మూడేళ్ళ క్రితం ఓ పెద్దాయన నన్ను వెదుక్కుంతూ మా కాలేజీకి వచ్చారు. డెబ్బై ఏళ్లు ఉండొచ్చు. నల్లగా, అంత ఎత్తూ కాని, లావూ కాని పర్సనాలిటీ. మనిషి చాలా నెమ్మది అని చూడంగానే అర్థమవుతుంది. పరిచయం చేసుకొని తాను రాసిన కథల గురించి చెప్పారు. దేవిరెడ్డి వెంకటరెడ్డి – పేరు విన్నట్టుగా ఉంది. కథలు గుర్తు రావడం లేదు. ఇప్పటి వరకు పుస్తకం పబ్లిష్ చేయాలనుకోలేదని, ఇప్పుడు ఆ ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. దీన్ని విరసమే ప్రచురించాలని తన కోరిక అన్నారు. నేను సంస్థలో చర్చిస్తానని చెప్పాను. ‘ముందుమాట మీరే రాయాలి’ అన్నారు. ఆశ్చర్యపోయాను. విరసం సరే, నేను ముందుమాట రాయడం ఏమిటి సార్ అన్నాను. కార్యదర్శివి కదా అన్నారు (అప్పటికి కార్యదర్శి బాధ్యతల్లోనే ఉన్నా). అయినా పెద్దవాళ్ళున్నారు కదా, రాయలసీమ కథకుల్లో ఎవరైనా సీనియర్ అయితే బాగుంటుంది అంటే పెద్దేమిటి, చిన్నేమిటి.. ఎప్పుడూ వాళ్ళే రాయాలనేముంది.. అన్నారు. మొహమాట పడుతుంటే విరసం ప్రచురణకు అర్హత ఉంటేనే చూడండి అన్నాడు. నవ్య, సాహితీ నేత్రం పత్రికల్లోని తన కథల పేజీలు, కొన్ని రాతప్రతులు ఇచ్చి తీరుబడిగా చదివి, సంస్థలో చర్చించి చెప్పమన్నారు. అక్షరాలు గుండ్రంగా పెద్దపెద్దగా ఉన్నాయి. తెల్ల కాగితాల్లో గీతాలు గీసి కాపీ రైటింగ్ బుక్ లో రాసినట్లు రాశారు. చదవడానికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలని చాలా శ్రద్ధ పెట్టారు.


మహాసభల పనుల్లో ఆయన కథలు చదవడం కాస్త పక్కకుపోయింది. చదివానో లేదో తెలుసుకోడానికి ఫోన్ చేశారు. తొందరేమీ లేదు, తీరుబడిగానే చదువు అని మళ్ళీ అన్నారు. కానీ ఆ మాటను పట్టుకొని ఆయన ఊహించనంత ఆలస్యం చేశానని ఆయన నేరుగా ఇంటికొచ్చాక గాని అర్థమవలేదు. అప్పుడు కూడా ఆయన తొందరపెట్టలేదు. అరుణతార విశేషాలు మాట్లాడి, చందా కట్టి తన కథల గురించి ప్రస్తావించారు. విరసం సీనియర్ సభ్యుల గురించి క్షేమ సమాచారాలు అడిగారు. మాటల్లో తెలిసింది విరసం తొలి రోజుల్లో ఆయన కొంత కాలం సభ్యులుగా ఉన్నారన్న విషయం. వ్యక్తిగత పరిమితుల వల్ల విరసంలో క్రియాశీలంగా లేనని, సభ్యత్వం కూడా కర్నూలు మహాసభల దాకే ఉండిందని చెప్పారు.

ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కూడా విప్లవ రాజకీయాలు తప్ప ప్రత్యామ్నాయం లేదని కచ్చితంగా చెప్పగలనన్నారు. దానికి నిర్మాణ బలాబలాలతో సంబంధం లేదని, సరైన రాజకీయాలు సరైన కార్యాచరణ ఎంచుకుంటాయని తన విశ్వాసాన్ని ప్రకటిస్తే ఆశ్చర్యపోయాను. ఇన్ని రోజులు మీరేందుకు మాకు పరిచయం కాలేదని, కథలెందుకు ప్రచురించలేదని, ఎప్పుడూ సాహిత్య సభల్లో కూడా కనిపించరెందుకని నాకేమో ప్రశ్నల మీద ప్రశ్నలు. ఆయన ఇల్లు మా పక్క వీధిలోనే అని తెలిసి సంతోషం, ఇన్నాళ్ళూ తెలీకుండా పోయిందే అని బాధ ఒకేసారి కలిగాయి. పత్రికలు, కొత్త పుస్తకాలు అడిగి చదివిచ్చేస్తానని తీసుకుపోయారు. రాయలసీమ కథల గురించి, కథకుల గురించి ముచ్చట పెట్టినపుడు ప్రముఖ రచయితలందరితో ఆయనకు వ్యక్తిగత పరిచయాలున్నాయని తెలిసింది. రారా కుటుంబంతో స్నేహం, సొదుం సోదరులతో దగ్గరి పరిచయం ఉన్నట్లుంది. ఎక్కడా ఎవరి సభల్లో కనపడరేమి అని అడిగాను. అవన్నీ నాకు సరిపడవులేమ్మా అన్నారు. కానీ పాత, కొత్త రచయితల్ని చదివేవారు. అరుణతార అక్షరం కూడా వదలేవారు కాదు. అభిప్రాయాలు నిర్మొహమాటంగా చెప్పేవారు.

ఆయన పుస్తకం పనితో మొదలై అప్పుప్పుడూ ఇంటికి రావడం అలవాటుగా మారింది. ఆయన కథలు చదవడం, కథ వెనక కథ చర్చించడం, ప్రచురణ పని ఇప్పుడు తలచుకుంటే అపురూప జ్ఞాపకమే. మొదటి కథ 1983 లో రాశారు. తర్వాత ఇరవై ఏళ్ళకు గాని రెండో కథ రాయలేదు. ఎందుకని అడిగితే కథ రాయడం ఆషామాషీ విషయం కాదన్నారు. మొత్తం కలిపి 13 కథలే. అవన్నీ కూడా చాలా సెలెక్టివ్ గా, విభిన్నంగా రాసారు. అందులో ఏ కథయినా బాలేదనిపించినా, మన దృక్పథానికి భిన్నంగా ఉన్నా నిర్మొహమాటంగా చెప్పమని ఒకటికి నాలుగుసార్లు అన్నారు. తన కథలు విరసమే ఎందుకు వేయాలనుకుంటున్నారో మళ్ళీ చెప్పారు. ఒకవేళ విరసం కాదంటే అసలు పుస్తకం వెయ్యను అన్నారు కచ్చితంగా.

రెండు మూడు కథల్లో మార్పులు సూచించాను. చాలా శ్రద్ధగా విన్నారు. కథలు రెండు మూడు సార్లు సవరించారు. ఆ వయసులోనూ కొత్తను స్వీకరించే మనసు, చాలా తెలిసినా ఎవరివద్దైనా నేర్చుకునేతత్వం గొప్పగా అనిపించాయి.

ఇంతకూ ఆయన కథల గురించి కొంతైనా చెప్పాలి.

ఆయన కథలన్నీ ఎంతో పొందికగా, సూటిగా చిక్కగా అల్లిన వచనంతో ఉంటాయి. కథా నిర్మాణంలో ఒక్క వాక్యం కాదు కదా, ఒక్క పదం కూడా అదనంగా పడినట్లు కనపడదు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన నేపథ్యం వెంకటరెడ్డిగారిని మొదటే బక్కజీవుల గురించి రాసేలా చేసింది. తిరుపతి ఓరియంటల్ కాలేజీలో త్రిపురనేని మధుసూదనరావు పాఠాలు ఆయనకు ఓ దృక్పథాన్ని ఏర్పరచాయి. మొదటి కథలోనే అంగడి గుమాస్తా బతుకును పరిచయం చేశారు. దరిద్రాన్ని అవలీలగా భరించొచ్చనుకున్న ప్రేమజంటకు సంసార జీవితం ఊహల నుండి నేలమీదికి దించుతుంది. ‘బక్కెద్దులు సోగకు కట్టబడినాయని’ అర్థమవుతుంది భర్తకు. జీవితం కంపుకొడుతున్నదని అంటూ ‘ఆర్ద్రంగా చెప్పటానికి నేనేం రచయిత్రిని’ కానంటుంది భార్య. ఈ వాస్తవంలోనే ఒకరిలోఒకరు లీనమయ్యే ప్రేమా వ్యక్తమవుతుంది. ఈ కథ రాసిన కాలం ఊహల్లో రాకుమారులతో తేలిపోయే యువతుల కథలు ట్రెండింగ్ లో ఉన్నాయి.

దీని తర్వాత 21 ఏళ్లకు ఎండిన రాయలసీమ నేల మీద కొత్త చిగుల్లేత్తే జీవితాల్లోకి ఆయన కథ (కొత్త చిగురు) ప్రవేశించింది. ఇవి కొత్త పంటను వాగ్దానం చేసే చిగుర్లేనా అంటే కాదు. కాని మనుషులు జీవిస్తారు. ఈ జీవించే మనుషులే రేపటికి కొనసాగింపు. వెంకటరెడ్డిగారి కథల్లో రైతాంగ సంక్షోభం ఉంటుంది కానీ ఆత్మహత్యలుండవు.

పంటలెండిపోతే జీవితం ఆగిపోతుందా? దెబ్బతిని లేచి నిలబడ్డానికి మనిషి జీవితంతో చేసే పోరాటం తప్పనిసరిగా ఉంటుంది. సేద్యం వాసనే వద్దనుకొని పట్నం వచ్చి రెక్కలకష్టం నమ్ముకునే రైతుబిడ్డ మాధవ, రాబోయే తరానికి ఈ నరకయాతన వద్దనుకొని కూతుర్ని మోటారు మెకానిక్కుకు ఇవ్వాలనుకునే సుభద్ర, పిల్లల చదువు కోసమే పట్నం దారిపట్టి బేల్దారి పనిలో దిగిన సోమిరెడ్డి, గ్రామీణ సంప్రదాయపు కట్టుబాట్లు ఛేదించి కులాంతర వివాహం చేసుకునే భారతి వంటి పాత్రలన్నీ భవిష్యత్తు మీద ఆశను నిలుపుకునేవి.

దశాబ్దాలుగా కాలువ నీళ్ల కోసం ఎదురుచూపులే మిగిలి, ప్రకృతి దోబూచులాటలో ఓడిపోయి అమ్ముకుందామన్నా భూములు కొనేవాడు లేని స్థితి ఉంటే, ఇక చాలు ఈ రైతు బతుకు అనుకోకుండా ఎలా ఉంటారు? కాలువ కోసం చేసిన ఉద్యమంలో దెబ్బలు తిని, జైలుపాలై, అప్పులు, అవమానాల పాలై వ్యవస్థ కౄరత్వాన్ని చూసిన ‘బుద్ధుడు’ రైతు జీవితమే వదిలేసుకొని బజ్జీల బండి పెట్టుకొని బతకడం ఒక వైపు నుండి చూస్తే విషాదమే. కాని ఆ మాజీ రైతు నష్టమంతా లెక్కేసి ఇక్కడ తేలాక ఇక నిబ్బరంగా ఉందంటాడు.

నీళ్లను మళ్లించే ఆధునిక సాంకేతికత ఇటువైపు చూడకపోయినా రాజ్యం మాత్రం మారుమూల పల్లెల్లోకి విస్తరించింది. అందరి చేతుల్లో కార్డులు పెట్టి అందరికీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించింది. కాలువ నీళ్లు వస్తాయా రావా? రావాలంటే ఏం చేయాలి? గిట్టుబాటు ధర వస్తుందా రాదా? దళారీ మార్కెట్‌ వ్యవస్థను ఎలా ఎదుర్కోవాలి? రాయలసీమలో ఈ తరహా చర్చ ఉండదు. సేద్యం మొదలయ్యేటప్పటి నుండి పంట రుణం, బీమాల చుట్టూ రైతులు తిరుగుతారు. దొంగ పాస్‌బుక్కులకు రుణాలు, ఇన్సురెన్సులు పొందే వాళ్లు ఒక పక్క అయితే, రైతుగానే గుర్తింపులేని కౌలుదార్లు ఒకవైపు. బ్యూరోక్రసీ పై నుండి కింది దాకా అన్ని అవలక్షణాలతో రైతు వద్దకు వచ్చేసింది. నీళ్లు మాత్రంరావు. (సీమ బొగ్గులు) ముప్పై ఏళ్ల క్రితం కథా రచన ప్రారంభించి ఒక గెంతుతో ఈ కాలంలోకివచ్చి తన కథని నిలిపే ప్రయత్నం చేసారు వెంకటరెడ్డిగారు.

ఈ మధ్య కాలంలో కథా నిర్మాణం, కథన పద్ధతిలో ఎన్నో ప్రయోగాలు వచ్చాయి. చాలా మార్పులకు లోనయ్యాయి. ముఖ్యంగా అనేక ప్రజాస్వామిక ఉద్యమాల ప్రభావం వల్ల భాష చాలా మారింది. మాండలికాలకు యాస కూడా జతయ్యింది. అయితే ప్రాంతీయ భాషలో రాసే చాలా మంది రచయితలు యాస మాత్రమే ప్రయోగించి అద్భుతమైన మాండలిక పదాలను పట్టుకోలేకపోతున్నారు. అట్లా చూసినప్పుడు ఈ తరం వాళ్లకు తెలియని ఎన్నో మాండలిక పదాలు ఈ కథల్లో నిండుగా ఉన్నాయి. ‘మితువు’, ‘బెలుకు’, ‘దేఖీలు’, ‘నట్టుదొగే పని’, ‘ఉడ్డా’, ‘గాటిపాట’, ‘ముక్కట్లు’, ‘వలపక్రం’, ‘మళిగ’ -ఇవి మచ్చుకు కొన్ని. వాక్యాల్లో, కథనంలో సొగసు ఉంది. అలవోకగా చదువుకుంటూ పోతే ఇది మన నుండి వేగంగా జారిపోతుంది. ఒక్కోచోట ఒక్కోవాక్యం కవితా పాదాల్లా చదువుకోవాలనిపిస్తుంది.

ఇంకో విషయం కూడా చెప్పాలి. రాయలసీమ కథకులు, ముఖ్యంగా 80 లలో రచనలు చేసినవాళ్లు కరువుతో పాటు ఫ్యాక్షన్‌ను చిత్రించకుండా పోరు. వెంకటరెడ్డిగారు వాటి జోలికి పోలేదు. ఆయన పుట్టింది ఏకచ్ఛత్రాధిపత్యం నడిచే పులివెందుల ప్రాంతంలోనే. కానీ ఈ అనుభవం తమకు నేరుగా లేదంటారాయన. ఒకే మూసలో రాయలసీమను, ఇక్కడి ప్రజలను, రచయితలను చూసేవాళ్లకు ఇది కొత్తగా అనిపించవచ్చు.

చివరికి ఆయన కోరిక నెరవేరింది. 2019 లో ఆయన కథల సంకలనం ‘సీమ బొగ్గులు’ విరసం ప్రచురణగా వెలువడింది. పుస్తకం ఆయన చేతిలో పెట్టాను. సంతోషంగా తడిమి చూసుకున్నారు. కలిసినప్పుడు పుస్తకం మీద వచ్చిన స్పందనల కన్నా ‘నీ ముందు మాట చాలా బాగుందని అంటున్నా’రని చెప్పారు. తన గురించి తాను ఎప్పుడూ చెప్పుకునే అలవాటు లేదని తెలుసు…  ఇప్పుడు కూడానా..!

అరుణతార శాశ్వత నిధి ప్రకటన చూసి స్పందించారు. తన పెన్షన్ డబ్బులు ఇస్తూ అరుణతార ఆగిపోకూడదని, ఏదో ఒక మేరకు తన సహకారం తప్పకుండా ఉంటుందని హామీ ఇచ్చారు.

వెంకటరెడ్డి గారు అలా వాకింగ్ కొచ్చినట్లు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చేవారు. ఒకసారి మా వీధిలో రోడ్డు, డ్రైనేజీ రిపెరు చేసేటప్పుడు చిన్న వంతెనలా ఏటవాలుగా వేసిన ఇనుప మంచం మీదకెక్కి వచ్చేశారు. ఈ వయసులో ఈ సాహసం అవసరమా అనాలనిపించింది. నేనే వస్తాను, మీరు రాకండి అన్నా, ఏం ఫరావాలేదన్నారు. ఎప్పుడూ ఏ సభలకూ పోని మనిషి, మేము రాయలసీమ కోసం సభ పెడుతున్నాం రమ్మంటే అందరికన్నా ముందొచ్చి కూర్చున్నారు.

ఇటీవలి కాలలోనైతే ఏదో కొత్త ఉత్సాహం వచ్చినట్లు గంటసేపు సాహిత్యం, రాజకీయాలు ముచ్చటించి, ఏమైనా కొత్త పుస్తకాలున్నాయా అని అడిగి తీసుకుపోయేవారు. ఆరెస్సెస్ రాజకీయాల పట్ల మండిపడేవాడు. విప్లవకారులే వాళ్ళకు సమాధానం చెప్పగలరనేవారు. ఆయన నడిస్తే పెద్దగా చప్పుడయ్యేది కాదు. అసలు మా దగ్గరకి రావడమే నిశ్శబ్దంగా వచ్చారు. అలా నిశ్శబ్దంగానే వెళ్ళిపోయారు.

ఏడాదిగా బెంగుళూరులో ఆయన కొడుకు దగ్గరుండే వారు. కరోనా కదా, ఈడనే ఉన్నామ్మా.. అంతా బాగైనాక పొద్దుటూరొస్తాను అన్నారు. ఏప్రిల్ మూడో వారంలో (22/23 కావొచ్చు) కరోనా వచ్చిందని అక్కడే బెంగుళూరు ఆస్పత్రిలో ఉన్నానని ఫోన్ చేశారు. ఏం ఇబ్బంది లేదుగదా సార్ అన్నా. బానే ఉన్నామ్మా.. అయితే కొద్ది రోజులు ఆస్పత్రిలోనే ఉండమన్నారు అన్నారు.

మరుసటి రోజు ఫోన్ స్విచ్చాఫ్. రెస్ట్ తీసుకుంటున్నారు అనుకున్నా.. అయినా ఎక్కడో అనుమానం, భయం.. రోజూ ఫోన్ చేస్తూనే ఉన్నా.. ఆ నంబర్ తప్ప ఆయన కాంటాక్ట్స్ ఇంకేమీ లేవు. ప్రొద్దుటూరు మిత్రులనడిగాను. వాళ్ళూ అదే చెప్పారు. చాలా రోజుల తర్వాత అరుణతార పంపమని ఆయనిచ్చిన అడ్రస్ దొరికింది. లెటర్ రాస్తూ రాస్తూ.. చూద్దాం ఫోనేమైనా పనిచేస్తుందేమో అని ప్రయత్నించా.. రింగయ్యింది.. ఎక్కడో చిన్న ఆశ. గుండె దడదడలాడగా ఆయన భార్య ఫోనెత్తింది. మా ఇంటాయన మే ఒకటో తేదీ చనిపోయనాడుమ్మా అంది..

ఈ విషయం ఎంతమందికి తెలుసో తెలీదు. చాలా తక్కువ కథలే రాసినా ఆయన చాలా మంచి కథలు రాశాడు. సాహిత్య సభలు, రచయితల బృందాలకు దూరంగా ఉండేవాడు. అందుకే ఆయన మరణం కనీసం సోషల్ మీడియా లో కూడా వార్త కాలేదు.

ఇక ఆ మనిషి కనిపించడు అంటే గుండెలో ఎక్కడో ఖాళీ అయిన భావన…   

తొలి యవ్వన దశలో ఆయన్ని ప్రభావితం చేసిన విప్లవ సాహిత్యోద్యమంలో ఏ కారణాల వల్ల ఆయన కొనసాగలేకపోయారో గాని గుండెల నిండా ఆ విశ్వాసాన్ని నిలుపుకున్నారు. వేరెవ్వరితోనూ కలవకుండా మౌనంగా ఉండిపోయి చివరి దశలో మళ్ళీ విప్లవ సాహిత్యోద్యమంలో తనకు చోటు కోరుకున్నారు. బహుశా ఆ చిన్న సంతృప్తితో ఆయన వెళ్లిపోయారేమో. కరోనా వచ్చి మీద పడకపోతే ఇంకా ఏమైనా చెప్పేవారా?      

ఏమైనా తాము రచయితలమని చెప్పుకోని అరుదైన రచయితలు, కొన్ని కథలు అలా మెరిపించి ఆ తర్వాత లోకం గుర్తింపు నుండి కనుమరుగైనవాళ్ళు ఎంతమంది ఉంటారో కదా.

వెంకటరెడ్డి గారికి అశ్రునివాళి..

Leave a Reply