విజయవాడ విరసం సభల్లో ఆట పాటలతో ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని, పోరాడి గెలవగలమనే విశ్వాసాన్ని అందించిన మూలవాసీ సాంస్కృతిక్‌ కళా మంచ్‌ సభ్యులు తమ గూడేలకు చేరుకున్న కాసేపటికే డ్రోన్‌ దాడులు మొదలయ్యాయి. ఈరోజు(జనవరి 30) మధ్యాహ్నం 2 గంటల సమయంలో బీజాపూర్‌ జిల్లా ఒట్టిగూడ పక్కన పంట పొలాల్లో ఆకాశం నుంచి బాంబులు కురిశాయి. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఉధృతంగా డ్రోన్‌ హెలికాప్టర్‌ దాడులు జరిగాయి. ఇటీవల కొద్ది విరామం తర్వాత, ఎన్నికలు జరిగి బీజేపీ అఽధికారంలోకి వచ్చాక పైనిక చర్యలు తీవ్రమయ్యాయి. ఇవాళ జరిగిన దాడిని అందులో భాగంగానే చూడాలి.

ఈ నెల 1వ తేదీ వేలాది సాయుధ బలగాలు చుట్టుముట్టి తల్లి ఒడిలో ఉన్న ఆరు నెలల మంగ్లి అనే పసికందును హత్య చేశాయి. దీనికి వ్యతిరేకంగా దండకారణ్యమంతా పిల్లలు, విద్యార్థులు చాలా చోట్ల శాంతి ప్రదర్శనలు చేశారు. ఇలాంటి అనేక ఘటనల మధ్యనే తల్లడిల్లుతూ, తిరగబడుతూ, భారత రాజ్యాన్ని ఎదిరిస్తూ పోరాడుతున్న మూలవాసీ సాంస్కృతిక్‌ కళా మంచ్‌ సభ్యులు విరసం సభలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో తెలుసుకొని విజయవాడకు బయలుదేరి వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో రెండు రోజులపాటు నడిచి, కిలోమీటర్‌కు రెండు మూడు సైనిక క్యాంపులను దాటుకొని, ఆ తర్వాత బస్సులు పట్టుకొని వచ్చేశారు.

దండకారణ్యంలో అదాని వంటి కార్పొరేట్‌ సంస్థల దురాక్రమణకు వ్యతిరేకంగా, సైనిక క్యాంపులకు వ్యతిరేకంగా మూడేళ్ల కింద మొదలైన సిలింగేర్‌ పోరాటం వందలాది గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్నదని చెప్పుకొచ్చారు. సైనిక క్యాంపులకు వ్యతిరేకంగా మొదలైన పోరాటం గనుల తవ్వకానికి, పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా అనేక డిమాండ్ల మీద పోరాటాలు ప్రజ్వరిల్లాయని చెప్పారు. సిలింగేర్‌ పోరాటానికి ఏడాది సందర్భంగా తెలుగులో పుస్తకం వచ్చిందని తెలిసి సంతోషించామని, ఇప్పుడు మూడేళ్ల పోరాటాన్ని ఇంకా బాగా రాయవచ్చని అన్నారు.

సభల ప్రోగ్రాంలో ఎక్కువ టైం లేదని, పదిహేను నిమిషాలు మాట్లాడ్డానికి అవకాశం ఉంటుందని చెప్పాం. కార్పొరేటీకరణ, సైనికీకరణః ఫాసిజం అనే సెషన్‌ను ఇద్దరు వక్తలతో నిర్వహించాం. సరిగ్గా పదహేనంటే పదిహేను నిమిషాల్లోనే కార్పొరేట్‌ ఫాసిజాన్ని, వర్తమాన బస్తర్‌ పోరాట చిత్రాన్ని ఒక కళాకారుడు వివరించి శ్రోతల్లో కూచోడానికి వేదిక దిగిపోతోంటే సభాధ్యక్షుడు ప్రోగ్రాం అయ్యే వరకు ఉండమని పిలవాల్సి వచ్చింది. అదీ వాళ్ల క్లుప్తత, సూటిదనం, వినయం, క్రమశిక్షణ.

భారత రాజ్యాంగంలో ఆదివాసుల రక్షణకు హామీ పడిన ఐదో షెడ్యూల్‌లో, ఆరో షెడ్యూల్‌లోని ఆదర్శాల డొల్లతనాన్ని, బూటకత్వాన్ని ఆయన విప్పి చూపించాడు. ఆదివాసులకు శాసనపరమైన హామీ ఇచ్చిన రాజ్యాంగమే వాళ్ల ప్రాంతాలను కార్పొరేట్లు దురాక్రమించడానికి, ప్రతిఘటించిన ఆదివాసులపై వైమానిక దాడులు చేయడానికి భారత రాజ్యానికి దారి చూపిందని ఆయన వివరించినట్లయింది. రాజ్యాంగబద్ధంగానే జరుగుతున్న ఈ దురాక్రమణ యుద్ధానికి రాజ్యాంగవాదులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించడానికే వాళ్లు ఇంత దూరం వచ్చారు.

ఆ ప్రశ్న రాజ్యాంగవాదులకు, ఉదారవాద ప్రజాస్వామికవాదులకు చేరిందా? ఎప్పటికైనా వాళ్లు ఆదివాసుల ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? రాజ్యాంగయంత్రమంతా మూకుమ్మడిగా చేస్తున్న ఈ కార్పొరేట్‌ సైనిక యుద్ధానికి రాజ్యాంగబద్ధ పరిష్కారాన్ని సూచించగలరా?
దండకారణ్యం సహా దేశమంతా కార్పొరేటీకరణ, సైనికీకరణ ఎందుకు జరుగుతున్నదో ఆదివాసులకు స్పష్టంగా తెలుసు. దీనికి పరిష్కార మార్గం కూడా తెలుసు. రాజ్యాంగాన్ని ఒక పవిత్ర భావనగా నమ్మి ప్రచారం చేస్తున్న వాళ్లు ఏమంటారో, ఏం చేస్తారో తెలుసుకుందామనే ఆసక్తికొద్దీ ఇక్కడిదాకా వచ్చారు. పెసా చట్టాన్ని అమలు చేయాలని రాజ్యం మీద ఒత్తిడి చేస్తూనే కార్పొరేటీకరణను, సైనికీకరణను సాహసోపేతంగా ఎదుర్కొంటున్నారు. వాళ్లకు ఈ రెంటి మధ్య పోటీ లేదు. వైరుధ్యం లేదు. చట్టబద్ధ పాలన చేయమని పాలకుల మీద ఒత్తిడి తేవడమంటే రాజ్యానికి, రాజ్యాంగానికి ఉండే వర్గ స్వభావాన్ని బహిరంగపరచడమే.

హిందుత్వ ఫాసిజమంటే కులం, మతం, భావజాలం, సంస్కృతి మాత్రమే అనుకొనే వాళ్లు ఎందరో మన మధ్య ఉన్నారు. బీజేపీని దించేసి కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ఫాసిస్టు సమస్య తక్షణంగా పరిష్కారం అవుతుందని అనుకొనే వాళ్లు ఇంకా చాలా మందే ఉన్నారు. ఇలాంటి ఉదారవాద మేధావులకంటే ఆదివాసులకు ఫాసిజం పట్ల చాలా స్పష్టత ఉన్నదని విరసం వేదిక మీద వాళ్లు ప్రదర్శించిన గోమాత నాటిక తేల్చి చెప్పింది. గో రాజకీయాలను వాళ్లు కార్పొరేట్‌ రాజకీయాలుగా కూడా అర్థం చేసుకున్నారు. ఆవు, అదాని మధ్య సంబంఽధాన్ని మరే విశ్లేషణ అవసరం లేనంతగా బట్టబయలు చేశారు. వాళ్లకు హిందుత్వ ఫాసిజం అంటే కార్పొరేట్‌ హిందుత్వ ఫాసిజమే. అది భావజాలంలోనే కాక కార్పొరేటీకరణగా, సైనికీకరణగా కూడా దేశాన్ని చుట్టుముడుతున్నదని చెప్పడానికే అడవులను దాటి మహా నగరానికి వచ్చారు. అంతా ఇరవై పాతికేళ్ల లోపు ఉన్న యువతీ యువకులు దేశ రాజకీయాలను వివరిస్తూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సూక్ష్మస్థాయిలో ఎత్తి చూపించారు.

సమయాభావం వల్ల అవకాశం లేకపోయిందిగాని, జనవరి 1వ తేదీ సైనిక దాడుల్లో చనిపోయిన మంగ్లీ స్మృతిలో ఒక నాటకాన్ని ప్రదర్శించేందుకు కూడా వాళ్లు సిద్ధమై వచ్చారు. ఇరవై రోజుల్లో ఆ ఘటనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తూ, వాటి మధ్యనే మన కోసం ఒక నాటకాన్ని తయారు చేసుకొని వచ్చారు. అదీ వాళ్ల సృజనాత్మక శక్తి.

పోరాటమే సృజనాత్మకం. ఆధిపత్యమే విధ్వంసం. అనేక సైనిక, వైమానిక దాడుల మధ్య పుట్టి పెరిగిన తరం వాళ్లది. ఈ తాజా బాంబు దాడిని మీరు ఒక వార్తగా అయినా స్వీకరిస్తారా? అని బైటికి చేరవేశారేగాని, కార్పొరేట్‌ హిందుత్వ ఫాసిజాన్ని ఎట్లా ఎదుర్కోవాలో వాళ్ల రాజకీయ వ్యూహం వాళ్లకు ఉండే ఉంటుంది. అందులో ఏ అనుమానమూ లేదు.

Leave a Reply