తెలుగు కవిత్వంలో దీర్ఘకవితలకు ప్రత్యేకత వున్నది.వస్తువును విస్తృతo చేయడానికి కవి ఎంచుకున్న కవితా మార్గం. నగ్నముని కొయ్యగుర్రం , శివారెడ్డి ఆస్ఫత్రి గీతం , వరవర రావు సముద్రం,   ఎన్.కె.లాల్ బనో గులామి  చోడో వంటి దీర్ఘ కవితలు భారత సమాజాన్ని అర్ధం చేసుకొని  ధిక్కార స్వరాన్ని నమోదు చేసినాయి. క‌ళ్యాణ‌రావు #, కాలం*, కాశీం మానాల‌, గుత్తికొండ వంటి దీర్ఘ‌క‌విత‌లు చ‌రిత్ర‌ను, విప్ల‌వోద్య‌మ చ‌రిత్ర‌ను న‌మోదు చేశాయి.    వీరంద‌రూ దీర్ఘ కవితల పరంపరకు ప్రగతి శీల దారులు  వేశారు.  ఛాయారాజ్  వంటి విప్లవ కవులు దీర్ఘ కవితా ప్రక్రియలో రాయడానికి ఉత్సుకతను ,అభినివేశాన్ని కనబరిచే వారు . సామాజిక ఘటనలను కవిత్వం ద్వారా చెప్పడానికి కవితా ప్రక్రియలో  ఇదొక పార్శ్వం .

విరసం కవుల  దీర్ఘ కవితల నుంచి ప్రేర‌ణ‌ పొంది దీర్ఘ కవితా ప్రక్రియను స్వీకరించిన కవి కెనరీ .ఉపాధ్యాయునిగా , కవిగా , విరసం సభ్యునిగా  సుపరిచితులు . కవిత్వం కెనరీకి ఒక బాధ్యత . కవితా రచన  ద్వారా  నూత్న ప్రప౦చాన్ని కలగనే  స్వాప్నికుడు .కవిగా కెనరీ ప్రయాణం  చాలా లోతైనది. విలువైనది . అనేక ఘటనలను దీర్ఘ కవితల గా నమోదు చేసిన కవి. నక్సలబరి రాజకీయాలను నిశితంగా గమని౦చి భావజాల పరంగా తన స్పందనను , వ్యక్తీకరిస్తున్న కవి .విప్లవం విజయ వంతం అవుతుందనే ఆశ వున్న కవి . తను కూడా అందులో భాగం కావాలనే బలీయమైన ఆకాంక్ష వున్న సృజన కారుడు .

ఇవన్నీ కలగలసిన కవి కెనరీ . ఏభై ఏళ్ల విప్లవోద్యమం ప్రయాణం , కొనసాగింపును , ఒడి దుడుకులును నిశితంగా గమనిస్తూ , హృదయాంతరం చేసుకుంటూ దీర్ఘ కవితా ప్రక్రియలలో రికార్డు చేస్తున్న కవి . ఆపరేషన్ గ్రీన్ హంట్ ద్వారా ఆదివాసీలపై రాజ్యం దాడి చేసినప్పుడు తమకు తాము నిర్మిచుకున్న జీవిత అవసరాలు ద్వంసమై తుపాకీ నీడన ఆదివాసీలు బందీలుగా వున్నప్పుడు కెనరీ వారి పక్షం వహిస్తూ కవిత్వ ద్వారా సంఘీ భావం ప్రకటించాడు .కవి సున్నితత్వం నుండి ఆదివాసీ సమాజాన్ని అంచనా వేశాడు .అణిచివేత వెనుక దాగిన  కనిపించని ఆక్రోశాలను , ఆవేదనలను కెనరీ మౌనoగా , నిశ్శబ్ధంగా భరించలేదు . జరుగుతున్న విధ్వంసం , యుద్ధం కవిని వెంటాడాయి . కెనరీ తన లోపల  రగులుతున్న వేదనను కవిత్వం ద్వారా పలికించాడు .

కెనరీ తాజా దీర్ఘ కవిత ‘తూర్పుముఖాన’.  విప్లవోద్య౦ నడకకు అయిదు దశాబ్ధాల కాలం దాటింది .ఈ కాల౦ రక్త చారికల వంతెనపై నడిచింది .నేల విప్లవోద్యమం చిందించిన రుధిర౦తో తడిసింది .భారత సమాజంలో విప్లవోద్యమం కలగలిసి పోయింది .అధికార మార్పిడి అన౦తర భారత దేశం వైఫ‌ల్యాల  మార్గంలో పయనించింది.  ఆర్ధిక  అసమానతల తలం అంతరించలేదు . కాలం గడుస్తున్న కొలది , దోపిడీ  పాలన  పునాది పై  ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య  విలువల కోసం  భూమి , భుక్తి,. విముక్తి అనే అజెండాతో నక్సలబరీ ఆవిర్భవించింది. ఏభై ఏళ్ల కాలం  పొడువునా గాయాలపాలైన చరిత్ర . దీనిని నిర్మించ‌డానికి  కాగడాలై వెలుగు నిచ్చిన వారి చరిత్ర . అరణ్యం వసంత గానం వినిపించిన సంద‌ర్భం. ఆ వసంత గానాన్ని కెనరీ అందుకున్నాడు .విప్లవోద్యమాన్ని కీర్తిస్తూ అనేక కవితలు వచ్చాయి .    కెనరీ కవితా వ్యక్తీకరణ మీద అనేక ప్రభావాలు ఉన్నాయి.  కవి విప్లవోద్యమం పట్ల అచంచల విశ్వాసాన్ని హృదయ గతం చేసుకోకపోతే దీర్ఘ కవిత పేలవంగా మిగిలేది .ప్రజాస్వామిక ఆ కాంక్షను  ఆకాంక్ష వెనుక దాగిన త్యాగాన్ని  కెనరీ కవిత్వం ద్వారా ఎత్తిపట్టాడు .

ఏ చీకటి బంధించలేని

ఉదయమిది

విశ్వాసాలు దీపాలు చిన్నవే 

 అవి దివిటిల్లా దారిచూపుతున్నవి. ఏభై ఏళ్ల కాలం లో అనేక సూర్యోదయాలు . ప్రతి సూర్యోదయం కొత్త ఆశను వ్యక్తపరిచింది. ప్రతి వేకువ ఆర్ధిక అసమానతలు లేని సమాజాన్ని వాగ్ధానం చేసింది . సకల పొరల్లో అట్టడుగునవున్న జీవితాలకు భరోసానిచ్చింది . ఒక ఆశ ఏభై ఏళ్ల కాలం నడిచింది .

ఏ నేలపై

విముక్తి  చైనా యేనాన్ ను

అరుణార్ణంగా అలికిన శ్రీకాకుళం

హామీనిచ్చింది . సామ్య‌ వాద  ప్రజా రాజ్యాన్ని కలగనే  ఆకాంక్షలు యావత్తు తెలుగు సమాజంపై పరుచుకున్నాయి . ఒక కార్యాచరణ నూతన ప్రజా స్వామిక విప్లవంకై దారులు వేసింది . పాలక ముఠా వైఫ‌ల్యo  దాని వెనుక దాగిన బీదరికం , ప్రజస్వామ్యం అందిoచినది కంటే అది మిగిల్చిన చీకటి .యివన్నీ నూత్న ఆలోచన విధానం వైపు రాడికల్ భావజాలం వైపు అడుగులు వేశాయి . మొత్తంగా ఆలోచనా పరులు .రచయతలు .కళాకారులు మేధో రంగంలో పని చేస్తున్న సకల ప్రజాస్వామిక వాదులు ఈ వసంత గానం వెనుక నిలబడ్డారు .భావ జాల రంగంలో  విస్తృతి కలిపిoచారు . ఈ వెలుగులో వచ్చిన రచనలు తెలుగు సాహిత్యంలో నూతన వ్యక్తీకరణలకు  చోదక శక్తిగా నిలిచింది నక్సలబరి .

నిర్జీవ భావాలకు తావులేదు

సజీవ దృశ్యాల సందోహాలకు కొదువలేదు .

అదే సమయంలో

పచ్చని లోయలో విచ్చుకుంటున్న

విశ్వ మానవ ప్రేమ పారవశ్యంలో

తలమునకలైన  క్రాంతి కారి జనతన సర్కార్

 కెనరికి విప్ల‌వోద్య‌మ  పునాది తెలుసు . ఆచరణ తెలుసు.   నక్సలబరి భూస్వామ్య పునాదులను ధ్వంసం చేయ‌డానికి ఆరంభ‌మైంది. దళారి పాలక వర్గాలకు వ్యతిరేకంగా సామ్రాజ్య వాదానికి   ప్రత్నామ్నాయంగా నిలబడింది . సుదీర్ఘ కాలం సైద్ధాంతిక పునాది నుండి  ప్రజల పక్షం వహించింది . అంత మాత్రమే కాదు , ఆదివాసీ ప్రాంతంలో  జనాతన సర్కార్ కు బీజ రూపంలోనైనా పునాది వేసింది . విప్లవోద్యమం వివిధ దశలను దీర్ఘ కవిత లోకి అనువర్తింప చేయగలిగాడు.

దీర్ఘ కవితా రచనలో కెనరీ ఒక మెల‌కువను సాధించ గలిగాడు .ఆరంభం  నుండి ముగింపు వరకు అంతర్ లయను  కవితా రూపంలో పలికించడలో పరిణితి కనబరిచాడు .తనదైన విప్లవ పరిభాషను ఎంచుకోవడ౦ దీర్ఘ కవిత చివరి వరకు దానిని కొనసాగించడం లో ప్రత్యేకతను సాధించాడు . తూర్పు ముఖాన ఏభై ఏళ్ల విప్లవోద్యమానికి కవి అందించిన ప్రతి బింబం ఈ దీర్ఘ క‌విత‌. 

Leave a Reply