రాప్తాడు గోపాలకృష్ణ

 నాన్నా కతచెప్పవూ , కథ రాప్తాడు గోపాల కృష్ణ ది.అతడుబయలుదేరాడు , కథా సంపుటి లోది.ఈ కథ నిద్ర పోవడానికి రాత్రుళ్లు కథలడిగే పిల్లవాడి కోరిక.బిడ్డడిని నిద్రపుచ్చడానికి ఒక తండ్రి తలకెత్తుకునే బాధ్యత.అంతకుమునుపే నిద్రపుచ్చడానికి యెన్నో కథలు చెప్పాక , నిద్రపుచ్చడంలో విఫలమయ్యాక , ఆఖరుగా యీ కథ చెబుతున్నట్టూ , దీని తర్వాత యిక కథలడక్కుండా నిద్రపోయితీరాలనే ఒప్పందంతో యీ కథను బయటికి తీసాడు, యీకథలోని తండ్రి.ఆమేరకు యిది కథలోని కథ.ఈకథ చెప్పడంలో తండ్రి కి ఒక లక్ష్యం వుంది.అలాగే యీ కథలల్లుతున్న కథకుడికీ లక్ష్యముంది.అది రెండంచుల కత్తిలాంటి లక్ష్యం.ఆ కథలోని కొడుకును నిద్రపుచ్చడమనేది , కథలోని తండ్రి వ్యూహమే కావచ్చు గానీ , నిద్రపుచ్చేకథలోనైనా సరే కొడుకులకు యేం నేర్పించాలో , యే విలువలను లోపలికి యింకించాలో కథకుడికి ఖచ్చితమైన అభిప్రాయం వుంది.

అనాథ అయిన హన్ కు అన్నీ కష్టాలే.ఒక చెప్పుల షాప్లో పని చసేవాడు.యజమాని భార్య తిట్టేది కొట్టేదీ, తిండి పట్టేది కాదు.ఒకరోజు రాత్రి హన్ , ఎవరైనా తనను తీసుకెళ్లి యే పనీ చెప్పకుండా బువ్వపెట్టి బొమ్మలు కొనిస్తే ఎంత బాగుంటుందో , అనుకుంటూ ఏడుస్తూనే నిద్రపోతాడు.కలలో ఒక తాత కన్పించి , ఒక మాజిక్ పెయింటింగ్ బ్రష్ యిచ్చి , నీకు కావాల్సింది గీసుకో నిజమైపోతుంది.దాంతో హాయిగా బతుకు.పేదలకూ కష్టాల్లో వుండేవారికే , నీ చేతులతో మాత్రమే దీన్ని వుపయోగించు , అని మాయమవుతాడు.ఉదయం లేచి చూస్తే హన్ పక్కనే బ్రష్ వుంది.ఆ బ్రష్ తో అమ్మ నీ నాన్ననీ ఒకింటినీ గీసి నిజం చేసుకుంటాడు హన్.ఇక అప్పట్నుంచీ ఆకలితో వుండేవారికి ఏం కావాలో అన్నీ యిస్తాడు. బాల కార్మికులై చదువుకోలేకపోతున్న  పిల్లల కోసం స్కూలూ , కొట్టకుండా పాటాలు చెప్పే టీచర్లూ, యింకా కావాల్సినవన్నీ చేసిచ్చాడు.దాంతో,ధనవంతులూ యజమానులూ హన్ ను కొట్టడానికొచ్చారు.పేదలు ఏకమై వారిని తరిమేశారు. తర్వాత రోజు యజమానులతో పాటు పోలీసులొచ్చారు, హన్ మాజిక్ బ్రష్ ను గుంజుకొని తుంచేశారు.హన్ ను కాల్చిపారేశారు.

కథ వింటున్న పిల్లవాడు ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే, ఆ కన్నీళ్లు తండ్రి గుండెల్లోకి యింకుతుంటే, కొడుకులో తడి వున్నందుకు తండ్రి గర్వపడతాడు.కొడుకును డాక్టరు గానో ఇంజెనీర్ గానో కాకుండా ఒక తడివున్న మనిషిగా పెంచాలనుకున్న తన నిర్ణయం పట్ల సంతృప్తి పొందుతాడు.

కథ చెప్పిన తండ్రి లక్ష్యం నెరవేరింది.కథకుడి కథా ప్రయోజనం కూడా నెరవేరింది.ఈ కథలో యింకో కోణముంది.ఏ కథకైనా వుంటుంది.అదే పాఠకుల కోణం.కథలు ఎందుకు చదువుతాం అనే ప్రశ్న వేసుకునేవారికీ, కథకు ప్రయోజనం వుండితీరాలని నమ్మేవారికీ హత్తుకునే కథ యిది.కథలోని పిల్లవాడు కథ విన్నాక వ్యక్తీకరించే విలువలే, కథ చదివిన పాఠకులకూ అలవరుచుకుంటారు.

ఈ కథలో మనల్ని సమ్మోహపరిచే విషయం, కథలో రచయిత వాడిన శిల్పం.అది కథా శీర్షికతో మొదలుపెట్టి,ప్రారంభ వాక్యంతో ఆకట్టుకొని, కథనడకలో మాజిక్ రియలిజాన్ని వాడడం ద్వారా  బలపడింది.ఒక సోషలిస్టు కలను అందరికీ అర్థమయ్యేలా చెప్పడమే కాదు దాని సాధనలో ఎదురయ్యే అవస్థలూ ఎరుక పరిచింది.

కథలోని తండ్రి కి కొడుక్కు అందమైన కలనివ్వాలనుంది.గొప్ప విలువలను నేర్పించాలనుంది.రచయితకేమో పాఠకులకు సోషలిస్టు వ్యవస్థను అర్థం చేయించాలనుంది,అదీ ఒక చిన్న పిల్లవాడి దృష్టి కోణంలో సోషలిస్టు వ్యవస్థను అర్థం చేయించాల. ఇంత పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి రచయిత వాడిన టెక్నిక్ , మాజిక్ పెయింటింగ్ బ్రష్.పిల్లవాడి చేతిలో యీ బ్రష్ , యీ దుర్మార్గ ప్రపంచంలోని లోట్లను పూరించాలని చూస్తుంది.అవన్నీ పరిపూర్తి అయితే దుర్మార్గం వూరకే వుండదు కదా.బ్రష్ ను విరిచిపారేస్తుంది.అలాంటి వుదాత్తమైన పనులు చేసేవారిని కాల్చిపారేస్తుంది.ఈ మొత్తం కథనం కథ వింటున్న పిల్లవాడు, కథలోని పిల్లవాడితో తాదాత్మ్యం సాధిస్తుంది.చదివే పాఠకులను ఆ పిల్లవాడితో ఐక్యత చేయిస్తుంది.మంచి కథ చదివిన అనుభూతి మిగిలిపోతుంది.
అట్లా,నాన్నా కథ చెప్పవూ,కథ మంచి కథగా మారింది.

Leave a Reply