5.5. 2021

టు
సోమేష్ కుమార్‌
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ ప్రభుత్వం,
హైదరాబాదు.


ఫ్రం
అరసవెల్లి క్రిష్ణ
అధ్యక్షుడు
విప్లవ రచయితల సంఘం
6-1-\16-7ఎ\1
పెద్దిరాజు స్ట్రీట్
పైజర్ పేట
విజయవాడ-1
520001

విషయం: జీవో ఎంస్ నెం. 73, తేదీ 80.3.2021, జనరల్ అడ్మినిష్ట్రేష‌న్‌ (ఎస్పిఎల్డి)శాఖ-తెలంగాణప్రజా భద్రతా చట్టం-1992- విప్లవ రచయితల సంఘాన్ని చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించడం, దానిపై విరసం అభ్యంతరం,సమాధానం.

రెఫరెన్స్:

1. దిన పత్రికలకు 28. 4. 2021నాడు ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంస్ 73.
2.ఆంధ్రజ్యోతి దిన పత్రిక, తేదీ: 2442021, పేజీ 1,3.
3.తెలంగాణ ప్రజా భద్రతా చట్టం, 1992

పైన ఉదహరించిన రెఫరెన్స్ 3 ప్రకారం ప్రభుత్వం ఒక సంస్థను చట్ట వ్యతిరేకమని పత్రికల్లో ప్రకటన జారీ చేసిన 15 రోజుల్లోగా సంబంధిత సంస్థ తన వాదనను ప్రభుత్వానికి వినిపించే హక్కు ఉన్నది.  దీన్ని వినియోగించకుంటూ విప్లవ రచయితల సంఘం(విరసం) తన వాదనను జీవో ఎంస్ 78లో చేసిన ఆరోపణలపై ప్రభుత్వానికి వివరణ ఇస్తున్నది.

రెఫరెన్స్ 1లో విరసాన్ని చట్ట వ్యతిరేక సంస్థగా గుర్తించడానికి 5 ఆరోపణలు చేశారు. వీటి ఆధారంగా విరసం చట్ట వ్యతిరేక సంస్థ అనే ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ ఐదు ఆరోపణలు పూర్తి సత్యదూరం. అవి పూర్తి నిరాధారమైనవి. వాటి ద్వారా విరసం చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించడం అసమంజసం. విరసం పూర్తిగా భారత రాజ్యాంగం కల్పించిన చట్టబద్ద అవకాశాలన్నీ వాడుకొని, వాటికి లోబడి పని చేసే సంస్థ. కాబట్టి జీవో ఎంఎస్ 78లోని ఆరోపణలు రాజ్యాంగంలోని అధికరణం 19లో పేర్కొన్న భావ ప్రకటనా స్వేచ్ఛ‌కు, వాక్ సభా స్వాతంత్ర్యాలకుతంత్య్రాల‌కు, సంస్థా నిర్మాణ స్వేచ్ఛ‌కు భంగకరమని విరసం అభిప్రాయపడుతోంది. విరసం కార్యక్షేత్రమైన సాహిత్య మేధోరంగాల్లో భావ ప్రకటనకు కీలక స్థానం ఉంది. సాహిత్య రచన అంటే భావ ప్రకటనే. సమాజం గురించి, జీవితం గురించి రచయితలు తమ అభిప్రాయాలను కళాత్మకంగా వ్యక్తీకరిస్తారు. భావాల వినిమయానికి, రచయితలు సంఘం పెట్టుకోడానికి, సమావేశాలు నిర్వహించుకోడానికి సాహిత్య రంగంలో చాలా ప్రాధాన్యత ఉంది. రాజ్యాంగంలోని 19వ అధికరణానికి చాలా దగ్గరి విషయాలవి. రాజ్యాంగబద్ధంగా నడవ వలసిన తెలంగాణ ప్రభుత్వానికి విరసాన్ని నిరాధార ఆరోపణలతో నిషేధించే హక్కు లేదు.

విప్లవ రచయితల సంఘాన్ని 1970 జూలై 4న శ్రీశ్రీ. కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి, కెవిరమణారెడ్డిలాంటి సుప్రసిద్ధ తెలుగు రచయితలు ఏర్పాటు చేశారు. అప్పటికి సీపీఐ(మావోయిస్టు) ఉనికిలోనే లేదు. 2005లో ఆ పార్టీ ఏర్పడింది. అంతక ముందు ముప్పై అయిదేళ్ల కింద ఏర్పడ్డ విరసం ఆ పార్టీకి అనుబంధ సంస్థ అని ప్రచారం చేయడం పూర్తి వాస్తవ విరుద్ధం. ఇందులో ఏ మాత్రం హేతుబద్ధత లేదు. విరసం ఏర్పడ్డప్పటి నుంచి తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాల్లో బహిరంగంగా పని చేస్తున్న స్వతంత్ర సంస్థ, విరసానికి ఏ రాజకీయ పార్టీతోను నిర్మాణపరమైన సంబంధాలు లేవు. విరసం నిర్మాణం, సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాలు తన సభ్యుల ఆమోదం మేరకు, సంస్థ ప్రణాళిక-నిబంధనావళికి లోబడి మాత్రమే జరుగుతాయి. హింసాత్మక చర్యలకు పాల్పడే వ్యక్తులను ప్రోత్సహించడం,సహాయం చేయడం, హింసకు-బెదిరింపులకు పాల్చడటం వంటి ఆరోపణలు విరసం మీద ప్రభుత్వం చేసింది. విరసం నిర్వహించే కార్యకలాపాల్లో ఇవి ఉండవు. హింసను విరసం ప్రోత్సహించదు, సరికదా మానవ జీవితంలో హింస ఎక్కడ ఏ రూపంలో ఉన్నా విమర్శిస్తుంది. స్వేచ్ఛ‌, ఆత్మగౌరవం పరిపూర్ణంగా ఉంటూ, హింస లేనప్పుడే మానవ జీవితానికి నిండైన అర్థం సమకూరుతుందని విరసం విశ్వాసం. సాహిత్యం ఏ హింసా ఘటనను సమర్థించదు. హింస అమలు కావడానికి మూలాలను అన్వేషించి కారణాలను విశ్లేషిస్తుంది. చిత్రిస్తుంది. హింస, దౌర్జన్యాలు అనాగరిక దశకు చెందినవని, చట్టబద్ధప్రజాస్వామ్యంలో హింస ఉండకూడదని భావిస్తుంది. హింసా మూలాలను మార్చకుండా హింస లేని సమాజం ఏర్చడ్డం సాధ్యం కాదని అభిప్రాయపడుతుంది. హింస లేని సమాజం నెలకొనడానికి ప్రజల్లో సాంస్కృతిక చైతన్యాన్ని పెంచడానికి సాహిత్యాన్ని కళలను సాధనం చేసుకుంది. హింసకు పాల్చదటం, బెదిరింపులకు దిగడం విరసం అవగాహనకు విరుద్ధం.గత యాభై ఏళ్లుగా మేం సమాజంలో హింస, దౌర్జన్యాలు, బెదిరింపులు ఉండకూడదనే సాహిత్యం రాస్తున్నాం. దళితులపై అగ్రకులాల వారు, స్త్రీలపై పురుషులు, ఆదివాసులపై నాగరికులమనుకొనే వారు, పిల్లలపై పెద్దలు, ఆర్థికంగా బలహీనులపై బలవంతులు, ప్రజలపై ప్రభుత్వం, రాజ్యం హింసకు పాల్చదకూదడదని మా తాత్విక విశ్వాసం. ప్రపంచ సాహిత్య చరిత్రలోనే హింసను ప్రేరేపించేలా రచన చేసిన ప్రగతిశీల సాహిత్యకారులు ఒక్కరు లేరు. సాహిత్య స్వభావమే హింసా వ్యతిరేకం. మానవజీవితంలోని సున్నితమైన కోణాలను, విలువలను, అనుభవాలను హింస కాలరాస్తుంది. అందుకే హింసా వ్యతిరేకతే సాహిత్య వస్తువు. హింసను వ్యతిరేకిస్తూ మానవత, స్వేచ్ఛ వంటి ఉన్నత విలువలను సాహిత్యం చిత్రిస్తుంది. సాహిత్యం తన భావ ప్రకటన వల్ల మానవ సమాజ నాగరికతా క్రమాన్నే ప్రభావితం చేసింది. విష రచయితల సంఘం ఈ యాభై ఏళ్లలో రకరకాల హింసా రూపాలకు వ్యతిరేకంగా ప్రజా ఆకాంక్షలను ఎత్తిపట్టింది. ప్రజల పక్షాన నిలబడింది. “వ్యక్తుల మధ్య అసమానత, ఆధిపత్య సంబంధాలన్నిటినీ విరసం వ్యతిరేకిస్తుంది. శారీరక శ్రమకు, మేధో శ్రమకు మధ్య, పట్టణ, గ్రామీణప్రాంతాల మధ్య, విద్యావంతుకు, విద్య లేనివారికి మధ్య, వ్యక్తీకరణ శక్తి ఉన్నవారికీ, లేనివారికీ మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చడానికి విరసం చైతన్యయుతంగా పని చేస్తుంది” – అనుబంధం 2 (విరసం ప్రణాళిక-నిబంధనావళి 16 నుంచి).

మానవ అనుభవమే సాహిత్యానికి వనరు. ప్రాచీన కాలంలో ప్రకృతిలో భాగమైన మనిషికి ప్రకృతి వల్లకలిగే అనుభవమే ఆనాటి కళా సాహిత్యాలకు ఆధారం. మానవ సమాజం ఏర్పడ్డాక ప్రతి దశలోనూ అసమ సంబంధాలే ఉ న్నాయి కాబట్టి, వాటి వల్ల కలిగిన మానవ అనుభవమే సాహిత్యానికి ముడి వస్తువు. అసమ సంబంధాల గురించిన ఎరుకే సాహిత్యంలో చైతన్యంగా వ్యక్తమవుతుంది. ప్రతి అసమానతలో హింస ఉంటుంది. అసలు అసమానత అంటేనే హింస. హక్కుల ఉల్లంఘన. అసమానతలకు దోపిడీ పునాదిగా పని చేస్తుంది. దీనికితోడు సాంఘిక, సాంస్కృతిక ఆధిపత్య సంబంధాల వల్ల అసమానతలు కొనసాగుతుంటాయి. అసమానతలు పోవాలని కోరుకోవడం అంటేనే హింస రద్దు కావాలనికోరుకోవడం. దీనికి సమాజంలోని అనేక తలాల్లో మార్పులు జరగాలి. ఇందులో ప్రజల క్రియాశీలమైన, చైతన్యవంతంమైన పాత్ర ఉండాలి. ప్రజలను కేవలం  ప్రేక్షకులుగా, లబ్దిదారులుగా, ఓటర్లుగా చూసినంత కాలం అసమానతలు ఉంటాయి. హింస కొనసాగుతూనే ఉంటుంది. సాహిత్యం అసమానతలకు వ్యతిరేకంగా మానవ చైతన్యాన్ని ప్రజాస్వామికీకరిస్తుంది. హింసకు పాల్చడటం, హింసను అనుభవించడం తగదని ఆలోచింపచేస్తుంది. హింసకు వ్యతిరేకంగా సున్నితమైన స్పందనలుకలిగించడమే మానవ జీవితంలో సాహిత్యం నిర్వహించే పాత్ర. మామూలు స్థితిలో కనిపించని, ఎరుకలోకి రాని హింసా బీభత్సాలను, అణగారిపోయిన స్పందనలను, అస్పష్టంగా ఉండపోయిన ఆలోచనలను, అసంబద్ధ క్రమాలను సాహిత్యం వెలుగులోకి తీసుకొస్తుంది. వాటి అసలు అర్థాలను తిరిగి మానవ అనుభవంలోకి తీసుకొస్తుంది. మనుషులకు తెలిసీ తెలియకా హింసకు పాల్పడే, హింసకు లోనయ్యే అనుభవాలన్నిటినీ రచయితలు తమ సాహిత్యంలో చిత్రిస్తారు. విరసం ప్రణాళికలోంచి పైన ఉటంకించిన వాక్యాలు దానికి సంబంధించినవి. అసమానతలు, ఆధిపత్యాలు, హింసా రూపాలుఎక్కడ ఉన్నా వ్యతిరేకించాలనే అవగాహన సాహిత్య సంస్థగా విరసం ప్రాపంచిక దృక్పథంలో భాగం. అయితే హింస కూడదని చెప్పినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. హింస ఎంత అమానవీయమో సాహిత్య పఠనం ద్వారా అనుభవంలోకి తేవాలి. హింస నుంచి బైట పడటానికి మనుషులు ఎంత క్షిష్టభరితమైన నాగరికతా ప్రయాణం చేశాడో, ఎంత సంఘర్షణకు లోనయ్యారో స్పురింపజేయాలి. హింస మ‌నుషుల చుట్టూ ఉండవచ్చుగాక, కానీ మానవులు రూపొందే క్రమంలో హింసకు దూరమయ్యారనే అవగాహన కల్పించాలి. సారాంశంలో మానవ నైజంలో హింస భాగం కాదనే ఆలోచన అందించాలి. అయితే మానవ సమాజం, అందులోని వ్యవస్థలు, వాటి చరిత్ర నిర్మాణమైన తీరు వల్లనే మానవ జీవితంలో అసమానతలు ఉన్నాయి. హింస అమలవుతున్నది. వాటి గురించి ఎరుక కలిగించడమే విరసం లక్ష్యం. విరసం సాహిత్య, సాంస్కృతిక ఆచరణ అంతా దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది.


కానీ జీవో 78లో ప్రధానంగా విరసం హింసను సమర్ధిస్తుందని ప్రభుత్వం ఆరోపించింది. పూర్తి నిరాధారమైన ఈ ఆరోపణ మీద ఆధారపడి మిగతా ఆరోపణలన్నీ చేసింది. విరసానికి హింసా స్వభావాన్ని ఆపాదించడాన్ని మేం మౌలికంగానే ఖండిస్తున్నాం. సమాజంలో పెచ్చరిల్లిపోయిన హింసోన్మాదాలను తన సృజనాత్మక కలాపం ద్వారా ఎత్తి చూపుతున్న విశ్లేషిస్తున్న విరసం మీద తెలంగాణ ప్రభుత్వం హింసారోపణలు చేయడం ఈ కాలానికి చెందిన పారడాక్స్‌గా మేం భావిస్తున్నాం. . అందువల్ల విరసం చట్టవ్యతిరేక సంస్థ అని ప్రకటించడానికి జీవో ఎంఎస్ 78లో చూపిన ఐదు కారణాలకు విరసం ఈ కింది విధంగా తన అభ్యంతరాలు చెబుతోంది.


1. ప్రభుత్వం ఆరోపించినట్లుగా సీపీఐ (మావోయిస్టు) వ్యూహం – ఎత్తుగడల ప్రకారం విరసం పని చేయదు.అలాంటి వాటితో విరసానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తి నిరాధార ఆరోపణ. విరసానికి స్వతంత్రమైన సాహిత్య సాంస్కృతిక లక్ష్యాలు ఉన్నాయి. వీటిని తనదైన తాత్విక పునాది నుంచి ఏర్పరుచుకున్నది. మరే రాజకీయ పార్టీ వ్యూహాలు-ఎత్తుగడలతో దీనికి సంబంధం లేదు. సాహిత్యకారుల సృజనాత్మక రచనా కార్యక్రమానికి తప్పక ఒక తాత్విక దృక్పథం ఉంటుంది. ఉండాలి. దృక్ప‌థం లేకుండా రచన చేయడం సాధ్యం కాదు. విరసం కూడా తన సాహిత్య సాంస్కృతికకర్తవ్యాలకు తగిన తాత్విక దృక్పథాన్ని ఎంచుకున్నది. సాహిత్య రంగంలో విరసానికి ఉన్న ఈ తాత్విక దృక్పథమే వేరే నిర్మాణాలకు కూడా ఉన్నంత మాత్రాన వాటితో విరసానికి అనుబంధం ఉన్నట్లు చెప్పడానికి వీల్లేదు. అసలు తాత్విక దృక్పథం ఏ ఒక్క నిర్మాణానికో, రాజకీయ పార్టీకో సొంతం కాదు. మానవ జీవితాన్ని అందులోని వైరుధ్యాలను, వాటికి ఉండగల పరిష్కారాలను అర్థం చేసుకోడానికి ఎవరికైనా ఒక దృక్పథం ఉండాల్సిందే. సమాజంలో ప్ర‌గ‌తిశీలమైన మార్పు రావాలని ఏరంగంలో కోరుకొనే వారికైనా ఏదో ఒక దృక్పథం ఉంటుంది. ప్రతి రంగానికి దాని స్వభావాన్నిబట్టి ఆ దృక్పథ అన్వయం తప్పనిసరి. రాజకీయ, రాజకీయార్థిక, చరిత్ర, విద్య. సాహిత్య, సాంస్కృతిక తదితర రంగాలనుబట్టి దృక్ప‌థం  అన్వయం అవుతుంది. ఆచరణ రూపాలు అంటాయి. విరసానిది సాహిత్య రంగం. కాబట్టీ తాను విశ్వసించే తాత్విక దృక్చథం భావజాలం, విలువలు, సంస్కృతి మొదలైన అంశాలకు తగినట్లు అన్వయం అవుతుంది. ఈ కార్యరంగానికి తగిన ఆచరణ రూపాలు ఉంటాయి. భావాల అన్వేషణ, భావాల ఉత్పత్తి, వినిమయం, సంఘర్షణ, సామాజిక వాస్తవికతకు తగిన భావాలనురూపొందించడం, జీవితానుభవం నుంచి భావాలకు సృజనాత్మక రూపాన్ని ఇచ్చి కథలు, కవిత్వం, నవలలు, పాటలు రాయడం, సాహిత్య, సామాజిక విమర్శ అందించడం వంటి పనులు విరసం సభ్యులు చేస్తారు. ఇదంతా విరసం ఎంచుకున్న తాత్విక దృక్పథానికి, ప్రణాళిక నిబంధనావళికి లోబడి స్వతంత్రంగా జరుగుతుంది. అంతేగాని ఇలాంటి తాత్విక దృక్పథం  ఉన్న నిర్మాణాలన్నీ అనుబంధంలో ఉండాల్సిన పని లేదు. గాంధేయవాదాన్ని అంగీకరించే వ్యక్తులు ఎందరో ఉన్నారు.నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. అంత మాత్రాన అవన్నీ ఒకదానికి ఒకటి అనుబంధం కాదు. గాంధేయవాదం ఒకానొక దృష్టి కోణం. దాన్ని ఎవరైనా స్వీకరించవచ్చు. వాళ్ల మధ్య నిర్మాణ సంబంధం ఉండనవసరం లేదు.

విరసం తన ప్రాపంచిక దృక్పథం ప్రకారం ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక, నిబంధనావళి వెలుగులో పని చేయడానికి దాని సభ్యులతో కూడిన అత్యున్నత బాడీ అయిన సర్వసభ్య సమావేశం మార్గ నిర్దేశం చేస్తుంది. “విరసం సర్వసభ్య సమావేశమే విరసంలో అత్యున్నత సంస్థ. విధాన నిర్ణయాలు చేయడానికి, కార్యనిర్వాహక వర్గాన్ని,  కార్యవర్గాన్ని ఎన్నుకోడానికి దానికి అధికారం ఉంది. సభ్యత్వాన్ని ఆమోదించడంలో, రద్దు చేయడంలో దానిదే తుది అధికారం(విరసం-నిబంధనావళి 6 ఉ, అనుబంధం-2). కాబట్టి విరసాన్ని ఏదో రాజకీయ పార్టీ వ్యూహం ఎత్తుగడల్లో ఇరికించడాన్ని మేం అంగీకరించడం లేదు.

జీవో 73లోని ఈ మొదటి అంశంలోనే.. రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు విరసం గెరిల్లా ఎత్తుడగల ప్రకారం పట్టణాల్లో వివిధ కవర్లలో పని చేస్తున్నదనే మరో ఆరోపణ చేశారు. ఇది పూర్తి వాస్తవ వ్యతిరేకం. రచయితల సంస్థగా విరసానికి ఈ వ్యవస్థ స్వభావం మీద కొన్ని కచ్చితమైన వైఖరులు ఉన్నాయి. అలాగే రాజ్యం మీద కూడా విమర్శలు ఉన్నాయి. చారిత్రకంగా రాజ్యం ఎలా ఏర్పడిందో, ఎలాంటి పాత్ర పోషిస్తున్నదో, ఇప్పుడున్న రాజ్యానికి ఎందుకు కొన్ని ప్రత్యేక స్వభావాలు ఉన్నాయో తన ప్రాపంచిక దృక్పథం నుంచి విశ్లేషిస్తుంది. ఈ రాజ్య వ్యవస్థలో రావాల్సిన మార్పుల గురించికూడా విరసానికి కొన్ని శాప్రీయమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆధునిక, ప్రజాస్వామ్య సమాజంలో అన్ని రకాలుగా సమానత్వం సాధించడం అత్యున్నత విలువ. దానికి సాటిరాగల లక్ష్యం మరొకటి లేదు. సమానత్వాన్ని వ్యక్తి స్వేచ్చను, సాంఘిక సంకెళ్లు లేని ప్రగతిదాయకమైన సమిష్టితత్వం సాధించడానికి సమాజంలో, రాజ్యంలో ఎలాంటి మార్పులు రావాల్సి ఉన్నదో విరసానికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. బహుశా ప్రపంచవ్యాప్తంగా ఆలోచనాపరులందరూ, రచయితలందరూ విడిగాగాని, సంఘటితంగాకాని ఆయా కాలాల్లో ఇలాంటి ఎన్నో ఆలోచనలు చేసినవాళ్లే. మనుషుల వ్యక్తిగత జీవితం, సామాజిక జీవితం అర్థం కావడానికి, ప్రగతిదాయకమైన విలువల మీద అవి పటిష్టం కావడానికి, సారాంశంలో ఉన్నతమానవీయ సంబంధాలు రూపొందడానికి ఇలాంటి ఆలోచనలు పురికొల్బాయి. మనకు తెలిసిన చరిత్ర అంతా ఇలాంటి అన్వేషణల ఫలితమే.

సాహిత్య సంస్థగా యాభై ఏళ్లుగా విరసం ఈ పని చేస్తున్నది. భారత రాజ్యాంగం ప్రకారం వేర్వేరు భావజాలాలు గల వ్యక్తులు, సంస్థలు సామాజిక రాజకీయార్థిక సాంస్కృతిక సమస్యల గురించి విశ్లేషించే హక్కు ఉంది. దీన్ని విరసం సహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, పత్రికలు, వ్యక్తులు పరిపూర్ణంగా వినియోగించుకోవాలి. అప్పుడే రాజ్యాంగం ప్రవచించే ప్రజాస్వామ్యం సారవంతం అవుతుంది. రాజ్యం మీద విమర్శలకు, విశ్లేషణలకు చోటు లేనప్పుడు అది నియంతృత్వం అనిపించుకుంటుందేగాని ప్రజాస్వామ్యం కాజాలదు. ఈ స్ఫూర్తితో విరసం తన ప్రాపంచిక దృక్పథం నుంచి రాజ్యం గురించి, ప్రభుత్వం గురించి, ఈ వ్యవస్థ పని తీరు గురించి విశ్లేషిస్తోంది. ఇది భావజాల సాంస్కృతిక కృషి. విరసం తన ప్రణాళిక ప్రకారం ఈ పని చేస్తున్నది. ఆ ఆలోచనాత్మక కృషిని రాజ్యంపై యుద్ధమని అనడం, పట్టణ గెరిల్లా ఎత్తుగడలు అనడం పూర్తి నిరాధార ఆరోపణ. తద్వారా ప్రజాస్వామ్య క్షేత్రంలో ఒక సాహిత్య సంస్థ బాధ్యతాయుత కార్యాచరణను అవమానపరచడమే. విరసం కార్యరంగానికి సంబంధం లేని దురారోపణ చేయడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యం.

2. జీవో ఎంఎస్ 73లోని రెండో అంశంలో మరికొన్ని ఆరోపణలు చేశారు. అవి కూడా నిరాధారమైనవి. మా ప్రజా ఆచరణను వక్రీకరించే ఉద్దేశంతో చేసినవే. విరసం అనేక కొత్త ఎత్తుగడలతో ఇతర సంఘాలతో చేతులు కలిపి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వివిధ సమస్యలను వెలుగులోకి తెస్తున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నామని అందులో రాశారు.
విరసానికి గతంలో ఎలాంటి ఎత్తుగడలు లేవు. ఇప్పుడు కొత్తగా అనుసరిస్తున్న ఎత్తుగడలు అసలే లేవు. ఇతర సంఘాలతో వివిధ సందర్భాల్లో కలిసి పని చేసే మాట వాస్తవం. ముఖ్యంగా విరసం సాహిత్య సంస్ద కాబట్టి సాంస్కృతిక విషయాలపై ఇతర సాహిత్య, కళా సంఘాలతో, వేదికలతో, వ్యక్తులతో కలిసి సభలు నిర్వహిస్తుంటాం. దీన్ని విరసం వాళ్లతో దాన్ని ‘చేతులు కలపడం” అనడానికి వీల్లేదు. ఆ మాట అంటే అవతలి వాళ్లను అవమానించడమే. సాహిత్య సాంస్కృతిక విషయాలపై అందరం కలిసి నిర్వహించడమంటే అవి మా అందరి ఉమ్మడి కార్యక్రమాలని అర్ధం. ప్రజా సమస్యలపైరచయితలు, మేధావులు అందరూ కలిసి సంతకాలతో ప్రకటనలు విడుదల చేసినప్పుడు అందులో సంస్థగా విరసం భాగమవుతుంది.

ఇక వివిధ ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడం రచయితల, బుద్ధిజీవుల నైతిక బాధ్యత. ప్రజల సమస్యలు వెలుగులోకి రావడానికి అనేక మార్గాలు ఉన్నప్పుడే అది ప్రజాస్వామ్యమనిపించుకుంటుంది. తమ పాలనలో ప్రజా సమస్యలు వీలైనన్ని మార్గాల్లో వెలుగులోకి వచ్చే వాతావరణాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. తద్వారానే ప్రజాస్వామ్యం సంప‌ద్వంతం అవుతుందని ఆనందించాలి. ఏ కారణం వల్లనైనా తమ కంటపదని, తాము పట్టించుకోని సమస్యలను రచయితలు వేర్వేరు సృజనాత్మక మార్గాల‌ ద్వారా గ్రహించి, వాటి స్వభావాన్ని, మూలాలను సమాజంలో చర్చనీయాంశం చేయడాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు హర్షించాలి. అంతేగాని ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడమే నేరమని, “ప్రజాభద్రత*కు భంగమని అనుకోనవసరం లేదు. ఈ జీవో 73 అయితే దాన్ని నేరచర్యగా వర్ణించింది.
ప్రజా సమస్యలకుగాని, అవి పరిష్కారం కాకుండా నాన్చివేతకు గురికావడానికి కాని, తద్వారా ప్రజలుఇబ్బందులపాలయ్యేందుకు గాని ప్రభుత్వమే కారణమైతే ఆ సంగతి కూడా సమాజంలో రచయితలు చర్చనీయాంశం చేయాలి. విరసం అదే చేస్తున్నది. కానీ ఈ జీవో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రకటనలు, సమావేశాలు, ఊరేగింపులు చేసేలా విరసం రెచ్చకొడుతున్నదని ఆరోపించింది. విరసం ఎవరినీ ఎలాంటి పనులకు రెచ్చగొట్టదు. ‘రెచ్చగొట్టడం” అనేమాట విరసానికి నేర స్వభావాన్ని ఆపాదించడమే కాక, అవతలి వైపు ఉన్న ప్రజలను చైతన్య రహితులుగా, వివేక హీనులుగా చిత్రిస్తోంది. ప్రజలను తక్కువ చేసే ఏ మాటా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి గౌరవాన్ని ఇవ్వదు.

అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకించడం కూడా రాజ్యాంగబద్ధ‌ హక్కు ప్రతిపక్షాలన్నీ చేసేది ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడమే. ఆ పని ప్రతిపక్షాలు మాత్రమే చేయాలనే నిబంధన రాజ్యాంగంలో లేదు. ప్రజాజీవితాన్ని నిర్ణయించే రాజకీయార్థిక సాంఘిక సాంసృతిక విషయాలన్నీ అధికార, ప్రతిపక్షాలకు అప్పగించి ప్రజలు మౌనంగా ఉండాలని రాజ్యాంగంలో లేదు. ఆధునిక సమాజాల్లో రాజ్యాంగ యంత్రం ఉన్నట్లే పౌర సమాజం కూడా ఉ టుంది. అది క్రియాశీలంగా ఉంటూ ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు పాలకులు తీసుకున్నప్పుడు వాటి మంచిచెడ్డలను పట్టించుకోవాలి. తద్వారా ప్రజానుకూల పాత్ర పోషించాలి.
విరసం గత యాభై ఏళ్లుగా పౌర సమాజంలో బాధ్యతాయుతంగా పని చేస్తున్నది. సాహిత్య, మేధో సంస్థగా తన రచనల ద్వారా ప్రజలను ఆలోచింపజేసే ఆచరణ కొనసాగిస్తున్నది. ఏది హేతుబద్ధమో, ఏది ప్రజాస్వామికమో, ఏది ఉన్నత మానవీయ విలువలకు దోహదం చేస్తుందో పరిశీలించమని సూచిస్తున్నది. మానవ జీవితంలో సాహిత్యకారులు చేయగల పని ఇది మాత్రమే. నిజ జీవితంలోని అనుభవాన్నే రచయితలు సాహిత్యంలో చిత్రించి, దాని మీద పాఠకుల్లో సున్నితమైన ప్రేరణకలిగించి సరికొత్తగా ఆలోచించడానికి దారి చూపుతారు. ప్రభుత్వ విధానాలపై, వ్యవస్థ పనితీరుపై రచయితలు ఒక కాంతిని ప్రసరింపజేస్తారు. సాహిత్య ప్రభావమంటే ఇదే. దీన్ని “వ్యతిరేకించడం”, ‘రెచ్చగట్టడం” లాంటి పదాలతో వక్రీకరించడం, నేరచర్యలుగా వర్ణించడం అభ్యంతరకరం.

ఈ పాయింట్లో ఇంకో ఆరోపణ కూడా ఉంది. ఇతర అనేక సంఘాలతో కలిసి పని చేస్తూ, ఆ సంఘాలసభ్యులను తమ ప్రభావంలోకి ఆకర్షిస్తున్నారని హేతురహితమైన అభియోగం చేశారు. విరసానికి ఒక తాత్విక దృక్పథం ఉన్నట్లే మిగతా సాహిత్య సంస్థలకు, అందులో పని చేసే వ్యక్తులకు కూడా ఒక దృక్పథం ఉంటుంది. దాని ప్రకారమే వాళ్లు పని చేస్తుంటారు. అందరికీ అమోదమయ్యే ఉమ్మడి కార్యక్రమాలకు సిద్ధమవుతుంటారు. అంతేగాని వాళ్లు విరసం ప్రభావంలోకిరావడమనేది ఉండదు. సాహిత్య రంగంలోనైనా, మొత్తంగా ప్రజా క్షేత్రంలోనైనా దృక్పథాల గురించి, ప్రభావాల గురించి తెలియకపోవడం వల్ల, తెలిసినా దురుద్దేశపూర్వకంగా విరసంపై ఈ ఆరోపణ చేశారని భావిస్తున్నాం.8. జీవో ఎంఎస్ 73లోని మూడో పాయింట్లో చాలా అభ్యంతరకర ఆరోపణలు చేశారు. విరసం సభ్యులు క్రమం తప్పకుండా మావోయిస్ట్ పార్టీ నాయకత్వంతో సంబంధాల్లో ఉన్నారని, ఛత్తీస్‌ఘ‌డ్‌ ప్రాంతంలో కలుస్తున్నారని ఆరోపించారు. ఇది పూర్తి నిరాధారం. బహిరంగ ప్రజా జీవితంలో ఉందే విరసం సభ్యులు సీపీఐ మావోయిస్టును కలిసే అవకాశం లేదు. అవసరం కూడా లేదు. అలాగే సిపిఐ (మావోయిస్ట్) ఆదేశాల మేరకు విరసం వివిధ సమస్యలపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కూడా ఇందులో ఆరోపించారు. విరసం తన ప్రణాళికకు అనుగుణంగా సర్వసభ్య సమావేశంలో, కార్యవర్గంలోతన కార్యాచరణను రూపొందించుకుంటుంది. ఆ మేరకు పని చేస్తుంది. ఇవి పూర్తి పారదర్శకమైనది. సందేహాలకు, వక్రీకరణలకు, ఆరోపణలకు తావు లేని బహిరంగ, చట్టబద్ధ ఆచరణ కొనసాగిస్తోంది. విరసాన్ని సీపీఐ (మావోయిస్టు) ఆదేశిస్తుందనడం అసంగతం. ఆ అధికారం సీపీఐ మావోయిస్టుతో సహా మరే రాజకీయ పార్టీకిగాని, సంస్థకుగాని లేదు. విరసం తన ప్రణాళిక ప్రకారం పని చేసే స్వతంత్ర సంస్థ అని మరోసారి తెలియజేస్తున్నాం.
అలాగే బంజరు భూముల సమస్యపై, విరసం వ్యవస్థాపకుడు పి.వరవర రావు, ప్రా. జి. ఎన్. సాయిబాబా, రోనా విల్సన్ తదితర భీమా కోరేగావ్ కేసులో అరెస్టయిన వారి విడుదల కోసం విరసం పని చేయడం ఒక నేరంగా ఇందులో ఆరోపించారు. అలాగే ఇతర సంఘాల నాయకులు, కార్యకర్తలపై అమలువుతున్న రాజ్యహింసకు వ్యతిరేకంగా పని చేయడం నేరంగా పేర్కొన్నారు.

సీపీఐ (మావోయిస్టు) ఆదేశాలతో వివిధ సమస్యలపై విరసం పని చేస్తుందనే మాట ఎంత అబద్ధమో, ఇలాంటి సమస్యలపై విరసం పని స్వంతంత్య్రంగా తన అవగాహన మేరకు పని చేస్తోందనే మాట అంతే సత్యం. దేశంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ భూమి సమస్య పరిష్కారం కాలేదు. ప్రతి పార్టీ తాము అధికారంలోకి వస్తే భూములు పంచుతామని చెప్పేదే. భూ పంపిణీ గురించి అనేక చట్టాలు వచ్చాయి. కమిషన్లు ఏర్పడ్డాయి. అయినా భూమి సమస్య అలాగే ఉన్నదని ప్రభుత్వ ప్రకటనలే చెబుతున్నాయి. దేశంలో, తెలంగాణలో అసమ భూసంబంధాలు ఉన్నాయి.దశాబ్దాల తరబడి ప్రభుత్వం ఏం చేసినా అవి మారడం లేదు. చివరికి బంజరు భూముల సమస్య కూడా అపరిష్కృతంగానే  ఉన్నది. కాబట్టి బంజరు భూముల సమస్య ఎందుకు ఉన్నదో ప్రభుత్వం ఆలోచించుకోవాలి. సమస్య ఉన్నప్పుడు సమాజంలో దాని మీద పోరాటం జరుగుతుంది. ఆ పోరాటాలు ముందుకు వచ్చినప్పుడు సాహిత్య సంస్థగా విరసం అది న్యాయమైనదే అనిఅంటుంది. మద్దతు ఇస్తుంది.

అలాగే ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు విరసం తన ప్రణాళిక-నిబంధనావళికి లోబడివ్యతిరేకిస్తుంది. రాజ్యహింసకు వ్యతిరేకంగా పని చేస్తుంది. “రాజ్యహింస‌*  అనే మాట ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. అంటే రాజ్యహింస కొనసాగుతున్నదని ప్రభుత్వం అంగీకరించినట్లే. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యం అనేది హింసకు పాల్చడ్డాక రచయితలు దాన్ని వ్యతిరేకించాల్సిందే. అక్రమ నిర్బంధాన్ని ప్రయోగించడం తగదని, చట్టబద్ధ పాలన కొనసాగించాలని ప్రభుత్వానికి పౌర సమాజంలో భాగంగా విరసం హితవు చెబుతుంది. ఇది నేరం కాకపోగా బాధ్యత. ప్రభుత్వాలు చట్టబద్ధతకోల్పోతే ప్రజాస్వామ్యమే సంక్షోభంలో పడుతుందనే విమర్శను పాలకులు స్వీకరించాలి. అంతేగాని హక్కుల ఉల్లంఘనను, రాజ్యహింసను ఖండించడమే నేరమని ఈ జీవో పేర్కొనడం ఆశ్చర్యంగా ఉంది. పైగా ప్రజాస్వామిక విలువలపై ఆధారపడి, పౌర స్ఫూర్తితో ఈ పని భారత పౌరులు ఎవరైనా చేయవచ్చు. దీనికి అసంగతమైన, నిరాధారమైన సీపీఐ మావోయిస్టు ఆదేశాలను లంకె పెట్టడం అభ్యంతరకరం.

ఇక విరసం సంస్థాపక సభ్యుడు వరవరరావు, సీనియర్ సభ్యుడు ప్రా. సాయిబాబ తదితరులు విడుదలకు,భీమాకొరేగావ్ కేసులోని మిగతా మేధావుల విడుదలకు విరసం పని చేయడాన్ని కూడా చట్టవ్యతిరేక కార్యకలాపంగా ఆరోపించారు. ఇది అభ్యంతరకరం. మొదటి ఇద్దరు విరసం సభ్యులు కాబట్టి వారి విడుదల కోసం విరసం తప్పక పని చేస్తుంది. అలాగే మిగతా మేధావులను కూడా అక్రమ ఆరోపణలతో నిర్బంధించారని విరసం అభిప్రాయం. వారిపై పెట్టిన కేసుకు ఎలాంటి ఆధారాలు లేవని మా వాదన. కాబట్టి వారికి బెయిల్ ఇవ్వాలని, విడుదల చేయాలని కోరుతున్నాం.

బెయిల్ కోరుకోవడం నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొనే పౌరులందరి హక్కు.  వారి తరపున ఎవరైనా డిమాండ్ మీద పని చేయవచ్చు. ఇది పూర్తి చట్టబద్ధమైన వ్యవహారం. న్యాయ ప్రక్రియలో భాగం. కేసుల స్వభావం ఏదైనా సరే బెయిలు కోసం కోర్టులో ప్రయత్నించవచ్చు. పౌర సమాజంలో దాని కోసం ప్రజాస్వామిక పద్ధతులన్నీ వినియోగించుకొని అభిప్రాయాన్ని కూడగట్టవచ్చు. దాని కోసం ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్మించవచ్చు. బెయిలు ఇచ్చేదీ లేనిదీ న్యాయస్థానంలో తేలుతుంది. కానీ బెయిలు కావాలని కోరుకోవడం, దాని కోసం పని చేయడమే చట్టవ్యతిరేకమని జీవో 78 పేర్కొనడం ఆశ్చర్యం. సాయిబాబా, వరవరరావులకు బెయిలు ఇవ్వాలని విరసం మాత్రమే కాదు. దేశంలోని ప్రధాన ప్రతిపక్షంకాంగ్రెస్ నాయకుల దగ్గరి నుంచి ఎందరో రాజకీయ నాయకులు డిమాంద్ చేశారు. కేవలం ఈ ఇద్దరి విషయంలోనే కాదు, ఇంకా దేశంలోని అనేక మంచి రచయితలు, పాత్రికేయులు, ప్రజా మేధావుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ వాళ్లకు బెయిలు ఇవ్వాలని ఎందరో కోరుకుంటున్నారు. వాళ్లందరూ సీపీఐ (మావోయిస్టు) ఆదేశాలతోనే ఈ డిమాండ్ చేస్తున్నారని ఆరోపించగలరా? వాళ్లందరి న్యాయ ఆకాంక్షను చట్టవ్యతిరేక కార్యకలాపం అనగలరా? నేర విచారణ ప్రక్రియలో భాగమైన బెయిల్ కోసం ప్రయత్నించడం కూడా నేరమే అవుతుందా?

ఉపా చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని ఎందరో న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు విశ్లేషించారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న వాళ్లు తమ రాజకీయ, భావజాల ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి ఇలాంటి అప్రజాస్వామిక, అమానుష చట్టాన్ని తీసుకవచ్చారనే విమర్శలు ఉన్నాయి. అ చట్టాన్ని దాన్ని రద్దు చేయాలని దేశంలో ఎందరో కోరుతున్నారు. విరసం కూడా ఈ దిశగా తన విమర్శ ప్రకటిస్తోంది. ఈ చట్టం సహా మూడు వ్యవసాయ చట్టాలను, సీవవ, ఎన్ఆర్సీలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అనేక భావజాలాలు, రాజకీయాలు ఉన్నవారందరూ కోరుతున్నారు. ప్రభుత్వం చేసేచట్టాలన్నిటినీ పౌరులందరూ విధిగా శివసావహించాలని రాజ్యాంగంలో లేదు. వాటిలో కొన్నిటి మీద కానీ, అన్నిటి మీద కానీ అసంతృప్తిని, అభ్యంతరాన్ని పౌరులు వ్యక్తం చేయవచ్చు. కొన్ని చట్టాలను ఏకంగా రద్దు చేయాలని కోరే హక్కు కూడా భారత పౌరులకు ఉన్నది. కేంద్రం తెచ్చిన ఎన్ఆర్సీ, సీఏఏల మీద తెలంగాణ ప్రభుత్వం కూడా అసమ్మతిని తెలియజేసింది. కానీ ఇప్పుడు ఈ జీవోలో మాత్రం సీఏఏ, ఎన్ఆర్సీల రద్దు కోసం విరసం నిరసన తెలపడాన్ని చట్టవ్యతిరేక కార్యకలాపంగాప్రకటించింది. ఇది తీవ అభ్యంతరం. ఇది పౌరులుగా మా హక్కును నిరాకరించడమేగాక, దాన్ని నేరంగా చిత్రించడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం.

4. ఈ జీవో ప్రకారం చట్ట వ్యతిరేక సంస్థలుగా ప్రకటించిన 16 సంఘాల్లో భాగంగా విరసం సభ్యులు కొందరు, చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు సీపీఐ (మావోయిస్టు) అజ్ఞాత కార్యకర్తలయ్యారని ఆరోపించారు. ఇది పూర్తి నిరాధార ఆరోపణ. ‘ విరసం సమాజ జీవిత ఉపరితల రంగాల్లో అభివృద్ధి నిరోధక భావజాలానికి, విలువలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ పోరాట క్రమంలో బోల్నివిక్ విప్లవంలోను, చైనా విప్లవంలోనే రచయితల, మేధావుల పాత్రను విరసం మార్గదర్శకంగా స్వీకరిస్తుంది. కళల గురించి, సంస్కృతి గురించి మార్క్స్‌,  ఏంగెల్స్, లెనిన్ల‌ సిద్ధాంతాల్ని,  మావో ఏనాన్ ప్రసంగాల్లోని  విప్లవ ప్రజా సాంస్కృతిక పంథాని, గోర్కి, లూషన్ల రచనలను, చైనా సాంస్కృతిక విప్లవ స్ఫూర్తిని విరసం స్వీకరిస్తుంది. సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక సాహిత్య సృజనలో ప్రేమ్‌చంద్  ఆదర్శాన్ని,  విప్లవ సాంస్కృతిక కార్యాచరణలో పాణిగ్రాహి ఒరవడిని విరసం స్వీకరిస్తుంది. కబీర్, వేమనలు మొదలుకొని ఫూలే, జాషువాల వరకు భారతీయ సాహిత్యంలోని ధిక్కార వారసత్వాన్ని,అనుకూలాంశాలను విరసం స్వీకరిస్తుంది. దేశ దేశాంతర ప్రజా సంస్కృతుల‌లోని పోరాటాంశను, ధిక్కార ధోరణిని స్వీకరించి ప్రస్తుత యుగ అవసరాలకు అనుగుణమైన ప్రజాసాహితాన్ని సంస్కృతిని అభివృద్ధి చేయడానికి విరసం కృషి చేస్తుంది.

ఈ ప్రణాళికతో ఏకీభవించే సృజనాత్మక రచయితలకు, కళాకారులకు, సాంస్కృతిక కార్యకర్తలకు,చరిత్ర, తత్వశాస్త్రం, విద్య, విజ్ఞాన శాస్త్రం, సామాజిక శాస్త్రాలు వంటి అంశాల్లో కృషి చేసేవారికి విరసం సభ్యత్వం ఇస్తుంది…”(అనుబంధం : 2 విరసం ప్రణాళిక-నిబంధనావళి 17, 18 నుంచి..)

విరసం కార్యరంగాన్ని ప్రణాళిక ఇంత స్పష్టంగా, వివరంగా నిర్దేశిస్తోంది. ఈ రంగాల్లో బహిరంగ ప్రజా జీవితంలో, కళా మేధో, సృజనాత్మక ప్రక్రియల్లో పని చేసేవారికే విరసంలో సభ్యత్వం ఉంటుంది. దీనికి భిన్నంగా జీవో 78లోని 4వ అంశంలో ఆరోపించినట్లు విరసం సభ్యులు ఎన్నడూ అజ్ఞాత కార్యకర్తలుగా పని చేయలేదు. సీపీఐ (మావోయిస్టు) కార్యకర్తలుగా పని చేయలేదు. ఇది పూర్తి నిరాధార ఆరోపణ.
5. ఈ అంశంలో దాదాపుగా పైన పేర్కొన్న ఆరోపణలే మరోసారి చేశారు. మావోయిస్ట్ పార్టీ ఆదేశాల ప్రకారం పైన పేర్కొన్న 16 సంఘాల్లో భాగంగా విరసం ఉద్దేశ్యాలు, లక్ష్యాలు, సభ్యుల ఏర్పాటు, పని పద్ధతులు ఉన్నాయనే అభియోగం చేశారు. విరసం ఉద్దేశాలు, లక్ష్యాలు సాహిత్య సాంస్కృతిక పరమైనవి. ఈ రంగాల్లో పని పద్ధతి ప్రధానంగా సృజనాత్మక ప్రక్రియల ద్వారా ఉంటుంది. ఈ పని పద్దతులు అన్నీ ప్రజా క్షేత్రానికి చెందినవి. ఆ రకంగా చట్ట పరిధిలో కొనసాగేవి. ఈ పని పద్ధతులను విరసం సభ్యులందరూ ఆచరిస్తారు. కొనసాగిస్తారు. వీటిని సమాజం పట్ల బాధ్యతగల సాహిత్యకారులుగా మేం మా చైతన్యంతో మేంఎంచుకొని నిర్దేశించుకున్నవి. సాహిత్య చరిత్రలో ఎప్పటి నుంచో ప్రజా, విప్లవ రచయితలందరూ ఆయా కాలాల్లో స్వచ్చందంగా స్వీకరించిన కర్తవ్యాలు ఇవి. ఆ వారసత్వంలో భాగంగానే విరసం కూడా ఈ లక్ష్యాలను నిర్వచించుకున్నది. సీపీఐ (మావోయిస్టు ఆదేశాల మేరకు ఈ లక్ష్యాలను, పని పద్ధతులను ఏర్పరుచుకున్నామని అనడం నిరాధారం. దీన్ని మేం అంగీకరించడం లేదు.

ఈ ఆరోపణలు చేసి, వీటిని అడ్డం పెట్టుకొని విరసాన్ని చట్టవ్యతిరేక సంస్థగా ప్రకటించడంపట్ల మేం అభ్యంతరం చెబుతున్నాం. ఈ జీవోలోని 2వ అంశంలో ‘ విరసం చట్టపాలనలో జోక్యం కలిగించుకోవడం, శాంతి భద్రతల నిర్వహణకు భంగం కల్గించడం లక్ష్యంగా వుందడం వల్ల ప్రజల శాంతి భద్రతలకు ప్రమాదం ఏర్పడిందని, అందువల్ల చట్టవ్యతిరేక సంఘంగా ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని రాశారు. విరసం ఎన్నడూ ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకోలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలశాసన అధికారాన్ని గౌరవించి అధికారంలో ఉన్న వారు చట్టబద్ధంగా పాలన సాగించాలని విశ్లేషిస్తూ వచ్చింది. చట్టబద్ధ పాలనకు ప్రభుత్వమే భంగం కలిగించినప్పుడు రాజ్యాంగం పౌరులకు కల్పించిన రాజకీయ, భావ ప్రకటనా హక్కులను అర్ధవంతంగా వినియోగించుకొని ఈ విమర్శ పెడుతూ వచ్చింది. అంతేగాని చట్టం ద్వారా కొనసాగాల్సిన ప్రభుత్వ పాలనలో విరసం ఎన్నడూ జోక్యం కల్పించుకోలేదు. శాంతిభద్రతలకు విరసం భంగం కల్పించలేదు. ప్రజల శాంతి భద్రతలకు భంగం కల్పించకపోగారాజ్యాంగం నిర్దేశించిన ఆదేశిక సూత్రాలకు కట్టుబడి ప్రభుత్వం ప్రజల శాంతి భద్రతలకు పూర్తి రక్షణ కల్పించాలని, చట్టబద్ధ హామీ ఇవ్వాలని, అమలు చేయాలని విరసం కోరుతూ వచ్చింది.
విరసం కార్యరంగం ప్రభుత్వ పాలన పరిధిలోనిది కాదు. విస్తృత ప్రజా సామాజిక రాజకీయార్థిక సాంస్కృతిక జీవితానికి సంబంధించింది. “సామ్రాజ్యవాద, దళారీ పెట్టుబడిదారీ, భూస్వామ్య శక్తులు దేశాన్ని ఆర్థికంగా కొల్లగొడుతూ సాహిత్య, సాంస్కృతిక కళా విద్యా రంగాల్లో ప్రజలు ఉద్యమాల ద్వారా సాధించుకున్న ప్రజాస్వామిక విలువలను నిర్మూలించి, ప్రజలది కాని పరాయి సంస్కృతిని, జీవన విధానాన్ని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తున్నాయి. మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేసిసరుకుల సంబంధాలుగా మార్చివేస్తేన్నాయి. కుహనా విలువలపై మోజు పెంచుతున్నాయి. భక్తి, యోగా విశ్వాసాల పేరుతో హిందూ మతోన్మాదాన్ని బ్రాహ్మణీయ సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయి. కళా, సాహిత్య రంగాల్లో సెక్స్‌ను, హింసను ప్రధానాంశంగా ప్రవేశపెట్టి యువతను నిర్వీర్య‌పరుస్తున్నాయి. స్త్రీ పురుషులలో శరీర సౌందర్యంపట్ల తప్పుడు విలువలను ప్రయత్నపూర్వకంగా పెంచిపోషిస్తున్నాయి. లంపెనిజాన్ని వ్యక్తివాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. సకల మానవతా విలువలను విధ్వంసం చేస్తున్నాయి…” (విరసం ప్రణాళిక: 15 నుంచి..) ఇంత విశాలమైన కార్యరంగంలో సాహిత్య, కళా మాధ్యమాల ద్వారా విరసం పని చేస్తున్నదే కాని ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకోదు. కాబట్టి చట్టపాలనలో విరసం జోక్యం చేసుకుంటోందనే ఆరోపణ నిరాధారమైంది.

తన ప్రణాళిక ప్రకారం విరసం పని చేయడానికి ప్రధానంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. వీటిని కూడా పోలీసు అనుమతి అవసరమైన రూపంలో నిర్వహించదల్చినప్పుడు తప్పని సరిగా చట్టబద్ధంగా వ్యవహరించాం. పోలీసుల అనుమతి మేరకే అలాంటి కార్యక్రమాలు చేపట్టాం. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా, ఇచ్చి రద్దు చేసినా మేం కార్యక్రమాలు విరమించుకున్నాం. విరసం కార్యక్రమాల వల్ల ప్రజా జీవితంలో చిన్న ఆటంకం ఎన్నడూ కలగలేదు.

అందువల్ల ప్రభుత్వ ఆరోపణలకు పైన చెప్పిన ప్రతివాదనల ద్వారా తేలేది ఏమంటే, ప్రభుత్వ నోటిఫికేషన్లో ఆరోపించినట్లుగా చట్టబద్ద పాలనకు విరసం అవరోధం కలిగించడం లేదు. ప్రజా భద్రతా నిర్వహణకు విరసం భంగపరచడం లేదు. ప్రజా శాంతికి విరసం ఆటంకం కాదు. అందువల్ల నోటిఫికేషన్లో ఆరోపించినట్లు విరసంను చట్టవ్యతిరేక సంస్థగా ప్రకటించడానికి హేతుబద్ధ ఆధారాలు ఏమీ లేవు. విరసంలాంటి సాహిత్య సాంస్కృతిక సంస్థను నిషేధించడం రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛ‌కు, సంస్థా నిర్మాణ స్వేచ్ఛ‌కు భంగకరం. అంతర్జాతీయంగా అనేక ఒడంబడికలు గౌరవించిన భావ ప్రకటనా స్వాతంత్య్రానికి ఈ చర్య వ్యతిరేకం.

అందువల్ల జనరల్ అడ్మిని(స్టేషన్(ఎస్పిఎల్డి) శాఖ ద్వారా ప్రభుత్వం 30 మార్చి 2021నాడు జారీ చేసిన జీవో ఎంఎస్ 73 రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని విరసం భావిస్తోంది. కాబట్టి ఈ ఉత్తర్వులను ఉపసంహరించాలని విరసం డిమాండ్ చేస్తోంది.

ఈ సందర్భంగా మీ దృష్టికి ఒక ముఖ్యమైన విషయం తీసుకవస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ను వినియోగించుకొని అప్పటి ప్రభుత్వం ఆగస్టు 17, 2005న విప్లవ రచయితల సంఘాన్ని జీవో ఎంఎస్ 878 ద్వారా నిషేధించింది. దాని మీద ప్రజా భద్రతా చట్టం ప్రకారం అదే రోజు 609 నెంబర్తో అధికార పత్రం విడుదల చేస్తూ ఒక సలహా మండలిని ఏర్పాటు చేసింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ టిఎల్ఎన్ రెడ్డి అధ్యకుడిగా, జస్టిస్ వి. నీలాద్రిరావు(హైకోర్టురిటైర్ట్ జడ్డి, జస్టిస్ ఎ. గోపాల్రావు(హైకోర్టు రిటైర్డ్ జడ్జి)లతో ఏర్పడ్డ ఈ కమిటీ ముందు విరసం తన ప్రతి వాదనలు వినిపించింది. ప్రస్తుత నోటిఫికేషన్లో ఏ ఆరోపణలు చేశారో అవే ఆరోపణలు పదిహేనేళ్ల కింద చేశారు. ఇదే ప్రజాభద్రతా చట్టాన్ని వాడుకున్నారు. విరసం మీద ఆ రోజు చేసిన ఆరోపణల్లో ప్రభుత్వం ఒక్కదాన్ని కూడా ఆ కమిటీ ముందు సహేతుకంగా, సాక్షాధారాలతో నిరూపించుకోలేకపోయింది. దీంతో ప్రభుత్వ ఆరోపణలు పూర్తిగా వీగిపోయాయి. విరసాన్ని చట్ట వ్యతిరేక సంస్థగా గుర్తించడానికిఆధారాలు లేవని విచారణ కమిటీ తేల్చి చెప్పింది. 11.11.2005 నాడు జీవో ఎంస్ 508 ద్వారా ఆగస్టు 17, 2005నాటి జీవో 3738ను రద్దు చేశారు. దీనికి సంబంధించిన నకలు పత్రాలను అనుబంధం 3, 4లో చేర్చుతున్నాం.
2005 నవంబర్లో నిషేధం ఎత్తివేశాక ఈ పదిహేనేళ్లలో విరసం గతంలాగే తన బహిరంగ, చట్టబద్ధ‌, సాహిత్యసాంస్కృతిక కార్యాచరణ కొనసాగిస్తున్నది. ఈ కాలంలో విరసం తన సభ్యులతో సహా తెలుగు సాహిత్యరంగంలోని ప్రముఖులు, యువ రచయితలు, ఔత్సాహిక రచయితలతో కలిసి 16 కథల వ‌ర్క్ షాపులు నిర్వహించింది. 4 కవిత్వం వ‌ర్క్‌షాపులు,  ఒక వ్యాస ప్రక్రియ వ‌ర్క్‌షాపులు నిర్వహించింది. 2005లో నిషేధం ఎత్తివేశాక 2006 జూన్ 10, 11 తేదీల్లో తన ఇరవయ్యో మహా సభలు రచయిత ప్రజల మనిషి అనే అంశం మీద నిర్వహించింది. ఇందులో అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని సుప్రసిద్ధ రచయితల మొదలు మూడు తరాల కవులు, రచయితల పాల్గొన్నారు. అప్పటి నుంచి యథావిధిగా ఒక ఏడాది మహా సభలు, మరో ఏడాది సాహిత్య పాఠశాల నిర్వహిస్తోంది. ఇందులో మేంఏ చట్ట వ్యతిరేక అంశాలు చర్చించలేదు. సరికదా, మానవ జీవితాన్ని ఉన్నతీకరించే అనేక అంశాలు ఇతివృత్తాలుగా వీటిని నిర్వహించాం. ఇందులో తెలుగు రాష్ట్రాలోని ప్రముఖ విశ్వవిద్యాలయా ఆచార్యులు, సీనియర్ పాత్రికేయులు, పరిశోధకులు, సుప్రసిద్ధ కవులు, రచయితలు, ప్రజా ఉద్యమ కార్యకర్తలు పాల్గొన్నారు.ఇవన్నీ బహిరంగంగా వేలాది మంది సమక్షంలో జరిగినవే. ఇందులో ఏ రహస్యం లేదు. కుట్ర లేదు. చట్టవ్యతిరేక వ్యవహారం లేదు. అయినా మళ్లీ 2005నాటి ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వం విరసం మీద చట్టవ్యతిరేక సంస్థ అనే ముద్ర వేసింది. ఈ ఉదంతం ఏం చెబుతోందంటే.. ఒకసారి నిరూపించుకోలేక, కొట్టివేతకు గురైన అవే ఆరోపణలను మళ్లీ వాడుకొని మరోసారి ఈ జీవో ఎంఎస్ 78ను తయారు చేశారు. న్యాయ ప్రక్రియలో కనీస సంబద్ధత లేని వ్యవహారం ఇది. కాబట్టి ఈ జీవో మీద విచారణదాకా వెళ్లనవసరం లేకుండానే దీన్ని రద్దు చేసుకోమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.


ఇట్లు
అర‌స‌విల్లి కృష్ణ‌

అనుబంధం 1 : మరోసారి భావ ప్రకటనా స్వేచ్ఛ‌ సంఘం పెట్టుకొనే హక్కుగురించి..
అనుబంధం 2: విరసం ప్రణాళిక -నిబంధనావళి
అనుబంధం 3 : 2005 ఆగస్టు 17న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విరసాన్ని నిషేధిస్తూ విడుదల చేసిన జీవో ఎంఎస్ 373
అనుబంధం 4: 2005 నవంబర్ 11న నిషేధం ఎత్తివేస్తూ విడుదలైన జీవో ఎంస్ 503 

అనుబంధం1:

మరోసారి భావ ప్రకటనా స్వేచ్ఛ‌, సంఘం పెట్టుకొనే హక్కుగురించి..

భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి ఒక సమాజంలో పదే పదే చర్చ జరగవలసిన స్థితి ఉన్నదంటేనే అక్కడ ఆ స్వేచ్ఛ లేదని అర్థం. సామాజిక ఆధిపత్యశక్తులు, రాజ్యం భావ ప్రకటనను అణిచివేస్తున్నందు వల్లేనే ఈ సమస్య తలెత్తుతున్నది. గత యాభై ఏళ్లుగా ప్రభుత్వం విప్లవ రచయితల సంఘం మీద ప్రభుత్వం ఆంక్షలు పెడుతూ వచ్చింది. ఆయా సందర్భాల్లో సమాజంలో భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి అర్ధవంతమైన చర్చ జరుగుతునే ఉన్నది.

జీవో ఎంఎస్ 73లో ప్రభుత్వం చేసిన ఆరోపణలన్నీ విరసం భావప్రకటనా స్వేచ్ఛ‌ను నిరోధించేందుకే అని మేం అభిప్రాయపడుతున్నాం. ఇలాంటి ఆరోపణల ద్వారా విరసం సాహిత్య సాంస్కృతిక ఆచరణను అద్దుకోదానికి ప్రభుత్వం ప్రయత్నించింది. రచయితల సంఘానికి భావ ప్రకటనా స్వేచ్ఛ‌ ఎంత ప్రధానమో గుర్తించకుండా, దాన్ని అడ్డుకోడానికి మావోయిస్టు వ్యూహం -ఎత్తుగడలతో ముడి పెట్టి నిరాధార ఆరోపణలు చేసింది. విరసం చట్ట వ్యతిరేక సంస్థ అని ప్రకటించింది. అందువల్ల భావ ప్రకటన గురించి కొంత వివరంగానే రాయవలసి వస్తున్నది.

భావ ప్రకటన స్వేచ్ఛ‌ కేవలం సాహిత్యరంగానికి చెందినదే కాదు. మేధావులకు సంబంధించిందే కాదు. అదొక రాజకీయ వ్యక్తీకరణకు మాధ్యమమే కాదు. మన సమాజం నాగరికం అయ్యే క్రమంలో భావ ప్రకటనకు కీలక స్థానం ఉంది. తనను తాను వ్యక్తీకరించుకోవడం ప్రకృతిలో మానవ జీవికి మాత్రమే ఉన్న ప్రత్యేకత. ఆలోచన, వ్యక్తీకరణ అనే రెండు అంచుల మీదిగా మానవ వికాసం జరిగింది. ప్రకృతిలోంచి మానవ సమాజం రూపొందడం, జంతుజాలం నుంచి మానవులు వేరుపడటం వెనుక ఆలోచన, వ్యక్తీకరణ రెండూ ఉన్నాయి. ఇవి మానవుల ఉనికిలో, అస్తిత్వంలో, ప్రగతిదాయక పరివర్తనలోంచి వేరు చేయలేనివి. భాష, కళలు, సాహిత్యం, నాగరికతా వికాసమంతా మానవ శ్రమతో కూడిన ఆలోచన, భావ వ్యక్తీకరణలతోనే సాధ్యమైంది.

అందుకే భావ ప్రకటన కేవలం సాహిత్యానికి సంబంధించిందే కాదు. మానవ సమాజం అనేక కోణాల్లో ఎదగడం వెనుక భావ ప్రకటన ఉన్నది. అందులో సాహిత్యం ఒకటి. భావ వ్యక్తీకరణను అణచివేయదడమంటే ఆలోచించడాన్ని కూడా అడ్డుకోవడమే. ఆలోచనా రహితమైన మానవ సమాజానికి, జంతువుల గుంపుకు తేడా ఉండదు. ఆధునికత వెల్లివిరిస  క్రమంలో ఈ విలువ స్థిరపడింది. దాన్ని పౌరుల హక్షుగా గుర్తించి రక్షణ కల్పించాయి. మానవ నాగరికత నుంచి వేరు చేయడం సాధ్యం కాదు కాబట్టే భావ ప్రకటన స్వేచ్ఛ‌ను ఆధునిక రాజ్యాంగాలు గుర్తించాయి. తమలో భాగం చేసుకున్నాయి. అందువల్లనే మన రాజ్యాంగం నాగరిక, ఆధునిక, ప్రజాస్వామ్య స్వభావాన్ని సంతరించుకుంది. దీనికికట్టుబడి ప్రపంచ చరిత్రలో సాహిత్య కళా సంస్థలను ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఎన్నడూ నిషేధించలేదు. అత్యంత నిరంకుశ, నియంతృత్వ ప్రభుత్వాలు కూడా సాహిత్య సంస్థలను నిషేధించలేదు. సాహిత్యంలో భావ ప్రకటనను నిషేధించినా, హింసతో దాన్ని ముడిపెట్టి వక్రీకరించినా, జీవో 73లాగా సాహిత్య సాంస్కృతిక ఆచరణను మావోయిస్టు వ్యూహం-ఎత్తుగడలలోకి కుదించి నేరమని ప్రకటించినా అది.. మనుషులను నిషేధించడమే. మానవతను చట్టవ్యతికరేకమనినిర్ధారించడమే.
అలాగే మనుషులు ఆనాదిగా ఏ ఒక్కపనీ విడిగా చేయలేదు. ఆహారం వెతుక్కోవడం దగ్గరి నుంచి కళా సాహిత్య సృజన చేయడం దాకా. మానవ కార్యాచరణలోనే ఈ సంఘటిత స్వభావం ఉన్నది. ఆలోచన, వ్యక్తీకరణ అనే రెండు మానవుల సంఘటిత శ్రమ క్రమంలో భాగం. మానవ సంబంధాల్లో భాగమైనందుకే వ్యక్తులు అనేక ఆలోచనలు చేయగలిగారు. వాటిని వ్యక్తీకరించుకోగలిగారు. ఆధునిక మానవులు చైతన్యయుతంగా, ఉద్దేశపూరితంగా సంఘటితం కావాలనుకుంటారు. ప్రజల సంఘటిత పోరాటాల్లో నిగ్గుదేలిన విలువలను, ఆదర్శాలను మన రాజ్యాంగం స్వీకరించింది. అందుకే దానికి ప్రజాస్వామిక స్వభావం వచ్చింది. అందులో ఒకటి సంఘం పెట్టుకొనే హక్కు సంఘం పెట్టుకొనే, నిర్వహించుకొనే హక్కును గుర్తించడం ద్వారా రాజ్యాంగం అనేక ప్రజాస్వామికీకరణ క్రమాలు సమాజంలో ఉంటాయనిఅంగీకరించింది. రాజ్యయంత్రాంగం ఒక్కటే సమాజాన్ని నిర్వహిస్తుందని, అన్ని వైరుధ్యాలను అదే పరిష్కరిస్తుందని అనుకొని ఉంటే ఇంకే ప్రజాస్వామిక ప్రక్రియలకు అవకాశం ఇచ్చేది కాదు. ముఖ్యంగా ప్రజలు సంఘటితం కావడాన్ని అంగీకరించేది కాదు. సంఘం పెట్టుకొనే హక్కును గుర్తించడమంటే భావ ప్రకటనను, రాజకీయ స్వేచ్ఛ‌ను వ్యక్తిగత స్థాయి నుంచి కలెక్టివ్లె వల్లో అంగీకరించడమే. సమాజ ప్రజాస్వామికీకరణలో ఇది అతి ముఖ్యమైన విషయమని రాజ్యాంగం అనుకుంది.

కానీ పాలకులు తమకు ఇష్టం లేని ఆలోచనలను, వ్యక్తీకరణలను చట్ట వ్యతిరేకమని ప్రకటించడంతోపాటు ఆ ఆలోచనల ఉమ్మడి నిర్మాణ రూపాలైన సంఘాలను నిషేధిస్తారు. తెలంగాణ ప్రభుత్వానికి విష రచయితల సంఘం ఆలోచనలు నచ్చలేదు. ఆ భావాల వ్యక్తీకరణ వల్ల తనకు ఇబ్బందికరమని అనుకుంది. చట్టపరంగా ఏ నిర్ణయమైనా తీసుకొనే అధికారం ఉన్నందు వల్ల విరసం భావాలను చట్టవ్యతిరేకమని ప్రకటించింది. వాటిలో హింస ఉన్నదని ఆరోపించింది. చివరికిసంఘాన్నే చట్టవ్యతిరేక సంస్థ అని జీవో తీసుకొచ్చింది. తద్వారా తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో భావజాల సంఘర్షణకు దిగింది. ఈ పని చట్టబద్దంగానే చేయవచ్చు. కానీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చట్ట వ్యతిరేక సంస్థ అని అనేక నిరాధార ఆరోపణలతో ఈ జీవో తీసుకొచ్చింది.

అనుబంధం 2:

విరసం ప్రణాళిక –నిబంధనావళి

అనుబంధం 3:

2005 ఆగస్టు 17న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవిరసాన్ని నిషేధిస్తూ విడుదల చేసిన జీవో ఎంఎస్ 373


విప్లవ రచయితల సంఘం (ఆర్‌డ‌బ్ల్యూఏ), భారత కమ్యూనిస్టుపార్టీ (మావోయిస్టు)అనుబంధ సంస్థ-చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించనైనది(జివో ఎంఎస్ నెంబర్: 375, సాధారణ పరిపాలన(ఎస్సి-ఎ) 17, ఆగస్టు 2005)భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు)గా పిలవబడే సంస్థ తుపాకులు, పేలుడు పదార్దాలు, మందు పాతరలు, క్రైమోర్ మైన్లు, రాకెట్ లాంచర్లు ఉపయోగిస్తూ బలప్రయోగం, హింస, ఉగ్రవాద కార్యకలాపాలద్వారా చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలదోసే లక్ష్యంతో పని చేస్తోంది మరియు దాని అనుబంధ సంస్థ విప్లవ రచయితలసంఘం(ఆర్డబ్య్యూయే )భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ‘పాక్షన్ కమిటీల ద్వారా, అనుబంధ సంస్థగా ఏర్పడి దిగువ చర్యలకు పాల్పడుతోంది.

1. తుపాకులు, పేలుడు పదార్థాలు, మందుపాతరలను ఉపయోగిస్తూ బలప్రయోగం, హింస, ఉగ్రవాదకార్యకలాపాల ద్వారా చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలదోసే లక్ష్యంగా గల భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రయోజనాలు, లక్ష్యాలను నెరవేర్చుటకు ఒక సాధనంగా ఉపయోగపడుతుంది.

2. వారి మనుసులలో భయం, ఆందోళన కలిగించుటకు చట్టవ్యతిరేక కార్యకపాలాలు చేసేఉగ్రవాదం, గుండాయిజం కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ వ్యాపింప చేస్తోంది.

3. చట్ట ప్రకారం ఏర్పడిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రమ పద్ధతిలో అసంబద్ధమైన సమాచారాన్ని ప్రచారం చేస్తోంది.

4 సాంస్కృతిక కార్యకలాపాల నిర్వహణతోపాటు పత్రాలు, కరపత్రాలు, పత్రికా ప్రకటనలు, సాహిత్యాల ద్వారా ప్రజలలో హింసాత్మక ధోరణిని ప్రచారం చేస్తోంది.

5. భారత కమ్యూనిస్టుపార్టీ (మావోయిస్టు) బృందంతో సమా వివిధ తీవ్రవాద సంస్థల ద్వారా పాల్చడుతున్న హింసాత్మక చర్యలను సమర్థిస్తూ ఎలక్షానిక్ మరియు ప్రింట్ మీడియాలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

6. మావోయిస్టుల మరియు ఇతర తీవ్రవాద సంస్థలకు అగ్రస్థానం ఇవ్వడానికి అనుబంధ సంస్థగా పని చేస్తోంది. మరియు ప్రజలలో హింసాత్మక ధోరణిని ప్రోత్సహిస్తోంది.

7 చట్టబద్ధంగా పని చేసే ఏజెన్సీలను నైతికంగా భంగపరిచే ఉద్దేశంతో సాధారణ ప్రభుత్వ ‘సేవకులు పోలీసు సిబ్బందికి వ్యతిరేకంగా అనుబంధ సమాచార ప్రచారం సాగిస్తుంది. మరియు బహిరంగ ప్రకటన, సాంస్కృతిక కార్యకలాపాలు సమావేశాల నిర్వహణ, హింసాత్మక చర్యలను ప్రోత్సహిస్తోంది.

8. భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) దళం యొక్క పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సమాచారం సేకరించి అందిస్తోంది. మరియు మనుషులను, మెటీరియల్ లాజిస్టిక్ మద్దతును కల్పిస్తోంది.

9. అండర్ గ్రౌండ్ కేడర్‌కు ఆశ్రయం కల్పిస్తోంది మరియు ప్రభుత్వం చట్టాన్ని అమలు పరిచే ఏజెన్సీలచే చేపట్టబడిన చర్యలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తోంది.

విప్లవ రచయితల సంఘం(ఆర్‌డ‌బ్ల్యూఏ) అనే సంస్థ దాని లక్ష్యాలు, న్యాయపాలనలో జోక్యం కలిగించుకొనుట, ప్రజాపాలన నిర్వహణ భగ్నం చేయుట, ప్రజాశాంతికి ప్రమాదం కలిగించుట వలన పైన తెలిపిన కారణాల వలన చట్టవ్యతిరేక సంస్థగా అభిప్రాయపడుతోంది మరియు ప్రకటిస్తోంది.

విప్లవ రచయితల సంఘం(ఆర్‌డ‌బ్ల్యూఏ) అనే సంస్థ కార్యకలాపాల వలన తక్షణం అమలులోకి వచ్చే విధంగా  దానిని చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ప్రభుత్వం భావిస్తోంది.

అందువల్ల, ఆంధ్రప్రదేశ్ ప్రజా భద్రతా చట్టం, 1992 (చట్టం21, 1992) సెక్షన్ 3(1) ద్వారా సంక్రమించినఅధికారాలను వినియోగించుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవ రచయితల సంఘాన్ని(ఆర్‌డ‌బ్ల్యూఏ)ను చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటిస్తోంది మరియు అధికారిక రాజపత్రంలో ప్రచురణ తేదీ నుంచి ఈ ప్రకటన అమలులోకి వస్తుందని సెక్షన్3(1) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ ఆదేశిస్తోంది.

అనుబంధం 4:

2005 నవంబర్ 11న నిషేధం ఎత్తివేస్తూ విడుదలైన జీవో ఎంస్ 503


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రజా భద్రతా చట్టం 1992- విప్లవ రచయితల సంఘం
చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటిస్తూ ప్రకటన -ఎత్తివేత-ఉత్తర్వుల జారీ
సాధారణ పరిపాలనా విభాగం(ఎస్సిఏ) జీవో ఎంఎస్ నెంబర్ 503


తేదీ: 11.11. 2005


కింది వానిని చదువుము

1. జీవోఎంఎస్ 378 సాధారణ పరిపాలనా విభాగం ఎస్సిఏ తేది: 17. 8. 2005
2. జీవోఎంఎస్ 374 సాధారణ పరిపాలనా విభాగం ఎస్సిఏ తేదీ: 17. 8. 2005

ఉత్తర్వు:

12.11.2005న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజపత్రం ప్రత్యేక సంచికలో దిగువ పేర్కొన్న ప్రకటన ప్రచురితమవుతుంది.

ప్రకటన


1. ఆంధ్రప్రదేశ్ ప్రజా భధ్రత చట్టం 1992(చట్టం నెంబర్ 25-1992)లోని మూడవ సెక్షన్లోని సబ్ సెక్షన్(1)కింద లభించిన అధికారాలను వినియోగించుకొని ప్రభుత్వం 17-68-2005న జీవో ఎంఎఎఓస్ 3873 జి.ఎ(ఎస్పిఏ) విభాగంనుంచి విప్లవ రచయితల సంఘాన్ని చట్ట వ్యతరేక సంస్థగా ప్రకటిస్తూ ఒక ప్రకటనను జారీ చేసింది. అది 17-8-2005 తేదీఆంధ్రప్రదేశ్ రాజపత్రం నంబర్ 608లో అచ్చయింది.

2. ఆంధ్రప్రదేశ్ ప్రజా భద్రతా చట్టం 1992 (చట్టం నెంబర్ 25:1992)లోని 5వ సెక్షన్, సబ్ సెక్షన్1 ప్రకారంఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్ట్ జడ్జి జస్టిస్ శ్రీ టిఎల్ఎన్ రెడ్డి అధ్యక్షతన మరి ఇద్దరు సభ్యులుగా నియమించబడిన సలహా సంఘం ఆ ప్రకటనను తదితర సంబంధిత సమాచాన్ని 28.9.2006, 15.10.2005 తేదీలలో జరిగిన సమావేశాలలో అవగాహన చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజా భద్రతా చట్టం 1992లోని సెక్షన్ 3(1) కింద విప్లవ రచయితల సంఘాన్ని చట్టవ్యతిరేక సంస్థగా ప్రకటించడానికి, సాధారణ పరిపాలనా విభాగం(ఎస్సివ)17.8. 2005న జీవో ఎంఎస్ 37ను విడుదల చేయడానికి తగినంత కారణం లేదని అభిప్రాయపడింది.

3. అందుచేత సలహా సంఘం వెలుబుచ్చిన పై అభిప్రాయాన్ని పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజా భద్రతా చట్టం 1992లోని సెక్షన్3, సబ్ సెక్షన్(5), సెక్షన్7లోని సబ్ సెక్షన్(2)ల కింద తనకు లభించిన అధికారాలను ఉ పయోగించుకొని ప్రభుత్వం విప్లవ రచయితల సంఘాన్ని చట్టవ్యతిరేక సంస్థగా ప్రకటింస్తూ జిఎ ఎస్సీఏ విభాగం 17.8.2005న జీవో ఎంఎస్ నంబర్ 378 కింద విడుదల చేసిన ప్రకటనను ఇప్పుడు ఎత్తివేస్తున్నది.


ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరిట
ఆయన అనుమతితో
టికె దివన్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి



Leave a Reply