నా కడుపున నలుసు
పడ్డాక గాని తెలియలేదు
ఆ దారి సవాళ్ళ మయమని

భుజాన వేసుకొని
మోసకెళ్తా ఉంటే
ప్రసవానికి కాక
కాటికి ఏమో కలత పడుతుంది
ప్రాణంలో ప్రాణం

స్వేచ్ఛా తెగల్లో పుట్టడమే
నా ప్రసవానికి శాపమని
నేను తల్లినవ్వబొతుప్పుడే
తెలిసొచ్చింది

డోలీ డోలీ
నన్ను ముద్దాడిన అమృతం తెర
ఇక ఈ డోలీలోనే
విగతజీవిగా మిగలితానేమో..!
ఈ ప్రయాణంలో
తల్లిగా ముద్ర గాంచడానికి
తల్లి బంధంకి దూరామైతే కారణమెవ్రూ..!
చెప్పండి 

నా శిశువు స్పర్శ నేను గాక
నేలముద్దాడతుందేమో
శాశ్వతంగా

అడవి తల్లి బిడ్డనైనందుకు
నన్ను తల్లిపేరు నుంచి
దూరం చేసే ప్రయత్నమే డోలీ మార్గం

 మా అమ్మ బామ్మ
ఈ మార్గంలోనే 
తల్లులయ్యారేమో
నిజమే అనిపిస్తుంది
నేనూ తల్లి నవుతానా..?

కిందాటి నెలలో
మా గూడాం స్త్రీ ఈడనే అసువులు బాసిందంటా
అప్పుడనిపించింది
నాలాగేందరో
ఈ సమరంలో నింగిలో చుక్కలయ్యారో
రెండు ప్రాణాలు మోసిన
ఆ భుజాలెంత క్షోభ పడ్డాయో...! 
ఇక ప్రసవించింది
బిడ్డను కాదు
ఇన్నేండ్లు కని చనిపోయిన తల్లుల కన్నీళను
ఊపిరాగిన తల్లులుకాడ యేడ్చిన పసికందు అరుపులను

ప్రసవాలకు వందల కోట్లు బడ్జెట్ పత్రాలు
అవి మా ప్రసూతికి కాదా
అయ్యాల్ల పొట్లో దొంతలు పేల్చడానికని
తెలీయలేదు

సంపద సృష్టించనూ వచ్చు
అసెంబ్లీలో నాటకీయంగా బడ్జెట్ చదివింపులు
రాయించనూ వచ్చూ
డోలీలోనే పొయిన జీవాన్ని సృష్టించగలవా!

ఆదివాసీ దినాన జేజేలు మాకు
ఆశలు మాకు
బడ్జెట్లో పైసలు మీకు
ఇదేనా ఇదేనా అభివృద్ధి
పథకాలకా..? 
పంపకాలకా..?
ఎస్టేట్స్కా..?

డోలీలో ప్రసవయాతనతో నరాలు పగిలి
పేగులు చితికిన ఆడదిని చూడు 
తెలుసుతా ఉంటాది
మీరా భారం మొసుకొరొమో
పిన్ను గుచ్చుకుస్తే అపోలో
కాలు బెణికితే సెవెన్ హిల్స్
తిరిగే హైబ్రిడ్ తోలువాళ్ళకి
కష్టానికి సెమటతో బిగిసిన మాంబోట్ల
కాయాన్ని చూడండి 

చూడండి
దీనికి బాధ్యులెవరో ?

రండిరా రండి
ఇకనైనా మోసిన ఆ భుజాన మళ్ళా
యింకో డోలీ మొయించోద్దు
ప్రసవించే ముఖాన సిందూరం రూపం పూయించక
తెల్లని గులాబీలు పూయించు

డబ్బెది యేండ్లు పూర్తయినని
మహోత్సవాలెందుకు చేయిస్తున్నరు
ఏం అన్ని ఆదివాసాల్లో రహదార్లెయించిందనా..
ఆసుపత్రులు కట్టిందనా
లోకాన్ని చూడ్డానికొచ్చే తండాల శిశువునైనా
స్వేచ్ఛగా విచ్చుకొనిచ్చిందా
డోలీ లేకుండా వొక చావునైనా అపగలగనందుకా
యిందుకు ఈ అమృత మహోత్సవాలు
ఊపిరాగిన గర్భిణీ స్త్రీలకు సీమంతాలకా ఏమి
ఈ అమృత మహోత్సవాలు 

అర్థం శతాబ్ద సాతంత్రం ప్రజలకు కాదా
గద్దెక్కిన వాళ్ళకా ?

2 thoughts on “డోలీ ప్రసవం

Leave a Reply