నా పెదవులపై తేనెపట్టు లాంటి మాటలేవీ?
అవి పక్షులై ఎగురుతుంటాయి
హృదయమూ మాటల మధుపాత్రే ఇపుడు
మనమధ్య పదాల ప్రసారం
ఓ అమూల్యమైన అనుభవానికి వాగ్ధానం
నిజానికి నా మాటలన్నీ
ప్రాణవాయువుతో పాటు ఆయుష్షు గా
నాలోకి మీ నుంచి వచ్చి చేరినవే
నా ప్రాణం లోపలుందని అనుకునేరు
అది బయటే ఉంది
నాతో కలిసి నడుస్తున్న వాళ్ళూ
నా భాగానికి ఇన్ని గింజలు పండిస్తున్న వాళ్ళూ
నా నడక కోసం దారుల్ని పరిచినవాళ్ళూ
నేనేదైనా చౌరస్తాలో నిలబడి ఉద్యమాచరణలో భాగంగా నినదిస్తున్నపుడు ప్రతిధ్వనిని అందించేవాళ్ళూ
మీరు మీరు మీరంతా నా ప్రాణసమానులు
మీరే నా మాటలలోని బరువుకు కారణమైనవారు
నా పద్యపాదాల్లో జీవం నింపే బతుకుపోరాటంలో నిండా మునిగిఉన్నవాళ్ళు
మీ నవ్వులు నా మాటలు
మీ సుఖదుఃఖాలు నా పదాలలోని అర్థాలు
మీ జీవనవాస్తవికత నా వాక్యాల పునాది
నా కవిత్వం మీ మాటల్నీ మీ గాధల్నీ
మీ గాయాల్నీ మీ నొప్పినీ ఆవాహన చేసుకుంది
ఇక నుంచి మీరు
నన్ను కవిత్వంగానే చదువుకుంటారు
కవిగా తప్ప ఇంకోలా నేను
పరిచయం కాబడడం
ఇక అసాధ్యం
నా కవిత్వం చదివాక
ఓ ఆలింగనపు పుష్పం మీ దేహంపై వికసించి
నా దేహం పై అలంకరించి పోండి
మన మధ్య మాధ్యమం ఇక
కవిత్వం
సూర్యుడికి ఎండా
వానకు తేమ
చంద్రునికి వెన్నెల
కవి కి కలం అస్తిత్వం..
నేనే మీ కవిత్వం…