాటు జరుగుతుండేది (చిన్లంజి దిబ్బ).

 క్రమశిక్షణ పేరిట విద్యార్థులను వేధించడంలో గురువులతోపాటు కూడా వాచ్ మెన్ లు కూడా ముందుండేవారు. లావెట్రీలు లేక మల మూత్ర విసర్జనాల కోసం విద్యార్థులు ఫెన్సింగ్ దాటిపోయి బహిరంగ ఖాళీ స్థలాలను వాడుకునేవారు. అక్కడి పంట పొలాల నీళ్లతోనే శుభ్రం చేసుకునేవారు. ఒకవేళ కరెంటు వస్తే ఒక గంట సేపే వచ్చేది. ఆ ఒక్క గంటలోనే వందలాది మంది విద్యార్థులు స్నానం చేయడం అనేది అసాధ్యం. ఇంటర్మీడియట్ చదివే సీనియర్ విద్యార్థులే చిన్నపిల్లలను నెట్టివేసి, అవసరమైతే కొట్టి ముందు స్నానం చేసేవారు. తాగడానికి, స్నానానికి మంచినీళ్లు కావాలంటే సీనియర్లు లేవకముందే ఉదయం నాలుగు గంటలకే జూనియర్ విద్యార్థులు లేవాల్సి వచ్చేది. ఉదయం 6 గంటలకు బెల్ కొట్టగానే ఠంచన్ గా విద్యార్థులందరూ స్టడీ రూమ్ కు వచ్చి తీరాలి. చాలామంది నీళ్లు దొరకక స్నానం చేయకుండానే తిరిగి వచ్చేవారు. ఏ మాత్రం లేట్ అయినా వాళ్లను మోకాళ్లు వేయించి వెదురు కర్రలతో చావబాదేవారు. ఇది దళిత విద్యార్థులకు నేర్పించే గురుకుల విద్య (క్రమశిక్షణ).

సాయంత్రం ఏడు గంటలకు భోజనాల గంట కొడితే వెంటనే విద్యార్థులందరూ పళ్లాలు పట్టుకుని పరిగెత్తేవారు. చిన్న పిల్లలను ఫిజికల్ డైరెక్టర్ పొర్లిచ్చి కొట్టేవాడు. పెద్ద పిల్లలు ముందే లైన్ లో ఉన్న వాళ్ళని నెట్టేసి అన్నం పెట్టించుకునేవారు. బక్క పలుచని విద్యార్థి అయిన రచయిత మాత్రం నిలబడ్డ కాడనే ఉండేవాడు. పి.డి.కి కంప్లైంట్ ఇస్తే సీనియర్ విద్యార్థి చేతిలో తిన్న చావు దెబ్బలను గురించి కూడా రచయిత ఇందులో రాశాడు. మెల్లగా ఎప్పటికో లైన్ ముందుకు కదిలితే బక్కపలచని జూనియర్ విద్యార్థులకు ఓ గంటెడు చారో , ఓ గంటెడు కూరో దొరకడమే చాలా కష్టమయ్యేది (అన్నం అమ్మిరాజు గాడి సొరూపం).

 ఇలా అనేక శారీరక బాధల్ని భరించలేక విద్యార్థులు పారిపోదామని ప్రయత్నించి చివరికి ఏ దగ్గరి బంధువుల ఇంటికో చేరితే, అమ్మానాన్నలొచ్చి తీసుకెళ్లి మళ్ళీ హాస్టల్లో వేసేవారు. ‘డార్మిట్’ రూములో ఒక పగిలి పోతే విద్యార్థులందరినీ నిలబెట్టి పిర్రల మీద కసి దీరా గంటలసేపు కొట్టడంలో ఇతర టీచర్లే కాదు, దళిత టీచర్ కూడా ముందుండేవాడు. విద్యార్థులను శిక్షించడమే క్రమశిక్షణగా అమలైన విద్యను బోధించే గురుకుల  హాస్టల్ లు భూలోకం మీద నరకకూపాలుగా ఉండేవి( ది ఫస్ట్ ఎస్కేప్).

కనీసం చిన్న చిన్న ఆనందాలకు కూడా నోచుకోకుండా గురుకుల విద్యార్థుల జీవితం ఎంత దుర్భరంగా ఉండేదో రచయిత ఈ పుస్తకంలో వివరించాడు. వాళ్లకిచ్చిన షూస్ ను దొంగతనంగా అమ్ముకొని కొన్నిసార్లు ఎన్నో కిలోమీటర్లు నడిచి వెళ్లి బయటి థియేటర్లలో సినిమాలు చూడడం, అది తెలిసి మళ్ళీ క్రమశిక్షణ పేరిట చావు దెబ్బలు తినడం ఆనాటి గురుకుల విద్యార్థులందరికీ సాధారణ అనుభవమే(తాల్ సే తాల్ మిలా).

మరి ఇలాంటి గురుకుల పాఠశాలలు /హాస్టళ్లను జనావాసాలకు దూరంగా నిర్మించి నిర్వహించడమంటే ఆధునిక అంటరానితనపు విధానంలో భాగంగా వాటిని వెలిబడులుగా నిర్వహించడమేనని చెప్పాలి. పేరుకు తగినట్టుగానే గురుకుల పాఠశాల విద్య సనాతన కుల వ్యవస్థను పెంచి పోషించడమేనని చెప్పాలి. ప్రశ్నకు తావులేని విధేయతను ప్రోత్సహిస్తూ క్రమశిక్షణ పేరిట విద్యా శిక్షను అమలుపరిచే జైళ్లుగా పాఠశాలలను నిర్వహించడం అంటే అట్టడుగు,దళిత వర్గాల పిల్లలకు విద్యను దూరం చేసే పాలకుల దుష్ట పథకం తప్ప వేరు కాదు. ఒకవేళ ఇన్ని వేధింపులు భరించి కూడా ఎవరైనా ఉన్నత స్థానానికి చేరుకుంటే ఆ విద్యార్థిని విజేతగా కీర్తించే దుర్మార్గం మరోవైపు నడుస్తోంది. అసలు పరిశీలన, ప్రయోగం, నిర్ధారణ లేవీ లేని చోట గురు శిష్యుల సంబంధం అసమానమైన యజమాని -బానిసల సంబంధంగానే ఉంటుంది. అక్కడ శాస్త్రీయ జ్ఞానానికి ఏ మాత్రం తావుండదు. ఉచిత విద్యను అందించడమే గొప్ప అనే సగటు భావన చలామణి అవుతున్న చోట వసతుల లేమి,వనరుల కొరతలు, విద్యార్థుల వేధింపులు అసలు గుర్తింపులోకే రావు. కంపల్సరీ  విద్యను తప్పనిసరి విద్య అని కాకుండా నిర్బంధ విద్యగా తర్జుమా చేయడంలో భాషా తప్పిదమే కాకుండా పాలకుల కులపరమైన కూడా వివక్ష దాగి ఉంది.

అంతేకాకుండా కూలిసాలక కూటికోసం కోటి శిక్షలు అనుభవిస్తున్న గురుకుల విద్యార్థులు కొందరైతే, క్రమశిక్షణ పేరిట నానా రకాల శిక్షలను విద్యగా భరిస్తున్న విద్యార్థులు మరికొందరు. హాస్టల్లో పంతుళ్ల చేతుల్లో చిత్రహింసలు భరించలేక పారిపోయే వాళ్లు కొందరైతే, బయట అంతకన్నా భయంకరమైన ప్రపంచం ఇంకోటి ఉందని తెలిసి ఎటూ పారిపోలేని దుస్థితిలో మరికొందరు. మొత్తానికి సాంఘిక సంక్షేమ హాస్టళ్లు కడజాతి పిల్లల పాలిట కాన్సంట్రేషన్ క్యాంపులుగా మారిన వైనాన్ని ఈ హాస్టల్ లైఫ్ పాఠకులకు కళ్ళకు కట్టినట్లుగా చూపెడుతుంది.

ఒకవైపు ఆధునిక విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందుతున్నప్పటికీ, మరోవైపు మతమౌడ్యాన్ని, అంధ విశ్వాసాలను, పురుష స్వామిక సనాతన కుల భావజాలాలను పాఠ్యంశాలుగా  ప్రవేశపెట్టి బాల బాలికల మెదళ్లను పాడు చేస్తున్నారు. నిజ చరిత్రను వక్రీకరించడం లేదా గోబెల్స్ తరహాలో అబద్దాలను పదే పదే ప్రచారం చేస్తూ ఒక నకిలీ చరిత్రను సృష్టించి, దాని ఆధారంగా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి తమ స్వార్ధ పూరిత దోపిడీ రాజకీయ ప్రయోజనాలను ఈడేర్చుకోవడం కోసమే నేటి పాలకులు అనుసరిస్తున్న కుటిల విద్యా విధానంలో భాగంగా ఇదంతా జరుగుతున్నదని చెప్పక తప్పదు.

అడుగడుగునా ఎన్నెన్నో అవమానాల మధ్య ఎన్నెన్నో హింస అణిచివేతల మధ్య సాగే  కడజాతి బతుకుల్లో అనంతమైన కన్నీటి సముద్రాలే ఉన్నాయి. వాటి హోరులోంచి జీవన సంతోషాలను పదిలంగా భద్రపరచుకుంటూ, ఎరుక పరుచుకుంటున్న ఎన్నెన్నో కఠిన జీవిత సత్యాల మధ్య అన్నిటినీ భరించుకుంటూ బతికుండడమే ముఖ్యం అనుకునే దుస్థితి ఉండడమే అత్యంత దుర్మార్గం.

ఇదంతా విద్యా వ్యవస్థలో సంస్కరణలు, మార్పులు జరగకపోవడం వల్ల సంభవించిన దుష్పలితంగానే చూడాలి.1966 లోనే కొఠారీ కమీషన్ కామన్ స్కూల్ విధానాన్ని సిఫారసు చేయగా, మరో రెండు దశాబ్దాల తర్వాత 1986 లో ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం విద్యా వ్యవస్థను అంతస్తుల వారీగా విభజించి, వివిధ ఆర్థిక వర్గాలకు వేరువేరు ప్రమాణాలు కలిగిన విద్యను అందించాలని ప్రతిపాదించింది. ధనిక, ఎగువ మధ్యతరగతి వర్గాల వారికి అన్ని వసతులు గల ప్రైవేట్ పాఠశాలలను, దిగువ మధ్యతరగతి, పేద వర్గాల వారికి కనీస వసతులు గల ప్రభుత్వ రంగ పాఠశాలలను, పేద వర్గాల బాల కార్మికులకు అనియత పాఠశాలలను ఆ జాతీయ విద్యా విధానం నిర్దేశించింది. ఫలితంగా విద్య ఒక వ్యాపార సరుకుగా మారిపోయింది. అంతేకాకుండా 2010లో అమల్లోకి వచ్చిన విద్యా హక్కు చట్టం ప్రభుత్వ రంగ విద్య, ప్రైవేట్ రంగ విద్య అనే అసమాన ప్రమాణాలు గల పాఠశాల విద్యా వ్యవస్థను చట్టబద్ధం చేసింది. పైగా గత పది 12 ఏళ్లలో కార్పొరేట్ పెట్టుబడులు సైతం విద్యారంగంలోకి చొరబడడంతో అత్యధిక శాతం విద్యా వ్యవస్థ కార్పోరేటీకరణకు గురైంది. ప్రభుత్వ రంగ విద్య మాత్రం ఎవరికీ పట్టని అనాథ బిడ్డగా మారిపోయింది.

 మరోవైపు మన దేశంలో వేల ఏళ్లుగా వేళ్ళునుకొని ఉన్న సంస్కృతి పితృస్వామ్య, కులాంతరాల సంస్కృతే. అటువంటి మన సంస్కృతికి స్వేచ్ఛ సమానత్వం అనేవి పూర్తిగా అపరిచితమైనవి. అవి సనాతన కుల సాంస్కృతిక సాముదాయక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేవని, క్రమశిక్షణను, విధేయతను విచ్చిన్నం  చేసేవి అన్న ఎరుక లోలోతులా నాటుకొని పోయిన లోకజ్ఞానం అది. దాని తాలూకు కుల సాంస్కృతిక పునాదుల్ని విచ్ఛిన్నం చేసే ఆధునికతా పోరాటాలు జరగకపోవడం వల్ల ఆ అంతరాల అణిచివేత సంస్కృతే నిరంతరం పునరుత్పత్తి అవుతూ ఇతరత్రా ప్రజలు చేసిన పోరాటాలు చారిత్రకంగా నిష్ఫలం అవుతున్నాయి. అంటే ప్రజలు ఒక చేతితో చేస్తున్న పోరాటం వారి మరో చేయి చేస్తున్న పనుల వల్ల నిష్ఫలం అవుతున్నదన్న నిజాన్ని గుర్తించడమే నేటి కాలావసరం. దీనినే ప్రజా(స్వామ్య)వ్యతిరేక శక్తులు కుటిలత్వంతో వ్యాఖ్యానిస్తారు. రెండు చేతుల మధ్య లేని శత్రుత్వాన్ని సృష్టించి వాటిని విడదీస్తారు. రెండు చేతులు ఒకే శరీరానివే అన్న స్పృహను కూడా రానీయకుండా వాటి మధ్య శాశ్వత విభజనను లేవదీస్తారు. తత్ఫలితంగారెండు చేతులు కలిసి చేయాల్సిన ఉమ్మడి కృషిని విచ్ఛిన్నం చేస్తున్నారు. మన చూపు సరిగ్గా ఉండాలంటే మనం రెండు కళ్ళతో ఏక సమయంలో చూడాల్సి ఉంటుందని, మనం చేసే పని సత్ఫలితం ఇవ్వాలంటే మన రెండు చేతులతో (కలిపి) పని చేయాల్సి ఉంటుందన్న నిజాన్ని గుర్తించడమే ఇప్పుడు మన తక్షణ అవసరం.

ఇంకొక వైపు ‘ప్రజాప్రాతినిధ్య’ ఎన్నికల ప్రజాస్వామ్య క్షేత్రంలో నానాటికి అంతకంతకూ పెరుగుతూ వస్తున్న తీవ్రమైన రాజకీయాల పోటీ వల్ల, అనులోమానుపాతంగా పెరుగుతూ వస్తున్న ప్రజాశ్రేణుల భాగస్వామ్యం వల్ల ప్రజల వర్గ పోరాట క్షేత్రం విస్తరించింది. అలా విస్తరించిన వర్గ పోరాట క్షేత్రంలో ఆధునికతకు అసలైన ప్రాతినిధ్యం వహించే రాజకీయ నాయకత్వం లేకపోవడం వల్ల, ఆధునికతను నెలకొల్పే భావజాల, పునాది పోరాటాలు జమిలిగా అనుసంధానంలో జరగకపోవడం వల్ల ఒక పెద్ద ఖాళీ ఏర్పడుతూ వచ్చింది. ఆ ఖాళీని పక్కా ప్రణాళికతో ఆర్ఎస్ఎస్ శక్తులు పూరిస్తూ ముందుకు వచ్చారు. ఉన్న చరిత్రను వక్రీకరించడం లేదా తప్పుడు చరిత్రను సృష్టించడం, నిజ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో నుంచే కాదు, ప్రజల మెదళ్ళ నుంచే తొలగించే దుర్మార్గమైన వ్యూహాత్మక మార్గాన్ని అనుసరిస్తున్నారు. తత్ఫలితంగా ఆ సనాతన తిరోగామి శక్తులే సామాజికంగానే కాదు, రాజకీయంగా కూడా అధికారంలోకి వచ్చినందువల్ల ఈనాటి ప్రమాదకర ఫాసిస్టు పరిణామాలు తలెత్తాయి. ప్రజలు తమకున్న ఆధునిక పూర్వ భావజాలాల వల్ల తమ వోట్ల ద్వారా తమకు తెలియకుండానే శత్రువులను ఎన్నుకుంటున్నారు. మాయదారి స్వార్థపూరిత దోపిడీ పాలకులు ఆధునిక సాంకేతికతను సైతం వాడుకుంటూ ప్రజల్లో మంద మనస్తత్వాన్ని ప్రేరేపిస్తూ, వారి హేతుబుద్ధి వికాసాన్ని చంపేస్తున్నారు. మన కంటిని మన వేలుతోనే పొడి(పిం)చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో (రాజ్యాంగబద్ధ) ప్రజాస్వామ్యా(పార్శ్వా)న్ని (ఎన్నికల) ప్రజాస్వామ్యమే హరిస్తోందాఅన్న అనుమానం ఎవరికైనా వచ్చి తీరుతుంది. మరి ఈ ప్రజలను కాదని మనం ఎక్కడికి పోగలం? వీరిని వేరే కొత్త ప్రజలతో భర్తీ చేయలేం కదా! ఆస్తికత్వంలో దేవుడిని ఎలా కాదనలేమో, ఆధునిక యుగ రాజకీయాలలో ప్రజలను కూడా అలా కాదనలేం. ఆధునిక యుగంలో ఆధునికతా ప్రాజెక్టే అనుసరించాల్సిన ప్రజా రాజకీయ ప్రాజెక్టు. అది పరివర్తనాశీలమైనది, విప్లవాత్మకమైనది. ఎందుకంటే- విప్లవమే ఒక ఆధునికతా ప్రాజెక్టు. పెట్టుబడిదారీ  వ్యవస్థ గర్భంలోనే దాని శత్రువైన కార్మిక వర్గం ఉదయిస్తుందని మార్క్స్ చెప్పినట్టుగానే, నూతన సామాజిక వ్యవస్థ నిర్మాణం మనుగడలో ఉన్న వ్యవస్థకు బాహ్యంగా జరిగే అవకాశం ఉండదు. శత్రువుతో సంబంధం లేకుండా శత్రువుతో పోరాడలేం. ప్రజ (మిత్రు)లతో ఐక్యత ఎలా ఒక సంబంధమో, శత్రువుతో పోరాటం కూడా ఒక సంబంధమే. అసలు మానవ సంబంధాలకు బాహ్యంగా నిర్మాణం గానీ, ఏ పోరాటం గానీ ఉండదు. కనుక నిజమైన ప్రజల వర్గ పోరాటాలకు ఏదీ అంటరానిది కాదు. అంటరానితనం(సంబంధ రాహిత్యం) ఐక్యతా కాదు, పోరాటమూ కాదు. అది వర్గ పోరాటానికి వెలివెతే.

One thought on “జీవిత కథలు

 1. మా సత్యం
  మోహన్ తలారి రాసిన
  “హాస్టల్ లైఫ్” సమస్యలు బాధలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఈ సమస్యలు ఇంకా పునరావృతం అవుతూనే ఉన్నాయి.
  సమీక్షకుడు మెట్టు రవీందర్ గారి సమీక్ష విధానము పాఠకులను ఆలోచింపజేస్తుంది.
  “హాస్టల్ లైఫ్” కథలు సాంఘిక సంక్షేమ విద్యార్థుల జీవితలను ఆవిష్కరించారు.
  సమీక్షకుడు సమీక్షలో పేర్కొన్నట్టుగా “రచయిత మోహన్ తలారి అనుభవాలు ఆయన జ్ఞాపకాలు కేవలం ఆయనకే పరిమితమైనటువంటి వైయక్తికమైన అనుభవాలు కావు”. నిజంగానే ఈనాడు సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టళ్లలో చదువుకుంటున్న స్థితిగతుల్లో ఇలాంటి మార్పు లేదు ఆందోళన కలిగించే విధంగానే ఉన్నాయి. విద్యార్థులు ఐక్యమత్యంతో వారి సమస్యల పట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు ప్రతిఘటిస్తూ ఊరేగింపుల ద్వారా, ధర్నాల ద్వారా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని గెరావ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యలన్నింటికీ మూల కారణం విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు చేపట్టకపోవడమే ప్రధమ కారణం.

Leave a Reply