కెవిఆర్గా నిలిచి పోగోరిన కనుపూరు వెంకట రమణారెడ్డి కవి, విమర్శకుడు, నాటక కర్త, విరసం వ్యవస్థాపక కార్యదర్శి, పత్రికా సంపాదకుడు, అధ్యాపకుడు. మార్క్సిస్టు దృక్పద భూమికతో ఒక రచనను రచయితని అంచనా వేసే పద్ధతికి కె.వి.ఆర్ రచనలన్నీ తార్కానాలుగా నిలుస్తాయి . తెలుగులో వ్యాసం రాసినా, గ్రంథం రాసి నా, ఒక రచన వెలువడిన కాలం దాని ముందు వెనుకలు, సామాజిక ఆర్థిక రాజకీయ సాహిత్య పరిణామాలు, రచయిత దృక్పథం ,సాహిత్య తత్వం వంటి అంశాలతో ముడిపెట్టి సమగ్ర దృష్టితో విమర్శ చేసిన వారు కెవిఆర్. మహోదయం, కవి కోకిల, జగన్నాథ రథచక్రాలు, ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర వంటివి కె.వి. ఆర్ గారి ప్రామాణిక రచనలు.
కెవిఆర్ తన సమకాలికులైన శ్రీశ్రీ, ఆరుద్ర, కొడవడికంటి కుటుంబరావు వంటి వారి రచనలను నిష్కర్షగా మెరమెచ్చులు లేకుండా విమర్శించడం జరిగింది. ఆరుద్ర వంటి వారు రమణారెడ్డి గారిని కరకు మాటల కడ్డీ కె.వి.రమణారెడ్డి అన్నారు. ఎవరు ఎన్ని అన్న ఆయన నిరంతర కృషిత్వాన్ని అంచనా వేస్తూ చేకూరి రామారావు కె.వి.ఆర్ ని సాహిత్య కార్మికుడిగా అభివర్ణిస్తూ అవిశ్రాంత సాహిత్య పత్తికుడుగా పేర్కొనడం విశేషం.కెవిఆర్ విమర్శ రచనలు విమర్శకుడికి అవసరమైన భావజాలం, పాండిత్యం గురించి తెలియజేస్తాయి. అపారమైన సాహిత్య సాంస్కృతిక అంశాల పరిజ్ఞానం, సామాజిక చారిత్రక శాస్త్రాల అధ్యయన భూమిక విమర్శకుడికి అవసరమైన సాహిత్య సంవేదన, కళా దృష్టి కె.వి.ఆర్ రచనలకు ప్రామాణికతను తెచ్చిపెట్టాయి. కవి జీవిత సాహిత్య విమర్శ పద్ధతిలో కెవిఆర్ది ప్రత్యేక స్థానం. కెవిఆర్ ని మౌలికంగా జీవిత సాహిత్య చరిత్ర విమర్శకుడని పేర్కొనవచ్చు. ఆయన ఎవరి రచనలను విమర్శించిన వారి జీవిత విశేషాలను సృశించకుండా ఉండడు .ఈ లక్షణం ఆయన రచనలన్నింటిలోనూ కనిపిస్తుంది.
తెలుగులో శాస్త్రీయ పద్ధతిలో వెలువడ్డ విమర్శ రచనలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కవిత్వంలోనే కాదు విమర్శ లోను తూచా తప్పకుండా నిబద్ధతను చూపిన రచయిత. కె.వి.ఆర్ విమర్శకి శాస్త్రీయమైన పునాది ఉంది. అయితే కెవిఆర్ మార్క్సిస్టు దృక్పథం నుంచి ఏమాత్రం పక్కకి తొంగి చూడడానికి ప్రయత్నించడు . అందువల్ల కొందరు రచయితల మంచి రచనలను కూడా ఆయన నచ్చలేక పోయాడు. మెచ్చుకున్న ,నొచ్చుకున్న కెవిఆర్ తన విమర్శ మార్గాన్ని మార్చుకోలేదు. ఆయన మాదిరిగా సిద్ధాంతానికి నిబద్ధులైన విమర్శకులు చాలా తక్కువగా కనిపిస్తారు . చాలా బాధ్యతాయుతంగా కొత్తచూపుతో సాహిత్య విశ్లేషణ చేయడంలో కె.వి.ఆర్ నిపుణమతి. నిబద్ధ మార్క్సిస్ట్ విమర్శకుడిగా సాహిత్య లోకానికి సుపరిచితులైన కెవిఆర్ సాహిత్య విమర్శ రచనలను ఆయన దృక్పథాన్ని తప్పనిసరిగా నేటి తరం పరిశీలించాల్సి ఉంది.
ఏ సిద్ధాంతమైనా జీవితాన్ని క్రమబద్ధంగా పరిశీలించి విశ్లేషించి చేసే సూత్రీకరణ అని కెవిఆర్ నమ్మాడు .జీవితా నుభవం ఎంత బౌద్ధికమో, అంత అనుభూతిమయమని ఎరిగిన వ్యక్తి .అనుభూతిని సామాజిక జీవితానుభవం నుంచి విడగొట్టడాన్ని ఆయన అనేక సందర్భాల్లో ప్రశ్నించాడు. తాత్విక భావాలు శూన్యం నుంచి గాక ప్రజల భౌతిక జీవిత వాస్తవం నుంచి వస్తాయన్న తత్వవేత్తల మాటలను కెవిఆర్ త్రికరణ శుద్ధిగా ఆచరించి చూపారు.
మార్చిస్టు గతి తర్కాన్ని శాస్త్రీయమైన పరిశీలనా పద్ధతిగా ఆయన భావించాడు . అర్థ శతాబ్దం పాటు నిర్విరామంగా రచనలు చేసిన కేవీఆర్ లో వైరుధ్యాలు చాలా తక్కువ. ఆయన రాతలకి చేతలకి అంతగా తేడా కనిపించదు. ఎంతటి వారితోనైనా ఎన్ని వైమనస్యాలు ఏర్పడినా , కఠినంగానే ప్రవర్తించిన, విమర్శించిన కె.వి.ఆర్ బాధ్యతగా వ్యవహరించినట్లు ఆయన రచనలు తెలుపుతాయి. సమగ్రత అనే లక్షణం కె.వి.ఆర్ రచనలన్నింటిలో కనిపిస్తుంది.
కె.వి.ఆర్ విమర్శ రచనల్లో కాల్పనికమైన ఆత్మా శ్రయ ధోరణులు లేవు . వాస్తవిక దృష్టి వాటిలో ప్రధానంగా ఉంటుంది. తెలుగులోని మార్క్సిస్ట్ విమర్శకులలో కెవిఆర్ వలె పరిశ్రమించిన వారు, పరిశోధించినవారు ,రచనలు చేసిన వారు లేరని చెప్పుకోవచ్చు.
(మార్చి 23 కెవిఆర్ జయంతి సందర్భంగా)