భారత పోరాటాల చరిత్రలో మరొక పోరాటం నమోదు అయింది. గత దశాబ్ద కాలంలో దేశంలో ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమం, రైతు ఉద్యమాలు, సిలింగేర్, తిజీమాలి లాంటి ఆదివాసీ పోరాటాలు జరిగాయి. ఇప్పుడు నోయిడా కార్మిక ఆందోళన వాటి సరసన చేరింది. వీటిలో దేనికవే ప్రత్యేకమయిన పోరాటలు. మరొకవైపు ఇవన్ని కార్పొరేట్ హిందుత్వ ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలు. ఈ తరహా పోరాటాలే దేశంలో అరకొరగా మిగిలి ఉన్న పోరాట, ప్రజాస్వామిక వాదులకు ఊపిరి అవుతున్నాయి. వీటిని కాపాడుకోవటం అనేది దేశ ప్రజలకు అవసరం, ఆవశ్యకత.                 

నోయిడాలో 82 ఫ్యాక్టరీలకు చెందిన కార్మికులు ఏప్రిల్ మొదటి వారం నుంచి సమ్మె చేస్తున్నారు. వేతనాలు పెంచాలని, ఎనిమిది పని గంటలు పనిదినం, రెగ్యులర్ – కాంట్రాక్ కార్మికులకు ఒకే జీతం, పని చేసే ప్రదేశంలో సరైన రక్షణ వసతులు కల్పించాలని కార్మికులు డిమాండ్ చేస్తూ ఈ సమ్మె మొదలుపెట్టారు. సమ్మె జరుగుతున్న ప్రాంతం దేశ రాజధానికి దగ్గరలో ఉన్న ప్రాంతం. ఢిల్లీతో సరిహద్దులు పంచుకునే హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలోని జిల్లాలతో పారిశ్రామికీకరణ అభివృద్ది కోసం ఏర్పాటు అయిన దానిలో ఈ ప్రాంతం భాగం. ఈ ప్రాంతంలో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు.         

నోయిడా ఉత్తరప్రదేశ్ కు చెందింది. రాష్ట్ర ప్రభుత్వాలు సమయానుకూలంగా మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా కనీసపు వేతనాలు, అలవెన్సులను ప్రకటించాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ఫ్యాక్టరీ యాజమాన్యాలు కార్మికులకు జీతాలను చెల్లిస్తాయి. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పని 12 ఏళ్ల క్రితం చేసింది. మళ్ళీ తిరిగి జీత బత్యాలు పెంపుదల గురుంచి పట్టించుకోలేదు. ఆ ప్రాంతంలో ఉన్న కార్మికులు అప్పటి వేతన సవరణతోనే ఇప్పటికి పనిచేస్తున్నారు. గత దశాబ్ద కాలంగా జీవన వ్యయాల పెరుగుదలతో పాటు యుద్ధం తెచ్చిన సంక్షోభం వల్ల విపరీతంగా పెరిగిన ధరల ప్రభావం వల్ల కనీసం రోజు గడవటం కష్టం అవుతున్న దశలో సమ్మెకు దిగారు. 

2025 నవంబర్ లో భారత ప్రభుత్వం నూతన లేబర్ కోడ్ లను తీసుకువచ్చింది. కార్మికుల పెంపు సంక్షేమం కోసం, ప్రపంచ విపణిలో భారత్ వెలగడానికి అని చెబుతున్న ఈ కోడ్ లు పూర్తిగా యజమానులకు అనుకూలమైనవి. కార్మికులకు వ్యతిరేకమైనవి.  కార్మికుల పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని 12 గంటలకు ఆమోదం ఈ కోడ్స్ ద్వారా అమలులోకి వచ్చింది. కాంట్రాక్ట్ కార్మికులను దోచుకోవడానికి, కార్మికులు సంఘటితంగా యూనియన్ లు పెట్టుకోవడానికి అనేక ఆటంకాలు ఇవి కల్పిస్తున్నాయి. కార్మికులు యాజమాన్యం పై నిరసన తెల్పడానికి ఉపయోగించే సమ్మె హక్కును, తన తోటి కార్మికులకు మద్దతుగా సమ్మెలో పాల్గొనే హక్కును కొత్త లేబర్ కోడ్స్ ఆపుతున్నాయి. కార్మికుల హక్కులను నిరాకరిస్తూ యాజమాన్యానికి బానిసలా ఉంచడానికే ఈ కోడ్స్ ఉపయోగపడుతున్నాయి.     

అధికారవర్గం నోయిడా సమ్మెను కార్మిక హక్కుల వైపు నుండి చూడకుండా ‘కుట్ర’ వైపు నుండి చూడటం మొదలుపెట్టింది. దేశంలో, రాష్ట్రంలో ‘డబల్ ఇంజిన్’ సర్కార్ ఉండగా వీటిని ఉపేక్షించం అంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఈ సంఘటనకు కారకులుగా చెబుతూ 10  మందికి పైగా సామాజిక కార్యకర్తకలను, విద్యార్ధులను నోయిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారి గురుంచి సమచారం తెలుసుకోవడానికి వెళ్ళిన న్యాయవాదులను కూడా నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. ఎప్పుడో దశాబ్ద కాలం క్రితం సవరించిన వేతనాలను సవరించకుండా కార్మికులను దోచుకుంటూ, కార్మికుల హక్కుల గురుంచి మాట్లాడుతున్న వారిని అర్బన్ నక్సల్, పాకిస్థాన్ ప్రేరేపణ అని ప్రచారం చేయడం రాజ్య’నైతిక’ స్వభావానికి నిదర్శనం. 

కార్మికులను సంఘటితం కాకుండా పోరాటాలను నిరోధించాలి అనుకున్న మోడీ ప్రభుత్వ కుట్రలను నోయిడా కార్మిక వర్గం బద్దలు కొట్టింది. ఈ సమ్మె మొదలయిన దగ్గర నుండి ఇది విస్తరిస్తున్న క్రమంలో 1000 మందికి పైగా అరెస్ట్ కాబడ్డారు. ఇందులో 350 మంది మైనర్లు. నోయిడా కార్మికులు ‘పోరాడితే పోయేది ఏమి లేదు బానిస సంకెళ్ళు తప్ప’ అన్న మార్క్స్ నిర్ధారణను మరోసారి రుజువు చేస్తున్నారు. నోయిడా కార్మికులు సమ్మె చేప్పట్టిన తరువాత హర్యానాలోని గుర్ గాం లోని ఫ్యాక్టరీలు కార్మికుల వేతనాలు పెంచాయి. ఒక చోట అంటుకున్న నిప్పురవ్వ దావానంలా వ్యాపించకుండా అక్కడి యాజమాన్యం ముందు జాగ్రత్త ఇది. కార్మికుల పోరాటానికి దక్కిన ప్రతిఫలం ఇది. ఇలాంటి పోరాటాలే కార్మికుల సంఘటితంగా ఉండి పోరడాల్సిన ఆవశ్యకతను తెలియచేస్తున్నాయి.   

140 ఏళ్ల క్రితం 8 గంటల పని దినం కోసం చికాగో కార్మికులు అందించిన పోరాట వారసత్వం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల కార్మికులు కొనసాగించారు. ఇప్పుడు మరోసారి దానిని భారత కార్మికులు అందుకున్నారు. ఇది నోయిడా కు మాత్రమే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న కార్మికులు, వాటికి నాయకత్వం వహిస్తున్న కార్మిక సంఘాలు అందుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ను ఉపసంహరించుకునేలా పోరాటాలు చేపట్టాలి. దీనికోసం కార్మికులను సంఘటిత పరుస్తూ ప్రజా ఉద్యమాలను నిర్మించాలి. ఇంతకమునుపు కార్మికోద్యమలలో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు హత్యలకు గురైయ్యారు. అలాగే అనేక మంది దేశద్రోహులుగా, ఆటంకవాదులుగా ముద్ర వేయబడ్డారు. ఇలాంటి అనుభవాల నుంచి ప్రజలను, గత రెండు దశాబ్దాల కాలంలో వస్తున్న నూతన తరానికి కార్మిక హక్కులకు, వారి డిమాండ్ లకు ఉన్న న్యాయ బద్దతను అర్ధం చేయించాలి. సామాజిక, ప్రజాస్వామిక హక్కుల పోరాటాలు కార్మిక వర్గంతో చేయి కలపాలి. సంఘటిత పోరాటాలు ఇప్పటి ఫాసిస్ట్ సందర్భంలో అత్యవసరం. ఇందుకోసం మనం అందరం మనవంతుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే చికాగో అమరులకు, ఆ వరుసలో కార్మికుల హక్కుల కోసం పని చేస్తూ అమరులైన వారిని ఇచ్చే నివాళి.          

Leave a Reply