ప్రముఖ కథా రచయిత శ్రీపతి(పుల్లట చలపతి) ఫిబ్రవరి 7వ తేదీ హైదరాబాదులో మరణించారు. ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం భైరిపురం. హైదరాబాదులో ఉపాధ్యాయుడిగా, ఆ తర్వాత ఢల్లీిలో ఆలిండియా రేడియో న్యూస్ రీడర్‌గా పని చేసి తిరిగి హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డారు. ఆయన కథా రచనలోకి ప్రవేశించాక కొద్ది కాలానికి శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం ఆరంభమైంది. ఆ పోరాటానికి ప్రతిస్పందించిన తొలి తరం విప్లవ రచయితల్లో, బుద్ధిజీవుల్లో శ్రీపతి ఒకరు. శ్రీకాకుళ పోరాట నాయకులు వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంతో, సుబ్బారావు పాణిగ్రాహితో ఆయనకు ప్రత్యక్ష సంబంధం ఉండేది. అందువల్ల కూడా ఆ పోరాట రాజకీయాలను మధ్య తరగతి రచయితల్లోకి, కళాకారుల్లోకి శ్రీపతి తీసికెళ్లారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాదు దాకా ఆయన నక్సల్బరీ శ్రీకాకుళ పోరాట సందేశాన్ని ప్రచారం చేశారు. శ్రీకాకుళ పోరాట నాయకత్వం దగ్గరి నుంచి అప్పటికి బైట ఉన్న కొండపల్లి సీతారామయ్య దాకా విప్లవోద్యమ సంబంధాల్లో తాను ఉండి, అనేక మందిని ఆ సంబంధాల్లోకి తీసికెళ్లారు. అంతగా శ్రీపతి విప్లవ రాజకీయాలతో కలిసి ఉన్నందు వల్లనే సమకూర్చినవాళ్లలో ఆయన కూడా ఉన్నారు. శ్రీకాకుళ పోరాటం ప్రచండమైన భావజాల, రాజకీయ వాతావరణాన్ని సృష్టించినప్పటికీ, వ్యక్తులను, వాళ్ల ఆలోచనలను, సంబంధాలను ఆ దిశగా మళ్లించవలసిన అవసరం ఉండిరది. దాన్ని శ్రీపతి నిర్వహించారు. విప్లవ సాహిత్యోద్యమంలోకి వచ్చిన దిగంబర కవుల సాన్నిత్యం, తిరగబడు కవుల బృందంలో ఎక్స్రేగా భాగస్వామ్యం ఆయన ఈ పనులు చేయడానికి అనుకూలించాయి. శ్రీకాకుళ పోరాటంలోని రాజకీయ అంశను గుర్తించి, చరిత్ర ఇచ్చిన స్థలకాలాల్లో నిలబడి చారిత్రక పాత్ర నిర్వహించారు.
1970 జూలై 3 అర్ధరాత్రి తర్వాత విప్లవ రచయితల సంఘం ఆవిర్భావ ప్రకటన మీద సంతకం పెట్టిన వాళ్లలో శ్రీపతి కూడా ఉన్నారు. విరసం ఏర్పాటుకు పూర్వరంగంలో, ఏర్పాటు ప్రకటనలో ఉన్న శ్రీపతి ఆ తర్వాత సంస్థ నిర్మాణం భాగం కాలేదు. కనీ నాలుగైదేళ్లపాటు సుమారు ఎమర్జెన్సీ వరకు విరసంతో కలిసి నడిచారు. సృజన, పిలుపు పత్రికల్లో రచనలు చేశారు. అంతకంటే ఎక్కువగా ఆ కాలంలో ఆయన విప్లవ సాహిత్యోద్యమానికి ఎప్పటికీ గుర్తుంచుకోదగిన దోహదం చేశారు. విరసానికి రాజకీయ దృక్పథాన్ని, స్వభావాన్ని అందించడంలో ఆయన చేసిన కృషి చాలా విలువైనది.
రచయితగా శ్రీపతి విప్లవ కథకు తొలి అడుగులను తీర్చిదిద్దారు. శ్రీకాకుళం, విశాఖపట్నంలో కాళీపట్నం రామారావు, రావిశాస్త్రి, ఎన్ఎస్ ప్రకాశరావు సహచర్యంతో కథలు రాయడమేగాక, విప్లవ కథకు ఉండాల్సిన వస్తువు, దృక్పథం, శిల్పం మొదలైనవాటిని సమకూర్చే ప్రయత్నం చేశారు. అప్పటికి ఆయన శ్రీకాకుళ నేపథ్యం కొంత ఉన్నప్పటికీ ప్రధానంగా మధ్య తరగతి కుటుంబ జీవితాన్ని చిత్రించే కథలు రాస్తుండేవారు. మంచుపల్లకి`మరి తొమ్మిది కథల్లో ప్రధానంగా ఈ ఇతివృత్తం కనిపిస్తుంది. శ్రీకాకుల పోరాట ప్రభావంతో ఆయన కథల్లో మార్పు వచ్చింది. ఆ రోజుల్లో ఎక్స్‌రే పేరుతో, శ్రీపతి పేరుతో సృజన పత్రికలో ఆయన కథలు అచ్చయ్యాయి. విప్లవ కథ నిర్మాణానికి ఆయన చేసిన ప్రయత్నంగా వాటిని గుర్తించవచ్చు. ముఖ్యంగా జనవరి 1972 సృజన సంచికలో నర్తోడు కథ దీనికి మంచి ఉదాహరణ. అట్లాగే శ్రీకాకుళ పోరాటానికి ఉన్న చారిత్రక స్వభావాన్ని గుర్తించిన బుద్ధిజీవిగా ఆయన కారా యజ్ఞం కథ ముగింపును సవ్యంగా అర్థం చేసుకున్నారు. విప్లవోద్యమం బద్దలు కావడానికి కారణమైన సామాజిక, రాజకీయ వైరుధ్యాలను చిత్రించిన యజ్ఞం కథ ముగింపుకు ఆ కాలానికి ఉన్న పరిమితులు కారణమని, అందువల్ల ఆ కథ అట్లా ముగిసిందనే వివరణ అనేక వైపుల సామాజిక, సాహిత్య, ఉద్యమ చర్చకు కారణమైంది. ఇది కథా రచనలోనేగాక, కథా విమర్శలో, పరిశీలనలో కూడా శ్రీపతి దృష్టి కోణాన్ని తెలియజేస్తుంది.
ఆయనకు కథ పట్ల ఉన్న శ్రద్ధ వల్ల ఆ ప్రక్రియా వికాసానికి దోహదం చేశారు. తూరుపు కథా సంకలనం హోరు, న్యూవేవ్ కథా సంకలనాల వెనుక ఎడిటర్‌గా, ఇతరత్రా కూడా శ్రీపతి ఉన్నారు. 1975 తర్వాత ఆయన రాజకీయ దృక్పథంలో మార్పు మొదలైంది. అయితే కథా రచన ఆపలేదు. బెనారస్ చిత్రాలు, సత్యజిత్‌రాయ్ ఎవరు?, కాటుక కళ్లు పుస్తకాలు వచ్చాయి. ఆహ్లాదంగా, అందంగా, ప్రకృతి వర్ణనలతో కథ చెప్పడంలో శ్రీపతి ప్రత్యేకత. విప్లవోద్యమంతో, విరసంతో చాలా కొద్ది కాలమే కలిసి నడిచిన్పటికీ ఒక ముఖ్యమైన చారిత్రక దశలో శ్రీపతి రచయితగా, బుద్ధిజీవిగా కీలకపాత్ర పోషించాడు. అనేక మంది వ్యక్తులు రూపొందడంలో, సందర్భాలు ముందుకు పురోగమించడంలో, ఆనాడు అత్యవసరమైన రాజకీయ వాతావరణం బలోపేతం కావడంలో శ్రీపతి ఉన్నారు. ఆయన చేసిన రాజకీయ, సాహిత్య కృషిని సదా విరసం గుర్తుంచుకుంటుంది. ఆయనకు నివాళి ప్రకటిస్తోంది.
జోహార్లు. అశృ నివాళులు శ్రీపతి గారికి.