నిత్యం జ్వలిస్తూ, సృజిస్తూ
గుంటూరు నుండి ప్రారంభమైన
నీ విప్లవ ప్రస్తానం!

కృష్టమ్మ అలల హోరులో
శతృ కిరాయి బలగాల పహారాలలో
నల్లమల్ల చెంచు ప్రజల జీవితాలలో
నిండు పున్నమి వెన్నెల వెలుగువై
పీడిత ప్రజలకు ఆత్మీయ కర స్పర్శవై
ఆంధ్ర-తెలంగాణా మైదానాల్లో
వర్గ పోరాటాల జ్వాలలను
నిత్యం జ్వలింపజేసిన
వీర యోధుడా!

నిరంకుశ దళారీ పాలకవర్గాల
ఫాసిస్టు అణచివేతకు
అలిపిరి లాంటి విస్ఫోటనంలో
పాలకవర్గాల గుండెల్లో గుబులు పుట్టించిన
బుద్ది చెప్పిన సాహసానికి సంకేతమా!

శాంతి చర్చలంటూ
ప్రజలను మోసం చేసే
దోపిడీ వర్గాల ఎత్తుల జిత్తులను
పార్టీ ప్రతినిధిగా చర్చలకు వెళ్ళి
రాజ్యం వర్గ స్వభావాన్ని
చర్చలంటూ మోసగించే
విప్లవోద్యమం అణిచివేతకు
దుష్ట కుట్రలను చీల్చి చెండాడి
ప్రజల ముందు ప్రతిభావంతంగా
విప్లవ స్వరాన్ని దృఢంగా
ప్రజాయుద్ధపు పంథాను ఎత్తిపట్టి
దళారీ పాలకవర్గాల ఎత్తుల జిత్తులను
చిత్తు జేసిన పార్టీ నాయకుడిగా
చారిత్రక ఘటనకు సాక్షిగా
తెలుగు పీడిత ప్రజల హృదయాలలో
పోరాట చైతన్యంగా నిలిచిపోయిన దృవతారా!

తూర్పు కనుమలలో ఎర్రని సూర్యునివై
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో
కువ్వి, భగత, కోయ గూడాలలో
ఆదివాసుల ఆత్మీయ బందువై
కార్పోరేట్‌ వికాస్‌ మాకొద్దు
ప్రకృతి వనరులకు, పర్యావరణ రక్షణకు
బాక్సైట్‌ గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా
సమరశీల పోరాటాల జ్వాలల్లో
నిత్యం వెలుగు జిమ్ముతూ

ఆదివాసీ ప్రజల ఆకాంక్షల స్వప్నానికై
పసిపాపల కల్మషంలేని నవ్వుల జల్లువై
నిత్యం నిండు పున్నమి వెన్నెలలా
ప్రజా యుద్ధానికి వెలుగునిస్తూ
మార్గదర్శకుడిగా సదా నిలిచి ఉన్నవాడా!

నీ గంబీరవదనం, దూరదృష్టితో
ప్రజలలో కేడర్‌లలో మమేకమై
రామగూడ లాంటి భారీ నష్టాల నడుమ
ఎందరో ప్రియమైన సహచరులు నేలకొరిగినా
నిండు హృదయంతో, హుందాగా
వర్గ చైతన్యంతో ఉద్యమం
ఎగుడు-దిగుళ్ళ గతిశీలతను
కేడర్‌కు బోధపరుచుతూ
ముందుకు నడిపిన విప్లవ సారధుడా!

నీ త్యాగం, అమరత్వం వృధా కాదు
అమరుల ఆశయాల పూర్తికై
ప్రజా విముక్తి గెరిల్లాలు
నేల నాలుగు చెరుగులా కవాతు చేస్తూ
ప్రజా యుద్ధపు విజయం సాధిస్తారు!

(భారత విప్లవోద్యమ నాయకుడు, పీడిత ప్రజల ప్రియతమ నేత కామ్రేడ్‌ ఆర్కే -+స్మతిలో… అక్షరాంజలి)

One thought on “నిండు పున్నమి వెన్నెల వెలుగువై…

Leave a Reply