కేరళ పౌరహక్కుల కార్యకర్త అయినూరు వాసుకు జైలు నిర్బంధం

కేరళకు చెందిన అయినూరు వాసు పౌరహక్కుల కార్యకర్త. వయసు 94సంవత్సరాలు. ఆయన్ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కొజికోడ్‌ న్యాయస్థానం ఆయన్ను 14రోజుల పాటు జైలులో వుంచాలని ఆదేశించింది. ఈయన గ్రో వాసు అనే పేరుతో అందరికీ చిరపరిచితుడు. గ్రో అంటే గ్వాలియర్‌ రేయాన్స్‌ కార్మిక సంస్థ అని అర్థం. ఆ కార్మిక సంఘానికి ఆయన నాయకుడిగా వ్యవహరించేవాడు. తన రాజకీయ భావాల కారణంగా బెయిల్‌ వ్యవహారంలో న్యాయస్థానంతో సహకరించడానికి నిరాకరించాడన్న కారణంగా కామ్రేడ్‌ వాసును జైలుకు పంపారు.

2016 నవంబర్‌లో కొజికోడ్‌ వద్ద కామ్రేడ్‌ కుప్పు దేవరాజ్‌, కామ్రేడ్‌ అజిత అనే ఇద్దరు మావోయిస్టు కార్యకర్తలను పోలీసులు చట్ట విరుద్ధంగా హత్యచేశారు. దీనికి నిరసన తెలియజేస్తూ కామ్రేడ్‌ వాసు ఇతర మానవహక్కుల కార్యకర్తలు కొజికోడ్‌ వైద్య కళాశాల మార్చురీ ముందు ప్రదర్శనను నిర్వహించారు. కామ్రేడ్‌ దేవరాజ్‌ మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు. ఆయననూ, కామ్రేడ్‌ అజితను  కేరళకు చెందిన థండర్‌బోల్డ్‌ కమాండోలు నవంబర్‌ 24, 2016న మలాప్పురం జిల్లా నీలంబర్‌ వద్ద   అడవుల్లో కాల్చి చంపారు. అప్పట్లో దేశవ్యాప్తంగా పలు మానవహక్కుల సంఘాలతోపాటు, ఆనాడు కేరళ ప్రభుత్వంలో భాగస్వామిగా వున్న సి.పి.ఐ.కూడా దీన్ని బూటకపు ఎన్‌కౌంటర్‌గా ఖండిరచాయి.

కామ్రేడ్‌ వాసు మీద  ఎప్పటినుండో వారంట్‌ వుందన్న కారణంతో గత శనివారం ఉదయం ఆయనను అరెస్టు చేశారు. ఆయన తాను ఆ ఎన్‌కౌంటర్‌ హత్యలకు నిదర్శనగా చేసిన ప్రదర్శన చట్టవ్యతిరేకమైంది కాదని, కాబట్టి తన అరెస్టు కూడా చట్టవ్యతిరేకమని వాదించి స్టేషన్‌ బెయిల్‌ తీసుకోవడానికి నిరాకరించారు. అప్పుడు ఆయన్ను న్యాయస్థానం ముందు హాజరు పరిస్తే మేజిస్ట్రేట్‌ 10వేల రూపాయలు పెనాల్టి కట్టమని ఆదేశించారు. దానికి కామ్రేడ్‌ వాసు ఇలా జవాబిచ్చాడు.

‘‘చట్టవ్యతిరేక ఎన్‌కౌంటర్లకు పాల్పడ్డ పోలీసుల మీద కేసు పెట్టాలిగాని, దాన్ని ఖండిరచిన వ్యక్తుల మీద కాదు. నిజం మాట్లాడటం నేరం కాదని’’ అలాచేసే హక్కు తనకుందని కూడా ఆయన కోర్టుకు వెల్లడిరచారు. ఆయన వయసును దృష్టిలో పెట్టుకొని మేజిస్ట్రేట్‌ బెయిల్‌ డాక్యుమెంట్లమీద సంతకం పెడితే విడిచిపెడతానన్నాడు. దానికి కూడా కామ్రేడ్‌ వాసు తిరస్కరించారు. తాను తీసుకున్న రాజకీయ వైఖరిని దృఢంగా సమర్ధించుకున్నారు. చివరకు ఆయన్ను పుతియారా సబ్‌జైలుకు పంపించారు.

ఆ బూటకపు ఎన్‌కౌంటర్‌ జరిగిన సందర్భంగా కామ్రేడ్‌ వాసు మాట్లాడుతూ ‘‘ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని మేం నమ్ముతున్నాం. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి పత్రికా విలేఖరుల్ని వెళ్లనీయకపోవడం మాలో అనుమానాలు రేకెత్తించింది’’ అన్నారు.  తదనంతరం 2016 డిసెంబర్‌ 3న దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల మానవహక్కుల సంఘాల కార్యకర్తలతో కూడిన నిజ నిర్థారణ కమిటీలో భాగంగా ఆయన ఎన్‌కౌంటర్‌ స్థలానికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఆ సందర్భంగా ఆయనపై సంఫ్‌ుపరివార్‌ కార్యకర్తలు దాడిచేసి కొట్టారు.

కామ్రేడ్‌ వాసును కేరళ ప్రజలు  ‘‘వాసు అన్న’’ అని పిలుస్తారు. ఆయన 1967 నక్సల్బరీ ఉద్యమకాలంలో సి.పి.యంకు రాజీనామా చేసి ఆ ఉద్యమంలో చేరారు. కేరళ రాష్ట్రంలో అనేక పోలీసు స్టేషన్లపై సాయుధ చర్యలలోనూ, భూస్వాముల నిర్మూలనా కార్యక్రమంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. కన్నూర్‌ సెంట్రల్‌ జైలులో 7సంవత్సరాలు నిర్బంధ జీవితాన్ని గడిపి బయటకు వచ్చాక జీవిక కోసం గొడుగులు అమ్ముకుంటున్నారు. తన అనారోగ్యాన్ని, మీదపడుతున్న వయసును కూడా లెక్కచేయకుండా కామ్రేడ్‌ వాసు ఇప్పటికీ కేరళలో జరిగే అన్ని ప్రజాస్వామిక ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన నిర్బంధాన్ని స్థానికంగా వున్న ప్రజాస్వామికవాదులు, లాయర్లు, సామాజిక కార్యకర్తలు అందరూ తీవ్రంగా ఖండిరచారు. సామాజిక కార్యకర్త సి.పి.రషీద్‌ ప్రసంగిస్తూ ‘‘ఫాదర్‌ స్టాన్‌స్వామికి అనుకూలంగా మాట్లాడిన సి.పి.యం. పార్టీ ఇప్పుడు ఉబ్బసం వంటి జబ్బులతో బాధపడుతున్న వయోవృద్ధుడ్ని జైలుకు పంపించింది. ఎన్‌ఆర్‌సి, సిఏఏ ఉద్యమాల సందర్భంగా నిరసనకారులపై పెట్టిన కేసులను ఇప్పటిదాకా ఉపసంహరించుకోలేదు. ఈ మధ్యకాలంలో పియుసిఎల్‌ రాష్ట్ర కార్యదర్శితో సహా 10మందిపై మంజేరి పోలీసులు, కేరళ పోలీసుల అకృత్యాలకు నిరసనగా వారు ఉద్యమాన్ని చేస్తున్న క్రమంలో అరెస్టు చేశారు’’ అన్నారు.  మరువక్కు అనే మాసపత్రిక ఎడిటర్‌ అంబిక కామ్రేడ్‌ వాసు నిర్బంధాన్ని రాజ్య హింస అని పేర్కొన్నారు. పియుసిఎల్‌ కేరళ రాష్ట్ర కార్యదర్శి, ఈ అరెస్టు చట్టవ్యతిరేకమని న్యాయసూత్రాలకు విరుద్ధమని అన్నారు. జర్నలిస్టులు, కళాకారులు, రాజకీయ నాయకులు, మేధావులు, మాజీ రాజకీయ ఖైదీలు పెద్ద సంఖ్యలో ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలుగు ప్రజలు, మేధావులు, రచయితలు కామ్రేడ్‌ వాసుపై అక్రమ నిర్బంధాన్ని ఖండించాలి .

Leave a Reply