నియాంగిరి సురక్ష సమితి నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ)(యూఎపిఎ) చట్టం కింద ఒడిశా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నియాంగిరి సురక్ష సమితి నాయకులు, మద్దతుదారులపై క్రూరమైన ఉగ్రవాద నిరోధక ఉపా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.
ఆగస్ట్ 5న, కలహండి జిల్లా లాంజిగఢ్ హాట్ నుండి స్థానిక ఆదివాసీ గ్రామస్తుల మధ్య ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల గురించి ప్రచారం చేస్తున్నప్పుడు, ఇద్దరు ఎన్ఎస్ఎస్ కార్యకర్తలు, కృష్ణ సికాకా (గ్రామం పతంగ్‌పదర్) బారి సికాకా (గ్రామం లఖ్‌పదర్)లను పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లారు.
ఆగస్ట్ 6వ తేదీ ఉదయం, నియాంగిరి సురక్ష సమితి తమ సభ్యులను పోలీసులు అపహరించుకుపోయారని ఆరోపిస్తూ కళ్యాణ్‌సింగ్‌పూర్ పిఎస్ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించి, వారి ఆచూకీని వెల్లడించాలని, విడుదల చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ప్రదర్శన తర్వాత, పోలీసులు, అదే రోజు, ఎన్ఎస్ఎస్ ప్రముఖ నాయకులైన లాడా సికాకా, డ్రెంజు క్రిసికాతో సహా తొమ్మిది మంది వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లింగరాజ్ ఆజాద్, ఎన్ఎస్ఎస్ సలహాదారు; బ్రిటిష్ నాయక్, ఖండూలామాలి సురాఖ్య సమితి; ఉద్యమానికి సంఘీభావంగా నిలిచిన కవి లెనిన్ కుమార్‌లతో సహా తొమ్మిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యూఏపీఏ, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద వీరికి వ్యతిరేకంగా కేసులు నమోదయ్యాయి.
బలవంతపు అపహరణ, కార్యకర్తలపై యాంటీ-టెర్రర్ ఉపా అభియోగాలు మోపడం ఒడిశా పోలీసులు స్థానిక ప్రజల గొంతులను, ముఖ్యంగా, గత రెండు దశాబ్దాలుగా నియమగిరి నుండి వేదాంత, తదితర కంపెనీల బాక్సైట్ తవ్వకాల ప్రయత్నాలను ప్రతిఘటిస్తున్న నియాంగిరి సురక్ష సమితి పతాక కింద ఉన్న నియంగిరికి చెందిన డోంగ్రియా కోండ్ సముదాయాన్ని అణచివేయడానికి చేసిన మరో ప్రయత్నం.
ఈ తప్పుడు కేసులు, నియమగిరి ప్రజలపై నిరంతర అణచివేత ఇవన్నీ ప్రజల సహజ వనరులను కార్పొరేట్లకు స్వాధీనం చేసుకునే అజెండాలో భాగమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై UAPA అభియోగాలు మోపడం అనేది ప్రజల గొంతులను అణచి వేయడానికి, కొండలలో వేదాంత మైనింగ్‌కు మార్గం తెరవడానికి చేస్తున్న ఉద్దేశపూర్వక కుట్ర.
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని బిజూ జనతాదళ్ ప్రభుత్వం మద్దతుతో అటవీ సంరక్షణ (సవరణ) చట్టం, 2023ని ఆమోదించింది, అటవీ అటవీ భూములను లాక్కోవడం ద్వారా కార్పొరేట్లకు అప్పగించడానికి వీలు కల్పించింది. గ్రామసభ హక్కులను దూరం చేసింది. గ్రామసభ హక్కులను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును అణగదొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం, వేదాంత కంపెనీ చేస్తున్న కుట్రలో భాగమే ఈ తాజా పోలీసు భీభత్సం.
ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై పెట్టిన ప్రతీకార, తప్పుడు, కల్పిత కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని, కృష్ణ సికాకను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని లింగరాజ్ ఆజాద్, ప్రఫుల్ల సమంతా, నరేంద్ర మొహంతి, బిశ్వప్రియ కనుంగో ఒక పత్రికా ప్రకటనలో డిమాండ్ చేశారు.
పత్రికా ప్రకటన
12 ఆగస్టు 2023
లోహియా అకాడమీ, భువనేశ్వర్
నియాంగిరి సురక్ష సమితి నేతృత్వంలోని ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై ఉన్న యూఏపీఏ కేసులను ఉపసంహరించుకోవాలి!
విషయం: నియాంగిరి సురక్ష సమితి నేతృత్వంలోని ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై ఉన్న యూఏపీఏ కేసులను ఉపసంహరించుకోవడం ; కృష్ణ సికాకను బేషరతుగా విడుదల చేయడం.
2023 ఆగస్టు 5వ తేదీన నియాంగిరి సురక్ష సమితి (ఎన్ఎస్ఎస్) కి చెందిన కృష్ణ సిక్కా (గ్రామం పతంగ్‌పదర్) బారి సిక్కా ((గ్రామం లఖ్‌పదర్)) అనే ఇద్దరు యువ కార్యకర్తలు కలహందీ జిల్లా లోని లాంజిగఢ్ హాట్కు వెళ్లారు. గ్రామస్తులను కలుసుకోవడం, ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని జరుపుకోవడం గురించి ప్రచారం చేయడం వారి ఉద్దేశం. వారు ఈ పనిలో నిమగ్నమై ఉండగా, సాధారణ దుస్తులు ధరించిన కొంతమంది పోలీసులు అకస్మాత్తుగా ఒక బోలెరోలో అక్కడికి చేరుకుని, ఉదయం 9 గంటలకు వారిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. వారితో పాటు ఉన్న గ్రామస్తుల నుండి సమాచారం అందుకున్న వెంటనే ఎన్ఎస్ఎస్ లంజిగఢ్, కల్యాణ్సింగ్పుర్ పోలీస్ స్టేషన్ల ఐఐసిలను, రేగడ, కలహందీ జిల్లాల ఎస్పీలను సంప్రదించింది. అధికారులందరూ అరెస్టు లేదా అపహరణ చేశామనడాన్ని నిరాకరించారు. మాస్ మీడియాలో వార్తలు వచ్చినా పోలీసు అధికార యంత్రాంగం ఖండిస్తూనే ఉంది.
తమ సభ్యులను పోలీసులు అపహరించారని ఆరోపిస్తూ ఆగస్టు 6వ తేదీ ఉదయం కళ్యాణ్‌సింగ్‌పూర్ పీఎస్ ముందు ఎన్ఎస్ఎస్ నిరసన ప్రదర్శన నిర్వహించింది. వారి ఆచూకీని కూడా పోలీసులు వెల్లడించాలని, అపహరణకు గురైన తమ ఇద్దరు సభ్యులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారు మెమోరాండం సమర్పించారు. సరియైన సమాధానం ఇవ్వడానికి బదులుగా పోలీసు అధికారి “వారి ఆచూకీని అంచనా వేయడానికి మేము దిసారిలమా (ఆదివాసి భాషలో జ్యోతిష్కుడు)?” అని వారిని ఎగతాళి చేశాడు.
గ్రామస్తులు ప్రదర్శన నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, ఎన్ఎస్ఎస్కు చెందిన ప్రముఖ నాయకుడు డ్రెంజు క్రిసికాను పోలీసులు కొట్టడానికి ప్రయత్నించారు. గ్రామస్తులను రెచ్చగొట్టి పోలీసుల అణచివేతను మరింత ఉధృతం చేసే పరిస్థితిని సృష్టించే ప్రయత్నమే ఇది. అక్కడి గ్రామస్తుల ఐక్య ప్రతిఘటనతో పోలీసులు డ్రెంజు క్రిసికను తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు.
అదే రోజు, ఆగస్టు 6వ తేదీన, ఎన్ఎస్ఎస్ ప్రముఖ నాయకులైన లాడా సికాకా, డ్రెంజు క్రిసికా లింగరాజ్ ఆజాద్, ఎన్ఎస్ఎస్ సలహాదారు; బ్రిటిష్ కుమార్, ఖండూలామాలి సురాఖ్య సమితి; ఉద్యమానికి సంఘీభావంగా నిలిచిన కవి లెనిన్ కుమార్‌లతో సహా తొమ్మిది మంది వ్యక్తులపై పోలీసులు ఎఫ్.ఐఆర్ నమోదు చేశారు. వారిపై యూఏపీఏ, ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఎఫ్ఐఆర్కు సంబంధించిన వార్త ఆగస్టు 8న ఎన్ఎస్ఎస్తో పాటు మిగతా వారందరికీ చేరింది.
వేర్పాటువాద శక్తులకు, రాష్ట్ర సమగ్రతకు, సార్వభౌమత్వానికి హాని కలిగించే శక్తులకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశ్యంతో రూపొందించిన యుఎపిఎ చట్టాన్ని ప్రజా ఉద్యమ నాయకులు, కార్యకర్తలపై మోపడం మాకు విచారం కలిగించింది. ఇది చట్ట విరుద్ధం, ప్రజాస్వామ్య వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం. నియంగిరిలోని డోంగ్రియా కొంద్ సముదాయానికి చెందిన స్థానికుల స్వరాలను అణచివేయడానికి పోలీసులు చేసిన మరో ప్రయత్నం ఇది. నియంగిరిలో బాక్సైట్ గనులను తవ్వడానికి వేదాంత, ఇతర కంపెనీలు చేసిన ప్రయత్నాలను ఎన్ఎస్ఎస్ బ్యానర్ కింద రెండు దశాబ్దాలుగా అడ్డుకుంటోంది.
గ్రామసభల హక్కులను సమర్థించిన సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును అణగదొక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం, వేదాంత కంపెనీ కుట్రలో భాగంగా కూడా దీనిని చూడవచ్చు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో, గ్రామ సభల హక్కులను స్వాధీనం చేసుకుని, అడవిని, అటవీ భూములను కార్పొరేట్లకు అప్పగించడాన్ని సులభతరం చేయడానికి రాష్ట్ర బిజెడి ప్రభుత్వ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం అటవీ పరిరక్షణ (సవరణ) చట్టం 2023ని ఆమోదించింది. నియమగిరి ప్రజలపై జరుగుతున్న అబద్ధ కేసులు, అణచివేత అన్నీ ప్రజల సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే అజెండాలో భాగమేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కృష్ణ సికాకా, బారి సికాకాలను హాజరుపరచాలని హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ దాఖలు చేశారు. తత్ఫలితంగా పోలీసులు బారీ సికాకాను విడుదల చేసి, అతని గ్రామానికి చేర్చగా, కృష్ణ సికాకాను 2018లో దాఖలు చేసిన అత్యాచార కేసులో అరెస్టు చేసి జైలుకు పంపినట్లు చూపించారు. గత ఐదేళ్లలో బహిరంగ సమావేశాలు, చర్చలలో పాల్గొంటున్న, వివిధ వేదికలలో తన సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో కృష్ణ సికాకాను పోలీసులు ఎలా కనుగొనలేకపోయారు? అనే ప్రశ్నను లేవనెత్తుతుంది. ఎన్ఎస్ఎస్కు చెందిన ప్రముఖ సభ్యుడిని అదుపులోకి తీసుకునే ఉద్దేశ్యంతో పోలీసులు ఈ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
మరీ ముఖ్యంగా శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్య రాజకీయాలలో రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కు. పోలీస్ స్టేషన్ ముందు శాంతియుతంగా నిర్వహించే నిరసనను చట్టపరంగా కూడా వేర్పాటువాదం లేదా రాష్ట్ర సమగ్రత, సార్వభౌమాధికారానికి హానికరం అని అనలేము. అందుకే, ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై యుఎపిఎ ప్రయోగించడం అనేది ప్రజల గొంతులను అణచి వేయడానికి, వేదాంత మైనింగ్‌కు మార్గం తెరవడానికి చేస్తున్న ఉద్దేశపూర్వక కుట్ర. లింగరాజ్ ఆజాద్ నిరసన ప్రదేశంలో లేనే లేరని చెప్పడం కూడా యిక్కడ అవసరం.
అందువల్ల ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారుల మీద దాఖలు చేసిన ఈ ప్రతీకార, తప్పుడు, కల్పిత కేసులన్నింటినీ వెనక్కి తీసుకోవాలని, కృష్ణ సికాకాను వెంటనే, బేషరతుగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము.
లింగరాజ్ ఆజాద్, ప్రఫుల్ల సమంతర, నరేంద్ర మొహంతి, బిశ్వప్రియ కనుంగో
తెలుగు: పద్మ కొండిపర్తి