కొవిడ్ మానవాళికి కొత్త అనుభవం. కరోనా అనంతర చరిత్ర అనగల స్థాయిలో మార్పులు జరుగుతున్నాయని చాలా మంది

అంటున్నారు. ఇందులో కొంత విశ్లేషణ ఉంది. చాలా వరకు ఊహ ఉంది. తొలి దశ కరోనా బీభత్సం మధ్యనే అమెరికాలో ఎన్నికలు ముగిశాయి. ట్రంప్ దిగిపోయి, జో బిడెన్ అధికారంలోకి వచ్చాడు. ప్రపంచ రాజకీయార్థిక సమీకరణాలు కొత్త దశలోకి మళ్లే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కరోనా వచ్చినా, బిడెన్ వచ్చినా పాలస్తీనా పరిస్థితి ఏమీ మారదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఆయన మొన్న ఒక మాట అన్నాడు. ఇజ్రాయిల్‌కు  తన ప్రయోజనాల కోసం పోరాటే హక్కు ఉందని అన్నాడు. పాలస్తీనా మీద ఇజ్రాయిల్ దాడి చేయడానికి హక్కు ఉందని ఆయన ఉద్దేశం.

ఇజ్రాయిల్ అనే శబ్జాన్ని ఎవరు ఎలా రాసినా అందులో ‘అయిల్ అనే మాటే నాకు వినిపిస్తుంది.  అదిప్పుడు  పాల‌స్తీనాకే విప‌త్తు కాదు.   పోరాట ప్ర‌జ‌లంద‌రి  గుండెల మీద ఇప్ప‌డు ఇజ్రాయిల్ ఆయుధాలే. బ‌హుశా ఆయిల్‌, ఆయుధాలు శ‌బ్దాలు కూడా ఇప్ప‌డు అందరికీ ఒకేలా వినిపించే అవ‌కావం ఉంది.   

కొవిడ్ వ‌చ్చాక  బైటికి క‌నిపించే  ప్రపంచ రాజకీయార్థిక విషయాల్లో వ‌చ్చిన మార్పులు ఏమోగాని , అయిల్ రాజకీయాలు మాత్రం మార‌లేదు. అ శక్తి దానికి లేదు.  పాల‌స్తీనా ప్ర‌జ‌ల‌కు నిల‌బ‌డే నేల కాదు. గుండె నిండా పీల్చుకోడానికి గుప్పెడు స్వేచ్ఛా శ్వాస కూడా దొర‌క‌డం లేదు. 

బైడెన్ వ‌చ్చినా, కొవిడ్ వ‌చ్చినా మార్పు లేదు. 

ప్రపంచ మానవాళి ఉద్వేగభరితంగా పాలస్తీనా న్యాయ అకాంక్షతో మమేకం కావచ్చు. తరతరాల పాలస్తీనీయులకు ఆ నేలతో ఉన్న అత్మిక సంబంధాన్ని చరిత్రలోంచి తవ్వితీసి విశ్లేషించవచ్చు. కానీ అయిల్ రాజకీయాల్లో మార్పు రాదు. బిడెన్ చెప్పిన మాట కొత్తది కాదు. అమెరికాతో సహా ప్రపంచ పాలకవర్ణానిదంతా అదే కంఠస్వరం. వాళ్ల వైఖరి మారదు. ప్రపంచ దేశాల్లో పాలకులు మారుతారుగాని, పాలస్తీనీయులకు సొంత నేల మీదే పరాయివాళ్లుగా బతికే చిరునామా మారదు.

పాలస్తీనా కన్నీటి కథను ఇట్లా సాధికారికంగా చెప్పగలవాళ్లు ఎందరో ఉన్నారు. పాల‌స్తీనా ప‌ట్ల భార‌త పాల‌కులు వైఖ‌రులు అనేక సార్లు మారి ఉండ‌వ‌చ్చు. అవ‌స‌రానికి త‌గిన సంబంధాలు నెర‌పి ఉండ‌వ‌చ్చు. కానీ భార‌త పీడిత ప్ర‌జానీకం ఎన్న‌డూ దృఢంగా  పాలస్తీనీయుల ప‌క్ష‌మే. అదే వాళ్ల  ‘అదృష్టం’. దండకారణ్య అదివాసులకు అది  లేదు. సమస్య మనకు ఎంత దూరంగా ఉంటే అంత సులభంగా న్యాయాన్యాయాల గురించి చెప్పగలం. అంత‌గా మ‌న స్నేహ‌హ‌స్తాన్ని అందివ్వ‌గ‌లం. కొండొక‌చో పాండిత్య ప్ర‌ద‌ర్శ‌న కూడా చేయ‌గ‌లం.  కంటికి క‌నిపించ‌ని, అనుభ‌వంలోకి రాని అతి మారుమూల అంచుల్లో స‌హితం ఉండ‌వ‌ల‌సిన సున్నిత‌త్వాలను  గుర్తించి వాటి మీద న్యాయ వైఖ‌రుల‌ను ముందుకు తేగ‌లం. 

 స‌మ‌స్య నేరుగా *మ‌న‌*దైనా అయి ఉండాలి. సుదూరానిదైనా అయి ఉండాలి. 

అయినా  దండకారణ్యం ఎంత దూరం?  అది ఎక్కడో లేదు. మన పక్కనే ఉంది. ప్రభుత్వాల భౌగోళిక సరిహద్దుల మాటేమోగాని, ఇప్పటికీ అదివాసీ నైసర్గిక, సాంస్కృతిక సంబంధాల ప్రకారమైతే తెలంగాణ అటవీ ప్రాంతం నుంచి, తెలుగు సమాజాల నుంచి దండకారణ్య భూభాగం వేరే కాదు.

పాలస్తీనా ప్రజలకు వేల ఏళ్లుగా ఎలా అ నేలతో ఎలా సంబంధం ఉన్నదో అంతకంటే ఎక్కువ దండకారణ్య అదివాసులకు అడవితో అనుబంధం ఉంది. సరిగ్గా ఇవాళ పాల‌స్తీనా మీద ఇజ్రాయిల్ ఎలాంటి పాలనా అధికారాన్ని పొందిందో అట్లే భారత రాజ్యం దండకారణ్య అడవి మీద అధికారం పొందింది. క్రమంగా మైదాన ప్రాంత రాజ్యం దండకారణ్యాన్ని అక్రమించుకోవడం మొదలు పెట్టింది. అదంతా చాలా పెద్ద చరిత్ర. ఇప్పుడు అక్కడికి పోనక్కర లేదు. బస్తర్ ఆదివాసులు గ‌త ప‌దిహేను  రోజులుగా ఒక చిన్న డిమాండ్ మీద పోరాడుతున్నారు. ఈ అడవి మాది, ఈ ఊళ్లు మావి. వీటి మధ్య మీ అధికారాన్ని స్థాపించుకోడానికి పోలీసు క్యాంపు ఎలా పెడతారని వాళ్ల వాదన. దీని కోసం ప్రాణాలను బలిపెడుతున్నారు. మా ఊళ్ల మధ్య పోలీసు క్యాంపు పెట్టడానికి వీల్లేదనే శాంతియుత ఆందోళనను ప్రభుత్వం రక్తసిక్తం చేసింది.

ఆదివాసుల డిమాండ్ చాలా న్యాయం అనిపించ‌డం లేదా?  ఊళ్లలో, పట్టణాల్లో జనావాసాల మధ్య, నేరుగా మ‌న ఇండ్ల మ‌ధ్య  పోలీసు క్యాంపులు పెడితే, వేలాది మంది పోలీసులు, సైనికులు, అర్ధ సైనికులు గుంపై సాయుధ విన్యాసాలు చేస్తామంటే మనం అంగీకరిస్తామా?  చూస్తూ ఊరుకుంటామా?  ప్ర‌జా జీవితానికి విఘాతమని అడ్డుకుంటాం కదా. 

సరిగ్గా సుక్మా-బీజాపూర్ సరిహద్దుల్లో ఉన్న సిల్లర్ వద్ద ప్రభుత్వం పెట్టిన సీఆర్పీఎఫ్ క్యాంపు విషయంలో అదివాసులు ఇలాగే స్పందించారు. పోలీసు క్యాంపు పెడితే ఏం జరుగుతుందో వాళ్లకు బాగా తెలుసు. అందుకే ఈ మోకూర్ క్యాంపును  ఎత్తి వేయాలని సుమారు పాతిక గ్రామాల నుంచి ఐదారు వేల మంది అక్కడికి వచ్చారు. వాళ్లను పోలీసులు బెదిరించారు.

మే 16 అదివారం రాత్రి అదివాసులు వెనక్కి వెళ్లిపోయారు. మర్నాడు మరింత ఎక్కువ మంది కదిలి వచ్చారు. క్యాంపు ఎత్తేసే వరకు కదలమని ధర్నాకు దిగారు.

క్యాంపు ఉంటే ఏమయ్యేదీ వాళ్లకు ఈ సందర్భంగా కూడా అనుభవంలోకి వచ్చింది. వేలాది మంది మీద పోలీసులు నేరుగా

కాల్పులు జరిపారు. ఇంత ఘాతుకానికి పాల్పడి కూడా పోలీసులు దీన్ని సమర్థించుకున్నారు. గ్రామస్టుల్లో మావోయిస్టులు ఉన్నారని, వాళ్లు క్యాంపు మీద ఫైరింగ్ చేయడంతో ఎన్‌కౌంటర్ జరిగిందని అన్నారు.

మావోయిస్టులెవరో, ఆదివాసులెవరో తెలుసుకోలేని రాత్రి పూట ఇది జరగలేదు. పట్టపగలే ఈ హత్యాకాండకు పాల్పడ్డారు.

మొదట ఇందులో ముగ్గురు చనిపోయారని బస్తర్ ఐజీ సుందరరాజన్ ప్రకటించాడు. అ మూడు శవాలను పోలీసులు స్వాధీనం

చేసుకున్నారు.  పాతిక మంది దాకా  గాయపడ్డారు.  ఈ విషయాలన్నీ స్థానికంగా పని చేసే బస్తర్ టాకీస్ అనే మీడియా సంస్థ వెలుగులోకి తీసుకొచ్చింది.

ఈ ఘటన తర్వాత కూడా అక్కడ పోలీసుల దాడులు జరుగుతున్నాయి. అదివాసులను భయాందోళనకు గురి చేస్తున్నారు. వాళ్ల ప్రాంతంలోకి వెళ్లడమేగాక వాళ్ల అనుమతి లేకుండా స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇది కేవలం ఈ ఒక్క పోలీసు క్యాంపు ఏర్పాటు చేయడానికి సంబంధించిందే కాదు. గత కొన్నేళ్లుగా ఐజీ సుందరరాజన్ అధ్వర్యంలో బస్తర్లో జరుగుతున్న పరిణామాల వెనుక ఒక స్పష్టమైన వ్యూహం ఉంది. ఆయన గత కొన్నేళ్లుగా బస్తర్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఒక పక్క పోలీసు క్యాంపులు ఏర్పాటు చేస్తూ, డ్రోన్ దాడులు, సైనిక చర్యలు చేస్తూనే ఇంకో పక్క శాంతి యాత్రలు, మారథాన్ ర్యాలీలు కూడా చేశాడు. ఏకంగా బస్తర్‌ను టూరిజం హబ్‌గా మార్చేస్తానని ఆయన ప్రకటించాడు. అ పేరుతో బస్తర్లో ఆదివాసులకు శాశ్వతంగా చోటు లేకుండా చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. లేదా వాళ్ల ప్రాంతంలోనే వాళ్లు పరాయి వాళ్లుగా జీవించాలి. పరాయి సంస్కృతికి లోబడి బతకాలి.  లేదంటే చ‌చ్చిపోవాలి. 

ఆదివాసుల చిరునామా మార్చ‌డ‌మే పాల‌కుల ల‌క్ష్యం.  వాళ్లు అక్క‌డ ఉండ‌కూడ‌దు. వాళ్ల‌కు నేల ఉండ‌కూడ‌దు.  దీని కోస‌మే దండ‌కార‌ణ్యానికి అభివృద్ధిని తీసికెళుతున్నారు.  దాని కోసం సైన్యాన్ని తీసికెళుతున్నారు.  దాని కోస‌మే క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు.  మొత్తానికి  అభివృద్ధి ప్రదాతలతో బస్తర్ నిండిపోతోంది.  అక్కడున్న సహజ సంపదలను మార్కెట్ సరుకు చేయడమే ఈ  వ్యూహంలోని అర్థం.  కానీ దండ‌కార‌ణ్య ఆదివాసుల‌కు కూడా ఒక అభివృద్ధి వ్యూహం ఉంది.  ఎలా బ‌త‌కాలో వాళ్ల ద‌గ్గ‌ర ఒక సాంస్కృతిక వ్యూహం కూడా ఉన్న‌ది.  అందుకే ఈ ఘ‌ర్ష‌ణ‌. 

పాలస్తీనా చుట్టూ అయిల్ ఉంది. బస్తర్ కింద అనేకానేక సహజ సంపదలు ఉన్నాయి. తేడా అల్లా అక్కడ ఒక దేశాన్ని మరో దేశం పేరుతో రద్దు చేస్తున్నారు. ఇక్కడ ఒక దేశ భూభాగంలోనే అనాదిగా అక్కడ బతుకుతున్న మూల వాసుల్ని తరిమేసేందుకు యుద్ధం చేస్తున్నారు. మధ్య ప్రాచ్యం కేంద్రంగా అయిల్ రాజకీయాలు ఇజ్రాయిల్ చుట్టూ తిరుగుతున్నాయి. సరిగ్గా భారతదేశంలో అపార సహజ సంపదకు ఆలవాలమైన దండకారణ్యం చుట్టూ ఇజ్రాయిల్, అమెరికా వెన్నుదన్నుతో, ఆయుధాలతో, నమూనాతో మంద్రస్థాయి యుద్ధం జరుగుతున్నది. విప్లవోద్యమ ప్రత్యామ్నాయ ఆచరణకు కూడా దండకారణ్యమే కేంద్రం కావడం యాదృశ్చికం కాదు.

అందుకే మొన్న 6వ తేదీ జరిగింది ఒక విడి ఘటన కాదు. గత కొన్నేళ్లుగా సాగుతున్న దుర్మార్గానికి ఇది కొనసాగింపు మాత్రమే. ఇటీవలి చరిత్రలోకే వెళ్లితే… ఏప్రిల్ 19వ తేదీ తెల్లవారుజామున బీజాపూర్ జిల్లా పమీద్ పోలీసు స్టేషన్ పరిధిలో డ్రోన్ ద్వారా బాంబులు వేశారు. ఇజ్రాయిల్ సైనికులు పాలస్తీనా మీద బాంబు దాడులు, కాల్పుల గురించి మనం వింటున్నాం. పేరుకైనా అవి రెండు “దేశాలు” రెండు “భూభాగాలు”. కానీ ఇక్కడ ఈ దేశ పాలకులు ఏకంగా ఒక ప్రాంతాన్ని లక్ష్యం చేసుకొని అకాశంలోంచి అందరూ ఆదమరిచి నిద్రపోతున్న సమయాన బాంబులు వేస్తున్నారు. ఆ బాంబు పేలుడు శబ్బాల్లో వాస్తవాలు మన చెవినపడకపోవడం విషాదం కదా. పాలకులేమో ‘అబ్బే.. మేమెందుకు అలాంటి పనులు చేస్తామని ఈజీగా తప్పించుకోగలరు. దేనికంటే, బాంబులు వేసి ఎన్కౌంటర్ కథనం చెప్పడానికి స్థలకాలాల పొంతన కుదరదు. కాబట్టి బుకాయించడమే పరిష్కారం.

ఈ పరిస్థితుల్లో మా నెత్తిన బాంబులు వేస్తున్నారని అదివాసులే చెప్పుకోవాలి. ఈ ఘటనను వెలుగులోకి తేవడానికి వందలాది మంది ఆదివాసులు గుమ్మిగూడి అందోళన చేస్తేగాని ఆ సంగతి ప్రపంచానికి ఒక వార్త కాలేదు. కాబట్టి సమస్య సిల్లర్ వద్ద ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్ క్యాంపు ఒక్కటే కాదు. ఐస్తర్ నుంచి ఆదివాసులను ఖాళీ చేయించాలనే యుద్ధ పథకాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అని.

పాలస్తీనాకు మన సకల భావోద్వేగాలతో సంఘీభావం అందించినట్లే, మన విశ్లేషణా పటిమతో అ ప్రజలను అలింగనం చేసుకుంటున్నట్లే, బేషరతుగా వాళ్ల న్యాయ ఆకాంక్షలను మన అస్తిత్వంలో చూసుకొని మమేకమైనట్లే బస్తర్ ఆదివాసులను మనం సొంతం చేసుకోలేమా? అక్కడేం జరుగుతోందో వాళ్లు అరిచి, కేకలు పెట్టి, రోదించి, నెత్తురోడి చెప్పేదాకా మన చెవిన ఎందుకు పడటం లేదో తరచి చూసుకోలేమా? న్యాయ భావనకు, హక్కుల దృక్పథానికి మానవీయతను మించిన కొలమానం ఏమంటుంది? ఇది ఉ దారవాదులందరూ అంగీకరించేదే కదా?

( 1.  సుక్మా-బీజాపూర్ సరిహద్దుల్లో ఉన్న సిల్లర్ వద్ద ప్రభుత్వం పెట్టిన సీఆర్పీఎఫ్ క్యాంపును తీసేయాల‌నే ఆందోళ‌న‌పై పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో గాయ‌ప‌డ్డ ఓ గ‌ర్భిణి ఈ సోమ‌వారం మ‌ర‌ణించింది. 

2. టైఫాయిడ్‌కు వైద్యం చేయించుకోడానికి భ‌ద్రాచ‌లం వ‌చ్చిన మావోయిస్టు గంగాల్ (కోర్సా ఐతూ)ను పోలీసులు అరెస్టు చేసి చిత్ర‌హింస‌లు పెట్టి కాల్చేశారు. పైగా ఆయ‌న కొవిడ్‌తో ఆస్ప‌త్రిలో చ‌నిపోయార‌ని ప్ర‌చారం చేశారు. 

3. కందమాల్ జిల్లాలో నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు)

Leave a Reply