ఆమెను ఎప్పుడో ఒకసారి చూశాను. వ్యక్తిగత పరిచయాలు అక్కరలేని సామాజిక వ్యక్తిత్వాన్ని కొంతమంది సంతరించుకుంటారు. అప్పుడు మనం ఎక్కడ చెయి పెట్టినా వాళ్ల అద్భుత స్పర్శ మనల్ని పులకింపజేస్తుంది. మనం ఏది ఆలోచిస్తున్నా వాళ్లు ఒక వెలుగు రేఖ మనపై ప్రసరిస్తారు. మనం ఏ పని చేస్తున్నా వాళ్లు ఆసరాగా వచ్చి నిలబడతారు.  మనం ఏదో  వెతుకుతోంటే మన ముందు దారి పరిచిపోతారు.  సామాజికులుగా, సామూహిక చైతన్య ప్రతినిధులుగా మారినవాళ్లకే ఇది సాధ్యమవుతుంది.

నర్మద అలాంటి జీవితం గడిపింది. అలాంటి వారితో కలిసి జీవించింది. దశాబ్దాల కఠోర జీవితాన్ని చైతన్యవంతంగా, ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా గడిపింది. వేలాది మందిని ప్రభావితం చేసింది. ఒక కొత్త పోరాట ప్రపంచం రూపుదాల్చడంలో తన సర్వశక్తులు ధారపోసింది. అలాంటి సామూహిక మానవి చివరి క్షణాలను  ఒంటరిగానే గడిపి వెళ్లిపోయింది. వ్యక్తిగత జీవితంలో, ఉద్యమంలో, ఖైదులో  కలిసి నడిచిన సహచరుడు కూడా ఆ క్షణాల్లో ఆమెతో లేడని తెలుస్తోంది. ఆమె జీవితంలాగే మరణం కూడా ఉద్విగ్న విషాదాల సమ్మేళనం. ఇలా కూడా జీవించగలరనే విప్లవాత్మక నమూనాగా తన జీవితాన్ని మలిచి మన ముందు పెట్టి వెళ్లిపోయింది.

ఉప్పుగంటి నిర్మల అదే పేరుతో ఈ తరంలో చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. నర్మదగా, నిత్యగా తెలియని వాళ్లు ఉండరు. ఆమె కథలు రాసింది. పత్రికలు నడిపింది. అనువాదాలు చేసింది. వ్యాసాలు రాసింది. సాహిత్య విశ్లేషణ అందించింది.  సిద్ధాంత కృషి చేసింది. రాజకీయ, విద్యా తరగతులు నిర్వహించింది.  ఈ పనులు చాలా విలువైనవే. అయితే అనేక మంది చేయగలిగినవి. ఈ పనులన్నీ చేసే క్రమంలో ఆమె విప్లవోద్యమ నాయకురాలిగా ఎదిగింది. దండకారణ్య గెరిల్లా జోన్‌ కమిటీ సభ్యురాలని ఆమె మరణానంతర విప్లవోద్యమ ప్రకటనల ద్వారా తెలుస్తోంది. 

వీటన్నిటికంటే నర్మదను  దండకారణ్య ఆదివాసీ మహిళా సంఘటన్‌ నాయకురాలిగా ప్రత్యేకంగా స్మరించుకోవాలి.

గడ్చిరోలిలో, దండకారణ్యంలో, ఆ మాటకొస్తే విప్లవోద్యమ స్థావరాలన్నిట్లో సగానికిపైగా మహిళలు పోరాట క్షేత్రంలో ఉన్నారు. బహుశా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీలో, ఏ ఉద్యమంలో కూడా అంత శాతం మహిళల భాగస్వామ్యం లేకపోవచ్చు. కేవలం సంఖ్యలోనే కాదు. నిర్ణయాత్మక స్థానంలో మహిళలు  విప్లవోద్యమంలోనే ఉన్నారు.  సహాయకులుగా, అనుబంధ పాత్రధారులుగా కాకుండా పురుషులతో సమఉజ్జీ మిలిటెన్సీని, రాజకీయ నిర్మాణ  సామర్థాన్ని, సిద్ధాంత పటుత్వాన్ని నెరపగల స్థాయిలో మహిళలు ఉన్నారు.

ఇలాంటి అరుదైన, మహాద్భుత కృషి యావత్‌ విప్లవోద్యమం వల్లనే సాధ్యమై ఉండవచ్చు. కానీ అందులో వందలాది మంది మహిళల క్రియాశీల, సృజనాత్మక  నాయకత్వ పాత్ర ఉన్నది. వాళ్లలో నర్మద  పేరెన్నికగన్న నాయకురాలు.

విప్లవోద్యమంలోని వేర్వేరు రంగాల్లో  రాజకీయ, సిద్ధాంత, నిర్మాణ కృషి నిరంతరం సాగుతూ ఉంటుంది. అందులో పితృస్వామ్య ఆధిపత్యం ఒక ముఖ్యమైన విషయం. ఆ రంగంలో 1980ల ఆరంభం నుంచే విప్లవోద్యమం కృషి ఆరంభించింది. ముఖ్యంగా దండకారణ్యంలో విప్లవకారులు ప్రవేశించిన తొలి రోజుల నుంచే స్త్రీల ప్రత్యేక సమస్యలపై పోరాటం మొదలైంది. స్త్రీలను తరతరాల ఆదివాసీ  కుటుంబ బంధనాల నుంచి, తెగల సాంఘిక సాంస్కృతిక కట్టుబాట్ల నుంచి, ఊరి పెత్తందార్ల దాష్టీకాల నుంచి బైటికి తీసుకరానిదే విప్లవోద్యమాన్ని నిర్మించ లేమనే ఎరుక కలిగింది. దండకారణ్య ఆదివాసీ క్రాంతికారీ మహిళా సంఘటన్‌ అట్లా మొదలైంది.

నిర్మల 1990ల ఆరంభంలో విప్లవోద్యమంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ రకంగా ఆమె దండకారణ్యం చేరేనాటికి అక్కడ మహిళా ఉద్యమానికి పునాదులు పడి ఉన్నాయి. ఆదివాసీ సంస్కృతిలో మార్పు తేవడానికి ప్రయత్నం చేసింది. పితృస్వామ్య వ్యతిరేక పోరాటం వర్గపోరాట చైతన్యంతో సాగవలసి ఉన్నదనే అవగాహన ఏర్పడి ఉన్నది.  విప్లవోద్యమం  తన ప్రారంభ దశను దాటి ఉన్నత దశకు ఎదగడానికి పెనుగులాడుతున్న దశ అది. మహిళల భాగస్వామ్యం లేకుండా, పితృస్వామ్య ఆధిపత్య వ్యవస్థకు, భావజాలానికి, సంస్కృతికి వ్యతిరేకంగా పురుషులు, స్త్రీలు, మొత్తంగానే విప్లవోద్యమం పోరాడితేనే ఆ దశను అందుకోగలమనే స్పష్టత వచ్చి ఉన్న కాలం అది. 

సరిగ్గా అప్పటికే  తెలుగు సమాజం కూడాఒక పెద్ద మేధో కసరత్తు చేస్తోంది. సుమారుగా దేశమంతా అలాగే ఉండిరది. స్త్రీవాదం ఒక సిద్ధాంత, సాహిత్య ధోరణిగా ముందుకు వచ్చింది. పితృస్వామ్యం గురించి చాలా కొత్త ఆలోచనలను అది అందించింది. స్త్రీల సమస్యలపట్ల అందరిలో సున్నితత్వాన్ని పెంచింది. వీటితోపాటు వర్గపోరాటం పట్ల విముఖతను, మార్క్సిస్టు వ్యతిరేకతను తారాస్థాయిలో పెంచింది. మార్క్సిజంలో పితృస్వామ్య విశ్లేషణకు చోటు లేదని, విప్లవం పేరుతో తిరిగి మళ్లీ మగవాళ్లే పెత్తనం సంపాదించుకొనే వ్యవహారమని, వర్గపోరాటం ద్వారా మహిళలకు ఒరిగేదేమీ లేదనే విస్తృత ప్రచారం చేశారు. ఇది ఫెమినిస్టుల పొరబాటు కాదు. రకరకాల ఫెమినిజాల్లోని సాధారణ లక్షణమే ఇది. దీన్ని బలపరుచుకోడానికి ఎన్నో ఉదాహరణలు తీసుకొచ్చారు.  కొత్త సిద్ధాంత పరిభాషను దిగుమతి చేసుకున్నారు. ఫెమినిజం వచ్చాక కూడా ఇంకా విప్లవం  ఏమిటనే జనరంజక వాదం పరిఢవిల్లుతున్న కాలంలో నిర్మల దండకారణ్యం వెళ్లింది. మహిళా ఉద్యమంలో భాగమైంది. దాని నాయకురాలైంది.

మామూలుగా సిద్ధాంత విషయాలను సైద్ధాంతికంగానే చర్చించాలిగాని వేరే వాటిని పోటీ తేగూడదని అంటారు.  ఇది పూర్తిగా నిజం. సిద్ధాంత సమస్యలను సిద్ధాంతపరంగానే చర్చించవలసి ఉంటుంది. కానీ అక్కడే ఎన్నటికీ పరిష్కారం దొరకదు. భాష పోగుపడుతుంటుంది. అదొక కీకారణ్యంగా మారుతుంది. ఆ కాలంలో ఫెమినిస్టులు ఈ పనిలో ఉండగా.. నిర్మల తన సహచరులతో కలిసి  స్త్రీవిముక్తి సిద్ధాంతం ఎలా ఉండాలనేగాక నిజమైన పితృస్వామ్య వ్యతిరేకపోరాటం ఎలా ఉండాలనే కృషి కూడా మొదలు పెట్టింది. సిద్ధాంతాన్ని ఆచరణలో భాగం చేసి దాని  అసలైన శక్తిని వెలికి తీసింది. 1990ల్లో దండకారణ్య మహిళా ఉద్యమమేకాదు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విప్లవ మహిళా ఉద్యమం కూడా  గుణాత్మకంగా ఎదిగింది. సారాంశంలో పితృస్వామ్యం చుట్టూ ఉన్న సైద్ధాంతిక సమస్యలను పండితులకు వదిలిపెట్టకుండా   స్త్రీల ఆచరణలోనే పరిష్కారాలు ఉంటాయని, ఉన్నాయని ఏదో ఒక స్థాయిలో నిరూపించింది.

ఆ తర్వాత ప్రత్యేకించి దండకారణ్యంలో, మొత్తంగానే విప్లవోద్యమంలో పితృస్వామ్య వ్యతిరేకపోరాటం ఎలా విస్తరించిందో ఇక్కడ వివరించడం కుదరదు. నర్మదలాంటి అనేక మంది నాయకత్వంలో పితృస్వామ్య వ్యతిరేక, దోపిడీ వ్యతిరేక, సకల ఆధిక్యాల వ్యతిరేక, ముఖ్యంగా రాజ్య వ్యతిరేక మిలిటెంట్‌ ఉద్యమంగా అది ఎలా విస్తరించిందో విరసం ఆ మధ్య ప్రచురించిన ‘దండకారణ్య మహిళా ఉద్యమ చరిత్ర’లో చూడవచ్చు. నిర్మల ఆ ఉద్యమ నాయకత్వంలో ఉన్నట్లే, ఆ పుస్తక రచనలో కూడా ఉండే ఉంటుందని మనం ఊహించవచ్చు. 

1990ల్లోనే విప్లవ మహిళా  ఉద్యమం ఇలా అన్ని రకాలుగా  విస్తరిస్తే ‘ఫెమినిజం’ అనే ధోరణి స్వచ్ఛంద సంస్థల ప్రాయోజిత విధానంగా మారిపోయింది.ఈ మాట అంటే ఇప్పుడు ప్రత్యేకించి బాధపడటానికి ఫెమినిజాన్ని  క్లయిమ్‌ చేసుకొనే బృందమూ లేదు, వ్యక్తులూ లేరు. అయినా ‘ఫెమినిజమే’ అలా మారిపోయిందనే మాటకు నొచ్చుకొని, ఫెమినిస్టులు అలా మారిపోయారని సవరించే  వాళ్లు ఉండవచ్చు.

మొత్తం మీద దాని సానుకూల, ప్రతికూల భావనలు మన సామాజిక చైతన్యంలో, సాంస్కృతిక వికాసంలో అంతర్లీనమై ఉన్నాయి.   ఈ సానుకూల అంశాలను సహితం వర్గపోరాటంలో భాగం చేసుకొని పితృస్వామ్య వ్యతిరేక పోరాటాలను  ప్రజ్వరిల్ల చేయవచ్చని చెప్పడానికి కా. నర్మద ఒక అద్భుత  ఉదాహరణ.

వర్గపోరాట చైతన్యంతో, మార్గదర్శకత్వంలో పితృస్వామ్యం, తెగ బంధనాల వంటి సాంఘిక సంబంధాల నుంచి విముక్తి సాధ్యమే అని కేవలం సిద్ధాంత భాషణం చేసి వదిలిపెట్టకుండా దాన్ని రుజువు చేసే క్రమంలో దండకారణ్యం చాలా అడుగులు ముందుకు వెళ్లింది.   ఈ స్థూల అవగాహన, అనుభవాలు  మిగతా సమాజాలకు కూడా వాటి  ప్రత్యేకతలనుబట్టి  వర్గపోరాటంలో భాగంగా ఉపయోగపడతాయి. ఈ ప్రయోగం, విజయాలు, నిర్ధారణల మీద ఒక్క ఫెమినిస్టుగాని, అస్తిత్వవాదిగాని మాట్లాడటానికి ఇష్టపడ లేదు.  వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చారు.

దండకారణ్యం స్త్రీవిముక్తి సిద్ధాంత, ఆచరణల్లాగే పితృస్వామ్య వ్యతిరేక సాహిత్య సృజనకూ గని వంటిది. 1990 ఆరంభం నుంచి అక్కడి నుంచి వస్తున్న సాహిత్యాన్ని పరిశీలించండి. చాలా కథలు, నవలలు పితృస్వామ్య వ్యతిరేక రచనలే. తెలుగు స్త్రీవాద సాహిత్యం, అయ్యో అయ్యో అనే ‘ప్రగతిశీల’ సాహిత్యం తాను తయారు చేసుకున్న మూసల్లో తానే పడి కొట్టుమిట్లాడుతోంటే దండకారణ్య సాహిత్యం వస్తువులో, శిల్పంలో కూడా ప్రవాహ సదృశ, ప్రయోగాత్మకమైన కొత్త కాల్పనిక ఆవరణను  తెలుగులో  ప్రవేశపెట్టింది. ఎక్కడా ఏడుపుగొట్టు ధోరణి లేకుండా పితృస్వామ్య బంధనాల నుంచి సాహసికంగా వెతుక్కొనే దారులు కనిస్తాయి.  నిస్సందేహంగా ఇందులో సైనిక కోణం కూడా ఉన్నది.  కానీ దండకారణ్య సాహిత్యం స్త్రీలు కేంద్రంగా సాగే సాంస్కృతిక సంఘర్షణను కథల్లోకి, నవలల్లోకి తీసుకొచ్చింది. మొత్తం మీద నిలువనీటి జీవితాన్నికాక అందులోంచే  చైతన్యవంతంగా మానవులు సాధించిన మార్పు క్రమాలను చిత్రించడం ఆ సాహిత్యం ప్రత్యేకత.

ఈ పని చేసిన వారిలో నర్మద పాత్ర గణనీయమైనది. విప్లవకారిణిగా ఆమె వ్యక్తిగత జీవితం కంటే వర్గపోరాటంలో భాగంగా స్త్రీ విముక్తికి,  సాహిత్య సృజనకు చేసిన దోహదం చారిత్రకమైనది. ఆమె నిర్మలగా మొదలై సాహిత్య రచనలో, సాహిత్య విమర్శలో నిత్యగా, విప్లవ మహిళా ఉద్యమ చరిత్రలో నర్మదగా దండకారణ్యమంతా  ఒక సజీవ ప్రవాహంలా విస్తరించింది. క్యాన్సర్‌ ఆమె శరీరాన్ని శిథిలం చేసి ఉండవచ్చు.  మరో మనిషి తోడు లేకుండా ఆమె భౌతకకాయం వెళ్లిపోయి ఉండవచ్చు. కానీ ఆమె ఆచరణ, స్ఫూర్తి, సిద్ధాంతం, కాల్పనికత దండకారణ్యమంతా ఒక సజీవ ప్రవాహంలా కొనసాగుతూనే ఉంటాయి. ఆమె చైతన్యంలోని వర్గపోరాట సునిశితత్వాన్ని అందుకోవడమే ఆమెకు ఇవ్వగల నివాళి.

Leave a Reply