అలిశెట్టి ప్రభాకర్ ను సామాజిక సంక్షోభం వున్నచోట వుండనీయలేదు. ఆ కల్లోల సమాజంలోని తుఫాను ఆయన జీవితంలో భీభత్సాన్ని సృష్టించింది. సృష్టించబడుతున్న కల్లోలాలకు కారణాలు వెదుక్కున్నాడు. ఆ కారణాలు, ఆవేశం, నిరసన కవితాత్మకమైంది. కవిత్వం రాయడానికి గొప్పగా చదువుకొనోక్కరలేదని నిరూపించాడు. స్పందించే గుణముంటే చాలు. ఆ స్పందనను ఒక క్రమంలో పేర్చుకునే నేర్పు స్పందించే గుణమే అందిస్తుంది. ఆ క్రమమే అలిశెట్టి. ఆదే ఆయన కవితాగుణం. అణచివేత, సంక్షోభాలకు కారణాలను శాస్త్రీయంగా అంచనా వేసుకోవడానికి విరసం అలిశెట్టికి చేయూత నిచ్చింది. ఆ శాస్త్రీయపు అంచనాలతో సామాజిక కుళ్ళును, కౌటిల్యాన్ని తూర్పారబట్టాడు. అట్లని నిందించడడమే పనిగా పెట్టుకోలేదు. ప్రత్యామ్నాయ మార్గాల్ని చూపించాడు. అనుసరించాల్సింది ఆ ప్రత్యామ్నాయ మార్గమేనని తార్కికంగా నమ్మబలికాడు. ఆ పలకడం మృదుస్వభావులకు కఠినంగా, పరుషంగా కనిపించి వుండవచ్చును. సమస్య తీవ్రతను చెప్పడానికి అప్పుడుగాని ఇప్పుడుగాని వ్యక్తీకరణ వైవిధ్యంతోడి తీవ్రత అవసరమే. కాఠిన్యంలోనూ, పారుష్యంలోనూ దిగంబర కవుల నీడ అందినా అది అలిశెట్టి వ్యక్తీకరణకు మచ్చకాదు. ఒక సామాన్య మధ్యతరగతి మనిషి సమాజాన్ని కుదిపి ఆలోచింపజేసే కవితలు రాయడానికి అలిశెట్టిని నడిపించిన దృక్పథమే కారణం.

అలిశెట్టికి ఊహ తెలిసొచ్చేనాటికి (విప్లవోద్యమ ప్రారంభకాలానికే) అత్యవసర పరిస్థితి చీకటి నీడలు పారాడుతున్న కాలమది. నిరసన కలాలు, గళాలు జైలు పాలయ్యాయి. దారిద్ర్యం, నిరుద్యోం, పీడన సమాజంలో సాధారణాంశాలనాయి. ఇరవై ఏళ్ళు గడచిపోయినా స్వాతంత్ర్యంనాటి వాగ్దానాలు ఎండమావులే. యువతకు దిక్కుతోచని స్థితి. సామాజికాభివృద్ధి చర్చలు చట్టసభల్లో శుష్కోపదేష్టలయినాయి. ఉక్కిరి బిక్కరైన సమాజంలో ప్రత్నామ్నాయ మార్గాన్ని అన్వేషించేవారికి నక్సల్బరీ వేగుచుక్క కనిపించింది. ఆ తటల్లితలోని కలమే అలిశెట్టి ప్రభాకర్.

1970ల తరువాత తెలుగు సాహిత్యంలో గణనీయ మార్పులొచ్చాయి. అంతవరకు కవులకు, రచయితలకు రాజకీయం అంటరాని వస్తువుగా ఉండేది. నిజానికి రామాయణ భారతమంతా రాజకీయ కవిత్వమే! ప్రబంధ సాహిత్యం భూస్వామ్య భావజాల ప్రచార కవిత్వమే! ఎటొచ్చీ స్వాతంత్రోద్యోమ కాలంనుంచే ఛందోవ్యాకరణాలంకార సంకెళ్ళను తెంచుకొని తెలుగు కవిత్వం ప్రజలకు దగ్గరైంది. 1970ల తరువాత సామాజిక సమస్యలు ఎత్తి చూపడమే కవిత్వపు ఏకైక లక్ష్యమైంది. ఆ లక్ష్యాన్ని అందిపుచ్చుకున్న వారు అలిశెట్టి ప్రభాకర్.

గూబలు గుయ్యిమనిపించే చెంపదెబ్బలు పెడుతూ స్తబ్దంగావున్న తెలుగు పాఠకుల్ని కదిపి నిలిపిన దిగంబర కవిత్వం రచయితల కర్తవ్యాల్ని గుర్తుచేసింది. దిగంబర కవుల్ని అరిషడ్వర్గాలని తిట్టిపోసిన విమర్శకులూ వున్నారు. దిగంబర కవిత్వం ఒక చారిత్రికావసరం. దిగంబర కవిత్వాన్ని వెన్నంటే రచయితలు, బాధ్యతల్ని గుర్తుచేసే తిరుగబడే కవులు, రచయితలకు మరోదిశ చూడాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. ఆ దిశ నక్సల్బరీ వెలుగులోని విప్లవ రచయితల సంఘం, శ్రీకాకుళోద్యమ కలం గళం. ఆ కలంలోని స్వరమే అలిశెట్టి ప్రభాకర్. అంటే అలిశెట్టి కలంపట్టే నాటికున్న స్థితి ఇది.

1970 తరువాత వచ్చిన కవిత్వాన్ని నినాదాలన్నారు. అందులో కవిత్వమే లేదని పెదవి విరిచి గేలిచేసిన వారున్నారు. వీరు వ్యతిరేకించిందంతా రాజకీయాల్నే కాని కవిత్వాన్ని, అభివ్యక్తినీకాదు. రాజకీయాల్ని వ్యక్తీకరించడానికి కవిత్వాన్ని నినాదప్రాయంగా మలనచినవారు అలిశెట్టి ప్రభాకర్. ఏ కవిత్వాన్నైనా రాజకీయ విలువలతో సామాజిక ప్రయోజనాన్ని ఆశిస్తూ అంచనావేయాలి. సామాజిక ప్రయోజనంలేని కవిత్వం నిష్ప్రయోజనం. అందుకు అలిశెట్టి ప్రభాకర్ అపవాదు.

మార్క్సిజమే అలిశెట్టి అవలంభించిన దృక్పథం. మార్క్సిస్టు విలువలనే ఆయన కవిత్వీకరించారు. కవిత్వంలోనే మార్క్సిస్టు సూత్రాల్ని వివరంచారు. సమాజాన్ని విశ్లేషించారు. మంటల జెండాలలో ఈ వాస్తవాలున్నాయి. అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత వెలువడింది ‘మంటలజెండాల’ సంకలనం. ఇందులో ముప్పైమూడు కవితలున్నాయి. శ్రమ అంటే ఏమిటో చెప్పి, దాని ప్రాధాన్యాన్ని వివరించి, అది పరాయీకరణ చెందిన ఫలాన్ని వివరిస్తారు. చెమట వ్యాపారం అన్న కవితలో

“నీ శ్రమ ఫలం

నీ సమక్షంలోనే పాతి పెట్టబడ్డ

విత్తనం

దాన్నే డబ్బు చెట్టుగా పెంచి

దక్కించుకున్న వాడిదే

పెత్తనం “

అని ”నా దృష్టిలో” అన్న కవితలో

“అంతస్తూ ఐశ్వర్యం

శ్రామికుడి భిక్షం

నాదృష్టిలో ధన మధాంధుడే

అడుక్కు తినేవాడు”

అంటారు. భిక్షం కావాల్సింది అడుక్కుతినేవారికి అని సాధారంగా అనుకుంటాం. అడుక్కుతినే వారికి బిక్షపాత్ర తప్పమరేమీ వుండదు. కాని అలిశెట్టి దృష్టిలో ధన మధాంధుడే అడుక్కుతినేవాడు. వాని సంపదంతా శ్రామికుడు వేసిన భిక్షమేనంటారు. ధనమదాంధుణ్ణి కసిగా వ్యతిరేకిస్తారు. స్వార్థాన్ని గండ్రగొడ్డలితో నరకగలిగిన వాడే నేటి హీరో అని శివసాగర్ అన్నాడుగదా!

నిర్వ్యాపకత్వాన్ని, సోమరితనాన్ని అలిశెట్టి సహించడు. సమాజంలో ఆకలి దారిద్ర్యాలు వుంటే వుండనీగాక అని చెబుతూనే ‘మొక్కలు’ అనే కవితలో

“బాల్యంలోనే

కన్నీళ్ళు

మొలిస్తే మెలవనీ

మొదలవనీ

అవి

కష్టాల వాతావారణంలోనే ఆరితేరి

ఎదగటం నేర్చుకోనీ

కానీ

చెట్లాయ్యాక

రహదారి పొడుగునా

ద్వారాపాలకుల్లా బతికితే

నైనైతే సహించను”

అని వ్యక్తిని సంబోధిస్తారు. యువతలోని నైరాశ్యాన్ని అలిశెట్టి సహించరు. కార్యోన్ముఖులు కావాలని ఆయన ఆలోచన. మరోచోట ‘ఏమిటీ విడ్డూరం’ అనే కవితలో

“ఏమిటీ విడ్డూరం….?

ఒక్కొక్కప్పుడు

చెట్లన్నీ

శిలల్లా స్ఫురిస్తాయి

మొహాలన్నీ

నరికేయబడ్డ మొండాల్లా తోస్తాయి

కొమ్మవుంటే ఊగని

కొలిమివుండీ మండని

ఎందుకీ జీతాలని”

మనిషైనందుకు మండాలంటారు. యువత ఉ ద్యమంలో భాగస్వాములు కావాలి. సామాజికాచరణలో భాగం కావాలి. ఉద్యమ ఆవశ్యకతను చెప్పడమే ఆనాటి రచయితల పని. నక్సల్బరీ అవసరాన్ని చెప్పడమే రచయితల కర్తవ్యంగా అలిశెట్టి భావించారు. సమాజంలో సమస్యల్ని ఎదుర్కోలేని వారు, ప్రత్యామ్నయం దొరకనివారు, ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. జీవితం అనే కవితలో

“ఈ వృక్షం

నువ్వు ఉరిపోసుకోవడానికి

వినియోగింపబడ్డదికాదు

స్వయం కృషిని

శాఖోపశాఖలుగా

విస్తరింపజేసుకొమ్మని”

అని చెట్టును చూసి నేర్చుకొమ్మాంటాడు. మానవుని శక్తిపై ఆయనకు అపార విశ్వాసం. అనేక విధాలుగా అభివృద్ధి చెందాల్సిన మనిషి అర్ధాంతరంగా నిలిచిపోరాదు. ఈ వ్యవస్థ ఆత్మహత్య పాపం అని చెబుతుందేకాని ఆత్మహత్యకు ప్రోత్సహించిన కారణాల మీదకు దృష్టి పోనివ్వదు. ప్రోత్సాహం మొదటి ముద్దాయి. ‘నాతో రండి’ కవితలో

“శూన్యంలో నిశ్శబ్దంలా

నిశ్శబ్ధంలో సమాధుల్లా

బతక్కండి

జ్ఞాపకాల రసిపుండ్లని

గోకటమే వ్యాపకంగా

చావకండి

నాతోరండి

సహనం సాహసం నిప్పులమీద

కాలాన్ని ఫలంగా వండుకుందాం.”

మంటల జెండాలు ఎమర్జెన్సీ తరువాత వ్రాసినవి. ఎమర్జెన్సీలో జరిగిన ఆకృత్యాలను గురించి చెప్పకోకుండా కర్తవ్యాన్ని నిర్వచించుకోవాలని అలిశెట్టి అంటారు. అప్పటికీ విప్లవోద్యమ విద్యార్థి యువజనులు గ్రామాల్లో సభలు సమావేశాలు నిర్వహిస్తూ భూస్వామ్య పీడనకు వ్యతిరేకంగా విముక్తి ఉద్యమాల్ని నిర్వహిస్తున్న కాలమది. ఇదే అంశాన్ని చెరబండరాజు ఇదే అదను కదలిరండి, బడుల నుండి, గనుల నుండి, నిరుద్యోగ జడతనుండి.. అనే గాయాన్ని రాశాడు. అప్పటికే పెద్దిశంకర్ లాంటి వాళ్ళు బస్తర్ లో ఉద్యమాన్ని విస్తరించే క్రమంలోనూ, కరీంనగర్ జిల్లాలోనే బయ్యపు దేవేందర్ రెడ్డి లాంటి వాళ్ళను పోలీసులు హత్య చేశారు. నిర్బంధంతోపాటు ఉద్యమం విస్తరిస్తూవున్న సమయంలో అలిశెట్టి ‘ఇంపాసిబుల్’ అనే కవితలో

“సూది

మొన

మీద

ఆవగింజని మోపటం

వృధాశ్రమ

నియంతృత్వపు

తుపాకీ

గొట్టం

పైన

భూగోళాన్ని ఆపటం

భ్రమ”

అని ఉద్యమంపై నిర్బంధాన్ని ధిక్కరిస్తాడు. అలిశెట్టి మనది వర్గసమాజమని గుర్తించాడు. ‘నగరంలో రోడ్డు’ కవితలో

“నగరంలో రోడ్డు

పెట్టుబడిదార్లకి

చెరిసగం ఆస్తుల్ని పంచేసి

రాజీ కుదిర్చిన మధ్యవర్తిలా

నగరంలో రోడ్డు

నల్లధనంలా కష్టజీవి ఎముకల్లోని ఇంధనంలా

…. బాధల బాటసార్లని

మింగేసే కొండచిలువలా”

వుందంటారు. నగరాలు నల్లధనం వున్నవాళ్ళ ఎస్సేట్స్. నగరాలు విస్తరిస్తూ గ్రామాల్ని, గ్రామీణ ఉత్పత్తుల్ని, శ్రమను మింగేసే కొండచిలువలే. చిన్న పట్టణ సమీపంలోని గ్రామాలు పట్టణంలా కలసిపోవడం, పరిశ్రమల విస్తరణలో గ్రామాలు మాయమవడం విలోమ అభివృద్ధి.

చిన్న మాటల్లోనే గొప్పభావాన్ని ఇమడ్చడం అలిశెట్టి గొప్పదనం. భావంలోని వైశాల్యపు లోతుల్ని అధ్యయనం ద్వారా అవగాహనలో వుంటే తప్ప అలా చిన్నమాటల్లో కుదించడం సాధ్యం కాదు. అలిశెట్టి చరిత్రపట్ల కళలపట్ల శాస్త్రీయ అవగాహనవుంది. అధ్యయన శీలతవుంది. చరిత్రకు ఆయన చెప్పిన వివరణ ‘చరిత్ర’ కవిత

“చరిత్ర

వడ్డీ

వ్యాపారస్తుడి

ఇనప్పెట్టెలోంచి పుట్టిందా….?

లేక

వర్ధమాన సినీతార

చనుమొన్నల్లోంచి మొలచిందా….?

లేక

రాజకీయ నాయకుడి

టోపీకింద పొదగబడిందా…………?

కాదు”

అంటూ దోపిడీదారులు చరిత్ర నిర్మాతలు కాదంటూ అదే కవితలోనే

”చరిత్రకు రక్తపాతమే ఉపోద్ఘాతం

చరిత్రకు చెమటబొట్టే ఆధారం

చరిత్రకు ఆశలే ప్రేరణ”

అని అంటూ ఆకలి, చెమట, రక్తపాతం అనే మాటల ద్వారా ప్రపంచ విప్లవాలు దేని ఆధారంగా నడుస్తాయో ఏది చరిత్ర అవుతుందో అలిశెట్టి వివరిస్తారు. చరిత్రపట్ల అలిశెట్టికి శాస్త్రీయ అవగాహనవుంది. చరిత్ర నిర్మాతలు వ్యక్తులు కాదు. శ్రమజీవులే చరిత్ర నిర్మాతలు. సమాజ గమనానికి రథచక్రాలు శ్రామికులే. నిరంతరం ప్రకృతిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి మానవుడు పరిశ్రమిస్తూనే వున్నాడు. పరాన్నజీవులు, సోమరిపోతులు. ప్రకృతిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంవల్ల సౌకర్యవంతమైన జీవితం అనుభవిస్తారు. శ్రమజీవి అన్వేషణ మార్కెట్ ను దృష్టిలో వుంచుకుని జరగదు. ఆకలి చరిత్రకు ప్రేరణ అని అంటే ఆ వ్యక్తీకరణను కవితా వ్యక్తీకరణ కింద అర్థం చేసుకుంటే అన్వేషణ అనే భావన కలుగుతుంది. అన్వేషణ ఒక నిరంతర ప్రక్రియ. అది వ్యక్తిగతమైందికాదు, సమాజగతమైంది.

‘మంటలజెండాలు’ సంకలనంలో విలక్షణమైన కవిత “కనిపించని కళాఖండం”.

కళల్ని శ్రమతో మేళవించి శ్రమలాగే రోజులున్నాయి…….

ఈ వర్తక ప్రపంచంలో వీడి శరీరం

ప్రతిరోజూ ఒకడికి లాభపాటి పెట్టుబడి

కళలతో వీడికెటువంటి సంబంధం లేకున్నా

సమస్త కళాఖండాలు వీడితోనే మలచబడతాయి.”

అని సూత్రీకరిస్తారు. సమస్త కళలు శ్రమలోనే పుడుతాయి. ఆనాటికి కళాకారులు, సాహితీవేత్తలు శ్రమ ప్రాధాన్యాన్ని, అది సమాజంలో నిర్వహించే ప్రధాన పాత్రను గుర్తించలేదు. ఏంగెల్స్ వివరించి చెప్పిన మాటనే అలిశెట్టి కవితాత్మకం చేశారు. ఇంతకంటే శాస్త్రీయత ఇంకేముంటుంది?!

కొన్ని కవితాపాదాలు తరచూ సభల్లో ప్రస్తావనకు రావడం వాటి ప్రాధాన్యతనుబట్టి, లేదా ప్రయోజనాన్నిబట్టి వుంటుంది. అటువంటి కవితాపాదాలు ప్రజల నోళ్ళలోనాని వాటి సారాంశం జీర్ణమవుతుంది. అటువంటిది ‘రాజకీయం’ అనే కవితలో అలిశెట్టి రాశాడు.

“ఒకనక్క

ప్రమాణ స్వీకారాం చేసిందట

ఇంకెవర్నీ మోసించనని

ఒకపులి

పశ్చాత్తాపం ప్రకటించిందట

తోటి జంతువుల్ని సంహరించినందుకు

ఈ కట్టుకథ విని

గొర్రెలింకా

పుర్రెలూపుతూనే వున్నాయ్”

అని పదవుల ప్రమాణస్వీకారం చేసే రాజకీయ నాయకుల్ని, ప్రజల అమాయకత్వాన్ని గిల్లి చెప్పినట్లుగా చెబుతాడు. అన్వయ కాఠిన్యం ఎక్కడావుండదు. చెప్పదలచుకున్న విషయం కథనాత్మకంగా కవితా సందేశం ఇవ్వగలిగారు. ఉపన్యాసాల్లో తరుచుగా ఈ కవితాపాదాలు వినిపిస్తుంటాయి.

భౌతిక పరిస్థితులు పరిపక్వమైనప్పుడు మాటలు మందుపాతరలవుతాయని మార్క్స్ అంటారు. ఈ సూత్రం అలిశెట్టి విషయంలో వాస్తవమేనని ఒప్పుకోవాలి. ఉత్తర తెలంగాణ మొత్తం ఎమర్జెన్సీ ఎత్తివేసిన తరువాత రైతాంగ ఉద్యమాలు ఎగిసిపడ్డాయి. నిర్బంధ వెట్టిచాకిరి, కూలీలు, దండుగలు, పంచాయితీలు ప్రశ్నించబడ్డాయి. భూ ఆక్రమణలు ప్రారంభమైనాయి. దీన్ని వెన్నంటే నిర్బంధమూ ఎన్ కౌంటర్లు ప్రారంభమైనాయి.

ఈ స్థితిని ఎదుర్కొంటూనే రాడికల్ విద్యార్థి యువజన బృందాలు గ్రామాలకు వెళ్ళి వ్యవసాయ విప్లవ సందేశాన్ని వినిపించి రైతుకూలీ సంఘాల్ని సంఘటిత పరచారు. దీని పరాకాష్ట జగిత్యాల జైత్రయాత్ర. భారతదేశ రాజకీయ ఉద్యమ చరిత్రలో అది మైలురాయి. దాదాపు నూటయాభై గ్రామాల్లో నిర్మాణమైన కరీంనగర్ జిల్లా రైతాంగ ఉద్యమం సందర్భమిది. ఈ కాలాన్ని ప్రతిబింబించే అలిశెట్టి కవిత ‘పెత్తందార్లు’ బహుశా 1978లో చినమెట్పల్లిలోని సంఘటనకు ఇది కవితారూపమే! రైతాంగ కార్యకర్తల్ని ఇద్దర్ని స్థానిక భూస్వామి ఇంట్లో బంధించి చిత్రహింసల పాలు చేస్తున్నాడని విని చుట్టుపట్ల గ్రామాల ప్రజలు భూస్వామి ఇంటిని చుట్టిముట్టి వారిని విడిపించే ప్రయత్నం చేశారు. రోజుల తరబడి భూస్వామి ఇంటిని దిగ్బంధం చేశాడు. పోలీసుల జోక్యంతో సమస్య పరిష్కారమైంది. ఆ కవితలో అలిశెట్టి

“నీ పొట్టనిండా దౌర్జన్యపుకూడు

నీ బతుకుంతా అక్రమాల ఊబి

అందుకే

ఇంత దట్టమైన చీకట్లోనూ

జగిత్యాల సిరిసిల్లా

సరికొత్త ఆయుధాల్లా

క్షణక్షణం నీగుండెల్లో తళుక్కుమంటూ….”

అని రైతాంగ ఉద్యమాల్లో తానూ ఒకడిగా మాట్లాడుతాడు. అలిశెట్టి సంఘటనల్ని కవితాత్మకం చేయడమేకాదు. సమాజ వాస్తవస్థితిని సూత్రీకరించి వైరుధ్యాల్ని వివరించి దాని చలన మార్గాన్ని సూచించడమేకాదు, సాధారణ కవితల్లోనూ భూస్వామ్య భావజాలాన్ని వ్యతిరేకిస్తాడు. ‘చంద్రున్ని కాల్చేస్తా’ కవిత ఇందుకు ఉదాహరణ. తెలుగు కవులకు చంద్రుడు కవితా వస్తువు. కవి సమయం కూడా. శ్రీశ్రీ ‘శరశ్చంద్రిక’ కవితలో చందమామనూ చూసి పొంగిపోయాడు. వెన్నెలను శివసాగర్ కవితాగానం చేశారు. అలిశెట్టి మాత్రం చంద్రుణ్ణి కౌగిలించుకోలేదు.

“ఆ వెన్నెల రొచ్చు గుంటలో

చచ్చిన కప్ప వెల్లికిలా పడ్డట్టు

ఏమిటా చంద్రుడుగాడు

ఛీ

అదే నా సూర్యుడొస్తే

ఎంత చైతన్యం

ఎంత కాంతిమయం

….ప్రతి ఉదయం నన్నునేను

సరికొత్త పనిలోకి పురమాయించుకోగలగే

ఏమిటా అతీయశక్తి ”

అంటూ ఉద్యమాల అవసరాన్ని చెబుతాడు. సాంప్రదాయ కవుల విధానాల్ని పూర్వపక్షం చేశాడు. దీనిబట్టి అలిశెట్టి పూర్వ కవులను కూడా చదువుకున్నట్లు తెలుస్తుంది. దిగంబర కవులకు కోపంవచ్చినట్లే ఈ వ్యవస్థపై అలిశెట్టికీ కోపం ఉంది. అతిచిన్న కవితల్లో గొప్పభావాల్ని నింపగల నైపుణ్యంగల కవి అలిశెట్టి ప్రభాకర్. ఈ నైపుణ్యం సామాజిక వైరుధ్యాల్ని చదువుకోవడం, పరిష్కారాలు శాస్త్రీయంగా అన్వేషించడం మూలంగానే సాధ్యమైంది.

(జనవరి 12 అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి సందర్భంగా)

Leave a Reply