ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు.
మనిషి లోపలి ఒంటరితనాల గురించి, బాహ్యప్రపంచంలో మనిషి ఎదుర్కొనే ఒంటరితనాల గురించిన కథలు మనల్ని కల్లోల పరుస్తాయి. కలవర పెడతాయి. అప్పటిదాకా రాని ఆలోచనలు ఇలాంటి కథలు చదివితే కొత్తగా పుట్టుకు వస్తాయి. ఏవో ఖాళీలు, ఏవో అంతరాలు, మరేవో అడ్డుగోడలు ఒక్కసారిగా కథలో కనిపిస్తాయి. అవన్నీ అంతకు ముందు మనం చూసినవే, అయినా చూసినా నిజంగా చూడలేనివి.
అప్పటిదాకా చూసినదాన్నే, చూసినా చూడలేని దాన్నే కొత్తగా చూపించేవే మంచి కథలు.
నడవడం స్థానంలో పరిగెత్తడం మొదలయ్యాక వేగం పెరిగాక, మనుషులకు దూరంగా మనుషులు కదలటం మనుషులు దూరంగా మనుషులు వెళ్లిపోవడం చాలా సహజమైపోయింది. సులభమై పోయింది కూడా.అలా పరిగెత్తుకుంటూ వెళుతున్న మనుషులు ఎక్కడో చోట ఆగాల్సిందే. కొందరిని మరణం అవుతుంది. మరికొందరిని కొందరి మరణాలు ఆపుతాయి. మనుషులు కావచ్చు ఖాళీలు కావచ్చు మరణాలు కావచ్చు ఏదో మలుపులో ఇది కదా జీవితం అని కొత్తగా చెబుతాయి.ఖాళీలను జ్ఞాపకాలను దుఃఖాలను ఒంటరితనాలను నీడలాగా వెంటేసుకుని తిరిగే వృద్ధులకు ఎన్నో ప్రతీకలు.
ఇంట్లో వయసులో చాలా పెద్ద వాళ్ళు యువతరానికి, నడివయస్కులకు ఒక్కోసారి మోయలేని భారంగానో బరువుగానో లేదా పాత ప్రశ్నలు గానో అనిపిస్తారు. విడిచి పెట్టలేని పడేయలేని పాత సామానులా కొందరు అనుకుంటారు. బంగారానికి విలువ ఇచ్చే వాళ్ళ మాటల్లో చెప్పాలంటే పెద్దవాళ్ళు పాత బంగారం లాంటి వాళ్లు అని మరికొందరు అనుకుంటారు .
పెద్దలని ఎలా చూడాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, చిన్నపిల్లలు మొదలుకుని పెద్దలతో ఎలా వ్యవహరించాలి ??
ఇవన్నీ నిజానికి ఈ వయసులో చాలా మంది పెద్ద వాళ్లకు కూడా తెలియని విషయాలే. కొందరు చిన్న పిల్లలు, కొందరు కూతుళ్లు కొందరు కొడుకులు, మనవళ్లు, చుట్టుపక్కల వాళ్లు కావచ్చు, బంధువులు కావచ్చు పరిచితులు కావచ్చు అపరిచితులు కావచ్చు, అర్థం చేసుకున్నప్పుడు అర్థం చేసుకోగలిగినప్పుడు-ఆ స్నేహం ఆ ప్రేమ ఆప్యాయత మనుషుల మధ్య ఒక సజీవతను తీసుకు వస్తాయి. అప్పటి వరకూ నిర్జీవంగా అనిపించినదేదో సజీవంగా అనిపించడమే మానవీయతకు ఒక ఉదాహరణ.
*
కథ విసుగు తెప్పించకుండా ఉండాలి. కొంచెం చెబుతున్నట్టు మరింకేమిటో అర్థం చేసుకోమన్నట్టు ఉండాలి. విభిన్న ధ్వనులతో కూడిన నగర జీవితంలో అక్కడక్కడా అప్పుడప్పుడు నిశ్శబ్దానికి కూడా చోటు ఉంటుంది. ఉండి తీరాలి కూడా. అదే జీవితం. మొత్తం చీకటి నిండిన జీవితాల్లో ఉన్నట్టుండి అప్పుడప్పుడు వెలుతురు ప్రసరింపచేస్తుంది కాలం. ఆ వెలుతురులో ఆ వెలుగులో జీవితాన్ని చూసినప్పుడు జీవితం కొత్తగా ఉంటుంది. అసలు ఎప్పటికప్పుడు కొత్తగా ఉండటమే కదా జీవితం. ఆ జీవిత సత్యాలను కథల్లో చదివినప్పుడు అంతవరకు మనకు బోధపడని సత్యాలే ఈ కథలలో అంతరార్థంగా ఉండి కొత్తగా అర్థం అవుతాయి. అట్లా వృద్ధుల ఒంటరితనాన్ని ప్రేమను కాంక్షించే తత్వాన్ని, ఒక ఎరుకను, స్పృహను కలిగించే కథ “చివర్లో ఒక స్నేహం”
*
మెహర్ రాసిన “చేదు పూలు” (2019) కథా సంపుటిలోని ఒక కథఇది .
దాదాపు ఎనభై సంవత్సరాల ముసలాయనకు, యాభై సంవత్సరాల కూతురు తోడు. మధ్యలో కొంతకాలం అతన్ని లాలించటానికి ఒక ఇరవై ఏళ్ల కుర్రాడు శేఖర్ పార్ట్ టైం జాబ్ కు కుదురుకుంటాడు.
*
ఆ కుర్రవాడు తన కోచింగ్ పూర్తయ్యాక ఇంటికి తిరుగు ప్రయాణం అవుతాడు. ఆ సమయంలో కథ మొదలవుతుంది. ఉద్యోగం చేస్తున్న యాభై యేళ్లు కూతురు తండ్రిని ఇంకా బాగా చూసుకోవడానికి శేఖర్ అనే కుర్రవాడికి ఉపాధి కల్పించి ఉంటుంది. శేఖర్ తన చదువు, కోచింగ్ పని పూర్తయ్యాక ఇంటికి వెళ్లి పోయే రోజు అది.
పక్కన టౌన్షిప్ లో జరిగే లాఫింగ్ సెక్షన్స్ ఆ ముసలాయన కు గుర్తుకు వస్తుంది. కథలోని ఆ దృశ్యాన్ని రచయిత ముసలాయన ఆలోచనల్లో ఇలా చెబుతాడు..
కిటికీ తెరల్లోంచి సాయంత్రపు వెలుగు ఇంకా తగ్గి లోపలికి వస్తోంది. ముసలాయన మంచం హెడ్ బోర్డుకు తలగడ వొత్తి పెట్టి దానికి జారగిలబడ్డాడు. గోడకున్న గడియారం వైపు చూసాడు. ఐదున్నర. చేసేదేం లేక ఆ గడియారాన్నే చూస్తూ కూర్చున్నాడు. కాలం మాయమై మరలా సుదుటి వెనక చీకట్లలో దృశ్యాలు : పక్కన టౌన్ షిప్ లో జరిగే లాఫింగ్ సెషన్స్ గుర్తు రాగానే ముఖం చేదు తిన్నట్లు చిట్లింది. రేపట్టించి అక్కడికెళ్ళాలేమో! పాసిపోయిన వాతావరణం, వర్తమానం లేదు. భవిష్యత్తు మాటే రాదు. ఎప్పుడు చావొచ్చి వీపు చరుస్తుందోనన్న భయాన్నీ, లేదూ యింకా వచ్చి చావదేమన్న ఏకాకి వైరాగ్యాన్నీ తాత్కాలికంగానైనా మర్చిపోటానికి అందరూ ఇక్కడ చెట్టపట్టాలేసుకుని ఉన్మాదుల్లా నవ్వటం. మాటల్లో కూడా ఎప్పుడూ అనే టాపిక్స్.. వాతావరణం గురించో, మనవళ్ళ అల్లరి గురించో, రోగాల బేరీజులో, కాస్త రంగు పులిమి గతంలోంచి ఎత్తుకొచ్చిన పిట్టకథలో.. వాళ్ల వాళ్ల ప్రత్యేక స్వభావాల్ని వదిలేసి ఏదో ఓడ మునిగితే ఒడ్డుకు చేరిన వాళ్ళలాగా ఒకరినొకరు పిరికిగా కరచుకుపోవడం.. అలికిడికి కళ్ళముందు గడియారం ఏర్పడింది.
టైం ఐదూ ముప్పై ఐదు. శేఖర్ తలుపు తెరిచి జీన్స్ పాంట్ జేబుల్లో డబ్బులు కుక్కుకుంటూ వచ్చాడు. వచ్చి మంచం మీద ముసలాయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ముసలాయన గడియారం వైపు చూసాడు.
“ఏంటీ, సీరియనస్ నెస్సు? ఎవరి మీద కోపం?” అన్నాడు శేఖర్. ముసలాయన రాని నిట్టూర్పొకటి విడిచాడు: “మాకెవరి మీద కోపం వుంటుందిరా? అయినా మా కోపంతో ఎవరికేం పని? పేషెంట్ కి నయమైపోయింది. మీ డ్యూటీ అయిపోయింది. ఇవాళ జీతం తీసుకుని చెక్కేస్తున్నారు. అయ్యగారు…”
“వెటకారమా?”
ముసలాయన గడియారం వైపే చూస్తున్నాడు.
“అంటే ఈ నాలుగు నెలలూ నేను చేసింది డ్యూటీ అంటారు.” ముసలాయన సెకన్ల ముల్లుని చూస్తున్నాడు.
“ఇదంతా జీతం లెక్కే అన్నమాట.”
శేఖర్లో ఇలా తను ఆశించిన స్పందన కనిపించాక – తన అక్కసు వెళ్ళగక్కేందుకు తగిన పునాది ఏర్పడిందని తేలాకా-ముసలాయన శేఖర్ వైపు చూసాడు. తలగడ మీద కొద్దిగా పైకి లేచి కూర్చుని, “నీ పద్ధతులలా వున్నాయిరా మరి. రేపు వెళ్ళిపోతున్నవాడివి. ముందో మాట చెప్పొద్దూ? మీ ఆంటీకి చెప్తే సరిపోతుందా? జీతం యిచ్చేది ఆవిడ గనుకనా?”.
శేఖర్ మాట్లాడలేదు. చిన్నగా నవ్వుతున్నాడు.
ముసలాయన చూపుడు వేలు ఆడిస్తూ, “వీపు విమానం మోతెక్కిపోతుందొరే, అలా నవ్వావంటేను,” అన్నాడు.
శేఖర్ నవ్వుతూనే లేచి నిలబడ్డాడు. “పదండి, అలా పార్కు దాకా వెళ్ళొద్దాం” అన్నాడు చేయందిస్తూ.
“ఓపిక లేదురా యివాళా…”
“లేవాలి! మళ్ళీ రేపు నేనుండను.”
ముసలాయన శేఖర్ ముఖంలోకి చూశాడు.”ఇదో వెధవ బెదరింపేమో మాకు”అని గునుస్తూనే శేఖర్ చేయందుకుని మంచం దిగాడు.
*
వృద్ధాప్యంలో తోడుగా సహాయపడిన యువకుడికి ముసలాయన కు మధ్య సంభాషణ చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది.
శేఖర్ వెళ్ళిపోతున్న విషయాన్ని ముందుగా తన తో చెప్పనందుకు ఆయన బాధపడతాడు. అతనికి డబ్బులు ఇచ్చే తన కూతురికి మాత్రం శేఖర్ తను వెళుతున్న విషయాన్ని ముందుగా చెప్పటాన్ని ముసలాయన జీర్ణించుకోలేడు.
ఇద్దరి మధ్య ప్రేమ వాత్సల్యానికి అభిమానానికి కృతజ్ఞతలు వీడ్కోలు కు సంబంధించిన భావ స్పందనలను, వాదనలను, ప్రతిస్పందనలను చదవడం ఆసక్తికరంగా ఉంటుంది.
ఈ వాదన మరి కొంత సేపు కొనసాగుతుంది .అది రచయిత మాటల్లోనే చూడండి.
ఇది గొడవ లాగా ఉండదు, నిలదీసినట్టు ఉండదు. సంజాయిషీ అడిగినట్టు ఉండదు, క్షమాపణ కోరినట్టు ఉండదు. అయినా గొడవే.
*
తర్వాత కారిడార్లోనూ, లిఫ్టులోనూ, అపార్ట్మెంటు గేటు దగ్గర నుండి పార్కు గేటు దాకానూ యిద్దరూ ఈ విషయమై వాదించుకుంటూనే వున్నారు. “క్లాసులు పూర్తవగానే వూరెళిపోతానని మీకు తెలుసు కదా”ని శేఖరూ, “నీ కోచింగ్ ఎప్పుడు పూర్తవుతుందో నాకేం తెలుస”ని ముసలాయనా, “తెలుసనుకున్నాన”ని శేఖరూ, “అనుకోవడమేమి”టంటూ ముసలాయన…. నిజానికి ఈ వాదులాట సగంలో వుండగానే ముసలాయనకి శేఖర్ తను వెళ్ళబోయే తారీకు ముందే చెప్పాడన్న సంగతి గుర్తొచ్చింది. అయితే వెళ్ళిపోవాలనుకోవడమే శేఖర్ అసలు నేరంగా మనసులో ఓ రహస్య నిశ్చయానికొచ్చేసిన ఆయన, హేతువుకు నిలబడని ఈ వాదాన్ని బయటపెట్టలేక, శేఖర్తే తప్పని బుకాయిస్తూనే వున్నాడు. చివరికి శేఖరే ఓ మెట్టు దిగి తనదే తప్పని ఒప్పుకున్నాడు. కాని అతనలా ఒప్పుకోగానే ఈ వాదనంతా ఎంత నిష్ఫలమో అర్థమైంది ముసలాయనకి. ఎంత వాదించినా అతను వెళ్ళిపోతున్నాడన్న నిజం ఎలానూ మారదు. ఇది గుర్తు రాగానే, ఇదివరకట్లా రాగద్వేషాల్తో మలినం కాని, స్వచ్ఛమైన, సొంతమైన దిగులు కమ్ముకొంది.
*
దిగులు ఎంత స్వచ్ఛమైనదో ఎంత సొంతం అయిందో రచయిత ప్రతిభావంతంగా చెబుతాడు. రాగద్వేషాల తో మలినం కాని దుఃఖం,దిగులు స్వచ్ఛం గానే ఉంటాయి. అదే నిజమైనది కూడా.
దూరాలు తప్పదని తెలిసి దూరమయ్యే మనిషి కోసం వృద్ధాప్యంలో ఆ ముసలాయన పడే వేదన అంతులేనిది. అదే సమయంలో అది సత్యం అని కూడా అతనికి తెలుసు, అర్థం అవుతుంది. తన ఆశకి వాస్తవానికి మధ్య ఉన్నటువంటి కఠినమైన ఆర్థిక సంబంధాలు మానవ సంబంధాలను ఎట్లా సున్నితంగా ,తీవ్రంగా , కఠినంగా ప్రభావితం చేస్తున్నాయో, మనసులకు దగ్గరైన మనుషుల కదలికలు ఎడబాటు ఎంత సంతోషాన్ని ఎంత ఉద్విగ్నత ని కలిగిస్తాయో ఈ కథలో చాలా సున్నితంగా చెప్పబడింది.
కోచింగ్ నిమిత్తం శేఖర్ ఆ ఊరు వచ్చాడు. ఆర్థిక అవసరాలు, అతడి కుటుంబ పరిస్థితులు అతన్ని ముసలాయన కు తోడుగా ఉంటూ సేవచేసే ఉపాధిని కలిగించాయి. వృద్ధాప్య దశ లో ముసలాయనకి సేదతీరడానికి కనీసం పార్క్ వరకు వెళ్లి రావడానికి ఒక తోడు అవసరం అయింది. కూతురు ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత పెద్దాయన బాగోగులు చూసుకునేది శేఖరే.
అది శాశ్వతమైన తోడు కాదని ముసలాయనకు బాగా తెలుసు. అయినా అతడు దగ్గర తరానికి దగ్గరగా అలవాటు పడిపోయాడు. ఈ దగ్గరితనాలు దూరమవుతాయని అతనికి తెలుసు. మరింకేమీ చేయలేని పరిస్థితులు. మనుషులకు మనుషులు కరువవుతున్న కాలం. మనుషులకు అవసరాలకు సరిపడా డబ్బు కరువవుతున్న కాలం. సరిగ్గా ఇక్కడే ఇంకా మనుషులకు డబ్బును మాత్రమే ప్రేమించని మనుషుల జాడ దొరుకుతుంది. ఈ జాడ చాలా విలక్షణమైనది. జీవితాంతం మనిషి జాడ కనుగొనడమే, మనుషుల్ని కాపాడుకోవడమే జీవితం కదా.
డబ్బు కోసమే శేఖర్ ఈ పనులు చేశాడా? ఆ ముసలాయనకు సేవ చేసిన శేఖర్ కు ప్రతిఫలంగా డబ్బు ఇస్తే సరిపోతుందా? ఇవీ ప్రశ్నలు.
వాళ్ళు కూర్చున్న మునిసిపల్ పార్కు చిన్నదే. మధ్యలో నీళ్ళు రాని ఫౌంటెన్;
… రేపటి నుంచీ తను ఈ పార్కుకి రాలేడని ముసలాయనకి చప్పున అర్థమైంది. తామిద్దరితోనూ కలిసి ఎన్నో వేడుకైన సాయంత్రాల్లో ఒక భాగమైంది ఈ పార్కు. ఇకమీదట ఇక్కడికి ఎప్పుడొచ్చినా దీని మూగతనం బాధపెడ్తూనే వుంటుంది. శేఖర్ వైపు చూసాడు. బెంచీ అంచు మీద తల వాల్చి నిద్రగన్నేరు కొమ్మల్లోకి చూస్తున్నాడు. ఏదో గుండెల్లోంచి మొదలై గొంతు దాకా ఎగతన్నినట్లైంది ముసలాయనకి. తల తిప్పి నేల వైపు చూస్తూ “గుర్తుంచుకోరోయ్ మమ్మల్ని!” అన్నాడు నెమ్మదిగా. చనిపోయాకా ఈ కుర్రాడి జ్ఞాపకంలో మిగలడమొక్కటే తన జీవితాన్ని సార్థకం చేసేది అనిపించింది ఆ క్షణాన.
శేఖర్ ఇబ్బందిగా నవ్వాడు: “ఊరుకోండి మీరూ…”
“గుర్తుంచుకుంటావా”
“గుర్తుంచుకుంటావా”
“ఎందుకు మర్చిపోతాను…”
“వీలు కుదుర్చుకుని రారా ఓ సారి… వీలైనంత త్వరగా… మళ్ళీ ఉంటానో లేదో”
“అదిగో మళ్ళీ!”
ముసలాయన నవ్వాడు. మళ్ళీ ఆలోచిస్తున్నట్టు ముందుకు చూస్తూ నుదురు చిట్లించి మాట్లాడేడు, “మంచి వుద్యోగం సంపాయించు. కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి. అన్నింటికంటే ఆర్థికంగా నిలదొక్కుకోవటం ముఖ్యం… ఒకళ్ళ దగ్గర చేయిజాచే పరిస్థితి రాకూడదు మనకి… అర్థమైందా!”
శేఖర్ అరచేతి రేఖల మీద గోరుతో జాడలు తీస్తున్నాడు.
ముసలాయన గుండెల నిండా గాలి పీల్చి వదిలాడు. “వెళ్లాం మరి, చీకటి పడుతోంది. “
శేఖర్ పైకి లేచాడు. ముసలాయన అలవాటు ప్రకారం శేఖర్ భుజం చుట్టూ ఓ చేయి వేసి మరో చేత్తో వూతకర్ర పట్టుకుని నడిచాడు. ఇదే చివరిసారి వీడ్ని ముట్టుకొనేది.
అన్నట్టు వేళ్ళతో భుజం మీద రాస్తున్నాడు. గేటుదాకా యిద్దరూ మాట్లాడలేదు. దారిలో గ్రేహౌండ్, దాని బట్టతల యజమాని ఎదురొచ్చారు. పార్కు రివాల్వింగ్ గేటు తిప్పుకుంటు లోపలికి వచ్చిన యిద్దరు కుర్రాళ్ళు ఏదో జోక్ చెప్పుకుని నవ్వుతూ హై ఫైన్ ఇచ్చుకున్నారు. ముందు శేఖర్ గేటు గుండా బయటకు వెళ్ళి ముసలాయనకి చేత్తో సాయం చేశాడు.
రోజులాగే శేఖర్ ముసలాయన్ని ఇంటి దాకా దిగబెట్టేందుకు రాబోయాడు.. ముసలాయన మాత్రం అలా వీల్లేదన్నాడు. శేఖర్ని ఇక్కణ్ణించే సాగనంపి వెళతానన్నాడు. శేఖర్ కాసేపు వాదించాడు. ముసలాయన వినలేదు. ఆటో మాట్లాడటం పూర్తయ్యాక లోపల కూర్చొని, జాగ్రత్తగా వుండమనీ, బాత్రూమ్ కి వెళ్ళేటపుడు తలుపు గెడ వేసుకోవద్దనీ, ఫోన్ చేస్తుంటాననీ చెప్పాడు శేఖర్.
ముసలాయన ఆటో మలుపు తిరిగే దాకా ఫుట్పాత్ మీద నుంచుని చూసాడు.
*
అలికిడైతే కూతురు వంటగదిలోంచి హాల్లోకి తొంగి చూసింది. ముసలాయన తలుపు దగ్గర కదలకుండా నిలబడి వున్నాడు. “ఏంటి నాన్నా! ఏమైందీ? శేఖర్ ఏడీ?” కొంగుకి చెయ్యి తుడుచుకుంటూ తండ్రి దగ్గరకు వచ్చింది. ముసలాయన కలలోంచి తేరుకున్నట్టు ఆమెను వెంటనే గుర్తుపట్టనట్టూ చూసాడు. “ఏమైంది నాన్నా?” వీపు మీద చేయివేసి కంగారుగా అడిగింది.
“అట్నుంచటు వెళ్ళిపొమ్మన్నాను వాడ్ని.” అన్నాడు.
ఆమె తండ్రి కళ్ళల్లోకి చూసింది. అక్కడ తడి కదిలిందేమో అనిపించింది. ప్రేమ పొంగింది. భుజం చుట్టూ చేయి వేసి, “ఛా.. ఏంటి నాన్నా ఇది… నేనున్నాను కదా. మనకి మనం ఉన్నాం కదా.” అంది.
ఇప్పుడిలా ఓదారుస్తోంది తను ఒకప్పుడు మోకాళ్ళ మీద బోర్లా వేసుకొని లాల పోసిన పాపాయి కాకపోతే, ఆయన గొంతులో అడ్డంపడినదానికి మాటల్ని తోడిచ్చి పంపేవాడే.
“ఊరుకోమ్మా, మరీ హడావిడి చేస్తావ్!” అంటూ ఆమె చేతుల్లోంచి జరిగి, కుంటుతూ పడగ్గది వైపు నడిచాడు.
ఇలా ముగుస్తుంది ఈ కథ. ఒక కొత్త ప్రారంభానికి ముందు ఈ కథ ముగిసింది. కథ లోని ముసలాయన జీవితం శేఖర్ వెళ్లిపోయిన తర్వాత మలుపు తిరిగి కొనసాగుతుంది.
ఈ కథలో రచయిత శేఖర్ గురించి ఒక మాట అంటాడు.
“ఇరవైలల్లో ఉంటాడు. తల్లుల పోలిక రావడం వల్ల సున్నితమైన అందాన్ని సంతరించుకునే ముఖాల తీరు….”. సున్నితమైన విషయాలను ఇంతకంటే సున్నితంగా ఎవరైనా ఇంకెలా చెబుతారు?
*
ఈ కథలో మూడు ప్రధాన పాత్రలు ఉన్నాయి. తండ్రిని బాగా చూసుకోవాలి అనుకునే యాభై ఏళ్ల ఒంటరి మహిళ. కోచింగ్ నిమిత్తం డబ్బు అవసరమై ముసలాయనకు సహాయం చేసే ఇరవైయేళ్ల శేఖర్. కూతురిని, శేఖర్ ను సంపూర్ణంగా విశ్వసించి అర్థం చేసుకున్న ఎనభైయేళ్ల ముసలాయన. ఈ కథ ఈ ముగ్గురు చుట్టూనే జరుగుతుంది, తిరుగుతుంది. ఇల్లు ఉంటుంది ,ఇంట్లో వస్తువులు ఉంటాయి, ఇంట్లో మనుషులు ఉంటారు. అయితే ఆ ఇంట్లో లేనిది ఏదో ఉంటుంది. అది సాధారణం గా కనపడదు. మనుషుల మధ్య కనపడని ఖాళీలు అగాథాలు గోడలు నిశ్శబ్దంగా మనుషుల్ని వేరు చేస్తుంటాయి. సామూహికం లోని ఒంటరితనం అదే. ఈ ఖాలీల్నీ, అగాధాల్ని, గోడల్ని ఎప్పటికప్పుడు మనుషులు గుర్తించకపోతే, సమస్యల్ని పరిష్కరించుకో లేకపోతే, జీవితాలు అస్తవ్యస్తంగా తయారవుతాయి. అర్థవంతం కాకుండా పోతాయి. ఇంటికకైనా,వీథికైనా, జీవితానికైనా, సమాజానికైనా విలువనిచ్చేది, విలువ తెచ్చేదీ మనుషులే.
వృద్ధాప్యానికి లొంగిపోయినట్టు కనిపించినా, నిరాశకు లోనైనట్లు కనిపించినా, శేఖర్ వెళ్లిపోవడం వల్ల దుఃఖానికి చేరువవుతున్నా.. ముసలాయనకు రాజీ పడటం తెలియలేదు. జీవన తాత్వికతను అర్థం చేసుకున్న వాడు కనుకనే కథ చివర్లో బేలగా మాట్లాడడు, దుఃఖాన్ని కనిపించనివ్వడు, మాటల్లో తగ్గడు, దొరికిపోడు. గంభీరంగానే ఉంటాడు. ఎంత గంభీరత అంటే , పార్క్ నుండి తోడుగా శేఖర్ ని ఇంటికి రావద్దు అంటాడు. అట్నుంచి అటే వెళ్లిపొమ్మంటాడు.
అక్కడే ముసలాయన వ్యక్తిత్వాన్ని, హుందాతనాన్ని, గంభీరతను రచయిత చక్కగా ఆవిష్కరించాడు. ఒక వీడ్కోలు కు అతను సిద్ధపడడు. శేఖర్ లేకపోవడం వల్ల డీలా పడిపోతాడు, ఎక్కడా కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పడు.
శేఖర్ వృద్ధిలోకి రావాలని సొంతంగా తన కాళ్ళపై తాను నిలబడాలని ఎక్కడా ఎవరి దగ్గరా ఆధార పడకూడదని ఆశిస్తాడు. అదే తన మాటగా శేఖర్ కు చెబుతాడు అతడి మంచిని, అభివృద్ధిని ముసలాయన కోరుకుంటాడు.
శేఖర్ భవిష్యత్తును పణంగా పెట్టి అక్కడే తనతోపాటే ఉండిపొమ్మని చెప్పడు. విజ్ఞతతో పెద్దలరికంతో వ్యవహరిస్తాడు. ఔదార్యం విలువ తెలిసిన స్వార్థం లేని ముగ్గురు మనుషుల కథ ఇది.మనుషుల్లో కళ్ళ వెనక దాగిన తడిని తడిమి తడిమి చూపించిన కథ.
ఇండ్లు గదులు విశాలంగా ఉంటే సరిపోదని, మనిషి మనసులో ప్రేమకు తడికి కాస్త చోటు ఉండాలని చెబుతూనే, వృద్ధాప్యంలో మనిషి సంస్పందనలు ఉద్విగ్నత లు ఉద్వేగాలు ఎట్లా ఉంటాయో ఈ చిన్న కథ చాలానే చెబుతుంది.
*
అర్ధమైన సున్నితమైన మానవ సంబంధాల చిత్రణ, కథలోని వాస్తవికత, పఠనీయత, మనుషులు పరిస్థితుల మధ్య సంఘర్షణ ,ముసలాయన అంతర్మథనం, మొత్తం మీద మానవ జీవితపు ఒంటరి సజీవ స్వరాన్ని ఈ కథలో వింటాం.ఈ కథ చదివాక ఒక ముసలి తండ్రినో, తాతనో, ఒక వృద్ధ స్త్రీ మూర్తినో చూసినప్పుడు, కలసినప్పుడు, మాట్లాడినప్పుడు, వింటున్నప్పుడు మన కళ్ళు చెవులు కొత్తగా పనిచేస్తాయి.కొత్తగా చూస్తాయి, కొత్తగా వింటాయి.
ఆ మాటలు, ఆ స్పర్శ వేరుగా ఉంటుంది. ఒక కథ చదివాక ఇంత సున్నితమైన మార్పు వచ్చిందంటే బహుశా ఈ కథకు జీవలక్షణం ఉన్నట్లే.