నిరాకర్ నాయక్ — వాస్తవిక కథనం


నేను -2011 నుండి 2015 వరకు, సుమారుగా మూడున్నరేళ్లు, ‘దేశద్రోహ’ తప్పుడు ఆరోపణల కింద వేర్వేరు జైళ్లలో మొదట సోర్డా సబ్-జైలులో, తర్వాత బ్రహ్మపూర్ సర్కిల్ జైలులో, ఆ తరువాత ఒడిశాలోని భంజానగర్ స్పెషల్ సబ్-జైలులో ఉన్నాను. ఎనిమిదేళ్ల నాటి పూర్తిగా తప్పుడు, కల్పిత కేసుకు సంబంధించి నన్ను రెండవసారి 2019లో మళ్లీ అరెస్టు చేసి మరో ఏడాదిన్నర పాటు సొరాడ, భంజానగర్ జైళ్లలో ఉంచారు.

నేను ఇప్పుడు బెయిల్‌పై ఉన్నాను. నాపై దాఖలైన మొత్తం పది కేసుల్లో మూడింటిలో నేను నిర్దోషిగా విడుదలయ్యాను, మిగిలిన ఏడు కేసులు విచారణలో ఉన్నాయి. ఒడిశాలోని గంజాం జిల్లాలోని వివిధ జైళ్లలో రెండు పర్యాయాలు ఐదేళ్లపాటు గడిపిన జైలు జీవిత సంక్షిప్త వాస్తవిక కథనాన్ని అందిస్తున్నాను.

విచారణా ఖైదీలలో  దాదాపు 99 శాతం సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన, చెందినవారు, దళిత, ఆదివాసీ వర్గాలకు చెందినవారు, అత్యధికులు నిరక్షరాస్యులు. వారు ‘జైలు’ని ఠాణా (పోలీస్ స్టేషన్) అని పిలుస్తారు. వారికి భూమి చట్టం గురించి, దాని గారడీ గురించి తెలియదు. వారు దేవుడిని నమ్ముతారు, థానాలో భరించే బాధలకు తరచుగా తమను తాము తిట్టుకుంటారు. వారు రోజూ పొద్దున్నా, సాయంత్రం సర్వశక్తిమంతుడిని ఆరాధిస్తారు, ఈ థానా నుండి తమను తప్పించేది దేవుడే అని అనుకుంటారు. వారు తమ కేసు పురోగతి గురించి న్యాయమూర్తిని లేదా జైలర్‌ను ఎప్పుడూ అడగరు. ఆ విషయాన్ని దేవుడికే వదిలేస్తారు.

సగానికి పైగా ప్రజలు విచారణ లేకుండానే ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గుతున్నారు. వారి కేసుల్లో కేస్ డైరీ, చార్జిషీట్లు, అభియోగాల రూపకల్పన, కమిట్‌మెంట్‌లు (విచారణకు సరిపోయేవి) మొదలైనవాటిని పోలీసులు తమ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఒక కేసు కమిట్‌మెంట్ కావడానికి మూడు నుంచి నాలుగేళ్లు పడుతుంది.

ఒక కేసులో వుండే ప్రైవేట్ సాక్షులు తాము కావాలనుకున్నప్పుడు కోర్టుకు హాజరు అవుతారు. కానీ ప్రభుత్వ సాక్షులు ఉద్దేశపూర్వకంగా సంవత్సరాలు తరబడి హాజరు కారు. పదే పదే నోటీసులు, సమన్లు ​​జారీ చేసినా ప్రభుత్వ సాక్షులు మరో జిల్లాకు బదిలీపై వెళ్ళామనే సాకుతో కోర్టుకు హాజరుకావడం లేదు. ఉద్దేశపూర్వకంగానే కేసు విచారణలో జాప్యం చేస్తున్నారు. అందువల్ల బాధపడేది, విడుదల కోసం వేచి ఉన్న విచారణ ఖైదీ.

సిడి రిపోర్ట్, ఛార్జిషీట్, ఎస్కార్ట్ వ్యాన్ లను ఎప్పుడు పంపాలనేది పోలీసుల ఇష్టాన్ని బట్టి వుంటుంది. పోలీసులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైతే, పేదవాడు ఏళ్ల తరబడి జైల్లోనే మగ్గిపోవాల్సి వస్తుంది. జైలులో ఉన్న తొంభై శాతం మంది తమపై ఏదో ఒక తప్పుడు, కల్పిత కేసులతో చిక్కుకుపోయిన వాళ్ళే. ప్రభుత్వోద్యోగులు యాదృచ్ఛికంగా జైలుకు వస్తే, ఎక్కువలో ఎక్కువ కేవలం పది, పదిహేను రోజులు మాత్రమే జైల్లో ఉండి, బెయిల్‌ మీద వెళ్లిపోతారు.

రాజకీయ నాయకులు, ధనవంతులు మాత్రం  దొంగతనం, దోపిడీలు, హత్య కేసుల్లో కూడా సాఫీగా బెయిల్ పొందుతున్నారు. జైలులో ఉన్న సమయంలో వారికి ఎంతో గౌరవం కూడా లభిస్తుంది. కానీ ఒక పేద, అమాయక వ్యక్తి జైలులోకి వచ్చాక తిరిగి బయటికి ఎప్పుడు వెళ్ళగలడనేది అతనికి తెలియదు. ఇల్లు, భూమి లేని వర్గానికి చెందినవారు కాబట్టి, చాలా మంది బెయిల్ కోసం దరఖాస్తు చేసినా, బెయిల్ మంజూరు అయినా, బెయిల్‌పై బయటకు వెళ్లడానికి ష్యూరిటీ షరతుల రీత్యా అవసరమైన భూమి లేదా ఇంటి లీజుల పత్రాలను ఏర్పాటు చేసుకోలేరు కాబట్టి జైలులోనే ఉండిపోతారు.

నేను భాంజానగర్ జైల్లో ఉండగా ఒకరోజు ముగ్గురు అమాయక పేద ఆదివాసీ యువకులు వచ్చారు. వారు రాయగడ జిల్లాకు చెందినవారు. వారి కేసు ఏమిటంటే, ఓ రోజు పొరపాటున ఓ కొత్త నంబర్‌కు ఫోన్‌ చేశారు. ఆ ఫోన్ నంబర్ భంజానగర్ సబ్ డివిజనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ది. అవతలి వాళ్ళు ఫోన్ ఎత్తడంతో వారు ఎవరో తెలియకుండానే  సరదాగా మాట్లాడారు. ఆ సరదా వాళ్ల కొంప ముంచింది. దాదాపు రెండేళ్లపాటు జైల్లోనే ఉన్నారు. డబ్బులు లేకపోవడంతో బెయిల్‌పై కూడా వెళ్లలేకపోయారు. వారి కేసును ఏ న్యాయవాది వాదించలేదు. నిరుపేదలు కావడంతో వారి కుటుంబ సభ్యులు ఎవరూ కలవడానికి రాలేదు. ఇంత చిన్న పొరపాటు వల్ల రెండేళ్లు కటకటాలపాలయ్యారు. తమ బాధను ఎవరి ముందు చెప్పుకోలేకపోయారు. దాదాపు 22 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత, తెలియకుండా చేసిన చిన్న తప్పుకు కోర్టు మరో రెండు నెలల జైలు శిక్ష విధించడంతో, అది కూడా అనుభవించి విడుదలయ్యారు.

ఇలా అనేక దళిత, ఆదివాసీ కుటుంబాలకు చెందిన నిరుపేదలకు న్యాయం జరగడం లేదు. వారి హక్కుల కోసం గళం విప్పిన వారిని కూడా ‘ద్రోహులు’గా పరిగణిస్తున్నారు.

ఖైదీలకు విద్య, వినోదం కోసం క్రీడా సామాగ్రి మొదలైనవి అందించడానికి చట్టాలు, నియమాలు ఉన్నాయి, కానీ ప్రతిదీ కాయితాల మీదే మిగిలిపోయింది. వాస్తవంలో ఏదీ అందుబాటులో లేదు. ఆహార మెనూ ఖైదీలకు తెలియజేయడం లేదు. ఖైదీలకు నాణ్యత లేని ఆహారాన్ని అందజేస్తున్నారు. జైలు అధికారులు ఖైదీల హక్కుల హననం చేస్తున్నారు. పేదలకు చట్టంపై అవగాహన కల్పించాల్సిన లీగల్ ఎయిడ్ లాయర్లు హాజరు రిజిష్టర్ పై సంతకం చేసి వెళ్లిపోతారు. ఈ ఐదేళ్లలో జైల్లో నిర్వహించిన ఏ న్యాయ సహాయ శిబిరానికి హాజరైనట్లు నాకు గుర్తు లేదు.

నేను 2012- 2014 మధ్య బ్రహ్మపూర్ జైలులో ఉన్నాను. అక్కడ ఖైదీలలో ఒకరు తప్పుడు కేసులో అరెస్టయ్యాననే అవమానం తట్టుకోలేక ఒక రోజు విషపూరిత మందు తాగి అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. బ్రహ్మపూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సంబంధిత వైద్యుడు ఆ ఖైదీ గుండెపోటుతో మరణించాడని పోస్ట్‌‌మార్టం నివేదికనిచ్చాడు. డాక్టర్, జైలు అధికారి, తదితరులందరూ అబద్ధాన్ని ఆశ్రయించి విషయాన్ని అటకెక్కించారు.

మరో ఘటనలో ఓ వ్యక్తిని అరెస్టు చేసి, పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు విపరీతంగా కొట్టి సోర్డా జైలుకు తరలించారు. జైలుకు వచ్చిన నాలుగైదు రోజుల్లోనే చనిపోయాడు. ఇది చాలా తీవ్రమైన సమస్య. అయితే కొంతమంది పలుకుబడి గల వ్యక్తుల ఒత్తిడితో పోలీసులు, వైద్యులు, జైలు అధికారులు ఈ విషయాన్ని కప్పిపుచ్చారు. అందరూ ఏమీ పట్టనట్టు మౌనం వహించారు. ఈ సంఘటన గురించి తెలియగానే, ఈ దారుణ హత్యకు వ్యతిరేకంగా జైలు ఆవరణలోనే ధర్నా చేశాము. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. కానీ, ఈ నేరానికి పాల్పడిన పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను వెంటనే సస్పెండ్ చేయకుండా, పదోన్నతిపై బదిలీ చేశారు.

ఎవరైనా ఖైదీ ఏదైనా అన్యాయానికి వ్యతిరేకంగా నోరు విప్పితే ప్లాస్టిక్ పైపుతో కొట్టి చిన్న చీకటి కొట్టులో ఉంచుతారు.

జడ్జి లేదా జిల్లా కలెక్టర్ తనిఖీకి వచ్చిన రోజు, జైలులో మంచి ఆహారం ఇస్తారు. అతను వెళ్లిన తర్వాత, ఖైదీలకు అదే పోషకాహారం లేని, నాణ్యత లేని నీళ్ల పప్పు, చిన్న రాళ్లతో నిండిన బియ్యం అందుతాయి. ఒక ఖైదీ రోజుకు ఇరవై నాలుగు గంటలలో 15 గంటల పాటు జైలు గదిలోనే ఉండాలి. జైలు పాలకవర్గంలోని నిజాయితీ లేని అవినీతి వ్యవహారాలు ఎన్నడూ బయటకు రాలేదు. రాజ్యాంగం పేరుతో ప్రమాణం చేసి బూటకపు పరిపాలన సాగించే అధికారులు మన పాలనా వ్యవస్థలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రజా జీవితంలోని అవినీతి విధానాలను ఏ వేదికలోనూ చర్చించరు.

విచారణా ఖైదీల హక్కులు:

నేను జైలు నుంచి వచ్చిన తర్వాత మా న్యాయవాది స్నేహితుడు, ఒడిశా హైకోర్టు సీనియర్ న్యాయవాది, ప్రశాంత్ జెనాతో  ఖైదీల హక్కుల గురించి చర్చించినప్పుడు యిలా అన్నారు … “ఎవరికి బెయిల్ మంజూరు చేయాలి, లేదా చేయద్దు అనేది ఇప్పటి వరకు భారతీయ కోర్టులలోని న్యాయమూర్తుల యిష్టాయిష్టాలు, విచక్షణ మీద ఆధారపడి వుంటుంది. బెయిల్ మంజూరు చేసే సమయంలో కోర్టు బెయిల్ ఎందుకు మంజూరు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని సుప్రీంకోర్టు కూడా చెబుతోంది. అయితే, వాస్తవానికి, ‘విచక్షణ’ అనేది ‘వివక్ష’గా మారకూడదని చెప్పింది.”

“కింది కోర్టులో దరఖాస్తు చేసిన తర్వాత నిందితుడికి బెయిల్ మంజూరు కాకపోతే, ఈ విషయంలో నిందితుడిని అడిగిన తర్వాత, నిందితుడు ప్లీడర్‌ను పెట్టుకోలేకపోతే హైకోర్టును ఆశ్రయించే సౌకర్యం ఉంది. న్యాయమూర్తి స్వయంగా కేసును ఉచిత న్యాయ సహాయం కోసం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెందిన న్యాయ సహాయ కేంద్రానికి అప్పగిస్తారు. అంతేకాకుండా, ఛార్జిషీట్‌ను సమర్పించడానికి నిర్దేశించిన కాలపరిమితి ముగిసినప్పటికీ, ఈ గడువులోపు చార్జిషీట్‌ను సమర్పించడంలో పోలీసులు విఫలమైతే కనక, బెయిల్ పొందే సౌలభ్యం భారతీయ న్యాయస్థానాలలో అందుబాటులో ఉంది. సెషన్స్ కేసులలో కూడా మేజిస్ట్రేట్ కోర్టు నుండే నిందితులు బెయిల్‌కు ఒక హక్కుగా అర్హులు. ”

అయితే, కేసులో ఛార్జిషీట్‌ను సమర్పించకపోతే నిందితులు బెయిల్‌కు అర్హులని పేద ఖైదీలకు చెప్పడం తమ బాధ్యతగా దిగువ కోర్టులోని న్యాయమూర్తులు భావించరు. విచారణా ఖైదీ బెయిల్ పొందడాన్ని హక్కుకు సంబంధించిన అంశంగా, ఖైదీ దరఖాస్తు చేసినా, చేయకపోయినా, బెయిల్ వచ్చే సదుపాయం వుండేలా చూడాలి. కానీ, మన న్యాయ వ్యవస్థలో అలాంటి నిబంధనలే లేవు, ఇది మన న్యాయ వ్యవస్థ బలహీనత కూడా.

######


(తాజా కలం: ఒడిశాలోని గంజాం జిల్లాలోని సోర్డా, పోల్సర ప్రాంతాలలో రాజకీయంగా శక్తివంతమైన వర్గాలు ఆక్రమించిన ఆదివాసీల భూమి వారి నిరంతర ఆందోళన కారణంగా విముక్తి పొందింది. నిరాకర్ నాయక్ ఆ ఆందోళనలో చురుకైన పాత్ర పోషించడం వల్ల భూ అక్రమణదారుల ఆగ్రహానికి గురయ్యాడు. అల్లర్లు, దొంగతనం, నేరపూరిత కుట్ర, దేశద్రోహం (UAPA & Sec.124 (A) కింద IPC) తప్పుడు ఆరోపణలతో అతను చాలా సంవత్సరాలు జైలులో ఉన్నాడు. అతని జైలు అనుభవం మొదట ఒడియా పత్రిక సంగ్రామి చేతనర గణభిత్తిలో ప్రచురించబడింది.  నిరాకర్ నాయక్‌పై కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి. లాలతేందు సమంతర దీనిని ఒడియా నుండి అనువదించారు. తెలుగు అనువాదం – పద్మ కొండిపర్తి. gassbhubaneswara@gmail.com


(కౌంటర్‌కరెంట్స్.ఆర్గ్ సౌజన్యంతో)

Leave a Reply