జీవితం చాలా నేర్పిస్తుంది. పట్టుతప్పి పడిపోతున్న సమయంలో, పోరాడి పోరాడి అలసి విసిగిపోయిన సమయంలో ఏదో చిన్న ఆశ దృక్పధమై నిలబెడుతుంది. ఎత్తు పల్లాలు దాటుకుని ముళ్ళ దారుల్లో గాయాలను మాన్పుకుని ముందుకు సాగే మార్గమొకటుందని మనమూహించకుండా తారసపడే ఒకానొక సమయం పట్టి పలకరిస్తుంది. గమ్యమేదైనా ప్రస్తుతం నేను నడవాల్సిన దారిని విస్మరించకుండా అదే సమయంలో నాకు నేను వేసుకున్న ప్రశ్నలకు సమాధానమింకా వెతుకుతూనే ఉన్నాను. ఆ అన్వేషణే నా యీ కవిత్వం.

2015 లో మొదలు పెట్టిన సాహితీ ప్రయాణం 2019 లో ఏడవ రుతువుగా రూపు దిద్దుకుని దేశమంతా వాళ్ళ ఊరు నుంచి అటుగా వంగిన ఆకాశం’ తో మూడు పుస్తకాలుగా నన్ను కాస్త మనిషిని చేసింది. ఈ ఎనిమిదేళ్ళ ప్రయాణంలో ఎన్నో ఎదురు దెబ్బలు వచనంగా తేలిపోయిందని ఒకరు, ఇంకా బాగా రాస్తే బాగుంటుందని ఒకరు. పుస్తకం టైటిల్ ఏం బాగుందనొకరు..టైటిల్ పిక్చర్ అసలు బాగోలేదనొకరు ఇలా వైవిధ్య భావాల మనుషులు కదా తలా ఒక రాయి విసిరారనుకోండి. ఇదంతా మొదటి పుస్తకం నాకు నేర్పిన పాఠం. నేను మాత్రం తొణికింది బెణికింది లేదు. ఇంతకు మించిన ఎదురు దెబ్బలు తిన్న జీవితం మరి.  మొదటి మెట్టు ఎక్కితేనే రెండో మెట్టు ఉందని మరింత లక్ష్యానికి చేరువవుతామని తెలిసిన దాన్ని.  వీటివల్ల నేను పెద్దగా కుంగిపోలేదు. పైగా మొండి ఘటాన్ని కూడా..అందుకే వీటిని స్ఫూర్తిగా తీసుకుని మరింత ఉత్సాహాన్ని బలాన్ని పుంజుకున్నాను. 

2015 లో ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్న క్రమంలోనే ఫేస్ బుక్ లో ఏకవాక్యంగా మొదలైంది ఈ ప్రయాణం. ఈ క్రమంలో ఎందరో కవులతో పరిచయాలు, సాహిత్య సభలతో కరచాలనాలు. కవిసంగమంలో అడుగు పెట్టి, యాకూబ్ సర్ తో పాటు మరి కొంత మంది సాహితీ పెద్దల ప్రోత్సాహంతో రోజూ చదువుతూ రాస్తూ పోయేదాన్ని.  ఆ క్రమంలోనే  నూనెల శ్రీనివాస్ రావు గారి పరిచయం సాహితీ స్రవంతి తో అనుబంధాన్ని ఏర్పరచింది.

మనమూ సమాజంలో భాగమనుకున్నప్పుడు నాలుగు దిక్కుల్ని సునిశితంగా పరిశీలిస్తాం. బడుగు వర్గాల మీద దాడులు, వారిని మరింత బలహీన పరిచే హేయమైన చర్యలు , ప్రభుత్వాల విధివిధానాలు ఎలా ఉన్నాయి?  ప్రశ్నించే ధోరణి లేకుండా చేసే క్రమంలో ప్రజలను ఎలా లొంగదీసుకుంటున్నారు?   చదువుకుని కాస్త ఆలోచన చెయ్యగలిగిన వాళ్ళు కూడా ఎందుకిలా గొర్రెల మందలో కలిసిపోతున్నారు ఇలా ఆలోచించినప్పుడు మన వంతుగా నాలుగు అక్షరాలు రాయలేమా అనిపించకమానదు. రాస్తే సరిపోతుందా ఆచరించనవసరం లేదా అని ప్రశ్నలు కూడా రాకపోవు. పేదరికంలో పెరిగి, కులాంతర మతాంతర వివక్షల్లో నలిగినా మతాంతర వివాహం చేసుకున్నాను. మనుషులంతా ఒక్కటేనన్న సిద్ధాంతమే నన్నీ సాహసం చేయించింది. అందుకే నా ఆలోచనలు ఆవేశం సమాజంలో పేరుకుంటున్న అసమానతలు, అణిచివేతలు,  బలహీనతలకు ప్రాముఖ్యత ఇవ్వాలనుకోవటంలో తప్పులేదనుకుంట.

ఈ సమాజంలో బలహీన వర్గాల తర్వాత అంతటి దారుణమైన వివక్షకు గురౌతున్నది మహిళ మాత్రమే. ఇవి మాత్రమే కాదు మహిళలు కాస్త సామాజిక స్పృహతో రాస్తున్నా ఓర్వలేని సమూహాలు కూడా తారసపడతాయి.  ఒక వైపే వకాల్తా పుచ్చుకుని రాస్తున్నావని నిలదీసిన వాళ్ళూ లేకపోలేదు. అదీ ఒక  మహిళ రాయటం చాలా మంది జీర్ణించుకోలేని విషయం. ఇలాంటి దాడుల్ని దాటుకుని రాగలిగితేనే సాహిత్యమనే కాదు ఏ రంగంలోనైనా స్థిరంగా నిలబడతాం. ఇలా నిలబడేందుకు నాలో ఉన్న ఆత్మస్థైర్యానికి తోడు ప్రజాశక్తి జర్నలిజం పాఠాల ప్రభావమూ లేకపోలేదు. నాలోలోపలి ఆలోచనలకు పుటం పెట్టిన పాఠాలివి. కమ్యూనిజం ఎప్పుడు పుట్టింది, ఎలా ప్రజల్లోకి ఆ భావాలు చొచ్చుకుపోయాయి, ఎంతమంది ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశారు? ఎంత మంది అవినీతి ప్రభుత్వాలను నిలదీశారు? ఎంతమంది నిజాన్ని నిలదీసి నిర్బంధంలో బతుకుతున్నారు? పెట్టుబడిదారీ విధానంలో దేశం ఎలా కొట్టుకుపోతోంది?  ఇవన్నీ ఇప్పుడు మనముందున్న  ఆలోచనతో పాటు అధ్యయనం చెయ్యాల్సిన కీలకమైన అంశాలు.

వీటన్నింటినీ బేస్ చేసుకుంటూ కత్తులు తీసుకుని పోరాటం చెయ్యలేకపోయినా ఓ కవిగా కత్తికన్నా పదునైన అక్షరాలతో ప్రశ్నించలేమా? అందుకే రాయాలనిపిస్తుంది. సామాజిక చైతన్యం లేని  సమాజం జీవశ్ఛవంతో సమానమని మనందరికీ తెలుసు. అందుకే రాసాను..రాస్తూ పోవాలనుకుంటున్నాను. సమాజం కోసం నిర్బంధంలో మగ్గిపోతున్న సాయిబాబా, వరవరరావు గారు లాంటి మరెందరో గొప్పవాళ్లను తలుచుకున్నప్పుడు మనము బతుకుతున్నది ఒక జీవితమేనా అనిపించకపోదు. ఏదో నాలుగు రూకలు సంపాదించుకుని విలాసవంతమైన జీవితాన్ని గడపాలని అదే జీవితమని అనుకునే మనస్తత్వం చిన్నతనం నుంచీ లేదు. ఇక ముందు రాకూడదనే అనుకుంటున్నా. అందుకే చుట్టుపక్కల ఏ సమస్య కనిపించినా తక్షణం స్పందించాలనుకుంటా. 

నల్ల చట్టాలతో రైతుల మీద దాడులు, సంస్థల ప్రైవేటీకరణలు, ప్రశ్నించిన వారని నిర్బంధించటం ఈ మధ్య.చాలా ఎక్కువైంది. ఇవన్నీ దారుణాలని తెలిసీ రాయకుండా అచేతనంగా ఎలా ఉండిపోగలం. ఇలాంటి బలమైన కారణాలతో పాటు ఎంతో అభివృద్ధి సాధించామనుకున్నచోటే అణగదొక్కటాలు, స్ర్తీలపై దాడులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. సామాజిక బాధ్యత కలిగిన మహిళగా,  జర్నలిస్ట్ గా నా గొంతు విప్పాలనుకుంటాను. అదీ బాధ్యతగా భావిస్తూనే. 

కరోనా సమయంలో ఎన్ని దారుణాలను చూసాం మనం. ఎన్ని కుటుంబాలు ఉద్యోగాలు లేక రోడ్డు పడ్డాయి. ఎంత మంది తక్షణ వైద్యమందక ప్రాణాలు విడిచారు? వలస కార్మికుల కన్నీటి చిత్రమింకా గుండెను తడి చేస్తూనే ఉంది. ఇవన్నీ ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిని పట్టి చూపిస్తున్నాయి. రాయాల్సిన అంశాలతో పాటు వీటన్నింటిని రికార్డ్ చెయ్యాలిసిన అవసరం చాలా ఉంది

అందుకే ” దేశమంతా వాళ్ళ ఊరు” కవితా సంపుటి తీసుకొచ్చాను. 

ఈ క్రమంలో నాకు తారసపడిన, నన్ను అక్కున చేర్చుకున్న ఎందరో సాహితీ  పెద్దలు, మిత్రులతో పాటు..అటుగా వంగిన ఆకాశం సంపుటిని మనసారా హత్తుకుని తన సొంత ఖర్చుతో అచ్చు వేయించిన  ( నరసం) తేళ్ళ అరుణ  గార్కి , రాధేయ పురస్కారంతో నన్నో కవిగా గుర్తించిన,  సుంకర గోపాల్, సిద్ధార్ధ, పెళ్ళూరు సునీల్ గారు, ఇంకా ఎందరో ఎందరెందరో స్ఫూర్తి ప్రదాతలకు , ఫేస్ బుక్ మిత్రులు పెద్దలు అందరికీ వినమ్ర వందనాలు..నా కవిత్వాన్ని ప్రచురిస్తూ వస్తున్న ప్రజాశక్తి, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, సూర్య, మాతృక, విశాలాక్షి, నవ తెలంగాణ,  అరుణ తార, సారంగ వెబ్ మాగజైన్,  కొలిమి, రాస్తా మరెన్నో పత్రికా సంపాదకులకు ధన్యవాదాలు..

సి ఎఎ  చట్టాల పేరు చెప్పి ముస్లిం సామాజిక వర్గాలపై ఎన్ని దాడులు జరిగాయో  వాళ్ళనీ దేశం నుంచి తరిమేయాలని ప్రభుత్వం ఎన్ని  పన్నాగాలు చేసిందో మనమంతా ప్రత్యక్షంగా చూసాం. మహారాష్ట్రలో అర్ధరాత్రి అమ్మాయిని బలాత్కరించి నడుమును విరిచేసి, నాలుక కోసి సాక్ష్యం లేకుండా.చేసి రాత్రికి రాత్రే ఆ అమ్మాయిని ఎలా హతమార్చారు?  పోలీసులే వాళ్ల పక్షాన ఎలా నిలబడ్డారు ఇవన్నీ చూసినప్పుడు మనసు నిండా ఎన్నో అలజడులు. హైదరాబాద్ ప్రియాంక రెడ్డిని బలాత్కరించి పెట్రోలు పోసి చంపేసినప్పుడు మా అమ్మాయి హైదరాబాద్ హాస్టల్ ఉండేది. ఆ సమయంలో నిద్రలో నేనెన్నిసార్లు ఉలిక్కిపడి లేచానో..నాలా ఎంతమంది తల్లులు నిత్యం ఉలిక్కిపడుతూనే బతుకున్నారో ఒక్కసారి అందరూ ఆలోచన చెయ్యాల్సి ఉంది. ఎందుకు రాయాలి అనడానికి సమాధానం దొరుకుతుంది. 

సాటి మనిషిని ఇంత కృూరంగా హింసించి చంపేసే స్థాయికి దిగజారుతూ మనిషిగా పుట్టడానికే అర్హత లేని వాళ్లని.జంతువులతో కూడా పోల్చలేని పరిస్థితిని రాయకుండా ఎలా ఉందాం. ఒక పక్క అభివృద్ధి అంటూనే పెట్టుబడిదారీ విధానం చాప కింద నీరులా పేరుకు పోతూ ఉన్న విషయం మనందరికీ తెలుసు. రాయకుండా ఉండగలమా? 

ముందు తరాల మనగడకు ఇది అడ్డంకి మాత్రమే కాదు. అభివృద్ధి నిరోధకం కూడా. ఇలా ఆలోచించినప్పుడు రాయవలసింది ఇంకా చాలా మిగిలే ఉందనిపిస్తుంది.. చాలా వరకు  అటుగా వంగిన ఆకాశం”  కవితా సంపుటిలో వీటికి ప్రాధాన్యత ఇచ్చాననిపించింది. అయినప్పటికీ  , చదివి ఆకళింపు చేసుకోవలసింది,  రాయవలసింది కుప్పలు తెప్పలుగా పడి ఉంది.

గొప్ప కవిత్వాన్ని చదువుతున్నప్పుడు నన్ను నేనింకా మెరుగుపరుచుకోవలసిన అవసరం కూడా ఉందనిపిస్తుంది. శ్రీ శ్రీ గారన్నట్లు ” కార్మిక కర్షకులకు, బడుగు బలహీన వర్గాలకు వర్గాలకు ఇరువైపులా నిలబడే వాడే కవి . ఈ మాటలను బలంగా నమ్ముతాను.  కవి నడిచిన దారిలో నావి కూడా ఒకటో రెండో అడుగులున్నాయని గుర్తించి నా అంతర్మధనాన్ని ఇలా వెల్లడించే అవకాశాన్ని, వేదికను అందించిన  వసంత మేఘం వెబ్ మాగజైన్ సంపాదకులకు మనసారా ధన్యవాదాలు.

Leave a Reply