అంతర్జాతీయ కరోనా విపత్తు వలన గత ఏడాది నుండి తెలంగాణ రాష్ట్రంలో విద్యభోదన ప్రత్యక్ష తరగతిగది విధానంలో కాకుండా డిజిటల్ తరగతుల పేరుతో జరుపుతున్నారు.ఈ విద్యా సంవత్సరం కూడా డిజిటల్ రూపంలోనే తరగతుల భోదన ఉంటుందని విద్యశాఖ స్పష్టం చేసింది. అయితే రూపంలో డిజిటల్ విద్యభోదన ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ సారంలో డిజిటల్ తరగతులు ఎంత మంది విద్యార్థులకు అందుతున్నాయనేది నేడు మనందరి ముందున్నట్టి ప్రశ్న. వేల సంవత్సరములుగా మన దేశంలోని శోశితజనసమూహౕలపై జరుగుతున్న సామాజిక,ఆర్థిక అణచివేత వలన నేడు మెజారిటీ ప్రజలు డిజిటలైజేషన్ ఫలితాలను అందుకోలేని పరిస్థితి నెలకొంది.
తరగతిగదిలో ప్రత్యక్ష భోదనకు స్కూల్ బిల్డింగ్, టీచరు, బెంచీలు, వెలుతురు,బ్లాక్ బోర్డు వంటివి అవసరమైతే డిజిటల్ విద్యభోదనకు ప్రతి విద్యార్థికి ల్యాప్టాప్,స్మార్ట్ టివి,ట్యాబ్,ఇంటర్నెట్ కనెక్టివిటీ,డాటా బాలెన్స్ లు మరియు కంప్యూటర్ పరిజ్ఞానం,ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి. పాలకులు వీటిని సమకూర్చకుండా విద్య భోదన అందిస్తున్నామని ప్రకటించడం చెవుడులోపం ఉన్న వ్యక్తి ముందు చప్పుడు చేయటమే అవుతుంది. డిజిటల్ భోదనకు తెలంగాణ సర్కారు కల్పించిన సౌకర్యాలు శూన్యం.2020 సెప్టెంబరు నెలలో నుండి విద్య భోదన సాగుతున్నదని ఆర్భాటముగా ప్రకటిస్తున్న తెలంగాణ విద్యశాఖ ఎంత మంది విద్యార్థులు పాఠాలు వింటున్నారో,ఎంత మంది విద్యార్థుల ఇండ్లలో స్టార్ట్ టివి, ల్యాప్ టాప్, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నదో ఎంత మందికి ప్రభుత్వం ద్వారా ఈ సౌకర్యాలు కల్పించారో వైట్ పేపర్ విడుదల చేయాలి. సర్కారు ప్రకటించిన టి-శాట్ చానల్ ఎందరి ఇండ్లలో ప్రసారం అవుతున్నది.ఎంత మంది విద్యార్థుల వద్ద టి-శాట్ తరగతుల టైమ్ టేబుల్ ఉన్నదో స్పష్టం చేయాలి.ప్రభుత్వం ప్రకటించిన భోదన మార్గాల ద్వారా విద్యార్థులకు విద్యభోదన అందటంలేదు.
గ్రామీణ ప్రాంత,పట్టణ ప్రాంత పేద విద్యార్థులు డిజిటల్ పరికరాలు కొనుక్కోలేని స్థితి ఉన్నది. 2020-21 విద్యసంవత్సరంలో డిజిటల్ పాఠాలు వినే కనీస సౌకర్యాలు లేక వేలసంఖ్యలో విద్యార్థులు డ్రాపౌట్లుగా మారినారు.కస్తూరిభాగాంది విద్యాలయాలు,గురుకుల పాఠశాలలో ప్రతితరగతిలో డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య 10% మించింది. విద్యార్థులు బాలకార్మికులుగా, యాచకులుగా, వ్యవసాయ కూలీలుగా, అర్థ కార్మికులుగా మారుతున్నారు. బాలికా వివాహౕలు పెరిగిపోయాయి. ఈ సందర్భంలో సగటు పాలక ప్రభుత్వం, పౌరుడు సేవా దృక్పథంతో స్పందించాలి. విదేశాలతో యుద్ధము సంభవించినప్పుడు యావత్ దేశ ప్రజలు యుద్ధములో పాల్గొనే భాద్యత వహిస్తారు మరియు అన్ని రకాల ప్రైవేటు ప్రభుత్వ వనరులు అత్యవసర వినియోగం ఆవశ్యకత, అవసరం ఉంటుంది. ఇది మనలోని దేశ భక్తికి కొలమానం అయినపుడు,కరోనా విపత్తు వలన దాదాపు అలాంటి యుద్ధపరిస్థితి నెలకొన్న ఈ సందర్భంలో ప్రైవేటు మీడియా సంస్థలు, టి వి చానాళ్ళు,ఇతర ప్రసార సాధనాలు విద్యార్థుల పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం చేసి దేశభక్తిని చాటుకోవల్సిన భాద్యత వారిపై ఉన్నది. పొద్దస్తమానం డైలీ సీరియల్స్ , వినోద కార్యక్రమాలు ప్రసారం చేసే చానాళ్ళు ప్రతిరోజు ఒక తరగతి సంబంధించిన తరగతులు ప్రత్యక్ష ప్రసారం చేస్తే కొంతవరకు విద్యార్థులకు ఉపయోగకరం.ఇందుకు ప్రైవేటు ప్రసార సంస్థల యాజమాన్యాలను ఒప్పించి ట్రాయ్ నిబంధనలను సవరించే భాద్యత ప్రభుత్వ టెలికాం& ప్రసారాల మంత్రిత్వశాఖ తీసుకోవాలి. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని 5 వ షెడ్యూల్డ్ ఫరిధిలోని అటవీప్రాంతాలలో విద్యా భోదనకు పట్టణకేంద్రాలనుండి కేబుల్ కనెక్టివిటీ అందించాలి. ఆదివాసులకు వారిస్థానిక భాషలో ఆన్లైన్ పాఠాలు భోదించేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలి. విద్య రంగానికి నిధుల కేటాయింపు పెంచాలి. ఈ కర్తవ్యాలను నెరవేర్చకుండా మేము విద్యనందిస్తున్నామని ప్రజల సొమ్ముతో వర్ధిల్లుతున్న ప్రభుత్వాలు-బడా పెట్టుబడిదారీ సంస్థలు కనీస మానవీయతను ప్రదర్శించకపోవడం దేశద్రోహమే అవుతుంది.
దేవాలయాలలో హుండీల పేరుతో,మసీదుల,చర్చీలకు కానుకల పేరుతో ప్రజలు జమ చేస్తున్న వందలకోట్ల రూపాయలు పేదపిల్లల డిజిటల్ భోదన పరికరాల అవసరాలకు వినియోగించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్ టాప్,ఇంటర్నెట్ సౌకర్యం అందిస్తే 3 వేల కోట్లకు మించదు. తెలంగాణ పాలకులు బహుళజాతి కంపెనీలకు,ప్రాజెక్టులకు కేటాయిస్తున్న లక్షల కోట్లలో 3 శాతం కూడా కాదు. ఇది కూడా చేయటానికి ప్రభుత్వం సిద్ధపడటం లేదంటే పేదలైన యస్సీ,యస్టీ,బి సి మైనారిటీ విద్యార్థుల పట్ల పాలకుల నిర్లక్ష్యము బహిర్గతమవుతున్నది. తెలంగాణ ప్రభుత్వం పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారానికి కావలసిన సౌకర్యాలు కల్పించకుండా విద్యాసంవత్సరం ప్రారంభించటం పేద విద్యార్థులకు విద్యను నిరాకరించటమే.ప్రతి విద్యార్థికి ఉచిత పుస్తకాల పంపిణీతో పాటు ఒక ల్యాప్టాప్,ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి.ప్రైవేటు టీవీ చానెళ్ళలలో తరగతుల ప్రత్యేక్ష ప్రసారాలు చేపట్టాలి.