కవి నడిచి వచ్చిన దారి తననెప్పుడూ ప్రజల వైపు నిలబెడుతుంది. కవిత్వంలో అత్యంత ఆధునిక శైలిలో తనకంటూ ఒక ఫ్రేంతో మనకు సుపరిచుతులైన కవి ఆశారాజు గారు. సిటీ లైఫ్ లోని సంక్లిష్టతను సున్నితంగా సరళంగా తనే రాయగలరని అందరికీ ఎరుక. ప్రతీ కవితలోనూ తన డిక్షన్ ఓ ప్రత్యేకతని మనకు అనుభూతిలోకి తెస్తుంది.  వరుసగా వచ్చే తన కవితా సంపుటాలలో నవ్యత తొణికిసలాడుతుంది. ఆ ఫ్రెష్నెస్ ని మనం తన కవిత్వాన్ని చదివేటప్పుడు  ఫీల్ కాగలం. తను కట్టే దృశ్య చిత్ర మాలిక మన మనో ఫలకంపై కదలాడుతూ వుంటుంది. అదే కవి సామాజిక సంక్లిష్టతపై, కల్లోలంపై రాస్తే తనలోని ఆగ్రహాన్ని ఎలా వ్యక్తం చేస్తారో ఈ కవిత “ఆవిర్భావం” మనకు ఉదాహరణ. ఇరవై ఎనిమిదేళ్ళ క్రితం రాసినదైనా ఈనాటి అప్రకటిత నిషేధానికి ఈ అసహన రాజ్య నిర్బంధ కాలానికి సరిగ్గ సరిపోతున్నది. కవి యొక్క సునిశితమైన చూపు ద్వారా రూపు కట్టిన కవిత యొక్క ప్రాసంగికత ఎప్పటికీ సరిగా తూకమౌతుంది.

నేను పుట్టకముందే

నా తల్లి కనటాన్ని నిషేధించి వుంటారు.

నన్ను కలగన్నందుకే

నా తండ్రిని హింసించి వుంటారు

ఇక్కడి బతుకే నిర్బంధమైనందుకు

నిషేధమే జీవితమైనందుకు

నేను ఉదయించగానే

నా తల్లి అస్తమించి వుంటుంది.

మనిషి పుట్టుకపైనే నియంత్రణ, కలలపైన నిషేధం, నిర్బంధ వాతావరణంలో పుడుతున్న బాల్యం ఎంత తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కుంటుందో, జీవితమే నిషేధింపబడి బతుకు నిత్యం నిర్బంధాల మధ్య గడిస్తే తల్లిని కోల్పోయిన బాల్యం వికసిస్తుందా? సంక్షుభిత కాలంలో వేలాదిమంది పిల్లలు రోడ్లపైన తిరుగాడుతున్న దృశ్యం మనకు కనబడుతుంది. అలాగే అకారణంగా నిర్బంధించబడి జైళ్ళలో పుట్టిన పిల్లల బాల్యం ఎంత కఠినంగా తయారవుతుంది. వారి మనస్సులలో ముద్రించబడిన జీవిత కల్లోలాన్ని ఎలా తుడిచి వేయగలం. అందులోను ఆదివాసీ, దళిత వర్గాలవారైతే వారి జీవితాలు ఎన్నెన్ని అవమానాల మధ్య చీత్కారాల మధ్య చిదిమి వేయబడుతున్నాయో కదా?  మనిషి మనిషిగా రూపుకట్టాలంటే పునాది బాల్యమే కదా? దానిని పోగొడుతున్న రాజ్యం ఎన్ని సంక్షేమ పథకాలతో కృత్రిమ వాతావరణాన్ని సృష్టించ చూసినా సాధ్యమవుతుందా? నేరమయ వాతావరణానికి రాజ్యానిదే బాధ్యత కదా? సమాజం దీనిని ప్రశ్నించలేకపోవడం ఎప్పటికీ విషాదమే. రోగాన్ని సృష్టించి దానికి పలాస్త్రీ పూసే పాలక వర్గాలదే బాధ్యత. పాలక వర్గాలకు కఠిన చట్టాలను చేసేందుకు సాయపడుతున్న సమాజానిదీ ఈ నేరంలో భాగమే.

చనుబాలు నిషేధమే!

వెచ్చవి వొడి దొరకని పసిపిల్లలకు

బాల్య ప్రపంచమూ విషేధమే!

ఆడుకోవడం, చదువుకోవడం

శరీరంనిండా దుస్తులేసుకోవడం

ఆప్యాయంగా, రెండు ముద్దలు తినటం

అన్నీ, ఈ రాజ్యంలో నిషేధాలే!

చదువు ఆటలూ అన్నీ కార్పొరేట్ మయం అయిపోయిన నేటి సందర్భంలో వలస కార్మికులు, నిరుద్యోగంతో ఆదాయం కోల్పోయిన కుటుంబ జీవనంలో బాల్యం ఎంత దుర్భర పరిస్థితిని ఎదుర్కుంటుందో దానికి తోడు నిర్బంధ వాతావరణంలో ఏదీ అడగలేని ప్రశ్నించలేని బతుకుల మధ్య చితికి పోతున్న బాలల దైన్య స్థితి నాటికంటే నేడు మరింత వేదనాభరితమయింది.

రేషన్ కార్డులిచ్చీ

తినటానికో కొలతనిచ్చీ

బతకటాన్నే నిషేధించారు

ఉద్యోగాలుండవు

అడగటానికి హక్కులుండవు

ఎవరూ ఎదురుగా నిలబడి మాట్లాడకుండా

ఎవరికివారు, చట్టాల్ని సవరించుకున్నారు.

సంక్షేమం పేరుతో ప్రభుత్వాలు జీవితాలలోకి ప్రవేశించి తాము నిర్దేశించిన కొలతలలోనే జీవించడం దగ్గరనుంచి తినడానికి కొలమానం సృష్తించి బతుకును చిద్రం చేయడాన్ని అలాగే హక్కులని హరించి మాటలను సైతం నిషేధించే కౄర చట్టాలను తయారు చేస్తున్న ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత జీవితంలోకి చొరబడడాన్ని ఈ స్టాంజాలో మన గమనంలోకి తీసుకు వచ్చారు కవి.

ఇక్కడ మాటను అడుక్కోవాల్సిందే

మౌనాన్నీ అడుక్కోవాల్సిందే

రక్తమూ కనిపించదు, దెబ్బలూ వినిపించవు

మనిషి మాత్రం చిత్రహింసల పాలవుతాడు.

ఇక్కడ శ్వాసనుకూడా అడుక్కోవాల్సిందే

మగపిల్లలందర్నీ, ఎప్పుడో ఎత్తుకుపొయ్యారు

పల్లెలన్నిట్నీ, పోలీసు ఠాణాలు చేసేశారు.

తల్లిదండ్రులింకా కొడుకుల్ని వెదుక్కుంటూనే వున్నారు

వీధులన్నీ స్మశానాలయ్యాయి

అప్రకటిత నిషేధ కాలంలో బయటకు కనిపించని హింసతో మనిషి నలిగిపోవడాన్ని ఈ భాగంలొ కవి ఎరుకలోకి తీసుకువచ్చారు. మగ పిల్లలనే  చెప్పారు కానీ నేడు రాజ్యానికి ఆడా మగా వృద్ధులూ అంగ వైకల్యంతో బాధపడే వారూ అన్న తేడా లేదన్నది నేడు మనకు అనుభవంలోకి వచ్చింది. ఇటీవలి ఎన్ ఐ ఏ వారి దాడులు అరెస్టులు చూస్తున్న మనకు దేశ భద్రత పేరుతో రాజ్య ద్రోహం పేరుతో దేశ ద్రోహం పేరుతో వలస ప్రభుత్వ చట్టాలకు పదును పెట్టి నిర్బంధిస్తున్న కాలమిది. తల్లిదండ్రులు పిల్లలను భార్యలు భర్తలను, పిల్లలు తల్లి దండ్రులను వెదుక్కుంటున్న సంక్షుభిత కాలంలో వున్నాం. ఒక కవిత ద్వారా తన లోలోపలి ఉక్క పోతను వ్యక్తపరిచినా సరే ఓర్వ లేని పాలక వర్గం తీవ్రమైన కేసులు పెడుతూ నిర్బంధం అమలు జరుపుతున్న కాలం. ఒక రకమైన స్మశాన వాతావరణం అలముకున్న వేళ. నాటి నుండి నేటి వరకు.

జనాన్ని ఖాళీ చేయించిన రాజ్యంలో

ఇప్పుడు కొత్తగా దేన్ని నిషేధించినట్టు?

నేను పుట్టకముందే

నా తల్లి గర్భాన్ని నిషేధించి వుంటారు

నేను నిర్బంధాల్నీ నిషేధాల్నీ ధిక్కరించి

ఈ కల్లోలిత రాజ్యంలో

కవిత్వంగా ఆవిర్భవించాను.

ప్రజలను ఖాళీ చేయించాక రాజ్యం దేన్ని నిషేధించగలదని కవి ప్రశ్నిస్తున్నారు. ఇన్నిన్ని నిషేధాల మధ్య నిర్బంధాల మధ్య ఆవిర్భవించిన కవి ఈ చీకటి కాలాన్ని ధిక్కరించే కవిత్వం కాకుండా ఉండగలరా? ఎప్పటికీ కవి ప్రజల పక్షం వహించాలన్న కవి అంతరంగం మనకు దిశా నిర్దేశం చేస్తుంది ఈ కవిత ద్వారా. సామాజిక కల్లోలాన్ని చిత్రించకుండా కవి తాదాత్మ్యం చెందలేడు అనేందుకు ఈ కవిత చక్కని ఉదాహరణ. సరళంగా సున్నితంగా  అంతే శక్తివంతంగా దృశ్యమానం చేయడంలో తనకున్న శిల్ప నైపుణ్యంతో కవిత్వీకరించిన ఆశారాజు గారికి అభినందనలు  తెలియ పరుచుకుంటూ రాస్తున్న యువ కవులకు ఆశారాజు గారి కవిత్వాన్ని అధ్యయనం చేయడం ద్వారా మనకు మనం సరళీకరింపబడుతూ ఎప్పటికప్పుడు కొత్తగా రాసే టెక్నిక్ ను అలవరచుకోవడానికి దోహదపడుతుందన్నది నా మాట.

One thought on “నిషేధాల మధ్య ఆవిర్భవించిన కవి

  1. 👍♥️✊
    మా సత్యం
    ఆశారాజు కవిత్వం “కలలతో ప్రయాణం” పై
    కె క్యూబ్ వర్మ విశ్లేషణ చదివా.
    కవి మిత్రులు ఆశారాజు గారు గొప్ప స్నేహశీలి.
    ఏ సంఘములో కూడా సభ్యులు కాదు. కానీ పీడిత ప్రజల పట్ల ప్రేమ ఉన్న వాడు.
    మావో అన్నట్లు
    ” సాహిత్యానికి మూల కందము మానవాళిపై ప్రేమ” ఆ ప్రేమ వారి కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తుంది కానీ విప్లవ కోణంలో పరిశీలించినప్పుడు వారి వ్యక్తిగత బలహీనతల వల్ల వారి ప్రేమ త్యాగాన్ని ఇవ్వకపోయినా, పీడిత ప్రజల పక్షాన నిలబడ్డ కవి.
    ఆశారాజ కవిత్వంలో
    ” నిషేధమే జీవితమై నందుకు
    నేను ఉదయించగానే
    నా తల్లి అస్తమించివుంటుది” కవితా వస్తువు లోని
    పదబంధాలు ప్రతీకలు ఆలోచింపజేస్తున్నాయి.
    సిద్ధాంత దృక్పథం లేకున్నా కవి యొక్క తాత్విక దృక్పథం, మానవ సంబంధాల గురించి అవగాహనతో రాజ్యహింసను అంతర్లీనంగా తెలియజేస్తుంది.
    ఆశారాజు కవిత్వం “కలలతో ప్రయాణం” పై
    కె క్యూబ్ వర్మ గారి పొదు పయిన విశ్లేషణ గతితార్కికతో ముడిపడి ఉంది. తార్కికమైన ప్రశ్నలతో
    “నేరమయ వాతావరణానికి రాజ్యానికి బాధ్యత కదా? సమాజంలో దీనిని ప్రశ్నించే లేకపోవడం
    ఎప్పటికీ విషాదమే.” కె క్యూబ్ వర్మ చక్కగా వివరించారు.
    ఉద్యమాభి వందనాలు.✊✊

Leave a Reply