సకల జీవరాసులకు నీరు ఎంత ప్రాణదాయినో చెప్పవలసిన పని లేదు. నీరు లేకపోతే జీవపు ఉనికే లేదు. భూమి పై అత్యంత విస్తారంగా లభించే సహజ వనరు కూడా గాలితో పాటు నీరే. అటువంటి నీరు ప్రకృతి కారణాలతో తప్ప అందరికీ, సకల జీవరాసులకు సహజంగానే లభించాలి. నీటిని తాగు, సాగు అవసరాలకై ప్రజలందరికీ లభ్యమయ్యేలా చూడటం అన్ని ప్రభుత్వాల సహజ బాధ్యత. అవి తమ బాధ్యతను ఎంత వరకు నెరవేర్చాయనే విషయం పక్కన పెడితే గత మూడు దశాబ్దాలుగా ఇంతటి సహజమైన వనరును కూడా, ఏ వనరు లేకపోతే మానవ మనుగడే ఉండదో అటువంటి వనరును కూడా ప్రైవేటు పరం చేసే ప్రక్రియ మొదలైంది. 1990లలో లాటిన్ అమెరికా దేశాలలో మొదలైన ఈ ప్రక్రియ క్రమంగా ప్రపంచమంతా పాకుతోంది.

పెట్టుబడి పెనుభూతం ఎడతెగని తన లాభాల దాహాన్ని తీర్చుకోవడానికి మనుషుల అత్యంత కనీస అవసరమైన నీటిని కూడా సరుకుగా మార్చివేసింది. ఈ లాభాల వేట గురించి తెలుసుకునే ముందు మొదట ఈ సహజ వనరును గురించి తెలుసుకుందాము.

భూమి పై నీరు రెండు రూపాల్లో ఉంది. సముద్రాలలోని ఉప్పు నీరు. ఇది మొత్తం నీటిలో 97.5%. మిగిలిన 2.5% నీరు మాత్రమే మంచి నీరు. మనుషులు, ఇతర భూచర జీవులు మంచి నీరు మాత్రమే తాగగలరు. ఇందులో 68.7 శాతం మంచు గ్లేషియర్ల (హిమనదాలు) రూపంలో, 30.1 శాతం భూగర్భ జలాల రూపంలో, మరో 0.8 శాతం గడ్డ కట్టుకొని ఉన్న మంచు రూపంలో (పార్మాఫ్రాస్ట్) ఉంది.  0.4 శాతం మాత్రమే ఉపరితల జలాలు. నదులు, మంచి నీటి సరస్సులు అన్నీ కలిసి మనుషులకు అందుబాటులో ఉన్న ఉపరిజలాల పరిమాణం ఇంతే. అందులో కూడా పునరుత్పాదన (renewable) చెందే జల వనరులు మరింత తక్కువ. దీనితో మనుషులు భూగర్భ జలాలను అపరిమితంగా వాడటం మొదలు పెట్టారు. గత 70 ఏళ్ళలో ప్రపంచ జనాభా మూడు రెట్లు కాగా నీటి వాడకం ఆరు రెట్లు పెరిగింది. సాగు నీటికి, పరిశ్రమల వాడకానికి నీటి వినియోగం ఇబ్బడిముబ్బడిగా పెరగటమే దీనికి కారణం. పరిశ్రమలకు నీటి అవసరాలు పెరిగే కొద్దీ ప్రభుత్వ రాయితీలతో, ప్రజల సొమ్ముతో తమ నీటి అవసరాలను తీర్చుకోవడమే కాకుండా నీటి పై తమ గుత్తాధిపత్యం కోసం పెట్టుబడిదారుల ఆలోచనలు మొదలయ్యాయి. అంతే కాకుండా పెట్టుబడిదారీ విధానపు సహజ లక్షణమైన అసమాన అభివృద్ధి కారణంగా, తక్షణ లాభాలే తప్ప మనగలిగిన (సస్టెయినబుల్) అభివృద్ధి పెట్టుబడికి పట్టని కారణంగా పట్టణీకరణ విపరీతంగాపెరిగింది. బృహత్ నగరాలు అవతరిస్తున్నాయి. అందువల్ల తాగు నీటి అవసరాల కేంద్రీకరణ పెరగటంతో నీరు ఎంతో లాభసాటి వనరుగా మారిపోయింది. ఆ సహజ వనరును సరుకుగా మార్చుకోవడం గత కొన్ని దశాబ్దాలుగా పెరిగిపోయింది.

నీరు సరుకా, మానవ హక్కా?

1992 డబ్లిన్ వాటర్ కాన్ఫరెన్స్, వర్ల్డ్ వాటర్ విజన్ నీటిని ఒక ఆర్థిక వస్తువుగా అంటే సరుకుగా అభివర్ణించింది. కానీ జీవించే హక్కు అనేది మనుషుల మౌలిక హక్కు. తిండి, నీరు, ఆరోగ్యం, స్వఛ్చ వాతావరణం అనేవి మనుషుల మౌలిక హక్కులో భాగం. నీరు లేకపోతే జీవితమే లేదు కాబట్టి అది మౌలిక మానవ హక్కు. కాబట్టి నీటిని సరుకుగా చూడటమనేది సామాజికంగా, నైతికంగా, పర్యావరణపరంగా కూడా తప్పు. నీటిని సరుకుగా భావించినప్పుడు నీటిని గురించి చేసే విధాన నిర్ణయాలు సామాజిక, పర్యావరణ కోణాల నుండి కాకుండా వాణిజ్యపరమైన కోణం నుండి, లాభ నష్టాల కోణం నుండి ప్రభుత్వాలు చేస్తాయి.

నీటి ప్రైవేటీకరణకు ప్రజామోదం పొందడం కోసం కొన్ని బాగానే అనిపించే వాదనలు మన ముందుకు ప్రయివేటీకరణ మద్దతుదారులు తీసుకువస్తారు. వాటిలో అతి ముఖ్యమైనవి రెండు:

  1. ప్రైవేటీకరణ వల్ల నీటి వసతుల నిర్వహణ మెరుగు పడటం ద్వారా ఆ ఖర్చులు తగ్గుతాయి. అంతే కాక ప్రజలకు మరింత సమర్థవంతంగా నీరు అందుబాటులోకి వస్తుంది.
  2. నీరు ఉచితంగా లభించడం వల్ల ప్రజలు అవసరానికి మించి ఖర్చు చేసి అత్యంత విలువైన ఈ వనరును వృధా చేస్తున్నారు. ప్రైవేటీకరణతో నీటికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. దాని వల్ల ప్రజలు నీటిని పొదుపుగా వాడతారు.  

మొదటి వాదన అన్ని రంగాల ప్రైవేటీకరణ కోసం వాడుతున్నదే. ప్రైవేటీకరణకు గురైన అన్ని రంగాలలోనూ దోపిడీ, పెట్టుబడిదారుల లాభాలు, పని పరిస్థితులు దిగజారిపోవడం ఎంత పెరిగాయో చూస్తూనే ఉన్నాము. నీటి ప్రైవేటీకరణకు కూడా అదే గతి పట్టక తప్పదు.

రెండవ వాదనలో కొంత పస ఉందేమో అని పైకి కనిపిస్తుంది. కానీ ప్రయివేటీకరణ జరుగుతున్నది జల వనరుల సంరక్షణ కోసం కాదు. అందుకు వేరే మార్గాలు అవలంబించవచ్చు. అందరికీ సగటు అవసరాల మేరకు ఉచితంగానో, ఖర్చుల మేరకు మాత్రం కనీస ఛార్జీలు విధించి అంతకు మించి విలాసవంతంగా నీటిని వృధా చేయడం పై కఠిన ఆంక్షలు విధించవచ్చు. సాగు నీటి విషయంలో కూడా ప్రణాళికా బద్ధంగా పంటలు వేయడం, తక్కువ నీటితో సాగయ్యే పంటలకు ఎక్కువ ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి చర్యలు చేపట్టవచ్చు. పెట్టుబడిదారీ ప్రభుత్వాలు తామే అవలంబించిన పద్ధతుల వల్ల కలుగుతున్న దుష్ఫలితాలకు ప్రజలను బాధ్యులను చేసి ప్రైవేటీకరణకు వకాల్తాదారులుగా మారడం చాణక్య నీతి తప్ప మరేమీ కాదు.

నీటి ప్రైవేటీకరణ జరిగినప్పుడు నీటి కొరత, అత్యధిక మొత్తాలలో లాభాలను గడించడం అనే కోణాలనుండే నీటి నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలు జరుగుతాయి తప్ప, ప్రజల అవసరాలు, దీర్ఘ కాలంలో నీటి మనుగడ (sustainability) అనే దృక్పథం ప్రైవేటు రంగానికి ఉండనే ఉండదు. కానీ బహుళ జాతి కంపెనీలు ప్రపంచ బ్యాంకు, ఐ‌ఎం‌ఎఫ్ ల మద్దతుతో పబ్లిక్ నీటి సదుపాయాలను ప్రైవేటీకరించి తమతో కాంట్రాక్టులు కుదుర్చుకోవడానికై అర్థ వలస దేశాలపై విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నాయి.

నీరు సరుకైనప్పుడు నీటిని కొనగలిగిన వాళ్ళు తమ విలాసాలకు – ఉదాహరణకు ప్రైవేటు స్విమ్మింగ్ పూల్ లు, నీటి కొరత ఉన్న ప్రాంతాలలో కూడా విలాసవంతమైన వాటర్ పార్క్ లు, గోల్ఫ్ కోర్స్ లు, ప్రైవేటు పచ్చిక బయళ్ళు వంటి వాటికి విచ్చల విడిగా నీటిని వాడుతున్నారు. మరొక వైపు తాగు నీటి కోసం కూడా తపించిపోతున్న ప్రజలు ఉన్నారు. ప్రైవేటీకరణతో ఈ అంతరం మరింత పెరుగుతుందే తప్ప తరగదు. అత్యంత విలువైన జల వనరులను విలాసాలకు వాడటం పెరుగుతుందే తప్ప తగ్గదు.

నీటి ప్రైవేటీకరణ – అంతర్జాతీయ అనుభవం:

నీటి ప్రైవేటీకరణ 1990లలో మొదట లాటిన్ అమెరికాలో ప్రారంభమై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకూ వ్యాపిస్తోంది. దీని వెనకాల కూడా ప్రపంచ బ్యాంక్, ఐ‌ఎం‌ఎఫ్ ల ఒత్తిడి ఉందని వేరే చెప్పనవసరం లేదు. రుణాలు మంజూరు చేసేటప్పుడు నీటిని ప్రైవేటీకరణ చేయాలనే షరతును విధించాయి. నీరు అనేది ఒక మౌలిక హక్కు. దానిని పబ్లిక్ రంగం నుండి ప్రైవేట్ పరం చేయడమంటే ఆ హక్కును కాలరాయడమే. ప్రభుత్వాలు తమ కనీస సామాజిక బాధ్యత నుండి తప్పుకోవడమే. ప్రభుత్వం నీటివనరులను అసమర్థంగా నిర్వహిస్తున్నదని ప్రచారం చేసి ప్రైవేటు రంగానికి అప్పజెప్పే ప్రక్రియ మొదలు పెట్టారు. ప్రైవేటు కంపెనీలు అత్యధిక లాభాలకు నీటిని అమ్మడమంటే అది జీవనానికి అత్యంత మౌలిక అవసరాల్లో ఒకటైన నీటిని సాధారణ ప్రజలకు నిరాకరించడమే అవుతుంది. 75% వరకు ‘నీటి పరిశ్రమ’ కొన్ని యూరోపియన్, అమెరికన్ బహుళ జాతి కంపెనీల అదుపులోనే ఉంది. ఈ బహుళ జాతి కంపెనీలు వివిధ దేశాల ప్రభుత్వాలపై నీటిని, దాని నిర్వహణను ప్రైవేటు పరం చేయాలని విపరీతమైన ఒత్తిడి పెంచి అందులో విజయవంతమవుతున్నాయి. సహజంగానే నీటి నిర్వహణ ప్రైవేటు పరం అయినప్పుడు సాధారణ ప్రజలపై పెను భారం పడుతుంది. ప్రైవేటీకరణ జరిగిన అనంతరం బ్రిటన్ లో నీటి బిల్లులు 1989-95 మధ్య 67 శాతం పెరిగాయి. నీటి కనెక్షన్లను తీసివేయడం 177 శాతం పెరిగింది. నీటి ధరలు 45 శాతం పెరగగా, కంపెనీల లాభాలు 692 శాతం పెరిగాయి. ఈ కంపెనీల సి‌ఈ‌ఓ ల జీతాలు 700 శాతం పెరిగాయి. ఫ్రాన్స్ లో కూడా నీటి బిల్లులు 150 శాతం పెరిగాయి.

బొలీవియా లో మునిసిపల్ నీటి సరఫరా ప్రైవేటీకరణ తరువాత నీటి బిల్లులను విపరీతంగా పెంచివేసారు. ప్రజలు కట్టలేకపోతే కనెక్షన్లను తొలగించివేయడంతో అక్కడ కొచమాంబ నగరంలో నీటి యుద్ధాలుజరిగాయి. నీటి కొరత ప్రజల ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావం వేసింది. ఆఫ్రికా ఖండం లో కూడా నీటి సరఫరా ప్రైవేటు పరం చేసిన అనేక నగరాల్లో – ( ఉదా: టాంజానియా లో దార్- ఎస్-సలాం, దక్షిణ ఆఫ్రికా లో కోన్ కొబే నగరం) అది ప్రజలకు నీటి హక్కును నిరాకరించి ప్రజల ఆరోగ్యాలపై చాలా దుష్ప్రభావాలు కలుగజేసింది.

ఈ ప్రైవేటీకరణలో ఇతర ప్రైవేటీకరణల లాగానే మొత్తం ప్రైవేటీకరణ కూడా జరగదు. మొత్తాన్ని కొన్ని విభాగాలుగా విడగొట్టి లాభాలు వచ్చే విభాగాలను మాత్రం ప్రైవేటీకరణ చేస్తారు. నష్టాలు రాగలిగే విభాగాలను ప్రభుత్వ రంగంలో ఉంచుతారు. లాభాల ప్రైవేటీకరణ, నష్టాల జాతీయకరణ అన్ని రంగాలలో మాదిరిగా ఇక్కడ కూడా జరుగుతుంది.

భారతదేశంలో నీటి ప్రైవేటీకరణ:

మన దేశంలో కూడా ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు కనుసన్నలలో జల విధానాలు రూపొందించడం మొదలైంది. 2002లో ప్రభుత్వం జాతీయ జల విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ విధానం ప్రకారం “ఎక్కడ సాధ్యమైతే అక్కడ జల వనరుల పథకాల ప్లానింగ్, అభివృద్ధి, నిర్వహణల కోసం ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి”

ఒక దశాబ్ద కాలంలోనే దేశంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో నడిచే ప్రాజెక్టుల సంఖ్య 300కు చేరుకుంది.  మహారాష్ట్రలో అత్యధికంగా 48 ప్రాజెక్టులు, కర్నాటకలో 26, తమిళ నాడులో 25, ఢిల్లీలో 20, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 15 ప్రాజెక్టులు అమలులోకి వచ్చాయి. ఈ ప్రైవేట్ భాగస్వామ్యంలో జల విద్యుత్తు కేంద్రాలు, పరిశ్రమలకు నీటి సరఫరా, తాగు నీరు, సాగు నీరు వంటి వన్నీ ఉన్నాయి. నీటి సరఫరాలో ఇతర దేశాల అనుభవాల లాగానే ప్రైవేటు రంగం ఇక్కడ కూడా విఫలమే అయ్యింది. టాటా సమూహానికి చెందిన జే‌యూ‌ఎస్‌సి‌ఓ జంషెడ్ పూర్ తో పాటు మైసూర్, భోపాల్, గ్వాలియర్, కోల్ కత్తా, హల్దియా, ముజఫర్ పూర్, చెన్నై నగరాలలో జల నిర్వహణ బాధ్యతలను తీసుకున్నా అందులో విఫలమైంది. మైసూర్ నగరంలోనైతే ఈ వైఫల్యానికిగాను 2013లో 7 కోట్ల రూపాయల జరిమానా విధించారు. నాగపూర్ లోనూ విడబ్ల్యూఐ‌ఎల్ (VWIL) కంపెనీతో ప్రాజెక్టులో ఇదే అనుభవం పునరావృతమైంది. పైగా ప్రాజెక్టు ఖర్చు అంచనా 387.9 కోట్ల నుండి 566 కోట్ల రూపాయలకు ఆ కంపెనీ పెంచింది. 

పైన పేర్కొన్న జల విధానం రాకముందే భారత దేశంలో కూడా జల వనరుల ప్రైవేటీకరణ 1990లలో ప్రారంభమైంది. 23 కిలోమీటర్ల దూరం పాటు శివనాథ్ నదిని రేడియస్ వాటర్ సప్లై కి 22 ఏళ్ల పాటు 1998లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం లీజుకు ఇవ్వడం ద్వారా మన దేశ చరిత్రలో మొదటి సారి ఒక నది కార్పొరేట్ కస్టడీ లోకి పోయింది. ఆ 23 కిలోమీటర్ల పొడవునా ఉన్న గ్రామాల ప్రజలు ఆ నీటిని వాడుకోవడం పై, చేపలు పట్టడంపై నిషేధాన్ని ఎదుర్కొన్నారు. ఆ కంపెనీ ఆ 23 కిలోమీటర్ల మేర నదికి ఇరువైపులా కంచె నిర్మించింది. ఆ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని సిఫారసు చేసినా ప్రభుత్వాలు రద్దు చేయలేదు. మెల్ల మెల్లగా ఎన్నో నగరాల్లో నీటి సరఫరా, మురికి నీటి శుద్ధి వంటివి ప్రైవేటు పరం అవుతున్నాయి. సూయజ్, వివెండి, థేమ్స్ వాటర్, బెక్టేల్ వంటి పెద్ద బహుళజాతి కంపెనీలన్నీ భారత దేశంలో ప్రైవేటుగా నీటి ప్రాజెక్టులను నడుపుతున్నాయి.

ఇట్లా పెరుగుతున్న నీటి ప్రైవేటీకరణ ప్రభావం ఎన్నో రకాలుగా ఉంది. ఈ వ్యాస పరిధిలో పర్యావరణం పై దాని ప్రభావమేమిటో చూద్దాము.

  1. జల కాలుష్యం: ఇది ప్రత్యక్షంగా నీటి ప్రైవేటీకరణ వల్ల మాత్రమే కాదు గానీ, ఇతర గనుల, పరిశ్రమల ప్రైవేటీకరణ వల్ల జరుగుతోంది. పరిశ్రమలు, గనులకు అవసరమైన నీటిని వాడుకొని వాటి నుండి వెలువడే జలాలను శుద్ధి చేయకుండా వదిలేయడమనేది మన దేశం లాంటి దేశాల్లో చాలా ఎక్కువ. పట్టణాలలోని నదులు, చెరువులు, సరస్సులు మురికినీటి కాసారాలుగా మారిపోయాయి. అక్కడి భూగర్భ జలాలు అత్యంత విషపూరితంగా మారుతున్నాయి. దీనివల్ల తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలు మనకందరికీ విదితమే. ఇదేదో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన సమస్య కాదు. మారుమూల అటవీ ప్రాంతాలలోని స్వచ్చమైన చెలిమలు, వాగులు, నదులు కూడా గనులు, పరిశ్రమలు వదులుతున్న నీటి వల్ల ఎంతగానో కాలుష్యభరితమైపోతున్నాయి. అక్కడి ఆదివాసీలు అనేక రోగాల పాలవుతున్నారు. ప్రభుత్వ పరిశ్రమలు ఉన్న చోట కూడా మొత్తంగా ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడికి సేవ చేయడానికే ఉంది కాబట్టి జల, వాయు కాలుష్య సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గనుల, పరిశ్రమల ప్రైవేటీకరణ పెరిగేకొద్దీ ఈ తరహా కాలుష్యం మరింత పెరుగుతున్నది.
  2. తాగు నీటి రంగంలో ప్రైవేటు పరిశ్రమ: గత మూడు దశాబ్దాలుగా భారతదేశంలో బాటిళ్ళలో నీరు తాగే సంస్కృతి పెరిగింది. దానికి తోడు మధ్య తరగతి ఇళ్ళల్లో వాటర్ ఫిల్టర్ల వాడకం కూడా చాలా పెరిగింది. ప్రభుత్వం పేరుకు రక్షిత మంచి నీటి పథకం, మిషన్ భగీరథ వగైరా పథకాలను ప్రకటించినా సురక్షితమైన తాగు నీటి సరఫరా పై ప్రజలకు భరోసా లేక పోవడం వల్ల, ఊదరగొట్టే ప్రచారం వల్ల బాటిల్ నీటి సంస్కృతి, మధ్య తరగతి ఇళ్ళళ్ళలో ఆర్‌ఓ ప్యూరిఫైయర్ల వాడకం రోజురోజుకూ పెరుగుతున్నది. ప్లాస్టిక్ పౌచ్ లలో కూడా నీటిని అమ్ముతున్నారు. చాలా హోటళ్ళలో నీరు పెట్టడమే మానేశారు. బాటిళ్ళు కొనుక్కోవలసిందే. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వంటి పబ్లిక్ స్థలాలలో ప్రభుత్వాలు నీటి వసతి కల్పించడం దాదాపు మానివేశాయి. ఎక్కడైనా అరకొర వసతులు ఉన్నా ఆ నీటి నాణ్యత అంతంత మాత్రమే. ఇదంతా నీటి కంపెనీలతో కుమ్మక్కయి చేస్తున్నాయి. దానివల్ల నీటి ప్రైవేటు వ్యాపారం దినదిన ప్రవర్ధమానమవుతున్నది.

దీని వలన ఒకవైపు కంపెనీల లాభాలు వేల కోట్లకు చేరుతుండగా ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి. అంతే కాక పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి విపరీతమైన, ఎన్నో రకాల నష్టాలు జరుగుతున్నాయి.

నీళ్ళ బాటిళ్ళ వ్యాపారం:

1990 లలో పార్లె కంపెనీ మన దేశంలో ‘బిస్లరి’ పేరుతో మొదటి వాటర్ బాటిళ్ళను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 3000 ఆర్గనైజ్డ్ వాటర్ బాటిల్ కంపెనీలు, మరో 12,000 అన్-ఆర్గనైజ్డ్ వాటర్ బాటిల్ కంపెనీలు ఉన్నాయని అంచనా. పెప్సి, కోకా కోలా వంటి బహుళ జాతి కంపెనీలు ఆక్వాఫీనా, కిన్లే వంటి బ్రాండ్ల పేరుతో ఈ రంగంలోకి దిగి మన సంపదను కొల్లగొడుతున్నాయి.

బిస్లరి, కిన్లే, ఆక్వాఫీనా, బెయిలీ, హిమాలయన్ మినరల్ వాటర్, కింగ్ ఫిషర్ మినరల్ వాటర్, క్వా మినరల్ వాటర్, మానిక్ చంద్ ఆక్సీరిచ్ మినరల్ వాటర్, టాటా వాటర్ ప్లస్, రైల్ నీర్ దేశంలోని పది అతి పెద్ద బాటిల్ నీటి కంపెనీలు.

బాటిల్ నీటి పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా 2021 లో 2.25 కోట్ల, కోట్ల రూపాయల (అక్షరాల కోట్ల కోట్లే!) విలువ గల పరిశ్రమ. 2022 లో భారత దేశంలో ఇది 43,663 కోట్ల రూపాయల పరిశ్రమ. మన దేశంలో ప్రతి యేటా ఈ పరిశ్రమ 20% పైగా కాంపౌండ్ వృద్ధి రేటుతో పెరుగుతోంది.

ఈ పరిశ్రమ భారతదేశంలో దాదాపు ప్రతి యేటా 3000 కోట్ల బాటిళ్ళను ఉత్పత్తి చేస్తోంది. రైల్ నీర్ ఒక్కటే 2018 లో 20 కోట్ల నీటి బాటిళ్ళను ఉత్పత్తి చేసింది.

ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి కలుగజేసే నష్టాన్ని ఎవరైనా ఊహించగలిగేదే. పట్టణాలలో, గ్రామాలలో కూడా మురుగు నీటి కాల్వలకు ఇవి పెద్ద ఎత్తున అడ్డు పడుతున్నాయి. హిమాలయాల నుండి, నదులు, సముద్రాల దాకా ప్లాస్టిక్ బాటిళ్ళు అంతులేని పర్యావరణ హాని కలుగజేస్తున్నాయి. మైక్రో ప్లాస్టిక్ లు నీటి కాలుష్యం కలిగించి  దాని ద్వారా మనుషుల ఆరోగ్యంపై దుష్ప్రభావం వేయడమే కాకుండా మట్టిలోకి కూడా ప్రవేశించి నేల లోని జీవులకు హాని కలిగిస్తున్నాయి. మొక్కల ద్వారా మనుషుల ఆహారంలో కలిసిపోతున్నాయి.

ఈ ప్లాస్టిక్ సమస్య కాకుండా మరొక ముఖ్యమైన సమస్య భూగర్భ జలాలపై ఈ పరిశ్రమ వేస్తున్న ప్రభావం.

దేశంలో సుమారు 1200 బాట్లింగ్ ప్లాంట్ లు ఉంటే అందులో 600 దాకా తమిళనాడులో ఉన్నాయి. నీటి ఎద్దడిని ఎదుర్కునే తమిళనాడులో ఇది పర్యావరణ పరంగానూ, ప్రజల అవసరాల పరంగానూ ఎటువంటి సమస్యలను కలుగజేస్తుందో సులభంగానే ఊహించవచ్చు. ఈ బాట్లింగ్ ప్లాంట్ లలో అత్యధికం భూగర్భ జలాల మీద ఆధార పడతాయి. అందువల్ల ఆ చుట్టు పక్కల అంతా కూడా భూగర్భ జలాలు తగ్గి పోవడం వల్ల ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కేరళ లోని ప్లాచిమాడలో ఈ కారణంగానే కోకాకోలా కు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు.

బాటిల్ నీటి పరిశ్రమ 20 ఘనపు మీటర్ల బాటిల్ నీళ్ళను ఉత్పత్తి చేయడానికి వాటర్ ప్యూరిఫయర్ల కంటే 52 రెట్లు ఎక్కువగా 4,280 కిలోగ్రాముల కార్బన్-డై-ఆక్సైడ్ ను వాతావరణంలోకి వదిలి గ్రీన్ హౌజ్ వాయువుల మొత్తాన్ని పెంచుతున్నది. ఇక ఆర్‌ఓ ప్యూరిఫయర్ల విషయానికి వస్తే అవి శుద్ధి చేసే ప్రతి లీటరు నీటికి 3-4 లీటర్ల నీటిని వృధాగా వదిలేస్తాయి. భూగర్భ జలాలను ఇవి ఎంత వృధా చేస్తాయో ఊహించవచ్చు. మన దేశంలో ఈ ప్యూరిఫయర్ల మార్కెట్ 2024 కల్లా సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. ప్రమాణాలు పాటించని ఆర్‌ఓ యూనిట్లు వీధికొకటి పుట్టుకొస్తుండడంతో ప్రజలు ఖనిజ లవణాలు లేని నీటిని దీర్ఘ కాలం పాటు తాగి లేని రోగాలు కొని తెచ్చుకుంటారు.

బాటిల్ నీటి వ్యాపారం కానీ, వ్యక్తిగత ప్యూరిఫయర్ల మార్కెట్ కానీ ఇంత పెద్దమొత్తంలో లాభసాటిగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు ప్రజలకు రక్షిత మంచి నీటిని ఒక బాధ్యతగా, ప్రజల మౌలిక హక్కుగా అందించకుండా నీటిని ప్రైవేటీకరిచడంపై ఇంత శ్రద్ధ చూపుతున్నాయి. ప్రైవేటు రంగం కాలు మోపిన చోట ఆ రంగం లోని ప్రభుత్వ విభాగాలను నష్టాల ఊబిలో కూరుకు పోయేలా చేయడం ప్రైవేటు రంగానికి వెన్నతో పెట్టిన విద్య. టెలికాం రంగంలో బి‌ఎస్‌ఎన్‌ఎల్ కు ఏ గతి పట్టిందో చూస్తూనే ఉన్నాము. సామ్రాజ్యవాద కంపెనీల ఒత్తిడి, ఇక్కడి దళారీ పెట్టుబడిదారుల కుమ్మక్కు వల్ల రక్షణ రంగం తో సహా అన్ని రంగాలను ప్రైవేటుపరం చేస్తున్న మోదీ ప్రభుత్వం నీటి విషయంలో కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రైవేటు పరం చేస్తుందనడంలో సందేహం లేదు. దీని పట్ల మన అప్రమత్తత పెంచుకోవాలి. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ ల వంటి పబ్లిక్ స్థలాలలో – అవి ప్రైవేటువి అయినా సరే (హోటళ్ళ వంటివి) సురక్షితమైన మంచి నీరు తప్పని సరిగా అందుబాటులో ఉంచాలని ఉద్యమించాలి. బాటిల్ నీటిని కొనడానికి బాధ్యులను చేయగూడదు. అత్యంత మౌలిక అధికారమైన జీవించే హక్కును కాలరాసే ఈ నీటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడటం అవసరం. నీరు సరుకు కాదనీ, అది ప్రజల ఉమ్మడి ఆస్తి అనీ, రక్షిత మంచి నీరు ప్రజల హక్కు అనీ పునరుద్ఘాటించాలి. అయితే లాభమే ఊపిరిగా బతికే పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత కాలం ఇటువంటి ప్రజల జేబులు కొట్టే, సహజ సంపదను కొల్లగొట్టే ప్రైవేటీకరణ మాత్రమే కాకుండా, పర్యావరణం పై చెరపలేని దుష్ప్రభావాన్ని వేసే విధానాలు వస్తూనే ఉంటాయి. సహజ వనరులన్నీ ప్రజల సామూహిక సంపదగా గుర్తించే సమాజం కోసం ఉద్యమించినప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గుర్తించాలి.

Leave a Reply