మనసు లేని ధర్మం 
ప్రేమ లేని ధర్మం 
దయ లేని ధర్మం 
ఆలోచన లేని ధర్మం 
తడి తెలియని ధర్మం 
ద్వేషం ప్రాణమై
హింసే చరిత్త్రెన ధర్మం 

నీ బ్రహ్మ 
నీ విష్ణు 
నీ మహేశ్వరుడు 
మాభుజాల మీద 
మిమ్మల్ని కూర్చోబెట్టి 
ఒక నిచ్చెనమెట్ల స్వర్గాన్ని 
మీ కిచ్చారు

ప్రియమైన హిందూ తాలిబన్లారా! 
నీ సనాతనం ఉన్నతమైతే 
మోసీమోసీ 
అలిసిపోయాం 
కాడి మార్చుకుందాం రండి ! 

మా పియ్యి ఉచ్చ మీ రెత్తిపోయండి 
పశువుల కళేబరాలు మోసుకెళ్ళి 
చర్మం ఒలిచి 
చచ్చిన గొడ్డు కూర తినండి 
మా చెప్పులు మీరు కుట్టండి 

మా లాగా 
కూటికి లేక కుమ్ముకు లేక 
బరిబద్ధ బొక్కలెల్లి 
అప్పుడా?ఇప్పుడా? అన్నట్టు 
కప్పుల్లేని గుడిసెలల్లా!చెట్లకింద 
పెంటకుప్పలల్లా! మురుగు కాల్వల మీద 
ఈగలల్లా దోమలల్లా పీతులల్లా 
అంటరాని వాళ్ళలా 
మీ నీడ సోకితే 
ముట్టుడైయ్యే బతుకు 
ముక్కు ముడ్సుకునే బతుకు 
వేల ఏండ్లు బతుకండ్రి! 

మీ మూతికి ముంత గట్టి 
మీ ముడ్డికి తాటి కమ్మకట్టి 
మీ చెవ్వులల్లో సీసం పోస్తాం 
చదువు సంధ్యల్లేక 
ఒంటి మీద చిరుగు పేలికల్లేక 
మా లానే 
వేల ఏండ్లు తిరుగండ్రి 

అప్పుడు మీ సనాతన ధర్మాన్ని 
చేతులకు తీస్కుంటాం 

మా కడుపు తీపిని నరికేసినట్టు గానే  
మీ అందాల ఆడపిల్లల్ని     
ఉచితపంపిణీసరుకు చేసే దేవదాసీల్ని చేద్దాం 
ఊరి దేవునికి పెళ్ళి చేద్దాం 
జోగినిని చేద్దాం 
మాతమ్మల్ని, బసివినిల్ని చేద్ధాం
వేశ్యల్ని చేసి ఊరేగిద్దాం 
ఒంటి మీద గుడ్డ పీలికల నగ్నత్వం వేల ఏండ్లిద్ధాం!

నీ సనాతన ధర్మం బుర్రూపుతే 
నా మెళ్ళేసుకొని తిరుగుతా!
రారా! భుజం మార్చుకుందాం 
ఈ దరిద్రపు బరువు మోయలేను 

తలలు నరకడం 
నీకు ఖడ్గంతో పెట్టిన విద్యే! 

భీమా-కోరేగావ్ 
యుద్ధ సంకేతం 
నీ గుండెల్లోంచి పొడుచుకొచ్చిన జ్ఞాపకం 
ఈ మధ్యనే కదా!
అంత త్వరగా మరుగవుతుందనుకోలే ! 
ఐదువందల మహర్లు 
వర్సెస్ 
ఇరువై ఎనిమిది వేల పీష్వాలు ! 
ఒక్కడు మిగిలిండా పీష్వా సైనికుడు? 

నా చౌకైన నాబలమైన 
తిండి మీద పడి
మా నెత్తురెందుకు చూస్తున్నావో 
నీ భయం అర్థమౌతోంది   

అయినా
ఒకడు ముఖం లోంచి పుట్టడం 
ఒకడు భుజాల్లోంచి పుట్టడం 
ఒకడు తొడల్లోంచి పుట్టడం 
అసహ్యాంగా లేదు 

సరేసరే 
ఇవ్వాళ మీ వారసులు 
మమ్మల్ని చంప మంటున్న వాళ్ళు
మమ్మల్ని నరకమంటున్న వాళ్ళు
మా స్త్రీల మానభంగాలు చేస్తున్న వాళ్ళు 
ఇంకా
ముఖాల్లోంచి భుజాల్లోంచి తొడల్లోంచేల్లోంచే పుడ్తున్నారా? 
యోనుల్లోంచి కాదా!

మా ఒంట్లో నెత్తురు ప్రవహిస్తే 
మీ ఒంట్లో ఉచ్చ ఉర్రూతలూగుతోందా? 
మేమ్ బువ్వతింటే 
మీరేం తింటున్నారు? 
ఏంటి మీ ప్రత్యేకత? 
మారణాయుధాల ఊరేగింపేనా? 

భయపెట్టి బతకడం 
మీ రహస్యం! 
భయంతో నిరంతరయుద్ధం 
మా రహస్యం!

మీకు తెలుగే రానట్టు 
అనువాదం అసాధ్యమైనట్టు
మాకు అర్థంకాని భాషలో  
మంత్రాలు చదివింది
చాలుచాలు 

మంత్రాలకు చింతకాయలు రాలవు 
లేకుంటే 
చైనా పాకిస్తాన్ 
ఏదేశం మిగిలేది మీమంత్రాల ముందు

ఇక వశపడ్తలేదు 
రారా!నా అణిచివేతను 
నువ్వు మోద్ధువురా! 
అప్పుడు 
నీసనాతన ధర్మాన్ని 
నా భుజం మీదెత్తుకు తిరుగుతాను 

మాటకు 
మాట రావాలి 
రాతకు 
రాత రావాలి 
మాటకు రాతకు 
కత్తులు తుపాకు లొస్తే 
సనాతన ధర్మం బలమెక్కడో  అర్థమవుతోంది 

కులమై 
మతమై
మనుషుల్ని విడదీస్తున్న దెవరు? 
అమానవీయతను పెంచుతున్నదెవరు? 
నెత్తుటి కల్లాపీ చల్లుతున్న దెవరు? 
వర్ణాశ్రమంటావో 
సనాతనమంటావో
మనుధర్మ మంటావో 
గీతా ఘోషంటావో 
మా ఇంటి కొస్తె 
నాకేమిస్తావ్ 
మీ ఇంటి కొస్తే 
నాకేమిస్తావ్ 
చెమట చుక్క రాలని తాత్త్వికత 

సనాతనధర్మం 
దళిత బహుజన శ్రమ దోపిడి సిద్ధాంతం! 
కులధర్మ పునరుద్ధరణ! 
సోదరభావాన్ని చంపుతున్న మతపాతర!
ఒక అసమానత 
ఒక వివక్ష 
ఒక అణిచివేత 

బట్ట కప్పుకున్నందుకు 
సనాతన ధర్మం పన్నుకోసం పీడిస్తే 
రొమ్ముల్నికోసి 
మీ చేతుల్లో పెట్టిన నంగేలిని మరిచి పోయావా?


కర్మ ఒక అభూత కల్పన 
పునర్జన్మ ఒక సృజనాత్మక మోసం 
సూర్యునిచుట్టూ చంద్రుని చుట్టూ 
రాహువుకేతువు మసిపూసి  
మూఢనమ్మకాలకు జేజేలు పలికింది 
మా ఆలోచనకు 
అజ్ఞానపు తాళం వేసింది 

ఆవులకు కుక్కలకు పాములకు విలువనిచ్చి 
దళిత బహుజనుల  
హీన జంతువుల్ని చేసింది 

ఒక్కనికే 
వేలమంది పెళ్ళాల్ని చేసి 
ఆటబొమ్మగా అంగడిబొమ్మగా 
ఒక విలాస వస్తువుగా
ఆకాశంలో సగాన్ని 
పురుషాధిపత్యానికి అలుసు చేసింది 

మీస్త్రీ మాస్త్రీ అంటాన కాని 
ఏ స్త్రీ అయినా 
మీకు శుద్రురాలే కదా!

ఆమె విలువ కు గోరికట్టి 
సతీసహగమనాల సంరంభం చేసిందే ధర్మం?
ఆడపిల్లల్ని గంగలో ముంచి చంపిందే ధర్మం?
నవ వధువు మూడురాత్రుల నరకం చూపిందే ధర్మం?
సమన్యాయం చంపిందే ధర్మం? 
మా అక్షరాల్ని తరతరాలుగా నిషేధించిందే ధర్మం?

చెమట చుక్కరాల్చని సనాతనం 
మీతో సమానంగా కూర్చోకుండా 
నా శ్రమసంపదలు లాక్కొని 
నన్ను బానిసను చేసి 
మీ భవంతుల పునాదుల్లో 
నన్ను నరబలి చేసిందే ధర్మం ?

ఇప్పటి నుండి  
వేల ఏండ్లు ఇవి నువ్వనుభవిస్తానంటే 
నా ఛండాలపు పనులన్నీ చేస్తానంటే
ఇప్పుడే ఈ క్షణమే 
నా పనులు నీకు 
నీ పనులు నాకు  
రారా!బాధ్యతలు విలువలు మార్చుకొని
కల్సి నెత్తినెత్తుకొని 
సనాతనాన్ని సంభరంగా ఊరేగిద్ధాం!

ఇవ్వాళ్టికివ్వాళ 
సనాతన ధర్మ నాయకుడే
నా కూడు గురించి ఆలోచించక
నాగూడు గురించి ఆలోచించక 
నా గుడ్డగురించి ఆలోచించక 
నా బొక్కలు మెళ్ళేసుకొని 
నా కడుపును డప్పుకొట్టుకుంటూ 
తిరుగుతున్న 
నా ఆకలి బొగ్గుముఖం దేవతచుట్టూ 
గోడలు కడ్తున్నాడు 
పరదాలు చుడ్తున్నాడు 
ఇంకా నేననుభవిస్తున్న 
సనాతనధర్మ చలువ నేం చెప్పాలి? 

నీ సకల స్వర్గ సౌఖ్యాల
సనాతనధర్మం 
నీకు గొప్పే
నాకు 
నేను నడుస్తున్న 
నా చావు ఊరేగింపు!

నాముత్తాత తాత తండ్రులు 
అవ్వేడువంగ బిడ్డెడ్సినట్టు నడ్సింది చాలు 
ఇప్పుడు 
మీకెదురీదకుంటే 
నేనెప్పటికీ బానిసనే! 


మీ సనాతన ధర్మ కొయ్యకర్రకు 
మీ దొడ్లో గొడ్డును కట్టేసినట్టు కట్టేసింది చాలు!

ఇక తప్పదు 
"దోమలు డెంగ్యూ మలేరియా లేదా 
కరోనా వైరస్ నిర్మూలించిన్నట్టు 
సనాతనధర్మం నిర్మూలించాలి"కదా!

(I STAND WITH UDAYANIDHI)

One thought on “తలుగు తెంపుకున్నా!

Leave a Reply