“కొన్నిదారులకు అడుగుల గుర్తులని దాచే అలవాటుండదు, కొన్ని అడుగులకు దారులతో అవసరం ఉండదు.” ఈ మాటని ఎప్పుడు, ఎక్కడ విన్నానో, చదివానో కూడా గుర్తు లేదు, మర్చి పోయాను. ఇప్పుడు నేను నడిచి వచ్చిన బాట కూడా అలాంటిదే. నా పుట్టుక జరిగింది అన్నదానికి, ఒక నేను మిగిలి ఉండటం తప్ప, నేను నడిచిన భూమి, పెరిగిన ఇల్లు, చదువుకున్న బడి… ఏదీ లేదు. మా ఊరు ఇప్పుడు లేదు. ఓపెన్ కాస్ట్ మింగేసింది. ఊరు ఉండాల్సిన ప్రదేశం ఓ పెద్ద మానవ నిర్మిత లోయగా మారిపోయింది.. అభివృద్ధి అనేది ఎంత గొప్ప పదమో అంత విషాదకరమైన మాట కూడా అని చెప్పటానికి ఇదొక ఉదాహరణ అనిపిస్తోంది.. ఇప్పుడు “నేను మా ఊరికి పోతున్నా అనేది ఒక అధివాస్తవిక వాక్యం…” ఎన్నడూ కనీసం చూడనైనా చూడని కశ్మీర్, పాకిస్థాన్, ఆఫ్గాన్ లాంటి దేశాలలాగే, ఇక ఇప్పుడు నాకు ఊహల్లో తప్ప పరిచయం లేని ఒక నిజమైన ఊహ మా ఊరు. అక్కడి ప్రజల దు:ఖాల వలెనే నిజమైనది నా దు:ఖమూనూ..
11A మైన్ అనబడు ఒకానొక బొగ్గు వెలికి తీసే రాకాసినోటికి అర్థ కిలోమీటరు దూరం కూడా ఉండనంత దగ్గరలో మా ఊరుండేది. ఓపెన్ కాస్ట్ లో భళ్ళుమంటూ బ్లాస్టింగ్ జరిగినప్పుడల్లా ఊరు ఊరంతా భూకంపం వచ్చినట్టు ఊగిపోయేది. ప్రతి ఇంటికీ నెర్రెలు వచ్చి ఉండటం మా ఊళ్లో సర్వసాధారణ దృశ్యం. తెల్లారగానే ఊరు ఊరంతా మణిరత్నం సినిమాల్లో కనిపించేలాంటి తెల్లటి పొగ నిండి పోయేది. అది పొగమంచు కాదు…. రకరకాల విషవాయువులు నిండిన పొగ, రాకాసి బొగ్గు మండిస్తే వచ్చే విషవాయువు. అందరికీ వంటచెరుకు ఉంటే మాకు మాత్రం వంట బొగ్గు ఉంటది. ఆ రాళ్లని మైన్ లోకి పోయి మోసుకొచ్చుకునే వాళ్లం. ఆ వాతావరణం చిన్నప్పుడే మాకు డస్ట్ ఎలర్జీ, రెస్పిరేటరీ ఇష్యూస్ ని తొలి బహుమానంగా ఇస్తుంది. ఆ బహుమాణాన్ని నేనూ అందుకున్నాను. సింగరేణీ బంగారు భూమిలో, బొగ్గు వెలికి తీసే కార్మికులంతా చుట్టుపక్కల ప్రాంతాలనుంచి వలసలు వచ్చి అక్కడ ఇళ్ళు కట్టుకుంటే అది ఊరయ్యింది. ఊరికి చివరగా ఉండే రెండు మంగలి ఇండ్ల మూలాన అది మంగలి పల్లె అయ్యింది. ఆ రెండు కుటుంబాలు కాక మేమూ, మా అమ్మమ్మ వాళ్ళు మరో రెండు మంగలి ఇండ్లు. అయితే ఈ రెండిళ్ళూ మంగలి పని చేసేవి కాదు. అవటానికి ప్రైవేట్ టీచరే అయినా కులాన్ని బట్టి “మంగలి సారు”అయ్యిండు మా నాన. బడికి పోయే దారిలో ఇళ్ల గోడలమీద సి.కా.స నినాదాలు జాజుతో రాసి ఉండేవి.
“మరిచిపోకు నేను బొగ్గుననీ
వేల యేండ్లుగా భూమిలో అణచబడి ఉన్నాననీ
నేను నల్లని వాన్ననీ, రాకాసి బొగ్గుననీ, సూర్యుడికి ముందు రూపాన్ననీ
అనంతానంత శక్తిని నాలో దాచుకున్నాననీ కూడా
నువ్వు గుర్తుంచుకో
నన్ను బూడిదగా మార్చాలనుకుంటే…
నానుంచి వచ్చే మహోగ్రమైన వేడిని కూడా భరించి బతకాలని గుర్తు చేసుకో…”
అంటూ ఆరోతరగతిలో రాసుకుంటే. ఆయన ఉన్న సంవత్సర కాలం నన్ను ప్రతీరోజూ గేలిచేసినట్టుగా నవ్విన ఆ “సోషల్ సార్” ఇప్పటికీ గుర్తున్నడు. (బహుశా నాలోని కవిత్వం అక్కడే మొదలై ఉంటుంది.) ఆ తర్వాత, నేను కూడా రాయగలను అని మరిచి పోయిన తరవాత… మళ్ళీ ఎప్పటికో రాయాలనిపించింది. నాకున్న కొన్ని దుఃఖాలని బయటికి వొమిట్ చేసుకోవటం కోసమైనా రాయాలనిపించింది. ఆ మధ్య కాలం పదిహేనేళ్లకు పైనే
చదువుకునే ఓపిక నాకూ, చదువు కొనే ఆర్థిక స్థాయి మానాన్నకీ లేకపోవటం వల్ల డిగ్రీ చదువు అనే సర్టిఫికెట్ తీసుకునే ప్రమాదం తప్పింది. అట్లే., ఇంత చదువు ఉండి ఈ పని చేయాలా? అనే ఫాల్స్ ప్రిస్టేజ్ కూడా దూరంగానే ఉండి పోయింది. కొన్నాళ్ళు గోదావరిఖని లోనే సెలూన్లో బార్బర్‌గా పని చేశాను. కాకుంటే ఆ స్కిల్ పట్టుబడలేదు. తర్వాత హైద్రాబాద్ వచ్చి, పొక్లైన్ మెకానిక్ గా మారిపోయాను. ఓ మల్టీనేషనల్ కంపెనీ తయారు చేసే హైడ్రాలిక్ ఎక్స్కవేటర్స్కి సర్వీస్ చేయటం మా పని. దాదాపుగా ఎనిమిదేళ్లు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాను ఓ ఎనిమిదేళ్ల పాటు. మధ్యలో ప్రయాణాల్లో పుస్తకాలు చదవటం, రాత్రుళ్ళు ఏ అర్థరాత్రో ఏదోక లాడ్జిలో నిద్రపోయి ఉదయాలు నాలుగ్గంటలకే లేచి మళ్ళీ ఇంకో ఊరి బస్సెక్కటాలు… ఇదేమి నరకం? అనుకున్నప్పుడు మా అమ్మ యాదికొచ్చేది. అన్నేళ్ల పాటు మా కోసం ప్రతీరోజూ నిద్రలేచే మా అమ్మ, ఎప్పుడూ ఇంత విసుక్కొలేదా? అనిపించిన మొదటిక్షణం…. ప్రపంచపు తల్లుల ధుక్ఖం అర్థమైతున్నట్టు అనిపించింది. చేస్తున్న ఉద్యోగంలో కనిపించే ప్రకృతి విధ్వంసం, శ్రమ దోపిడీలు స్పష్టంగా అర్థమవుతూ వచ్చాయి. మా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లూ, పోరాట కథల వెనుక ఉన్న మహా యుద్దం తెలుసుకోవటం మొదలైంది. నెమ్మదిగా మార్పు అక్కడ మొదలైందేమో…
చిన్నప్పుడు ఇబ్బందిగా అనిపించిన సందర్భాలు కుల, వర్గ వివక్షల్లో భాగం అని అప్పుడు అర్థమయ్యాయి. ఓ అమ్మాయిని ప్రేమించి కలిసి ఉండాలనుకున్నప్పుడు… కులం, ఆర్థిక స్థాయి, గౌరవం లాంటివి ఎంత బలంగా వేళ్ళూనుకున్నాయో తెలిసి వచ్చింది. బహుశా అందుకే ఇప్పటికీ డబ్బు మీద పెద్ద యావ ఉండకపోవటం, మనుషులకు మరీ ఎక్కువ గౌరవం ఇవ్వకపోవటం నాలో ఉంది. స్థిరంగా ఒక చోట ఉండటం కూడా నచ్చదు. మూసలో పడిపోతానన్న భయం వెంటాడుతూనే ఉంటుంది. నేను రాసే కవితల్లో ఈ విషయం అర్థమవుతూ ఉంటుంది. ఇప్పటికీ అదే గుణం, అందుకే నాన్ సీరియస్, బాధ్యత లేని మనిషి అని పేరు వచ్చేసింది… (ఆ పర్లేదు, నన్ను నేను కాపాడుకోవటం కదా ముఖ్యం) ఆ దశలోనే కవిత్వం ఎక్కువగా రాయటం ఉండేది… స్పర్టకస్, చే గువేరా లాంటి వాళ్ళని చదవటం, అంబేద్కర్ ని తెలుసుకోవాలనుకోవటమూ అప్పుడే. బహుశా వీళ్లందరి నుంచీ ఒక్కొక్క గుణమూ నాలో చేరుతుంటే చిన్నప్పుడు ఉన్న ఆరెస్సెస్, హిందూత్వ విషం నెమ్మదిగా తగ్గటం మొదలైంది. నెల్లూరులో ఉన్నప్పుడు తిరుపతి గుడీ, ఒంగోలులో ఉన్నప్పుడు కొన్నాళ్ళు చర్చీ, చీమకుర్తిలో ఉన్నప్పుడు మజీద్. ఈ మూడూ తలా కొద్దినెలలు నన్ను లోపలికి రానిచ్చి తర్వాత నాలోపలినుంచి దేవున్ని తరిమేశాయి.. జరుగుతున్న పోరాటాలూ, కనిపిస్తున్న మరణాలూ నాలోంచి ఒక “ఆల్ ఈజ్ వెల్” తత్వాన్ని పక్కకు జరిపేశాయి. లోలోపల మా పల్లె జానపదాన్ని పాడుకుంటూ ఈ జనం మధ్యన తిరిగే కాస్మో పాలిటన్ నగర జీవిని నేను…
ఉద్యోగరీత్యా ఊళ్లు తిరగటం, కవిత్వం రాయటం పారలల్ గా నడుస్తూనే ఉంది, 2014లో విజయవాడలో ఉండగా నచ్చని జాబ్ ఉన్నపళంగా వదిలేసి శాశ్వతంగా హైదరాబాద్ వచ్చేసాను. కవి యాకూబ్ నన్ను అక్కున చేర్చుకున్నారు. తర్వాత మరికొంతమంది…. డబ్బులుండేవి కాదు ఎక్కువ దూరాలు నడవటం, ఆకలేసినప్పుడు అప్పటికప్పుడు ఏదో పని చేయ్యటం. కనిపించినవాళ్ళు చాలా సార్లు డబ్బులో, మరేదో హెల్ప్ చేసేవాళ్ళు..ఒక ఎయిమ్, టైమ్ అంటూ టార్గెట్ పెట్టుకోకుండా ఎటు పడితే అటు తిరగటం. చత్తీస్ ఘడ్, తమిళనాడు, నల్లమలా ఇట్లా చాలా ఏరియాలు పిచ్చిగా తిరిగేవాన్ని. చేతిలో ఒకే ఒక విలువైన వస్తువు మొబైల్ ఫోన్ మాత్రమే. రాయాలనుకున్నది రాయటం తప్ప అది ఇలాగే ఉండాలన్న నిబంధన ఎప్పుడూ లేదు. కవి సంగమం, విరసం ఈ రెండూ అందుబాటులో ఉండే వేదికలు. శ్రీకాంత్ నన్ను ఆకర్షిస్తే, అనామధేయుడు కుదుపు కుదిపాడు, వీవీ సముద్రమై కమ్ముకుంటే, సముద్రుడు, శివసాగర్ సూటిగా రాయటమెలాగో చెప్పారు. కవిత్వం రాయటంలో కూడా ఒక్కరి ప్రభావం ఉందని చెప్పలేను. నామీద, నా కవిత్వ శైలి మీదా చాలా మంది కవుల ప్రభావం ఉంది. రాయటం ఒక తప్పని సరి అవసరం అయిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఇదే, ఇట్లాగే, ఇలాంటి భాషే అనే నిబంధనలు మాత్రం లేవు. అది నాలోని ఒక అసహనం వల్ల వచ్చిన గుణమో, జరుగుతున్న ఏ విధ్వంసాన్నీ ఆపలేక ఈ చిన్న విషయాల్లో నేను చూపించే ధిక్కారమో ఇప్పటికీ అర్థం కాలేదు నాకు.
రాయటానికి ఎలాగైతే నిబంధనలు లేవో ఏదైనా ప్రొటెస్ట్ జరిగితే అక్కడ నిలబడటానికి కూడా ఏ బ్యానర్ అని చూసుకునే పనికూడా లేదు నాకు… అవి లెఫ్ట్ పార్టీలా? విదార్థి సంఘాలా? బహుజన, దళితవాద పార్టీలా, ప్రజా పోరాట సంఘాలా అని కూడా పట్టింపు లేదు. ఎవరు రోడ్డు మీద నిలబడితే ఆ కారణాన్ని చూసి వాళ్ళతో పాటు గొంతు కలపటమే ఇప్పటివరకూ తెలిసింది. ఇది ఈ ప్రపంచం కవిగాడనుకునే ఒకానొక అత్యంత సాధారణ మనిషి జీవితం…
చే నచ్చుతాడు, బాబ్ మార్లే ఎక్కువ నచ్చుతాడు. యాకూబ్ రాసే కవిత్వం, అలిశెట్టి ప్రభాకర్ రాతా ఇష్టం. ఖలీల్ గీబ్రాన్ ఇష్టం, మావో అంతకన్నా ఇష్టం… ప్రభావితం చేసిన మనుషులు వందల్లో ఉంటారు. అయితే ప్రత్యేక గుర్తింపు ఇవ్వటం అవసరమా అనిపిస్తుంది, నిజంగా కృతఙ్ఞత చెప్పుకోవాల్సి వస్తే ఇప్పటిదాకా నిర్మించబడ్డ ఈ సమాజాల మూలాల మొదటి మనుషులనుంచీ మొదలు పెట్టాలి… అవును, నన్ను నిలబెట్టిన ప్రతీ మనిషికీ నేనొక కొనసాగింపును. వాళ్లంతా నాతో పాటుగా భవిష్యత్తులోకి వస్తారు. నేను ఆగిపోయిన కాడ ఇంకొకడెవ్వడో నన్నూ కలుపుకొని వాళ్ళని మోసుకుంటూ సాగుతాడు. పోరాటం జరిగినంత సహజంగా ఈ బదిలీ జరుగుతూనే ఉంటుంది.
రాయటం ముఖ్యం, అది ఏ ఫార్మాట్ లో ఇరుక్కోకుండా ఉండటం ఇంకా ముఖ్యం. కాబట్టి ఇది కవిత, ఇది వచనం అని ఎలాంటి లిమిట్స్ లేవు. రాస్తున్నప్పుడు దేనినీ మనం బంధించి మూసలో పోయాలని కూడా అనుకోవాల్సిన పనిలేదు. అది రాసేవాడి మనఃస్థితిని బట్టి దాని రూపం తీసుకుంటుంది. ఒకానొక సంఘటనమీద రాయటం ఎవరికీ డ్యూటీ కాదు. కవిత రాయలేని స్థితిలో ఉన్నవాడు పోయి కార్యక్షేత్రంలో ప్రత్యక్షంగా నిలబడతాడు. అతన్ని కవికన్నా ఎత్తులోనే చూస్తాను. కాబట్టే..! కవి అనగానే సామాన్యుడికన్నా ఒక మెట్టు ఎక్కువ అనుకోవటం ఇప్పటికి లేదు. ఈ 12 సంవత్సరాలలో రాసిన కవితలు ఓ రెండు వందల వరకూ ఉండొచ్చు, అచ్చువేసినవి 50 వరకూ ఉన్నాయేమో. నిశ్శబ్ద అనే పుస్తకం రెండేళ్ల కిందట వచ్చింది, దానికంటే ఓ అయిదేళ్లకి ముందు తీరం దాటిన నాలుగు కెరటాలు అనే పేరుతో నేనూ, అనిల్డాని, చైతన్య, వర్ణలేఖ ల కవితలని కలిపి మువ్వా శ్రీనివాసరావు గారు వేసిన పుస్తకంలో కొన్ని కవితలు వచ్చాయి. రాసిన కొన్ని కథలు కూడా సోషల్ మీడియాలోనూ, ఆన్లైన్ మ్యాగజైన్స్ లోనూ వచ్చాయి. ప్రింట్ మీడియాలో అచ్చుకి పంపటం ఇష్టం లేకపోవటం వల్ల ఒకే ఒక కథ నా ప్రమేయం లేకుండా ఓ ప్రముఖ పేపర్లో అచ్చయ్యింది. ఆ తర్వాత యెప్పుడూ అలాంటి ప్రమాదం జరక్కుండా జాగ్రత్త పడ్డాను. నిజానికి నేను… సోషల్ మీడియాలోనే ఎక్కువ రాసిన, అక్కడ రాయటాన్ని ఇష్టపడతాను. కవితకన్నా ఒక వ్యాసం రాసేటప్పుడు బాధ్యతగా ఫీలవుతాను. ఇప్పటికీ నా కవిత్వానికంటే నేను రాసిన వ్యాసాలు, లేదా పోస్టులు అనబడు సోషల్ మీడియా కంటెంట్స్ కే ఎక్కువ ఫాలోయింగ్ ఉందని నమ్ముతాను. చాలా సందర్బాలలో కవిత్వం వ్యక్తిగత వ్యవహారమనీ అనుకుంటాను, కేవలం కవిత్వంతో సమాజం మారిపోతుందనే మాట పట్ల కూడా నాది భిన్నాభిప్రాయమే. నిజానికి నేనిప్పటివరకూ ఏదైనా ధిక్కార వాక్యం రాసి ఉంటే మాత్రం, ఆ క్రెడిట్స్ ఎప్పుడూ నన్ను వెంటాడే ఈ వాక్యానివే
“కవిత్వమంటే కమ్యూనిస్టు మేనిఫెస్టో కాదేమో గానీ గ్రీన్ హంట్ లో చెదిరిపడిన దేహాల ధిక్కార నయనాలు మాత్రం కచ్చితంగా కవిత్వమే….” (అనామధేయుడు) .
రాయటం తప్పని సరి కాదు. రాయటం బాధ్యత కూడా కాదు. కానీ, రాస్తున్నప్పుడు ఒక్కొక్క వాక్యం నన్ను ప్రశ్నించకుండా ఉండటమే ముఖ్యం అనుకుంటాను. నగరీకరణ, ఫాసిజం, గ్రీన్ హంట్, భారతదేశాన్నే అమ్మటం, వ్యవసాయ రంగాన్ని సమూలంగా దెబ్బతీయటం….. ఇన్ని భారాల మధ్య కూడా ఇక్కడ బతికి ఉండటం ఒక పోరాటమైతే. వాటిని ఎదిరించి మరీ నిలబడుతున్న వాళ్ళు యుద్ధమే చేస్తున్నట్టు. అటువంటి యోధులకి రెడ్ సాల్యూట్స్ తో…
మీ అంతరంగాన్ని దానిలోని సుడిగుండాన్ని అక్షరబద్ధం చేసారు. అభినందనలతో
థాంక్ యు సర్
బాగుంది నరేష్
మంచి పయనం… కవిత్వమంటే.. బతుకు బాటే… అచ్చు లో కవిత్వం అవసరమే..