దక్షిణాన పుట్టిన
వివిక్త కొండల్లో ఏపుగా పెరిగిన
రాక్ ఫోర్ట్

ఒరిగిపోయిన చెట్టంత మనిషి
కన్నీళ్ళతో కావేరి నిండిపోయింది

చదివిన వేదాంత శాస్త్రం
గొల్లుమని ప్రవచనాలను వెదజల్లుతుంది

సామాజిక శాస్త్రం ఫిలిప్పీన్స్ నేర్పితే
ఝార్ఖండ్ క్షేత్రమయ్యింది

వనాంచల్ ప్రతి మొక్క
వంగి సలాం చేస్తుంది

గజరాజులు గజగజ వణుకుతున్నాయి
అండగా నిలిచిన స్వామి లేడని

తాను ముందుండి వేసిన ప్రతి అడుగు
ఆదివాసీ బతుకుల వెలుగు నింప ప్రయత్నం

హక్కులకై సంధించిన ప్రశ్నలే
తన చావుకి కారణమౌతుంటే
పుటల్లోని రాజ్యాంగ ప్రతులు
పటపట రాల్చాయి చుక్కలు

వణుకుతున్న చేతులు
తాగలేని నీరు ఒలుకుతుంటే
ఓ స్ట్రా ఇవ్వమన్నా ఇవ్వలేని న్యాయం

పండు ముదుసలి
పార్కిన్సన్ తో జైలు హాస్పిటల్లో..
అయినా ఆఖరి శ్వాస దాకా
చెద‌ర‌ని ఆదివాసీ స్వ‌ప్నం
అమరుడా! దండం!!

Leave a Reply