తత్వశాస్త్రం అంటే సామాన్యులకు అర్థంకాని నిగూఢమైన విషయమని చాలామంది అనుకుంటారు. అందుకు భావవాద తత్వవేత్తలు, ఆధ్యాత్మికవాదులు వాస్తవికతను మరుగుపరిచి , తత్వశాస్త్రం పట్ల మార్మికతతో వ్యవహరించడమే ప్రధాన కారణం. ఇహలోకంలోని సామాజిక జీవితంతో సంబంధం లేని, మానవ అనుభవంలోకి రాని ‘పరలోకపు’ విషయాలతో గందరగోళపరచడం వల్ల సామాన్యజనం తత్వశాస్త్రాన్ని నిగూఢమనుకునేలా చేశారు. పైగా ఈ ప్రకృతిని, ప్రపంచాన్ని దైవ సృష్టి అనడంతో ప్రజల్ని నిమిత్తమాత్రుల్ని చేశారు. అందుకే విప్లవ రచయిత చెంచయ్య గారు ప్రకృతిని, ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు అనే ప్రశ్నే సరైంది కాదని ఈ పుస్తకంలో అంటారు. ఎందుకంటే- ఎవరు సృష్టించారన్న ప్రశ్నలోనే అది ‘సృష్టించబడిందన్నది వాస్తవం’ అన్న ధ్వని ఉంది. కాబట్టిడం సృష్టికర్త ఎవరు అన్న ప్రశ్నకు జవాబు ఉండాలి కదాని అనిపిస్తుంది. అలా అనిపించేటట్టు చేయడమే ప్రజల్ని తప్పుదారి పట్టించడం.
కాని నిజం ఏమిటంటే-ఈ ప్రకృతి అంతా పదార్థం నుండి ఏర్పడింది. ఆ పదార్థాన్ని కూడా ఎవరూ సృష్టించలేదు. ఎవరూ నాశనం చేయలేరు. దానికి ఆద్యంతాలు లేవు. అది నిత్యం ఉనికిలో ఉండి సుదీర్ఘకాలంలో నెమ్మదిగా మార్పు చెందుతూ నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అందులో భాగంగానే నిర్జీవపదార్థం నుండి జీవపదార్థం పుట్టింది. జీవపదార్థంలో జరిగే నిరంతర అభివృద్ధి ఫలితంగానే అత్యున్నతమైన జీవులుగా మనుషులు ఉనికిలోకి వచ్చారు. మానవ శరీరంలో అనేక నాడీకణాల పరిణామాల ఫలితంగా ఏర్పడ్డదే మనిషి మెదడు. అది అత్యంత సంక్లిష్టమైన పదార్థం. మెదడు ప్రత్యేక నిర్మాణ ఫలితమే మనసు లేదా చైతన్యం. అలా ప్రకృతిలో భాగమైన మానవ సమాజం కూడా అభివృద్ధి చెందుతూ వస్తోంది. మొదట ఆటవికులుగా ఉన్న మనుషులు సామాజిక అభివృద్ధి క్రమంలోనే ఈనాటి ఆధునిక మనుషులుగా మారారు.
అయితే ఈ పదార్థ, చైతన్యాల పట్ల సమాజంలో అనేక రకాల దృక్పథాలున్నాయి. పదార్థం ప్రాథమికం, చైతన్యం ద్వి తీయమని భౌతికవాదం అంటే, చైతన్యం/ఆలోచనే ప్రాథమికం, దృగ్గోచర ప్రపంచమంతా దాని ప్రతిబింబం అని భావవాదం అంటుంది. ఈ రెండు వాదాల్లో కూడా అనేక రకాల కలగాపులగపు ధోరణులు ఎన్నో ఉన్నాయి. భావ వాదుల్లో స్వీయాత్మక భావవాదులు, ఆధ్యాత్మిక భావవాదులు, వేదాంత వాదులు, అద్వైత వాదులు ఉన్నట్లే, భౌతిక వాదుల్లో కూడా చార్వాకులు, బౌద్ధ ,జైనవాదులు, అజ్ఞేయవాదులు(సందేహవాదులు), నాస్తికులు, హేతువాదులు, అధి (జడ) భౌతిక వాదులు, యాంత్రిక భౌతికవాదులు మొదలైనవారు ఉన్నారు. ఉనికిలో ఉన్న ఒక్క భౌతిక ప్రపంచాన్ని చూసే చూపులో ఇన్నిన్ని రకాలు ఉండడం, ఇన్నిన్ని రకాల దృక్పధాలు ఉండడం భిన్న కులాలుగా, భిన్న మతాలుగా, భిన్న వర్గాలుగా, భిన్న స్త్రీ , పురుషులుగా విభజితమైన సమాజంలో చాలా సహజం. వీటన్నింటిని చెంచ య్యగారు ఇందులో సోదాహరణంగా వివరించారు.
మనుషులు జీవించే క్రమంలో తాము ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం వెతికారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే తమకున్న జ్ఞానం మేరకు అనేకానేక తాత్విక అన్వేషణలు సాగిస్తూ వచ్చారు. విశ్వానికి మూలం ఏమిటి అని ప్రశ్నించుకుని జవాబులు వెతికారు. కొందరు అగ్ని అని, మరికొందరు వాయువు అని, ఇంకొందరు ఆకాశం అని, నీరు అని చెప్పారు. ప్రాచీన గ్రీకు తత్వవేత్తల్లో చాలామంది జీవాన్ని, పదార్థాన్ని వేరుగా చూడలేదు. అంటే పదార్థానికి విడిగా చైతన్యం ఉంటుందని భావించలేదు. ఇలా తమ తాత్విక చింతనను దైవంతో ముడి పెట్టకపోవడమే వారి విశిష్టత అని చెప్పవచ్చు. సుమారు అదే కాలంలో జీవించిన భారతీయ తత్వవేత్త లైన బుద్ధుడు, చార్వాకులు కూడా విశ్వంలోని పదార్థాలు ఎలా ఏర్పడ్డాయని ప్రశ్నించుకున్నారు. కాని వాటిని ఎవరో సృష్టించారని మాత్రం వారు భావించలేదు. ఆమేరకు వారందరినీ ఆది భౌతికవాదులని అనవచ్చు.
కాని పైథాగరస్ లాంటి గ్రీకు తత్వవేత్త మాత్రం అనేకమంది భారతీయ ఆధ్యాత్మిక వాదుల్లాగే భౌతిక పదార్థాన్ని, ప్రపంచాన్ని వదిలి మానసిక శక్తుల గురించి, అమూర్త భావన గురించి చాలా ఆలోచించాడు. కొందరు గ్రీకు తాత్వికులైతే ఇంద్రియాలను నమ్మకూడదని అవి భ్రమలను కల్పిస్తాయని, నిజమైన జ్ఞానం కేవలం ఆలోచనల ద్వారానే పొందగలమని అన్నారు. మరికొందరు తత్వవేత్తలు భారతీయ ఉపనిషత్ రుషుల్లాగే బహు దేవతావాదాన్ని వ్యతిరేకించి ఏకేశ్వరవాదాన్ని చెప్పి, సమస్త విశ్వం ఆ ఏకైక దైవంలోనే ఇమిడి ఉందన్నారు. నిజానికి చార్వాకుల్ని, బౌద్ధుల్ని మినహాయిస్తే, ప్రాచీన భారతీయ తత్వవేత్తలందరూ దృగ్గోచరమైన భౌతిక ప్రపంచాన్ని భ్రమ లేదా మిథ్య అని, ఆ భ్రమ నుండి విముక్తి పొందడమే మోక్షం అని అన్నారు. భౌతిక ప్రపంచంతో సంబంధం రద్దు కావడమే ఆత్మకు సంబంధించి నిజమైన జ్ఞానమని, ఆనందమని, అదే మోక్షమని ఉపనిషత్తులు కూడా పేర్కొన్నాయి. ఇక్కడే లోతుగా పరిశీలించి చార్వాకంలో భౌతికవాద ధోరణి ఎక్కువ ఉంటే, బౌద్ధంలో గతితార్కిక ధోరణి ఎక్కువ ఉందని, అలా ఉండడానికి ఆనాటి చరిత్ర విధించిన పరిమితే (అంటే సైన్స్ పరిజ్ఞానం లేని పరిస్థితులు) కారణమని చెంచయ్య గారంటారు.
అలాగే ప్రాచీన కాలంలో పుట్టిన ధర్మశాస్త్రాలన్నీ భావవాద తాత్విక చింతనను మరింత పెంచి పోషించి మొత్తం తత్వశాస్త్రం మీదనే పెత్తనం చెలాయించాయి. స్వతంత్ర ఆలోచనా ధోరణి గల భౌతికవాదుల్ని వితండవాదులని ఖండించి, క్రూరంగా శిక్షించాయి. రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాల్లో కూడా భావవాద ధోరణులను చొప్పించారు.శ్రామికులైన శూద్రులు జ్ఞానానికి, వేదాది తాత్విక విషయాలను చదివే అధికారం వారికి లేదని మనువాది శంకరాచార్యుడి లాంటి వాళ్ళు శిలాశాసనం చేశారు. మానవ జోక్యం వల్ల సమాజంలోని మార్పు క్రమం మరింత ప్రభావితం అవుతుంది. అందుకే కాలక్రమంలో మనిషి ప్రకృతి రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ తెలుసుకునే క్రమం ఇంకా నిరంతరాయంగా సాగుతూనే ఉన్నది. వర్గ పూర్వ సమాజంలో అయితే మనుషులకు శాస్త్రీయమైన ప్రాపంచిక దృక్పథం ఉండే అవకాశం లేదు. ఆ కాలంలోని తత్వ‘శాస్త్రాల’న్నీ ఆనాటి అనుభవ పరిశీలనా జ్ఞానం పై ఆధారపడి మాత్రమే ప్రపంచాన్ని విశ్లేషించి, వివరించాయి. కాని సమాజంలో వర్గాలు ఏర్పడడం వల్ల ఆ వివిధ వర్గాల మధ్య ఘర్షణ, ఆయా వర్గాల ప్రయోజనాలు, స్వభావాలు సమాజంలోని సకల రంగాలలో ప్రతిఫలించాయి. కనుక వర్గ సమాజంలోనే వివిధ ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు ఆవిర్భవించాయి. అలాగే తత్వశాస్త్రం కూడా అనేక రకాలుగా అభివృద్ధి చెందింది. హెగెల్, ఫ్యూయర్ బా ల ద్వారా గతితర్కం, భౌతికవాదాలు మరింత అభివృద్ధి చెందాయి. ఆ రెండింటి అంతఃసారాన్ని గ్రహించి పై ఇద్దరిలోనూ ఉన్న భావవాద పరిమితుల్ని మార్క్సు, ఎంగెల్సు లు గుర్తించి, అధిగమించారు.
అయితే మనుషులు ప్రకృతిలోనే కాకుండా సమాజంలోనూ జీవిస్తున్నారు కాబట్టి మానవ విజ్ఞానం పెంపొందడానికి సమాజ శాస్త్రాలను, చారిత్రక తత్వశాస్త్రాలను భౌతికవాద పునాదితో సమన్వయపరచాలని మార్క్స్,ఎంగెల్స్ లు భావించారు. ఫలితంగానే గతితార్కిక చారిత్రక భౌతికవాదం అనే శాస్త్రీయమైన తత్వశాస్త్రాన్ని కనుగొన్నారు. ఈ విధంగా మార్క్సిస్టు తత్వశాస్త్రం పాత యాంత్రిక వాదాలను, అన్ని రకాల భావవాదాలను, పరిమితులతో కూడిన అనేక రకాల భౌతికవాదాలను ఓడించి ముందుకు వచ్చింది. అలా మొట్టమొదటిసారిగా శాస్త్రీయమైన తత్వశాస్త్రం (అంటే మార్క్సిజం) ప్రపంచానికి అందివచ్చింది. అప్పటినుండి మార్క్సిస్టు తత్వశాస్త్రం శ్రామిక వర్గానికి బౌద్ధిక ఆయుధం కాగా, శ్రామికవర్గం మార్క్సిస్టు తత్వశాస్త్రానికి భౌతిక ఆయుధంగా మారిందని మార్క్స్ అంటాడు. మార్స్ కు ముందున్న భౌతికవాదులు బాహ్య ప్రపంచం మానవులపై ప్రభావం చూపుతుందనే ఏకముఖ పార్శ్వాన్ని మాత్రమే వివరించారు. అయితే ఈ బాహ్య ప్రపంచం మనుషులపై ప్రభావం చూపినట్లే, మనుషులు కూడా బాహ్య ప్రపంచం పై ప్రభావం చూపుతారు. అంటే బాహ్య ప్రపంచం మనుషులను మార్చినట్టే మనుషులు కూడా బాహ్య ప్రపంచాన్ని మారుస్తారని మార్క్స్ పేర్కొన్నాడు. దీంతో బాహ్య ప్రపంచం, మనుషుల మధ్య పరస్పర ప్రభావాలు ఏకముఖంగా కాకుండా ద్విముఖంగా ఉంటాయని రుజువైంది.
ఇలా మనుషులు తమ కార్యకలాపాల ద్వారా ప్రకృతిని, సమాజాన్ని తమ సమిష్టి అవసరాలకనుగుణంగా మార్చడాన్నే మానవ ఆచరణ అంటారు. ఈ ఆచరణ మనుషులు చేసే పని/ఉత్పత్తి, శాస్త్రీయ పరిశోధన, సామాజిక కార్యకలాపాలు అనే మూడు రూపాల్లో ఉంటుందని మార్క్సు ఎంగెల్సు లు చెప్పారు. దీన్నే ఆ తర్వాత కాలంలో మావో ఉత్పత్తి, శాస్త్ర ప్రయోగం, వర్గ పోరాటం అనే మూడు రూపాల్లో మానవ ఆచరణ కొనసాగుతుందని చెప్పాడు.
మార్క్సిస్టు తాత్విక చింతనను అవగాహనా సౌలభ్యం కోసం మూడు అంశాలుగా విడగొట్టి అధ్యయనం చేయవచ్చు. అవి గతి తార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం, జ్ఞాన సిద్ధాంతం. (1) ప్రకృతి, మానవ సమాజానికి సంబంధించిన మార్పులు, అభివృద్ధి క్రమాన్ని తెలియజేసేది గతితార్కిక భౌతికవాదం.(2) సామాజిక చరిత్రకు గతి తార్కిక పద్ధతిని అన్వయించడం చారిత్రిక భౌతికవాదం.(3) ఆలోచనకు, ఆచరణకు మధ్య గల సంబంధాన్ని తెలియజేసేది జ్ఞాన సిద్ధాంతం. నిజానికి ఈ మూడు వేర్వేరు అంశాలు కావు, అవి కలగలిసి ఉండే అంశాలే. కాబట్టి పరిశీలనలో ఈ మూడింటిని కలిపే అన్వయిస్తాం. మార్క్సిస్టు మహోపాధ్యాయులు ఈ గతి తార్కిక భౌతికవాద సూత్రాలను రకరకాలుగా చెప్పినప్పటికీ, (1) పరస్పర సంబంధం (2) పరిమాణాత్మక గుణాత్మక మార్పులు (3) అభావం అభావం చెందడం (4) వైరుధ్యాలు అనే నాలుగు సూత్రాల రూపంలో మార్క్సిస్టు తత్వశాస్త్రాన్ని రచయిత చెంచయ్యగారు ఈ పుస్తకంలో చాలా సులభరీతిలో వివరించారు. ఇది పామరులు, పండితులనుకునే వారూ తప్పక చదవాల్సిన తత్వశాస్త్ర పుస్తకం. చెంచయ్యగారు ఉద్దేశించినట్టుగా మార్క్సిస్టు మహోపాధ్యాయుల రచనల్ని చదివి చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి సోపానంగా ఉపయోగపడే ప్రథమ శాస్త్రీయ తత్వశాస్త్ర వాచకమని నిస్సందేహంగా చెప్పవచ్చు.