అమ్మీ ఓలమ్మీ ఉపాధి హామీ పనికెల్లొచ్చీసినావేటి. డబ్బులెప్పుడు పడతాయో నేదో తెలీదు కానీ ఎండతోటి గునపాం పట్టుకోనేక మట్టి కాడక తవ్వీ తవ్వీ ఇసుగెత్తిపోతే నెత్తి మండిపోతున్నా తట్టల్తోని మోసుకెల్లి ముగ్గేసినట్లు గట్టు తీర్సి దిద్ది ఒచ్చీసినాక ఇలా గెంజి తాగి సేరబడ్డానే.
ఏటో ఈమజ్జెన ఒల్లలిసిపోయొచ్చినా సరే నిద్దర కంటి మీదకి రాక టీవీ సూడ్డం అలవాటయిపోయినాదే. సీరియల్లు సూడ్డం మొదలెడితే రాతిరి పది వరకు ఆపనేం. గుంట్లకొండి పోసినామా లేదో కూడా తెలీడం లేదోలమ్మి. ఆలకి సెలవులిచ్చిన కానించి ఇంటికి జేరకుండా ఈదిలో ఆటల్తోనే కాలం గడిపేత్తున్నారే. ఈ సెల్లులొకటి కదా? ఆల్నాయన ఈమజ్జెన కొన్న సెల్తోటి గుంటల మజ్జెన గొడవలెక్కువయి పోయినాయి. నేన్జూత్తానంటే నేన్జూత్తానని. సర్లే ఒళ్ళలిసి పోయి తొంగుందామని సేరబడి టీవీ ఏసినానా చానల్ మారుత్తుంటే టక్కుమని ఒక వార్త విన్నానే.
అదేదో కేరళా సినిమా అంట. బొట్టు బెట్టుకున్న బేపనమ్మిని ముసుగేసుకున్న తురకమ్మాయి ఎక్కడికో తోలుకు పోయి తుపాకుల మజ్జిన పడీసిందని సెప్తుంటే ఇదేమన్నయం ఇదేమన్నాయం అని ఆ కథంతా ఇన్నానే. మనూర్లో ఒటేలు నడిపేటోడు కదా నాయర్ బాబు ఈ రోడ్డు మీద బళ్లు కొట్లొచ్చి గుంటలకి ఆ సాంబారు బువ్వ ఎక్కక సేసిన అప్పులకు వడ్డీలు కట్టనేక ఒటేల్లోనే ఉరేసుకుంటే కుటమానం కుటమానం ఎటో ఆళ్ళురెళ్లిపోనారని ఇన్నాం కదా ఆ రాస్ట్రంలో మూడు పదులేల మంది ఆడ కూతుర్లని దేసం దాటించీసినారని సెప్తుంటే ఒళ్ళంతా సెమటలు పట్టీసినాయే మల్లీ.
అదేటో గానీ ఊరు దాటి ఎల్దామంటే ఎన్నెన్ని అడ్డంకుల్దాటుకునెల్తున్నాం మనం మరి ఆలెలాగెలిపోయుంతారంతావేటి? మొన్న గంగా పుస్కరాలకి మీ అత్తా నేనూ ఎల్లినామా టౌన్ టేసన్లో రైలెక్కి రాయపూర్‌లో దిగినామా ఆ టేసన్లో రెండు సీరలు జాకెట్టు గుడ్డెట్టిన సేతి సంచీని వొదలకుండా తనికీ సేసి ఆదార్ కార్డు సూపితే గాని ఒదల్లేదు. మరలాంటప్పుడు అన్నేలమంది ఇన్ని రాస్ట్రాలు దాటి సముద్రాల్దాటి ఎలగెగిరి పోనారేటి. మొన్నామజ్జిని నాయుడోరి పెద్దమ్మి సదువుకని ఇసాకపట్నం ఎల్లి అక్కడో బొట్టిడ్ని నవ్వుజేత్తే ఆడు ఇదీ కల్సి పారిపోతే పోలీసులకు జెప్తే ఆల పోన్నెంబరు ఇత్తే రెక్కొట్టుకుని ఈడుసుకొచ్చీసినారంట ఇద్దర్నీ. మరీ పోలీసులు ఇంకేవేవో రకరకాల మందీ మార్బాలం కాపలా కాస్తుంటే ఇన్నేల మంది తప్పించుకు పోనారంటే మనకేదో పెద్ద సిల్లు బడి పోయినట్లుందోలమ్మీ. అటేటో సూత్తావేటే నీ సెల్లు సూపు తగలెయ్య ఆ పెదాన మంతిరంతటోడు సెప్తున్నాడు ఈ సినిమా సూడండి ఎంత పెద్ద గోరం జరిగిపోనాదా రాస్ట్రంల అని. మరంత మంది ఆడ కూతుర్లెలిపోతే ఈ దేసాన్నొగ్గీసి ఈయనక్కడ కూసోని ఏటి పీకుతున్నాడే సెప్మీ. మా తాత ఇలాగే సిన్నప్పుడు కాశీ మజిలీ కతలు, బేతాల కతలు సెప్పీవోడే నిద్దర పట్టక దొర్లితే. ఇసుమంటి కతల్జెప్పి బయపెట్టిత్తే ఓటేసిత్తాం అనుకుంటున్నాడు గావాల. ఏటోనేలె ఈ మజ్జెన మనూర్లోనూ రామ్మందిరానికి రంగులేసీనారే. మనీది సివరున్న నారాయణ్‌రావు ఇలేకరి పన్జేత్తున్న మురలీ ఇంకో ముగ్హుర్నలుగురు ఎదురు పడినప్పుడల్లా జై సీరాం అంతన్నారే కొత్తగా. మనకిలపింటివి తెలీవు ఒల్లారా నీలు పోసుకుని గూట్లో దీపమెట్టీసి పన్జూసుకోవడమే కదేటమ్మీ. ఏటో జరుగుతోందే మనకు తెలవకుండా. అన్నీ నాకెందుకులే అని ఊరుకోకే అప్పుడప్పుడూ అలోసించే మల్లీ. ఎవురో ఏదో కతల్జెప్తే నమ్మీకే సిన్నా.
*కేరళ స్టోరీ* సినిమాపై స్పందన
Kekuyub Varma chaalaa baagaa రాశారు