పాణి

          రామ్మోహన్‌ సార్‌కు ఆరోగ్యం బాగోలేదని, ఆయన కోసం పుస్తకం తీసుకరావాలనుకొని రాఘవాచారిగారు వ్యాసం రాయమన్నారు.  తనతో కలిసి జీవిస్తున్న వారు తన గురించి ఏమనుకుంటున్నదీ, ఈ   ప్రపంచ కల్లోలాలపై  వేర్వేరు సందర్భాల్లో ఆయన చేసిన విశ్లేషణల్లో ఏమున్నదీ ఒక చోటికి చేర్చి రామ్మోహన్‌సారుకు అందించాలని పాలమూరు అధ్యయన వేదిక అనుకున్నది. 

           మామూలుగా అయితే ఇలాంటి పుస్తకం చదివాక రామ్మోహన్‌సారు తప్పన  ఏదో ఒక సునిశిత వ్యాఖ్య చేసేవారే. కానీ ఇంకా పుస్తకం పని పూర్తి కాక ముందే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దాంతో అప్పటికి సేకరించిన వ్యాసాలను ఒక పుస్తకంగా కూర్చి ఆయన చేతిలో పెట్టారట.  దాని గురించి ఆయన ఏమనుకున్నదీ మనకు తెలియదు. అప్పటికే ఆయన తన తుది ప్రయాణానికి సిద్ధమయ్యారు. మానవ సంబంధాల్లోంచి, ఉద్యమానుభవాల్లోంచి రామ్మోహన్‌గారిని తిరిగి చూచుకోడానికి మిత్రులు, సహచరులు ప్రయత్నిస్తుండగా ఆయన తిరిగి చూడకుండా నిశ్శబ్దంలోకి జారిపోయారు. 

           ఈ ఉద్విగ్న విషాద పరిణామాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ఇంతకూ ఆయన గురించి ఏం రాయాలని మధనపడుతూ వచ్చాను. మృత్యుముఖంలో ఉన్న ఆయనతో నాకున్న పరిచయాన్ని తలపోసుకుంటున్నాను. 

          నిజంగానే ఇది మరణం  వలె విషాదభరితమైనది. అరవై ఏళ్ల ఉద్యమ జీవితాన్ని, ప్రజా మేధో జీవితాన్ని గడిపిన మనిషి మృత్యువులోకి ఒరిగిపోతున్న  చివరి సన్నివేశం. ఇలాంటప్పుడు    రాయడమంటే   ఆయనను మళ్లీ  తెలుసుకోవాలని ప్రయత్నించడం.  ఆయన తేటతెల్లంగా బతికిన మనిషి. కర్కశమైన లోకంతో కూడా సుతిమెత్తగా వ్యవహరించిన బుద్ధిజీవి. ఈ ప్రపంచాన్ని మార్చాలనే ప్రయోగానికి ఆసరా అయిన మానవుడు. చివరి క్షణాల్లో ఆయన గురించి రాయడమంటే  ఆయనను మళ్లీ తెలుసుకోవడమే కదా. 

నిజంగానే ఈ పది పదిహేను రోజులుగా ఎంత మధనపడ్డా రామ్మోహన్‌సార్‌ నా రాతలోకి రాలేదు.

           ఇప్పుడు ఆయన లేరు. అలా వెళ్లిపోయిన మనిషిని తొలిసారి ఎప్పుడు, ఎక్కడ చూశానో గుర్తు లేదు.  ఆయనతో నాకు సుదీర్ఘ అనుబంధం లేదు. కానీ గాఢమైన మానవానుబంధం ఉంది. ఆయన వ్యక్తిత్వం వల్ల అది చాలా విలువైనది. గత పాతికేళ్లుగా  తెగిపోని జీవధారలా ఆయనతో ఒక సంభాషణ సాగింది.   ఇటీవలైతే తరచూ ఎక్కడో ఒక చోట తారసపడటం.  ఫోన్‌లో మాట్లాడుకోవడం. ఏదైనా సరే అది మెత్తగా ఉంటుంది. ఒక చూపుతో ఉంటుంది. ఒక వెలుగుతో ఉంటుంది. ఇది చాలు. నిత్యం మాట్లాడుకోవాల్సిన పని లేదు. 

          రామ్మోహన్‌సార్‌ను విరసం నిర్మాణ సమావేశాల్లో చూసినట్లు నాకు గుర్తు లేదు. కానీ  ఎక్కడ కలిసినా ఆయన మాట్లాడే అనేక విషయాల్లో సాహిత్యం, విరసం కూడా ఉండేవి. ఆయన విరసాన్ని, విప్లవ సాహిత్యోద్యమాన్ని సన్నిహితంగా పరిశీలించేవాడు.  ఎవరెవరు ఏం రాస్తున్నదీ, ఎలా విశ్లేషిస్తున్నదీ గమనించేవాడు. అలాంటప్పుడు ఆయన తనను తాను విరసం సభ్యుడునుకొనే మాట్లాడేవాడు.   అవగాహనలో, విశ్వాసాల్లో ఆయన దృఢమైన వైఖరితో ఉండేవాడు. సుదీర్ఘ ఉద్యమానుభవం వల్ల కావచ్చు అనేక కల్లోలాలు చుట్టుముడుతున్నా ఆయన గొంతులో ఎన్నడూ నిరాశ ధ్వనించేది కాదు. ఉద్యమాల విస్తృతిని, లోతును, వాటి ముందున్న సవాళ్లను,   మానవ జీవితమే ఎదుర్కొంటున్న సంక్షోభాలను.. అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇలా ఆలోచించాలి కావచ్చు.. అన్నట్లు మాట్లాడేవారు. ఏ ఒక్కవైపుకో ఒరిగిపోయి రామ్మోహన్‌గారు మాట్లాడేవారు కాదు. 

          బహుశా ఇతరులతో  మాట్లాడటమంటే ఆయనకు తనలో తాను ఆలోచించడమే కావచ్చు.  కాసేపు ఆయనతో గడిపితే,  కాసేపు ఆయన మాటలు వింటే ఇలా అనిపించేది. అందుకే ఆయన చాలా నింపాదిగా  మాట్లాడేవారు. ఎక్కడి నుంచో కొత్త ఆలోచనలను, భావనలను కూడగడుతున్నట్లు మాట్లాడేవారు. కొత్త దిక్కుల నుంచి ఆలోచనలు వెతికి తెచ్చినట్లు సంభాషించేవారు. ఒక్కోసారి ఆయన మాటలు చాలా తాజాపరిచేవి. అందులో కొత్త సమాచారం కూడా ఉండేది.  పనుల హడావిడిలో కొట్టుకపోయేవారు నిలబడి ఆలోచించక తప్పని స్థితి కల్పించేవారు.

          రామ్మోహన్‌సారు తాను ఆలోచిస్తున్నట్లే కాకుండా   మనతో కూడా  కలిసి ఆలోచిస్తున్నట్లుగా ఆయన సంభాషణ ఉండేది. అందుకే తుది వైఖరిని ప్రకటించడం కంటే వెతుకులాటగా ఉండేది. చాలా ఓపెన్‌ మైండ్‌తో ఆయన ఆలోచించేవారు. ఆయన నిండైన చింతనాపరుడనిపించేది. అందులో  కచ్చితత్వం   ఉండేది.  ఎంతగానంటే, ఒకసారి మహబూబ్‌నగర్‌లో పాలమూరు అధ్యయన వేదిక మీటింగ్‌లో  మాట్లాడుతూ నేను వాడిన ఒక పదం మీద ఆ తర్వాత చాలా సేపు చర్చించారు. ఖండిరచడమో, విమర్శించడమో ఆయన ఉద్దేశం కాదు.  ఆ పదం చుట్టూ, ఆ భావన చుట్టూ వెలుగు ప్రసరింపచేయడం ఆయన ఆలోచనా పద్ధతి. నిజానికి ఆ పదం గురించిన ప్రస్తావన ఒక సందర్భం మాత్రమే.  ఆ మొత్తాన్నీ ఇంకో వైపు నుంచి ఏమైనా చూడగలమా? అనేదే ఆయన ప్రయత్నం. 

           రామ్మోహన్‌గారు విప్లవ, విప్లవ సాహిత్యోద్యమ తొలి తరం ఆలోచనాపరుడు. ఆ లోతు, గాఢత  స్పష్టంగా కనిపించేవి.  ఆ తరంలో కొందరికి ఉండిన ఉద్రిక్త స్వభావానికి మాత్రం ఆయన దూరం. బహుశా ఆయన నిర్మాణ కర్తవ్యాలకన్నా వాటికి అవసరమైన ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉండవచ్చు. అది ఆయన స్వభావానికి తగినదే కావచ్చు.  అందుకే విప్లవోద్యమ నేపథ్యంలో మేథో శిక్షణ పొందిన అనుభవశాలిగా కనిపించేవారు.  చుట్టూ మోహరించిన సమస్యల మీద, ఆటుపోట్ల మీద, జయాపజయాల మీద ఆయన లోతైన అంతర్మథన చెందుతున్నాడని అనిపించేది. అక్కడి నుంచి ఆయన మాటలు వచ్చేవి. బహుశా ఆయన తర్వాతి తరాల వాళ్లకు కూడా ఆయనంటే గౌరవం అందుకే  కావచ్చు. 

          రామ్మోహన్‌సార్‌లో ఇంకో ప్రత్యేకత కూడా ఉన్నట్లుంది. జీవితకాలమంతా నిర్మాణయుతంగానే పని చేశారు. విప్లవోద్యమం,  విరసం, ఏపీటీఎఫ్‌, పాలమూరు అధ్యయన వేదిక దాకా రూపంలో, పేర్లలో ఎన్నయినా కావచ్చు. కాని సారంలో రామ్మోహన్‌సార్‌ నిర్మాణయుతంగానే పని చేశారు. బహుశా ఆయన ఆలోచనల్లోనే నిర్మాణాత్మక లక్షణం ఉంది. ప్రతి ఆలోచనా, ప్రతి పనీ  ప్రజా పోరాటాల నిర్మాణాత్మక కృషికి దోహదకారి కావాలనే అవగాహన ఉన్నది. అందుకే ఆయన ఉండిన విప్లవోద్యమ స్రవంతిలో ఎన్ని సంక్షోభాలు వచ్చినా, సొంత జీవితంలో ఆటుపోట్లు వచ్చినా ఎప్పుడూ ఏదో ఒక నిర్మాణంతో కలిసి నడిచారు.  ఇది ఆయన దృఢమైన ఆలోచనాపరుడనడానికి నిదర్శనం. వ్యక్తిగా ఉండిపోకుండా, ఉద్యమాలకు మిత్రుడిగా మిగిలిపోకుండా తన స్వభావానికి తగిన పద్ధతిలో సంస్థలలో భాగమయ్యారు. బహుశా దీని వల్లే కావచ్చు.. ఆయన విరసం కమిటీల సమావేశాలకు రాలేకపోయినా తనను తాను విరసం సభ్యుడనుకొనే మాట్లాడేవారు.

ఇటీవల ఓ పదేళ్లుగా ఆయన సంభాషణలో  కులం, మతం గురించి  ప్రస్తావన ఎక్కువగా ఉంటోంది.  హిందుత్వ ఫాసిజం మీద విశ్లేషణ ఉంటోంది. ఆయన మృత్యుశయ్య మీద ఉన్నారని తెలిశాక ఆ రోజుల్లో  రామ్మోహన్‌గారు ఎలా ఆలోచించేవారనే ఆసక్తి కలిగి దొరికిన కొన్ని రచనలు చదివాను. ఆశ్చర్యం కలిగింది.      ముప్పై అయిదేళ్ల కిందటి నుంచే ఆయన ఈ విషయాలను లోతుగా ఆలోచిస్తున్నారు. విప్లవోద్యమ చైతన్యంతో విశ్లేషిస్తున్నారు. మామూలు ఉదారవాద వైఖరితో కాకుండా మార్క్సిస్టు లెనినిస్టు అవగాహనతో కులం, మతం, సంస్కృతి మొదలైన వాటిపై పదునైన వ్యాసాలు రాశారు. 1989  లో విరసం వేసవి పాఠశాలలో అంబేద్కరిజం మీద చేసిన ప్రసంగం సంక్షిప్త నివేదికలో రామ్మోహన్‌సార్‌ చాలా వరకు కనిపిస్తాయి.  చుండూరు ఘటన జరిగాక విరసం, జనసాహితి, ప్రజారస తరపున ఆయన ఒక పెద్ద కరపత్రం రాశారు. అందులో రామ్మోహన్‌గారు రాజకీయార్థిక చారిత్రక సాంస్కృతిక విశ్లేషకుడిగా కనిపిస్తారు. చుండూరులాంటి దారుణ ఘటన జరగడానికి నిర్దిష్టంగా గుంటూరు జిల్లా చరిత్రలోకి, స్థూలంగా కోస్తా ప్రాంత సామాజిక పరిణామాల్లోకి వెళ్లారు. దళితులు ఆత్మగౌరవం ప్రకటించుకొనే స్థితికి చేరుకొనేసరికి అగ్రకుల భూస్వాముల ప్రతిక్రియ ఎంత దారుణంగా ఉంటుందో ఆ నేపథ్యంలో వివరించారు. ఎంత ‘అభివృద్ధి’ జరిగినా,  ఎన్ని ఆర్థిక పరిణామాలు జరిగినా మన సాంఘిక సాంస్కృతిక సంబంధాల ప్రాచీన మూలాలు బలీయమైనవనే ఎరుక కలిగించేలా ఆ రచన సాగుతుంది. కరపత్రమనేగాని, ఒక సొంత రచనలా అది ఉంటుంది. 

          మతతత్వం`ఒక పరిశీలన అనే వ్యాసం(1992), కులం, మతవాదం, సామ్రాజ్యవాదం(1994) అనే వ్యాసం సిద్ధాంత స్థాయిలో ఉంటాయి. పరిశోధనా దృష్టితో వీటిని రాశారా? అనిపిస్తుంది. ఈ విషయాలపై ప్రామాణిక మార్క్సిస్టు లెనినిస్టు వైఖరిని చేరుకోగల ప్రయత్నం ఈ వ్యాసాల్లో చేశారు.

          విప్లవ సాహిత్యోద్యమంలో భాగంగా  రామ్మోహన్‌సార్‌కు మొదటి నుంచి ఈ విషయాల మీద సహజంగానే ఆసక్తి ఉన్నట్లుంది. వీటన్నిటికంటే ముందు చెప్పుకోవాల్సింది పాలమూరు వలసల గురించిన ఆయన విశ్లేషణ. కాలపరంగా కూడా అది ముందటిదే. అందులో లేబర్‌ వలసను ఆ ప్రాంత రాజకీయార్థిక సాంస్కృతిక కోణాల్లో చూస్తారు. గణాంకాలు, వ్యథలు, వ్యక్తీకరణలకే పరిమితం కాకుండా సారంలోకి వెళతారు. బహుశా పాలమూరు కరువు, వలస, వెనుకబాటుతనం గురించి తదనంతర కాలంలో జరిగిన పరిశోధనలకు, ఉద్యమాలకు ఒక మౌలిక భూమికను రామ్మోహన్‌సార్‌ ఆ వ్యాసంలో సిద్ధం చేశారా? అనిపిస్తుంది. 

          ఆయన లోతైన విప్లవ మేధావి అనడానికి ఇలా ఎన్నో రచనా ఆధారాలు కూడా ఉన్నాయి. వీటిని ఇప్పుడు చూస్తే రామ్మోహన్‌గారు ఇంకా ఎంతో రాసి ఉండాల్సింది కదా అనిపిస్తుంది. దేనికో ఆయన చాలా తక్కువే రాశారు. అందుకే ఆయన సంభాషణలను ఇప్పుడు గుర్తు చేసుకుంటే  తనను తాను రచయితగా అనుకొనేవారా? అనే సందేహం కలుగుతుంది. పరిశీలకుడిగా, చుట్టూ చూపున్నవాడిగా, ఆత్మీయ ఆలోచనాత్మక సంభాషణ నెరిపేవాడిగానే ఆయన స్పురిస్తారు. 

          ముఖ్యంగా 2018లో మహబూబ్‌నగర్‌ విరసం మహాసభల సందర్భంగా ఆయనతో చాలా విస్తృత సంభాషణకు అవకాశం కలిగింది. ఆ సభల ఇతివృత్తం బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం కావడం వల్ల కూడా ఆయన మాటలు దాని చుట్టూ తిరిగేవి. ఆ సందర్భంలో ఆయన పాలమూరుకు ఉన్న ప్రజాస్వామిక,  లౌకిక సంప్రదాయాన్నీ, బలపడిపోతున్న సంఫ్‌ు ఫాసిస్టు ధోరణినీ ఘటనల్లో, ఉదాహరణల్లో పూసగుచ్చి వివరించేవారు. ఫాసిస్టు ప్రమాదం గురించిన రామ్మోహన్‌సార్‌ చాలా ఆందోళనపడేవారు. హిందుత్వ అనే మాట కౌంటర్‌ ప్రొడక్ట్‌ కాకుండా ఎన్నెన్ని జాగ్రత్తలతో, ఎన్నెన్ని అర్థాల్లో వాడవలసి ఉన్నదో ఆలోచించేవారు. లేకుంటే దాన్నే ఫాసిస్టులు వాడుకొనే ప్రమాదం ఉన్నదనేవారు. 

          రామోహ్మన్‌సార్‌ విప్లవోద్యమంలో ఒక తరానికి ప్రతినిధి. మరో రెండు  తరాలతో కలిసి ప్రయాణించారు. సహజంగానే ఈ కాలమంతా చాలా ఘర్షణతో, వేదనతో, సంక్షోభాలతో సాగింది. కానీ ఇందులో అద్భుతమైన వెలుగు ఉంది. గొప్ప విజయాలు ఉన్నాయి. అపారమైన అనుభవాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యనే అంతా అయిపోయిందని వగచేవాళ్లున్న ఈ లోకంలో ఆయన మొదటి నుంచీ తన పద్ధతికి తగిన రీతిలో పని చూస్తూ వచ్చారు.

          విప్లవ, విప్లవ సాహిత్యోద్యమాల కోసం, ప్రజాస్వామిక పోరాటాల కోసం ఆయన చేసిన ఆలోచనలకు,  పనులకు, రాతలకు, మాటలకు ఆయన్ను సగౌరవంగా స్మరించుకోవాలి. అంతకంటే కూడా ఇంత  సుదీర్ఘమైన కాలినడకన అలిసిపోకుండా,  పడిపోకుండా సాగడం, నడుస్తున్న దారిని ఇంకా విశాలం చేయాలనుకోవడం ఆయన గొప్పదనం. అన్నిటికన్నా అవి చాలా విలువైనవి. ఈ పని చేసిన అనేక మందిలో రామ్మోహన్‌సార్‌ది ఒక ప్రత్యేక శైలి. అది పనులకు, ఆలోచనలకేగాక హృదయస్పందనలకు మరింత దగ్గరిది.

అది విప్లవంవల్లా, తన సొంత వ్యక్తిత్వం వల్లా ఆయన సంతరించుకున్నారు. అట్లా మన హృదయ స్పందనల్లో ఆయన పదిలంగా నిలిచే ఉంటారు. 

Leave a Reply