‘ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం తేలిక. ప్రజాస్వామికీకరణ చాలా కష్టం’ అని ప్రొ. శేషయ్యగారు తరచూ అనేవారు. మనలాంటి సమాజాల్లో పౌరహక్కులు   ప్రజల అనుభవంలోకి రాగల రాజకీయ, సాంస్కృతిక వాతావరణం ఏర్పడ్డం ఎంత కష్టమో చెప్తూ ఈ మాట అనేవారు.

భూస్వామ్యం సాంస్కృతికంగా కూడా బలంగా ఉన్న చోట ప్రజా స్వామికీకరణకు చాలా అడ్డంకులు ఉంటాయి. ఎవరో కొంతమంది ఉదాత్త ఆశయాలతో  ప్రజాస్వామ్యం కోసం పని చేసినంత మాత్రాన అది ఎన్నటికీ ఒక భౌతిక వాస్తవంగా మారదు. వాళ్ల కృషి దోహదకారి కావచ్చు. అంత వరకే. ఆధిపత్య సంబంధాల్లో అణగారిపోతున్న జనం మూకుమ్మడిగా లేచి పోరాటాల్లోకి వచ్చినప్పుడే   ప్రజాస్వామ్యానికి కుదురు ఏర్పడుతుంది. వాళ్లు చైతన్యవంతమై రెక్కలల్లార్చి, శ్రమ చేసే ఆ చేతుల్లోకి దొరికిన పోరాట రూపాలన్నీ అందుకున్నప్పుడే ప్రజాస్వామ్యం ఎట్లా ఉంటుందో అనుభవంలోకి వస్తుంది.

ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన, ఆధునిక  విలువలు పై నుంచి  వచ్చినట్లు కనిపిస్తాయి. చరిత్రలోని అనేక క్రమాల వల్ల  అట్లా అనిపిస్తుంది. కానీ అవి ప్రజల మధ్య ఉన్న సంబంధాలను మౌలికంగా మార్చలేవని కూడా అదే చరిత్ర నిరూపిస్తూ వచ్చింది. సంస్కృతిని, రాజకీయాలను మార్చగల విస్పోటనాశక్తి కింది నుంచి విడుదల కావాల్సిందే. ఏ ఆధిపత్య, అనాగరిక, అమానుష సంబంధాల్లో ప్రజలు బందీలై ఉన్నారో వాటిని తెంచుకొనే క్రమమే నిజమైన ప్రజాస్వామికీకరణ. అట్లాంటి సామాజిక సంఘర్షణలోంచి రూపుదాల్చే విలువలు మానవ సంబంధాల్లో నిలదొక్కుకోవడమే ప్రజాస్వామికీకరణ. అలాంటి రాజకీయ, సాంస్కృతిక ప్రక్రియల గుండా చరిత్ర నడక వేగవంతమవుతుంది. మూల మలుపు తిరుగుతుంది.  చరిత్రలో ఇలాంటి మార్పును తీసుకొచ్చే ప్రజా సంచలనాలు పోటెత్తనంత వరకు నిజమైన ప్రజాస్వామ్యం కలగానే ఉంటుంది.

స్వప్నసీమను దాటి ప్రజాస్వామ్యం నేల మీదికి వచ్చి వాస్తవ రూపం ధరించడానికి ఆధునిక భారతదేశ చరిత్రలో ఎన్నో ఉద్యమాలు దోహదపడ్డాయి. అందులో ముప్పై ఏళ్లుగా నిషేధంలో ఉన్న విప్లవ ప్రజాసంఘాలు నిర్వహించిన పాత్ర అజరామరం. తెలంగాణలో ఒక ప్రజా వెల్లువ ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కొద్ది కాలానికే ప్రజల మీదికి అణచివేత, దోపిడీ, నియంతృత్వం విరుచుకపడ్డాయని, గత పదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యం అడుగంటిపోయిందని అందరూ గుర్తిస్తున్న సమయంలో తెలంగాణ చరిత్రలో అద్భుతమైన ప్రజాస్వామికీకరణకు దోహదం చేసిన ‘నిషేధిత’ సంఘాల గురించి మాట్లాడుకోవాలి.

1992 మే 21న నిషేధానికి గురైన రాడికల్‌ విద్యార్థి సంఘం, రాడికల్‌ యువజన సంఘం, రైతుకూలీ సంఘం, సింగరేణి కార్మిక సమాఖ్య, ఆలిండియా రివల్యూషనరీ స్టూడెంట్‌ ఫ్రంట్‌, విప్లవ కార్మిక సమాఖ్య(ఇది ఒక సంఘంగా ఉనికిలో లేదు..)లకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అంతటా నిర్మాణాలు ఉన్నా, ఇవి ఆరంభమైంది మాత్రం తెలంగాణలోనే. మిగతా రాష్ట్రాల్లో కూడా విప్లవ ప్రజాసంఘాలకు ఇవి స్పూర్తినిచ్చాయి. అనుభవాలను పంచాయి. కొత్తగా ప్రజాసంఘాలు ఏర్పడ్డానికి నమూనాలుగా పని చేశాయి.

నిషేధం వచ్చే నాటికి ఈ సంఘాలకు   పదిహేనేళ్లకు పైగా పోరాట చరిత్ర ఉంది. ప్రజా పోరాటాల నుంచి ఏర్పడి,  ప్రజల మధ్య పని చేసి అచ్చంగా ‘ప్రజలు’ అనే వ్యక్తీకరణకు సార్థక సజీవ ఉదాహరణలుగా నిలబడ్డాయి. సాపేక్షంగా స్వేచ్ఛాయుత అవకాశాలు, తీవ్ర నిర్బంధం, ఆ తర్వాత నిషేదం వంటి మూడు దశలను ఎదుర్కొన్నాయి. నిషేధం తర్వాత కూడా రహస్యంగా చాలా కాలం పని చేశాయి. మొదటి నుంచీ తీవ్రమైన నిర్బంధాన్ని, అప్రకటిత నిషేధాన్ని ఎదుర్కొన్నప్పటికీ  నిషేధంలో కూడా ప్రజల్లో కలిసి అద్భుతమైన పోరాటాలను నిర్మించిన చరిత్ర ఈ సంస్థలకు ఉన్నది.

ఈ కాలమంతా  తెలుగు సమాజ సాంస్కృతిక, రాజకీయ వికాసంలో ఈ  ప్రజాసంఘాలు  కీలకపాత్ర పోషించాయి. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలని, చట్టసభలని మాత్రమే తెలిసిన భారత ప్రజలకు తెలంగాణలో ఆరంభమైన ఈ సంఘాలు తెలుగు ప్రాంతాలంతా విస్తరించి ప్రజాస్వామికీకరణ ఎట్లా ఉంటుందో అనుభవంలోకి తీసుకొచ్చాయి. ఆ ప్రక్రియ ఎంత ఉత్తేజభరితమో, ఎంత చైతన్యకారకమో, ఎంత రాపిడిలోంచి సాగవలసి ఉన్నదో రుజువు చేశాయి. ఆ దిశగా ఇందులో  ప్రతి సంఘం లక్షలాది మంది ప్రజలను కదిలించింది. వాళ్లు కొత్త మానవులుగా తయారయ్యేందుకు ప్రేరేపించింది. ప్రజల్లోని సాహసం, తెగువ, జ్ఞానం,  సృజనాత్మకత, భవిష్యదాశలను విప్లవీకరించి చరిత్ర నిర్మాతలు కాగల వనరుగా మలిచింది. 

తెలంగాణ సమాజంలో కనీస ప్రజాస్వామ్యం కూడా ధ్వంసమైపోయిందని,  మానవతకు బద్ధ విరోధి అయిన ఫాసిజం దేశమంతా ఆవరించినట్లే తెలంగాణలోనూ బలపడుతున్నదని ఆందోళనపడుతున్న ఈ తరుణంలో ముప్పై రెండేళ్లపాటు బహిరంగ జీవితానికి దూరమైపోయిన ఈ ఆరు సంస్థల మీద నిషేధం ఎత్తేయాలనే డిమాండ్‌ బలహీనంగా అయినా వినిపిస్తున్నది. తెలంగాణ చైతన్యవంతం కావడానికి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి రాజకీయాలపై నిషేధం తొలగించడం మొదటి షరతు కావాలనే ఆకాంక్ష వినిపిస్తున్నది.

ఈ తరంలో చాలా మందికి ఈ సంస్థల పేర్లు కూడా తెలియకపోవచ్చు. ఇలాంటి సాహసిక సంస్థలు ఉంటాయనే ఊహ కూడా లేకపోవచ్చు. సమాజ ప్రజాస్వామికీకరణ నేల మీద, మనుషుల మధ్య, వాళ్ల చైతన్యవంతమైన ఆచరణతో ఇట్లా సాధ్యమే అని బొత్తిగా తెలియకపోవచ్చు. చరిత్ర నిర్మాణమంటే ఎట్లా ఉంటుందో ఈ సంస్థలు ఆ తరం కళ్ల ముందుకు తెచ్చి, వాళ్ల అనుభవంలో భాగం చేశాయంటే  నమ్మలేకపోవచ్చు. ప్రజాస్వామ్యమంటే అందరికీ గుర్తింపు కార్డులని, మహా అయితే ధర్నా చౌక్‌లో అరిచే అవకాశమని నిర్ధారణ అయిన ఈ పరిస్థితుల్లో సమాజాన్ని తిరగదోడి, కొత్త విలువల మీద  ప్రజాస్వామికీకరణకు ఈ సంస్థలు దోహదం చేశాయంటే ఆశ్చర్యం కలుగుతుంది.

            0          0          0

భారత విప్లవోద్యమ చరిత్రలో చారుమజుందార్‌ 1965`68 మధ్య రాసిన ఎనిమిది డాక్యుమెంట్లకు ఉన్నంత  ప్రాధాన్యత 1974`78 మధ్య కొండపల్లి సీతారామయ్య రాసిన గతాన్ని సమీక్షించుకొని విప్లవ మార్గంలో పురోగమిద్దాం, వ్యవసాయక విప్లవం అనే రెండు పత్రాలకు ఉన్నది. విప్లవోద్యమ పునర్నిర్మాణ పోరాటాల్లోంచి  ఈ రచనలు   పుట్టి ఆ పోరాటాలకు   దార్శనికతను అందించాయి. . రాజకీయ నిర్మాణ రూపాన్ని ఇచ్చాయి.   ఈ పత్రాలు ప్రజల క్రియాశీలతను కేంద్రం చేసుకున్నాయి. వందల ఏళ్ల కిందటి ఆధిపత్య సంబంధాలు, రీతిరివాజులు,  దోపిడీ రూపాలను  తల్లకిందులు చేసే ప్రజా  రాజకీయ ఆచరణను పునాది చేసుకున్నాయి.  స్వేచ్ఛ, ఆత్మగౌరవం, సమానత్వం, భూమి మీద హక్కు, శ్రమకు తగిన వేతనం మొదలైన  పోరాట ఎజెండాను తీసుకొచ్చాయి. అనేక అంతరాల, ఆధిక్యాల, దోపిడీ రూపాలతో ఘనీభవించిన మన సమాజాన్ని కదలబార్చే వర్గపోరాటం ద్వారా  ప్రజాస్వామికీకరించాలనే అవగాహనను ఆ రెండు పత్రాలు ఇచ్చాయి. ఆ వర్గపోరాటంలో గతంలో జరిగిన తప్పులను సమీక్షించడం, వర్గపోరాటంలో భాగం కావాల్సిన వర్గ ప్రజలను గుర్తించడం, విప్లవోద్యమ పథకాన్ని తయారు చేయడం ఈ పత్రాల ప్రత్యేకత. సామాజిక, రాజకీయ ప్రజాస్వామ్యం  వర్గపోరాటం ద్వారా తప్ప ఇంకే రకంగా రాదని, అప్పుడే అది తన అసలైన అర్థాన్ని సంతరించుకుంటుందనే ఒక కొత్త వైఖరులను అవి ప్రవేశపెట్టాయి.   

విప్లవోద్యమంలో ఈ రాజకీయ, సాంస్కృతిక సిద్ధాంతం కేవలం మేధో పరంగానే అభివృద్ధి కాలేదు.  దీని ఆచరణలోంచి విప్లవ ప్రజాసంఘాలు పుట్టుకొచ్చి బలోపేతం చేశాయి. ప్రజాస్వామాన్ని సాధించడానికి  భిన్న సమూహాలను పెద్ద ఎత్తున సమీకరించాలని, అనేక వర్గపోరాట రూపాలను ఆచరించాలని,  ప్రజలు వెనువెంట అందుకోగల రూపాల నుంచి మిలిటెంట్‌ రూపాల దాకా అవి విస్తరించాలని, తక్షణ`దీర్ఘకాలిక లక్ష్యాలతో సాగాలని, ఇవన్నీ ప్రజాస్వామ్య సాధనను మౌలిక స్థాయి నుంచి ఎత్తిపట్టగల వ్యూహంలో భాగం కావాలనే అవగాహనను నిజం చేయడానికి ఈ సంఘాలు రంగం మీదికి వచ్చాయి.

ఆధునిక భారతదేశ చరిత్రలో అప్పటి దాకా ప్రజాస్వామ్యం గురించి వచ్చిన అనేక భావనలకంటే, ప్రక్రియలకంటే పూర్తి భిన్నమైన మార్గంలో ఈ సంఘాలు నిర్మాణమయ్యాయి. అట్లా రాడికల్‌ విద్యార్థి సంఘం 1975 ఫిబ్రవరిలో ఏర్పడిరది. 1975 జూన్‌ 25`26 తేదీల్లో తొలి మహాసభలు జరగలవలసి ఉండి, అనేక కారణాల వల్ల ఆగిపోయి 1978 జూన్‌ సభలతో రాడికల్‌ యువజన సంఘం ఏర్పడిరది. 1981లో రైతుకూలీ సంఘం, సింగరేణి కార్మిక సమాఖ్య ఏర్పడ్డాయి. అంతక ముందు నుంచే ఈ అన్ని రంగాల్లో తెలంగాణ పల్లెలో, సింగరేణి బొగ్గు గనుల్లో, విద్యాలయాల్లో ఎక్కడికక్కడ పోరాటాలు జరిగాయి. స్థానిక నిర్మాణాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత రాష్ట్రస్థాయి సంస్థలుగా మారాయి.

విద్యార్థులను, కార్మికులను, పట్టణ`గ్రామీణ యువతను, పల్లెల్లో భూమిలేని వ్యవసాయ కూలీలను, చిన్న సన్నకారు రైతులను, మహిళలను పీడిత కుల, మత, పితృస్వామ్య, వర్గ ఆధిపత్యాలకు, దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా ఈ సంస్థలు సమీకరించాయి.

వందల ఏళ్ల నుంచి సాగిన దళిత బహుజన పోరాటాల్లో, ఆదివాసీ ఉద్యమాల్లో, నిరుపేద శ్రామిక పోరాటాల్లో ప్రజాస్వామ్య భావన ఉన్నప్పటికీ, వలస వ్యతిరేక రాజకీయ పోరాటాల్లోంచి అదొక ఆధునిక అర్థాన్ని సంతరించుకున్నప్పటికీ , దానికి అనుగుణంగా కొన్ని మార్పులు జరిగినప్పటికీ అట్టడుగు ప్రజా జీవితంలోకి ప్రజాస్వామ్యం ఒక సంబంధంగా, జీవన విధానంగా, సామాజిక రాజకీయార్థిక సాంస్కృతిక విలువగా ప్రవేశించలేదు. దానికి అవసరమైన కీలక మార్పులు ఏవీ జరగలేదు. పై నుంచి అందరికీ ఓటు, కేంద్రీకృత చట్టపరమైన పాలన మాత్రమే ప్రజాస్వామ్యంగా చెలామణిలోకి వచ్చాయి. వాటికి ఉన్న ప్రగతిశీల స్వభావం ప్రజాస్వామ్యాన్ని మౌలిక స్థాయి నుంచి నిర్మించలేకపోయింది. మన దేశంలో ప్రజాస్వామ్యం కేవలం భావనగానే కాక కొన్ని ప్రక్రియలుగా కూడా మొదలైనప్పటికీ భూస్వామ్య ఆర్థిక సాంస్కృతిక సంబంధాల్లో అది చిక్కుపోయింది. ఆ సంబంధాలను అది మార్చలేకపోగా, వాటికి  తగిన సారంతో  ప్రజాస్వామ్యంగా మనుగడలోకి వచ్చింది. ప్రజాస్వామ్యం  సాకారం కావడానికి అవసరమైన ప్రజాస్వామికీకరణకు అవకాశమే లేకుండా పోయింది. ఈ రెంటికీ తేడా తెలుసుకోలేని రూపభ్రాంతి రాజకీయ, సాంస్కృతిక మేధో రంగాలను ఆవరించింది. అందుకే భారతీయ మేధావుల సూత్రీకరణలు, వివ్లేషణలు, లెక్కలు గట్టే తూనికలు అన్నీ ప్రజాస్వామ్యం చుట్టూ రూపభ్రాంతితో తిరుగుతుంటాయి. సామాజిక జీవితాన్ని, అందులోని తాజా మార్పులను, వాటి అర్థాలను తెలుసుకోగల సిద్ధాంత కచ్చితత్వాన్ని పాటిస్తే ఈ నిర్ధారణకు రావచ్చు. అట్లని ప్రజాస్వామికీకరణ ఏదో ఒకే మార్గంలో జరుగుతుందని అనడానికి లేదు.  మన దేశంలో పై నుంచేగాక కింది నుంచి కూడా ఎంతో కొంత ప్రజాస్వామికీకరణ జరిగింది. అయితే  దానికి పునాది ఏర్పడలేదు. ప్రజాస్వామిక విలువలు సంతరించుకోలేదు. మన సమాజం ఎదుర్కొంటున్న సంక్షోభాలన్నిటికీ మూలం అక్కడ ఉంది. ‘సంక్షోభాలు’గా బైటికి భారీగా కనిపించే వాటికంటే అట్టడుగున అన్ని రంగాల్లో నిత్య సంక్షోభం రగులుతూ ఉన్నది. బైటికి చెప్పుకొనే ఆదర్శాలకు, అట్టడుగు వాస్తవాలకు మధ్య  తీవ్రమైన వైరుధ్యం  సాగుతున్నది. కింది నుంచి ప్రజాస్వామికీకరణ జరగలేదనడానికి ఇది గుర్తు.

దీన్ని విస్మరించి ప్రజాస్వామ్యానికి రాజకీయ అర్థం ఒక్కటే చెప్పుకుంటే మనకు ప్రజాస్వామ్యమంటే ఏమిటో తెలియనట్లే. రాజకీయాల ప్రాధాన్యతను గుర్తించాల్సిందే. మౌలికంగా ప్రజాస్వామ్యం ఒక యుగ స్వభావం. రాజకీయార్థిక సామాజిక సాంస్కృతిక వికాసం జరగాలి.   భూస్వామ్యాన్ని, బూర్జువా శక్తులను దాటి నిజమైన అర్థంలో అమలులోకి రావాలి. అనేక చారిత్రక, రాజకీయార్థిక, సామాజిక సాంస్కృతిక కారణాల వల్ల  అది ముందుకు సాగలేదు. ఏదో మహత్తర ప్రజాస్వామిక ప్రయాణం దేశంలో జరుగుతున్నట్లు బైటికి కనిపిస్తుంది. తీవ్రమైన మార్పులు జరిగిపోతున్నాయని అనిపిస్తుంది. నిజంగానే మార్పులు జరుగుతున్నాయి. కానీ అక్కడక్కడే ముందుకు వెనక్కి నడుస్తూ నిలువనీటి మురికి గుంటగా మారింది.  అందులోపడి కొట్టుమిట్టాడుతున్నందు వల్ల మనకు ప్రజాస్వామ్యమంటే ఏమిటో అర్థంకాని అయోమయం ఏర్పడిరది. చిక్కుముడుల పజిల్‌గా మారిపోయింది. ఎక్కడి నుంచి బయల్దేరామో, ఎక్కడికి చేరుకోవాలో తెలియని ఆగంతక ప్రయాణ భారాన్ని చరిత్ర ఈ దేశ ప్రజల మీద మోపింది. 

ఇప్పుడే ఇట్లా ఉన్నదంటే యాభై ఏళ్ల కింద ఎట్లా ఉండేదో ఊహించుకోవచ్చు. ఈ స్థితిని  విమర్శనాత్మకంగా చూడగల దృష్టిని నక్సల్బరీ పంథా అందించింది. ఆ తర్వాత జరిగిన మార్పులేవీ ఈ విమర్శకు సమాధానం చెప్పలేకపోయాయి. ఈ విమర్శ కాలాతీతమైందని రుజువు చేయలేకపోతున్నాయి. వేరే ప్రజాస్వామిక ప్రక్రియలను కనీసంగా ముందుకు తేలేకపోతున్నాయి. ఇలాంటి విమర్శా ఆయుధంతో పైన చెప్పిన విప్లవ ప్రజా సంఘాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా కొన్ని డజన్ల సంస్థలు ఏర్పడ్డాయి. విమర్శనాత్మక చింతన ప్రజాస్వామ్యాన్ని ప్రోది చేసే భౌతికశక్తిగా ఎలా మారుతుందో ఈ సంస్థలు నిరూపించాయి.

పాత సమాజాన్ని పట్టి ఉంచుతున్న కులం, పితృస్వామ్యం, భూస్వామ్య దోపిడీ, పార్లమెంటరీ రాజకీయాలు మొదలైన వాటి మీద ఈ సంస్థలు విమర్శ పెట్టాయి. అందువల్ల వాటి బారినపడిన గ్రామీణ దళిత బహుజన కులాల ప్రజలు, భూమి లేని వ్యవసాయ కూలీలు, చిన్న రైతులను రైతుకూలీ సంఘం లక్షలాదిగా సమీకరించింది. గ్రామీణ, బస్తీపేదలను, యువజనాన్ని రాడికల్‌ యూత్‌ లీగ్‌ పోరాటాల్లోకి తీసుకొచ్చింది. వలస కాలంలో జరిగిన కార్మిక పోరాటాలతో సమానంగా, పొలిటికల్‌ మిలిటెన్సీలో మరింత మిన్నగా సింగరేణిలో సికాస ఉద్యమాలను నిర్మించింది. ఏఐఆర్‌ఎస్‌ఎఫ్‌ దేశవ్యాప్తంగా విప్లవ విద్యార్థి సంఘాల కార్యాచరణకు ఒక ఉమ్మడి నిర్మాణంగా దృక్పథాన్ని, లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ సంస్థల నాయకత్వంలో జరిగిన కృషి  అనేక జీవన రంగాల మీద  ప్రభావం వేసింది. గ్రామాల్లో, గనుల్లో, పట్టణాల్లో, విశ్వవిద్యాలయాల్లో  సాంస్కృతిక  పోరాటంగా ఆరంభమై రాజకీయ పోరాటంగా ఎదిగిందో, రాజకీయ పోరాటంగా మొదలై సాంస్కృతిక శక్తిగా మారిందో చెప్పలేనంత జమిలిగా సాగింది. ఆస్తి సంబంధాలను, మొత్తంగా ఆర్థిక వ్యవస్థను మార్చే డిమాండ్లు కేంద్రంగా ఉన్నప్పటికీ ఆర్థికవాదానికి గురికాకుండా సామాజిక రాజకీయ సాంస్కృతిక వికాసానికి తిరుగులేని దారి వేశాయి. ఆ మార్గంలో గణనీయమైన విజయాలు సాధించాయి. వాటి సారాంశమంతా విప్లవ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడమే. నిలువనీటి ప్రజాస్వామ్యం స్థానంలో విప్లవ ప్రజాస్వామ్యాన్ని సాధించాలని అనుకోవడం పాలకులను డిస్ట్రబ్‌ చేసింది. తెలంగాణను అటు పాలకులు, ఇటు ప్రజలు కూడా కల్లోలిత ప్రాంతంగా గుర్తించారు.

ప్రజాస్వామ్యం ఒకరు ఇస్తే వచ్చేది కాదని, ఇచ్చింది తీసుకొని ఇదే ప్రజాస్వామ్యమని భ్రమ పడటానికి లేదని, అదొక నిండైన, మానవీయమైన, స్వేచ్ఛాయుతమైన, సమానత్వ ప్రాతిపదిక మీద ఎప్పటికైనా ఆచరణలోకి రావాల్సిన సమగ్ర భావన అని ప్రజల అనుభవంలోకి వచ్చింది.

ప్రభుత్వం బంజరు భూములు ఇవ్వడం, పేదరిక నిర్మూలనా పథకాలు అమలు చేయడం, ఉపాధి హామీకి కూలి పనులు చూపడం, ఉచితాలు రుచి చూపించడం ప్రజాస్వామ్య అమలు కాదు. దున్నగలిగేవారంతా  భూములు సాధించుకోడానికి పోరాటంలోకి దిగి గ్రామీణ కుల ఆధిక్య, భూస్వామ్య పెత్తందారీ సోషల్‌ ఆర్డర్‌ను కుదిపివేయడం వల్ల ప్రజాస్వామ్యానికి కుదురు ఏర్పడుతుంది. నిరుద్యోగ సైన్యంగా, నిస్తేజంగా మారిన యువత  క్రియాశీల సృజనాత్మకశక్తిగా మారే క్రమం పాత సామాజిక సంబంధాలను మార్చి ప్రజాస్వామ్యానికి పునాదులు వేస్తుంది. వేతన కూలీలుగా ఘోరమైన దోపిడీకి గురయ్యే కార్మికులు తమ శ్రమశక్తి విలువ తెలుసుకొనే క్రమంలో వర్గపోరాటంలో భాగమైనప్పుడే ప్రజాస్వామ్యం రూపుదాల్చుతుంది. ఈ మొత్తానికి కాలేజీల్లో, విశ్వ విద్యాలయాల్లో చదువుకుంటున్న యువతీ యువకులేగాక గ్రామాల్లోని రైతు కూలీలు, గని కార్మికులు కూడా  రాజకీయ, సిద్ధాంత నాయకత్వం వహించగలిగేలా ఎదిగినప్పుడే ప్రజాస్వామ్యం అర్థవంతమవుతుంది. మనలాంటి కరడుగట్టిన సమాజంలో ఇంతకంటే దగ్గరి దారిలో   ప్రజాస్వామికీకరణ జరగదని రుజువైంది. మిగతావన్నీ సూక్తులుగానే మిగిలిపోయాయి.

ఈ నిషేధిత సంస్థలు తమ బహిరంగ కార్యాచరణలో ప్రజాస్వామ్య సాధన కోసం ప్రజల మధ్య ఉండే లెక్కలేనన్ని వైరుధ్యాలను పరిష్కరించాయి. పాత వ్యవస్థ కల్పించిన వైరుధ్యాలను, వనరుల కొరత వల్ల వచ్చిన వైరుధ్యాలను, నిచ్చెనమెట్ల సామాజిక ఆర్థిక అంతరాల వల్ల తలెత్తిన వైరుధ్యాలను, తప్పడు భావజాలం వల్ల కొనసాగే వైరుధ్యాలను, వ్యక్తిగత స్థాయిలోని వైరుధ్యాలను ఈ ప్రజాసంఘాలు సృజనాత్మకంగా పరిష్కరించాయి. విడివిడిగా, వేరైపోయిన ప్రజల మధ్య ఐక్యత ప్రజాస్వామ్య అమలుకు అతి ముఖ్యమైన ఆధారం. దాన్ని సాధిస్తూ, పాలకవర్గ విధానాల వల్ల ప్రజలందరి నెత్తిన వచ్చి పడ్డ అనేక సమస్యలకు ఎక్కడికక్కడ విప్లవాత్మక పరిష్కారాన్ని ఈ సంస్థలు సాధించాయి. ఈ ప్రపంచానికి కర్తలైన ప్రజలను పీడిరచే పాలక విధానాలు కొనసాగుతున్నంత వరకు ప్రజాస్వామ్యం అమలులోకి వచ్చిందని ఎవరు చెప్పినా అది బూటకమే. అలాంటి విధానాలను హేతుబద్ధంగా, న్యాయ ప్రాతిపదిక మీద పరిష్కరిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసినట్లు. ప్రజాస్వామ్య స్థాపన చివరికి తరగతి గదిలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య, కుటుంబంలో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య కూడా జరగాల్సిందే. రాడికల్‌ విద్యార్థి సంఘం మానవ జ్ఞానానికి, అనుభవానికి సంబంధించిన ఇలాంటి క్షేత్రస్థాయి సంస్థలలో కూడా ప్రజాస్వామ్యం అంకురించడానికి దోహదం చేసింది. నిరక్షరాస్యులైన గ్రామీణ కుటుంబాల్లో, ఉన్నత విద్యావంతులైన మధ్య తరగతి పట్టణ కుటుంబాల్లో తల్లిదండ్రుల ఆలోచనలను సహితం విప్లవ విద్యార్థులు తమ ఉద్యమ భావజాలంతో ప్రభావితం చేశారు. రాజ్య వ్యతిరేక పోరాటం తప్పదని ఆ సంస్థ విద్యార్థుల్లో, మధ్య తరగతిలో, మేధావుల్లో కల్పించిన ఒక్క అవగాహన చాలు..తెలుగు సమాజం ఎంత క్రియాత్మకంగా మారిందో చెప్పడానికి. సుమారు ఇరవై ఏళ్లపాటు తెలుగు సమాజానికి ఆ సంస్థ అందించిన ఉత్తేజం, ఉద్వేగం,  చైతన్యం, సామాజిక దృక్పథం వల్ల ఎలాంటి రాజకీయ సాంస్కృతిక వికాసం జరిగిందో  లెక్కగట్టడం చాలా కష్టమైన పని. తన సాహసం, త్యాగనిరతి వల్ల భారతదేశంలో మరే విద్యార్థి సంఘానికన్నా ఎక్కువగా సమాజ ప్రజాస్వామికీకరణకు దోహదం చేసింది. తెలుగు సమాజాలకు లెక్కలేనంత మంది రాజకీయ ఉద్యమ నాయకులను, సిద్ధాంతకర్తలను, సాహిత్యకారులను, కళాకారులను, పరిశోధకులను, ప్రజాస్వామికవాదులను, పాత్రికేయులను, న్యాయవాదులను, వైద్యులను, వక్తలను రాడికల్‌ విద్యార్థి సంఘం సమర్పించింది.

రాజ్యం, వర్గ సమాజం మధ్య సృజనాత్మక, మేధో వ్యక్తీకరణ ఉన్న, సామాజిక విలువలపట్ల పట్టింపు ఉన్న, వ్యాఖ్యానశక్తి ఉన్న, ఉద్యమాలకు నాయకత్వం వహించగల దక్షత, శిక్షణ ఉన్న బృందాన్ని విప్లవ విద్యార్థి ఉద్యమం రూపొందించింది. ఆధునిక భారతదేశ చరిత్రలో 1970ల్లో, 80ల్లో మరే భాషా సమాజంలో లేని మేధో కృషి, పౌర సమాజ పాత్ర తెలుగు ప్రాంతాల్లోనే కనిపించడం వెనుక ఇతర సంస్థలతోపాటు రాడికల్‌ విద్యార్థి సంఘం గణనీయ కృషి ఉన్నది. ఉత్తర భారతదేశం సరే, దక్షిణ భారతదేశంలో కూడా ఇప్పటికీ సాహిత్య, మేధో, ఉద్యమ రంగాల్లో తెలుగు సమాజాల ప్రత్యేకత అంతా ఈ సంస్థలు సాధించిన సాంస్కృతిక రాజకీయ వికాసంలో ఉన్నది. ఇప్పటికీ తెలుగు సమాజాల్లోని పేరెన్నికగన్న  ప్రజా వేధావులందరూ ఎక్కడో ఒకచోట రాడికల్‌ యువజన, విద్యార్థి, రైతాంగ, కార్మిక పోరాటాలతో ప్రభావితం అయినవారే. ఆ సంస్థల ప్రజా జీవితమే దీనికంతా కారణం.

రాడికల్‌ ఉద్యమాలకు తాత్వికంగా ప్రజాస్వామ్యం పట్ల ఉన్న వైఖరి చాలా లోతైనవి, విశాలమైనది. క్రియాత్మకమైనది. అందువల్ల ప్రభుత్వం చట్టరూపంలో నిషేధం విధించినప్పటికీ అది ఏదో ఒక రూపంలో ప్రజా క్షేత్రంలో కొనసాగుతున్నది. ప్రభుత్వానికి ఇక ప్రజాస్వామ్యాన్ని రూప సంబంధమైన ప్రసహనంగా కూడా నడపలేని దశ 1990కల్లా వచ్చేసింది. భారత మిశ్రమ ఆర్థిక వ్యవస్థ 1991నాటికి నూతన ఆర్థిక విధానాల పేరుతో కొత్తగా ఏర్పడిన ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగమైపోయింది.   సామంత పాలన పూర్తి రూపం తీసుకున్నది. రాజ్యాంగంలోని  లౌకికవాదాన్ని ధ్వంసం చేయడానికి  బాబ్రీ మసీదు మీదికి    మతోన్మాద బీజేపీ   అప్పటికే గురిపెట్టింది. దానికి ‘ఉదారవాద’ కాంగ్రెస్‌ మౌన సంకేతాలు ఇచ్చింది. ఇక తాను నోటి మాటగా చెప్తున్న ప్రజాస్వామ్యానికి కూడా చోటు లేని పరిణామాలు వేగంగా జరిగిపోతున్న తరుణంలో విప్లవ ప్రజాస్వామ్యాన్ని కింది నుంచి సాధించే పనిలో ఉన్న ప్రజాసంఘాలను  పాలకవర్గం భరించలేకపోయింది.   రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థలను నిషేధించింది. ఇదేదో యాదృశ్చిక నిర్ణయం కాదు. బూర్జువా ప్రజాస్వామ్యం సారంలో పూర్తి లుప్తమైపోతున్న దశలో, విప్లవ ప్రజాసంఘాల నేతృత్వంలో కింది నుంచి ప్రజాస్వామిక ప్రక్రియలు ఊపందుకుంటున్న తరుణంలో పాలకులకు నిషేధం విధించడం అనివార్యమైంది. రెండు విరుద్ధ శక్తుల మధ్య  ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న సంఘర్షణలో రాజ్యం తన చేతిలో అధికారం ఉంది కాబట్టి నిషేధం కోసమే ఒక చట్టాన్ని తయారు చేసింది.

ఈ ముప్పై ఏళ్లలో తెలుగు సమాజాలు అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాయి.    వ్యవస్థ అంతర్గత తర్కం ప్రకారమే ఇవి ఎదురయ్యాయి. స్థానీయ కారణాలతోపాటు అంతర్జాతీయ రాజకీయార్థిక పరిణామాలు కూడా వీటిని తీవ్రం చేశాయి. సామ్రాజ్యవాద దేశాల మధ్య వలసానంతర వాణిజ్య యుద్ధాలతోపాటు భోగోళిక, సైనిక వ్యూహాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో మహోన్నత ప్రజాస్వామిక రాజ్యాలనీ, సమాజలనీ పేరు మోసిన చోట కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రతీఘాతుక ఫాసిస్టు ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రజాస్వామిక ఉద్యమం జరిగిన  తెలంగాణలో ఆ మరునాటి నుంచే నియంతృత్వ పాలన మొదలైంది. ఆ ప్రజా ఉద్యమంలో విప్లవ శక్తులు భాగమైనప్పటికీ నిషేధం, తీవ్రమైన నిర్బంధం వల్ల సామాజిక సాంస్కృతిక రంగాల్లో తమదైన పాత్ర పోషించలేకపోయాయి. విప్లవ విద్యార్థి ఉద్యమం బహిరంగంగా పని చేసే వాతావరణమే ఉంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో వందలాది మంది విద్యార్థులు నిరాశా నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకొనేవారా?  విద్యార్థి ఉద్యమం రాజకీయంగా, నైతికంగా బలహీనపడి అధికార రాజకీయాల్లో భాగమై ఉండేదా? అనే ప్రశ్నలు ఊహాత్మకం కాదు.  ఆర్థిక పోరాటాలకు పరిమితం కాని సికాసలాంటి సంస్థలు దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఏర్పడి ఉంటే దేశం ఇంతగా ప్రైవేటీకరణ భారం మోయాల్సి వచ్చేదా? నూతన ఆర్థిక విధానాల అమలు, సికాస, విప్లవ కార్మిక సమాఖ్య మీద నిషేధం తెలంగాణకు సంబంధించినంత వరకు ఒక ముఖ్యమైన మలుపు. మిగతా కార్మిక సంఘాలు ఎన్నో ఉన్నాయి. వాటికి ఆర్థిక డిమాండ్లు తప్ప విప్లవమనే రాజకీయ లక్ష్యం లేదు. అసలు కార్మికులు కొత్త ప్రపంచాన్ని నిర్మించే వర్గమనే స్పృహ కూడా లేదు. బహుశా వలస పాలన తర్వాతి కార్మికోద్యమ చరిత్రలో మేటి ఉదాహరణ సికాస.

ఇట్లాంటి ప్రజాసంఘాలను నిషేధించడమంటే సమాజంలోని ప్రజాస్వామిక ప్రక్రియలను తుడిచేయాలని అనుకోవడమే. ఈ ప్రజా సంఘాలకు సంబంధించే వందలాది మందిని చంపేసి, వేలాది మందిని హింసలపాలు చేసి అణచివేశారు.  ప్రజాస్వామ్యానికి, ప్రజా చైతన్యానికి దోహదం చేసే సంస్థలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే   కేసీఆర్‌ అధికారంలోకి రాగానే గుట్టుచప్పుడు కాకుండా,  ఎప్పుడో 1992లో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ను 2014లే ఏర్పడ్డ కొత్త రాష్ట్రంలో ‘తెలంగాణ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ 1992’గా మార్చి విప్లవ ప్రజాసంఘాల మీద నిషేధం కొనసాగించాడు. తెలంగాణ ఉద్యమ కాలంలో పెల్లుబికిన ప్రజా శక్తులను చాలా వరకు లొంగదీసుకోవచ్చని, భయపెట్టవచ్చని, బలహీనపరచవచ్చని ఆయన అనుకున్నాడు. నిజమైన ప్రజాస్వామ్యం కోసం పని చేసే విప్లవ ప్రజాసంఘాల మీద మాత్రం నిషేధం కొనసాగించాలని అనుకున్నాడు. ఆ పేరుతో నిర్మూలించాలని అనుకున్నాడు.

ఈ నిషేధం వల్ల ఆ సంస్థలు ఏమైపోయాయి? ఇరవై ఏళ్ల ఉమ్మడి రాష్ట్ర నిషేధం, ఆ తర్వాత పదేళ్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిషేధం అనుభవించిన ఆ సంస్థకు తిరిగి కోలుకొనే శక్తి  ఉన్నదా? నిషేధం ఎత్తేస్తే మళ్లీ బహిరంగ జీవితంలోకి వస్తాయా? అనే ప్రశ్నలు ఎన్నయినా ఉండవచ్చు. చట్టబద్ధంగా నిషేధానికి గురి కావడానికి ముందే ఆ సంస్థల్లో కొన్ని, ఒక మేరకు రహస్య పని విధానాన్ని ఎన్నుకున్నాయి కదా? అనే దగ్గరి నుంచి బహుశా ఆ సంస్థల చారిత్రక పాత్ర ఆ రెండు దశాబ్దాలతో ముగిసిపోయిందని, ఇప్పుడు ఏర్పడ్డ కొత్త పరిస్థితుల్లో వాటి పాత్ర ఏమీ ఉండదనే దాకా ఎన్ని అభిప్రాయాలైనా వినిపించవచ్చు. రాజకీయాల మీద, రాజకీయ సంస్థల మీది చట్టరూపంలో నిషేధం మొత్తంగా ప్రజాస్వామ్య పతనం దిశగా సమాజాన్ని తీసికెళుతుంది. ఈ విప్లవ సంస్థల ఆదర్శాలు, పని పద్ధతులు, పోరాట రూపాలు, ఆ రోజుల్లో అవి ప్రదర్శించిన నిబద్ధత, క్రియాశీలత మారిన ప్రస్తుత పరిస్థితులకు కూడా పూర్తిగా అవసరం అయ్యేవే. అన్వయం అయ్యేవే. ఆచరణ యోగ్యమైనవే. అసలు నిషేధాన్ని ఆ సంస్థల వైపు నుంచి కాకుండా సమాజ ప్రజాస్వామికీకరణ వైపు నుంచి పరిశీలించాలి. అప్పుడు ఈ ముప్పై ఏళ్లలో దానికి ఎంత విఘాతం జరిగిందో గుర్తించగలం. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనే మాటను ముఖ్యమంత్రి అంత లోతైన అర్థంలో అన్నాడని మనమేమీ భ్రమపడనకర లేదు. ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోగల పరిణతి రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఉన్నాయని అనుకోవాల్సిన పని లేదు.

ప్రజాస్వామికీకరణ ఎంత గంభీరమైన, లోతైన, భిన్న రూపాల ప్రక్రియో మనకు తెలిస్తే దానికి విప్లవ సంఘాల మీది నిషేధం వల్ల కలిగిన నష్టం అర్థమవుతుంది. చివరికి నిషేధం ఎత్తేయాలనే డిమాండ్‌ కూడా తెలంగాణ రాజకీయ, సాంస్కృతిక పునర్వికాసానికి దోహదం చేస్తుందని తెలిసినా చాలు. దాని కోసమే ఒక ఉద్యమాన్ని నిర్మించవచ్చు.

Leave a Reply