తేదీ 31 మే, భారత విప్లవోద్యమ చరిత్రలో మరో తీవ్ర విషాద దినంగా నమోదైంది. కామ్రేడ్‌ ఆనంద్‌ (కటకం సుదర్శన్‌, దూలాదా) అనారోగ్యంతో 69వ ఏట కన్ను మూశాడని జూన్‌ 5 నాడు వార్తలలో చూసి నిర్ఘాంతపోయాను.

‘‘మన దేశాంలో చైనా అనుభవాలు మక్కికిమక్కి లేదా కొన్ని సవరణలతో అన్వయిస్తే సరైన ఫలితాలు రావు. మన దేశ నిర్దిష్ట పరిస్థితులపై ఆధారపడి విప్లవోద్యమాన్ని నిర్వహించాలి. మూడు రంగాలలో ఎత్తుగడలు నూతనంగానే ఉండాలి. మనం ఈ నిర్బంధంలో నిర్మించే సంఘాలు ఒక కొత్త తరహాలో ఉండాలి. గతంలో మనకు లేని ప్రయోగాలు చేయాలి’’.

అనే అభిప్రాయం ఆయనకు ఉండేది. తాత్కాలిక వెనుకంజలో వున్న భారత విప్లవోద్యమాన్ని పురోగమింపచేయడానికి ఆయన అంకితమయ్యాడు. ఆయనలోని తపన, ఆరాటం, ప్రతిభ, ఐదు దశాబ్దాల గొప్ప విప్లవ అనుభవాన్ని రంగరించి ఆయన ఆ అవగాహనకు వచ్చాడు. కామ్రేడ్‌ ఆనంద్‌ ఐదు దశాబ్దాల విప్లవోద్యమ అనుభవంలోని ప్రతి అధ్యాయం విశిష్టమైనదే. ఆయన జీవితం తెరిచిన పుస్తకం. అందులోని ప్రతి అధ్యాయం భారత విప్లవోద్యమ ఎగుడు, దిగుళ్లను, ఆటు పోట్లను, సాఫల్య, వైఫల్యాలను, బలహీనతలను, బలమైన అంశాలను రక్తసిక్త చరిత్రను బలంగా ముందుకు తెస్తాయి. ఆయన అపార అనుభవాల నిధి. సిద్ధాంత, రాజకీయ అధ్యయనశీలి. జ్ఞానాన్ని అన్వయించడంలో ఆయన దిట్ట.

కామ్రేడ్‌ ఆనంద్‌ 1978 నుండి 2023 మధ్య ఒక విప్లవ ఆర్గనైజర్‌ నుండి కేంద్ర నాయకుడి వరకు అన్ని స్థాయిలలో పని చేశాడు. కామ్రేడ్‌ ఆనంద్‌ విప్లవోద్యమ జీవితం రాడికల్‌ విద్యార్థి సంఘ నిర్మాణం నుండే మొదలైంది. నిజంగా ఈనాడు అత్యున్నత స్థాయిలో భారత విప్లవోద్యమానికి నాయకత్వం అందిస్తున్న అగ్రశ్రేణి నాయకులందరూ ఆ తరానికి చెందినవారేనని విడిగా చెప్పాల్సిన పని లేదు. కల్లోలభరితమైన 1960ల నాటి పరిస్థితులతో ఆ తరం రాటుతేలింది. ఆ తరం నక్సల్బరీ రాజకీయాలతో పదునెక్కింది. ఆ తరం ప్రత్యేక తెలంగాణ కోసం వీధుల్లోకి వచ్చి పోలీసు కాల్పులను సవాల్‌ చేస్తూ ‘జై తెలంగాణ’ నినాదాన్ని ప్రాణం కన్నా మిన్నగా భావించి పోరు కేతనాన్ని ఎగురవేసింది. ఆ కేతనాన్ని చేతబూని తొలి తెలంగాణ ఉద్యమంలో పరవళ్లు తొక్కిన మన నాయకుడు కామ్రేడ్‌ ఆనంద్‌ మలి ఉద్యమంలోనూ నాయకుడై, ఆ ఉద్యమ రథసారధులలో ఒకరై, భౌగోళిక తెలంగాణ సాధించిన ఘనతను సంతరించుకున్న నాయకులలో ఒకరు. ప్రజాస్వామిక తెలంగాణ నినాదాన్ని ప్రజలకు అందించిన విప్లవోద్యమ ప్రతిష్టను ఇనుమడిరపచేసి దాని ప్రాసంగికతను ఈనాటికి ఎత్తిపడుతూ, విప్లవోద్యమంతో అనుసంధానిస్తూ, తెలంగాణ విప్లవోద్యమ పునర్వికాసానికి బాటలు పరిచిన విప్లవనేత కామ్రేడ్‌ ఆనంద్‌. బూర్జువా నాయకులు సైతం ఆ నినాదంతో ప్రజల మధ్యకు వెళ్లక తప్పని విధంగా తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పాడు. మావోయిస్టుల ఏజండానే మా ఎజండా అని పాలకవర్గాలతో సైతం అన్పించాడు. తెలంగాణలో ఎన్నికల రాజకీయాలు నడుపుతున్న వారు సైతం మావోయిస్టులను కాదని ఏ పల్లెలో, పట్టణంలో, కాలేజీలో, విశ్వవిద్యాలయాలలో, పొలాలలో, గనులలో, ఖార్ఖానాలలో రైతులలో, కార్మికులలో, మహిళలలో పని చేయలేని స్థితిని కల్పించాడు. ఆ సమూహాలకు విప్లవ రాజకీయాలే ప్రత్యామ్నాయం అని ధైర్యంగా చెప్పి ప్రజలను నడిపించాడు.

బెల్లంపెల్లి బొగ్గు బాయి దొర కొడుకు కార్మిక సోదరి రాజేశ్వరిపై అత్యాచారానికి పాల్పడినపుడు కామ్రేడ్‌ ఆనంద్‌, ఆయనతో పాటు అనేక మంది యువకులు కన్నాల బస్తీ, బూడిద గడ్డను విప్లవ రాజకీయాలతో మండిరపచేసి తెలంగాణ వ్యాప్తంగా ఆ జ్వాలలను విస్తరింపచేశారు. మాకు ‘‘అన్నలు’’ ఉన్నారన్నా అపార విశ్వాసాన్ని బాధిత, వంచిత, పీడిత మహిళలలో దాదాపు ఐదు దశాబ్దాల క్రితమే కల్పించాడు. ఆయన మరణవార్తతో ఈ గతాన్ని ఇప్పటి తరం జ్ఞాపకం చేసుకోవడం వింటున్నాం. తెలంగాణ పట్టణాలలో, నగరాలలో గుండాలను గడగడలాడిరచిన రాడికల్స్‌ను ఏ సోదరి మరిచిపోతుంది? దొరల గడీలలో భూస్వాముల ఆగడాలకు బలైన జీవితాలలో విశ్వాసాన్ని నింపిన రాడికల్స్‌ను, రైతు కూలీ సంఘాలను, ‘అన్న’లను ఏ పల్లె మరిచిపోతుంది? ఈనాటి యువతులు, వారి తల్లి తండ్రులు ‘నీ బాంచెన్‌ దొర, కాల్మొక్తా’ అనే భయంకర రోజుల నుండి విముక్తై గుండెలపై చేయి వేసుకొని నిశ్చింతగా వుండగలుగుతున్నారంటే, తెలంగాణ గడ్డన చిమ్మిన విప్లవకారుల నెత్తుటి త్యాగాలే కారణం అని ప్రతి పల్లె చరిత్రలో లిఖితమై వున్నది. ఆ చరిత్రలో ఆనంద్‌ ఒక విడదీయరాని భాగం.

తెలంగాణలోని ఆదిలాబాదు, కరీంనగర్‌ జిల్లాల రైతాంగ పోరాటాలను ఉన్నత దశకు తీసుకెళ్లాలని, ‘కల్లోల’ జిల్లాలుగా ప్రకటితమైన ఆదిలాబాదు, కరీంనగర్‌ జిల్లాల విప్లవోద్యమాన్ని కాపాడుకోవడానికి పొరుగున వున్న విశాలమైన అటవీ ప్రాంతానికి విస్తరింపచేయడానికి, పురాణ కాలం నాటి దండకారణ్యాన్ని తిరిగి వర్తమాన చరిత్రలో భవిష్యత్‌ విప్లవ చిత్రపటంపై సదా వెలుగొందేలా చేయడానికి ప్రయత్నించిన చేసిన తొలితరం విప్లవకారులలో ఒకరు ఆనంద్‌. గోదావరి నదిని దాటిన మరుసటి రోజే విప్లవకారులపై మహారాష్ట్ర పోలీసులు కాల్పులు జరిపి కామ్రేడ్‌ పెద్ది శంకర్‌ను పొట్టన పెట్టుకున్నప్పటికీ చలించకుండా, మడమ తిప్పకుండా విప్లవోద్యమ కర్తవ్యాన్ని పురోగమింపచేయడంలో అహర్నిశలు కృషి చేశాడు. ఈ క్రమంలో ఆయన ఉన్నత స్థాయి నాయకుడిగా ఎదిగి తుదకు ఆ దండకారణ్య గడ్డనే, ఆ మూలవాసీ పీడిత ప్రజల ప్రియమైన నాయకుడిగా, వారి దూలా దాదాగా గుర్తింపు పొంది తన తుదిశ్వాస విడిచాడు.

బస్తర్‌లోని అమూల్యమైన ప్రాకృతిక వనరులను కొల్లగొట్టుకపోవడానికి దళారీ కార్పొరేట్‌ వర్గాలు సృష్టించిన ఫాసిస్టు సల్వాజుడూం తెల్ల బీభత్సాన్ని అసమాన ధైర్య సాహసాలతో ప్రతిఘటించి మరణించిన మూలవాసీ ప్రజల ముద్దు బిడ్డ దూలా స్మృతిలో ఆనంద్‌ 2010 నుండి దూలాగా మారాడు. ఆ పేరే చివరి వరకు ఆయన చిరునామాగా నిల్చింది. కన్నాల బస్తీ కటకం సుదర్శన్‌, ఆనంద్‌గా దాదాపు నాలుగు దశాబ్దాల విప్లవోద్యమ నాయకుడిగా నిలిచి ఉర్పల్‌మెట్ట దూలా పేరుతో భౌతికంగా దూరమయ్యాడు.

ఇంద్రవెల్లి రైతాంగ పోరాటాన్ని నిర్మించిన నాయకులలో కామ్రేడ్‌ ఆనంద్‌ ఒకరు. ఆనాడు ఒక ఆర్గనైజర్‌ గా, జిల్లా స్థాయి నాయకుడిగా, అమరుడు కామ్రేడ్‌ శ్యాం నాయకత్వంలో ప్రజా రచయిత, ఆనాటి గెరిల్లా దళ కమాండర్‌ సాహు లాంటి వాళ్లతో కలిసి కొంరం భీం పోరాట కలలను సాకారం చేయడానికి నడుం బిగించి సృష్టించిన చారిత్రక ఉద్యమ మలుపు ఇంద్రవెల్లి. రగల్‌ జెండాలతో రక్తసిక్తమైన ఇంద్రవెల్లి చరిత్రకు, 60కి పైగా ఆదివాసీ వీరుల త్యాగాలకు సాక్షిగా నిల్చిన స్థూప నిర్మాణాన్ని నక్సలైట్లే దేశభక్తులు అన్న నటుడు, ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు డైనమెట్లతో పేల్చివేయించిన చరిత్రను జనాలలో బట్టబయలు చేసి ఆ పోరాట చరిత్రకు నిజమైన వారసులు ఆదిలాబాదు గోండన్నలు, వారికి నాయకత్వం వహించిన విప్లవకారులే అని చాటుతూ నాలుగు దశాబ్దాల తరువాత మరో విడత 2020లో నేటి తరానికి గత ఇంద్రవెల్లి చరిత్రను అందించిన ఘనత కామ్రడ్‌ ఆనంద్‌ కే దక్కుతుంది.

సింగరేణి బొగ్గు గనులలో కార్మిక బతుకులు వెళ్లదీస్తూ, బొగ్గు తట్టలతో నల్ల బంగారాన్ని ప్రపంచానికి అందించి వెలుగులు విరజిమ్మేలా చేసే వేలాది కార్మికులలో మల్లయ్య ఒకరు. మల్లయ్య, ఆయన జీవిత సహచరి వెంకటమ్మలకు తొల్చూరు కొడుకుగా పుట్టిన సుదర్శన్‌ ఆ బావులలో కొలువు కోసం తండ్రి బాటలో కార్మిక జీవితాన్ని కలలు కని మైనింగ్‌ డిప్లొమా చదివి కొద్ది కాలం ఉద్యోగం చేసి తన కన్నా ఐదుగరు చిన్నవాళ్లకు అపురూపమైన అన్నగా నిల్చిన జ్ఞాపకాలనే వాళ్లకు మిగిల్చి ప్రజల మనిషిగా విప్లవోద్యమంలో కొనసాగాడు.

కామ్రేడ్‌ సుదర్శన్‌ ఆనంద్‌గా విద్యార్థి, యువజన, గిరిజన రైతాంగంతోనే తన జీవితాన్ని ఎక్కువగా పంచుకున్నాడు. 1980లలో సింగరేణి కార్మికులు వేజ్‌ బోర్డు కోసం జరిపిన చారిత్రాత్మక సమ్మె పోరాటం ఎమర్జన్సీ (1975-77) తరువాతి కాలంలో విప్లవ కార్మికోద్యమంలో ఒక మైలు రాయి. సంఘాల నిర్మాణమే రివిజనిజం అనుకున్న పొరపాటును గుర్తించి సింగరేణి కార్మిక సమాఖ్య నిర్మాణానికి పునాదులు వేసిన కార్మికులలో, వారి నాయకులలో కామ్రేడ్‌ ఆనంద్‌ కృషి అవిస్మరణీయమైనది.

కార్మిక బస్తీలలో సారా వ్యతిరేక ఉద్యమం నుండి ప్రతి పోరాటాన్ని లోతుగా అధ్యయనం చేసి వాటికి పరిష్కారాలు చూపడంలో ఒక కార్మికుడిగా, కార్మిక వర్గ నాయకుడిగా కామ్రేడ్‌ ఆనంద్‌ సమర్థవంతమైన పాత్ర పోషించాడు. అంతేకాదు, కార్మికులతో, రైతాంగాన్ని, కార్మిక పోరాటాలతో రైతాంగ పోరాటలను మమేకం చేసి, కార్మికవర్గ నాయకత్వంలో జమిళిగా వాటిని నడుపకుండా భారత జనతా ప్రజాస్వామిక విప్లవం జయప్రదం కాదన్న మౌలిక విప్లవ అవగాహనతో గతంలో బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణపురం, గోదావరి ఖని, రామగుండం, ఎఫ్‌.సీ.ఐ తదితర అన్ని రంగాలలోని కార్మకుల పోరాటాలతో ఆదిలాబాదు, కరీంనగర్‌ జిల్లాల రైతాంగ పోరాటాన్ని ముఖ్యంగా సాయుధ పోరాటంతో అనుసంధానిస్తూ కొత్త తరహ కార్మిక ఉద్యమాలకు బాట చూపిన వారిలో కామ్రేడ్‌ ఆనంద్‌ చొరవ, పట్టుదల, కృషి మరువలేనిది.

తెలంగాణ విప్లవోద్యమం తాత్కాలిక వెనుకంజలో వున్నప్పటికీ దాని పునర్వికాసానికి అహర్నిశలు కృషి సలుపుతూ మణుగూరు, కొత్తగూడెం, మందమర్రి, బెల్లంపెల్లి, గోదావరిఖని సింగరేణి కార్మిక పోరాటాలతో తెలంగాణ రైతాంగ ఉద్యమానికే కాదు, దండకారణ్యానికి అండగా నిలుపాలనే మార్గదర్శకత్వాన్ని ఆనంద్‌ అందించాడు. ఆ కృషి మూలంగానే ఆయన ఈరోజు గనులకన్నా లోతైన, విస్తృతమైన కార్మికవర్గ నాయకుడిగా నిలిచిపోయాడు.

కామ్రేడ్‌ ఆనంద్‌ ఉత్తర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, దండకారణ్య కేడర్లను ప్రత్యక్ష పోరాట రంగంలో తీర్చి దిద్దడానికి ఎనలేని కృషి చేశాడు. తెలంగాణలో ఆదిలాబాదు జిల్లాను ముఖ్యమంత్రి రామారావు ఆదర్శజిల్లాగా ప్రకటించి పోలీసు శిబిరంగా మార్చిన పరిస్థితులలో అడవులలో తీవ్రతరమైన పోలీసు దాడులను ఎదుర్కొంటూ ఆయన ఎంతో సమయస్ఫూర్తి, చొరవ, దృఢ సంకల్పంతో కార్యకర్తలను నడిపించాడు. ఆ దాడులలో ఆయన నాయకత్వంలో ఎదిగి వచ్చిన మెరికల్లాంటి కేడర్లు, గెరిల్లాలు ఎందరో రక్త తర్పణం చేసి తెలంగాణ ఉద్యమానికి వన్నె తెచ్చారు. దండకారణ్య ఉద్యమాన్ని నూతన ఎత్తులకు వికసింపచేశారు.

కామ్రేడ్‌ ఆనంద్‌ నిరంతర అధ్యయనశీలి. ఆయన చైనా, రష్యా విప్లవోద్యమ అనుభవాలను యధాతథంగా మన దేశ విప్లవోద్యమానికి అన్వయించకూడదని అర్థం చేయించేవాడు. స్థల కాల పరిస్థితులను బట్టి సిద్ధాంత అన్వయం వుండాలనీ, అలా కానపుడు మనం తూర్పుకు వెళ్లాలనుకొని పశ్చిమానికి బండి కట్టిన చందంగా వుంటుందనీ హెచ్చరించేవాడు. ఉత్తర తెలంగాణ సహ యావత్తు ఆంధ్రప్రదేశ్‌ ఉద్యమం 1998 నుండి ప్రపంచ బ్యాంకుకు ఒక ప్రయోగశాలగా మారి విప్లవోద్యమాన్ని అణచడానికి పాలకవర్గాలు చేపట్టిన లో-ఇంటెన్సిటీ కాంఫ్లెక్ట్‌ (ఎల్‌.ఐ.సీ) విధానాలను లోతుగా అధ్యయనం చేసి విప్లవోద్యమాన్ని నిలబెట్టడానికి ఆయన కృషి చేశాడు. ఫలితంగా ఉద్యమం ఎన్ని ఆటు పోట్లను ఎదుర్కొంటున్నప్పటికీ అనేక రకాల అనుభవాలను గడిస్తూ భారత విప్లవోద్యమ శస్త్రాగారానికి నూతన అమ్ములను సమకూరుస్తున్నది. అందుకు విప్లవోద్యమం చేపట్టిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పోరాటమే ఒక సజీవ వుదాహరణ.

కామ్రేడ్‌ ఆనంద్‌ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విప్లవోద్యమ సిద్ధాంత రాజకీయాలను వెంట వెంట ప్రజలకు అందించడానికి పత్రిక ఒక ఆర్గనైజర్‌ అన్న లెనిన్‌ బోధనను సదా గుర్తుచేయడమే కాకుండా పలు విప్లవ పత్రికలకు సంపాదక బాధ్యతలు నిర్వహించాడు. తెలంగాణ ఉద్యమం నుండి వెలువడిన ప్రజా విముక్తి, గెరిల్లా సందేశం పత్రికలకు ఆయన అనేక వ్యాసాలు రాసి అందించాడు. ఆంధ్రప్రదేశ్‌ ఉద్యమం నుండి వెలువడిన క్రాంతి పత్రికను 2000 తరువాత దాదాపు దశాబ్దన్నర కాలం అనేక ఇబ్బందుల మధ్య ప్రధాన సంపాదకుడిగా కొనసాగించాడు. పీపుల్స్‌వార్‌ పత్రికకు ఆయన తరచుగా వ్యాసాలు రాసేవాడు. గత నాలుగేళ్లకు పైగా పీపుల్స్‌మార్చ్‌ పత్రిక కామ్రేడ్‌ దూలాదా సంపాదకత్వంలోనే వెలువడుతోంది. గత రెండేళ్లుగా విప్లవోద్యమ ప్రతినిధి అభయ్‌ బాధ్యతలను నెరవేరుస్తూ దేశ, ప్రపంచ పరిణామాలపై విప్లవ వైఖరులను వెంట వెంట ప్రజల ముందుంచడంలో ప్రశంసనీయమైన పాత్రను పోషించాడు. వివిధ రాజకీయ విషయాలపై ఆయన అనేకసార్లు మీడియాతో ఉద్యమ వైఖరులను పంచుకున్నాడు.

ఆయన ఎప్పటికప్పుడు కార్యకర్తలను ఎడ్యుకేట్‌ చేసుకోవడానికి మారిన పరిస్థితులు, విప్లవోద్యమం అవలంభించాల్సిన ఎత్తుగడలు, పని పద్ధతులను వివిధ సర్క్యులర్ల రూపంలో, లేఖల రూపంలో రూపొందించి అందించడంలో తన వంతు పాత్ర ఆయన చాలా బాధ్యతాయుతంగా నిర్వహించాడు. 1998-2003 మధ్య తెలంగాణ విప్లవోద్యమం ఎదుర్కొన్న అత్యంత ప్రతికూల పరిస్థితులను, ఆటు పరిస్థితులను విశ్లేషించుకొని విప్లవ శక్తులను కాపాడుకోవడానికి చేపట్టిన ఎత్తుగడలలో భాగంగా దండకారణ్యాన్ని తెలంగాణకు దన్నుగా ఉపయోగించుకోవాలనీ 1980లలోనే వ్యూహాత్మకంగా ఆలోచించిన విధానాలకు కార్యరూపం ఇచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టడంలో కామ్రేడ్‌ ఆనంద్‌ కీలక పాత్ర పోషించాడు. కామ్రేడ్‌ ఆనంద్‌ వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులను లోతుగా అధ్యయనం చేసి ఉత్పత్తి సంబంధాలలో వచ్చన మార్పులను విశ్లేషించి దస్తావేజును రూపొందించడంలో 2008-12 మధ్య విశేష కృషి సలిపాడు. నిజానికి ఆయన 1991లోనే విప్లవోద్యమం ‘‘దున్నేవారికే భూమి, దొరలు దురాక్రమించిన పట్టా భూములను స్వాధీనం చేసుకోండి’’ అని పిలుపు ఇచ్చిన సమయంలో ఆయన భూపంపకాలపై ప్రత్యేక అధ్యయనం చేసి పరమేశ్వర్‌ పేరుతో మీడియాకు ఫ్యామిలీ హోల్డింగ్‌లపై వ్యాసాలు రాశాడు. 2001లో విప్లవోద్యమం నిర్దేశించిన కర్తవ్యం ప్రకారం ఆయన దక్షిణ బస్తర్‌ గ్రామాలలో వర్గ పరిశీలన జరిపాడు. 2007-12 మధ్య దేశ వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న వికృత పెట్టుబడిదారీ విధానాలను నిర్దిష్టంగా అధ్యయనం చేశాడు. ఒక ప్రత్యేక దస్తావేజ్‌ను రూపొందించాడు. ఆ తర్వాత విప్లవోద్యమం ఇటీవల 2021లో విడుదల చేసిన భారత దేశంలో ఉత్పత్తి సంబంధాలు దస్తావేజ్‌కు సంపద్వంతం చేయడంలో ఆయన ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు.

2004లో నూతన విప్లవ నిర్మాణం ఏర్పడిన వెంటనే 2005లో భారత పాలక వర్గాలు బస్తర్‌లో చేపట్టిన సల్వాజుడుం, రaార్ఖండ్‌లో చేపట్టిన సేంద్రలు, 2009-17ల మధ్య కొనసాగించిన దేశ వ్యాప్త ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ కాలంలో విప్లవోద్యమంలో బోల్షెవిక్‌ తత్వాన్ని ఇనుమడిరపచేయడంలో ఆయన పాత్ర ప్రముఖమైనది.

కామ్రేడ్‌ ఆనంద్‌ మారుతున్న పరిస్థితులలో, దేశంలో హిందుత్వ ఫాసిస్టు ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రగతిశీల, ప్రజాస్వామిక, విప్లవ శక్తులను సమైక్యం చేయడానికి వినూత్న పద్ధతులలో చొరవ చూపేవాడు. దోపిడీ పాలక వర్గాలకు వ్యతిరేకంగా హిందుత్వ ఉగ్రవాదుల ప్రమాదానికి వ్యతిరేకంగా విశాల ప్రజారాసులను సమీకరించుకోకుండా భారత జనతా ప్రజాస్వామిక విప్లవం పురోగమింపజాలదనే విప్లవ వైఖరిని అమలు చేయడానికి కామ్రేడ్‌ ఆనంద్‌ దేశవ్యాప్తంగా ప్రజాహిత శక్తులను సమీకరించేందుకు పూనుకున్న దశలో ఆ అసువులు బాయడంతో ప్రగతిశీల, ప్రజాస్వామిక, లౌకిక, విప్లవ శక్తుల బాధ్యతను ఎంతగానో పెంచింది. ఆ అసంపూర్ణ కర్తవ్య పరిపూర్తికై ఆ శక్తులన్నీ హిందుత్వ శక్తులను ఎండగడుతూ, వాటి ప్రమాదాలను నివారించుకుంటూ కామ్రేడ్‌ ఆనంద్‌ అనుసరించిన మార్గంలో తుదివరకూ పోరాడాల్సి ఉంది.

కామ్రేడ్‌ ఆనంద్‌కు క్రీడలంటే ఎంతో ఇష్టం. ఆయన పత్రికలలో తప్పకుండా క్రీడా వార్తలు చూసేవాడు. రేడియోలో కామెంట్రీ వినడానికి కొద్ది సమయాన్నైనా కేటాయించుకునే వాడు. ఆయన సామాజిక ఇతివృత్తాలతో కూడిన సినిమాలను చూడడానికి ఇష్టపడేవాడు. ఇతరులకు వాటిని చూడాలనీ సూచించేవాడు. మానసిక ప్రశాంతత కోసం అరుదుగానైనా విప్లవ పాటలు ముఖ్యంగా అమరుల జీవిత చరిత్రలపై రాసినవి ప్రత్యేకించి వినేవాడు. విప్లవ గాయని విమలక్క పాడిన సావిత్రిబాయి ఫూలే పాటను ఎక్స్‌లెంట్‌ అన్నాడు. ఈ మధ్య ఓ సందర్భంలో కలుసుకున్నపుడు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నపుడు ఆయనకు ఫోటోలు తీయడం ఎంతో ఇష్టమైనదనీ, స్కూలు జీవితంలో ఆటలు ఆడడం బాగా చేసేవాడిననీ, (బొగ్గు) బాయి దొరల పిల్లల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తోటి పేద, కార్మిక పిల్లలతో కలిసి జట్టుగా ప్రతిఘటించిన వివిధ అనుభవాలను పంచుకున్నాడు. ఆయన విరామ సమయాలలో గెరిల్లా యువకులతో ఎంతో సంతోషంగా తన విప్లవానుభవాలను పంచుకుంటుండేవాడు. ఆనంద్‌ విప్లవోద్యమంలో అత్యంత క్రమశిక్షణ పాటించడంలో ముందుండేవాడు. తన చివరి కోరికగా తన జీవిత సహచరి కామ్రేడ్‌ ఊరేతో కలిసి ఒక ఫోటో దిగాలనుకొని ఉద్యమం అనుమతి కోరినట్టు తెలిపాడు.

కామ్రేడ్‌ ఆనంద్‌ మరణం వర్తమాన పరిస్థితులలో ఉద్యమానికి పెద్ద నష్టం. దేశంలో విప్లవోద్యమాన్ని రానున్న సంవత్సర కాలంలో తుదముట్టిస్తామనీ హిందుత్వ శక్తులకు ప్రాతినిధ్యం వహించే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కామ్రేడ్‌ దూలాదా లేకపోవడం ఎంతో లోటుగా వుంటుంది. దక్షిణ బస్తర్‌లో పోలీసులు విప్లవోద్యమ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని కొనసాగిస్తున్న ఆకాశదాడుల నుండి ఆయన తృటిలో తప్పుకున్న సందర్భాలు వున్నవి.

2021లో కొరోనా విజృంభించిన సమయంలో, తనకు ఎంతో ప్రియమైన కామ్రేడ్‌ హరిభూషణ్‌తో పాటు కత్తి మోహన్‌ రావు, బుద్రీదీ అమరులైన వేళ, తీవ్ర అనారోగ్య బారిన పడి తీరని వేదనను అనుభవించాడు. ఆ తరువాత ఆయనకు అత్యంత సన్నిహితులలో ఒకరైన కామ్రేడ్‌ సాకేత్‌, దీపక్‌ అమరత్వం, కేంద్ర నాయకుల అరెస్టులు ఆయనను చాలా బాధించాయి. ఆయన కొద్ది సంవత్సరాలుగా బీపీ, మధుమేహం, ఊపరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. అయినప్పటికీ, క్రమం తప్పకుండా హెల్త్‌ కేర్‌లో భాగంగా వ్యాయామం చేయడం, భోజనం, నిద్ర మొదలైన విషయాలలో నియమాలు పాటించడం, 69 ఏళ్ల వయసులో కూడ చురుగ్గా వుండడానికి ఆయన అవలంభించిన పద్ధతులు యువతరానికి ప్రేరణనిస్తాయి.

చివరనే అయినప్పటికీ జీవితంలో ముఖ్యమైన వాటిలో ఒకటిగా చెప్పుకోవలసింది వైవాహిక జీవితం. ఆయన విప్లవం కోసం కుటుంబ నియంత్రణ పాటించాడు. ఆయనతో జీవితాన్ని తొలుత పంచుకున్నది కామ్రేడ్‌ సాధన. కామ్రేడ్‌ ఆనంద్‌ నిర్మల్‌ పట్టణంలో విద్యార్థి ఆర్గనైజర్‌గా బాధ్యతలు కొనసాగించినపుడు పరిచయమైన రాడికల్‌ విద్యార్థిని కామ్రేడ్‌ సాధన. ఆమెతో దాదాపు దశాబ్దన్నర జీవితాన్ని పంచుకున్నాడు. ఆమె 2002లో అనుకుంటా, పోలీసు కాల్పులలో అసువులు బాసింది. ఆ తరువాత మరో ఆరేళ్ల తరువాత అనుకుంటా, ఉద్యమంలోని కామ్రేడ్‌ ఊరేతో వైవాహిక జీవితాన్ని పంచుకున్నాడు. కామ్రేడ్‌ ఊరే ఆయన వెంటే వుంటూ ఆయన రక్షణ, ఆరోగ్యం, ఇతర అవసరాలు తీర్చడంలో భాగంగా ఆయన స్టాఫ్‌కు బాధ్యత వహిస్తుంది. కామ్రేడ్‌ ఆనంద్‌ అమరత్వం ఆమెకు తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తుంది. కానీ, ఆమెకు అపార విప్లవోద్యమ అనుభవం వుంది. ఆమెకు అనేక అమరత్వాల గురించి తెలుసు. కాబట్టి తన సహచరుని అమరత్వాన్ని కూడ పంటి బిగివున గుండెల్లో దాచుకుంటూ ప్రజలలో ఆయన ఆశయాల సాధనకై తుది వరకు పోరాడుతుందనీ పూర్తి విశ్వాసం, నమ్మకం వ్యక్తం చేయడం తప్ప ఈ విషాద క్షణాలలో ఆమెకు అంతకన్నా ఎక్కువగా చేకూర్చే సాంత్వన ఏముంటుంది? ఈ దేశంలో విప్లవోద్యమాన్ని జయప్రదం చేయడమే కాకుండా, ప్రపంచ సోషలిస్టు విప్లవ విజయానికై దివారాత్రులు పాటుపడిన కామ్రేడ్‌ ఆనంద్‌ ఆశయాల పరిపూర్తికై మనం ఉద్యమించాలి. ఈ దేశ పీడిత ప్రజలు, కార్మికులు, రైతులు, విద్యార్థి , యువజనులు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, మత మైనార్టీలు, బుద్ధిజీవులు, కవులు, కళాకారులు, రచయితలు, లౌకికవాదులు, పాత్రికేయులు. జాతుల పోరాట కారులు ఆయన ఆశయాల పరిపూర్తికై పోరాడాలి.

Leave a Reply