ఎలాగైతేనేం
ఉబికి వచ్చే కన్నీటికి
ఇసుక గూడంత విరామం దొరికింది
ఆ మధ్యానం
అన్నం కుండ దించుతుండగా
చెవులకు లీలగా తాకిన వార్త
పళ్ళెంలో మొదటి ముద్ద
అతని కోసమే కలుపుతున్నట్టు
స్కూలు నుంచి వచ్చిన
పిల్లాడి లంచ్ బాక్స్
అంట్ల గిన్నెలో గబగబా సర్దుతున్నట్టు
అంతా తత్తరపాటు
అప్పటికి
విన్న ఆమెకది పగటి కలే కావచ్చు
ముఖ పరిచయమే లేని నాకు మాత్రం
ఎండిన నాలుకపై
తెప్పరిల్లే చిన్న వాన చినుకు
అతగాడికి
కాగితాలకందని శిక్ష వెయ్యాలని
తీర్పరి
చెరకుగడ పిప్పిగా
పాఠాన్ని నములుతూ పోతుంటాడు
శూన్యం కుమ్మరించిన నేలపై
ఒకరి కళ్లను మరొకరు
ఫొటోగ్రాఫ్ చేస్తూ మేముంటే
ఆకాశమంత ధైర్యాన్ని
పోతపోసుకున్న సాయీ
నీ కెంత టెంపరితనం
లాగి విసిరేసిన
నాలుగు గోడల బందెలదొడ్డిలో
చీకటి దులిపిన ముక్కు వాసనలు
జైలు వూచల్లోంచి
బద్దకంగా కదిలే ఉదయాస్తమయాల మధ్య
అమాంతం మింగేసే
ఒంటరితనపు భల్లూకాలు
ఒళ్లు విరిచిన
నల్ల పరదా కింద
ఎర్రమందారాల కలలు కంటూ నీవు
ఆమె ఎన్నోసార్లు భయపడింది
గేటుకెదురుగా
తల్లికోడిలా పచార్లు చేసింది
ఒకటా రెండా...
పదేళ్ళు..
పచ్చి గాయాల దేహానికి
ఏ లేపనంతో పూతపూయాలి
కరిగిన కాలాన్ని
అమ్మ చివరి చూపు
దూరం చేసిన వాళ్లకు
ఏ శిక్ష వేయాలి.
Related