తెలంగాణలో నిషేధాన్ని మోస్తూ ఈ జులై 4లోకి విరసం ప్రయాణిస్తోంది. గత కొన్నేళ్లుగా తీవ్రమవుతున్న నిర్బంధం గత ఏడాది జులై నాటికే పూర్తి స్థాయికి చేరుకుంది. ఈ సంవత్సరం మార్చి 30 నుంచి ఇప్పుడది మరోసారి నిషేధంగా మారింది.
ఇదేమీ కొత్త కాదు. కానీ ప్రతిసారీ అనుభవం కొత్తదే. కొత్త ధిక్కారమే.
ప్రతి అణచివేతా కొత్త ఆలోచనలను ప్రేరేపిస్తుంది, సృజనాత్మక వెల్లువలకు దారి తీస్తుంది. ఈ విషయం చెప్పడానికి సుదీర్ఘ గతంలోకి వెళ్లనవసరం లేదు. ఈ ఒక్క ఏడాది ప్రజలు, సృజనజీవులు గడించిన అనుభవాలే చాలు. మహా మానవ విషాదంగా మారిన కొవిడ్ మధ్య ఈ ఏడాది గడిచిపోయింది. అది ఇంకా పూర్తి కాలేదు. రాజ్యపు నిర్బంధ వెల్లువల వలె, కొవిడ్ మృత్యు వెల్లువలు సాగుతున్నాయి. మానవుల ఉనికిలోకి సామూహిక మరణ విషాదం ప్రవేశించింది.
సరిగ్గా రాజ్యం ఇదే పని చేస్తున్నది. అంతకంటే ఎక్కువ చేస్తున్నది. ఎప్పటి నుంచో సాగిస్తున్న తన వ్యూహాత్మక అణచివేతను అనేక రూపాల్లో విస్తరించింది. భయం, నైరాశ్యం, ఒంటరితనం, బేలతనం, ఆలోచనారాహిత్యం.. ఒకటేమిటి? ఎన్నెన్ని రూపాల్లోనో మానవ మేధను, సృజనాత్మకతలను ఆవరించాలని చూస్తోంది. క్రియాశీలమైన మానవులను నిస్సహాయతలోకి తోసి వేయడం, యథాతధ స్థితికి ప్రేక్షకులను చేయడం అన్నిటికంటే అత్యంత ప్రమాదకమైన అణచివేత రూపాలు. జీవించడమంటే మరేమీ కాదు, కేవలం అదొక ‘అలవాటు’ అనే స్థితిలోకి నెట్టివేయడం వెనుక అణచివేత భావజాల వ్యూహం కూడా ఉంది.
కొవిడ్ బారిన పడి తేరుకోవడం, మరణించిన వాళ్లను మెల్లగా మర్చిపోవడం, రొటీన్ పనుల్లో పడిపోవ డం ఇప్పుడు కేవలం వ్యక్తుల అనుభవమే కాదు. అది మానవాళి అనుభవం. మరణానికి, మరణ భయానికి సంబంధించిందే కాదు ఇది. జీవితానికి సంబంధించింది. జీవిత క్రమాలన్నీ, ఆలోచనా రీతులన్నీ, క్రియాత్మక రూపాలన్నీ ఇలా మారిపోతేనే రాజ్యానికి రక్షణ. ఇప్పుడా పనిని పాలకులు ముమ్మరంగా చేస్తున్నారు.
మన కళ్ల ముందే ప్రజాస్వామ్యపు మేలి ముసుగులన్నీ తొలగిపోతుంటాయి. ప్రజలు ప్రోది చేసుకున్న విలువన్నీ విధ్వంసమైపోతుంటాయి. దేనికదే విడిగా జరిగిపోతున్నట్లు కనిపిస్తుంటాయి. లోలోపలి పరమ వికృత, జుగుప్సాకర సారం కనిపిస్తూ ఉంటుంది. కానీ అంతా ప్రశాంతంగా ఉందని చెప్పే గంభీర ప్రసంగాలు అన్ని వైపులా అందుబాటులో ఉంటాయి. మిగతావన్నీ నిషేధితమవుతాయి.
అబద్ధాల మీద, కుట్రల మీద వ్యవస్థలు నడవ లేవు. వాటి తర్కం వల్లనే నడుస్తుంటాయి. కానీ పాలకులకు అణచివేత వలె అబద్ధాలు కూడా కావాలి. బరితెగించిన హింసోన్మాదం వలె కుట్రలు కావాలి. పాలకులు ఈ రెంటినీ భారీ పరిశ్రమలుగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇంతగా గతంలో ఎన్నడూ చేసి ఉండరు. ఇప్పుడు నిజాలను, అబద్ధాలను వేరు చేయాల్సిన పనే లేదు. అంతా ఒక భావజాలంగా మారిపోయింది.
అయితే ఇదొక్కటే మిగిలిందా? అనేదే ప్రశ్న.
ఇదొక్కటే ఉండటం ఎన్నటికీ సాధ్యం కాదు. సామాజిక జీవితం అనే మహాద్భుతమైన శక్తి దీనికి లోబడదు. అది అనేక తలాల్లో, రూపాల్లో తనను తాను అనుక్షణం పునరుత్పత్తి చేసుకుంటూనే ఉంటుంది. పునర్జీవింపచేసుకుంటూనే ఉంటుంది. ఆంక్షలను అలవాటు చేసుకున్నట్లు కనిపిస్తూనే ధిక్కారంతో తిరగబడుతుంది. ఒట్టి పోయినట్లనిపించే క్షణాలు ఉండవచ్చుగాని నిత్య సజీవమే తన శాశ్వత స్వభావమని చాటుకుంటుంది.
ఇప్పుడదీ ఉన్నది. దీన్ని నిశితంగా చూడాలి.
ఈ ఏడాదిలో ఎన్ని నిరాశలు ఆవరించాయో అంతకంటే ఎక్కువ ఆశా పవనాలు వీచాయి. ఎన్నిసార్లు పడిపోయినట్లనిపించిందో.. అంత కంటే ఎక్కువసార్లు లేచి నిలడింది. పాలకుల, వ్యవస్థల గుట్టు విప్పే సృజనాత్మక వెల్లువలు సాగాయి. ఇదీ మన ముందున్న సమాజ అనుభవమే. ఒక పక్క మూసుపోతోంటే ఇంకో పక్క తెరుచుకోవడం ఎంత అద్భుతంగా ఉంటుందో చూస్తున్నాం. ఒక పక్క విధ్వంసమవుతోంటే ఇంకో పక్క నిర్మాణం కావడం ఎంత ఉద్విగ్నంగా ఉంటుందో కూడా చూస్తున్నాం. ఆ రకంగా పాలకుల వ్యూహమే ప్రజల చేతిలో ప్రతి వ్యూహంగా మారిపోయింది.
ఈ మొత్తం విరసం అనుభవం కూడా. ఈ ఏడాదిలో విప్లవ, విప్లవ సాహిత్యోద్యమాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. చీకటి రోజుల గానాలను వినిపిస్తున్నాయి. కానీ ఈ కాల స్వభావాన్ని గుర్తించాయి. దానికి ఎదురొడ్డి నిలబడగలం అనే ఎరుక పొందాయి. ఇట్లాగే కాకపోవచ్చు, ఇంకెలాగైనా కావచ్చు. సజీవ, పునరుజ్జీవ, పునఃసృజన ఎడతెగని ధార అని నిరూపించుకోడానికి సిద్ధమవుతున్నాయి. సవాళ్లకు పరిష్కారాలు వెతికే పనిలో ఉన్నయి. దేనికంటే, యావత్ సమాజమే సంక్షోభాలకులోనై పరిష్కారాల కోసం పెనుగులాడుతున్న రోజులివి. చీకట్లు ముసురుకొచ్చే వేళ వెలుగు రేఖలను పూయించడానికి విప్లవ సాహిత్యోద్యమం తనలోని పత్రహరిత శక్తినంతా వెచ్చిస్తున్నది. అందుకే జూలై 4 అంటే విరసానికి గతం కాదు. భవిష్యత్తులో భాగం. ఆ రోజుకు ఎన్నో చారిత్రక ప్రస్తావనలున్నాయి. అవీ గతానివే కాదు. వర్తమానం ప్రాధాన్యాలు. ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఇప్పడు 75 ఏళ్లు. ఆధునిక విప్లవోద్యమాల చరిత్రలోనే మహోజ్వల అనుభవాలను పంచి, దారుణ నిర్బంధాలకు, నాయకత్వ విద్రోహాలకు బలైపోయిన పోరాటం అది. కానీ అదీ వర్తమానంలో ముందుకు సాగుతున్న పోరాట స్ఫూర్తి.
జూలై 4 ఒక ప్రయాణ సూచి. మార్గదర్శి. ప్రయాణం మాత్రం నిరంతర క్రమం.