ఆదిలాబాదు విప్లవానికి కన్నతల్లి’ అని ప్రముఖ విప్లవ కవి ఎన్‌కె అంటారు.
‘విప్లవానికి సింగరేణి ఊట చెలిమ’ అని ‘తల్లులు బిడ్డలు’ అనే ఈ నవలలో పాత్రగా కనిపించే నల్లా ఆదిరెడ్డి అంటాడు.
మొదటిది కవితాత్మక వ్యాఖ్య. రెండోది విప్లవోద్యమ అనుభవం. అదే ఒక సూత్రీకరణ అయింది. అదే ఈ నవల నిరూపించే సత్యం.

సింగరేణి ప్రాంతంలోని బెల్లంపల్లి కేంద్రంగా హుస్సేన్‌ రాసిన ‘తల్లులు బిడ్డలు’ నవల నడుస్తుంది. అక్కడి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అంతా విస్తరించి, ఇటు తెలంగాణలోని మిగతా జిల్లాల్లోకి, అటు ఆదివాసీ ప్రాంతంలోకి ఇందులోని కథా స్థలం చేరుకుంటుంది. పైకి చూడ్డానికి గజ్జల లక్ష్మమ్మ కేంద్రంగా రచన సాగినట్లనిపిస్తుంది. కానీ కొన్ని డజన్ల పాత్రల ఉద్వేగ సంబంధాల మధ్య నవల నిర్మాణమవుతుంది. సింగరేణిలోని వందల, వేల కార్మిక జన సందోహాన్నంతా తనలోంచి చూపిస్తుంది. విప్లవోద్యమ చరిత్రలోని నిజ మానవులే పాత్రధారులైనందు వల్ల జీవితంలోని అపార వైవిధ్యాన్నంతా ఈ నవల సొంతం చేసుకున్నది. అనేక మందికి ప్రాతినిధ్యం వహించే కాల్పనిక పాత్రలు సాహిత్యంలో ఉండాలనే నియమాన్ని ధిక్కరించి ఒక గొప్ప పఠన అనుభవాన్ని ఈ నవల అందిస్తుంది. 1970లలో ఆరంభమైన నవలా కాలం వర్తమానంలో కూడా నిర్మాణమవుతున్న చరిత్రగా మారి మన మధ్య నుంచే నడిచిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది. అందువల్ల ఈ రచన గత అనుభవాల, జ్ఞాపకాల తలపోతలా కాకుండా ఇవ్వాల్టి పోరాట గాథలా మనకు చారిత్రక అనుభవాన్ని ఇస్తుంది. సారాంశంలో మనందరి స్థలకాలాల ఉద్వేగాలను, అనుభవాలను, మనం నిర్మిస్తున్న చరిత్రలోని వెలుగు నీడలను, జయాపజయాలను, మారుతున్న కాలంలోంచి భవిష్యత్‌ కోసం చేస్తున్న సన్నాహాలనూ చిత్రిస్తుంది. ఆ రకంగా ఈ రచనకు ఉప శీర్షికలో ఉండే ‘స్మృతులు’ అనే మాటలో ఉండే గతం అనే భావన ‘చారిత్రాత్మకత’లో కరిగిపోయి ‘నిరంతర ధార’గా మన అనుభవంలోకి వస్తుంది.

కా. హుస్సేన్‌ గతంలో పాటలు, కథలు రాశారు. గత నలభై ఏళ్లలో నెత్తురు చిత్తడిలోంచే భారత కార్మికోద్యమంలో మహాద్భుత విజయాలను ఎత్తిపట్టిన సింగరేణి కార్మికోద్యమ చరిత్ర రాశారు. ఇప్పుడు అదే సింగరేణి కార్మికుల రక్తమాంసాల, భావోద్వేగాల, సాహసాల, బలిదానాల అజరామర గాథను నవలగా అందించారు. సింగరేణి కార్మికోద్యమ చరిత్రను అంత విస్తారంగా రాశాక కూడా ఇంకా తాను చెప్పవలసింది మిగిలే ఉన్నదని హుస్సేన్‌కు అనిపించి ఉంటుంది.

నిజంగానే దేనిగురించైనా చరిత్రగా చెప్పాక కూడా మిగిలేవి తప్పక ఉంటాయి. అనుభవంగా, జ్ఞాపకంగా, మానవ చైతన్యంగా, మనుషుల సంబంధంగా చిత్రించవలసినవి ఇంకా ఉంటాయి. హుస్సేన్‌ రాసిన సింగరేణి కార్మికోద్యమ చరిత్రను చదివి ఇప్పడు ఈ ‘తల్లులు బిడ్డలు’ చదివితే కూడా ఈ అభిప్రాయం కలుగుతుంది. సింగరేణి పోరాటంలో భాగమైన వాళ్లకు, అక్కడి నుంచి దేశం నాలుగు చెరగులా అనేక రంగాల్లో విస్తరించి విప్లవోద్యమంలో భాగమైన వాళ్లకు, దానికి సన్నిహితంగా ఉన్న వాళ్లకు కూడా అట్లాగే అనిపిస్తుంది. భావోద్వేగాలను రేకెత్తించే, మానవ అనుభవంలోంచి పోటెత్తే, తిరిగి మానవ అనుభవంలో సంలీనమయ్యే లక్షణం విప్లవానికి ఉంటుంది. అందువల్లే దానికి అంతటి శక్తి. ఒక సైద్ధాంతిక పునాది మీద, రాజకీయ కార్యక్రమం వెలుగులో సాగే శాస్త్రీయ ఆచరణను చరిత్రగా రాసుకున్నా, నివేదికలుగా పొందుపరిచినా, విజయగాథలుగా గానం చేసినా తిరిగి మానవ అనుభవాన్ని తట్టే పని మిగిలే ఉంటుంది.

హుస్సేన్‌ దాన్ని గుర్తించారు. అందుకే ఈ బృహత్‌ నవల రాశారు.

ఈ రచయిత 1972 దాకా సొంత ఊళ్లో వ్యవసాయం చేశారు. ఆ తర్వాత జమ్మికుంట బస్టాండు వద్ద టీస్టాల్‌ నడిపి, ఆ ఊరి కాలేజీ విద్యార్థులతో పరిచయం పెంచుకొని విప్లవ రాజకీయాల్లోకి వచ్చారు. జననాట్యమండలి పాటలు పాడుతూ ఆ చుట్టుపక్కల పల్లెలన్నీ తిరిగారు. 1975లో సింగరేణిలో కార్మికుడిగా చేరి, 1981లో సికాస ఆవిర్భావంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ సంస్థకు నాయకత్వం వహించారు. అప్పటి పీపుల్స్‌వార్‌ ఉత్తర తెలంగాణ కమిటీ సభ్యుడిగా పని చేసి, జార్ఖండ్‌ కార్మికోద్యమంలోకి వెళ్లారు. అరెస్టయి జైలు జీవితం గడిపి బైటికి వచ్చారు.

అందువల్ల ఆయన ఈ చరిత్రకు సాక్షి. ఈ చరిత్ర నిర్మాణంలో భాగస్వామి. ఈ చరిత్రే ఆయనను కూడా నిర్మించింది. ఆయన అనుభవంలో ఈ చరిత్ర భాగం. ఆ రకంగా ఈ పుస్తకంలోని అనుభవం ఆయన ఒక్కడిదే కాదు. వేలాదిమంది అనుభవం. తీవ్ర ఉద్రిక్తతల మధ్య, కల్లోలాల మధ్య కాలం ఒరుసుకుంటూ సాగి గడిరచిన అనుభవం ఇది. అందుకే సాధారణ పాఠకులకు కూడా ఈ వాచకం రచయిత సృష్టి అనిపించదు. కేవలం ఒకానొక రచన అనిపించదు. వేల, లక్షల మంది నిర్మించిన చరిత్రే ఈ రచనగా మారిందని ఎవ్వరికైనా అనిపిస్తుంది. ఏ రచనకైనా స్వీయ అనుభవ కోణం ఉంటుంది. కానీ రచయితలు దాన్ని తమ సొంతంగా భావిస్తే రచన ఒకలాగా ఉంటుంది. అదొక సామూహిక, సామాజిక అనుభవమని అనుకుంటే రచన ఇంకోలాగా ఉంటుంది. తల్లులు బిడ్డలు నవలలో హుస్సేన్‌ తన గురించి ప్రత్యేకంగా చెప్పుకున్న సందర్భాలు ఒకటి రెండు ఉన్నాయి. ఈ 520 పేజీల రచనలో హుస్సేన్‌ నేరుగా కనిపిస్తారు. కానీ స్వీయానుభవ పరిధిని చాలా వరకు అధిగమించారు. దాని వల్ల ఈ నవలకు గొప్ప చారిత్రక గుణం వచ్చింది. ప్రతి వ్యక్తి అనుభవానికి చరిత్రలో చోటు ఉండటం, జీవితానుభవాలలో చరిత్ర అంతర్లీనంగా ఉండటం, చరిత్రను వ్యక్తిగత అనుభవ కోణంలో చూడటం అనేవి పూర్తి వేర్వేరు విషయాలు.

హుస్సేన్‌ తాను చూసి, విని, పాల్గొని చేసిన పనులను కూడా తనవిగానే భావించకపోవడం వల్ల పాఠకులు సామాజిక చరిత్రతో నేరుగా కనెక్ట్‌ అవుతారు. 1971 నుంచి ఉత్తర తెలంగాణలో మొదలైన విప్లవోద్యమానికి ఉన్న విస్తృతిని ఇందులో చూసి సంభ్రమానికి లోనవుతారు. ఇంత విస్తృతిని సాధించిన ఉద్యమం ఆశ్చర్యకరమైన అతి చిన్న ప్రయత్నంగా మొదలైంది. మొదట ఇద్దరు ముగ్గురే పనిలోకి దిగారు. కానీ సరైన వర్గ సమీకరణను ఎంచుకున్నారు. ఒక్కో పుల్లా పుడకా ఏరి గూడు నిర్మించినట్లు ఒక్కో మనిషిని వెతికి పట్టుకొని, వాళ్లందరినీ వర్గపోరాటంలో భాగం చేశారు. అదంతా హుస్సేన్‌ ఈ రచనలోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సింగరేణి బొగ్గు బాయిల్లో, బస్తీల్లో కార్మికులు, వాళ్ల కుటుంబసభ్యులు చేసిన సాహసం, వాళ్ల నిబద్ధత, చైతన్యం, సంసిద్ధత మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ మనుషులకు ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? అనే ప్రశ్న తలెత్తుతుంది. మళ్లీ అంతలోనే సామాన్య మానవులకే ఇవన్నీ సాధ్యం అనే సమాధానం కూడా ఈ నవల ఇస్తుంది.

అందువల్ల ఈ నవల ఆనాటి స్థల కాలాలను అధిగమించింది. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా ఎలా విప్లవోద్యమాన్ని నిర్మించవవచ్చు? ఎలా కొనసాగించవచ్చు? అనే విషయాలను ఫోకస్‌ చేయగల శక్తిని సంతరించుకుంది. నిజానికి ఈ పుస్తకాన్ని ఆనాటి విప్లవోద్యమం గురించి తెలుసుకోడానికి కాదు. ఇప్పుడు ఎలా ప్రజాపోరాటాలు నిర్మించాలి? నిర్వహించాలి? అనే విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే పోగొట్టుకోడానికి చదవాలి. దేనికంటే ఇప్పుడు వివిధ రంగాల్లో పని చేయడానికి తగినంత మంది మనుషులు లేరనే వాదన ఉంది. పైకి చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. కానీ పని చేయగల సంసిద్ధత ఉంటే, దృక్పథం ఉంటే, స్పష్టమైన రాజకీయ కార్యక్రమం ఉంటే ఇద్దరు ముగ్గురైనా దావానలం సృష్టించగలరనే తార్కిక ఎరుక కలిగించే రచన ఇది. ఇప్పుడున్న గడ్డు పరిస్థితులను అధిగమించగల వెల్లువ సృష్టించడం సాధ్యమే తాత్విక అంతర్‌ దృష్టి కలిగించే రచన ఇది. దేనికంటే ఘోరమైన అననుకూల పరిస్థితుల్లో అప్పుడు విప్లవోద్యమ సన్నాహాలు ఎలా ఆరంభించిందీ హుస్సేన్‌ చాలా వివరంగానే చెప్పారు. అసలు ఎలా పని చేయాలో తెలియకపోవడమే అప్పుడు వాళ్లకు ఉన్న ఒక పెద్ద పరిమితి. ఇది ఉండగా ఎంత పెద్ద సిద్ధాంతాన్ని తయారు చేసుకున్నా అది పుస్తకాలను దాటి బైటికి రాదు. అక్షరాల్లో కనిపించడం తప్ప ఏ అర్థాన్నీ ఇవ్వదు. ఈ స్థితిని ఒకరిద్దరే బద్దలు కొట్టారు. అనేక సృజనాత్మక పద్ధతులు అనుసరించారు.

అట్లా ఆ తొలి రోజులతో పోల్చితే ఇవ్వాళ అనేక అనుకూలతలు ఉన్నాయి. గొప్ప అవగాహనలు ఉన్నాయి. నిజానికి ఇవ్వాల్టితో ఏ రకంగానూ పోల్చడానికి వీలులేని అత్యంత ప్రాథమిక దశ అది. అలాంటి చోట మొదలైనప్పటికీ ఈ నవల ఉద్వేగాన్నేగాక అనేక ఆలోచనలు పంచుతుంది. ఇప్పుడున్న పరిస్థితులను అధిగమించడానికి ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా మొదలు పెట్టాలో, దానికి ఎలాంటి సంసిద్ధత, సృజనాత్మకత ఉండాలో స్పురింపజేస్తుంది. ఆ రకంగా కూడా ఈ నవల ఇవాల్టి విప్లవోద్యమ అవసరాలు తీర్చుతుంది. అందుకే ఇది గతం కాదు. స్మృతుల సంపుటి కాదు. వర్తమానం మీదుగా సాగే భవిష్య ప్రయాణం.

ఈ నవలలో ఒకచోట నల్లా ఆదిరెడ్డి, హుస్సేన్‌ తదితరులు ఆదిలాబాద్‌ జైలు నిర్బంధాన్ని బద్దలు కొట్టుకొని బైటికి వస్తారు. జైలు నుంచి తప్పించుకొని మహారాష్ట్ర అడవుల్లో పదిహేను రోజులు తిరిగి తిరిగి, ఎక్కడికి పోతున్నదీ తెలియని స్థితిలో చివరికి మళ్లీ ఆదిలాబాద్‌ చేరుకుంటారు. వాళ్ల కోసం పోలీసులు జల్లెడపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్లు ఒక కార్మికుడి ఇంటికి చేరుకొని తలుపుకొడతారు. ఆ ఇల్లాలు వాళ్లను చూసి సంతోషంతో లోపలికి తీసుకపోతుంది.

వాళ్లకు జైలు బ్రేక్‌ చేయాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచి పాఠకుల్లో టెన్షన్‌ మొదలవుతుంది. ఇది ఎట్లా పరిణమిస్తుందో అని. చివరికి వాళ్లు ఆ ఇంటి దగ్గరికి వెళ్లినప్పుడు ‘ఇప్పుడున్న నిఘాలో..’ అనో, ‘మారిన పరిస్థితుల్లో..’ అనో ముఖం మీదే తలుపులు వేస్తారేమో అనే భయం మనకు కలుగుతుంది. దానికి పూర్తి భిన్నంగా జరుగుతుంది. కార్మికులే వాళ్లను తిరిగి పార్టీ కాంటాక్ట్‌లోకి తీసికెళ్లి క్షేమంగా పంపించేస్తారు.
ఇది చదువుతోంటే రష్యా విప్లవకాలంలోని కార్మికవాడల్లో మనం తిరుగుతున్నామా, ఆ కార్మికోద్యమాలను చదువుకుంటున్నామా? అనిపిస్తుంది. ఇలాంటి సన్నివేశాలు నవలలో చాలా ఉన్నాయి. విప్లవోద్యమ చరిత్రలోని అద్భుతం, ఉద్వేగం, సౌందర్యం, కల్లోలం, దు:ఖం, సాహసం పాఠకులను లాక్కెళతాయి.

మామూలుగా అయితే ఇందులో శిల్పం లేదనే కొందరు విమర్శకులు అనవచ్చు. నిజంగానే ఇందులో కళ్లు మిరమిట్లుగొలిపే శిల్పం లేదు. వ్యక్తుల అంతర్మథనాలు, అంతరంగ ప్రపంచాలు, ఇద్దరో ముగ్గురో మనుషుల సంబంధాలు, వాళ్ల ప్రయోజనాలు, వాటి మధ్య సంఘర్షణలు కాకుండా వందల, వేల మంది సంబంధాల అల్లిక ఈ రచనా వస్తువు. వ్యక్తులు కాకుండా సమూహం దీని ఇతివృత్తం. ఈ నవలలో ఉండే వాళ్లంతా తామున్న సంబంధాలను, స్థితులను మార్చాలనుకుంటారు. దానికి సిద్ధమవుతారు. మనుషులు తమను కండీషన్‌ చేసిన స్థితిని మార్చే క్రమంలో తమను కూడా ఎలా మార్చుకుంటారో ఈ నవలలోని ప్రతి పాత్ర పరిణామంలో చూడవచ్చు. అనేక మంది మనుషులు కొత్త సంబంధాల్లోకి చేరుకొనే క్రమంలో ఇదంతా కనిపిస్తుంది. ఇది పాత్రలు ఎరుక పొందే క్రమం అని కూడా అనిపిస్తుంది. ఇందులో ఆ మనుషుల ఊహ ఉంది. సత్యం ఉంది. పాతను రద్దు చేసి కొత్తను నిర్మించాలనే కోరిక ఉంది. భవిష్యత్తుపట్ల గొప్ప ఆశ ఉంది. సారాంశంలో విప్లవం అనేది ఆ కొత్త సంబంధాల్లో భాగమైన మనుషుల ఉమ్మడి అనుభవంగా మారింది. దాన్ని సంతరించుకొనే క్రమమే ఈ నవలా వస్తువు. ఇదే దీని దృక్పథం. ఆ రెండిరటి మేళవింపు వల్ల రచనకు అపారమైన శక్తి వచ్చింది. ఈ నవలలో ఉన్న ఆకర్షణకు కారణమైన శిల్పం అదే.
ఈ నవలా నిర్మాణంలో ఇంకో విచిత్రం ఉంది. నవలను హుస్సేన్‌ సర్వసాక్షి కథనంతో మొదలు పెడతారు. తర్వాత నేను వచ్చి కథ చెబుతూ పోతాడు. అది కొద్దిసేపే. ఆ తర్వాత ఈ నేను కనిపించడు. నవల అనేక ప్రాంతాల్లో, అనేక మంది మధ్యకు వెళ్లిపోతుంది. ఎక్కడెక్కడో నడుస్తుంది. మళ్లీ ఎప్పటికో నేను వస్తాడు. అదెలా ఉంటుందంటే.. రఘు(శ్యాం) ఓ వ్యక్తితో ‘హుస్సేన్‌ను పిలుచుకరా’ అని చెప్పాడు. ఆయన బయల్దేరి వచ్చి ఆ సంగతి నాకు చెప్పాడు. నేను వెళ్లి రఘును కలిశాను.. ఇలా కథ సర్వసాక్షి కథనంలోకి, ప్రథమ పురుషలోకి అలవోకగా మారుతుంది. మామూలుగా అయితే ఇలాంటి పద్ధతిని అంగీకరించడం కష్టం. హుస్సేన్‌ ఆ నియమాలేవీ ఖాతరు చేయలేదు. బహుశా గొప్ప అవార్డు వచ్చిన ఏ ఇంగ్లీషు నవలలోనో, ఆర్ట్‌ ఫిలింలోనే చూస్తే తప్ప అంగీకరించలేని విచిత్ర పద్ధతిలో హుస్సేన్‌ నిస్సంకోచంగా రాసేశారు.

విప్లవం కొత్త నిర్మాణాలను తీసుకొస్తుంది. ప్రతి ఆలోచన వెనుక, పని వెనుక ఒక నిర్మాణం ఉంటుంది. అవి కొత్తవి అయినప్పుడు గతాన్ని కూలదోసుకుంటూ వస్తాయి. గత నిర్మాణాలను ధ్వంసం చేయకుండా కొత్త వాటికి చోటు ఉండదు. అట్లా నిర్మాణాలు తయారయ్యే దృశ్యం అత్యంత సౌందర్యభరితంగా ఉంటుంది. విప్లవంలోని ఆకర్షణ అదే. సరిగ్గా ఇలాగే విప్లవ సాహిత్యం గత శిల్పాలను, స్థిరపడిన కథా నిర్మాణ రూపాలను అధిగమిస్తుంది. అసలు సాహిత్య భావనలనే మార్చేస్తుంది. సాహిత్య వస్తువును, దృక్పథాన్ని మౌలికంగా మార్చేయడం వల్ల పాఠకులు కూడా మారిపోతారు. పఠన అనుభవమే మారిపోతుంది. అట్లా తల్లులు బిడ్డలు ఒక కొత్త పఠన అనుభవాన్ని అందరికీ ఇస్తుంది. వాచకాన్ని మాత్రమే చదవడం తెలిసిన విమర్శకులకు ఇది అర్థం కావడం కష్టం. అసలు ఇలాంటి రచనలు వాళ్ల అనుభవంలోకి రావడమే కష్టం.

ఈ నవలలో కనిపించే నల్లా ఆదిరెడ్డి, గజ్జల గంగారాం, కటకం సుదర్శన్‌, కట్ల మల్లేశ్‌ వంటి నాయకుల పాత్రలను, ఇతర పాత్రలను రచయిత సమదృష్టితో చిత్రించారు. ఏ వ్యక్తినీ ఎక్కువ చేయలేదు. తక్కువ చేయలేదు. వాళ్ల వాళ్ల సహజ స్వభావంతో, చైతన్యంతో, క్రియాశీలతతో చూపిస్తారు. ఈ విలువు దానికదే ఒక సాహిత్య శైలి. దాని వల్ల కూడా ఈ నవల చాలా ఆకర్షణీయకంగా ఉంటుంది.

సాహిత్యం గురించి మనకు ఉన్న అభిప్రాయాలను తిరగేసి చూసుకొనే కొత్త దృష్టిని కూడా ఈ రచన అందిస్తుంది. మామూలుగా ఏ రచన అయినా భావోద్వేగ సంపుటిగా ఉండాలని అనుకుంటాం. రచయిత ప్రయత్నిస్తేనే అది సాధ్యమవుతుంది. విచిత్రం ఏమంటే హుస్సేన్‌ ఎక్కడా పాఠకుల్లో ప్రత్యేకించి భావోద్వేగాలు కలగాలని రాసినట్టనిపించదు. చాలా మామూలుగా రాసుకుంటూపోయారు. ఈ నవలలోని వస్తు బలమే ఉద్వేగపూరితంగా మారుతుంది. రచయిత ప్రత్యేకంగా ఏ ప్రయత్నమూ చేయకుండానే అనేక ఘటనలు, సందర్భాలు, సన్నివేశాలు వాటికవే సహజంగా పాఠకుల్లో ఉద్వేగాలు కలిగిస్తాయి. దుఃఖానికి లోను చేస్తాయి. కొన్ని చోట్ల అవి చాలా తీవ్రంగా కూడా ఉన్నాయి. ఈ రచనా క్రమమే అలా ఉన్నది. కొంత కథనం, కొంత డాక్యుమెంటేషన్‌, చరిత్ర రచనా పద్ధతి.. కలిసి సాగింది. ఇట్లా రాయడమే సర్వత్రా మంచిదని చప్పడానికి ఈ మాట అనడం లేదు. వేల లక్షల మంది ఉమ్మడిగా గడిరచిన సాహసిక, త్యాగపూరిత, నిర్మాణయుత, ప్రజాస్వామిక అనుభవం సాహిత్య వస్తువు అయినప్పుడు అది తిరిగి పాఠకులకు ఎలా చేరుతుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. నిజానికి ప్రతి అనుభవమే సామూహికమే కావచ్చు. కానీ అది ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించేదై ఉండి, రచయిత కూడా ఆ దృష్టితోనే దాన్ని చూసినప్పుడు వస్తువు దానికదే ఎంత ఉద్వేగ ప్రభావశీలిగా ఉంటుందనడానికి ఈ తల్లులు బిడ్డలు మంచి ఉదాహరణ.

విప్లవోద్యమం 1972 నుంచే ఎన్నో రాజకీయ, నిర్మాణ ప్రయోగాలు చేసింది. పోరాట రూపాలను అనుసరించింది. ప్రజలు ఏ సంకెళ్లలో ఉన్నారో, వాటి స్వభావం ఏమిటో గుర్తించి వాటికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయడానికి అవన్నీ అవసరం అయ్యాయి. ఇలాంటి వాటిని కేవల సిద్ధాంతాల ద్వారానే తెలుసుకుందామని ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్లు ఎన్నటికీ ఆ దరిదాపుల్లోకి వెళ్లలేరు. ఏ ఒక్కదాన్నో పరిగణలోకి తీసుకుంటే ఈ వ్యవస్థ స్వభావం ఎప్పటికీ అర్థం కాదు. ఈ నవలలో విప్లవ కార్యకర్తలు ఇంత గంభీరమైన విషయాన్ని సిద్ధాంతం అనే వెలుగు కింద ఆచరణ ద్వారానే తెలుసుకున్నారు. కార్మికులను అంటిపెట్టుకొని ఉన్నందు వల్లనే సమస్యల మూలాలు అర్థం చేసుకున్నారు. నిజానికి ఇందులో విప్లవ కార్యకర్తలు పోరాటాలను నిర్మించారా? లేక ఆ పోరాటాలకు తగినట్లు కార్మికులనే సరికొత్తగా తయారు చేశారా? అనే సందేహం కలిగేలా ఆ రెంటినీ కొనసాగించారు. అందుకే అంత చారిత్రాత్మక పోరాటాన్ని నిర్మించగలిగారు.

ప్రజలను పోరాటాల్లోకి సమీకరించడం కష్టం కాదు. దీర్ఘకాలిక దృష్టితో వాళ్లను పోరాటాల్లో నిలబెట్టి, వాళ్ల ఆచరణను, చైతన్యాన్ని ముందుకు తీసికెళ్లడం మాత్రం చాలా కష్టం. ఇది విప్లవోద్యమం సాధించిన విజయం. ఇది చాలా అరుదైనది. మిగతా ఉద్యమాలకు, విప్లవోద్యమానికి తేడా ఇక్కడే కనిపిస్తుంది. విప్లవోద్యమాన్ని వ్యతిరేకించే వాళ్లు కూడా తమ పోరాటాల కోసం ఈ విషయాన్ని పరిశీలించాలి. రాజకీయ వ్యూహం లేని ఉద్యమాలు చాలా మిరిమిట్లు గొల్పవచ్చు. నిత్యం ఊరేగింపులు, సభలు సమావేశాలతో, ప్రసంగాలతో హోరెత్తవచ్చు. కానీ విప్లవం లక్ష్యంగా ఉన్న వాళ్లు ఈ పనులు చేసి సంతృప్తి చెందరు. ఈ నవలలో సికాస సహా వివిధ ప్రజా సంఘాల తరపున పెద్ద ఎత్తున ప్రజా సమీకరణకు అనేక బహిరంగ కార్యక్రమాలు సృజనాత్మకంగా నిర్వహించారు. దీన్నంతా ఒక వ్యూహంలో భాగం చేసి, దానికి తగినట్లు ప్రజల మిలిటెన్సీని ఎలా పెంచుతూ పోయారో ఈ నవలలో అద్భుతంగా హుస్సేన్‌ రాశారు. ఉద్యమానికి తగినట్లు ప్రజలను తయారు చేయడంలో మిలిటెన్సీని పెంచడం ఒక ముఖ్యమైన విషయం. సృజనాత్మకత, విమర్శనాత్మకత అనే రెండు కాళ్ల మీద ప్రజలు మిలిటెన్సీని అందుకోవాలి. ఇది జరగకపోతే సృజనాత్మకతా ఉండదు. విమర్శనాత్మకతా ఉండదు. సృజనాత్మకత, విమర్శనాత్మకత, మిలిటెన్సీ అనే మూడిరటి మేళవింపు వల్లే 1970ల చివర, 80ల మొదట ప్రాథమిక దశలో ఉన్న విప్లవోద్యమం అతి కొద్ది కాలంలోనే ముందడుగు వేసింది. ప్రజల చైతన్యాన్ని, సంసిద్ధతను పెంచుతూ విప్లవోద్యమం ఒక దశ నుంచి మరో దశలోకి వెళ్లింది. అదంతా ఈ నవలలో చూడవచ్చు. ఉద్యమంలో ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగకపోతే వర్గపోరాటం అనే మాట విప్లవ శిబిరంలో కూడా లాంఛనప్రాయంగా మిగిలిపోయేది. ఈ క్రమంలో తీవ్రమైన నిర్బంధం వచ్చింది. ఉద్యమం నష్టపోయింది. దాన్ని అధిగమించేందుకు ఉద్యమం అనేక ప్రయోగాలు చేసింది. నిర్బంధం, దాన్ని అధిగమించి విస్తరించడం, ఒక ప్రాంతంలో నష్టపోయి మరో ప్రాంతానికి చేరుకోవడం, ఒక రూపంలో పని చేయడానికి అవకాశం లేక మరో రూపాన్ని ఎంచుకోవడం.. అన్నీ కలిసి ఒక దశలోంచి మరో దశలోకి చేరుకోవడం అనే గుణాత్మక మార్పును ఈ నవల చిత్రించింది.

ఈ మార్పు క్రమాన్ని హుస్సేన్‌ దగ్గరిగా చూసినందు వల్ల, దాన్ని నడిపించినందు వల్ల ప్రజల వ్యక్తీకరణల్లో, భావాల్లో, అనుభవాల్లో, ఆచరణ రూపాల్లో అది ఎలా ఉంటుందో రాయగలిగారు. విమర్శకులు ఇవేవీ పట్టించుకోకుండా విప్లవోద్యమ వ్యూహం దగ్గరి నుంచి అన్నిటినీ తిరస్కరిస్తుంటారు. సింగరేణి కార్మికులు తమ ఆర్థిక సమస్యల మీదే కాకుండా విప్లవంలో భాగం కావలసిన అన్నిటినీ ఎలా పట్టించుకున్నదీ ఈ తరహా విమర్శకులకు ఎత్తి చూపించింది. విప్లవోద్యమానిది ఆర్థికవాదం అని, దుందుడుకు వాదం అని ఇప్పటికీ అనే వాళ్లు ఉన్నారు. వాళ్ల కళ్లు తెరిపించేలా ఆ రోజుల్లోనే ఈ రెంటికీ భిన్నంగా సికాస ఎట్లా పని చేసిందీ చెప్పడానికి బోలెడు సమాచారం రచయిత ఇచ్చారు.

అందుకే ఈ నవలలో కార్మికుల చైతన్యం, సికాస, విప్లవ పార్టీ నిర్మాణమవుతున్న తీరు ఏకకాలంలో కనిపిస్తాయి. మామూలు మనుషులైన కార్మికులు కఠోరమైన విప్లవాచరణలో భాగమవుతోంటే, నూతన నిర్మాణ రూపాలను ఆవిష్కరిస్తోంటే వాళ్ల తల్లులు, రక్తసంబంధీకులు కొత్త కుటుంబ సంబంధాలను నిర్మిస్తూ ఉంటారు. ఈ నవలలో గజ్జల లక్ష్మమ్మ వంటి తల్లులు, కార్మికుల భార్యలు, విప్లవోద్యమంలో భాగమవుతూ కొత్త కుటుంబ సంబంధాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. దీన్ని ఒక పక్క నుంచి లక్ష్మమ్మ, ఇంకో పక్క నుంచి జిలానీ బేగం, మరో వైపు నుంచి సరోజ, నవల చివరి దాకా శ్రీలత.. ఇలా అనేక మంది మహిళలు యథాతధ కుటుంబ సంబంధాలను పట్టి కుదిపిపారేశారు. విచిత్రమేమంటే అది అందరిలో, అన్నిసార్లు విప్లవ చైతన్యంగానే కనిపించదు. కామన్‌సెన్స్‌గా, వివేకంగా, ఆర్తిగా, గౌరవంగా, కేవలం ఆరాధనగా, సాటిలేని తెగువగా మనుషుల వ్యక్తిత్వంలో భాగమయ్యే అనేక రూపాల్లో, ఆ వ్యక్తిత్వాల నుంచి వ్యక్తమయ్యే అనేకానేక తీరుల్లో వాళ్లు కుటుంబ సంబంధాలను మార్చేస్తుంటారు. ఈ నవలలో అనేక మంది మహిళా పాత్రలు విప్లవ కార్యకర్తలకు వేళకు అన్నం ఒండి పెడుతూ ఉంటారు. టీలు ఇస్తూ ఉంటారు. ఇవి కుటుంబ వ్యవస్థ అప్పగించిన యథాతధ పనులు. ఆ పనులను కాదని విప్లవంలోక వెళ్లిన జిలానీబేగం, గజ్జల సరోజ ఒక పక్క ఉంటారు. ఇంకో పక్క పైన చెప్పిన పనులే చేస్తూనే ఎంచుకొని మరీ అనేక కొత్త పనుల్లోకి వెళ్లిన మహిళలు మరెందరో ఉంటారు. కుటుంబ సంబంధాల్లో మార్పుకు కుటుంబంలోనే ప్రయత్నించాలని, అక్కడే మూలం ఉందనే వెర్రి సిద్ధాంతాన్ని ఈ మహిళలు నమ్మలేదు. జీవిత వాస్తవం అనేక తలాల్లో, అనేక రంగాల్లో విస్తరించి ఉంటుందని, వాటి మధ్య సంబంధం ఉంటుందనే సంక్లిష్ల అవగాహన విప్లవోద్యమానికి అప్పుడే ఉండేది. దాన్ని వ్యక్తులు తమ స్పృనుబట్టి అర్థం చేసుకుంటారు. సొంతం చేసుకుంటారు. అది ఎలా ఉంటుందో హుస్సేన్‌ ఎక్కడా ఒక్క వాక్యం కూడా చెప్పరు. కానీ పాఠకులకు ఇందులో ఉండే పాత్రలు, వాటి వెనుక ఉన్న నిజ మానవులు మనకు ఈ సత్యాన్ని నవల పొడవునా చెబుతూ ఉంటారు.

అదే సమయంలో ఆ రోజుల్లో విప్లవోద్యమం ముందు ఉండిన ఒక పెద్ద వైరుధ్యాన్ని ఈ నవల చిత్రించింది. మహిళలు చైతన్యవంతులై విప్లవోద్యమంలోకి వస్తామని అంటారు. కానీ వాళ్లను ఇమిడ్చుకోలేని పరిమితి ఉద్యమానికి ఉంటుంది. చైతన్యవంతమైన మానవులే పరిమితుల నుంచి ఉద్యమాలు, నిర్మాణాలు అధిగమించేలా చేయగలరు. కానీ ఆ నిర్మాణానికి అప్పటికి ఉన్న పరిమితి వల్ల వాళ్లను ఉద్యమంలోకి తీసుకోలేదు. నిజానికి అది సమాజానికి ఉన్న పరిమితి. ఆ సమాజాన్ని మార్చే విప్లవ నిర్మాణం అనేక సాంకేతిక కారణాల వల్ల సమాజానికి ఉన్న పరిమితికి లోబడి ఉండాల్సి వస్తుంది. దీని గురించి నాయకత్వానికి చాల స్పష్టమైన అవగాహన ఉన్నది. అయినా తక్షణంగా ఏమీ చేయలేరు. ఉద్యమం ఇంకో వైపు నుంచి శక్తిని కూడగట్టుకొని ఈ పరిమితిని అధిగమించే వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ దశ దాటాక మహిళల భాగస్వామ్యం విప్లవోద్యమం అనేక దశలను వేగంగా అధిగమించేందుకు దోహదపడిరది. అంటే వర్గపోరాట అభివృద్ధి క్రమంతో సంబంధం లేకుండా సమాజం వల్ల ఎదురయ్యే ఏ పరిమితినీ విప్లవ నిర్మాణం తనంత తాను అధిగమించలేదు. కేవలం సైద్ధాంతిక అవగాహన ఉన్నంత మాత్రాన నాయకత్వం అప్పటికప్పుడు అన్ని వైరుధ్యాలను పరిష్కరించగలదా? అనే చర్చను కూడా ఈ నవల సరోజ, జిలానీ బేగం ఇద్దరి విషయంలో ముందుకు తీసుకొచ్చింది. క్రమంగా పరిష్కారం ఎలా వెతుక్కున్నదీ ఈ రచన చెబుతుంఇ.
అందుకే ఈ నవలా ఇతివృత్తం ‘విప్లవం’ అని కాకుండా ‘విప్లవోద్యమ క్రమం’ అనడం బాగుంటుంది. ఇందులో ఏ ఒక్క పాత్ర మనకు ఒక్కసారిగా అర్థమైపోదు. నవల సాంతం పాత్ర నిర్మాణమవుతూనే ఉంటుంది. ఆ క్రమంలోనే ఆ పాత్రలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఏ ఒక్క ఘటన అప్పటిదే అనిపించదు. ఇప్పటిదీ అనిపిస్తుంది. చేతిబాంబును పరీక్షిస్తూ చిన్న వయసులోనే గజ్జల గంగారాం ఎలా చనిపోయిందీ ఈ నవలలో హుస్సేన్‌ చాలా వివరంగా వర్ణించాడు. అది పాఠకుల్ని పట్టి కుదిపేస్తుంది. నలభై ఏళ్ల కిందటి ఆ ఘటన గురించి ఈ రచనలో చదువుతోంటే ప్రజా గెరిల్లా సైన్యానికి బాణం బాంబు తయారు చేస్తూ ఇటీవల జార్ఱండ్‌లో ప్రమాదవశాత్తు అమరుడైన సునీల్‌ గుర్తుకు వస్తాడు. ఈ రెండూ విడి ఘటనలు కాదు. యాభై ఏళ్ల విప్లవోద్యమ క్రమం.

విప్లవాన్ని సిద్ధాంతాల నుంచి అర్థం చేసుకోవడం ఒక పద్ధతి. కానీ హుస్సేన్‌ ఆచరణ నుంచి విప్లవాన్ని అర్థం చేసుకొని, అదెలా నిర్మాణమవుతున్నదో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఆయన చిత్రించిన ఈ కల్లోలభరిత ఆచరణను నిష్పక్షపాతంగా పరిశీలించి దీని వెనుక ఉన్న సిద్ధాంతం ఏమిటి? అనే అన్వేషణ ఎవరైనా ఈ నవల ఆధారంగా చేయవచ్చు.

సిద్ధాంతం`ఆచరణ మధ్య అర్ధవంతమైన సంబంధం తెలుసుకోడానికి ఇది దోహదపడుతుంది. ‘విప్లవం ఇట్లా రాదు.. మరోలా వస్తుంద’ని ఎవరైనా కలగంటూ ఉంటే వాళ్లు ఈ నేల మీద, ఈ ప్రజల మధ్య దశాబ్దాలుగా విప్లవోద్యమం ఎట్లా నిర్మాణమవుతున్నదో తెలుసుకోడానికి ఈ నవల గొప్పగా ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా నూరేళ్ల కమ్యూనిస్టు ఉద్యమంలో శిఖరాయమానమైన సింగరేణి ఉద్యమం ముందు వెనుకల ఎన్నెన్ని రంగాల్లో వర్గపోరాటం ఉన్నదో, స్వయంగా సింగరేణి ఎన్నెన్ని రంగాలకు జవసత్వాలను ఇచ్చిందో ఈ నవలలో చిత్రించారు. పల్లెల్లో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, పట్టణాల్లో విద్యార్థి యువజన ఉద్యమాలు, సింగరేణి కార్మికోద్యమాలు, పల్లెలను పట్టణాలను ఊపేసిన సాంస్కృతికోద్యమాలు, అడవుల్లోని ఆదివాసీ పోరాటాలు.. ఇలా దేని నుంచి ఏది ఎట్లా ఉద్భవించిందో, దేనికి ఏది ఊతమైందో, దేనికి ఏది ఎట్లా కొనసాగింపు అయిందో ఈ నవల చాలా వివరంగానే చెబుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అదెలా కొనసాగుతున్నదో చెప్పడానికి హుస్సేన్‌ ప్రయత్నించారు. వాటన్నిటి వెనుక ఉన్న దృక్పథం, అవగాహన, వ్యూహం మీద దృష్టి ప్రసరింపచేసేలా రచన సాగుతుంది.

నిర్దిష్టంగా బెల్లంపల్లిని, మొత్తం సింగరేణి ప్రాంతాన్ని కేంద్రం చేసుకొని సాగిన ఈ నవల సికాస పోరాట చరిత్ర అనవచ్చు. అల్లం రాజయ్య ఇటీవల రాసిన సైరన్‌ నవల సికాస ఆవిర్భావానికి ముందు మొదలై ఆ సంస్థ ఏర్పాటుతో ముగిసిపోతుంది. ఆ కాలమంతా పల్లెల నుంచి బొగ్గుబాయిల మీదికి తరలి వచ్చిన కార్మికుల జీవితాలను అద్భుతంగా అ నవల చిత్రించింది. దానికి కొనసాగింపు అన్నట్లుగా హుస్సేన్‌ ఈ తల్లులు బిడ్డలు నవల రాశారు.

విప్లవోద్యమం మీద సందేహాలు ఎందరికో ఉంటాయి. విప్లవోద్యమమే ఈ వ్యవస్థకు ప్రత్యామ్నాయం అనుకుంటే దానికి ప్రత్యామ్నాయం సూచించే వాళ్లు కూడా ఉన్నారు. అన్నిటినీ స్వాగతించాల్సిందే. అనేక ప్రయోగాలు చేయాల్సిందే. కానీ ఏ ప్రయోగమైనా నేల మీదే చేయాలి. ప్రజల మధ్యే చేయాలి. తొట్రుబాటుకు లోనుకాకుండా చేయాలి. ముఖ్యంగా ఎవరి కాళ్ల దగ్గరే వాళ్లు సుళ్లు తిరగకుండా .. సుదూర చరిత్రలోకి మారుతున్న కాలంతోపాటు పరిగెడుతూ గురి చూడాలి. దానికి ఎంత తెగువ కావాలి? ఎంత దార్శనికత కావాలి? ఎంత సంసిద్ధత కావాలి? అలాంటి విప్లవ లక్షణాలు మూడు తరాలుగా తల్లులకు, బిడ్డలకు, వాళ్లు నిర్వహిస్తున్న విప్లవోద్యమానికి ఎలా ఉన్నాయో చెప్పిన రచన ఇది. ఈ పుస్తకం మీద నవల అని ఉండదు. కానీ నవల చదువుతున్నామని పాఠకులకు గాఢంగా అనిపిస్తుంది. విప్లవ నవలల్లో కాలానికి సంబంధించిన ఒక లక్షణం ఉంటుంది. అదే వర్తమానీయత. హుస్సేన్‌ ఆ వర్తమానాన్ని మరింత బాగా, గొప్పగా చూపించడంలో విజయం సాధించారు. తద్వారా భవిష్యత్తు దిశగా పాఠకులను నడిపించడంలో అంతకంటే ఎక్కువ విజయం సాధించారు.

Leave a Reply