అస్తమించడమంటే

రేపటి సూర్యోదయమే కదా

అతడు అస్తమించాడు


తుమృకోట తూర్పు గుమ్మంలో పొడిచి

చిన ఆరుట్ల చిగురు కొమ్మల్లోంచి జాలువారి

గుత్తికొండ నెత్తిమీద మొలిచిన సూర్యుడతడు


శాంతి పావురంకు 

ప్రజలంటే ఎంత పావురం

విద్రోహ పొగమబ్బుల మధ్యనే

శాంతి కపోత పతాకమెగిరేశాడు


మంజీర సర్కారు జాగీరు మీద నిలబడి

జన ఎజెండా జెండా నాటి

ప్రజా ఆకాంక్ష వెల్లువల సద్దిమూట పట్టుకెళ్లాడు


పంతులు కదాప్రపంచ గమనాన్ని

తన వేకువ వెలుగు దారుల్లో చూపించి

జనతన సర్కార్ రాస్తా మీదుగా జనాన్ని నడిపించాడు


అతని కిరణాలు అరికాళ్ళు

నాటిన అడుగుల నిండుగా

జగిత్యాల జైత్రయాత్రలు…జంగల్ మహల్ రెపరెపలు…


కన్నతల్లుల కడుపుకోత వలపోతల

కుంపట్లో రగిలీ రగిలి

బలిమెల మీద

సలసల నిప్పులుగక్కిన  సూర్యుడతడు

కండ్లముందరే

కడుపుతీపి నెలవంక కండ్లుమూసినా

ఒక చేత్తో కన్నీరు

మరో చేత్తోఎర్రజెండ

ఎత్తిపట్టిన సుత్తికొడవలి పిడికిలతడు


శిఖరాగ్రమైనవాడు

నీకు అగ్రకులం వాసనేయొచ్చు

వాడల్లోంచివెలివాడల్లో తడిచి

అంటరాని వసంతాన్ని

జీవితంలోకి ఆహ్వానించిన మనిష తడు


జ్ఞానం ముక్కుపుటాల్లో

అజ్ఞానం మ్యూకస్ నిండి

దుర్బుద్ధి వాసనొస్తే తప్పెవరిది?


మనువున్మత్తులో తడుస్తూ చరిస్తూ

కొస నాల్కల మీద నీలి పాటలు పాడే మిత్రులారా

కులం మలం కడుక్కోవాల్సిందెవ్వరో

తేలాలిక తప్పదు


నలబై ఏండ్ల నడకలో

ప్రతీ అడుగులో పునాదిరాళ్లు పేర్చిన

వర్గరహిత చరిత్ర నిర్మాత అతడు

నూతన మానవుడతడు
             

Leave a Reply