వస్తూ వస్తూ
నీ ఇంటి బయట ఓ చెట్టు నాటి వచ్చాను
నాది కాకపోయినా
ఏదో ఒక నీడ నీకుండాలని
*
పని నీ కోసమే
చేస్తున్న వాడిని
పనిలోపడి నన్ను
మరిచిపోకు అంటావు
**
బతుకు తరిమితే
వలస వచ్చాను
ప్రేమ పిలిస్తే
తిరిగి వెళ్ళిపోతాను
*
చెమట చుక్క నుదుటి నుండి
టప్పున జారిపడినప్పుడంతా
నీ గుండె
ముక్కలైందేమో అని భయపడతాను
*
ఎలా నిజం అవుతాయి
స్వప్నాలు
దిండు కింద పడి
నలిగిపోతుంటే
*
పర్లేదు ఖాళిగానే
ముగిసిపోని రాత్రుళ్ళు
నీ ఇంటిపని తగ్గిపోయే
వరకూ
*
అందం గురించి
దిగులుపడకు
నీ లావణ్యం కరిగిపోయింది
నావల్లే!
**
ఎందుకంత నా హృదయోల్లాసాన్ని
కోరుకుంటావు
బండ బారిపోయిందేదీ
ప్రేమ కురిపించదు
***
పైకి ధైర్యం నటిస్తా గానీ
నువ్వంటే
చాలా భయం నాకు
భరిస్తున్నావు కదా
**
అన్ని సంబంధాలనీ
అందరూ మనలో వెతుకుతారు
గానీ
ప్రేమని కాకపోవడం విషాదం
*
ఇంత దాకా
కలిసినడిచిన వాళ్ళం
కడదాకా
తోడుండలేమా?
*
బహిరంగమైపోయింది
కదా
మన మధ్య ఉన్నది
ప్రేమే!
*
6.11.23
Related