పాలస్తీనా స్వేచ్ఛాకాంక్షపై జరుగుతున్న యుద్ధంలో పసి పిల్లల మరణాలు ప్రపంచ మానవాళిని కలచివేస్తున్నాయి. యుద్ధం ఎక్కడ జరిగినా, ఏ రూపంలో జరిగినా నెత్తురు ప్రవహించాల్సిందే. చరిత్ర పొడవునా రాజకీయాల కొనసాగింపుగా సాగిన యుద్ధాలన్నీ తీవ్రమైన విధ్వంసానికి, విషాదానికి కారణమయ్యాయి. ఏ నేల మీది జరిగే యుద్ధాలకైనా దురాక్రమణే లక్ష్యం. అది పాలస్తీనాలో ఒక రకంగా ఉండొచ్చు. కశ్మీర్లో ఇంకోలా ఉండొచ్చు. దేశం మధ్యలోని దండకారణ్యంలో మరోలా ఉండొచ్చు. ఎక్కడైనా సరే, ఏ రూపంలో అయినా సరే దురాక్రమణ కోసం సాగే యుద్ధాలు పిల్లలను బలి తీసుకుంటాయి.
పాలస్తీనాలో చనిపోతున్న పిల్లల కోసం అనుభవిస్తున్న అనంతమైన దు:ఖం దండకారణ్యాన్ని కూడా ఆవరించింది. ఇది అచ్చంగా ఈ దేశ ప్రజల మీద దేశాధినేత చేస్తున్న యుద్ధం. తాజాగా ‘భారతీయ నాగరిక సురక్షా సంహిత’ను తయారు చేసుకున్న సంఫ్‌ుపరివార్ ప్రభుత్వం ఆదివాసీ జన సముదాయం మీద చేస్తున్న అనాగరిక యుద్ధంలో కొత్త సంవత్సరాది రోజు ఆరు నెలల పసికందును భద్రతా దళాలు చంపేశాయి. ఈ ఘటనలో పాప తల్లి మాసె గాయపడిరది. ఈ ఘటన చత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లా ముత్వెండి గ్రామంలో జరిగింది.
ఎప్పటిలాగే మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని, ఈ ఘర్షణలో పాప చనిపోయిందని బస్తర్ ఐజి సుందర్రాజ్ ప్రకటించాడు. ఈ వార్తను టైమ్స్ ఆఫ్ ఇండియా ఇట్లాగే ప్రచురించింది. తెలుగు పత్రికలు ఈ ఘటనకు కనీస ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయి. ఆ రోజు ఎదురు కాల్పులు జరగలేదని, భద్రతా దళాలు మూకుమ్మడిగా దాడి చేసి ఏకపక్షంగా జరిపిన కాల్పుల్లో తన బిడ్డ చనిపోయిందని తండ్రి సోది అన్నట్లు తెలుస్తోంది.
చత్తీస్ఘడ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంచుకోడానికి టైం పట్టిందేమోగాని ఆదివాసుల మీదికి సైనిక బలగాల తరలింపులో ఎలాంటి ఆలస్యం జరగలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అంతకముందటి బీజేపీ రమణ్‌సింగ్ అణచివేత విధానాలను తూచా తప్పకుండా అనుసరిస్తే, ఆ విధానాలను మళ్లీ తిరిగి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇంకింత ముందుకు తీసికెళ్లింది. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన తొలి చర్య మావోయిస్టుల మీద తుది యుద్ధానికి మరిన్ని సైనిక బలగాలను మాడ్ దిశగా తరలించడం.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఉన్మత్తంలో కేంద్ర హోంశాఖ జనవరి ఐదో తేదీ నుంచే యుద్ధాన్ని మరింత ముమ్మరం చేసినట్లు వార్తలు వచ్చాయి. బీఎస్ఎఫ్, కోబ్రా, డీఆర్జీ, ఐటీబీపీ, సీఆర్పిఎఫ్లకు చెందిన పది వేల బలగాలను ఒక్కసారిగా దాడికి బయల్దేరి వెళ్లాయి. చత్తీస్‌ఘడ్‌లోని నారాయణపూర్ మొదలు తెలంగాణ సరిహద్దులోని గ్రామాలంతటా ఈ విధ్వంస సేనలు అలజడి సృష్టించాయి. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగాలు ఒకపక్క సాగుతూ ఉండగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కమాండ్ కింద నడుస్తున్న ఆపరేషన్ ప్రహార్‌లో భాగంగా ఈ యుద్ధాన్ని ముమ్మరం చేసినట్లు భద్రతా దళాల అధికారులు ప్రకటించారు.
యుద్ధాలన్నీ దురాక్రమణ కోసమే జరుగుతాయి. దండకారణ్యాన్ని దురాక్రమించి అక్కడి సహజ వనరులను అదానికి కట్టబెట్టడానికి ఫాసిస్టు ప్రభుత్వం చేస్తున్న ఈ యుద్ధంలో ఎందరు పిల్లలు చనిపోయారో, ఎంత మంది తల్లులు మరణించి పిల్లలు అమ్మ ప్రేమకు దూరమయ్యారో. తాజాగా ఈ యుద్ధం ఒక పసి పాపను బలి తీసుకున్నది.
కార్పొరేటీకరణ అత్యంత అమానుషమైన రాజకీయార్థిక ప్రక్రియ. అది అంతిమంగా సైన్యం మీద మాత్రమే ఆధారపడుతుంది. ఆయుధాలతో, సైనిక బలగాలతో విస్తరించే కార్పొరేటీకరణ ఊయల పాపలను కూడా బతకనివ్వదు. ఒకపక్క చత్తీస్ఘఢ్ ఎన్నికల హడావిడి నడుస్తున్న రోజుల్లోనే పల్నార్, డుమ్రిపరల్నార్, కవాడ్గావ్ అనే మూడు గ్రామాల మధ్య కొత్తగా మూడు సైనిక క్యాంపులను ఏర్పాటు చేశారు.
దండకారణ్యంలో 2021 మే 13న మొదలైన చారిత్రాత్మక సిలింగేర్ పోరాటంలో ఏర్పడ్డ మూలవాసీ బచావో మంచ్ ఆధ్వర్యంలో సైనిక క్యాంపులకు, పర్యావరణాన్ని విధ్వంసం చేసే భారీ వంతెనల నిర్మాణానికి, గనుల తొవ్వకం కోసం అడవుల నరికివేతకు వ్యతిరేకంగా ఆదివాసులు పోరాడుతున్నారు. ఈ రెండున్నర సంవత్సరాలలో ముప్పైకి పైగా సమస్యలపై ఈ సంస్థ నాయకత్వంలో ఆందోళనలు జరిగాయి. ఏదైనా దీర్ఘకాలికమే. నెలలపాటు జరిగిన పోరాటాలు ఉన్నాయి. సంవత్సరాల తరబడి సాగుతున్నవీ ఉన్నాయి. ఒక పోరాటం మరో పోరాటంలోకి విస్తరించి, అనేక పోరాటాలుగా మారి పురోగమిస్తున్నాయి. వీటన్నిటి మధ్యనే ప్రభుత్వాలు కొత్తగా సైనిక క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. కార్పొరేటీకరణ కోసం సైనికీకరణను ఇబ్బడిముబ్బడిగా పెంచడం పాలకవర్గ విధానంలో భాగం. సైనిక బలగాల యుద్ధ చర్యలను దాని నుంచి వేరు చేయలేం. ఆదివాసీ ప్రాంతాల దురాక్రమణ వ్యూహానికి ఉన్న రెండు ముఖాలే కార్పొరేటీకరణ, సైనికీకరణ. హిందుత్వ ఫాసిజం సారాంశంలో కార్పొరేట్ ఫాసిజం అనడానికి దేశవ్యాప్తంగా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇది దండకారణ్యంలో ప్రబలంగా కనిపిస్తోంది.
చత్తీస్‌ఘడ్‌లో ఈ పాసిస్టు యుద్ధం ఎప్పుడో ఆరంభమైంది. ఇది ఇటీవలి శాసన సభ ఎన్నికల దగ్గరి నుంచి రాబోయే పార్లమెంట్ ఎన్నికల దాకా ఒక ప్రత్యేక దశలో నడిచే అవకాశం ఉంది. అమిత్‌షా గత ఏడాది చాలా స్పష్టంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల మావోయిస్టు రహిత భారత్‌లో జరగబోతున్నాయని అన్నాడు. ఆ దిశగా సైన్యాన్ని నడిపించడానికి ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడం మరింతగా దోహదం చేస్తున్నది. మావోయిస్టు రహిత భారత్ అంటే దండకారణ్యానికి సంబంధించినంత వరకు అటవీ ప్రాంతాల దురాక్రమణ. ఎన్నికలను సజావుగా, శాంతిభద్రతల మధ్య నడిపించడం రాజ్యాంగం అప్పగించిన ఒక కర్తవ్యం. దాని కోసం ఎవరినైనా చంపేయవచ్చు. ఎన్ని లక్షల సైనిక బలగాలనైనా మోహరించవచ్చు.
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో భాగమైన సైనిక దాడులు చత్తీస్ఘడ్ నుంచి ఒడిషా దాకా అప్పుడే విస్తరించాయి. జనవరి 5వ తేదీ ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లోని మల్కాన్‌గిరి` దండకారణ్య ప్రాంతాల మధ్య అణచివేతకు సమన్వయ కమిటీ ఏర్పడినట్లు పత్రికల్లో వచ్చింది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే ఈ యుద్ధం ఎంచుకున్న రాజ్యాంగ కర్తవ్యం.
ముత్వెండి గ్రామంలో చనిపోయిన ఆరు నెలల పసిబిడ్డ తన తల్లిని కూడా గుర్తు పట్టలేకపోవచ్చు. పొత్తిలిలోని బిడ్డను కోల్పోయిన ఆ తల్లికి ఇది ఎన్నటికీ మరపురాని విషాదమే. పాలకుల యుద్ధోన్మాదం మీద ఆమె జ్ఞాపకాలు రగులుతూనే ఉంటాయి. అక్కడ ఆమె తన బిడ్డను పోల్చుకుంటుంది. మరి మనం ఎట్లా ఈ యుద్ధాన్ని పసిగట్టగలం? నిదురలో కూడా ప్రకృతి అంత స్వచ్ఛంగా పూచే ఆ పసిపాప నవ్వులను చిదిమేసిన ఈ దురాక్రమణ యుద్ధోన్మాదాన్ని ఎట్లా అర్థం చేసుకోగలం?
పాత రోజుల్లో పొరుగు ప్రాంతాల దురాక్రమణ రాజ ధర్మం. ఇప్పుడది రాజ్యాంగ ధర్మం. ఎవరు అవునన్నా కాదన్నా అడవిని అదానికి అప్పగించడం అనే ధర్మాచరణ పూర్తి రాజ్యాంగబద్ధం. కాదన్నవారే రాజ్యాంగ వ్యతిరేకులు. పాలకులు ఎల్లవేళలా రాజ్యాంగబద్ధంగా ఉండటమే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని విశిష్టత. ఈ రాజ్యాంగబద్ధత అవసరమైతే పసి పిల్లల కుత్తుకలు తెగనరుకుతుంది. వారి తల్లులను హత్య చేస్తుంది. వాళ్ల ఇళ్లను నేలమట్టం చేస్తుంది. వాళ్ల నేలకు వాళ్లను పరాయివాళ్లను చేస్తుంది. కాదని తిరగబడితే ఏకంగా నిర్మూలిస్తుంది. రాజ్యాంగం అప్పగించిన ఈ రాజధర్మమే మన ప్రజాస్వామ్య సారం.
Video Source – Bastar Talkies