పదరా..పదరా
పదపదపదమని..కదం దొక్కరా
 " ఢిల్లీ కోటకు వొణుకు పుట్టగా
ప్రపంచమంతా నివ్వెరపోగా "
                  "పదరా"

రైతుబిడ్డ లా నిలువరించెడూ
బారికేడ్లనూ బద్దలు గొట్టగ 
" పొలాలల్లో శ్రమించే చేతులు
నియంత మీదకు పిడికిలెత్తినవి "
                    "పదరా"

సంకెళ్ళేసిన రోడ్ల మీదకు
సర్రున దూసుకు..పదండి,పదండి
" మన కడుపులకూ సంకెళ్ళేసిన
 దోపిడి దొంగలు పని బట్టంగ "
                 " పదరా "

గర్జించరా..గర్జించరా.
నియంత మీదకు నిప్పులు జెరగర
 " పొలాల నమ్మే బందిపోట్లకూ
 పొట్టలు గొట్టే విద్య దెలువదా"
                 " పదరా"

పరుగెత్తరా.. పరుగెత్తరా
కోటల మీదా గురి వెట్టరా
" మన బత్కుల చెరను బట్టినా
 నరహంతకుల పనిబట్టరా "
                " పదరా"

లాగెయ్యరా.. లాగెయ్యరా
ఇనుప కంచెలను ఈడ్చివేయరా
" స్వర్గ పునాదుల పెకిలించీ
 కొడవళ్ళతో చీల్చి వేయరా "
               "పదరా"

యుద్ధానికి సిద్ధం కండీ
రైతు ఘోషనూ ఎలుగెత్తండీ
 " పిడికిళ్ళే మన ఆయుధాలుగా
ఫెళ ఫెళ విరుచుకు పడండి"
                "పదరా"

పాలకులారా..వినబడలేదా..
ప్రజా సైనికుల కవాతు చప్పుడు
" అదుగో,అదుగో.. వినండి, వినండి
 నియంత కోటలు పగుళ్ళుబారెను "

Leave a Reply