మాష్టారూ‌ మీరూ అబద్ధాలాడతారని అనుకోలేదు. ‘వందేళ్ళుంటాను ..ఈ వందేళ్ళూ కథకి, కథానిలయానికి చెయ్యాల్సిన పనులున్నాయి అవి పూర్తిచెయ్యాలి’  అని‌ మాటిచ్చి  ఇలా చెప్పాపెట్టకుండా వెళ్ళిపోవడం ఏమైనా బాగుందా? మీరూ మోసం చెయ్య‌గలరా ? మీ మాటమీద నమ్మకంతో మేం ధైర్యంగా ఉంటే కూతుర్ని మాత్రం రప్పించుకుని మాకు చెప్పకుండా  అర్థాంతరంగా వెళ్ళిపోవడం మోసం కాదా మాష్టారూ. మీరు ఆడినమాట తప్పుతారని కలలో కూడా అనుకోలేదు. ప్రతి ఏడాదీ ఫిబ్రవరి రెండో శని,ఆదివారాలు కథానిలయం వార్షికోత్సవాలు జరుగుతాయని, ఆ రెండురోజులూ అదొక సాహిత్యోత్సవంగా జరగుతుందని, దేశవిదేశాల నుండి కథాభిమానులు వస్తారని ముందురోజే రాకపోతే ఊరుకునేది లేదని ఎన్నన్నారు..మూడేళ్ళుగా ఆ సందడే లేకపోయింది కదా.మాట నిలబెట్టుకోలేకపోయినందుకు లోలోపల దుఃఖాన్నెంత దిగమింగుకున్నారో కదా. ‘వందేళ్ళ పండగ ఘనంగా చేద్దురుగాని’ అని అన్నారు‌ కదా ..అదీ మరిచిపోయారు. మీరూ అందర్లాటివాళ్ళేనా మాష్టారూ. మేమైతే అలా అనుకోలేదు. మా మాష్టారు ప్రత్యేకం, స్థితప్రజ్ఞులు, భీష్ముడులాగా ఎప్పుడు ఈలోకాన్ని వదలాలంటే అప్పుడే వెళ్ళగలరు..అంతదాకా మాతో ఉంటారని అది శతవర్షసంబరమే అవుతుందని ఎంత నమ్మకంగా ఉన్నామో. వయసు మీదపడితే అందర్లాగే మీరూ అన్నీ మరిచిపోయారా?

కలిసిన ప్రతిసారీ కథగురించి  ఏదో ఒక కొత్త సంగతి చెప్పేవారు కదా.ఇప్పుడు ఎవరు చెప్తారు? ఒకనాటి మహా కథకుల గురించిన ముచ్చట్లు ఎవరు వినిపిస్తారు?

గురజాడ కథల్లోని దార్శనికతగురించి, కొకు కథలోని లోతులగురించి ఆసక్తికరమైన అంశాలుగా ఎవరు  చెప్తారు? శ్రీశ్రీని నేను చూడలేని దురదృష్టం నాది మాష్టారూ అంటే శ్రీశ్రీ గారు చదువుతుంటే అతని ఏకాగ్రత గురించి, పఠనంలో శ్రీశ్రీ లీనమైనప్పటి అతని ముఖకవళికలగురించి కళ్ళకు కట్టినట్టుగా మాకు ఎవరు వివరిస్తారు? కథలమేస్త్రి రావి శాస్త్రి గారి సరదాకబుర్లలోని సామాజిక విశేషాల్ని మీకంటే గొప్పగా చెప్పేవారెరున్నారు?

మీలాగా  జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా కడదాకా కొనసాగించినవారెవరైనా ఉన్నారంటే నమ్మలేను. సాహిత్యం ద్వారా లభించిన ప్రతిపైసా సాహిత్యానికే ఖర్చుచేయాలని అలగే చేసి చూపిన మీదారిలో నడవడం ఎంతకష్టమో మాకు‌ అర్థమయ్యింది. అందరూ కారా మాష్టర్లు కాలేరని బోధపడింది. మీలాగా జీవించడం అది అసిధారావ్రతమని, అందరికీ అది సాధ్యం కాదని ఎప్పుడో తేలిపోయింది.

పెళ్ళయిన తొలిరోజులనాటి సంగతులు మీ తొంభయ్యేడో పుట్టినరోజు నాడు  చెప్తున్నప్పుడు మీ కళ్ళవెనక దోబూచులాడే వెలుగునీడలు నా కళ్ళముందు కదలాడి కల్లోలపరుస్తున్నాయి మీలాగా ఆలోచించలేకపోయినందుకు. సీతమ్మగారిపట్ల మీరు చూపిన ఆనాటి ఆ శ్రద్ధ, ఆసక్తి మీరు చెప్తుంటే మీతో రాముడెక్కడ సరితూగగలడు? అనిపించేది.  పుస్తకాలు చద‌వడానికి, భార్యతో కొంత సమయం గడపడానికీ కుదరడం లేదని ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్నొదిలి తక్కువ జీతానికి ఉద్యోగంలో కుదురుకోవడం మీకేచెల్లింది.

మాష్టారూ ఎన్నికబుర్లని, నా తొలికథ విముక్తి చదివి ఈ అనామకుడికోసం వెతికి వెతికి పట్టుకుని, బెదురుబెదురుగా ఉన్న నన్ను లాక్కెళ్ళి నాలోని భయాన్ని పోగొట్టి పక్కన కూర్చోపెట్టుకుని కథ గురించి ఎన్నెన్ని విశేషాలు చెప్పారో కదా. ఒక కొండ గడ్డిపరకను వెదుక్కొనిరావడం లాంటిదే కదా నన్ను వెదకడం. అందుకే కదా మిమ్మల్ని అందరూ మేష్టారని గౌరవించేది. గురువు అనే పదానికి నిజమైన అర్థం మీరే అంటే కాదనేవారుంటారా ఎక్కడైనా. అందుకే కదా రావిశాస్త్రి గారు మిమ్మల్ని అంత గొప్పమాటతో గౌరవించింది. దేవుడ్ని అందరూ  మొక్కుతారు,దేవుడే మనిషైవస్తే ఆదేవుడూ మిమ్మల్ని‌ మొక్కుతాడని ఎంత గొప్పగా చెప్పారు. అందరూ కథలో కవిత్వమో రాస్తారు గానీ రాసిన రాతలకు కట్టుబడి ఉండేవాళ్ళెందరుంటారు‌ మీలాగ? అందుకే గదా మీరంటే ప్రపంచానికి గౌరవం. మీ సాహిత్యం ఎంతగొప్పదో అంతకంటే గొప్పది మీ వ్యక్తిత్వమని, అదీ  గురువుగారంటే అని‌ గర్వంగా చెప్పుకుంటాం.

మాష్టారూ..ఒక మాట.  మీ శిష్యుడు, నా సోదరుడు అప్పల్నాయుడు ఒక మాటన్నాడు..మీరు వ్యక్తిగా అప్పల్రాముడు, రచయితగా సీతారాముడు అని. మీరొప్పుకున్నారా ఆ మాటని, మరొకరెవుళో మీరంటే గిట్టనోడు అన్నాడొకసారి  ‘శ్రీరాముల్నాయుడు కారా కాడా’ అని . మరొకరన్నారు ‘ కారా కీర్తికాముడు, పాతిక కథలుమాత్రమేరాసి, కథానిలయం కట్టి ఆ కీర్తిమీదబతికెస్తన్నాడు’ అని. ఎవరేమన్నా ఏమీ‌మాట్లాడరు..మౌనంగా కారా కిళ్ళీ నోట్లో వేసుకుని‌ గుంభనంగా నవ్వుకుంటారు. మీరు గొప్ప లోతుగుండెమీది. బహుశా అందుకేగావాలి మీ కథలు అంతలోతుగా ఉంటాయి. “ఆర్కియాలజిస్ట్ భూమిపొరల్ని పొరాపొరా తీసి చరిత్రకాలాన్ని నిర్నయించినట్టు మీ కథల్ని కూడా పొరకుపొరా విప్పుకుని అధ్యయనం చెయ్యాల్సిందే”నని వేల్చూరివారన్నారుకదా .అక్షరసత్యం సుమా.

మాష్టారూ

మీరున్న‌ప్పుడు తరచూ వచ్చే నేను మీ చివరిప్రయాణం చూడ్డానికి రాలేకపోయానని కోపమొచ్చిందా? మీకు తెలుసుకదా సర్. అయినా వద్దామని బయలుదేరితే రావొద్దని‌ మనోళు ఫోన్ . ఏంచెయ్యను..నాది దురదృష్టం. మీ అంతిమ యాత్ర జనసంద్రం పొంగినట్టు జరగాల్సింది..అతి కొద్దిమందితో ….జరగడం జీర్ణించుకోలేకపోతున్నాను. గుర్తుచేసుకుంటే నేను చివరిచూపు చూడనందుకు‌ సిగ్గుపడుతున్నాను. మీకు‌ కోపం రాదని నాకు తెలుసు. స్థితప్రజ్ఞులు మీరు. రుషితుల్యులు. రాగద్వేషాలకు అతీతంగా సాగిపోయారు.

మీరు చేయిపట్టి నడిపించి, కథానిలయం ప్రారంభ సభలో నాపుస్తకాన్ని ఆవిష్కరించి కథాదీపధారిగా నాకు కథలదారి చూపించిన‌ మిమ్మల్ని మీరునాకు కానుకచేసిన పుస్తకాలలోని మీ సంతకాల్లో మిమ్మల్ని‌చూసుకుంటాను. తల్లిరుణం,తండ్రిరుణం,గురువురుణం తీర్చుకున్నట్టే సమాజరుణం తీర్చుకోవాలని‌మీరు చెప్పినమాట మరిచిపోలేదు‌ మాష్టారూ.

భక్తులకు పుణ్యక్షేత్రం లాగా కథానిలయం మాకు నిత్య దర్శనీయక్షేత్రం.

ఎన్నో కబుర్లు చెప్పాలనుకున్నాను ..

మరోసారి మనవిచేసుకుంటాను గురువుగారూ. గురువన్నా అదేంటి గురూ…మనం సాహిత్య సహచరులమే అనే గొప్ప సంస్కారం ముందు తలవంచడం మాత్రమే చేయగలను.

ఉంటాను మాష్టారూ.

Leave a Reply