(నయా ఉదారవాదం అనే పదం నిజానికి ఒక misnomer – తప్పు సంకేతాన్ని ఇచ్చే పదం. కానీ కొన్ని సామ్రాజ్యవాద విధానాల సమాహారానికి నయా ఉదారవాదం అనే పేరు పడినందుకు మాత్రమే ఆ పదాన్ని ఈ వ్యాసంలో ఉపయోగించాను. సారాంశంలో అది సామ్రాజ్యవాద విధానమే, నయా వలసవాద దోపిడీ పద్ధతే.)
దక్షిణ అమెరికా దేశాలలో పింక్ వెల్లువ తిరుగుబాట్లు, అరబ్ దేశాలలో జరిగిన అరబ్ వసంత తిరుగుబాట్లు, అమెరికా, యూరోప్ దేశాలలో జరిగిన ‘బ్లాక్ లైవ్స్ మాటర్’ ఉద్యమాల తరువాత అంత పెద్ద ఎత్తున ప్రజల తిరుగుబాటు ఎగిసి పడుతున్న దేశం శ్రీలంక. ప్రజల తిరుగుబాటువల్ల తప్పనిసరి పరిస్థితిలో శ్రీలంక ప్రధాన మంత్రి మహేంద్ర రాజపక్ష తన పదవిని ఒదులుకోవలసి వచ్చింది. పారిపోయి ఎక్కడ తలదాచుకున్నాడో తెలియని పరిస్తితి. అధ్యక్షుడైన గొటబయ రాజపక్ష రాజీనామా చేయాలని కనీవినీ ఎరుగని ప్రదర్శనలు, మిలిటెంట్ నిరసనలు కొనసాగుతున్నాయి.
ఒక దశాబ్దం కిందట తమిళ ఈలం ఉద్యమాన్ని అత్యంత క్రూరంగా అణచివేసి సింహళ జాతీయులలో తిరుగులేని పేరు సంపాదించిన రాజపక్ష కుటుంబం (ఎల్‌టిటిఈ ని మట్టుబెట్టినప్పుడు అధ్యక్షుడు మహీంద్ర రాజపక్ష కాగా, అప్పటి సైన్యాధిపతి గొటబయ రాజపక్ష) ఇంత కొద్ది కాలంలోనే ఈ స్థితికి చేరడానికి కారణమేమిటి? శ్రీలంకలో పెట్రోల్, తిండి పదార్థాలు, మందులు ఇతర నిత్యావసర వస్తువులకు ఎన్నడూ లేనంత కొరత ఏర్పడటానికి, ఆ దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి కారణాలేమిటి? శ్రీలంక నేడు చిక్కుకొని ఉన్న రుణ వలయానికి బాధ్యులెవరు?
ఈ కారణాలను పరిశీలించే ముందు ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను ఒకసారి తెలుసుకోవడం అవసరం.
ఎన్నో దశాబ్దాల తరువాత మొదటి సారి మధ్య తరగతి, ఉన్నత మధ్యతరగతి శ్రీలంక ప్రజలు – వైట్ కాలర్ వర్కర్స్, ఐటి రంగంలోని వారు, కళాకారులు, నటులు – ఒక్కరేమిటి, సకల రంగాల వారు రోడ్ల పైకి ఎక్కి గొటబయ గద్దె దిగాలని నినదించారు. కార్మికులు, ఇతర శ్రమ జీవులు వారి ట్రేడ్ యూనియన్లు గతంలో నిరసనలు తెలిపినప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగ జేస్తున్నారని ఈసడించిన వాళ్ళే ఇప్పుడు తాము అదే పనికి ఉపక్రమించారు. కనీవినీ ఎరుగని ద్రవ్యోల్బణం, సరుకుల కొరత అందరి జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. పెట్రోల్ కోసమైతే రోజుల తరబడి క్యూలలో నిలబడాల్సిన పరిస్థితులు. ద్రవ్యోల్బణం ప్రభావం దేశ ప్రజలందరి మీద – రైతులు, బెస్తలు, రోజు కూలీలు, ఉత్పత్తి రంగం లోని కూలీలు, వైట్ కాలర్ ఉద్యోగులు, చిరు-మధ్య తరగతి వ్యాపారస్థులందరి మీద – పడింది. ప్రశ్న-పత్రాలను ముద్రించడానికి కాగితపు కొరత ఉండటంతో 9, 10, 11 తరగతుల స్కూలు పరీక్షలను నిరవధికంగా వాయిదా వేశారు. దానితో 45 లక్షల విద్యార్థులు ప్రభావితమయ్యారు. 1948 లో శ్రీలంక ‘స్వాతంత్ర్యం’ పొందినప్పటి నుండి ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆర్థిక సంక్షోభం ఇది. మొదటి సారి శ్రీలంక విదేశీ రుణ ఎగవేతకు పాల్పడింది. రుణాన్ని చెల్లించడానికి ఒక నెల గడువు పొడిగించినప్పటికీ చెల్లించలేకపోవడంతో రుణ ఎగవేతదారుగా ముద్ర పడింది. శ్రీలంక 5100 కోట్ల డాలర్ల విదేశీ రుణాలు చెల్లించడం అసాధ్యమైనదిగా పరిణమించింది.
ఫిబ్రవరిలో మొత్తం మీద ద్రవ్యోల్బణం 15.1% ఉండగా, ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 25.7% ఉండింది. గత సంవత్సరంతో పోలిస్తే బియ్యం ధర 30% పెరిగింది. తిండి పదార్థాలు కొనలేక ప్రజలు తమ తిండిని తగ్గించుకొని ఆకలితో పస్తులుంటున్నారు.
ఇటువంటి సంక్షోభ కాలాల్లో ఎప్పుడూ జరిగే విధంగానే, కింది వర్గాల వారే అందరికంటే ఎక్కువ అవస్థలకు గురవుతున్నారు. గంటలు, రోజుల తరబడి క్యూలలో నిలబడటం వల్ల రోజువారీ సంపాదన కూడా కోల్పోతున్నారు.
శ్రీలంక ఆర్థిక వ్యవస్థలో విదేశీ వినిమయ రిజర్వులకు ప్రధాన వనరు – తేయాకు, రబ్బరు ఎగుమతులు; విదేశీ పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయం, విదేశాల్లో పని చేసే శ్రీలంక వాసులు పంపే డబ్బు.
శ్రీలంక ఎగుమతులు ఆ దేశ జిడిపి లో 23%. పర్యాటక శాఖ వాటా 19%. శ్రీలంక ప్రధానంగా తేయాకు, రబ్బర్, వస్త్రాలు, కొబ్బెర, సుగంధ ద్రవ్యాల వంటి వస్తువులను ఎగుమతి చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సరుకుల ధరలు పడిపోవడంతో ఎగుమతులు దెబ్బతిన్నాయి. అకస్మాత్తుగా రసాయనిక ఎరువుల వాడకాన్ని నిలిపివేయడంతో ఆ పంటల దిగుబడి కూడా పడిపోయింది.
బియ్యం, గోధుమలు, గోధుమ పిండి, పప్పు ధాన్యాలు, చక్కెర, కాగితం, మందుల వంటి వస్తువులను శ్రీలంక దిగుమతి చేసుకుంటుంది. పెట్రోలియం కోసం వంద శాతం దిగుమతి పైనే ఆధార పడుతుంది. విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో వీటి దిగుమతి తగ్గిపోయింది. వీటిని కొనడానికి తగినన్ని డాలర్లు శ్రీలంక వద్ద లేవు.
దిగుమతులపై ఆధారపడిన శ్రీలంక విదేశీ కరెన్సీ రిజర్వులు కరోనా ప్రభావం వల్ల గణనీయంగా తగ్గిపోయాయి. 2020లో చమురు ధరలు తగ్గినప్పుడు చమురును నిలువ చేసుకోవడానికి తగిన వసతులు సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ వద్ద లేవు. సమీప భవిష్యత్తులో చమురు ధరలు బాగా పెరగబోతున్నాయని సూచనలు ఉన్నా ధరలను నియంత్రణలో ఉంచుకోవడానికి గానీ, రిస్క్ ను తగ్గించుకోవడానికి గానీ ఈ సంస్థ ముందస్తు ఒప్పందాలు (ఫోర్వార్డ్ ట్రేడింగ్) ఏమీ చేసుకోలేదు. విదేశీ మారక నిలువలు తగ్గిపోవడంతో చమురు కొనలేకపోవడం వల్ల, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరువాత చమురు ధరలు విపరీతంగా పెరగడంతో దక్షిణ ఆసియాలో తలసరి వాహనాల సంఖ్య అత్యధికంగా ఉన్న శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ కు తీవ్రమైన కొరత ఏర్పడింది. ప్రభుత్వం ఎటువంటి రేషన్ విధానాన్ని ప్రకటించకపోవడంతో చమురును నిలువ చేసుకోగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు అధికంగా నిలువ చేసుకోవడంతో సామాన్యులకు చమురు అందడం మరింత గగనమైపోయింది. చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. డిసెంబర్-మార్చ్ మధ్యలో పెట్రోల్ ధర 177 శ్రీలంక రూ. నుండి 303 శ్రీలంక రూ. వరకు 71% పెరిగింది. రాజ్యం జోక్యం చేసుకోకుండా, మార్కెట్ ధరలను నిర్ణయించాలనే నయా-ఉదారవాదం విధానంగా పేరు పడిన సామ్రాజ్యవాద పాలసీ ఫలితమే ఇది.
***
గొటబయ రాజపక్షకు చెందిన ‘పొదుజన పెరమున’ పార్టీ 2019 లోనే అత్యధిక మెజారిటీతో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలను, 2020లో పార్లమెంటరీ ఎన్నికలను గెలుచుకుంది. రెండేళ్ళలోనే పరిస్థితులు ఇంతలా దిగజారి పోవడానికి వెనుక, ఈ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాలతో పాటు అంతకు ముందు నుండే కొనసాగుతున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలే కారణం.
గొటబయ కంటే ముందు అధికారంలో ఉన్న మైత్రేయ సిరిసేన ప్రభుత్వం 2016 లో ఐఎంఎఫ్ తో ఒప్పందం చేసుకున్నది. దాని షరతుల ప్రకారం చేపట్టవలసిన ‘పొదుపు చర్యల’ పట్ల, ‘నయా-ఉదారవాద ఆర్థిక విధానాల’ పట్ల, ఆ ప్రభుత్వ అవినీతి పట్ల ప్రజలలో చెలరేగిన వ్యతిరేకత గొటబయ అధికారం లోకి రావడానికి తోడ్పడింది. దానికి జాతీయవాద ప్రచారం/జాతి విద్వేషవాద ప్రచారం కూడా తోడ్పడింది. అవినీతికి వ్యతిరేకంగా ‘బలమైన’ నాయకుడు కావాలనే మధ్య తరగతి ప్రజల కోరిక ఇందుకు తోడయ్యింది. (ఎల్‌టిటిఈ ని అణచివేసిన సేనకు సైన్యాధ్యకుడు గొటబయ కావడం వల్ల ఆయన ఒక బలమైన వ్యక్తి అనే ముద్ర సింహళీయులలో నెలకొంది)
ఏప్రిల్ 19, 2019 ఈస్టర్ పర్వ దినాన శ్రీలంకలో మూడు చర్చిలపై, మూడు హోటళ్లపై ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్ ‘నేషనల్ తవహుజ్జ జమాత్’ చేసిన ఆత్మాహుతి బాంబు దాడులలో 270 మంది మరణించగా, 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి తర్వాత పెరిగిన పర ద్వేష సంస్కృతి కూడా గొటబయ అధికారంలోకి రావడానికి తోడ్పడిన కారణాలలో ఒకటి.
2016లో సిరిసేన ప్రభుత్వం, ఐఎంఎఫ్ తో చేసుకున్న ఒప్పందాన్ని 2019 లో అధికారంలోకి వచ్చిన గొటబయ ప్రభుత్వం నిలిపివేసింది. పన్నులు, వడ్డీ రేట్లను పెంచకుండా ఆపివేసింది. ద్రవ్య వినిమయ రేటును ఫిక్స్ చేసింది. మాంసం, వెన్నతో సహా 367 వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించింది.
అయితే ఈ విధానాల ఫలం పారిశ్రామికీకరణకో, వేతనాల పెంపుదలకో దారితీసేవిధంగా పెట్టుబడిని నియంత్రించే యంత్రాంగం లేకపోవడం వల్ల (అంతకు ముందు వరకు అవలంబించిన ఉదారవాద విధానాలు అటువంటి యంత్రాంగం ఏ పాటి ఉన్నా దానిని బలహీన పరిచాయి), ఉన్న మేరకు కూడా వాటిని వినియోగించే ఇచ్చా శక్తి లేకపోవడం వల్ల, నిజమైన ఆర్థిక కార్యకలాపాలు జరగకపోయినప్పటికీ అది కార్పొరేట్ లాభాలకు, స్టాక్ విలువ పెరగడానికే దారితీసింది.
తక్కువ వడ్డీ రేట్లను, వినిమయ రేటును నిర్ధారించటాన్ని దుర్వినియోగపరుచుకొని దిగుమతిదారులు సరుకులను నిలువ చేసుకోవడానికి, ఎగుమతిదారులు తమ డాలర్లను విదేశాలలో దాచి ఉంచుకోవడానికి ఉపయోగించుకోవడం వల్ల రెండింటికీ కొరత ఏర్పడింది. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యాపారవేత్తలు అవినీతి, లంచాల ద్వారా దిగుమతులపై ఉన్న ఆంక్షలను యధేచ్చగా ఉల్లంఘించి లాభాలు గడించారు.
వ్యవసాయంలో సంక్షోభం:
విదేశీ మారక నిల్వల సంక్షోభం వల్ల శ్రీలంక ప్రభుత్వం ఏప్రిల్ 2021 లో విదేశాల నుండి రసాయనిక ఎరువుల దిగుమతిని నిలిపి వేసి ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించింది. ఇది మంచిదే, దేశ సార్వభౌమత్వానికి, స్వావలంబనకు కూడా ఎంతో తోడ్పడే అంశమే. అయినా ఎటువంటి తయారీ లేకుండా, ఆర్గానిక్ వ్యవసాయానికి అవసరమైన పరిశోధన, విధాన నిర్ణయాలు లేకుండా అకస్మాత్తుగా నిర్ణయించితే జరిగేది కాదది. సోవియట్ యూనియన్ పడిపోయిన తరువాత క్యూబాలో తలెత్తిన ఇంధన, ఎరువుల సంక్షోభం నుండి బయటపడేందుకు సరియైన విధాన నిర్ణయాలు, పరిశోధనల మద్దతుతో ఆ దేశం ఆర్గానిక్ వ్యవసాయానికి మారింది. శ్రీలంకలో ఎటువంటి తయారీ లేని ఈ అకస్మాత్తు నిర్ణయం వల్ల వ్యవసాయ దిగుబడులు పడిపోయాయి. ముఖ్యంగా తేయాకు, రబ్బర్ వంటి ఆహారేతర పంటల ఉత్పాదన, వరి దిగుబడి తగ్గిపోయాయి. ఆర్గానిక్ వ్యవసాయానికి మారడం అనేది ఒక క్రమంలో జరగవలసిన ప్రక్రియ.
అప్పుల ఉచ్చు:
ఈ విదేశీ మారక నిల్వల సంక్షోభానికి చైనా ఇచ్చిన రుణాల కబంధ హస్తం కారణమని పాశ్చాత్య మీడియా, భారత మీడియా ప్రచారం చేస్తున్నది కానీ వాస్తవం అది కాదు. నిజానికి శ్రీలంక విదేశీ రుణాలలో చైనా వాటా 10 శాతం మాత్రమే. శ్రీలంక విదేశీ రుణాలలో పాశ్చాత్య దేశాల బ్యాంకులు, ద్రవ్య సంస్థలు, నిధుల వాటానే 40 శాతం. ఈ రుణాలు ఇంటర్నేషనల్ సావరీన్ బాండ్ల రూపంలో ఉన్నాయి. ఈ బాండ్లలో 70% గత ప్రభుత్వం 2016-2019 మధ్య జారీ చేసినవే.
2017 లో శ్రీలంక ప్రభుత్వం తన ఆదాయంలో 83% రుణాల చెల్లింపుకే వినియోగించింది. ఇందులో పావు వంతు విదేశీ రుణాలకు సంబంధించినదే. 2017లో 2300 కోట్ల డాలర్లుగా ఉన్న విదేశీ రుణాల చెల్లింపులు 2019-22 మధ్య ఏటా 3300 కోట్ల డాలర్ల నుండి 4200 కోట్ల డాలర్లకు పెరిగాయి. వీటిని చెల్లించలేక కొంత అప్పును ఈక్విటీగా మార్చి చెల్లించింది. దాని ఫలితంగా హంబన్ టోటా నౌకాశ్రయాన్ని చైనా కు అప్పజెప్పింది.
కార్పొరేట్ ప్రపంచీకరణ పాలసీల ప్రకారం వివిధ దేశాలలో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో – పెద్ద పెద్ద ఓడ రేవులు, విద్యుత్ కర్మాగారాలు, హై వే లు, రిసార్టులు, విమానాలయాలు వగైరా, వగైరా ల పేరుతో అప్పులు ఇచ్చి అప్పుల ఉచ్చులో చిక్కుకునేలా చేసి తమకు అనుకూలమైన ఆర్థిక విధానాలను బలవంతంగా ఆ దేశాల పై రుద్దడం ఈ రుణ సంక్షోభాలకు కారణం.
కోవిడ్ కారణంగా శ్రీలంక పర్యాటక పరిశ్రమ, దాని ద్వారా వచ్చే ఆదాయం బాగా దెబ్బ తిన్నాయి. శ్రీలంక జిడిపి లో పర్యటనా రంగం వాటా 2000 లో 6% ఉండగా 2019 వరకు అది 19.6% కు పెరిగింది. 2019 ఈస్టర్ బాంబు దాడుల తరువాత 70% తగ్గిపోయిన పర్యాటకుల సంఖ్య, కరోనాతో మొత్తంగానే కుప్ప కూలిపోయింది. కరోనా కారణంగా పర్యాటక విభాగం నుండి వచ్చే ఆదాయమే కాక విదేశాల్లో పనిచేసే వాళ్ళు దేశానికి పంపించే డబ్బు కూడా గణనీయంగా పడిపోయింది. దీనితో విదేశీ మారక నిల్వలు రెండేళ్లలో 70% పడిపోయాయి.
దాంతో ఆర్థిక ‘సంస్కరణలు’ మొదలు పెట్టిన నాటికంటే శ్రీలంక ఎక్కువ రుణగ్రస్తమైంది. అప్పు-జిడిపి నిష్పత్తి పెరిగిపోయింది.
ఇప్పుడు సావరీన్ బాండ్లను కొని ఉన్న బ్లాక్ రాక్, ఆష్మోర్ గ్రూప్ వంటివి శ్రీలంక రుణాన్ని పునర్వవస్థీకరించడం కోసం ప్రయత్నిస్తామని ప్రకటించాయి. అంటే, ప్రభుత్వ ఆస్తులు మరోసారి కారు చౌకగా ప్రైవేటు హస్తాలలోకి వెళ్లిపోతాయి.
ఈ రుణ ఉచ్చు నుండి బయట పడటానికి ఐఎంఎఫ్ వంటి ప్రపంచ ద్రవ్య సంస్థలను ఆశ్రయిస్తే అవి సంక్షేమ చర్యలను తగ్గించుకొమ్మని, పబ్లిక్ ఆస్తులను ప్రైవేటుగా అమ్మివేయమని ఇచ్చే సలహాలను పాటించవలసి ఉంది. దీని వల్ల మళ్ళీ దళారీ పెట్టుబడిదారులకు, బహుళ జాతి సంస్థలకు లాభాలు, శ్రమజీవులకు కష్ట, నష్టాలు పెరగటమే ఉంటుంది.
‘నయా ఉదారవాదం’ పేరుతో వచ్చిన సామ్రాజ్యవాద విధానాలు:
నిజానికి శ్రీలంకలో కొద్ది కాలం కిందటి వరకు ఎన్నో మానవాభివృద్ధి సూచకాంకాలలో మన దేశం కంటే మెరుగైన స్థితిలో ఉంది. ఉదాహరణకు: మన దేశంలో సగటు జీవిత కాలం 70 ఏళ్ళు కాగా, శ్రీలంకలో అది 78 ఏళ్ళు; ప్రసవ సమయంలో మరణాల సంఖ్య రెండు దేశాలలో 145, 36; అక్షరాస్యతా శాతం 74.4%, 91.9%; తలసరి జిడిపి 7,200$, 12,900$; శిశు మరణాల సంఖ్య 35.4, 7.8. అటువంటిది అది ఈరోజు కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. దీనికి కారణం పాశ్చాత్య ద్రవ్య సంస్థలు ‘నయా-ఉదారవాదం’ పేరుతో విధించిన విధానాలే. (దీర్ఘ కాలిక దృష్టితో చూస్తే సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానాలు ఉన్నంత కాలం ఈ సంక్షోభాలు తప్పవు) ఈ ‘నయా ఉదారవాద విధానం’లో ‘అప్పు చేసి పప్పు కూడు’ తినడం అన్న చందంగా విదేశీ ద్రవ్య సంస్థల అప్పులతో తలకు మించిన భారమైన భారీ ప్రాజెక్టులను చేపట్టడం ఒక అనివార్యమైన భాగం. మొదట ఇది ఆకర్షణీయంగా, కొనసాగించగలడానికి సాధ్యమైనదిగానే కనిపిస్తుంది. ఎంత అప్పు దగ్గర ఆగిపోవడం అనేదానికి ఏ నియమం ఉండదు. ఎటువంటి ప్రభుత్వమైనా తన ఇతర ప్రయోజనాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు కొన్ని ‘జనాకర్శక పథకాలను’ ప్రవేశపెట్టవలసిందే. వీటిని చూపించి కొందరు ఆర్థికవేత్తలు అది ‘దుబారా’ అంటారు, కానీ ఆ ‘దుబారా’ లేకుండా మొత్తంగా పెట్టుబడిదారులకూ, మధ్యతరగతికి మాత్రమే లాభకరమైన విధానాలను అనుసరించడం సైనిక ప్రభుత్వాలకైనా ఎల్లకాలం సాధ్యం కాదు.
అటువంటి సమయంలో, చాలా చిన్నపాటి రుణ చెల్లింపుల సంక్షోభం వచ్చినప్పుడు దాని నుండి బయటపడటం కష్టం కాదనిపిస్తుంది. కానీ అది కొంత దీర్ఘ కాలం కొనసాగినప్పుడు ఆ రుణాలను చెల్లించడానికే మరింత కఠినమైన నిబంధనలతో కొత్త రుణాలను తీసుకోవలసి వస్తుంది. ఇదే అప్పుల ఉచ్చులోకి దారి తీస్తుంది.
నయా ఉదారవాద విధానాల్లో అనివార్యంగా ప్రత్యక్ష పన్నులను (కార్పొరేట్ టాక్స్, ఆదాయ పన్ను వంటివి) తగ్గించడం వంటి చర్యలను శ్రీలంకలో కూడా అనుసరించడం వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గింది. రెండున్నర దశాబ్దాల పాటు ఆధిపత్య జాతి విధానంతో తమిళులపై, తమిళ ఈలం ఉద్యమం పై చేసిన యుద్ధానికి కావలసిన ఆయుధ సామాగ్రికై, ఇతర సైనిక ఖర్చులపై శ్రీలంక ప్రభుత్వం వందల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థపై ఇది వేసిన దీర్ఘకాల ఫలితాలను కూడా తక్కువ చేయడానికి వీలు లేదు.
ముగింపుగా చెప్పాలంటే శ్రీలంక ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభానికి కారణం అది ఆధిపత్యవాదంతో, జాతి దురహంకారంతో శ్రీలంక తమిళులపై రెండున్నర దశాబ్దాల పాటు చేసిన యుద్ధ భారం, అది ‘నయా-ఉదారవాదం’ పేరుతో అవలంబించిన సామ్రాజ్యవాద అనుకూల ఆర్థిక విధానాలు. అందులో భాగంగా శ్రీలంకను ప్రధానంగా వ్యవసాయ దేశంగా మాత్రమే ఉంచి, ఇతర వస్తువులన్నింటికీ దిగుమతులపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థగా అక్కడి దళారీ పాలకులు, సామ్రాజ్యవాదులు అనుసరించిన ఆర్థిక విధానాలు.
చివరిగా రాజకీయంగా అక్కడి మధ్య తరగతి, ఉన్నత తరగతి ప్రజల రాజకీయ వైఖరులను కూడా కొంత చర్చించి ఈ వ్యాసాన్ని ముగిద్దాం.
రాజకీయనాయకుల అవినీతి, లంచగొండితనాలతో విసిగిపోయిన మధ్యతరగతి ప్రజలు మొత్తం రాజకీయాల పట్లనే ఒక అవిశ్వాసాన్ని/ఏవగింపును పెంచుకొని రాజకీయాలకు దూరంగా జరిగారు. గొటబయ అధికారంలోకి రావడానికి అతను రాజకీయాల నుండి వచ్చిన వాడు కాకపోవడంతో మధ్య తరగతి ప్రజలకు అతనిపై ఒక విశ్వాసం ఉండింది.
మహిళల హక్కుల గురించి, ఎల్‌జిబిటిక్యూ హక్కుల గురించి, మైనారిటీ హక్కుల గురించి ప్రగతిశీల ఉద్యమాలు చేసిన/చేస్తున్న మధ్య తరగతి ఉద్యమకారులకు కూడా ప్రత్యామ్నాయ రాజకీయ దృక్పథం కొరవడడం వలన, అటువంటి దృక్పథాన్ని కలిగి ఉండడమే ఆధిపత్య రాజకీయాలకు మరో రూపం అనే అరాచక దృక్పథం ఉండటం వల్ల కూడా అవి ‘నయా ఉదారవాద’ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయం కాలేకపోయాయి. ఇటువంటి వారిని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి సులభంగా పరోక్షంగా తన సిద్ధాంత పరిధిలోకి లాక్కొనగలదు. శ్రీలంక లోనైనా, అటువంటి సంక్షోభ సమయాల్లో ఏ దేశంలోనైనా ఈ ప్రమాదం పట్ల అప్రమత్తంగా ఉండాలి.
70వ దశకంలోనూ, 80వ దశకం తొలి అర్ధ భాగంలోనూ శ్రీలంకలో ఇతర లెఫ్టిస్ట్, మార్క్సిస్ట్ పార్టీలకు భిన్నంగా జనతా విముక్తి పెరమున అనే మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీ సాయుధ తిరుగుబాటు కూడా చేసింది. కానీ, ఆ ఉద్యమానికి జాతుల స్వయంనిర్ణాయాధికారం పట్ల మార్క్సిస్టు దృక్పథం కొరవడటం వల్ల ఆధిపత్య జాత్యహంకారానికిలోనై తమిళ ఈలంకు వ్యతిరేకంగా పోరాడి పాలకవర్గ పక్షంలో చేరి పోయింది. మళ్ళీ ఒకసారి అక్కడ మార్క్సిస్ట్ దృక్పథంతో, ప్రత్యామ్నాయ ప్రాపంచిక దృక్పథంతో ద్రవ్య పెట్టుబడి కబంధ హస్తాల నుండి అంటే సామ్రాజ్యవాదం నుండి శాశ్వతంగా బయటపడటానికి ఉద్యమిస్తే తప్ప విముక్తి లేదు.
శ్రీలంకలో అవలంబించిన, అవలంబిస్తున్న ఆర్థిక విధానాలనే తరతమ భేదాలతో మన దేశంలో కేంద్ర స్థాయి లోనూ, వివిధ రాష్ట్రాలు కూడా అవలంబిస్తున్నాయి. స్థాయిలలో ఎన్ని తేడాలున్నప్పటికీ, సారాంశంలో ఒకటే. వాటి దుష్ఫలితాలపై ప్రజలు పోరాడకుండా ఉండటానికి మన దేశంలో కూడా గుడ్డి దేశ భక్తి పేరుతో, సనాతన సంస్కృతి పేరుతో మత విద్వేషాన్నీ, మత దురహంకారాన్నీ, పాకిస్తాన్, చైనా విద్వేషాలనూ రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే అటువంటి పద్ధతులు ఎల్లకాలం కొనసాగవనడానికి శ్రీలంక పరిణామాలే సాక్ష్యం. అయితే స్వయంస్ఫూర్తితో అట్లా వెల్లువెత్తే ఏ పోరాటమైనా దిశావిహీనంగా ఉండకుండా ప్రగతిశీల, విప్లవ శక్తులు సన్నద్ధంగా ఉండాలి.