రాయలసీమ  విద్యా పరిరక్షణ కమిటీ, 

అమ్మకు తిండి  పెట్టలేదు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు కొనిపెడతానని చెప్పాడంట వెనకటికి ఒక ప్రబుద్ధుడు. కర్నూలు  జిల్లాలో రాయలసీమ విశ్వవిద్యాలయం, ఐఐటిడిఎం, ఆంధ్ర ప్రదేశ్ ఉర్దూ విశ్వ విద్యాలయం ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అనే సంగతి పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా జగన్నాథ గట్టు దగ్గర క్లస్టర్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. 2008 లో 16 విభాగాలతో ఏర్పడ్డ  రాయలసీమ విశ్వ విద్యాలయం పట్టుమని పది మంది అధ్యాపకులు లేక కీలక విభాగాలు మూసివేతకు గురైనాయి. 

అమెరికాలో ఒక ప్రభుత్వం గద్దె దిగగానే ప్రభుత్వంలో ఉన్న సెక్రెట్రీలు కూడా అధికారం నుంచి తప్పుకుంటారు. అలాగే మన రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలలో  ముగ్గురు ఉపకులపతులు, లెక్కలేనంత మంది రిజిస్ట్రార్లు మారారు.  గతంలో వీరు రిజిస్ట్రార్, రెక్టార్, విసి, డైరెక్టర్లు కావాలంటే స్థానికంగా ఉన్న మంత్రుల కాళ్ళు పట్టుకుని అంతో ఇంతో సమర్పించుకుని వచ్చి అడ్డగోలు నియామకాలు చేపట్టి అనతికాలంలో లక్షలు గడించి కోట్లకు కోట్లు బిల్లులు చేసి ఇష్టానుసారంగా వ్యవహరించిన వారు ఎప్పుడైతే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిందో,  ఎదో సంక్షోభం / ఉపద్రవం ముంచుకొచ్చినట్లు రిజిస్ట్రార్లు, రెక్టార్లు, విసిలు విధులకు దూరంగా ఉండడం లేకపోతే  ఆరోగ్య కారణాల వల్ల విధులకు రాజీనామా చేయడం , కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.  వారు నిర్వహించిన ఇంటర్వ్యూలు అన్ని అడ్డగోలు నియామకాలు వాటిపై చర్యలు అన్ని ప్రశ్నర్థకంగా మారాయి.

            ప్రభుత్వం  వచ్చి 34 నెలలు గడుస్తున్నా  పరిస్థితి ఏమి మారలేదు, కొత్త విసి వచ్చి సగం కాలమయ్యింది, కదలాల్సిన ఫైళ్లు చెదలు పట్టి ఉన్నాయి. శాశ్విత అధ్యాపకులు లేక దశాబ్దం పైగా అవుతున్నది. దాదాపు అన్ని  విభాగాలు అధ్యాపకులు లేక అకడమిక్ అసిస్టెంట్ లతో కాలయాపన చేస్తున్నారు.  2019 సంవత్సరం  రీసెర్చు స్కాలర్లు సమర్పించిన థీసిస్ గ్రంథాలకు చెదలు పట్టింది కానీ వారి వైవాకు మోక్షంలేదు.  గత సంవత్సరం జరిపిన పరీక్షల ఫలితాలు ఇంతవరకు విడుదల కాలేదు. రౌతు మెత్తగుంటే గుర్రం మూడు కాళ్లతో పరుగెత్తిందనే  చందంగా మారింది విశ్వవిద్యాలయాల పరిస్థితి. 

కొత్త కోర్సులకు , కొత్త కళాశాలలకు అఫిలియేషన్ కు మోక్షం లేదు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అన్న చందంగా మారింది విశ్వవిద్యాలయాల పరిస్థితి. ఈ విద్యాసంవత్సరం విశ్వవిద్యాలయంలో కొన్ని  విభాగాలు మూసివేయక తప్పదు.  ఉన్న సీనియర్ అధ్యాపకులు రిటైర్ కావడం, గత దశాబ్ద కాలం నుండి నియామకాలు లేకపోవడం, దశాబ్ద కాలం కిందట చేరినవారిని ఇంతవరకు రెగ్యూలరైజ్ చేయకపోవడం సమస్యగా మారింది. ఉన్న విశ్వవిద్యాలయాలు పటిష్టం చేయకుండా కొత్తగా క్లస్టర్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. విద్యాలయాలంటే బిల్డింగులు స్థలాలు కాదు, అధ్యాపకులు లేకుండా  విశ్వవిద్యాలయాలు ఎలా నడుపుతారో బోధ పట్టం లేదు. పరీక్షలు సకాలంలో జరుపరు, ఫలితాలు వెల్లడించరు,  పిహెచ్‌డీ  వైవా జరపరు. 

పరిస్థితి ఇలా ఉంటే మరో రెండు సంవత్సరాలలో విశ్వవిద్యాలయాన్ని  శాశ్వ‌తంగా మూసివేయడం ఖాయమని పిస్తున్న‌ది. ఇక రాష్ట్ర విభజన తర్వాత   ఆంధ్రప్రదేశ్ కు పదవ షెడ్యూలు క్రింద ఏర్పాటైన ఉర్దూ  విశ్వవిద్యాలయం  ఎంతో ఆర్భాటంగా మొదలుపెట్టి నాలుగు  సంవత్సరాలైన నిధుల లేమితో నేడు స్మశాన ప్రశాంతత నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ఉర్దూ విశ్వవిద్యాలయం కర్నూలు లో  ఉన్న సంగతి ప్రభుత్వం మరచిపోయింది. అక్కడ విసి, రిజిస్ట్రార్, కళాశాల ప్రిన్సిపాల్ ఎవరు లేరు, తాత్కాలిక అధ్యాపకులతో కాలం వెలిబుచ్చుతున్నారు. విద్య‌లో నాణ్యత ఉండాలని క్వాలిటీని పెంచడానికి కొత్తగా కన్సల్టెన్సీలు ద్వారా కో ఆర్డినేటర్ల ను నియమించి ఉన్న కొద్ది మంది అధ్యాపకులతో అర్థం పర్థం లేని పనులు చేయిస్తున్నారు. కంప్యూటర్ సైన్సులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, మిషన్ లార్న్ఇంగ్  కోర్సులు ప్రవేశపెట్టారు బోధించడానికి బోధకులు లేకపోవడంతో విద్యార్థులు సుదూర ప్రాంతాలకు తరలిపోతున్నారు.  అధ్యాపకులకు ఓరియెంటేషన్, రెఫ్రెషర్ కోర్సులు లేవు, బోధనా నైపుణ్యాలు మెరుగుపడాలంటే బోధకులకు కొత్త అంశాల పట్ల శిక్షణ ఉండాలి. ఉపాధ్యాయ శిక్షణా మార్గదర్శి, మెటీరియల్  దొరకడం లేదు. అధ్యాపకులకు పునశ్చరణ తరగతులు, ఓరియెంటేషన్ కోర్సులు లేక కళాశాలల్లో బోధన చప్పగా ఉంది. 

ఈ  విద్యా సంవత్సరం నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలలో ‘ఇంగ్లీష్ మీడియం’ తప్పనిసరి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, అండర్గ్రాడ్యుయేట్ (యుజి) స్థాయిలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడం గ్రాడ్యుయేట్ల కెరీర్ అవకాశాలను మెరుగుపరుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ “గట్టిగా భావిస్తుంది”   కానీ కేవలం కార్పొరేట్ కంపెనీల కోసం మాధ్యమం మార్చడం శ్రేయస్కరం కాదు.  

విద్య మానవ వికాసానికి, సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేది గా ఉండాలి కాని విద్య  అంతిమ లక్ష్యం ఉపాధి కాకూడదు. విద్య వ్యాపార మయం అయినప్పుడు ఇలాంటి భావనలు ప్రభుత్వాలకు రావడం  సర్వసాధారణం.  మాధ్యమం మార్చినంత మాత్రం విద్య ప్రమాణాలు పెరుగుతాయి అనుకుంటే ప్రభుత్వం పప్పులో కాలేసినట్లే.  ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఆంగ్లం నేర్చుకుంటేనే అన్న భ్రమలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు కనీసం పాఠశాలల్లో అధ్యాపకులను నియమించకుండా విద్యార్థులను ఎందుకూ పనికిరాని వారిగా తయారు చేయడమెందుకు.  గత 15 సంవత్సరాలుగా నియామకాలు లేక విశ్వవిద్యాలయాలు మూసి వేతకు దగ్గరలో ఉన్నాయి. నలభై సంవత్సరాల క్రిందట వెలసిన శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, పద్మావతి విశ్వవిద్యాలయంలోనే   ఆంగ్ల విద్యను బోధించడానికి  అధ్యాపకులు లేక విభాగాలు మూసివేశారు. ఇక కొత్తగా వెలసిన రాయలసీమ, ఆదికవి నన్నయ, యోగి వేమన, విక్రమ్ సింహపురి, ద్రావిడ్, అంబెడ్కర్ విశ్వవిద్యాలయాలలో  చివరకు జెఎన్‌టీయూ లో ఇద్దరు అధ్యాపకులు ఉన్నారు.  అధ్యాపకులను నియమించక మాధ్యమాలు మారిస్తే  విద్య వ్య‌వస్థ నీచ స్థితికి దిగజారే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పిన  కేంద్ర విశ్వవిద్యాలయంలో, ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఆంగ్లం బోధించే వారు లేక ఐదు సంవత్సరాలవుతోంది. 

            ఇక కర్నూలు – రాయలసీమ ప్రాంత  ప్రజలకు ఏమాత్రం ఉపయోగ పడని ఐఐటిడియం  లో రాయలసీమ ప్రాంత ప్రజలు ఒక్కరూ అధ్యాపక అధ్యాపకేతర ఉద్యోగాలలో లేరు. భవన నిర్మాణ కార్మికులుగా కూడా వీరు పనికిరారు. డైరెక్టర్ మొదలు కొని గేట్ కీపర్ వరకు స్థానికేతరులే.  ఇలా పెరుగుతున్న విశ్వవిద్యాలయాలు తరుగుతున్న విద్యా ప్రమాణాలతో కర్నూలు జిల్లా శోభిల్లుతోంది.

                                                    

                                                    

Leave a Reply