విర‌సం మ‌రోసారి నిషేధానికి గురైంది. తెలంగాణలో విర‌సం  సహా పదహారు ప్రజాసంఘాలను నిషేధించారు. మార్చి 30 న త‌యారు చేసిన జీవో నెంబర్ 73లో  పదహారు  ప్ర‌జా సంఘాలు మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాల‌ని  పేర్కొన్నారు.  ఇవి  మావోయిస్టు పార్టీ వ్యూహం ఎత్తుగడల ప్రకారం పనిచేస్తున్నాయన్నది ఆరోపణ. తెలంగాణ డిజిపి చీఫ్ సెక్రటరీకి 12 మార్చి 2021 న ఒక లెటర్ పంపారు. దానికి ప్రతిగా మార్చి 30న తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పేరుతో ఈ జోవో విడుదల అయింది. అయితే అది ఇరవై నాలుగు రోజుల తరువాత ఏప్రిల్ 23 న పత్రికలకు చేరవేశారు. మామూలుగా అయితే వెంట‌నే పత్రికలలో గెజిట్ రూపంలో ప్రకటనగా ప్రభుత్వాలు ఇవ్వాలి.లేదా ఆ జీవోను సంఘాల బాధ్యులకు అంద‌జేయాలి. కానీ  దానిని వార్త గా ప్రచురణకు పంపారు. అలా  కూడా చేయలేదు. దానిని జర్నలిస్టుల వాట్సాప్ గ్రూపులో పెట్టారు. ఆ జీవోలో సోమేశ్ కుమార్ సంతకం కానీ,  ధృవీకరించేవి ముద్రలు కానీ ఏమి  లేవు. ఇలా ఒక ప్రణాళికాబద్ధ‌ కుట్రలతో ఈ సంఘాలను నిషేధించారు.

ఈ నిషేధాలు,  నిర్బంధాలు ముందు ఊహించిందే. గ‌త రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలు దీనికి ఆధారం. మొదట నిర్బంధాలకు గురిచేశారు. అవి ప్రజాసంఘాల కార్యాచరణను ఆపలేకపోయాయి. కొంత ఒడిదొడుకులు ఉంటే ఉండొచ్చు. కానీ వాటిని అధిగమించి పనిచేయసాగాయి. ఇప్పుడు ఇక నిషేధం విధించడం ద్వారా వాటి పనిని ఆపదలుచుకున్నారు. దీనిని కూడా అధిగమించి ముందుకు పోగలమని  అవి ఇప్పటికే ప్రకటించాయి.         

ఈ నిషేధం 2019 లోనే మొదలైంది. 2019 ఆక్టోబరులో తెలంగాణ ప్రభుత్వం గద్వాల కేంద్రంగా కుట్ర కేసులను మొదలుపెట్టింది.  ఆ కేసులో విద్యార్థి సంఘాల నేతలను, మహిళా సంఘం, విరసం, టీపీఎఫ్ నాయకులను అరెస్టు చేశారు. దాని తరువాత  వరుసుగా నెలకొక ఊపా కేసును పెడుతూ ఇరవై మూడు మందిని అక్రమ అరెస్టులు చేశారు. మరొక ఎనభై ఎనిమిది మందిని ఈ కేసులలో ఇరికించారు. వీరిలో ఒకొక్కరి పై రెండు నుండి ఆరు దాకా ఊపా కేసులు పెట్టారు. అందరిమీద, అన్ని కేసులల్లో ఒక‌టే ఆరోపణ.  మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అబ‌ద్ధ ప్ర‌చార‌మే. 

అదే కాలంలో హైదరాబాద్ సిపి అంజన్ కుమార్ ఒక పత్రికా సమావేశం పెట్టి ఇరవై మూడు ప్రజాసంఘాలను నిషేధిత సంఘాలుగా ప్రకటించారు. నిషేధానికి సంబంధించిన ఏ ప్రక్రియ పాటించకుండా చేసిన ప్రకటన అది. ఆ ప్రకటన ఎదో అనుకోకుండా చేసింది కాదు. భవిష్యత్తులో విధించే నిషేధానికి స‌మాజంలో ఒక‌ర‌క‌మైన సానుకూల వాతావ‌ర‌ణాన్ని త‌యారు చేసుకోడానికే ఆ ప‌ని చేశారు.   

వీటికి కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్‌లో 2020 నవంబర్ నెలలో విశాఖ‌ప‌ట్నం ముచ్చింగిపుట్టులో, పిడుగురాళ్ల లో మ‌రో  రెండు  ఊపా కేసులు నమోదు చేశారు. వీటి కింద  ఏపీలో  పదకొండు మంది ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేశారు. మిగ‌తా  ప్రజాసంఘాల నేతలు    హైకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఆ విషయం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా మార్చి నెలలో ముంచింగిపుట్ట కేసు ఎన్ఐకి బదిలీ అయింది.  ఆ తరువాత మార్చి 31 న ముప్పై మంది ప్రజాసంఘాల నేతల ఇళ్ల పైనా దాడులు చేశారు. మీడియాలో దీనిపైనా కథనాలు వచ్చాయి. నిషేధానికి ముందు ఇలాంటి సన్నాహక కార్యక్రమాలు జరిగాయి. ఆ తరువాత తీరికగా నిషేధపు వార్త బయటికి వచ్చింది.   ఈ  స్థితి తెలంగాణ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ దాకా చుట్టుకొని వ‌చ్చేలా క‌నిపిస్తున్న‌ది. అలా వ‌చ్చినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.   

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1992లో మొదటి సారి నిషేధపు ఆజ్ఞలు జారీ అయ్యాయి.  అప్ప ట్టొ కొన్ని సంఘాల మీద  నిషేధం తీసుకొచ్చారు.  అప్పటి నుండి సంవత్సరానికి ఒకసారి దాన్ని  పొడిగిస్తున్నారు. మధ్యలో కొంతకాలం పాటు కొన్ని సార్లు ఈ నిషేధాన్ని ఉపసంహరించారు. 

కానీ ఇప్పుడు విధించిన నిషేధం గతంలో లాంటిది కాదు. మొత్తంగా దేశంలోనే ఒక మెజారిటీ వాదపు రాజకీయాలను మైనారిటీల మీద బలవంతగా రుద్దడానికి జరుగుతున్న నిర్బంధంలో భాగ‌మే ఈ చర్య. ప్ర‌జ‌లు తాము  నిర్వచించే అభిప్రాయాలు మాత్ర‌మే క‌లిగి ఉండాల‌ని పాల‌కులు అనుకుంటున్న ఫాసిస్టు సంద‌ర్భంలో వ‌చ్చిన నిషేధం ఇది.  మతం, దేశభక్తి పేరుతో ఇది అమ‌లులోకి వ‌చ్చింది. వాటిని కాద‌న్న వారంతా  నిషేధపు నీడలోకి వెళ్లాల్సిందే.          

తెలుగు సాహిత్యం పై త‌న‌కు మక్కువ అని,  సాహిత్యాన్ని బాగా చదువుకున్నాన‌ని  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకుంటారు. ఆయ‌న  ప్రభుత్వంలోనే ఒక సాహిత్య సంస్థ నిషేధానికి గురైంది. కేసీఆర్ చదవరే కాదు,  తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన వాళ్లలో ఒకడు. అయన పోరాటానికి ఉన్న కారణం చాలా స్ప‌ష్ట‌మే. తెలంగాణ‌లోని త‌న వ‌ర్గానికి  అధికారం కావాల‌ని, త‌న వ‌ర్గమే తెలంగాణ‌ను  దోచుకోవాల‌నే అంతిమ లక్ష్యం కోసం ఆయ‌న ఉద్య‌మించాడు. ఈ సంగ‌తి  ప్ర‌జా సంఘాలు మొద‌టి నుంచీ చెబుతూనే వ‌చ్చాయి.  అయినా అందులో ప్ర‌జా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి కాబ‌ట్టి ప్రాంతీయ ప్ర‌జాస్వామ‌క ఉద్య‌మంగా గుర్తించి అందులో భాగ‌మ‌య్యాయి. ఆ ర‌కంగా  తెలంగాణ ప్రాంతం కోసం పోరాటం జ‌రిగిన పోరాటంలో  ప్రజాసంఘాల పాత్ర  కేసీఆర్‌కు తెలియంది కాదు. వాళ్ళ ఉద్దేశం ప్రజాస్వామిక తెలంగాణ. ప్రతిపక్షం లేని తెలంగాణాలో ఇవి ప్రతిపక్ష పాత్రను నిర్వహిస్తున్నాయి. ప్రజల గొంతుకగా ఉన్నాయి. వాటి కార్యాచరణనే ఆయనకు సమస్యగా మారింది. అందుకే కేంద్రంలో ఉన్న భాజపా ఫాసిస్టు చర్యలకు మద్దతుగా ఈ నిషేధాన్ని విధించాడు. నిర్బంధాలకు, అణిచివేతలకు తెలంగాణను ఒక మోడల్ గా ముందుకు తీసుకువచ్చాడు. అధికారం కోసం భాజపా, టీఆరెస్స్, వైకాపా  లేదా మిగతా పార్టీలు ప‌ర‌స్ప‌రం ఎన్ని ఆరోపణలు అయినా చేసుకోవచ్చు. కానీ ప్రజల తరుపున పనిచేసే  శ‌క్తుల ప‌ట్ల వారంద‌రి వైఖ‌రి ఒక‌టే. అందుకే ఈ నిషేధాలు, నిర్బంధాలు.  

నిషేధానికి గురైన ఈ పదహారు ప్రజాసంఘాలు భిన్నమైన లక్ష్యాలతో ప‌ని చేస్తున్నాయి. వాటి దృక్ప‌థాలు ఒక్క‌టి కాదు. వీటిలో ఒకటి లేదా రెండు సంఘాలకు మాత్రమే మార్క్సిస్టు రాజకీయాల పట్ల పూర్తి ఏకాభిప్రాయం ఉంది. ఆంత మాత్రాన వాటిని  మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాల‌ని ఆరోపించ‌డానికి ఆధారాలు లేవు.  ఎందుకంటే దేశంలో అనేక సమూహాలు, పార్టీలు మార్క్సిస్టు రాజకీయాలతో పనిచేస్తున్న సంగతి తెల్సిందే. అవి అన్నీ ఒక‌టి కాదు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకవచ్చే ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడటమంటే  మావోయిస్టు పార్టీ ప్రభావం లోకి తీసుకువెళ్లడం ఎలా అవుతుంది?  అది ఆ పార్టీ అర్బన్ పర్స్పెక్టివ్ ఎలా అవుతుంది?    క్రూరమైన  చట్టాలతో మనుషులను బందీలను చేస్తే వారి విడుదల కోరడం తప్పు ఎలా అవుతుంది?  కార్పొరేట్ అనుకూల చట్టాలు చేసి అవి రైతాంగానికి వ్యతిరేకంగా ఉంటే మాట్లాడం నేరమెలా అవుతుంది? మోనారిటీల అస్థిత్వాన్ని కాలరాసే   సిఏఏ /ఎన్ ఆర్ సి ల  గురుంచి మాట్లాడితే దేశద్రోహం ఎలా అవుతుంది?  ఈ అభిప్రాయాలూ కలిగి ఉంటే మావోయిస్టులు అవుతారా? అదే అయ్యేట్ల‌యితే  ఈ దేశంలో నూటికి తొంబై మంది మావోయిస్టులే అవుతారు. వారిని నిర్బంధించ‌డానికి దేశ‌మంతా జైలు కావాల్సి వ‌స్తుంది.  ప్రతివారు నిషేధానికి గురికావాల్సిందే.   భిన్నమైన రాజకీయాలు కలిగి ఉన్నందుకు  నిషేధించాల‌నుకుంటే దేశంలో నిషేధానికి గురికాని మనిషే మిగలడేమో.  అసమ్మతి లేకుండా దేశం నడవాలంటే ఇది ప్రజాస్వామ్యం కాకుండా రాచరికం, ఫాసిస్టు రాజ్యం అవుతుంది.

నాగరికత పరిణామ క్రమంలో సమాజం ఇలాంటి ఎన్నో నిర్బంధాలను, నిషేధాలను చవి చూసింది. ప్రగతిశీల ఆలోచనలు కలిగి ఉన్నారనే నెపంతో ఎంతో మంది ఆనాటి వ్యవస్థలకు వ్యతిరేకంగా నిలబడ్డవారే. వారి త్యాగాల ఫలితమే నేడు సమాజం అనుభవిస్తున్న ఫలాలు. వారు ఆనాటి ఆధిప‌త్య  వ్యవస్థలతో  గొంతు క‌లిపి ఉంటే స‌మాజపు పురోగమనం జరిగేది కాదు. 

అలాగే ఇప్పుడు సమాజపు పురోగమనం కోసం ఒక పెద్ద పెనుగులాట జ‌రుగుతున్న‌ది. దీని కోసం  ప్ర‌జ‌లు, మేధావులు, ర‌చ‌యిత‌లు సంఘ‌టిత‌మై త‌న  పాత్ర నిర్వహిస్తున్నారు. వారి పక్షన నిలబడతామా లేదా అన్నదే  ప్రశ్న.  తెలంగాణ సమాజంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామా లేదా అన్నదే ప్రశ్న. భిన్న అభిప్రాయాలకు, రాజకీయాలకు చోటు ఇస్తామా లేదా అన్నదే ప్రశ్న.  పోరాటాల ద్వారా వచ్చిన తెలంగాణలో ప్రజల పక్షాన ఉన్న వారిని కాపాడుకుంటామా లేదా?  అన్నదే ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబునివ్వాల్సింది మనమే. ఆ స‌మాధాన‌మే మ‌న స‌మాజాన్ని నాగ‌రికంగా తీర్చిదిద్దుతుంది.

Leave a Reply