ఎంత  పెద్ద సమస్యయినా, ఎంత చిన్న సమస్యయినా పంపిణీ దగ్గర బిగుసుకు పోతున్నాయి. ఆ సమస్య తెగకుండా అనేక ఉచ్చులు బిగించటంలో ఎవరి మానాన వారు వాద ప్రతివాదాలు తీవ్రం చేస్తూనే ఉంటారు. ఈ నాలుగు దశాబ్దాలుగా కృష్ణానదీ జలాల పంపిణీకి, పున:పంపిణీకి సంబంధించి అనేకానేక చిత్రవిచిత్ర వాదనలు వినవలసి వచ్చింది. ఆ సంభాషణలో  ఘర్షణలో చిన్నచిన్న మెట్లుగా సమస్య పరిష్కారం వైపు ముందడుగు వేస్తూ వచ్చింది కానీ ఓ కొలిక్యిరాలేదు. రాలేదు అనేకంటే పట్టించుకోగల బాధ్యత ఉన్నవారు రానీయలేదు అనటమే సరిగా ఉంటుంది. కృష్ణానది నీళ్ళ విషయంలో అన్ని వనరుల సంపదల పంపిణీల చర్చ సందర్బం కాదు కావచ్చు కానీ సమాజ పరివర్తనకు దోహదపడగల అవకాశం ఉన్న ఏ చర్చ అయినా ఈ నాలుగు దశాబ్దాలే అనికాదు స్వతంత్ర భారతకాలమంతా పరిష్కారం గిడస బారుతూ వచ్చిన ప్రధాన సమస్యలే అనేకం ఉన్నాయి. బిసిల లాగా ఎస్‌.సి., ఎస్‌.టి వర్గీకరణ సమస్య, చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల సమస్య, భూములు ఇతర సహజ వనరుల పంపిణీ సమస్య ఒకే ప్రాంతంలోని ప్రజల మధ్య, ఒకే దేశంలోని భిన్న ప్రాంతాల మధ్య ఇలా ఏ సమస్య కూడా శాస్త్రీయ, న్యాయ పరిష్కారాన్ని సాధించటం సులభసాధ్యం కావటం లేదు. దశాబ్దాల కాలం మురిగిపోతున్నది. జీవితాలు ధ్వంసమవుతున్నాయి. ఒకే విషయం మీద దీర్ధకాలం కేంద్రీకరించవలసి వస్తే, కేంద్రీకరించి సంవాదంలో, పోరాటంలో ఉండవలసి వస్తే ఆ పరిణామాలు ఆ సమాజంపై ఎలాంటి ప్రభావం వేస్తాయో లోతైన విశ్లేషణలు జరగటం అవసరం అనిపిస్తోంది.

భారతదేశం 1947లో వలసపాలన నుండి విడివడిన తరువాత, సువిశాల దేశంగా రూపొందే క్రమంలో దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. ఆ రాజ్యాంగం వెలుగులోనే అయినా దేశం ఆధునికం కావటానికి ఆలోచనలు భూస్వామిక అవశేషాలను దాటి విశాలం కావటానికి, పెట్టుబడులతో తీవ్రమయ్యే దోపిడీ పీడనలను అధిగమించే కార్యాచరణకు అవసరమయ్యే భావజాల విస్తృతికి కృషి చేయటంలో పాలన, పాలనా వ్యవస్థలు ఘోరంగా విఫలమయ్యాయి.

సమాజపు దిగువ వర్గాలనుండి వ్యక్తమయిన ఆశలను, ఆకాంక్షలను ఉపేక్షించటం, అవి ఆగ్రహంగా వ్యక్తమైతే అణిచివేయటం జరిగింది. అట్లాగే పై నుండి ప్రభుత్వాలే ఒక పాలనా విధానంగా చిన్న చిన్న మెరుగైన చర్యలకు పూనుకుంటే సమాజంలోని అధిపత్య వర్గాలు అడ్డగించటం కొనసాగుతూ వస్తోంది. ఫలితంగా చిన్నా పెద్ద సమస్యలు అట్లాగే మూలుగుతున్నాయి. పైపైకి పరిష్కారానికి చాలా కృషి జరుగుతున్నట్టు అనిపిస్తున్నా ఏ కృషీ జరగని పరిస్థితిని సమాజం, సమాజంలోని అణగారిన ప్రజలు భరించటం కష్టమని పాలకులు గ్రహించటం తప్పని అవసరం అని కూడా ఇటీవలి అనేక సందర్భాలు హెచ్చరిస్తున్నాయి. సహజ వనరుల పంపిణీకి సంబంధించిన అనేక సమస్యలలో కృష్ణానదీ జాలాల పంపిణీ, పున:పంపిణీ సమస్య కూడా ఒకటి చాలా తీవ్రమైంది కూడా.

ఎంతో ఆలోచిస్తు సమానత్వం వైపు, ప్రగతివైపు చర్చను, ఆచరణను ప్రోత్సహించవలసిన ప్రజాస్వామిక దృక్పథంగల వ్యక్తులు, శక్తులు కూడా పంపిణీ అనే దశను దాటి సంక్షేమ పథకాలు కూడా ఎందుకు అనే ప్రతికూల దిశవైపు సమాజం పోతున్నదా? అని నాలో కలుగుతున్న అందోళన ఇంకోవైపు నన్ను వెంటనే ఈ వ్యాసం రాసే దిశగా కదిలించలేకపోయాయి. కానయితే ఏ కృష్ణానది నీరు, అనదిపారుతున్న రాష్ట్రాలమధ్య రాష్ట్రాల లోపల కరువు పీడిత ప్రాంతాలకు న్యాయంగా పంచాలని పోరాడుతున్నామో, తెలంగాణ రాష్ట్రంలో కూడా అంతర్గత జలవైరుధ్యాల పరిష్కారానికి నిలబడ్డామో ఆ వివరాలు గత వ్యాసానికి కొనసాగింపుగా రాయాలనిపించింది. గత వ్యాసంలో కృష్ణానదిని, నీటి లభ్యతను, పంపిణీ తీరుతెన్నులను, పంపిణీలో అసంగతాలను, బీళ్ళకు నీళ్ళ అవసరాన్ని అందుకు నిర్దిష్టంగా చేపట్టవలసిన చర్యలను చర్చించాను. 2018 తరువాత ఈ అయిదేండ్లలో కూడా చాలా జరిగింది. కానీ నీటి పంపిణీ జరగలేదు. ఏం జరిగిందో, ఏం జరగాలో చూద్దాం.

జస్టిస్‌ బచావత్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు ముందు కృష్ణానది మీద మహారాష్ట్ర” కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు తమకు తోచిన విధంగా ప్రాజెక్టులు నిర్మించుకున్నాయి. ఈ రాష్ట్రాలు ఏర్పడక ముందటి ప్రతిపాదనలను, ఆ చారిత్రక కారణాలను కానీ, స్థానికంగా జరిగే నష్టాలను కానీ పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టాయి. నీటి వినియోగ అనుభవంలో ముందున్న ఆంధ్రపాలకవర్గ అధిపత్యం వల్ల ఆంధ్రప్రదేశ్‌ భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు చేపట్టిన తీరు చూసిన ఎగువ రాష్ట్రాలు 1956 జల వనరుల చట్టం సెక్షన్‌ 3 ప్రకారం ట్రిబ్యూనల్‌ వేసి నీరు పంచమని కోరాయి. తెలంగాణ తొలిదశ పోరాటం ఉధృతంగా జరుగుతూండిన 1969లో జస్టిస్‌ ఆర్‌.ఎస్‌. బచావత్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేశారు.

ఏడు సంవత్సరాల పాటు అధ్యయనం చేసి, రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ వాదనలు విని 1976 మేలో జస్టిస్‌ బచావత్‌ తన తీర్చును కేంద్రానికి అందించారు. ఈ తీర్పు 2000 మే చివరి దాకా అమలులో ఉంటుందన్నారు. ఈ గడువు నాటికి ఆరు సంవత్సరాల ముందే మలిదశ తెలంగాణ పోరాటం మొదలైంది. మరోసారి తెలంగాణలో నెత్తురు పారుతుండింది. 1997లోనే కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో నీటి నిర్మాణాలు పెరిగి పోతున్నాయని, మిగులు జలాల మీద ఆ రాష్ట్రానికి హక్ములేదని, నిర్మాణాలు ఆపాలని సుప్రీం కోర్టుకు వెళ్ళింది. ఇంతలో బచావత్‌ తీర్చు అవధి ముగియటంతో మరో ట్రిబ్యునల్‌ వేయవలసి వచ్చింది. 2004లో ఏర్పడిన బ్రిజేర్‌కుమార్‌ కొత్తగా కొండలు తవ్వింది లేదుకానీ మిగులు జలాలు కూడా లెక్కలు తీసి 2013 నాటికి తీర్చు ప్రతులను కేంద్రానికిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ సహజంగానే అ తీర్పుపై స్టే కోరింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

2 జూన్‌ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం కూడా నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతివాదిగా చేర్చి తమకూ నీరు పంచాలని కోర్టును ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వం జస్టీస్‌ బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ను ఈ నాటికీ కొనసాగిస్తూనే వుంది. ఒక చిన్న వివాదం పరిష్కరించటానికి, న్యాయం అమలు చేసే విధి విధానాలు ఇవ్వకుండా ఒక ట్రిబ్యునల్‌ను ఇరవై సంవత్సరాలుగా నిర్వహించటం ఏమి సంకేతాలు ఇస్తున్నది. ఎగువన ఉన్న కర్టాటక, మహా రాష్ట్రలు  మిగులు జలాల పంపిణీని హర్షిస్తుండగా   ఆంధ్రప్రదేశ్‌ వ్యతిరేకిస్తున్నది. ఈ మూడు రాష్ట్రాలు పంచిన నీటిని, అదనపు నీటిని మొత్తంగా వాడుకుంటున్నాయి. జస్టిస్‌ బచావత్‌ ట్రిబ్యునల్‌ నాడు కానీ, జస్టీస్‌ బ్రిజేశ్‌ తీర్చు ఇచ్చిన 2018 నవంబర్‌ కాలానికి కానీ తెలంగాణ రాష్ట్రం కాదు కనుక నీళ్ళు పంచలేదు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కోరినా, ట్రిబ్యునల్‌ కొనసాగుతున్నా కృష్ణానది నీటి పంపిణీ జరుగలేదు.

పై రెండు ట్రిబ్యునళ్లు  నీటిని ప్రాజెక్టులకు రాష్ట్రాలకు కేటాయించాయి. కానీ రాష్ట్రాల  లోపలి ప్రాంతాలకు కేటాయించ లేదు. బచావత్‌ తీర్పులో ఆయా ప్రాజక్టులకు  కేటాయించిన  నీటిని ఆ రాష్ట్రంలో వాడుకోవచ్చునని చెప్పిన సూచనలను వదిలేసి పాలకులు బేసిన్‌కు నష్టం చేసి బేసిన్‌ బయటికి తరలించటానికి ఉపయోగించారు. నీరున్న చోట పనులుంటున్నాయి. పంటలుంటున్నాయి. నీరు లేని చోట పనిలేదు. పంటలేదు. బతుకు వెతుక్కుంటూ వలసలు తీవ్రమైనాయి. అసమానతలు, ప్రాంతీయ అసమానతలు తీవ్రమైనాయి. ఈ అసమానతలు జలవనరుల పంపిణీ పోరాటాలకు తొవ్వలు వేశాయి. అనేక చారిత్రక కారణాల వల్ల తెలంగాణకు చిన్న నీటి వనరులే ఆధారం. ఇక్కడి వాన నీరు నిలుపుకున్న చెరువులే ఆధారం. తరాల జీవితంలో అవి తలదాకా వూడిపోయాయి. ఆ పేరుతో కేటాయించిన 90.82 టి.ఎం.సీ. నీరు కృష్ణలోనే కలుస్తున్నది. ఈ వాస్తవ పరిస్థితి దేశమంతటికీ తెలుసును.

అయినా చాలా నిలకడగా, రాష్ట్ర విభజన పోరాటం రెండు దశాబ్దాలు కొనసాగుతే కానీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టం రూపొందలేదు. ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, ట్రిబ్యూనల్‌ కొనసాగుతున్నా పది ఏండ్లలో విభజన చట్టం పూర్తిగా అమలు జరగాలని చట్టంలో ఉన్నా తెలంగాణకు నీటి పంపిణీ జరగలేదు. కృష్ణానది నీటిని ఎత్తిపోతల పథకాల ద్వారా తీసుకొని ఎగువ ప్రాంత బీళ్ళకు నీళ్ళివ్వాలని, ఎల్లకాలమూ నదికి నీరివ్వటము, ఎండిపోవటమే కానీ నేల తడారి, ఎడారిగా మారిపోవటమే కానీ ఈ నేలకు నీటి హక్కు లేదా అని ప్రారంభించిన పోరాటాలకి మూడు దశాబ్దాలు దాటుతోంది. అనేక సంఘాలను, వ్యక్తులను సమీకరించి ఏర్పరచిన జలసాధన సమన్వయ సమితి నిర్వహించిన సభలు, సమాలోచనలు, ప్రత్యక్ష పోరాటాలు అడుగుతున్నాయి. కరువు వ్యతిరేక పోరాట కమిటీ, కృష్ణా నదీ జలాల పున:పంపిణీ ఉద్యమం చేసిన పోరాటాలు, అనుభవించిన హింస అభివృద్ధి పరచిన వాదనలు చేసిన ప్రతిపాదనలు అడుగుతున్నాయి. తెలంగాణ జనసభ, దేహాలు అగ్ని గుండాలు చేసుకుని ఎలుగెత్తిన యువకుల కంఠనాదాలు అడుగుతున్నాయి. ఇవాళ ఈ చరిత్రంతా గతంలోకి మారి ఉండవచ్చును కానీ, ఆ చరిత్ర అడిగిన ప్రశ్న కృష్ణానదిలో హక్కుగా దక్కవలసిన తెలంగాణ నీటి వాటా ఏమైంది అనే ప్రశ్నమాసిపోగలదా?

తెలంగాణ సమాజానికి ఇది కృష్ణానదికి మాత్రమే, లేక దక్షిణ తెలంగాణకు మాత్రమే సంబంధించిన చాలా చిన్న ప్రశ్న కావచ్చు, ఆ నాటి ఉద్యమ క్రియాశీల నాయకత్వానికి ఆ నాటి స్థాయిలో పని చేయవలసిన ప్రధాన ఎజెండా కూడా కాకపోవచ్చును. నీరు వస్తే చాలు ఎంతో కొంత అనుకునే వారికి కృష్ణానదీ జలాల పంపీణీ, పున:పంపిణీ అంత అవసరం అనిపించకపోవచ్చును. ఈ మూడు దశాబ్దాల కాలపు రెండవ దశాబ్దంలో చిన్నా చితక లిప్టు పథకాలు చేపట్టిన తెలంగాణ ప్రతిపక్ష పాలక వర్గానికి ఇది అంత అత్యవసరమైన ప్రశ్న అనిపించకపోవచ్చును. వారిని అధికారం కోల్పోయిన నీరసం అవహించి ఉండవచ్చును. గుంపులో గొంతు కలిపే ఇతర ప్రతిపక్షాలు గుంపు కనిపి స్తే గొంతు విప్పి మరికొంత మౌనంలో తలమునకలవుతుండవచ్చును. ఇంక అధికారం చేపట్టిన వారికి వారి కోరిక తీరింది. రైతులతో, బీడు భూములతో, గత చరిత్ర ఒడిపిన నెత్తురుతో వారు బంధమే తెంచుకుని కొత్త అవతారమెత్తారు. అయినా తెలంగాణకు కృష్ణా నదిలో నీటి వాటా పంచలేదు అనే ప్రశ్న మాసి పోగలదా? రాష్ట్రం వస్తే నీళ్ళు వస్తాయనుకుంటిమి గదా. రాష్ట్రం లేనందుకే నీళ్ళు పంచలేదు అని చెప్పిరి గదా. ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులన్నీ నీటి తరలింపుకు అనువుగా దిగువన కట్టిరి గదా. ఇంక తెలంగాణకు నీళ్ళు ఉంటాయా? జస్టిస్‌ బచావత్‌, జస్టిస్‌ బ్రిజేశ్‌ కూడా పంచిన నీరు ఆంధ్రప్రదేశ్‌ పేరు మీద ప్రాజెక్టుల వారీగానే కదా. తెలంగాణ పేరు మీద పంచలేదు కదా. ఎవరికి పట్టినా పట్టకపోయినా ఇది తెలంగాణ సమస్య. దక్షిణ తెలంగాణ సమస్య, మరింత స్పష్టంగా చెప్పాలంటే రెండు కోట్ల ప్రజల సమస్య తగ్గించి చెవితే మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు నల్లగొండ జిల్లా ఎగువ ప్రాంతానికి చెందిన తీవ్ర సమస్య.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తీవ్ర సమస్యను టీ బిస్కెట్ల సమావేశాలలో ముచ్చటించే స్థాయికి కుదించింది. ప్రజలకు నిజాలు చెబుతూ కేంద్రం మీద వత్తిడి పెంచలేదు. పైగా సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలను దూకుడుగా అమలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి తెలంగాణ ఉద్యమ అకాంక్షల ఎజెండాను వదిలేసింది. నీటి కొరత, తీవ్ర పోటీ ఉన్న కృష్ణానదీ జలసాధన అత్యవసరతను, వినియోగంలోకి తేగల అవకాశాలను, అవసూలను వదిలేసింది. ఎంతగా వదిలేసిందంటే అలంపురం నుండి అయిజ  దాకా పాదయాత్ర చేసి అశేషంగా యాత్రలో కదిలిన ప్రజల ముందు కుర్చీ వేసుకు కూర్చుని ఆర్జీఎస్‌ అనకట్టను సుంకేశులలాగా బాగు చేసి లక్షల ఎకరాలు పారిస్తానని చెప్పిన మాట వదిలేసింది. కాంగ్రెస్‌ 2012 నాటికి చేసిన పనులు పూర్తిచేసి కల్వకుర్తి, నెట్టెంపాడు, ఖీమాఫేజ్‌ 1, భీమా ఫేజ్‌ 2, కోయిల్‌సాగర్‌ పథకాలను 35 రోజులలో నీరు తీసుకునే లాగా పూర్తి చేసి ఆ సాగర్‌ కాలువల కింది లాగా పొలాలకి నీరు అందిస్తానన్నమాట వదిలేసింది. జూరాల పునరుజ్జీవనం, గట్టు ఎత్తిపోతల, అమ్రాబాద్‌ ఎత్తిపోతల చేపట్టి కరువు గట్టును గట్టెక్కిస్తానని, చెంచుల తలరాత మారుస్తానని చెప్పిన మాట వదిలేసింది. ఈ అన్నింటిని మించి ప్రజల నోటి మీద కథలాగా ప్రచారంలో ఉండిన పాలమూరు రంగారెడ్డి పథకాన్ని తక్షణం చేపడతామని చెప్పి, రీ-డిజైన్‌ల పేరుతో చేయగలిగినంత నష్టం చేసి, అ పథకంలో చివరిది అత్యంత కీలకమైనదీ అయిన లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్‌ నిర్మాణం మాటే వదిలేసింది. 2018 ఎన్నికలలో మరోసారి ప్రజలముందు ఇచ్చిన హామీని రివర్స్‌ చేసింది. ఒక్కపంపు ప్రారంభించి అంతా పచ్చగయినట్టు తెలంగాణ అంతటా తెగబడి ‘పచారాలు చేసుకుంది. నిజానికి ఈ పదేండ్లుగా అనువుగా వానలు కురవటం వల్ల, 2012లో ప్రారంభించిన పథకాల పంపుల నీరు కాలువల్లో పారి పాత చెరువులు నింపినందు వల్ల, రైతులు అ కాలువల నుండి, చెరువుల నుండి సొంత పైపులు, మోటార్లతో నీరు తరలించుకుని సేద్యం చేసుకోవటం వల్ల ప్రభుత్వం దూకుడుగా ప్రచారం చేసుకున్న అబద్దాలకు కాలం కలసి వచ్చింది కానీ వాస్తవం వేరే వుంది. తెలంగాణ నీటి వాటా తేలి ఆ నీరు పున : పంపిణీ జరిగితే తప్ప అనుభవం మారదు. అప్పుడు గానీ రంగారెడ్డి జిల్లాకు నీటి మార్గం దొరకదు.

తెలంగాణకు హక్కుగా నీరు సాధించవలసిన ప్రభుత్వం రెండవసారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాయలసీమకు వెళ్లి బేసిన్‌లు లేవు, భేషజాలు లేవు అని చెప్పింది. మహారాష్ట్రకు వెళ్ళి గోదావరి నీళ్ళు లిఫ్టు పెట్టి తోడుకు పొమ్మని చెప్పింది. నేను తప్ప తెలంగాణకు దిక్కులేదని, నేను ఏం చేసినా చెల్లుతుందని ప్రభుత్వం ఒంటెత్తు పోకడలు పోయింది. ఈ రాజకీయ దివాళాకోరు తనం అటు ఆంధ్రకు పైన కేంద్రానికి కలిసి వచ్చింది. ఈ రెండు రాష్ట్రాలు నీటి వినియోగానికి ఒక అవగాహనకు రావచ్చు. వచ్చి ఇలా కేంద్రాన్ని ఒప్పించవచ్చు. 1. కేంద్రం నీటి పంపిణీ న్యాయంగా పూర్తి చేయాలి. 2. రెండు రాష్ట్రాలు చేపట్టే నీటి సేకరణ పథకాలను కేంద్రం ఆమోదించాలి. 3. కరువు కాలంలో అందుబాటులో ఉండే నీటిని రెండు ప్రాంతాలకు న్యాయంగా నీరు అందించే వ్యవస్థలు ఏర్పరచాలి. ఓ కేంద్రం రాష్ట్రాలు సమన్వయంతో రైతులకు నిజాలు చెబుతూ జలవిద్వేషాలు ఘర్షణలు రెచ్చగొట్టకుండా చూడాలి. 5. ఆయా రాష్ట్రాలు తమకు అందుబాటులోకి వచ్చే నీటితో సమగ్రజల విధానం రూపొందించి భూములు పంటలు కాపాడే విధంగా అమలు చేయాలి. ఇలాంటి ప్రజాను కూల ఆలోచనలతో కాకుండా ఎవరి ప్రాంతాలకి వాళ్ళే జెట్టీలు అన్నట్టు కొంతకాలం, వైరుధ్యమే లేదని పూసుకు తిరుగుతూ కొంత కాలం గడిపారు తప్పితే ఈ రెండు రాష్ట్రాలలో జల సాధన చర్చకు బాధ్యత పడలేక పోయారు.

కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టగలినన్ని తంపులు పెట్టింది. తాను రాష్ట్ర విభజన చట్టాన్ని పరిశీలించి చంద్రబాబునాయుడు కోరినట్టుగా, వెంకయ్య నాయుడు సూచించినట్టుగా అధికారం చేపట్టిన వెంటనే తెలంగాణ భౌగోళిక ప్రాంతాన్ని కుదిస్తూ ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ పార్లమెంటులో విభజన చట్టంలో సవరణలు చేసింది. పోలవరాన్ని జాతీయ పథకంగా చేపట్టటానికి, పూర్తి చేయటానికి, తెలంగాణలో ముంపు అనే సమస్య పరిష్కారానికి ఏడు గ్రామాలు అవసరమయితే ఏడుమండలాలే ఇచ్చేసింది. మరి తెలంగాణకు నీళ్ళు పంచాలి కదా. విభజన చట్టంలో అందుకు ఉన్న అడ్డంకులను పరిశీలించాలి కదా. అవసరమైన న్యాయమైన చర్యలు చేపట్టాలి కదా అనుకోలేదు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాలలో పూర్వ రాష్ట్రంలో తెలంగాణలో పారుతాయని అంచనా ఉన్న నీటికే ఒప్పుకోమని తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించింది. తరువాత ఒప్పుకున్నారు కదా అని దబాయించింది. కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో లోపాయికారి ఒప్పందం, ఏదైనా తెలంగాణ నష్టపోయింది. నీళ్ళు నష్టపోయింది. కాలం నష్టపోయింది.

ఇంత మాత్రమే కాదు కేంద్రం మరో తప్పుడు విధానంతో ముందుకు వచ్చింది. అది నదుల అను సంధానం. కేంద్రంలో ఏర్పడుతున్న ఏ ప్రభుత్వాలైనా పర్యావరణ పరంగా, భూ భౌతిక పరిస్థితుల పరంగా వచ్చే నష్టాలను విపత్తులను పక్కకు నెట్టి మాటి మాటికి నదుల అనుసంధానం మాటెత్తుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో  ఎగువన రైతాంగం నీటికి అలమటిస్తుండగా గోదావరి, కృష్ణ కావేరి అనుసంధానాన్ని దిగువన ప్రతిపాదిస్తు, అడవులు, భూములు, ప్రజలు ఏమయినా కానీ నదుల అనుసంధానం జరిగితీరాలంటున్నాయి. తెలంగాణలో వచ్చిన ప్రజాగ్రహం దీన్ని కొంత నిలువరించింది. ఇది తొలగిపోని   ముప్పు. ప్రజలే దీన్ని ఆపాలి. కేంద్రంలో జలమంత్రిత్వ శాఖ ఉంది గనుక అది చలనంలో ఉండాలి గనుక ఇలాంటి పనులతో గడిపింది. ఇంతకు మీంచి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నదులమీదికి, వాటి మీది నిర్మాణాల మీదికి ఒక గజెట్‌ ద్వారా తన అధికారాన్ని ప్రయోగించింది. జల విభజన అడిగేవాళ్ళు కేంద్ర గజెట్‌ రద్దు కోసం పోరాడవలసిన అవసరం ముందుకు తెచ్చింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి ఫెడరల్‌ స్పూర్తికి వ్యతిరేకమైన ఈ గజెట్‌ రద్దుకు పోరాడ లేకపోయాయి. ఎవరి బలహీనతలు లొంగుబాట్లు వారి కుండి ఆ గజెట్‌ రెండు రాష్ట్రాల ప్రజల స్వీయ గౌరవం మీద కత్తిలా వేలాడుతున్నది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నీళ్లు కావాలి కానీ, నీటి పంపిణీ అవసరం లేదు. మిగులు నీళ్ళు వాడుకుంటూ ఎగువ రాష్ట్రాలను ఒక ఆట అడుకున్న రాష్ట్రం అది. డెల్దాకు మాత్రమే నీరు సహజ హక్కుని ఒక వాదనను స్థిరపరిచే కృషి చేసిన పాలకవర్గమది. ఇటీవల రాయలసీమ ప్రశ్నలవల్ల గోదావరి నీరు కృష్ణా డెల్టాకు తరలించే ఎత్తులు వేస్తూ, పనులు చేసుకున్నది కానీ సారాంశంలో నీటి పంపిణీని వ్యతిరేకించే వర్గమది. ఇది రాయలసీమకైనా తెలంగాణకైనా దశాబ్దాల అనుభవం. కర్ణాటక, మహారాష్ట్రలకు హక్కుదారులం మేమేననే భావన ఉంది. ఇప్పుడు విడిపోయింది ఆంధ్రప్రదేశ్‌ కనుక ఆ నీళ్ళనే పంచుకోమనీ, 2013 బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ తీర్చు అమలు పై స్టే తొలిగించి అమలు చేయమనీ వారి వాదన. పైవాళ్ళు అంగీకరించరు. కింది వాళ్ళూ అంగీకరించరు. మధ్యనున్న తెలంగాణకు నీరు పంచటానికి చట్టంలోనే అద్దుకులున్నాయని బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ తప్పించుకుంటున్నది. ఈ మెలికలు, క్షిష్టతలు తొలిగించి నూతనంగా ఏర్పరచిన రాష్ట్రానికి నీరు పంచవలసిన బాధ్యత కేంద్రానిది. కాగా కేంద్రం తన అధికారం శాశ్వతం చేసుకునే క్రీడలో రాష్ట్రాలను బలహీనపరుస్తున్నది. లోబరుచుకుంటున్నది తప్ప రాష్ట్ర ప్రజలకు తక్షణంగా చేయవలసింది ఏమిటో చేయటం” లేదు. ఈ అన్ని సందర్భాలను చర్చకు తేవడంలో, లోపాలు పదే పదే ఎత్తి చూపడంలో, అన్యాయం నశించాలనే ఆందోళనలలోనే తొమ్మిదేండ్లు గడిచాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పరచిన విభజన చట్టంలోని 9వ, విబాగంలో 84 నుండి 91 దాకా సెక్షన్లు జలవనరుల పంపిణీకై తీసుకోవలసిన చర్యలను సూచించాయి. 84 అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు, నీటి నిర్వహణ బోర్జులు ఏర్పరచటం, 85 ఏర్పరచిన బోర్డులకు విధి విధానాలు రూపొందించటం, 86 సిబ్బంది నియామకం. 87 నీటి నిర్వహణ బోర్డుల పరిధి, 88 బోర్డుల అధికారాలు, 89 నీటి వనరుల పంపిణీ, 90 పోలవరం జాతీయ ప్రాజెక్టుగా చేపట్టటం, 91 తుంగభద్ర బోర్డులో చేయవలసిన ఏర్పాట్లు. నీరు పంచవలసిన 89 ని మినహాయించి మిగతా అన్ని సెక్షన్లను అమలుపరచటానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సెక్షన్‌ 87 అమలులో తన అధికార దాహం చాటుకుంది. బోర్డుల పరిధి నిర్ణయించటంలో నదులను, వాటి మీది బ్యారేజీలను, కాలువలను తన పరిధిలోకి తీసుకుంది. పారిశ్రామిక భద్రతా దళాలను ప్రయోగిస్తానంది. ఈ చర్యకు డ్యాముల సేఫ్టీ బిల్లును  కూడా తోడు తీసుకు వచ్చింది. కేంద్రం మిథ్య అనే దగ్గరి నుంచి రాష్ట్రాలను మిథ్య చేసే విఘాత చర్య ఇది. దీన్ని తెలంగాణ సమాజం, సంఘాలు వ్యతిరేకించిన స్థాయిలో కూడా అధికారం రుచి, నీటి రుచి లోతుగా తెలిసిన ఆంధ్రప్రదేశ్‌ సమాజం కానీ, పాలక వర్గం కానీ పట్టించుకోలేదు. ఏ అధికారం ఏమయితేనేమిటి కాళేశ్వరం చల్లగుంటే చాలును అనే ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించింది. 15 జూలై 2021న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎస్‌.ఓ. 2845 (ఇ) నెంబరు గజెట్‌ నోటిఫికేషన్‌ రద్దు చేయించుకోక పోతే తెలంగాణ అధికారం కృష్ణా గోదావరి నదులమీద, వాటి నిర్మాణాలు కాలువల మీద ఉండదు గాక ఉండదు. ఇది రాష్ట్రాల సార్వఫౌమాధికారానికి తీవ్ర విఘాతం.

మళ్ళీ 89 సెక్షన్‌ గురించి మాట్లాడుకుంటే ఈ సెక్షన్‌లో వివరణలుగా ఎ, వి అంశాలు చేర్చారు. మొత్తంగా నీటి పంపిణీకి సంబంధించి విభజన చట్టం వల్ల ముందుకు వస్తున్న సమస్యలపై బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ అక్టోబర్‌ 2016లో తాను పరిశీలిస్తున్న కొన్ని సంక్షిష్టలను ముందుకు తెచ్చింది. అవి. 1. విభజన చట్టంలో 89 సెక్షన్‌లో నాలుగు రాష్ట్రాల మధ్య నీరు పంచాలని చెప్పలేదు. 2. ఆ సెక్షన్‌లో తెలంగాణ అనే మాటే లేదు. 3. గత ట్రిబ్యునళ్లు ఏ ప్రాజెక్టులకు నీరు కేటాయించాయో ఆ ప్రాజెక్టులకు మాత్రమే నీటి కేటాయింపుల ప్రస్తావనవుంది. 4. బేసిన్‌ అవతల చారిత్రక కారణాల వల్ల నీటి వినియోగం సరైనదే అంది. అందువల్ల బేసిన్‌ బయట రాయలసీమకు ఆ హక్కు వుంది. 5. విభజన తరువాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు పూర్వ రాష్ట్రానికి కేటాయించిన నీటిని అంతకు ఎక్కువ తక్కువలు లేకుండా అంత నీరు వాడుకోవాలి. 6. నీటి అన్యాయం కారణంగా రాష్ట్రం ఏర్పడిందన్న తెలంగాణ వాదన సరికాదు. కోర్టులో తెలంగాణ ఈ వాదన చేసింది కానీ పునర్వవస్థీకరణ విల్లు లక్ష్యాలు, కారణాలు అని చేసిన ప్రకటనలో ఈ కారణం లేదు. 7 . తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్యయుతమైన, రాజకీయపరమైన ఆశలను, ఆశయాలను నెరవేర్చడానికే పూర్వ రాష్ట్రాన్ని విభజించారు కాని నదీ జలాల అసమానతల కారణంగా కాదు. ఇలాంటి అనేక విషయాలను లోతుగా చూసిన బ్రిబ్యూనల్‌ నూతన తెలంగాణ పట్ల కనీసం కనికరంతో కూడా పరిశీలించలేదు. ఎందువల్ల ఈ మాట అనవలసి వస్తున్నదంటే బేసిన్‌ బయట రాయలసీమకు చారిత్రక కారణాలు వర్తించినపుడు 89లోని ఎ లో ప్రస్తావించిన చారిత్రక కారణాలను – బేసిన్‌ లోపల తెలంగాణకు చారిత్రక కారణలవల్ల జరిగిన నష్టాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడటం వల్ల జరిగిన నష్టాన్ని ఫజుల్‌అలీ కమీషన్‌ ముందు తెలంగాణ చేసిన వాదనల్ని రైతుల దుర్మరణాల్ని మహబూబ్‌నగర్‌ వలసల్ని ఎంతగా కోర్టు వాదనలో చర్చించినా- ట్రిబ్యునల్‌ పరిశీలించలేక పోయింది. ఉత్త సాంకేతిక కారణాలను గుర్తించింది. 2013 నాటికి తీర్పు వెలువరించిన తరువాత ఈ పదేండ్ల కృషిలో 2వ, ట్రిబ్యునల్‌ పై విషయాలు గుర్తించింది. 15 జూలై 2021 నాటి గజెట్‌ రద్దుకు జరుగుతున్న జనాందోళనలలో ఈ విషయాలన్నీ చర్చకు వస్తున్నా తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రశాంతంగా ఉంది. అధికారం దక్కింది చాలుననుకున్నదేమో.

ఎందువల్లనంటే ఈ తొమ్మిది ఏండ్లుగా రీడిజైన్‌ల అనర్థాల మీద, గత ప్రాజెక్టులు పూర్తి చేయవలసిన అవసరం మీద, నీటి సాధన కోసం నిరంతరం పోరాడవలసి వచ్చింది. కరోనా కాలంలో సైతం అనేక వెబినార్లు జరపవలసి వచ్చింది. అయినా జలవనరుల పంపిణీ పక్కకు నెట్టేశారు. ఎన్నికలు తోసుకు వస్తుండటంతో, కృష్ణ నీటి పంపిణీయే దక్షిణ తెలంగాణలో ఓట్లడగటానికి కీలకం కావటంతో, రెండుసార్లు తెలంగాణకు ప్రధానమంత్రి వచ్చి వెళ్ళిన తరువాత తెలంగాణ సమాజం నీటి పంపిణీకి చేస్తున్న అందోళన ఆయనకు తాకిన తరువాత, అనివార్యమై పోయి కృష్ణానది నీళ్ళ పంపిణీకి చర్యలు ప్రారంభిస్తున్నట్టు రెండు రాష్ట్రాలతో సంప్రదించి విధివిధానాలు రూపొందించి గజెట్‌ విడుదల చేయనున్నట్టు కేంద్ర కేబినెట్‌ సమావేశం ప్రకటించింది. 2018లో డిటిఎఫ్‌ సావనీర్‌లో రాసిన వ్యాసంలో ఎప్పటికైనా కృష్ణానదీ జలాల పున:పంపిణీ అనివార్యం” అని చేసిన విశ్లేషణకు ఒక ముందడుగు పడింది. తప్పకుండా ఇది ప్రజాందోళనల ఫలితం. పూర్వ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విభజింపబడింది కానీ, ఈ రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరగలేదని కేంద్రం ప్రకటించినట్లైంది. ప్రాజెక్టులు తన చేతిలోనే ఉన్నా కూడా తెలంగాణకు హక్కుగా ఇవ్వటానికి నీళ్ళులేవని గుర్తించనట్లయింది  

నీళ్ళు పంచక తప్పని పరిస్థితిని తెలంగాణ సమాజం కల్పించిందని చెప్పకుండానే చే ప్పినట్టయింది. ఈ ప్రకటన దశకు కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించటానికి అంతగా వత్తిడి తేవటానికి] పాలమూరు అధ్యయన వేదిక చేయగల కృషి నిరంతరం చేసింది. పార్టీలను, ప్రజా సంఘాలను, ప్రజాస్వామిక వాదులను ఈ కృషిలో భాగం చేసింది. ఈ అందరితో కలిసి పని చేసింది. ఎట్టకేలకు పంపిణీ ప్రకటన సాధించగలిగినా పంపిణీ సాధించవలసే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్చరుస్తాం అని అనేక ప్రకటనలు ఖిన్న స్థాయిలలో వెలువడిన తరువాత ఎన్నెన్ని మలుపులలో నిలిచి పోరాడ వలసి వచ్చిందో గుర్తు చేసుకుంటే

జలసాధన కోసం కూడా పరిమితులులేని కృషి జరగవలసి ఉంది. ఈ ప్రకటనను తెలంగాణ సమాజం స్వాగతించగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భిన్నంగా స్పందించింది. రాయలసీమ తెలంగాణకు న్యాయంగా నీళ్ళు పంచినా, ప్రాజెక్టులవారీగా నీళ్ళు పంచినా తనకు అన్యాయం జరిగిపోతుందని స్పందించింది. సరిగ్గా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన సందర్భాన్ని అడ్డుకోవటానికే కాలం గడిసినట్లుగా అసలు నీటి పంపిణీ జరగటమే తప్పని వాదన ముందుకు తెస్తోంది. ఈ పరిస్థితిని రెండు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగానే ఆలోచించాలి. నీటి విభజన జరగాలని ఆలోచించాలి. ఎట్లా జరగాలో ఆలోచించాలి. అందుకు అవసరమైన ప్రాతిపదికలను రూపొందించాలి. ఇవాళ కాకపోతే రేపైనా నీరు పంచాల్సిందే. విభజన చట్టంలో నీటి కారణంగా తెలంగాణ విడిపోయిందని, అందుకే పోరాడిందని ప్రకటించకుండా, పాలకవర్గ రాజకీయ అధికార దాహాన్ని మాత్రమే గుర్తించి ప్రకటించినా కఠినమైన నిజం ఏమిటంటే తెలంగాణ నీటి నష్టాలకు గురైంది. అనేక నష్టాలలో ఇది ప్రధానమైంది. నాలుగు దశాబ్దాలుగా ఇది మా అనుభవం. పోరాడుతున్న రైతాంగ అనుభవం, మా పోరాటం మా వాటా నీటి కోసం కేంద్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వంతో మాత్రమే, రాయలసీమతో కాదు. ఇప్పుడు ఓపికగా నీటి పంపిణీ న్యాయంగా సాధించుకోకపోతే పాలకులు బాగానే ఉంటారు. ఆ వైరుధ్యాలలో ప్రజలు తమ మధ్యలేని వైరుధ్యాలతో పరస్పరం ప్రతికూలంగా ఆలోచిస్తారు. ఇప్పుడున్నతరం పరిష్కరించవలసిన ఈ సమస్య రేపటి తరానికి మిగిలించిన వాళ్ళమవుతాము. అలా కాకూడదని కృషి చేయటం రెండు ప్రాంతాల ప్రజలకు మంచిది. ప్రజల మధ్య వైరుధ్యాలతో చలికాచుకునే పాలకులు తేలిపోతారు. రాష్ట్రాలకు పంచిన నీరు ప్రతి ఎకరా భూమి దాకా పునః:పంపిణీ జరగాలి. పంపిణీ అనివార్యం. అది రెండు రాష్ట్రాలు గుర్తించాలి.

05-10-2023

Leave a Reply