మొత్తం పదకొండు కథల విశ్లేషణ
ఈ కథల పేర్లే చాలు ఏదో కొత్త దనం.
కథలు సులభంగా నడిచాయి. ఇతివృత్తాలు అంత గంభీరమైనవి. అంత సారవంతమైనవి. జీవితాలను ఆవిష్కరించాయి. రచయితల భాష సరళమైనది. ఆకర్షణీయమైనది. కఠిన పదాలు లేవు. పదప్రయోగ వైచిత్రి కై పెనుగులాట కనిపించవు. చదువరులను ఆలోచింపజేస్తాయి. విసుగు అనిపించదు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతంలోని మాండలిక సౌరభమంతా మాండలికాల వల్ల కథల్లోకి వచ్చింది. అదే ఒక నిండుదనం తెచ్చింది.
చిన్న కథలలో ఆవేదన, విషాదం తో బాటు ఆవేశం అగ్ని ప్రవాహంగా తన్నుకు వస్తాయి. ప్రతి కథలో స్పష్టమైన లోతైన వాడైన ఆలోచనలతో పాటు వర్తమానాన్ని అద్దంలా చూపిస్తున్నాయి. రీడర్ మనస్సులలో ఉత్కంఠను రేకెత్తిస్తూ అనేక కొత్త కోణాలకు తలుపులు తెరిచిన కథల సంచిక అరుణతార మార్చి 2021 సంచిక *కథల ముంగిలి*.
వాస్తవికతా సహజమార్గంలో అనేక సామాజిక అనుభవాల, సంఘర్షణల, భిన్న మనస్తత్వ అంశాల మిళితంగా ‘ఎపి ఫానిక్ ‘ కోణంలో (Epiphanic ) సంఘటన క్రమాల అనుభవంతో కళాత్మకంగా ఈ కథలు రూపుదిద్దుకున్నాయి. వాస్తవికతను ప్రతిబింబించడానికే పరిమితం కాకుండా, ఒక సాహిత్య వస్తువు కథగా మారే క్రమంలో మానవ స్వభావాన్ని వాస్తవికతతో కళాత్మకంగా మిళితం చేసిన కథలు ఇవి. అలాగే జీవితానుభవ చిత్రణ ద్వారా ప్రతి కథా సత్యం గురించి ఎరుక కలిగిస్తుంది. వాస్తవికత గురించి ఎన్ని విశ్లేషణలు ఇచ్చినా, దాని గురించి ఎరుక కలిగించడమే సాహిత్యం చేయగల పని. ఆ పని ఈ కథలు చేశాయి.
పాలకుల నియంతృత్వ వ్యక్తిత్వానికి ఈ కథల్లోని ఇతివృత్తం ఒక మనో వైజ్ఞానిక విశ్లేషణ. ఈ సందర్భంగా వాస్తవిక కథా శిల్పం పట్ల ప్రఖ్యాత రచయిత సింగమనేని నారాయణ గారు అన్న మాటలు గుర్తు చేసుకోవాలి. ఊహల్లో అల్లుకొన్న ఇతివృత్తాలతో కథలు రాయటం అంటే మరీ సులభం, ఎటొచ్చి జీవితం పట్ల పరిశీలన వుండీ, జీవితం నుండి ప్రేరణ పొందీ, జీవిత వాస్తవికతను పాఠకులకు అందించగల అందుకు రాయటం మాత్రం కష్టమైన పనే అని నేను ఒప్పుకుంటాను అని పేర్కొన్నారు.
నాన్ ఫిక్షన్ (non fiction)లో మనుషులు యదార్థ జీవిత ప్రతిబింబాలు. కానీ కథల్లో సమకాలీన సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతుల మధ్య కాల్పనిక పాత్రలుగా మారాలి. జీవితాన్ని, దాన్ని అనుభవించే మనుషుల ఆకాంక్షలు, నమ్మకాలు, వంచన, అవినీతి, రాజ్యహింసను మానవ స్పందనల వైపు నుంచి కాల్పనీకరించాలి.
ఈ కథలన్నీ ఈ పని చేశాయి.
వాస్తవికత ను అంటిపెట్టుకొని ఉండటం ఈ కథల బలం. అయితే వాస్తవికతే సాహిత్యం కాదు. వాస్తవికత ఎంత గొప్పదైనా, సత్యమైనా దాన్ని కథ చేయడంలోని నిర్వహణలో కనిపించే నేర్పు వల్లనే అది సహజత్వానికి అద్దం పడుతోంది. ఆ రకంగా కథా నిర్వహణలో ఈ రచయితలు కొత్త పుంతలు తొక్కారు. మూస పద్ధతిని కాదని, శైలిలోనూ, విషయ పరంగానూ కొత్త ప్రయోగాలపై దృష్టి నిలిపినట్లు తెలుస్తోంది. సమకాలీన సమస్యల చిత్రణకు అవసరమైన కొత్తదనం వల్ల ఈ కథలు మనల్ని కదిలిస్తాయి. విస్తృత సంఘటనల్ని చిత్రిస్తూ అనేక కోణాల్లో భావోద్వేగాల్ని ప్రదర్శించాయి.
ఏ కథ కా కథ విభిన్నంగా రూపొంది రచయితల ఆశావహ దృక్పథం కూడా ప్రకటిస్తుంది.
సామాజిక ప్రపంచంలో చెలరేగే విభిన్నమైన, విరుద్ధమైన భావాలను, ఘర్షణలను మనుషుల చైతన్యంలో, మనోప్రపంచంలో సహజంగా వ్యక్తం చేయడం ఈ కథలన్నిటి గొప్పదనం. తాయమ్మ కరుణ రాసిన ‘ ఏమైంది ‘ కథ లో తెలంగాణ పల్లె లోని చేనేత కార్మికుల జీవన స్థితిగతుల్ని ఇతి వృత్తంగా స్వీకరించి జీవిత వాస్తవాల్ని తెలంగాణ మాండలికంలో ఆవిష్కరించారు. ఎల్లమ్మ, సత్యమ్మ, పద్మ, పెంటయ్య, సీనయ్య పాత్రలు తెలంగాణ మాండలిక సంభాషణ తో కొనసాగుతుంది. వాడుకకు దూరమైన తెలంగాణ మాండలిక పదాలు ‘ జాలట్లస, ‘ అగ్గువస ,’ క్యాలి'(మతి తప్పడం), వాకిలూకి ‘ సాన్పి చల్లుటస లాంటి మాండలిక పద ప్రయోగాలు, సందర్భ దృష్ట్యా సామెతల వాడకం బాగుంది.
‘ కరువమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం’. మరొకచోట ‘ఎల్లమ్మ’ ఎంతో ఆవేదనతో పద్మతో అంటుంది ” మీ మావకు ఎత్తులు జిత్తులు తెల్వవు చెల్లె. ‘ నీళ్ళoటే నీళ్ళoటడు. పాలంటే పాలంటడు. తెల్వి తోటి నేనే సంసారాన్ని నడుపు కొచ్చిన చెల్లె” అని గర్వంగా చెప్పుకునే ఎల్లమ్మ లాంటి గ్రామీణ ప్రజల్లోనే ఇలాంటి కల్మషం లేని హృదయాలు చూడగలం. చేనేత కార్మికుల కుటుంబంలో ఒకప్పుడు మంచిగా బతికిన ఎల్లమ్మ , సీనయ్య లు తమ పొలాలను మగ్గాలను అమ్ముకుని తమ గ్రామంలోనే కూలీలుగా మారారు. ఎల్లమ్మ గోస నుండి వచ్చిన మాటలు ” పొలం బాయె, గోడ్డు గోదా బాయె, యేసుకున్న బంగారము బాయె; చిన్న కొడుకు కామెర్ల తో కాలం జేసె, పెద్ద బిడ్డ ముండమోసె, చిన్న బిడ్డ క్యాలి తప్పే.(మతి తప్పే) ఏంది చెల్లె? నాకు శని ఎంట్ట బడ్డట్టు ఆయే”.
నేటికీ తెలంగాణలోని గ్రామీణ ప్రజలు మగ్గాలపై నేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధర లేక, మరమగ్గాలు, సాంచాలను కొనేవాడు లేక, లాభాలు రాక, మరింత అప్పులపాలై, కష్టాల నుంచి బయట పడలేక, కష్టాలకు అలవాటు పడిన జీవితాలను ఈ కథలో చూస్తాం.
రెండవ కథ శ్రీనివాస మూర్తి గారు రాసిన *’ ఖబర్ కె సాత్’*
కథాంశం చాలా భిన్నమైనది. శిల్పం, శైలి సరళ భాషతో కళ్ల ముందు దృశ్యాలు నిర్మించడంలో రచయిత చాలా ప్రతిభ కనబరిచారు. కాందుర్ లో మనమూ ఉన్న అనుభూతి తో తీవ్రమైన సంఘర్షణకు లోనవుతాం. కాశ్మీర్ ప్రాంతంలోని హింసాత్మక చరిత్రను, కాశ్మీరీ జాతీయవాద కోణాలను ఇంత అనుభూతిమయంగా కాల్పనీకరించడం సాధారణం కాదు. కశ్మీర్‌కు జరిగిన ద్రోహాలను తెలియజేస్తూ, రచయిత ప్రతి అంశంపై విస్తృతమైన పరిశోధన చేసినట్లు వాస్తవాలతో సమ్మిళితమై కథ చాలా స్పష్టంగా ఉంది.
పాకిస్థాన్ అంతర్గత కల్లోలం, పాకిస్థాన్ మిలిటెంట్లు, భారత పాలకుల మతోన్మాద చర్య, భారత భద్రతా దళాల దాడులతో కాశ్మీర్ లోని ప్రజలు నరకయాతనతో, భయంతో జీవించడం భయంకరమైనది. కానీ, అదే సమయంలో, భయాన్ని జయించే ధోరణి మానవులకు సహజంగానే ఉంటుంది. వాళ్లు ఎంత దయనీయంగా జీవిస్తున్నదీ కథ చెబుతుంది. కాశ్మీర్ లో కొత్త చట్టం వచ్చిన నాటి నుంచి అక్కడి ప్రజలకు సైక్రియాటిస్టల అవసరం పెరగడం మనలను ఆవేదనకు లోను చేస్తుంది.
చలం రాసిన ‘ హిందూ-ముసల్మాన్’ కథలో దేశవిభజన సందర్భంగా జరిగిన రక్తపాతం హిందువులు/ ముస్లింలు దారుణ పాశవిక హింసకు గురైన సన్నివేశం ఈ కథ గుర్తు చేస్తుంది. అలాగే మనకు సాదత్ హసన్ మంటో రాసిన చిన్న కథలు, డాక్టర్ శాంతికుమార్ గారు రాసిన ‘ఖబరస్తాన్ ‘ మనల్ని చుట్టు ముడతాయి. ‘ఖబర్ కె సాత్స కథతో.
హనియా కొడుకు పరీక్షకు అని పోయిన కొడుకు పీనుగై వచ్చాడా? అన్న సంఘటన మనోభావ విశేషణాత్మక పాత్రల చేత తీవ్రమైన సంఘర్షణకు లోనవుతాము. హమీద్ పెద్దాయన పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో ‘రెండు మోడల్స్ అందుకున్న వారి కొడుకు దేశభక్తి నిరూపించు కోవాల్సిన స్థితి వచ్చింది.
‘సైతాను శాసిస్తున్న కాశ్మీరు లో.
ఈ కథలో కొన్ని చారిత్రక అంశాలను చర్చిస్తుంది. ఇది కథలో చక్కగా అమరిపోయింది. భావోద్వేగాలతో కథ చేయగల మెలకువ తెలిసి ఉంటే, అవసరమైనప్పుడు వాచ్యంగా చెప్పినా కథకు లోటు ఉండదనడానికి ఈ కథ ఉదాహరణ.
‘ షేక్ అబ్దుల్లా తరం నాయకత్వం ఇందిరాగాంధీకి లొంగిపోవడం, ఫరూక్ అబ్దుల్లా తరం రాజీవ్ గాంధీకి,
ముఫీ సయీద్ తరం వీళ్లకు లొంగిపోయిన విషయాలు ప్రస్తావనకు వస్తాయి.
మత ఫాసిజానికి వ్యతిరేకంగా మరింత ఎక్కువగా కథలు రావాల్సిన అవసరాన్ని ఈ కథ గుర్తుకు తెస్తుంది.
మూడవ కథ పావని గారు రాసిన *’ సిక్స్ ప్యాక్ రాముడుస. ఇందులో సింబాలిక్గా శక్తివంతమైన ప్రతీకను కథ ప్రకటిస్తుంది. భారత పాలకుల క్రూరమైన మతోన్మాదానికి అనుసంధానంగా నియమించుకున్న ఆర్ ఎస్ ఎస్ శౄఖ పని తీరును రచయిత తనదైన శైలిలో ఒక తార్కిక తాత్విక పరంగా వ్యక్తం చేశారు.
లాక్‌డౌన్ పుణ్యమా అంటు బిట్టు అలియాస్ కార్తీక్ భార్యా పిల్లలతో సొంత ఊరికి వచ్చి అమ్మా నాన్న పిల్లలతో ఆనందం గా ఉంటున్న సమయంలో నుదుటికి గుడ్డ కట్టుకుని పెద్ద పెద్ద డీజే శబ్దాలతో అరుపులతో, పాతిక ఇరువది ఏళ్ల కుర్రాళ్ళు బెదిరింపు ధోరణిలో చందా అడగడం నిత్యం చూస్తూనే ఉన్నాం.
‘ హిందువులంతా ఇవ్వాల్సిందే’ అని అడుగుతుంటే బిట్టు నాన్న ఇవ్వను అని అంటాడు.
బిట్టు చూసి తండ్రితో ‘ రాము అంటే చిన్నప్పుడు శాఖ నడుపుతుండే ఆయనే నా ‘
అని ఆశ్చర్యంగా అడిగాడు. బిట్టు బాల్యం సంఘటనలతో, నోస్టాల్జియా తో సంబంధం కలిగిన సంఘటనలను సూచిస్తుంది. ముగింపులో బిట్టు గాడి అమ్మ …ఈ రాము క్యారెక్టర్ గురించి చెబుతుంది. వీళ్లు ఏకు మేకై కూర్చున్నా రమ్మా… ఎన్నడూ లేదు… కొత్తగా ఊర్లో ఎక్కడ లేని కొట్లాటలు.
ఈ ఊర్లో ఎట్టనో నా పిల్లలను వీల్లపాలు పడకుండా కాపాడు కున్నా…అంటుంది. కథ అక్కడ ముగుస్తుంది.
నాల్గవ కథ.
పి.చిన్నయ్య గారు *రాసిన ‘కాని కాలం’*
కథ పేరు లోనే ఒక అన్వేషణ దాగి ఉంది.
ఈ కథలో సతీష్ సార్ గ్రామంలో జన్మించారు విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు ఎలా ఉపయోగించుకుంటున్నారు,
పేద విద్యార్థుల సమస్యలు, స్మార్ట్ ఫోన్లు లేక పేద విద్యార్థులు తరగతులు దూరమవడం, గ్రామ పాఠశాలలో నేటికి హెచ్ఎంలు కుల పట్టింపు లతో బాలరాజు లాంటి ఒక ఉత్తమ విద్యార్థి ఆన్లైన్ క్లాస్ కు దూరమవడం, పాఠశాల హెచ్ ఎం బాలరాజును ఎక్కడైనా వెళ్లి చూడమని అవమానం చేయడం, ఇలాంటి కుల వివక్షతను ఈ కథలో చూడవచ్చు. తెలంగాణ మాండలిక భాషలో కథ కొనసాగుతోంది. సతీష్ సార్ లాంటివారు ఉన్నతమైన భావాలతో సమాజంలో, విద్యావిధానంలో ఒక కొత్త మార్పు రావాలని తన వృత్తి పట్ల ఎంతో నిబద్ధతతో విశ్వాసంతో క్రియాశీలకంగా పని చేసే వ్యక్తి, అసమానతలు లేని సమాజం, స్వార్థం లేని మానవుని తయారు చేసే విద్య విధానం గురించి లునచార్ స్కి విద్యా శిక్షణ , భాగంగా విద్యార్థులకు క్లాసులు ద్వారా ఒక కొత్త విద్య సంస్కృతిని ప్రవేశపెట్టాలని తపన లో నూతన మానవుల ఆవిర్భావం ఆవశ్యకతను, రచయిత ఆశయం అంతర్లీనంగా కథలో తెలియజేస్తుంది. ప్రజల కోసం కళారూపాలు కొత్త చైతన్యాన్ని, కొత్త విద్యా సంస్కృతిని ప్రతిబింబించే కథ.
ఐదవ కథ పాణి గారు రాసిన ‘ కాయితాలు’ కథలో పాలకవర్గ విధానాలలోని CAA, NRC, అమలు పట్ల జరుగుతున్న క్రూర స్వభావము లోని వారి ” జేనో ఫోబియా” లక్షణం లో దాగిన ఇతర మతస్తులపై జాత్యహంకారం, వర్ణ వివక్ష, శత్రుత్వం తో రగిలి పోతున్నారు. ఒకవైపు మానవ హక్కుల ఉల్లంఘన, అంతేకాదు జీవించే హక్కుకు హమీ ఇచ్చే 21వ అధికరణ (right to live) భారత పౌరులకు మాత్రమే పరిమితం కాదు. పౌరులు కాని వారూ దీని కింద రక్షణ పొందవచ్చు అన్న న్యాయ సూత్రం ఈ కథలో అంతర్లీనంగా తాత్వికంగా ఇమిడి ఉంది. మనుషుల మధ్య సంబంధాలతో, భావోద్వేగాలతో ఒక సంక్లిష్టమైన సామాజిక అనుభవాన్ని కథగా రూపొందించారు.
ఆరవ కథ. వడ్డే బోయిన శ్రీనివాస్ గారు రాసిన ” దుఃఖం మీది నడక” తెలంగాణ మాండలికం తో ఈరమ్మ కథ కొనసాగిస్తోంది. ప్రతి 30 కిలోమీటర్లకు భాషా మాండలికం మారిన తీరు ఈ కథలో మనం చూడొచ్చు.
దవాఖాన లో కరోనా రోగుల గది ఉకుతు కాంట్రాక్టు స్వీపర్ అన్న మాటలలో ” మాగ సాలు సంబురం, ఉట్టికెక్కలేనమ్మట…. స్వర్గానికి కెక్కు తదట. సౌలతు లియ్య లేదు గని సల్లి. సల్లిండ్రు గులాపుులు…. మల్ల గాలి మోటార్ మీది నుంచి…. మనస్స్ ల మీద గాదు దవాఖాన బంగ్లాల మీద …” అన్న మాటలు నేటి కేంద్ర /రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం విధానాన్ని అద్దం పడుతోంది. వాడిన మాండలిక పద జాలం రచన శైలి, ఇతివృత్తంలో జీవం ఉట్టిపడుతోంది. వాడిన మాండలికంలో ‘చె వ్వా’, అస్కెతి, సాదు కున్న, గున్స్కుంట, గితంతా గండి, సోయి సోక్కు, దూనికినై, తాప తాప కు, అర్గిజ్, గల్ల గురిగి, అవ్వల్ దర్జా, కమస్కం, పోటం, బల్మటికిచ్చిం డ్రు, చాలా పదాలు చూడొచ్చు.
ఈరమ్మ కరోనా నుంచి కోలుకొని అంబులెన్స్ వెనక పక్క అద్దాల నుంచి ఇంటికి వస్తున్నప్పుడు, నగరం లోని సంఘటనలు ఒకటొకటిగా చూస్తున్న కొద్దీ , వలస కూలీలపై జరుగుతున్న లాఠీఛార్జి ని చూసి డ్రైవర్ అడుగుతుంది. తల్లడిల్లి పోతుంది.
ఈరమ్మ వార్డ్ బాయ్ తో ” అవు బి డ్డా! డాక్టర్ సార్లు, నర్సమ్మ లు పుణ్యాత్ములు ఆళ్ళు లేకుంటే నర్లోక మయ్యే టిదో” అన్న మాటల్లో వాళ్ల సేవ తత్వాన్ని కొనియాడింది.
ఉన్నట్టుండి ఈరమ్మ చూపు వార్డ్ బాయి పట్టుకున్న అరటిపండ్ల పొట్లం కట్టిన పేపర్ మీది రంగుల బొమ్మ మీద పడింది. ఎంతో అతృత తో ” బిడ్డా! రైలు పట్టాల మీద మొండా లేంది…. ఆ తల్కయలేంది…. అబ్బ! తునుకలు.. తునకలు…”
కార్మికుల కర్షకుల పట్ల పాలకులకు ఉన్న కర్కశత్వానికి ప్రతీకగా తెలియజేస్తుంది.
ఏడవ కథ ఉదయమిత్ర గారు రాసిన ‘ వెల్తురు పిట్టలు. ఈ పేరులో ఎంత అందమైన ఊహ.
ఈ పేరు రేపటి వర్గ రహిత సమాజానికి ప్రతీక. ప్రపంచ పీడిత మానవుల విముక్తికై పోరాడుతున్న విప్లవకారుల త్యాగాలను స్ఫూర్తిగా స్వీకరించి, తమ జీవితాలకు అన్వయింపు చేసుకొని పనిచేస్తున్న సుజాత kovid 19 వ్యాధితో బాధపడుతున్న వాస్తవిక సంఘటనను రాజ్యహింస, అణిచివేత నుంచి ఉద్భవించిన వాస్తవిక ఇతివృత్తం.
సుజాతకు కిడ్నీ సమస్య, ఉబకాయం, మధుమేహ వ్యాధి, అధిక రక్తపోటు, మోకాళ్ల సమస్య, హుద్రోగ సమస్యతో పాటు కొత్తగా కొవిద్ 19 తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, సాటి కొవిద్ పేషెంట్కు సమస్యలు వస్తే సహాయపడుతూ, అమరుల కుటుంబాల గురించి కంటతడి పెడుతుంది. కథలో అక్కడ అక్కడ కవితాత్మక భావ గాంభీర్యం వ్యక్తమవుతోంది.
కథ ముగింపులో అంటాడు
” వీళ్ళు ఇంతే … గూడెం నుంచి గూడానికి, పల్లె నుంచి పట్నానికి, మైదానం నుండి అడవికి వచ్చి కాలువ లను చుట్టేస్తూ ఉంటారు….’ వెల్తురు పిట్టలు’ వీళ్లు. ఏ చెట్టు మీద వాలితే ఆ చెట్టుకు వసంతాన్ని వాగ్దానం జేస్తారు. గాయాల శరీరాలతో నిటారుగా ఆకాశం వైపు చూస్తూ శిఖరాలతో పోటీపడు తుంటారు. ప్రేమికులు వీళ్లు.”
వస్తు వైవిధ్యం లోనే కాదు శిల్ప పరంగా ఒక వినూత్న ప్రయోగం. రచయిత ఆశావహ దృక్పథం ఈ కథలో కనిపిస్తుంది.
ఎనిమిదో కథ బి.అనురాధ గారు రాసిన ‘ దికూ’ కథ. ఆదివాసి భాష లో నుంచి వచ్చిన ‘ది కూ’ అనే ఒక నూతన పదం తెలుగు సాహిత్యం లోకి ప్రవేశించింది. ఝార్ఖండ్ ఆదివాసి భాషలో దికూ అంటే పీడించేవారని, బయట నుండి వచ్చే వాళ్ళని దికూ అంటారు. ఆదివాసి సమాజంలో మహిళా సంఘాల ఉద్యమ స్వరూపాన్ని అక్కడి ప్రజలతో మమేకమైన తీరు, మహిళా ఉద్యమ సంఘాల విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో కార్యదర్శి రీలామాల, సంఘ సభ్యులు బుదినీ, కారూకి, మై ని వీళ్లంతా ఊరు ఊరు, ఆదివాసి గ్రామంలో చాలాకాలం తర్వాత, మళ్లీ గ్రామాల్లో రూపొందుతున్న ఉద్యమ రూపాలను కథలో చూడొచ్చు. లాల్ మునికి జరిగిన ఒక యదార్థ సంఘటన ఈ కథ ఇతివృత్తం.
లాల్ ముని మహిళా సంఘం వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంది. మహిళా సంఘం వాళ్లు వచ్చారు అని తెలుసుకొని, మహిళా అధ్యక్షురాలయినా రిలామాలతో లాల్ ముని మంగ్లూ తనపై ప్రవర్తించిన సంఘటన పై వివరిస్తుంది.
లాల్ ముని తనకు కారూ అంటే ఇష్టమని సంఘ నాయకులతో చెప్తుంది. ఒకరోజు అడవిలో నేను తెల్లవారకముందే విప్ప పూలు ఏరుతూ ఉండగా మంగ్లూ మసక మసక చీకట్లో హఠాత్తుగా పట్టుకుని , కుడి చేత్తో తన జేబులో నుండి కుంకుమ తీసి నా నుదిటి మీదుగా పాపిట్టీలో పూశాడు.
ఆదివాసి సమాజంలో పెళ్లి అంటే ఇలా ఏమీ ఉండదు. అసలు సింధూరాలు, కుంకుమలు వాళ్ళకి తెలియదు. లాల్ మునికి కూడా ఏమి తెలియదు. మహిళా ఉద్యమ కారులంతా ఆ ఊరిలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు కింద పంచాయితీ ఏర్పాటు చేశారు. ఊరు ఊరంతా తామున్నామంటూ చెట్టు కిందికి చేరుకుంది. ఒక్కసారిగా వాతావరణం ఉద్విగ్నంగా అయిపోయింది.
మంగ్లూను తల్లిని పిలిపించారు.
” లాల్ ముని నువ్వు చెప్పు”అని బుదీ నీ అనగానే లాల్ ముని ధైర్యంగా ముందుకు వచ్చి జరిగిందంతా చెప్పంది.
పంచాయతీలో మహిళా నాయకురాలు ” ఆమెకి ఇష్టం లేకుండా ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం మొదటి తప్పు. పైగా దొంగచాటుగా జబర్దస్తీ చేసి ఆమెకు సింధూరం పెట్టి పెండ్లి చేసుకున్న అనడం ఇంకా తప్పు. అసలు మన దగ్గర ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం అనేది ఎప్పుడో బంద్ య్యింది. అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే పెళ్లి. నువ్వు మళ్ళీ ఇంకో దారిలో ఒక పని చేస్తే దాన్ని ఎవరూ ఒప్పుకోరు.” అయినా ” ఈ సింధూరాలు మనకి ఎక్కడి నుండి వచ్చాయి?
దికూల్లాగా మోసాలు చేయడానికి ప్రయత్నించకు”. తీవ్ర స్వరంతో అంది.
మంగ్లూ అమ్మ కల్పించుకొని
” పాపం వాళ్లని విడదీయ కండి “
అంటే, బుదీ నీ మళ్లీ అందరిని వారించి లాల్ ముని ఇప్పుడు నువ్వు చెప్పు.
ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు? మంగ్లూ చేసిన దాన్ని నువ్వు పెళ్లి అని ఒప్పుకుంటావా?
” నేను కారూను చేసుకుంటాను “.
” కారూ, నువ్వు లాల్ మునిని చేసుకుంటావా?.
కారూ ముందుకు వచ్చి “చేసుకుంటాను ఆమె నాకు ఇష్టమే”.
లాల్ ముని వైపు చూస్తూ అన్నాడు.
పంచాయితీ లో అధిక సంఖ్యలో మహిళలు ఉన్నారు.
మంగ్లూ చేసిన తప్పు పై పంచాయితీలో నుంచి రక రకాల ప్రతిపాదనలు వచ్చాయి.
అతన్ని కట్టేసి బాగా కొట్టాలని, జరిమానా వేయాలని, అతని కుటుంబాన్ని ఊరు నుండి వెళ్లగొట్టాలనీ ఇలా ఎన్నో వచ్చాయి. మహిళా సంఘం నాయకురాలు రీలామాల, బుధీనీ మాట్లాడుతూ, ” ఈ పంచాయతీ కి సంబంధించి సంఘం తరఫున కొన్ని నిర్ణయాలు మీ ముందు పెడుతున్నాము.
మంగ్లూ తాను అనుకున్నట్టుగా అది వివాహం కాదని, అత్యాచారం అని ఈ పంచాయతీ భావిస్తోంది. అతను చేసిన పనికి శిక్షగా కారూ, లాల్ మునిల వివాహం సందర్భంగా జరిగే వేడుక, విందుల ఖర్చు, వారిద్దరూ జీవించడానికి అవసరమైన గుడిసె వేయడానికి కావాల్సిన సామాగ్రి సొంత ఖర్చుతో స్వయంగా నిర్మించి ఇవ్వాలి. అతనిది తప్పు అని గుర్తు చేయకుండా అతనిని సమర్థించి నందుకుగాను అతని కుటుంబ భూమిలో కానీ, ఇంట్లో కానీ పని చేయడానికి, ఒక ఏడాది ఎవరు వెళ్ళకూడదు.”
ఇప్పుడు ఈ నిర్ణయాలు ఆమోదం అయితే చప్పట్లు కొట్టండి. అభ్యంతరం ఉంటే మాట్లాడండి. అక్కడ ఉన్న వాళ్లంతా పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. డప్పులు కూడా మోగాయి.
అందరూ పిడికిలి ఎత్తి అభివాదం చేశారు. మహిళా సంఘం వర్ధిల్లాలి అంటూ నినాదాలు అందుకున్నారు. ఈ కథల్లోని ఇతివృత్తం ప్రతీకాత్మకంగా దండకారణ్యంలో రూపొందుతున్న నూతన సోషలిస్టు మానవున్ని, నవ సమాజ నిర్మాణాన్ని తెలియజేస్తుంది.
తొమ్మిదో కథ పి వరలక్ష్మి గారు రాసిన ‘ సురిగాడు’ కథ లోని ఇతి వృత్తం నోస్టాల్జియా తో ముడిపడిన భావోద్వేగ కథాంశం. కుటుంబ సమేతంగా ఉన్న వ్యక్తి జ్ఞాపకాలను కలిగిన దృగ్విషయం. (phenomna) ఈ కథలో వైవిధ్యభరితమైన ఇతి వృత్తం, మంచి శిల్పం, శైలి ఉంది. విస్తృత సంఘటనల్ని భావోద్రేకాలను ప్రదర్శించాయి. ఆడంబర పదాలు గాక సరళమైన భాషను ఉపయోగించారు. లెక్చరర్ కళాశాలకు వెళ్తున్నప్పుడు రోడ్డుపైన జరిగిన ఆకస్మిక సంఘటన వారి కుటుంబముతో కలుపుతుంది. సురిగాడు (సురేష్) చిన్ననాటి కుటుంబ సన్నిహితులు. లెక్చరర్ నాన్న, సూరి నాన్న ఓకే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్లు. లెక్చరర్ తన చిన్ననాటి సూరినికి ఒక మతతత్వ పార్టీతో ఉన్న సంబంధాలు చూసి తన మనసంతా చేదు …
“సురి గాడు”కథలో ప్రేమ వైఫల్యం ముడిపడి ఉంది. చివరగా కథ ముగింపు లో ఒకరోజు హఠాత్తుగా ఇంటికి వచ్చి సూరి తన ప్రేమ గురించి ” ఏమోక్కా! ఇదంతా చెప్పు కోవాల్నో గూడ తెలీక పెచ్చిక్కి పోయింది. ముందు నీగ్గూడా చెప్పాలనుకోలేదు. డిగ్రీ కాలేజీ లో పరిచయమైన శృతి, వారి తండ్రి ప్రభాకర్ రెడ్డి. మా ప్రేమ విషయం తెలిసి న తర్వాత, ప్రభాకర్ రెడ్డి మనుషులు కాపుకాసి అటాక్ చేసినారు, చావుదప్పి బైట పడిన సూరి చేతి ని నా చేతుల్లోకి తీసుకున్నాను.
అప్పటికే వాడి కళ్ళ నిండా నీళ్లు.
‘ మరి శృతి’?.
‘ తనంటే నా కిప్పుటికీ ఇష్టమేస. సూరి తడి కళ్ళలో గొప్ప వెలుగు.
అంతర్లీనంగా ప్లేటోనిక్ ప్రేమ వ్యక్తమవుతోంది.
కులానికి సంబంధించిన అసమానతలు, అణిచివేత లూ దాని విధానాలూ దాని భావనలూ ఎంత బలమైన వీ సామాజికంగా లోతుగా వేళ్ళూనుకున్నవి నిజం. భారతదేశ రాజ్యాంగంలో అస్పృశ్యతను రద్దు చేసినప్పటికీ, ఈ దేశంలోని పౌరులు అందరూ సమానులే నంటూ ప్రకటించినప్పటికీ, దాని వైఫల్యం మనకు ఈ కథలో వ్యక్తం అవుతుంది.
పదో కథ యామిని గారు రాసిన ‘ వ్యక్తిత్వం’ కథలో చత్తీస్గడ్ రాష్ట్రంలోని కాంకేర్ లో జన్మించిన కామ్రేడ్ రామశిల రాజ్య హింసకు వ్యతిరేకంగా పోరాడిన జీవితంలోని వ్యక్తిత్వమే కథా ఇతివృత్తం. విప్లవకారుల వ్యక్తిత్వం మానవాళి పై ఉన్న ప్రేమ, దేశభక్తి ఒక విప్లవకారులకు మాత్రమే సాధ్యం. వారు నమ్మిన విశ్వాసాలు వారి ఆచరణ తో ముడిపడిన జీవితమే ఈ ‘ వ్యక్తిత్వం’ కథలో దర్శనమిస్తుంది. స్ఫూర్తిదాయకమైన ముగింపు.
చివరగా పదకొండవ కథ కె వి కూర్మనాథ్ గారు రాసిన ‘ రెక్కలు విరిగిన పక్షులు’ శక్తివంతమైన వ్యంగ్యం తో ఇమిడి ఉన్న కథ. యానిమల్ ఫార్మ్Animal form ), రమేష్ అనే జర్నలిస్టు యానిమల్ ఫార్మ్ లో అల్లేగొరికల్ సెటైర్ తో సమకాలీన సామాజిక రాజకీయ ఆర్థిక స్థితిగతులను వ్యంగ్యంతో సమయోచితంగా వ్యక్తం చేయడం కథలో ప్రత్యేకత. గతంలో వీరు రాసిన ‘e- కుక్క’, ‘వెన్నెల పడవ’ కథలు గుర్తుకు వస్తాయి. అసమ్మతిని పాలకులు నిషేధించిన విధ్వంసక ఉద్దేశంలో పాలకులు ప్రజా మేధావుల పై మోపిన హత్య ప్రయత్న కుట్రను లోతైన రాజకీయ అర్ధాన్ని తెలియజేస్తుంది.
చివరగా ఈ కథలు అన్నింటికీ బొమ్మలు గీసిన కరుణాకర్ యెనికపాటి గారి కళా దృక్పథం వల్ల ఈ కథలు మరింత అర్థవంతంగా పాఠకులకు కనెక్ట్ అయ్యాయి. కథలోని సారం పట్టేలా ఆయన కళాత్మకంగా బొమ్మలు గీచారు. ఈ సంచిక వర్తమాన విప్లవ కథకు ఒక చిరు సాక్ష్యం.