ఆఫ్ఘాన్ మహిళా కవిత్వం
“అందరూ నిన్ను తమ దానిగా చెప్పు కుంటారు..కాని, నేను నిన్ను నిన్ను గానే చూస్తాను. ” Jalaluddin Rumi balki. (రూమి )
ఆప్ఘాన్ లు అన్ని సాహిత్య ప్రక్రియ ల కన్నా కవిత్వానికి పెద్ద పీట వేస్తారు..తాము భావాల్ని కేవలం కవిత్వం ద్వారా మాత్రమే చెప్పగలమన్నది వాళ్ళ విశ్వాసం.. అక్కడ కవులు, కవయిత్రులు కవిత్వాన్ని బైటికి చదవడానికే ఇష్ట పడ్తారు(recitation)…ఆప్ఘాన్లు సాధారణంగా కవిత్వాన్ని పర్షియన్(దారి), ఫస్తో భాషల్లో రాస్తారు..వాళ్ళు ఎక్కువగా “లాండై”(ద్విపద)పద్ధతిలో రాస్తుంటారు.
పదమూడవ శతాబ్దంలో జన్మించిన సూఫీ కవి,జలాలుద్దీన్ రూమి బల్కీ ని వాళ్లు ఆదికవి గా భావిస్తారు.ఆయన కవిత్వంలో ఆధ్యాత్మికత తొంగి చూసినా ,కవిత్వంలోని నిరాడంబరత , సారాంశం సాధారణ ప్రజలకు చేరుతుంది. ఆయన కవిత లు అనేక ప్రపంచ భాష ల్లోకి అనువదించబడ్డాయి.
ఆ తర్వాత, పదిహేడవ శతాబ్దం కు చెందిన ఖుషాన్ ఖాన్ ఖట్టన్ ను ఆఫ్ఘాన్లు తమ జాతీయ కవిగా ప్రకటించుకున్నారు.
* * *
ఐతే కవిత్వమనేది పురుషులకే సొంతం కాదని, పదవ శతాబ్దానికి చెందిన రబియా బాల్కీ తన కవిత్వం ద్వారా రుజువు చేసింది. ఆమె పర్షియన్ భాషలో గొప్ప ప్రేమ కవిత్వమే రాసింది. ఒక టర్కీ బానిస(బక్తాష్) ప్రేమ లో పడ్డందుకు స్వయంగా ఆమె సోదరుడే ఆమెను బంధించి,చంపేశాడట. బాల్కి తన చివరి కవితను జైలుగోడలమీద తన రక్తం తో రాసిందని చెబుతుంటారు.
“రక్తం,ప్రేమ,అగ్ని, కన్నీళ్ళ మధ్య
ఆమె గోడలా కుప్ప గూలింది “…..ఫరీద్ అల్..లిన్ అత్తార్
ఆమె ప్రేమ గొప్పతనం,అనివార్యత గురించి రాస్తూ,” ప్రేమ అనే సాలెగూడులో చిక్కు కున్నాక ఎంత ప్రయత్నించినా బైటికి రాలేకపోయాను. నేను ఈ పులి మీద స్వారీ చేయడం మొదలెట్టాక, కళ్ళాలు ఎంత బిగించినా అదుపులోకి తెచ్చుకోలేకపోయాను.ప్రేమ అనేది ఓ మహా సముద్రం.ఎంతటి తెలివి గలవాడైనా బైటికి రాలేడు ” అంటుందామె..
ఇప్పటికీ ఆఫ్ఘాన్ లో తలిదండ్రులు తమ పిల్లలకు ఆమె పేరు పెట్టుకోవడానికి ఇష్ట పడ్తారు..
బాల్కీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మహిళలు తమ కనీస స్వేచ్ఛా స్వాతంత్ర్యాల గురించి గొంతెత్తుతున్నారు.పురుషాధిక్య సమాజం లో వాళ్ళు భౌతిక హక్కులే గాక,సాహిత్యంలోను తమ స్థానం కోసం పోరాడుతున్నారు..
” కొందరన్నట్టు, అఫ్గాన్ మహిళలు కవిత్వం మీద మాట్లాడటమంటే, తమను తాము చిన్న పుచ్చుకోవడం గాదు…సాహిత్యం లో పురుష కవిత్వం, స్త్రీ కవిత్వం అని తేడాలుండవు.అది అద్భుతం అక్షరాల ప్రోది “అంటుంది హోమిరా గధేరి.
మరొక యువ కవయిత్రి హోసిన్ జాదా మాట్లాడుతూ,”ప్రస్తుతానికి సాహిత్యాన్ని పురుషులు కబ్జా జేశారు.. ఇప్పుడిప్పుడే స్త్రీలు దాన్ని ప్రశ్నిస్తున్నారు ” అంటుంది.”తన హక్కుల్ని గుంజేసుకున్నారనీ, తనను తల్లిగా నే గాకుండా ,సమాజంలో పురుషునిలాగ, ఓ మనిషిగా చూడాలనీ,తన హక్కుల్ని గౌరవించాలనీ ,తాను వంటింటి కే పరిమితం గాదని, ఈ ప్రపంచమంతా తనదేనని ప్రకటించాలి. ” అంటుందామె.
ఇపుడు ఆఫ్ఘాన్ మహిళల కవిత్వం చదివినపుడు,వాళ్ళు పురుషాధిక్య సమాజాన్ని ప్రశ్నించడమే గాక, మొత్తంగా ఒక సొషలిస్టు సమాజాన్ని కోరుతున్నారని తెలుస్తుంది.
* * *
కొందరు కవయిత్రులు,ఆఫ్ఘాన్ లోని పురుషాధిక్య సమాజంలో ఇమడలేక, పాశ్చాత్య దేశాలలో తలదాచుకొని, తమ కవిత్వాన్ని వినిపిస్తున్నారు. బహారీ సయీద్,పర్వీన్ ఫజ్వాక్,పెగా నావెల్ మొహజీర్ లాంటి వాళ్లు తమతమ రంగాల్లో పనిచేస్తూ కవిత్వం రాస్తున్నారు..వీరు వర్క్ షాపు ల్లో,సెమినార్ల లో అవగాహన పెంచుకుంటుంటారు..తద్వారా ప్రపంచానికి బాగా తెలుస్తున్నారు.
రెండో వర్గం వారు ఆఫ్ఘాన్ లోనే ఉంటూ తమదైన గొంతును వినిపిస్తున్నారు.నదియా అంజుమన్,ఖలీదా ఫోరుగ్,ఫరంగీజ్ సౌగంధ్ లాంటివారు గృహిణులు గా, ఉద్యోగస్థులు గా, సామాజిక కార్యకర్తలు గా ఉంటూనే,తమ కవిత్వం వినిపిస్తున్నారు.
వీల్లలొ నదియా అంజుమన్ జీవితం విషాదమైంది.ఈమె ఇ రవై ఐదు సంవత్సరాల పిన్న వయస్సులోనే హత్య గావింపబడింది.ఈమె స్వతంత్ర భావాలు భరించలేక,స్వయంగా భర్తనే హత్య చేశాడని చెప్పు కుంటారు.
పాశ్చాత్య దేశాలవాళ్ళు , ఆఫ్ఘాన్ దేశ మహిళలను నోరు లేని వాళ్ళనీ(silenced voices),తమ విడుదల కోసం పాశ్చాత్యుల మీద ఆధార పడతారనీ,చిన్న చూపుతో ఉంటారు. కాని వాళ్ళు పాశ్చాత్యుల దుష్ప్రచారాన్ని ఎండగడుతూ, తామూ మనుషులమేనని, తమకు స్వతంత్ర జీవితం ఉండాలని , బూజు పట్టిన సాంప్రదా యాలను నిరసిస్తున్నామని, తమ కవిత్వం ద్వారా ప్రకటిస్తున్నారు. ఒక సోషలిస్టు సమాజం కోసం కల గంటున్నారు. ఆప్ఘాన్ సమాజాన్ని నీలిబురఖాలు దాటి, గడ్డం పురుషులను దాటి ఆవలి కి చూడాలనిప్రకటిస్తున్నారు.
వాళ్ళ గొంతుల్ని విందాం..
ఆఫ్ఘాన్ కవయిత్రుల లో నదియా అంజుమన్ (1980–2005)గారి గొంతు ప్రత్యేక మైనది. జాన్ కీట్సు లాగ పిన్న వయసులోనేచనిపోయినా గొప్ప కవిత్వమే రాసింది. ఆమె అనుభవించిందే రాసిందేమో నని పిస్తోంది. భరించలేని విషాదమూ, జయించగలిగే ఆత్మవిశ్వాసం రెండూ ఆమె కవితల్లో కనబడుతాయి.
” తేనెను గురించి ఏమని పాడేది
అది నా నాలుక మీద చేదై పోయింది
నా గొంతు నొక్కిన నియంత
పతనమైపోతాడు..”
మరోచోట మరింత కుంగిపోయిన ట్టు అనిపిస్తుంది.
“నేనూ, నాజైలూ..
నాభావోద్వేగాలను నేలమట్టం అయ్యాయి
నా పుట్టు కు ఒక వ్యర్థ గీతం…”
వసంతాన్ని అందుకోలేక బాధపడ్తుంది.
” హృదయ మా. !
వసంతం వెళ్ళిపోయిందని తెల్సు..
కానీ, ఈ విరిగిన రెక్కలతో నేనెలా ఎగిరేదీ?”
ఇంతగా విషాదాన్ని పలికే ఆమె ఆశను కోల్పోలేదు..
” ఎన్నడో ఒకనాడు
నేనీ పంజరాన్ని.
బద్దలుగొట్టు కొని. బైటికి వొస్తా..”
“నేను
లేలేత కొమ్మల
నాజూకు చెట్టునే కావొచ్చు
కాని బెదిరించే సుడిగాలికి
వొణికి పోయేది లేదు..
ఆఫ్ఘాన్ మహిళను నేను
నాబాధల్ని అనంతం దాక పలికిస్తా..”
..అంటూ తన ధిక్కారాన్ని ప్రకటిస్తుంది
* * *
పర్వీన్ ఫజ్వాక్ (1967)ఆధునిక కవయిత్రి.. పర్షియన్ భాషలో రాస్తుంది.. ఈమె పురుషాధిక్యత మీద సూటిగా విరుచుకు పడ్తుంది.
గాడాంధ కారం..
ఆశల పత్రహరితాలు
తుఫాన్ గాలికి చెల్లా చెదురయ్యాయి
మా పుస్తకాల్ని కాల్చేసి
వాళ్ళు చలిమంటలు గాచుకుంటున్నారు
ఇగ ఇప్పుడు మేము
తుపాకుల డేగ కన్నుల మధ్యన
శిరసెత్తిన ప్రశ్నలం
మూర్చిల్లిన జాతి నరాల్లో
ఎడతెగని ప్రకంపనలం. “
మరొక చోట తన విశ్వాసాలను ప్రకృతితో పోలుస్తుంది
” పచ్చని చెట్లను నరికి
ఆటబొమ్మల జేశావుగాని
హృదయంలో రేగిన
అగ్నిజ్వాలల్ని ఆర్పలేకపోయావు.
ఆశల ఆకులు చెట్టు
ఆకునైనా తెంపలేని నీవు
చీకటి సముద్రం మీద
వారధి కట్టి గలవా?
అహంభావీ..
ఏనాడైనా నీ చూపును
వెల్తురు వైపు సారించేవా “
అంటూ సూటిగా పురుషాధిక్యతను ప్రశ్నిస్తుంది
* * *
ఖాలెద్ ఫరోగ్..(1972)..కాబూల్ యూనివర్శిటీ లో ప్రొఫెసర్ గా పనిచేస్తుంది..
“ఎప్పుడూ మరువొద్దు.
ఉద్యమం మనేది, ఇక్కడ క్షమించరాని నేరం “
ఉద్యమాలు చేసేవాళ్ళనిలా హెచ్చరిస్తుంది..
“. గాలీ వానా భీభత్సం..
చెట్ల చేతులు అదే పనిగా ఊగుతున్నాయి “
..ప్రకృతి బీభత్సాన్ని ఇలా వర్తమానంతో పోలుస్తుంది
* * *
ఫెగా జావెద్ మొహజర్(1976) ఎంతటి విషాదంలో ను ఆశల్ని పలికిస్తుంది..
” నీ మోకాళ్ళలో శక్తి తగ్గితే నేం.
నిన్ను దహించే సంఘర్షణ
నన్నూ దహించి వేస్తుంది.. “
” కాబూల్ నగరమా..
ఈ రాత్రి
నీవెంత నిశ్శబ్దపు టెడారిగ మారినా
ఈ వెన్నెల రాత్రి
నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా..
ఎందుకంటే
నువ్వు నాహృదయానివి”
తన మాతృభూమి పై ప్రేమను ఇంతకంటే అందంగా,ఇంతకంటే ఉన్నతంగా ఎవరు చెప్పగలరు??
* * *
ఫెరాంగెజ్ సౌగంధ్ గారిది మరొక భిన్నమైన స్వరం.. ఈమె వేశ్యల దీనస్థితి మీద కదిలించే కవితలు రాసింది..మూలాలు చెప్పకపోయినా, పురుషాధిక్య తే ఈజాడ్యానికి కారణమని తెలిసిపోతుంది
” ఒక్క క్షణం
ఆమె అద్దంలో కి చూసుకుంటది.
ఆమె లేదక్కడ.
ఎక్కడో దుమ్ము ధూళిలో
కప్పబడిపోయింది
వేశ్యా ప్రపంచపు దుమ్ము ధూళిలో
ఆమె తన ఉనికిని పోగొట్టుకుంది “
” ప్రతి గంటా
ప్రతి రాత్రీ
ప్రతి రోజూ
ధృడమైన బాహువుల్లో
గిలగిల కొట్టుకొని ఆమె దుఃఖిస్తూనే ఉంటది “
” ఆమె
గంటల కొద్దీ
తనలో తానే నవ్వుకుంటది
వేశ్యకు
అదొక సుదీర్ఘ ఉపశమనం “
“ఎక్కడో
పట్టణంలో తారట్లాడే మృత్యువు
వేశ్యల తడికళ్ళ లో
నిరంతరం తొంగి చూస్తుంటుంది “
” సాగిపోయే
ప్రతి శిశిరం వెనుకా
విప్ప వల్సిన మిగిలే ఉంటది
” నేను
నా పుట్టిన రోజును
వేశ్యా దుఃఖంతో పంచుకున్నాను “
..ఇలా ప్రతి వాక్యమూ వేశ్యా హృదయ దర్పణం..
* * *
బహర్ సయీద్ గారు,(1953) మతాన్ని అడ్డు పెట్టుకొని పురుషులు తమ మీద చేస్తున్న పెత్తనాన్ని దులిపేస్తుంది..
” పురుష భక్తులారా
మీ ముఖాలు తిప్పేసుకోండి
మీ అహంభావాలు , బలహీనతలను దాచేసుకోండి..
మీ అందం విశ్వాసాలకు ముసుగేసుకోండి..”
అంటూ హెచ్చరిస్తూనే,
” ఓ భూమి పుత్రులారా..
నా తల వెంట్రుకలు
మిమ్మల్ని ఎలా చెదరగొడ్తాయో చెప్పాలి “
అని అడుగుతుంది…..
” అతడు
బలహీనుడూ, మూఢ భక్తుడూ ఐతే తప్ప
నన్ను బురఖా ధరించమని చెప్పడు “
ఇలా తెగేసి చెప్పి,
” ఎంతటి గాడాంధ కారమైనా
ఈ వెల్తురు ను మింగలేదు.
నేను సూర్యుణ్ణి
మీ పరదాల్ని దాటి
మిమ్ముల పలుకరిస్తా “
బీహార్ సయీద్ గారు రేపటి స్వప్నాలను సజీవంగా కాపాడుకుంటుంది..
* * *
ఈ కవితలన్నింటినీ ఇంగ్లీషులోకి అభిబా టాలూద్కర్,ఆరియా షఫీ గారు ఇంగ్లీషు లోకి అనువాదం జేశారు.. టాలూద్కర్ గారు బ్రూక్లిన్(న్యూయార్క్)లో ఉంటారు..ఆమె స్క్రిప్టు అనువాదకురాలిగా పనిజేస్తారు..పాకిస్తాన్ ప్రగతిశీల కవిత్వాన్ని కూడా అనువాదం జేశారు.. వీలైనపుడు కవిత్వం రాస్తుంది
ఆరియా ఫనీగారు. పర్షియా సాహిత్యంలో రీసెర్చ్ స్కాలర్..