నా కవితా ప్రస్థానం వలసలో మొదలైంది. అప్పటి వరకూ అంటే 1993 నాటకి నా ఇరవై మూడేళ్ళ జీవితంలో సీరియస్ సాహిత్యం తో పరిచయం తక్కువ. కొంత శ్రీశ్రీ, కొంత తిలక్, కొంత ఠాగూర్ గీతాంజలి తప్ప కవిత్వం అంటే సినిమా సాహిత్యం గా పరిగణించేవాణ్ణి. మా తెలుగు మాస్టార్లు పలికించిన పద్యాల ప్రతిపదార్థాలు కూడా బట్టీయం వేసినవే కానీ సిరీయస్ గా చదివినవి కావు. కాకపోతే హిందీ పాటలు ( చాలామందికి తెలియదు కానీ అందులో ఉర్దూ భాషే ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ముస్లీం ఉర్దూ కవుల ప్రభావం) వినేవారికి ఎంతో కొంత కవిత్వం లోపలికి ప్రవేశిస్తుంది. షకీల్, హస్రత్, కైఫీ, గుల్జార్ ఇలా అనేకుల పాటలు వినని రోజు లేదు. అలా లోపల పాటల తోటలా ఉండేది అంతరంగం. అలా కవిత్వం రాగ దాహంగా లోనికి ఇంకింది.
             
1993 లో బతుకు తెరువు కోసం కొన్నాళ్ళు సౌది అరేబియా వెళ్ళాల్సి వచ్చింది. అదొక బలవంతపు వలస. ఊపిరిసలపని పని. ఊపిరాడనివ్వని వాతావరణం. మనశ్శాంతి కోసం అక్కడ కొన్న మొదటి వస్తువు వాకమెన్. రూంకొచ్చాక పాటలు వినడం. నిదురపోవడం. అప్పటికే  దేశంలో బాబ్రీ వివాదం రాజుకొని ఉంది. అది కూలదు అనే నమ్మకం ఒకవైపు, హిందూ ముస్లీంల మధ్య నిలబెట్టబడుతున్న గోడలు ఒక వైపు కలవర పెట్టటంతో నిదురలేని రాత్రులని చవిచూడాల్సి వచ్చింది. అప్పటి నా స్నేహితులంతా పరమతస్థులు. వాళ్ళ స్నేహం బీటలు వారుతుందేమో అనే భయం ఒక పక్క మత సామరస్యం నరనరాన జీర్ణించుకుపోయిన జీవనవిధానం ఒక పక్కన ఇదో అంతఃసంఘర్షణ. ఐదు పూటల నమాజులో దువా చేస్తే అల్లా కరుణకు పాత్రులయ్యే పేర్లలో సగం పేర్లు హిందువులవే! చివరికి కూలిన ఆ నమ్మకాన్ని నిలబెట్టగలిగే మార్గం ఆనాడు తెలియదు. అభద్రతలోంచి పరమత సహనం కొరుతూ కొన్ని కవితలు రాయడం తప్ప. నాన్న కాంగ్రేస్ వాది. అవే ముస్లీంల రాజకీయాలు. కళ్ళు మూసుకొని హస్తం గుర్తుకు ఓటేసేలా అందాక ట్యూన్ చేసి ఉన్నారు. దానికి ఇందిరాగాంధి కారణమేమో? బాబ్రీ కూలడాన్ని కాంగ్రేసు ప్రభుత్వం కళ్ళప్పగించి చూశాక ఆ రాజకీయాల నుంచి దూరం కావడం అనివార్యమైతే ముస్లీం కో ప్రత్యామ్నాయం లేకపోవడం ముస్లీంలకో నాయకత్వం లేకపోవడం ఈ దేశంలో ముస్లిం ల వెనుకబాటుకొక గుర్తు. ఈ పరిణామాల మధ్య ప్రగతిశీల ఆలోచనలున్న చాలా మంది ముస్లీంలను కలవరపెట్టింది అందులోంచే కదా ఖాదర్ పుట్టుమచ్చ పుట్టుకొచ్చింది. ఆ వెతుకులాట ఒక్కొక్కర్ని ఒక్ఖోవైపు కు నెట్టింది. నన్నూ, బాషాను మార్క్సిజం వైపుకు నెట్టిన సందర్భంలోంచి నా కవిత్వం పుట్టుకొచ్చింది.
           

మా నాయన మా అమ్మ ఇద్దరూ మనుషులను ప్రేమించడం చిన్నప్పట్నించే అలవాటు చేసిందానికి గుర్తుగా నా చుట్టూ మనుషులుండేవారు. శత్రువులను చూసెరుగను. మా ఇంటి నిండా జనం ఉండేవాళ్ళు. అమ్మ అల్లారఖా అనబడే ఇమాం కూతురాయే! అలా తాత సంపాదించిన స్వఛ్ఛమైన గౌరవం ఇంటి నిండా మనుషుల పరిమళం వెదజల్లింది. ముస్లీంలుగా ఉండడం, కొందరు శుక్రవారం రోజు ( ఆ కాలంలో చాలా మంది ముసల్మానులకు రంజాన్ లోనే నమాజు గుర్తొచ్చేది) నమాజు చదవడం తప్ప ఇంకే ఇస్లామీయ జీవనతత్వం తగలని కష్టజీవులే అంతా. బతుకుపోరాటంలో నిమగ్నమైన వారికి ఐదుపూటల నమాజు ఎలా గుర్తుకొస్తుంది.? ఇలాంటి వాతావరణంలో పెరిగినవాడికి తెలుగు కవిత్వంతో సహవాసం కొంత ఆశ్చర్యకరంగానే ఉంటుంది. నాతో చదువుకొన్న మిత్రుల్లో చాలా మందికి నేను కవినని తెలిసే అవకాశం లేదు. నా రాజకీయ దృక్ఫధం కూడా తెలిసే అవకాశం లేదు. చదువులో పెద్ద శిఖరాలు ఎక్కని వాడి గురించీ లేదా సంపాదించడం చేతకాని వాడి గురించి ప్రపంచం పెద్దగా పట్టించుకోదు. నిజానికి నా దగ్గరి మిత్రులంతా బాగా చదువుకొని పెద్ద ఉద్యోగాల్లో కుదురుకొని నాతో దూరం అయ్యారు. ఇప్పటి నా మిత్రులు రాజకీయ దృక్ఫధం వల్ల మిత్రులయ్యారు. ఇదొక ఐరనీ. వాళ్ళతో పంచుకున్న జ్ఞాపకాలూ అనుభవాల పాత్ర నా జీవితం మీద తక్కువేమీ కాదు. కానీ ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు ఆ సంబంధాలు ఉపయోగపడలేదు.

ఇప్పటి మిత్రుల సాంగత్యం అది 1993 బాబ్రీ విధ్వంసం తర్వాత మొదలైంది. అప్పటికే పివి సరళీకరణలు సగటు మనిషికి జీవనవిధ్వంసాన్ని కళ్ళ ముందు నిలపడం ఆరంభించాయి. అతని పాలసీలే ప్రైవేటికరణ ప్రపంచీకరణని మన లోగిళ్ళలోకి వచ్చి చేరాయి. ఇక్కడే నేనెవర్నీ అనే రాజకీయ ప్రశ్న నాలో మార్పుకి కారణమైంది. యాదృచ్ఛికమైన చారిత్రక అవసరమో తెలియదు కానీ నాలాంటి సగటు ముస్లీంలకి రాజకీయ భూమిక లేదా డయాస్ ఒకటి అవసరమైంది. చుట్టూ చూసుకున్నపుడు అప్పటికి కొంత విభిన్నంగా కనబడింది మిత్రజ్యోతి సాహితీసాంస్కృతిక సంస్థ. ఎంతో కొంత సాహిత్యంతో పరిచయం ఉన్న నాకు ఆధునిక సాహిత్య సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్ళే ఉద్దేశ్యంతో ఏర్పాటైన మిత్రజ్యోతితో బంధం బలపడడం అనివార్యమైంది. అక్కడా తిరిగి ఘర్షణే!

మిత్రజ్యోతిలో యువకులు నిర్వహిస్తున్న కార్యక్రమాలు అప్పటి సిపిఐ ఎపిసీఎల్సీ వంటి ప్రజాసంఘాలను ఆకట్టుకుంది. వారితో పరిచయం ఏర్పడింది. మిత్రజ్యోతిని కొన్ని పరిమితుల్లోనే నడపాలనీ ఎటువంటి రాజకీయ వాసన తగలకూడదని నమ్మే మిత్రులు సంస్థ నుంచి దూరమయ్యారు. ఇదే సందర్భంలో మిత్రజ్యోతి విరసంకు దగ్గరైంది. నేనూ మిత్రజ్యోతి వ్యవస్థాపక సభ్యుడు బాషా, ఖలందర్  ఇంకా ఒకరిద్దరు కలిసి సంస్థను నడపే ప్రయత్నం చేశాం. సంస్థకి వర్గదృక్ఫధం అలవడింది. మార్క్సిస్టు ధోరణి వచ్చిచేరింది. పౌరహక్కుల కోణం అదనం. వీటన్నింటి ప్రభావం నా మీద బాషా మీద ఎక్కువగా పడింది. మాకు స్పష్టమైన రాజకీయాలు అలవడడానకి విరసంతో స్నేహం దోహద పడింది. ఇది వ్యక్తిగతంగా నాకు గొప్ప మేలు చేసింది. ఒక ముస్లింగా పుట్టిన నేను మారడానికి అవసరమైన జీవిత అనుభవాలు, ఇంకా చెప్పాలంటే సాహిత్యం ప్రపంచాన్ని చూసే దృష్టిని మారుస్తుంది అని చెప్పడానికి నేనే ఉదాహరణ. అక్కడి నుండి నేను కవిత్వం రాయడానికి అలవాటం పడ్డాను.

ప్రపంచీకరణ, హైందవీకరణ, దానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రజాప్రతిఘటనలు, ప్రజాస్వామిక ఆకాంక్షలు బలంగా నా కవిత్వంపై ప్రభావం చూపాయి. ఇదే నేపధ్యం రాయలసీమ కరువు, వలసలు వానలేమిని చూస్తూ చలించకుండా ఉండగలనా రాయలసీమ వాడిగా? రాయలసీమ ప్రత్యేక పరిస్థితులు ఇప్పటికీ ఒక విధ్వఃసకర బతుకుచిత్రాన్ని ముందుంచుతున్నాయి. కవిత్వంలో రాయలసీమ బతుకు పోరాటాల్నీ, వలస చిత్రాన్నీ, ప్రాకృతిక రాజకీయార్థిక మార్పులతో నడుస్తూ చిత్రిక పట్టే ప్రయత్నమూ జరుగుతోంది. అందులో చంద్రునికి నూలు పోగు అన్నట్టు నావి కొన్ని అక్షరాలు కవిత్వాన్ని ఒలికించాయి. మొత్తంగానే ఈ నేపధ్యాల మధ్య నన్ను నేను నిలబట్టుకొని ఉన్నాననీ, సంస్కరించుకుంటూ ఉన్నాననీ నా కవిత్వంలో విప్లవం, రాయలసీమ అస్థిత్వం, ప్రేమ, పాయలుగా నా పద్యాల్ని పాడుకుంటూనే ముస్లీంగా పుట్టినందుకు ఆ సమూహం ఇవాళ తనను తాను వ్యక్తీకరించుకుంటున్న స్థలకాలంలో నేనూ నిలబడి ఇస్తున్న ఒక నినాదం నా కవిత్వం. అదే నన్ను మనిషిగా నిలబెడుతూ ఉంది.

Leave a Reply